పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాథాలహరి

ప్రాచీన అర్వాచీనసాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనించిన విద్వత్కవులు కథలు రాయడానికి పూనుకున్నప్పుడు వారి పాండితి ఆ కథల్లోనూ కథనసంవిధానంలోనూ కూడా ద్యోతకమవుతుంది. ఆ కథల్లో సాహిత్యపరమైన, సాంఘికపరమైన సంగతులు అనేకం గ్రహించి ఆనందించగలం.

పిలకా గణపతిశాస్త్రిగారు (1911-1983) సృష్టించిన సాహిత్యం తెలుగుపాఠకులకి అపురూపం. “ప్రాచీనగాథాలహరి” శీర్షికతో గణపతిశాస్త్రిగారు ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో 1956-1957లో ధారావాహికంగా ప్రచురించిన కథలు ఇవి.

నాదగ్గర ఉన్న సంకలనం ముందుమాటలో యాభై కథలు మూడు సంకలనాలుగా ప్రచురించదలచినట్టు రచయిత చెప్పేరు. ఈపుస్తకం మూడో సంకలం అని ముఖపత్రంమీద ఉంది. కానీ మొదటి రెండు సంకలనాలు నాకు దొరకలేదు. ఆ ముందుమాటలో ఇతర సంగతులు ఇలా ఉన్నాయి. మొదటిది – ఈ సంకలనంలో ఒక సంఘటననో, సన్నివేశాన్నో, శ్లోకాన్నో తీసుకుని, వేర్వేరు రీతులలో కథానికలుగా రాయడం. రెండోది, తాము ప్రచురించ దలచిన మూడు సంపుటాలు అనుస్యూతంగా కాక, దేనికది స్వతంత్రంగా ప్రకటించడం.

అంతే కాదు. కథారచనకి ఉపయోగపడగల వస్తువు తీసుకుని “విభిన్న వినూత్న కల్పనలతో, వివిధ పాత్ర చిత్రణలతో” తమదైన శైలిలో మలచిన కథలివి అని కూడా గణపతిశాస్త్రిగారే చెప్పుకున్నారు. కథాంశాలు “కొన్ని చారిత్రకాలయితే, కొన్ని చారిత్రక పూర్వరంగంతో కల్పించిన స్వతంత్ర రచనలు” అనీ, “సంస్కృతకావ్యాలలోని కథలకి అనువాదాలు కానీ, అనుకరణలు కానీ కావు” అనీ కూడా వివరించేరు. తమ ధ్యేయం ఇంత స్పష్టంగా చెప్పే రచయితలు అరుదు. ఇది నాకు నచ్చిన మొదటి విషయం.

వారి ధ్యేయానికి అనుగుణంగా గణపతిశాస్త్రిగారు హాలుని గాథాసప్తశతి, కల్హణకవి రాజతరంగిణి, మహా భారతంలోని కొన్ని సన్నివేశాలు, సందర్భాలు, లేదా ఒక శ్లోకం తీసుకుని రాయడంచేత మొత్తంమీద “కథాశరీరకల్పనం చాలావరకూ సరికొత్త పంథాలో నడిచింది” అంటారు.

ఈ ఎరుకతో గణపతిశాస్త్రిగారి కథలు చదివితే, ఈ కథలలో మనం తెలుసుకోగల సంగతులు అనేకం కనిపిస్తాయి.

నాకు తోచిన మరొక కోణం మనదేశంలో మౌఖికసాహిత్యానికి అనన్యసామాన్యమైన ప్రాధాన్యత ఉంది. ఏ పాఠశాలలోనూ చదువుకోనివారికి కూడా భారతం, భాగవతంవంటి గ్రంథాలలోని పాత్రలూ, సన్నివేశాలూ, సంఘటనలూ సుపరిచితం. నిత్యజీవితంలో వాటి ప్రసక్తి ఏదో ఒకవిధంగా వస్తూనే ఉంటుంది. కీచకుడిలా అనో, సీతాదేవిలా అనో ఒక్కమాట చెప్పగానే సుమారుగా అర్థమయిపోతుంది ఆ వెనకనున్న కథా, ఆ సమయంలో ప్రసంగిస్తున్న అంశానికి ఉన్న సంబంధం. ప్రత్యేకించి “కీచకుడు అనో సావిత్రి అనో ఎందుకంటున్నానంటే” అంటూ సుదీర్ఘ వివరణలు ఇవ్వవలసిన అవుసరం రాదు. మరి ఈ కథలు అంతకుమించి అధికంగా ఏమి చెప్తున్నాయంటే, గణపతిశాస్త్రిగారు తీసుకున్న సన్నివేశాలు, సంఘటనలూ అంతగా ప్రాచుర్యంలో ఉన్నవి కావు అని అనిపించింది, కనీసం నాకు. లేదా, ప్రాచుర్యంలో ఉన్నా సూక్ష్మవివరాలు అంత స్పష్టంగా తెలినివి.

