చెత్తకుండి భద్రం! (కథ)

చెత్తకుండీల్లో చేరే ఎలకలూ పందికొక్కులగురించి కాదీ కథ. చెత్తకుండీల్లో ఇళ్లల్లో

DSC02284                                               (ఈకథకి స్ఫూర్తిదాయకమైన దృశ్యం)

వాళ్ళు పారేసిన చెత్త ఏరుకుని బతుకులు వెళ్ళదీసుకునే బడుగువారిగురించి చెప్తున్నా.

నేను నిత్యా తిరిగేది పట్టుమని మూడు మైళ్ళు కూడా ఉండదు. ఆ పరిధిలోనే కనీసం ఇద్దరు ముగ్గుర్ని చూస్తాను కూరలబజారులో కనిపించే చక్రాలబండి తోసుకుంటూ. ఒకొక బండిలోనూ బండిఅంచుల వేలాడుతూనూ ఐదారు సంచులుంటాయి. వాళ్లలో ఒకమ్మాయిని నేను ప్రత్యేకంగా గమనిస్తున్నాను. యాదాలాపంగానే మొదలయినా, రాను రాను నాకుతూహలం మీరిపోతూ వచ్చింది. అప్పుడప్పుడు ఆ చెత్తకుండీల్లోంచి సగం తిని పారేసిన హేంబర్గర్లలాటివి ఏరుకు తినడం చూసేను కానీ అన్ని సంచులు నింపడానికేం ఉంటాయో నాకు అంతు బట్టలేదు. ఏమిటి ఏరుకుంటోంది, వాటితో ఏం చేస్తుంది, అసలు ఆమె ఆ పరిస్థితికి ఎలా వచ్చింది – ఇవీ నాకు అర్థం కానివీ, జవాబులు దొరకనివీను.

మామూలుగా వీధిలో నడుస్తున్నప్పుడు పరిచయస్థులూ కానీవారూ కూడా పలకరిస్తారు. కొందరు అలవోకగా తలెగరేస్తే, కొందరు బాగున్నావా అని కూడా అడుగుతారు. ఇక్కడ అట్టే జనాలుండక కానీ అదే మనదేశంలో అయితే అలా హలోలు చెప్పుకుంటూ కూచుంటే, రెండు రోజులగ్గానీ ఇల్లు చేరం అని నవ్వుకున్న రోజులు లేకపోలేదు. అప్పుడే నాకనిపించింది ఇంతమందికి హలోలు చెప్తున్నప్పుడు ఈ అమ్మాయికి మాత్రం ఎందుకు చెప్పకూడదూ అని. ఒకరోజు పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి, కనీ కనిపించనంతగా తలెగరేసేను. ఆ తరవాత నన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి కూడా చిన్నగా నవ్వు ప్రదర్శించింది. నాకు మాటాడాలని ఉంది కానీ ఏం మాటాడ్డం, ఏం మాటాడితే ఏం తప్పో. అసలు నాకు మాటాడాలని ఉన్నంతమాత్రాన ఆవిడ కూడా అలాగే అనుకుంటోందని ఎలా అనుకోను?

000

అలా ఆలోచిస్తూనే నా నిత్యసంచారానికి బయల్దేరి మెట్లు దిగుతుంటే, “యాడికి పొద్దెక్కి బయలెల్తన్నవు” అంటూ సంద్రాలు ఎదురుపడింది.

“రా మంచి సమయానికే వచ్చేవు. నా మామూలు గస్తీకి బయల్దేరేను. పద. నడుస్తూ మాటాడుకుందాం.”

ఇద్దరం తీరిగ్గా పెళ్ళినడకలు సాగిస్తున్నాం. కాళ్ళు సాగుతున్నాయి, నోరు వాగుతోంది కానీ కళ్ళు మాత్రం అలవాటయిన దృశ్యంకోసం వెతుకుతున్నాయి.

సంద్రాలు కనిపెట్టేసింది. “ఏటి సూస్తన్నవ్. నీసేయితులొస్తారేటి?”

“స్నేహితులు కాదులే. మామూలుగా ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు ఈవీధుల్లో. ఇవాళ ఒక్కరూ కనిపించడం లేదేమా అని చూస్తున్నాను.”

