ఊసుపోక 147 – ఇల్లాలి హస్తవాసి ఇడ్లీలు మసి

నేడో రేపో ఎనభయ్యోపడిలో పడబోతున్నావు, మాడకుండా ఇడ్లీ చెయ్యలేవూ చోద్యం అంటూ అక్కులు నొక్కుకునేవారిని చూసి నేను మహా హాచ్చెర్యపోయేస్తున్నాను. ఇడ్లీలు మాడేయి కనకే చెప్పుకోడం కానీ, అన్నం మాడింది, కూరమాడింది అని చెప్పుకుంటామా? అసలు ఇడ్లీలు ఎలా మాడిపోతాయని అడిగేవారి పాకశాస్త్రప్రావీణ్యంగురించి నాకు సంశయాలు కలుగుతున్నాయి. ఇడ్లీ మాడ్చడమయినా రానివారు రెసిపీలు చెప్తే నమ్మొచ్చా అని నాకు గొప్ప అనుమానం వచ్చేస్తోంది. నిజానికి వీరు అప్పుడెప్పుడో రెసిపీ చెప్తూ ప్రెషర్ కుకర్లో ఉడకపెట్టంమంటే నమ్మి ప్రెషర్ కుకర్ కొన్నాను. కూర చెయ్యలేదు కానీ ప్రెషర్ కుకర్ ఇప్పటికీ ఉంది ధగధగ కొత్త మెరుపులతో. నేపథ్యంలో రేడియో నమ్మరాదే చెలీ ఇమ్మగవారిని అంటూ పాడుతోంది.

ఇంతకీ నా మాడుఇడ్డెనులకథాక్రమంబెట్టినదనిన –

అమెరికా ఖండంలో అడుగెట్టేవరకూ, అంటే మూడుపదులు దాటి మరో దశాబ్దార్థం దాటేవరకూ నేను వంటగదిలో అడుగుపెట్టలేదు. పొగ పడదని కాదు కానీ నాకు అలా జరిగిందంతే. అమెరికా వచ్చేక ఇక్కడ చప్పిడికూడు తినలేక, ఓస్ వంటేం మహా యజ్ఞమా ఏమిటి, గిన్నెలో నీళ్ళూ బియ్యం పోసి పొయ్యిమీద పెడితే అన్నం అయిపోతుంది. కూరముక్కలు తరిగి మిల్లిగరిటెడు నూనె పోసి, ముక్కలు గోధుమరంగు తేరేక ఉప్పూ కారం చల్లితే కూరయిపోతుందంటూ నాకు నేనే పాఠాలు చెప్పుకుని వంటలు చేసేసేను. ఉప్పు తక్కువా, కారం ఎక్కువా అయినప్పుడు కూడా తెల్లనివారు జేగురురంగుమోములతోనే డెలీషసు, డెలీషసంటూ తినేయడంతో నాకు మరింత ఉత్సాహం వచ్చేసి, నా సృజనాత్మక ప్రయోగాలు కూడా సాగిస్తూ వచ్చేను.

నా పాకశాల ప్రయోగశాల అయిపోయిన వైనం ఇదీ.

మొదట అమ్మ పెట్టిన కూరలూ, పచ్చళ్లూ రుచులు పదే పదే మననం చేసుకుని, ఇందులో ఇదున్నట్టుంది అందులో అదున్నట్టుంది అని ఉన్నవీ లేనివీ ఊహించుకుంటూ కూరలూ, పచ్చళ్ళూ చేసేయడం మొదలెట్టేను. కథలు ఎలాగా చెల్లడం లేదు, కనీసం వంటకాలమూలంగానైనా నాపంట పండి, చరిత్రలో శాశ్వతమైన స్థానం సంపాదించుకోగలనన్న మర్మకోరిక కూడా అనుకోండి. ఇక్కడ మరొక హెచ్చరిక. నాపేరు నిడదవోలు మాలతి. నేను మాలతీ చందూరుని కాను, కాను గాక కాను. కాలేను సప్తజన్మలెత్తినా!

ఇడ్లీ మాడడం ఎలా జరిగిందంటే మాఅమ్మాయి నువ్వు ఇది తప్పక చూసి తీరాలి అంటూ గట్టిగా నొక్కి వక్కాణించిన Ms. Fisher Murder Mysteries చూస్తూ, పొయ్యిమీద పెట్టిన గిన్నెసంగతి మరిచిపోయేను వంటింట్లోంచి పడకగదిలోకి మాడుపరిమళాలు ప్రసరించేవరకూ. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనవిషయం ఏమిటంటే, రెండోవాయ పకోడీలు వేసేలోపున పొలోమని తగులుకునే ఫైరలారం ఈ ఇడ్లి మాడుపుకి మారు పలకలేదు. దానిక్కూడా నచ్చినట్టుంది ఆ సువాసన :p.

నేను ఆనందమానందమాయె అని మాయాబజారులో సావిత్రిలా గదంతా కదం తొక్కుతూ, ఆ హుషారులోనే జాలమిత్రులకి నా ప్రతిభ చాటుకున్నాను. అప్పుటికబుర్లన్నమాట చూడండి.