మహా భారతంలోని ఉపకథలు – యక్షప్రశ్నలు, మహాప్రస్థానం, రాజ్యాభిషేకం (కర్ణుడిఅంగరాజ్య పట్టాభిషేకానికి పూర్వం ద్రుపదునియందు ద్రోణాచార్యుని పగ వివరంగా ఉంది ఇందులో), ఉదంకుడు గురుపత్నికోరినమీదట పౌష్యరాణి కర్ణాభరణాలు సంపాదించడానికి పడిన అవస్థలు వంటి కథలు కర్ణాకర్ణిగా పాఠకులు విని ఉండవచ్చు కానీ గణపతిశాస్త్రిగారు ఈ ఉపకథలు తీసుకుని, వాటి పూర్వాపరాలు వివరిస్తూ తనదైన శైలిలో, చవులూరించే తెలుగుదనంతో ఉత్కంఠభరితంగా కథనం సాగించడం విశేషం. ఉదాహరణకి, యక్షప్రశ్నలు అన్నపదం నిత్యవ్యవహారంలో అనేక సందర్భాలలో వాడతాం, వింటాం కానీ ఆ ప్రశ్నలు ఏమిటి, ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఏమిటి అంటే అందరూ చెప్పలేకపోవచ్చు. నేను చెప్పలేను. గణపతిశాస్త్రిగారికథ చదివేకే తెలిసేయి నాకు.

“కవి చక్రవర్తి” కథలో హర్ష విక్రమాదిత్య చక్రవర్తి కవి మాతృగుప్తుని కాశ్మీరదేశాధిపతిగా నియమించడం. ఆ సంఘటనకి పూర్వాపరాలు చిత్రించేరు. కథ మొదట్లో ఆర్థికమైన ఇబ్బందులకు లోనై, మాతృగుప్తుడు చక్రవర్తి ఆశ్రయం కోరినమీదట చక్రవర్తి ఆయనని తమకొలువులోనికి తీసుకుంటాడు కానీ కవిగా ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చినట్టు కనిపించదు. ఆద్యంతాలా రాజుప్రవర్తనా, మాతృగుప్తుని ప్రవర్తనా కూడా ప్రతిభావంతంగా చిత్రించేరు రచయిత. నిజానికి కథల్లో పాత్రల మనోవిశ్లేషణ అధ్యయనం చేయదలుచుకున్నవారికి ఈకథ అద్భుతమైన వనరు కాగలదు. మాతృగుప్తునిపట్ల చక్రవర్తి అనాదరణ, మాతృగుప్తుని శాంతం, ఓరిమి వీటికి కారణాలు – వంటివి అర్థం కావాలంటే కథ ఆసాంతం చదవాలి. కథ పూర్తిగా చదివినతరవాత వీరి వ్యక్తిత్వాలు ఎంత దృఢతరమో తెలుసుకుని ఆశ్చర్యపోతాం.

ఈకథ చివరలో ఉదహరించిన మూలకథారచయిత కల్హణుని వాక్యాలు గమనార్హం. “పామరులు విశ్వసింపరనే భయంతో యథార్థవిషయాలే వ్రాస్తున్నానని కల్హణుడు రాజతరంగిణి పీఠికలో పేర్కొన్నాడు! ఆ కల్హణుడే విక్రమార్క, మాత్రృగుప్త, ప్రవరసేనుల చరిత్రలు మూడూ మూడు పునీత మార్గాలలో ప్రవహించిన ఆకాశగంగానదీ ప్రవాహాలవంటివని ముక్తకంఠంతో ప్రశంసించాడు. ” అంటారు రచయిత.