“నీనాగే పనీ పాటూ లేనోరేనా?”

“నన్నెందుకలా అస్తమానం ఎద్దేవా చేస్తావు?” అన్నాను విసుగ్గా.

సంద్రాలు నవ్వింది, “మరెవుర్ననమంటవు?”

నేను కూడా నవ్వేసి, “లేదులే. నువ్వన్నది నిజమే. నేను చేసే పనేముంది కనక. నేను చూస్తున్నది పూట గడుపుడానికి పాటు పడేవాళ్ళేలే. అసలందుకే నిన్ను కూడా రమ్మన్నాను. వాళ్లేం చేస్తున్నారో నాకు సరిగా అర్థం కాలేదు. వాళ్ళగురించి నువ్వేమైనా చెప్తావేమోనని.”

“ఏటి సెప్పాల, సెప్పనానికేంవుంది?”

“ఈ చెత్తకుండీలు కెలుకుతూ కనిపిస్తారు. ఏదో ఓ రొట్టెముక్కో కాయోపండో ఏరుకునేవాళ్ళని చూసేను కానీ వీళ్ళు సంచులకొద్దీ ఏమిటి పోగుచేస్తున్నారో, వాటిని ఏం చేస్తారో తెలీడం లేదు.”
“ఆయమ్మనే అడగనేకపోనావా?”

“అడిగేను నాకొచ్చిన భాషలో. తల అడ్డంగా ఊపింది ఇంగ్లీష్ అంటూ. అందుకే నువ్వయితే ఆమెభాషలో మాటాడగలవని రమ్మన్నాను.”

“ఈడో సెంటరుండాదిలే. ఆ ఇల్లోల్లు తాగి పారేసిన సోడాకాయలూ, గాజుబుడ్లూ ఏరి మూట గట్టుకుని ఆసెంటరోల్లకిస్తే, ఆరు నాలుగో పదో చేతలెడ్తరు.”

నాకింకా ఈ ఊరు కొత్తే. సంద్రాలు సర్వాంతర్యామి నాపాలిట. నా విజ్ఞానసర్వస్వం!

“నాలుగో పదోతో రోజు గడిచిపోతుందా?”

“ఆల్ల ఓపికనిబట్టి. ఒకొకలు యాబయ్, వందా కూడా సంపాయిచ్చుకుంతరు. ఒకాయనయితే 300 దనుక కల్ల సూస్తనన్నడు కలిసొచ్చిన్నాడు.”

“పోన్లే. అదీ బాగానే ఉన్నట్టుంది,” అన్నాను సందిగ్ధంగా. నాకెందుకో ఆవిడ చెప్పినంత సుళువు అనిపించలేదు. ఆ అనుమానం కూడా తీర్చేసింది.

“అంత తేలిగ్గాదు. అడుక్కుతినేవోరిలో గీరుకుతినేవోడని. కలిగినోలు పారేసే సెత్త ఏరుకోనానికీ పోటీలే. ఒకుడు తెల్లారిగట్ల లేస్తే, మరొడు అర్తరేతిరే బయలెల్తడు అందినన్ని అంకిచ్చుకోనానికి. ఊరిమజ్జిన ఓటల్లకాడయితే మరీ తన్నుకుసవ్వాల. కుంత దూరంలో సొంతిల్లోరూ, అద్దికున్నోరూ ఇల్లముంగలెట్టిన సెత్తకుండీలైత నయంవే గానీ అక్కన్నుంచి బండి తోస్కంట సెంటరు కాడికొచ్చెతలికి తల పేనం తోక్కొస్తాది.”

ఆ వృత్తిలో కూడా లుకలుకలున్నాయని తెలిసేక నామనసు తేలిక పడింది. ఈమాట మీకు అన్యాయంగా అనిపించవచ్చు కానీ ఏసంగతకయినా అనేకకోణాలు పరీక్షిస్తే అదే సంతృప్తి. ఇద్దరం నడుస్తున్నాం. దూరంగా వీధిచివర ముందురోజు చూసిన లెమన్ స్టాండు కనిపించింది. “చూసేవా, నాకిక్కడ నచ్చేవిషయల్లో ఇదొకటి,” అన్నాను.