(గమనిక: ఆనాటికబుర్లివి. జాలంలో ఎవరిచక్రాలు వారికున్నాయి కనక ఆకాడికి అవి రహస్యాలకిందే లెక్క – కొండమీద గోలలాటిదే అయినా ఇక్కడ వారిపేర్లు చెప్పి తంటాలు తెచ్చుకొనుట నా అభిమతం కాదు కనక పేర్లు చెప్పడం లేదు. ఎవరికి వారు తమగోత్రనామాలు చెప్పుకుని “మమ” అనుకుంటే సరిపోతుంది. ఆయా కబురురచయితలకు ధన్యవాదాలు.)

DSC02299అమెరికాలో నెలో రెణ్ణెల్లో తిరిగితే, తినడం మానేసినా కాయం తరగకపోవడానికి కారణం మాడిన ఇడ్లీలు చూసి కేకు, కేకంటూ కేకలేసిన బాలామణి కాయభారం లోగుట్టు పెరుమాళుకీ మరియు నాకూ కూడా తెలిసిపోయె :p.

ఉప్మా యొక్క మహాఘనత – “ఒర్రగా” వేగేసిన ఉప్మాట, ఆ ఉప్మాయే ఉప్మా అంట. ఆమధ్య ఒక ఆదివారం మాఅమ్మాయి విందుకి పిలుస్తే, మిగిలిన ఇడ్లీ పిండితో ఊతప్పాలు చేసి పట్టుకెళ్ళేను. వాళ్ళకి తెగ నచ్చేసింది. అంతకంటే గొప్ప విషయం “tastes like మినపరొట్టె” ఉంది అంది సరయు. చూసేరా మాపిల్లకొచ్చిన తెలుగు. భాష అంతా మరిచిపోయినా వంకాయ, బెండకాయ, ఆవకాయ, (దీనికే పికిల్ అంటారు తెలుగువాళ్ళు), పెరుగు అన్నం – ఈమాటలు మాత్రం శిలాక్షరాలయి నిలిచిపోయేయి అమ్మాయినాలుకమీద. మనసుకి మార్గం మంచి భోజనం అంటే ఇదే మరి. భాషకి కూడా అంతే.

బొమ్మలో మాడుఇడ్లీ ఏర్పరిచిన తీరులో అద్భుతమైన ఆకారాలు బహుసుందరం అన్న మెప్పు విన్నాక, “ఇచ్చట మాడిన ఇడ్లీ మాత్రమే దొరకును” అని బోర్డు రాయించి వంటగది గోడమీద పెట్టుకోడానికి సంసిద్ధురాలనయితిని. “మీరాతలలో తీపి ఎక్కువ ..ఈ మాడు వాసన ఖంఢాంతరాలు వ్యాపిస్తోంది మరి ..”లాటి అభినందనలు చూసుకుని తెగ ఆనందించేసేను.

ఆలోచనలో పడితే ఇడ్లీల గతి ఇది. తినడానికి లేదు కానీ గిన్నెలు తోముకోడం గంటన్నర! – అని జాలంలో మొర పెట్టుకుంటే వచ్చిన కబుర్లు ఇన్నీ అన్నీ కావు.

“కథ మళ్లీ మొదటికి. ఇప్పుడు గిన్నెలు తోముకుంటూ ఆలోచించుకోవడం” అన్న సలహా నేను అపార్థం చేసుకుని మరేదో జవాబు ఇచ్చేను, రామక్కా అంటే తామరాకా అన్నట్టు. హీహీ.

“ఇడ్లీలు మాడ్చుట” క్షుణ్ణంగా ఎరిగినవారు ఆమాడిన పళ్ళేలు తోముకోడంగురించిన కిటుకులు చెప్పేరు – కాస్త ఇసక లేదా మట్టి, కొబ్బరి పీచు లేదా స్టీలు స్క్రబ్బరుతో గానీ తోముకోవచ్చుట. అన్నట్టు మందుబిళ్లల రాపర్స్ కూడా ఉపయోగపడతాయిట. ఇది నేను కొత్తగా తెలుసుకున్నాను. మీరు కూడా రాసి పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

ఎలక్ట్రిక్ రైస్ కుకర్ లో అయితే ఇడ్లీలు మాడకముందే పొయ్యి ఆరిపోతుందంటున్నారు. ఇది కూడా నా వంటకాలనోటుబుక్కులో రాసుకున్నాను.

అన్నట్టు ఇడ్లి చివుళ్ళ కాస్త ఎర్రబడితే కళ్ళెఱ్ఱ జేసేవారు కూడా ఉన్నారుట. చోద్యం కాదూ. అసలు మాఅమ్మాయి చిన్నప్పుడు అడుగంటిన అన్నం అయితే తప్ప తినేది కాదు. పెచ్చులన్నం చూసి, దానిమీద నెయ్యి వేసుకుంటే ఆ రుచి చెప్పతరం కాదు అనిపించేది ఆ మొహం చూస్తే.