గణపతిశాస్త్రిగారు ఆ “గంగానదీ ప్రవాహాలను” ఈ విధంగా మనకు అందించడం ముదావహం.

“సార్వభౌమ సత్కారం”కథ – ఉజ్జయినిలో విక్రమార్క చక్రవర్తికి కలిగిన పుత్రసంతానం భవిష్యత్తుగురించి ఆస్థానవిద్వాంసుల జోస్యానికి భిన్నంగా మిహిరుడు “ఆ బాలుడు వరాహంచేత హతుడు కాగలడ”ని చెప్పి, వారి ఆగ్రహానికి గురికావడంతో మొదలయినకథ మిహిరుడు “వరాహ మిహిరుడు”గా సార్వభౌముని సత్కారం అందుకోడంతో ముగుస్తుంది. జ్యోతిషం చెప్పడంలో సూక్ష్మాతిసూక్ష్మ అంశాలు అందరూ గమనించకపోవచ్చు తెలిసో, తెలియకో. కొందరు చెప్పిన జోస్యాలు ఫలించడానికీ, మరికొందరు చెప్పినవి ఫలించకపోవడానికీ మాత్రం ఈ సూక్ష్మ అంశాలే అని అర్థమవుతుంది ఈ కథ చదివేక.

నాకు అత్యంతరమణీయంగా కనిపించిన కథలు గీర్వాణభాషాభ్యాసం, బహువ్రీహి. రెండుకథల్లోనూ అనర్ఘమైన చమత్కారమే కాక తెలుగుభాష వైభవం కూడా చూస్తాం. ఇటువంటి కథలు రాయడం సాధికారికమైన భాషాజ్ఞానం ఉన్నవారికే సాధ్యం అనుకుంటాను.

మొదటికథ, గీర్వాణభాషాభ్యాసం, నాదగ్గర ఉన్న సంకలనంలో లేదు కానీ కథానిలయంలో దొరికింది. జలక్రీడాసమయంలో తనపై నీళ్ళు చల్లుతున్న చక్రవర్తిని ఉద్దేశించి లీలావతి సంస్కృతంలో “రాజన్, మోదకైస్తాడయ,” అని ఆయనని వారించబోవడం, గీర్వాణభాషాజ్ఞానం లేని చక్రవర్తి మోదకములు (లడ్డూలు) తెప్పించి ఆమెపై విసరడం సూక్ష్మంగా పాఠకులలో చాలామందికి పరిచితమైన కథ.

గణపతిశాస్త్రిగారు ఈ చిన్న ఉదంతాన్ని తీసుకుని అనేక అంశాలు చేర్చి, గుణాఢ్యుడు బృహత్కథ సృష్టించడం, ఏడు లక్షల గాథలు రాయగా, ఒక లక్ష మాత్రమే మిగలడం వంటి అనేక విషయాలతో కథని సాహిత్యచరిత్రలో ఒక ముఖ్యమైన, ఆసక్తికరమైన శకలంగా తీరిచి దిద్దేరు. గణపతిశాస్త్రిగారికృషి శ్లాఘనీయం.

సింహళ దేశపు యువరాణి లీలావతితో కాశ్మీరదేశ చక్రవర్తి వివాహం, ఆమె బాహాటంగా చెలికత్తెలముందు చక్రవర్తిని పరిహాసం చేయడం, దానికి వెనకనున్న కారణాలు, గుణాఢ్యుడు ఓటమినంగీకరించి షరతు ప్రకారం సంస్కృతంలో రచనావ్యాసంగానికి స్వస్తి పలకడం, ఆ తరవాత వింధ్యాటవికి వెళ్ళిపోయి, పైశాచిలో అక్కడ బృహత్కథ రచించడం, వంటి ఎన్నో విషయాలు ఈకథలో చేర్చేరు.

బహువ్రీహి వ్యాకరణంలో ఒక సమాసం పేరు. రెండు పదాలు చేర్చి మరొక పదానికి పర్యాయపదంగా వాడడం. ఒకొకప్పుడు ఒకే సమాసానికి వేరువేరుగా అర్థాలు చెప్పుకోవచ్చు, ఆ రెండు పదాలనూ విడదీసే పద్ధతినిబట్టి. ఈకథలో సౌకర్యాన్ని ఉపయోగించుకున్న తీరు చదివి తెలుసుకోవలసిందే కానీ నేను సూక్ష్మీకరించగలది కాదు.