ఎనిమిదేళ్ళ అబ్బాయి నిమ్మరసం అమ్ముతున్నాడు. గ్లాసు 50 సెంట్లు. ముందు రోజు నేనిలాగే నడుస్తుంటే ఆ అబ్బాయి ఆశగా నావేపు చూసేడు. నేను దగ్గరికి వచ్చేక మరింత హుషారుగా నామొహంలోకి చూసేడు.

“నాదగ్గర డబ్బుల్లేవు. నేనూరికే వీధులంట తిరుగుతున్నాను,” అన్నాను క్షమాపణగా.

“ఫరవాలేదు,” అంది తల్లి చిరునవ్వుతో.

వాళ్ళని దాటి మరో పదడుగులు వేసేవేళకి ఆ అబ్బాయి ఏదో అనడం వినిపించింది. నేను వెనక్కి తిరిగి, “ఏమిటీ?” అనడిగేను.

“నువ్వు మళ్ళీ వస్తే, మేం ఇంకా ఇక్కడే ఉంటాం అంటున్నాడు,” అందావిడ.

నేను నవ్వి, “ఇవాళ కాదు కానీ రేపు తప్పకుండా వస్తాన”ని చెప్పి, “అదేమిటి?” అంటూ ఆ బల్లకి కట్టిన బోర్డు చదవబోయేను. నేను చదవఖ్ఖర్లేకుండానే ఆ తల్లి చెప్పింది కేన్సరుఆస్పత్రిలో పిల్లలకి బొమ్మలు కొనడానికిట ఆ డబ్బు.

నేను మర్నాడు డబ్బు తీసుకొస్తానని మరోమాటు మాటిచ్చి నాదారిన పోయేను. కథ ఆసాంతం చెప్పి, “వీళ్ళలో నాకు నచ్చిందిదే,” అన్నాను.

“ఏటి నచ్చినాది?”

“ఏం లేదు. పిల్లలకి చిన్నప్పటినుండి కొన్ని విలువలు నేర్పుతున్నారు కదా. జులాయిగా వీధులంట తిరిగేబదులు ఏదో సత్కార్యం.”

“సరి నువ్ పద,” అంది సంద్రాలు నాబుజాలమీద ఉన్న శాలువ లాక్కుని.

నాకు అర్థం కాలేదు. అదే తెలుస్తుందిలే అనుకుని ముందుకు సాగి, లెమన్ స్టాండుదగ్గరకొచ్చి, ఓ గ్లాసు తీసుకుని డాలరు ఇచ్చేను ఆ అబ్బాయికి. అతను ధన్యవాదాలు చెప్పి, డాలరు పెట్టెలో పెట్టుకుని చిల్లర 50 సెంట్లు తీసి లెక్క సరి చూసుకుని ఇచ్చేడు. తల్లి నవ్వుతూ చూస్తోంది.

ఈ బేరం అంతా అయేవేళకి సంద్రాలు వచ్చింది, శాలువా ఒళ్లంతా కప్పుకుని, తల చింపిరిగా రేపేసుకుని, కళ్ళు చికిలించి చూస్తూ, ఆ పిల్లాడితో దీనాతిదీనంగా, “గొంతెండిపోతన్నది. నాకాడ సెంటన్న నేదు. ఒక్క సుక్క నిమ్మరసం పొయ్ బాబూ,” అంది.

ఆ అబ్బాయి తికమకగా చూసేడు. తల్లి ఆ దుకాణంధ్యేయం వివరించింది.

సంద్రాలు నాచేతిలో గ్లాసువేపు చూసి, “ఒక్క సుక్క గొంతు తడుపుకోనీ,” అంది.

నేను ఇరుకున పడ్డాను. ఇస్తే, ఆ అబ్బాయినీ, అతడిధ్యేయాన్నీ కించపరిచినట్టు. ఇవ్వకపోతే గొంతెండిపోతున్న మనిషిపట్ల రవంతయినా జాలి చూపని కర్కశహృదయురాలిని!

సంద్రాలు చిన్నగా దగ్గుతూ వెళ్ళిపోయింది. “ఉండు. మంచినీళ్ళు తెస్తాను,” అంది అబ్బాయి తల్లి. సంద్రాలు వినిపించుకోలేదు.