మధ్యలో కొంచెం శాఖాచంక్రమణం అయి మాటీవీ ఆభరణాలూ, చీనాంబరామీదకి బండి నడిచింది కానీ మాటీవీ చూసే మహద్భాగ్యం లేదు కనక ఈ చర్చ అక్కడే సమాప్తమయిపోయింది.

కొత్తకాపురాలు ప్రారంభించిన యువజనాలకి కూడా నా పాకరహస్యాలు అందించబడుతున్నాయని తెలిసుకుని అమందానందభరితురాలనయితిని. “ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి అని చూపాలి ఈ పోస్ట్ ని”ట. చూసేరా, మరి నేను కూడా సంఘసేవ చేస్తున్నాను.

అలాగే మరో చదువరికి తమ అనుభవం జ్ఞాపకం తెప్పించిన ఘనత కూడా నాదే – “చాలా సార్లు పాలు స్టవ్ మీద పెట్టి , బుద్హిగా ఇవతలకొచ్చి ఎంచక్కా చదువుకుంటూ …. అక్కడేమో పాలు కాగి కాగీ….మరిగీ మరిగీ…. కోవా తయారై ఆనక…. ఇంకేం చెప్పమంటారు?” అంటూ వాపోయెను ఒక చదువరి.

ఈ పద్యం చూసేరా నా ఇడ్లీ మాడుపు తరవాత పుట్టిన కవిత. కవితలు ఎలా పుడతాయని ఎవరికేనా సందేహం కలిగితే, ఈ పద్యంతో సరి!

దిబ్బ రొట్టె రీతి తినగను వచ్చును
కోప మేల మీకు కోరి తినక
శాస్త్ర వేత్త కన్న సాటిగ యున్నారు
ఉడక బెట్టె వాచి ఉబుసుబోక

“ఐన్ స్టీన్ లేక న్యూటను గుర్తులేదు వాచి అనుకుని గుడ్డు ఉడకబెట్టిన ఉదంతం” అని కూడా చెప్పేరు.

ఇడ్లీలలాటిదే మరో ప్రయోగం – సోయా పిండితో మైసూరుపాకులాటిది – సోయాపాకు అందాం.

ఆమధ్య ప్రొటీనులు, కాల్షియంమీద ధ్యాస మీరిపోయి, బజారుకెళ్తే ప్రతి వస్తువుమీద ఇవి ఏ పాళ్లలో ఉన్నాయో చూస్తున్నాను. అప్పుడే ఈ సోయాపిండి కూడా కనిపించింది. నాకు సోయాపాలరుచి బాగా నచ్చింది. పిండి కూడా ఆసంతులోదే కదా అని తెచ్చేను. కూరల్లో, పప్పుల్లో చల్లుకు తినొచ్చంటే. తీరా చూస్తే, కూరలో ఆ పిండి పచ్చివాసన పోక, నాలుకకి జిగురులా అతుక్కుంటూ మహా చిరాకు కలిగించింది. అప్పుడే కనుగొన్నాను మరో కిటుకు. మొదట నెయ్యిలోనో నూనెలోనో పిండి వేయించేస్తే, అలా వాసన రాదని.

సరే ఎలాగా వేయిస్తున్నాను కదా ఇంత పంచదార పోస్తే మైసూరుపాకయిపోతుందనిపించింది. అలా కొంతసేపు వేయిస్తే, మైసూరుపాకు చూపులు దానికొచ్చేయి. రుచికేం, అందులో పంచదార చేదా, నెయ్యి చేదా? కాదు కదా. అంచేత బాగానే ఉంది. బాగానే ఉంది కదా దానిమీద ఇన్ని బాదం పలుకులు చల్లేను. చూడ్డానికీ, తినడానికీ కూడా బాగానే ఉంటుందని.

DSC02298

 

దీనిని హై ప్రోటీను ఫలహారముగా గ్రహించుకోండి. రాహువుపాల బడ్డ చందురునివలె ఉన్నదేల అని అడక్కండి. నేను వంట చేస్తూ చేస్తూ రుచి చూస్తాను సమపాళంలో అన్నీ పడ్డాయో లేదో తెలుసుకోడానికి. ఆవిధంగా వంట అయేసరికి నాభోజనం మూడొంతులు అయిపోతుంది. దీన్ని fringe benefit అనొచ్చో అనకూడదో నాకు తెలీదు.

గుండెలుంటే ప్రయత్నించి చూడండి. అలాగే మఫిన్ పిండిలో కూడా ఈ సోయా కలిపేను నిన్న. చాలా బాగుంది.

ఇప్పటికి ఇంతే నాప్రయోగసరళి.

(ఏప్రిల్ 25, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక 147 – ఇల్లాలి హస్తవాసి ఇడ్లీలు మసి”

  1. యం.వి. రమణరావుగారూ, నిజంగానే జరిగిందండి. చెప్పేను కదా నేను కూడా ఎప్పుడూ లేదు. అందుకే చెప్పుకోడం.
    ఇడ్లీ పళ్ళేలకి నూనే రాస్తాం కనక, నీరంతా ఇగిరిపోయేక, పళ్ళెం వేడెక్కిపోయి అలా మాడిపోయేయి. Fire alarm ఎందుకు తగులుకోలేదో మాత్రం నాకు తెలీదు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s