స్థూలంగా అనేక కథలలోలాగే ఈకథలో కూడా నిరుపేద పండితుడు విద్యానాథుడు తమప్రాంతాలకి వేంచేసిన ప్రతాపరుద్రదేవ మహీపతిని ఆశ్రయించబోతే, సోమయామాత్యుడు అడ్డు తగలడం, విద్యానాథుడు తన మేధతో రాజుగారి అనుగ్రహం సంపాదించడం, ఆ అనుగ్రహంతో సంపాదించుకున్న భూభాగాన్ని ఆక్రమించుకోడానికి కూడా మంత్రి అనేకవిధాల ఆటంకాలు కల్పించడం జరుగుతుంది. కథ పొడుగునా విద్యానాథుడు ప్రదర్శించిన పాండిత్యం అమోఘం. తెలుగుభాషపట్ల ఏమాత్రం అభిమానం ఉన్నవారికైనా అలరించగల కథ అని నేను అనుకుంటున్నాను.

పాదప్రహారం కథలో సకల విద్యాపారంగతుడు, నిత్య నిష్ఠాగరిష్ఠుడు, ధర్మబద్దుడు అయిన విష్ణునాగుడు మిత్రునిప్రోద్బలంతో కొంతా, తాను భరతశాస్త్రవిదుడనని నిరూపించుకోవాలన్న భేషజంతో కొంతా కలసి, వేశ్య మదనికఇంటికి వెళ్ళి  రాధికాభినయం పట్టమని అర్థించడం, ఆమె అభినయం పట్టి, నెరజాణతనంతో తనపాదాగ్రంతో విష్ణునాగుని శిరసు అలవోకగా స్పృశించడంతో కథ పాకాన పడుతుంది. ఆ పైన ఆ పాదతాడనంమూలంగా విష్ణునాగుడు తన బ్రాహ్మణ్యం, ఆర్షేయపౌరుషేయాలు అపవిత్రమయిపోయేయని బాధపడి, ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిశ్చయించుకోడంతో కథ గొప్ప మలుపు తిరుగుతుంది. అటు ధర్మవేత్తలూ, ఇటు విటపరిషత్తువారూ కూడా గణికా పాదతాడనానికి ప్రాయశ్చిత్తం లేదని గ్రహించి, లేదని సూటిగా విష్ణునాగునికి చెప్పక, ఆయనని అనేకవిధాలుగా అవహేళన చేస్తారు. ఈ భాగం చదువుతుంటే, ప్రాయశ్చిత్తంగురించిన సందేహాలు కలగడం సహజం. విట పరిషత్తువారు తనని హేళన చేస్తున్నారని గ్రహించిన విష్ణునాగుడు వారికి తగు సమాధానం చెప్పడంతో కథ సరదాగా ముగుస్తుంది.

గాఢానురాగం, చంద్రముఖి కథలు ప్రణయకథలు. మొదటికథ – మోహాతురతతో ప్రియుడిని రహస్యంగా కలుసుకోడానికి ఆయత్తమవుతున్న రత్నావళిని చెలికత్తె అపరాజిత వారించడానికి యత్నించడం ప్రధానాంశం. రత్నావళిప్రేమ ప్రేమ కాదనీ, ప్రేమమనే భ్రమా, ఆత్మవంచనా అనీ హెచ్చరించి, తనమాట రుజువు చేయడానికి ఆమెకి మరొక ప్రేమకథ చెప్పి, ఆపైన రత్నావళిని పరీక్షిస్తాననీ చెప్పడంతో కథలో ఉత్సుకత పుంజుకుంటుంది. కథ ముగించిన అపరాజిత తొలి ఒప్పందంప్రకారం అడిగిన ప్రశ్నలూ, రత్నావళి ఇచ్చిన సమాధానాలూ ఒక ఎత్తయితే, ఆమె చెప్పినకథలో లేని భాగం ఎత్తి చూపి, రత్నావళి మనసున వాస్తవం నాటుకునేలా తెలివిడి చేయడం మరొక ఎత్తు. ఇటువంటి చమత్కారాలు గణపతిశాస్త్రిగారివంటి మహానుభావులకే చెల్లుతాయి అనిపించకపోదు.