నేను నా గ్లాసు తీసుకుని ఆ అబ్బాయి చేస్తున్న మంచిపనికి మరోమారు అభినందనలు చెప్పి, సంద్రాలుని కలుసుకున్నాను.

“ఏంటి నువ్వు చేసినపని?” అన్నాను కోపంగా.

“నీకు సూపిచ్చిన ఏ యిసయానికైన ఎన్ని సేయలుంటయ్యో.”

“ఏం ఛాయలు? పాపం ఆ అబ్బాయికి ఆవిడ కాస్త మంచితనం నేర్పబోతుంటే నువ్వు నన్ను నవ్వులపాలు చేసేవు.”

“ఆ యమ్మ నేర్పీది మంచితనంవా డబ్బు సంపాయించేతనంవా?”

“ఆఁ?”

“సంపాయిచ్చి ఏంసేస్తన్నడు. యేరే ఆల్లకిస్తన్నడు. ఆయనకి పెతి సుక్కా డబ్బే.”

“అవును, అది సద్వినియోగానికే గదా. రోజులు లెక్క పెట్టుకుంటూ మంచాన బడ్డ పిల్లలకి కాస్త ఉపశమనంగా బొమ్మలు కొనివ్వడం గొప్పవిషయం కాదూ.”

“ఆఎనక ఏటవుతాది. అందురూ మాగొప్పగ సెప్పుకుంతరు. పేపర్ల బొమ్మలొస్తయి. ఇయన్నీ ఆ కుర్రోనికేం నేరుపుతయ్?”

నాకు నోట మాట రాలేదు. నేనంతదూరం ఆలోచించలేదు.

“అద్గదే మరి. నాను పసిబిడ్డని గానులే, నాకూ తెల్సాసంగతి. ఐన నాకు కస్టం ఒచ్చింది గంద. నాకో సుక్క పోస్తె ఏటయిపోనాది?”

“ఏటీ అయ్పోనేదు. ఆ అబ్బాయి ధ్యేస అంతా తలపెట్టిన ఘనకార్యంమీదే ఉండాలని ఆమె కోరిక. అర్జనుడిదృష్టి అంతా తాను కొట్టబోయే పక్షికన్నుమీదే ఉన్నట్టు. ఏపని గానీ చేపట్టినప్పుడు మొత్తం దృష్టి అంతా దానిమీదే ఉండాలి,” అన్నాను నేను ఆవేశంగా.

“నివ్వూ ఆల్నాగే మాటాడతన్నవు. నీకింక సాలా తెల్యాల.”

నేను కోపంగా సంద్రాలువేపు చూసేను. హుమ్, నేనెంత చులకనయిపోయేనూ అని కొంచెంసేపు వాపోయేను మనసులోనే.

“ఆహా, సరే. చెప్పు నేను ఇంకా తెలుసుకోవలసిన ఘనాపాఠీ విషయాలు.”

“నేదులే. నేన్నింటం నేదు. ఈదేసంలో అసులు ఇయేలా రేపూ అదే నాయం అయ్పోనాది. దేసంవేటి, నోకం అంత అనాగే ఉన్నాది. ఇందలక నివ్ సెప్తన్నవే ఆ బండి తోసుకు బతికేయమ్మనే సూడు. మొగున్ని నమ్ముకుని ఈదేసం వొచ్చింది. ఆడేమో గొప్పోల్లఇల్లు కడ్తా దూలం కూలి సచ్చిపోనాడు. నేయానికి ఆడికుటుంబంవోలకి నస్టం ఇచ్చుకోవాల ఆకట్టించేవోలు. లేనోల్లకి కోరట్లు కోరట్లు గావు. ఆ యమ్మ ఆలదేసంలో పెద్దసదువే సదూకుందంట. అవుతేనేమి, ఇంగీలీసు రాదు. అందుసేత ఆయమ్మకి సరిపోయీ పని దొరకనేదు. కాలీజీలో గాజుబుడ్లు కడిగి, ఇల్లల్ల బాతురూములు కడిగీ పిల్లల్ని సదివించింది. ఉప్పుడేంవో ఆయమ్మకి కాయితాలు లేవని ఆలదేసానికి పొమ్మంతన్నరు గవుర్మెంటోలు. కొడుకులు సేన్నంలో సేరిపోనారు. సవ్వనానికి పనికొస్తరు గాని బతకతం అంట ఏగానిక్కొర గారు అంటరు మల్ల ఆ యుద్దానికి పంపినోలే.”