చంద్రముఖి కథ- అదొక మహా అరణ్యం. ప్రపంచసృష్టిలో ప్రప్రథమ మానవుడు మనస్వి, మరొక మానవుడికోసం వెతుకుతుంటే ఒక వృద్ధుడు సవిత కనిపిస్తాడు. ఆయనద్వారా ప్రప్రథమ స్త్రీ చంద్రముఖితో పరిచయమవుతుంది మనస్వికి.ఈ తొలి జంట ప్రేమతో మొదలై, సంసారంలో చిన్న చిన్న కలహాలతో, కలతలతో సాగి, రాజీ పడడంతో ముగుస్తుంది కథ. ఈకథ చదివితే, ఆనాటినుండీ ఈనాటివరకూ, దంపతులకలహాలు ఒక్కలాగే ఉన్నాయని ఈనాటి యువదంపతులందరూ ఒప్పుకు తీర్తారు.

ఒక సన్నివేశం తీసుకుని, గౌతమబుద్ధుని ఒక పాత్రగా చేర్చిఅల్లిన కథ భాగ్యశాలిని. శ్రావస్తినగరంలో కాటకంమూలంగా ప్రజలు అన్నాతురులై అల్లల్లాడుతున్న సమయంలో, బుద్ధుడు శ్రావస్తీనగరంలోని ధనవంతులని అన్నదానం చేయమని కోరగా, ధనవంతులెవరూ ముందుకు రారు. ఒక సామాన్య భిక్షుకి బుద్ధుప్రభువుఅనుగ్రహంతో తాను చేస్తానని ముందుకు రావడం ఈకథలో సౌందర్యం.

“రాజ్యాంతే నరకం ధృవం!” అన్న కథలో కాశ్మీర చక్రవర్తి శంకరవర్మ చరమదశలో క్రౌర్యంతోనూ, ధనప్రలోభంతోనూ ప్రజలని కష్టాలపాలు చేసినప్పుడు కుమారుడు గోపాలవర్మ తండ్రిని మందలించే సన్నివేశం చదువుతుంటే, ఆనాటి ఆలోచనలు కొన్ని మనకి తట్టకపోవు. వార్తల్లో చూస్తున్నాం. నేరం చేసిన ప్రతి ఒక్కరూ తమని తాము సమర్థించుకోడానికి ఇచ్చే సమాధానాలు. శంకరవర్మని ధర్మపాలన పునఃప్రతిష్ఠించమని గోపాలవర్మ వేడుకుంటాడు. దానికి శంరవర్మ ఇచ్చిన సమాధానం – తమ తండ్రి, గోపాలవర్మ తాతగారు, శంకరవర్మని అనేకవిధాల హింసించేరుట. ఎందుకంటే “ఆగర్భ శ్రీమంతులకు క్షుద్రదరిద్రుల కష్టసుఖాలు తెలియవు. రాజ్యాధికారం చేజిక్కినతరవాత అవి జ్ఞప్తికి రావాలనే దృష్టితో” అని.

మరి శంకరవర్మకి ఆవిషయం జ్ఞప్తిలో ఉందా అంటే కొంతకాలం మాత్రం ఉంది. ఆ తరవాత తనలో “కారుణ్యం లేశమైనా లేకుండా నశించిపోయింది” అంటాడు! ఇలాటి కుంటిసాకులు ఏకాలంలోనూ ఉన్నాయి. ఈనాడు కూడా ఏ సమాజంలో చూసినా ఏవిధమైన నేరాలు చేసినవారైనా ప్రజలకి ఇచ్చుకునే సమాధానాలు ఇలాగే ఉంటున్నాయి కదా.

అవకాశం దొరికినప్పుడు ఛలోక్తులు కూడా రుచి చూపించేరు గణపతిశాస్త్రిగారు. గీర్వాణభాషాభ్యాసంలో శర్వవర్మ సంస్కృతం ఆరునెలలల్లో నేర్చుకునే సదుపాయం చేయగలనని హామీ ఇచ్చినతరవాత, ఆస్థానవిదూషకుని ఛలోక్తులు – “అయితే దీనివల్ల ఒక్క పెద్ద ప్రమాదం ఏర్పడేటట్లుంది. ప్రతిష్ఠాననగరంలోనావంటి మందబుద్దులందరు ఇక మహా గీర్వాణ విద్వాంసులయిపోయే పక్షంలో వీరందరినీ పోషించడానికి ప్రభువులవారి కోశాగారానికి శక్తి చాలదేమో.” తనది “మృత్పిండ బుద్ది” (మట్టిబుర్ర) అంటాడు.

గణపతిశాస్త్రిగారి కథల్లో వారు పేర్కొన్న కొత్తదనం ఈనాటికీ కొత్తగానే కనిపిస్తుందనడానికి పై ఉదాహరణలు చాలనుకుంటాను. పాశ్చాత్యసంప్రదాయంలో వినూత్నపోకడలకి అలవాటు పడిన కొంతమంది పాఠకులకి కూడా ఈకథలలో కొత్తదనం నవ్యనూతనంగా ఆదరణీయంగా కనిపిస్తుందనే నా అభిప్రాయం, ప్రత్యేకించి వారి కథనరీతిమూలంగా.

భాషగురించి చెప్పాలంటే, గీర్వాణభాషాభ్యాసంకథలో ఈవాక్యాలు చెప్పుకోవచ్చు. గుణాఢ్యుడు తాను సంస్కృతంలో రాయడం మానుకుంటానని ప్రతిజ్ఞ చేయడంచేత ప్రాకృతంలో రచన కొనసాగిస్తాడు. ఆ గాథలు ఆటవికులందరూ గానం చేస్తుంటే, ఆ ‘గాథా సంగీతం’ వింటుంటే, గుణాఢ్యమహాకవి హృదయం ఉత్సాహానందాలతో ఉరకలు వేసింది. “అమాయకులైన ఆటవికులానందించి గానం చేసినదే మహాకవిత! అహంభావపూరితులైన మహరాజుల ఆస్థానాలలో గీర్వాణకవిత కేవలం గణికగా మారి భ్రష్టమయిపోయింద” ని శిష్యుడైన నందివర్మతో చెప్పి, ఆ గాథలు రాజుకి అంకితం చేయ నిరాకరిస్తాడు గుణాఢ్యుడు. ఈవాక్యం చదువుతున్నప్పుడు నాకు మరొక విషయం స్ఫురణకి వచ్చింది. ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, బిరుదురాజు రామరాజుగారు, నాయని కృష్ణకుమారిగారు మొదలైన పండితులు కృషి చేసి జానపదసాహిత్యానికి సాహిత్యస్థాయి కల్పించేవరకూ, అంటే 40వ దశకంవరకూ,మన విశ్వవిద్యాలయాలు జానపద సాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తించలేదు. గుణాఢ్యుని అభిప్రాయం వారు వినలేదో, వినిపించుకోలేదో!

అలాగే పరీక్ష నిర్వహించేవిధానంలో కూడా ఈనాటి ఛాయలు చూస్తాం. (ఇది రచయిత కల్పనేమో నాకు తెలీదు). చక్రవర్తి పాండిత్యాన్ని పరీక్ష పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు, అమాత్యులకి కలిగిన మొదటి సందేహం – అసలు సంస్కృతపాండిత్యం అన్నపదానికి సరియైన అవధి నిర్ణయము మొదట్లో చేసుకోలేదు, పాండిత్యం నిర్ణయించడానికి కావలసిన అర్థనిర్వచనము లేదు” అని. పరీక్షగురించిన వాదోపవాదాలు కూడా చేర్చేరు ఇక్కడ.

గణపతిశాస్త్రిగారి పాండిత్యం కథల్లో కనిపిస్తుందని మొదట్లో చెప్పేను. నాకు కథలనిండా కనిపించింది. ఇక్కడ మచ్చుకి కొన్ని ఉదాహరణలిస్తాను. గాఢానురాగం కథలో ఉపమానాలు చూడండి. కాంచనమాల ముఖం ఆ దీపకాంతిలో “నక్షత్రకాంతిలో శుద్ధపాడ్యమినాటి చంద్రవంకలా మెరిసింది”. “కార్తీక కౌముది పలచ పలచని గోక్షీరంలా ప్రపంచం అంతటా ప్రసరించింది”.