“అవును, యుద్ధాలకీ, కూలిపనులకీ మాత్రమే పనికొస్తారు తొక్క తెల్లన కాకపోతే,” అన్నాను నీరసించిపోతున్న హృదయంతో.

మరో పదడుగులు వేసి మలుపు తిరిగేం. సంద్రాలు ఠక్కున ఆగి వీధికి అటుపక్కన నడుస్తున్న అబ్బాయికి చెయ్యూపింది. నేనటు చూసి, “ఎవరది?” అన్నాను. అతను నావేపు చూసి చిన్నగా నవ్వేడు.

“మాదొరబాబు సిన్నకొడుకు. ఆ సొక్కా లాగా సూసినవ?”

“ఏం? బాగానే ఉన్నాయి కదా.”

“ఈమజ్జనే మందేసంవెల్లి ఆర్నెల్లుండి తిరిగొచ్చినాడు. రెన్నెల్లయింది. ఆకాడ్నించి పెపంచకంవంతా దరిద్రంతో కొట్టకపోతన్నది. మనం – అదేలే ఇక్కడోల్లు – కొవ్వెక్కి సరుకంత దుబారా సేసేస్తన్రు అంటా నీతులు సెప్తా సెత్తకుండీల్లో గుడ్డలేరుకుని ఏస్క తిరగతన్నడు.”

“మరి మీదొరబాబు ఊరుకున్నాడా? ఆయనకి పరువు తక్కువ కాదూ?”

“ ఏటి సేస్తడాయన. నువ్విచ్చేది నాకక్కర్నేదు అంటాడీ బాబు.”

“ఈ జనాలందురు తెగ దుబారా సేసేస్తన్నరని ఈబాబు ఆగరం. ఈయన ఆ సొక్కాలాగూలేస్కుని సూపిత్తన్నడంట ఎంత సొమ్ము వుర్దగా పారేస్తన్నరో.”

నాకు అందులో తర్కం కనిపించలేదు. నాకింకా నేను రోజూ చూసే తోపుడుబండి అమ్మాయి మనసులో మెదులుతోంది. అతను అవి ఏరుకోకపోతే, ఆ అమ్మాయి తీసుకుని ఆ పూట గడుపుకునేది కదా. ఆమాటే అన్నాను సంద్రాలుతో.

“అనాగ గూడ సేస్తర్లే. ఆలే ఏరుకొచ్చి మల్ల అవుసరంవైనోలకి పంచిపెడ్తరు.”

“మరి ఆ యమ్మ అక్కడ్నుంచి తీసుకోవచ్చు కదా.”

“ఆమెకి మనసొప్పదంట. ఆలు తేరగ ఇచ్చినయి తీస్కుని నాను రోజంత ఏటి సెయ్యాల. నాకస్టం నాను పడి, తింటే నాకు తుర్ప్తి అంటది.”

నేను ఉలిక్కి పడ్డాను. అప్పటికి వారంరోజులుగా ఆలోచిస్తున్నాను, పాపం, నేను ఓ రెండు డాలర్లు ఆమెచేతిలో పెట్టొచ్చు కదా అని. అలా చేసుంటే ఏమయేది?

“ఇంకా నయం, నేను తెగించి డబ్బు ఇచ్చేను కాను,” అనుకోకుండా బయటికే అనేసానామాట.

“ఏటీ?”

వివరించేను నా ఆలోచన.

“ఇవ్వనేకపోనావా?”

“ఇప్పుడు నువ్వంటున్నదదే కదా. ఇంతవరకూ నేను వెనకాడింది ఆవిడ తీసుకుంటుందో లేదో అన్న భయంచేత. ఒక రోజిస్తే రోజూ దానికోసం ఎదురు చూస్తుందేమోనన్న భయం. నేనిచ్చేనని మగతా బళ్ళవాళ్ళకి చెప్తే, వాళ్ళు నన్నింక బతకనివ్వరేమోనన్న భయం.”