కవి చక్రవర్తి కథలో మాతృగుప్తుడు విక్రమాదిత్య చక్రవర్తి మరణించినతరవాత కాశ్మీరదేశపు వారసుడైన ప్రవరసేనునికి రాజ్యం ధారాదత్తం చేయబోయేముందు అంటాడు, “ఆదిత్యుని అస్తమయంతో సూర్యకాంతమణి దీప్తి తగ్గిపోతుంది. … నాదీప్తీ అంతే.”

చివరిమాటగా, నాది మరీ మృత్పిండ బుద్ధి అనుకోను కానీ సుమారుగా ఆప్రాంతాల్లోనే ఉన్నాను అనుకోవచ్చు. ఈనాడు ఆవగింజంతైనా తెలుగుభాష నారాతలలో కనిపిస్తోందంటే నేను ఆరోజుల్లో ఆంధ్రపత్రిక, భారతి వంటి ప్రముఖపత్రికలు చదవడంచేతనే అని ఈకథలు చదువుతుంటే అర్థమయింది! నేను ప్రబంధాలూ, కావ్యాలూ చదువుకోలేదు. నాకు ఏమాత్రమో తెలుగుభాషలోని లాలిత్యం, సౌరభ్యం తెలిశాయంటే గణపతిశాస్త్రిగారివంటి మహా కవులూ, పండితులవల్లనే. ఆ మహానుభావులకు సాష్టాంగప్రణామములతో ముగిస్తాను ఈ చిన్న రచన.

నా ఈ చిన్న వ్యాసాన్ని శ్రమ అనుకోకుండా చదివి, నా పొరపాట్లు చూపిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి  కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. (మార్చి 28, 2015)

ఈ లింకులు చూడగలరు –

ప్రాచీన గాథాలహరి మూడవసంపుటము.Praachiina Gaathaa Lahari

పిలకా గణపతిశాస్త్రిగారి జీవితవివరాలు, సాహిత్య ప్రస్థానం, తెవికీలో. లింకు – http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B0%BE_%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF

వారి ప్రాచీన గాథాలహరి కథలు, ఇతర కథలు కథానిలయంలోచాలావరకు పిడియఫ్ ఫార్మాట్‌లో. http://kathanilayam.com/writer/1930

 

 

(మార్చి 23, 2015)

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాథాలహరి”

 1. పింగుబ్యాకు: వీక్షణం-129 | పుస్తకం
 2. నారాయణస్వామి, సరేనండీ ఈవిధంగా ఆ పుస్తకం తవ్వితీసే అవకాశం కలిగింది కదా. చదివి మీ అభిప్రాయాలు చెప్తారని ఆశిస్తున్నాను. ఈవ్యాసంలో నేను రాసిన కొన్ని అభిప్రాయాలు నిలుస్తాయో లేదో తెలుసుకోవాలని ఉంది నాకు.

  మెచ్చుకోండి

 3. కథా ప్రపంచం, మీకు గణపతిశాస్త్రిగారియందు గల గౌరవ అభిమానాలు మెచ్చుకోదగ్గవి. మీరు ఉగాదిరోజున పెట్టిన వ్యాసం నేను చూడలేదనుకుంటాను. చూస్తాను కనిపిస్తుందేమో.

  మెచ్చుకోండి

 4. నరసింహమూర్తిగారూ, చాలా సంతోషం. అవును, భారతిలో వ్యాసాలు నేను చదివేదాన్ని, అర్థం కాకపోయినా. కేవలం ఆ భాషే నన్ను ఆకట్టుకునేది. మీరు గణపతిశాస్త్రిగారికథలు చదివి మీఅభిప్రాయాలు చెప్పగలరని ఆశిస్తున్నాను. నమస్సులు

  మెచ్చుకోండి

 5. బాగా రాశారు మాలతి గారూ! అవి చదవని నాలాంటి వాళ్లకి కూడా చదవాలనే ఉత్సాహం కలిగించేలా రాశారు..!

  మెచ్చుకోండి

 6. చాలా సంతోషం. ఈటీవలి భారత యాట్రలో ఈ పుస్తకం కొత్త యెడిషను కొన్నాను. మొన్న అలమరాలు సర్దుతుంటే కనబడింది. అది మూడు సంపుటాల సంకలనమేమో .. చాలా లావుగా ఉంది.

  మెచ్చుకోండి

 7. శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి రచనలు అంటే నాకు అమితమైన ప్రీతి.మా నివాసంలో గోడ కి వారి చిత్రం పటం పెట్టుకున్నాను అంత ఇష్టం వారన్నా వారి రచనలన్నా .నేను చిన్నతనంలో( ఎనిమిదో తరగతి వయసులో ) వారు వ్రాసిన విశాలా నేత్రాలు చదవడం జరిగింది ఆ రచనలో వున్న ఆ తెలుగు చదివాకా ఆ భాష , శైలి పైన మరింత మమకారం పెరిగింది. వారికి సంబందించిన రచనలు దాదాపు సేకరించాననే చెప్పాలి.మొన్న ఉగాది రోజున వారు లోగడ ఒక పత్రికలో వ్రాసిన అప్పటి ఉగాది వ్యాసం నా టైంలైన్ మీదా టపా చేసాను కూడా !

  మెచ్చుకోండి

 8. శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారి ప్రాచీన గాథాలహరిపై మీ సమీక్ష వారి కథల సంకలనానికి తగిన ఉజ్జీలో నడిచింది. చిన్నతనములో వారి కథలు కొన్ని చదివినా ఇప్పుడేమీ అవి నాకు గుర్తు లేవు. మీ వ్యాస సమీక్షను చదివిన పిమ్మట ఆ కథలన్నీ చదవాలనే ఉత్సాహము నిజంగానే కలిగింది.శ్రీ గణపతి శాస్త్రి గారు పాండిత్యమును నిర్వచించ లేమనుచునే వారి పాండిత్యమును వారి కథలలో నిరూపించుకొనడము విశేషము. చిన్నతనములో భారతి సంపుటాలను గ్రంధాలయాలలో చదివే వాడిని. మరల ఆ చిన్నతనాన్ని గుర్తు తెచ్చారు.

  మెచ్చుకోండి

 9. అనిల్ గారూ, ఆ మహానుభావుడిని కలుసుకోడం నిజంగా అదృష్టమే. కనీసం మీరు నాకు పరిచయం (రెండోస్థాయిలో అన్నమాట) అనుకుని ఆనందిస్తాను. ఇహ, ఈనాటి సాహిత్యం మాట కూడా రాద్దాం అనుకుని ఊరుకున్నాను. అవునండీ. ఈనాటి సాహిత్యం చదివి, వీటివల్ల మేం స్ఫూర్తి పొందేం అని రాబోయే తరాలవారు చెప్పుకునే అవకాశం నాకు కనిపించడం లేదు. మళ్ళీ రాస్తానేమోలెండి ఈవిషయంమీద.

  మెచ్చుకోండి

 10. మీరన్న చివరి వాక్యాలలో ఈనాడు ఆవగింజంతైనా తెలుగుభాష నాఅధీనంలో కనిపిస్తోందంటే నేను ఆరోజుల్లో ఆంధ్రపత్రిక, భారతి వంటి ప్రముఖపత్రికలు చదవడంచేతనే అని ఈకథలు చదువుతుంటే అర్థమయింది! నేను ప్రబంధాలూ, కావ్యాలూ చదువుకోలేదు. నాకు ఏమాత్రమో తెలుగుభాషలోని లాలిత్యం, సౌరభ్యం తెలిశాయంటే గణపతిశాస్త్రిగారివంటి మహా కవి పండితులవల్లనే. ఉన్నదంతా నిజమే! అటువంటి సాహిత్యం చదివాం కాబట్టి కొంతలో కొంత అవగాహన ఉంటుంది సాహిత్యం మీద కాని భాష మీద కాని.

  ఈ మధ్య వస్తున్న సాహిత్యం చదువుతుంటే నేను చదువుకుని నేర్చుకున్నది సరైనదేనా అన్న అనుమానం కూడా వస్తుంది అప్పుడప్పుడు. పైగా అసహనం ఒకటి ఈ నాటి రచయితలలో.

  మంచి టపా!
  ఆ మాహానుభావుడ్ని కలుసుకున్న అదృష్టవంతులలో నేను ఒకడిని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.