సంద్రాలు నావేపు కోపంగా చూసి విసురుగా తలెగరేసింది నిరసన తెలియజేస్తూ.

“ఏం? నిజమే కదా. ముందొకసారి ఇలాగే ఏదో ధర్మసంస్థకి ఓ పది డాలర్లు పెంపేను. అక్కడ్నించీ వాళ్ళే కాదు మరో పది సంస్థలు ఉత్తరాలమీద ఉత్తరాలు గుప్పించేరు. అలా పంచిపెట్టడానికి నాదగ్గరేంవుంది. ఒకమారు ఇస్తే, ఇంక చెప్పలేం మిగతావారు వాయించే వాయింపులు.”

“అనాగే అనుకో. ఇయ్యాలనుంటే ఇయ్యి. నేకపోతే ఆ ఊసెత్తమాక.”

“ఆ మొదటి సంస్థ మిగతావారికి మనఎడ్రెసులు అమ్ముకుంటారని నాకు తెలీలేదు అప్పట్లో.”

“ఇయన్నీ సాకులు.”

000

ఆరాత్రి నాకు ఎంత ఆలోచించినా ఈ రెండు ప్రపంచాలనీ ఒకతాటిమీదకి ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. పెట్టుబడిదారీ సమాజానికి తగినట్టుగా పిల్లలని తయారు చేస్తున్నదొకరూ, పొట్ట పోసుకోడానికి చెత్తకుండీల్లో బతికే జీవులు కొందరూ.

సంద్రాలంది, “ఉప్పుడే ఏం జూసేవు. ఆమజ్జిన ఇన్నా సంప్రస్కలో ఆ సెత్తకుండి యజమానులూ, సెత్తకంపెనీలు సేరి గోలెత్తేరంట. ఆ కుండీలు మా సొంత, ఆ సెత్త మాసొంతం, సెత్త కంపెనీ ట్రక్కులొచ్చి ఆరి ట్రక్కుల్లోకెత్తుకున్నాక ఆరివనీ, మద్దెన ఎవరైన సెత్తకుండీలో సెయ్యెడితే అది అపసారం అని. జరిమాన కట్టుకొ, నేదా జయిల్లో కూకో అంటరంట.”

సంద్రాలు తనదారిన వెళ్ళిపోయింది. నేను ఇంటికొచ్చి ఆలోచనలో పడ్డాను. ఇంకా మాఊరికి వచ్చినట్టు లేదు ఆ సౌలభ్యం.

గబుక్కున లేచి, రెండోసారి వీధిలోకి బయల్దేరేను రెండు డాలర్లు జేబులో వేసుకుని. ఇది జరిగి మూడు వారాలయింది. నా చెత్తబండి స్నేహితురాలు మళ్ళీ కనిపించలేదు. కనిపించిందేమిటంటే చెత్తకుండీమూతనుండి వేలాడుతూ తాళం కప్పలు!

DSC02273

000

గమనిక – ఈ కథవెనక వాస్తవాలకి కింద ఇచ్చిన లింకులు చూడండి.

http://en.wikipedia.org/wiki/Homelessness_in_the_United_States

http://en.wikipedia.org/wiki/Freeganism

యూట్యూబులో homelessness మీద విడియోలు చూస్తే తల తిరిగిపోతుంది.

000

 

(మార్చి 12, 2015)

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “చెత్తకుండి భద్రం! (కథ)”

  1. ఇంచు మించు ఇలాంటి దృశ్యమే మురికికాలవలలో నీళ్లు జల్లెడ పడుతుండటం చూసి ఎందుకలా చేస్తారు అని తెలుసుకుని ఆశ్చర్య పోయాను బంగారు అంగళ్ళ దగ్గరి మురికికాల్వల మట్టి నుండి వెండి బంగారు రేణువులు సేకరించ టానికి అలా చేస్తారని..దునియాలో ఆహరం కొందరికి సులభం గా కొందరికి అతి కష్టం మీద కొందరికి బేవార్సుగా లభిస్తుంది…ఒక్క ఆహరం విషయం లొనే ఇంత తేడాలుంటే మిగిలిన మౌలికఅవసరాలకు ఎంత తేడాలు ఉంటాయో…

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.