ఊసుపోక 149 – మ్, ఏ రచయితలా రాస్తే బాగుంటుంది చెప్మా?!

రెండు రోజులక్రితం “ఏరచయితలా రాస్తే మీకథకి సార్థకత అనుకుంటారు. ఆరచయితలో మిమ్మల్ని ప్రత్యేకించి ఆకట్టుకున్న అంశం ఏమటి” అని వర్థమాన రచయితలని ప్రశ్నించేను. వారి జవాబులు సూక్ష్మంగా – తాము ఎవరినీ అనుకరించమనీ, తాము తమలాగే రాస్తామని. నిజమే. ఏ ఒక్కరూ మరొకరిలా రాయరు, రాయలేరు. రాస్తే రాణించదు కూడాను. పట్టుచీరె కట్టి గిల్టు నగలు పెట్టుకున్నట్టు ఎబ్బెట్టుగానూ, హాస్యాస్పదంగానూ ఉంటుంది.

అయితే ఈ “ఎవరిలా రాయడం?” అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి ధర్మసూక్ష్మం వివరిస్తాను.

మిమ్మల్ని అడిగినతరవాత నామాట కూడా చెప్పాలి కదా. బహుశా 14, 15 ఏళ్ళప్పుడనుకుంటా రావిశాస్త్రిగారి కథలు చదివేను. అప్పుడే రావిశాస్త్రిగారిలా రాయగలగితే బాగుండునని అనిపించింది. ఇప్పటికీ అనిపిస్తుంది. అంటే ఎత్తిపోతలు కాదు, “దస్తూరీమాత్రమే స్వహస్తం”గా (ఆరుద్రగారివాక్యం) మామిడిచెట్టుని వేపచెట్టుగానూ, ముత్యాలమ్మని చెత్యాలమ్మగానూ మార్చి రాయడం కూడా కాదు నేను చెప్తున్నది.

నాకు రావిశాస్త్రిగారిలా రాయాలనుంది అంటే నాకు ఆయన రాసిన కథ చదువుతున్నప్పుడు కలిగిన స్పందనమాట అన్నమాట. ఒకొకపదం, వాక్యం నామనసులో సూటిగా నాటి శాశ్వతంగా నిలిచిపోయేయి. సందేశం కంటే కూడా పదసౌలభ్యం నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అంచేత రావిశాస్త్రిగారిలా, మధురాంతకం రాజారాంగారిలా రాయాలనుంది అంటే వారికథలు చదువుతున్నప్పుడు మనలో ఎలాటి స్పందన కలిగిందో అలాటి స్పందన కలిగించగల కథలు రాయాలని ఉంటుంది అని.

ముఖ్యంగా రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు అల్పాక్షరాలతో అనల్పార్థాలు ధ్వనింపచేయడంలో అద్వితీయులు. “పువ్వులు” కథలో “ఈ తుపాకీ పేలదు”, “పాపి” కథలో “మరి ఆడి పాపాలన్నీ ఏటయిపోయినట్టు” లాటి వాక్యాలు అక్షరలక్షలు చేస్తాయి. నిజానికి క్లిష్టమైన సంస్కృతభూయిష్టమైన సమాసాలు వాడకుండానే అంతటి శక్తిమంతమైన వాక్యాలు రాయగలగడం ఆయన ఎక్కడ నేర్చేరో అనిపిస్తుంది నాకు.

అంచేత నాకు “ఫలానావారిలా రాయలనుంది” అంటే అది వారిరచనలకి నివాళి అని మాత్రమే అర్థం. “పక్కింటి బామ్మగారిలా గారెలొండు” అంటే ఆవిడలా గుండు కొట్టింటుకుని, సైను పంచె ముసుగేసుకుని అని కాదు కదా.

ప్రతి ఒక్కరూ, ఎవరికి వారు తమలాగే రాస్తారు. వారి అనుభవాలు, పెంపకం, చుట్టూ ఉన్న సమాజం, ఓనమాలనాటినుండి చదువు పూర్తయేవరకూ దారిపొడుగునా కలిసిన స్నేహితులూ, ఇంకా జాలమిత్రులూ – ఇంతమంది ప్రభావం ఉంటుంది ప్రతి ఒక్కరి ఆలోచనాధర్మంలోనూ. వాటన్నిటిమీదా ఆధారపడి తయారయిన పదకోశం వారికి ప్రత్యేకంగా ఉంటుంది. వారు చదివిన పుస్తకాలూ, అనుదినమూ వింటున్న మాటలూ, వాక్యనిర్మణం కూడి ఆ రచయిత రచనకి పునాది అవుతుంది. అదే చిత్తశుద్ధితో రాసిన రచన అవుతుంది.

నాప్రశ్నకి సమాధానంగా తమ ఆలోచనలు పంచుకున్నవారు – లక్ష్మీదేవి, స్ఫురిత మైలవరపు, ఇస్మయిల్ సుహేల్ పెనుకొండ, జోగారావు వెంకట సంభార, జ్యోతి వలబోజు, మహేశ్వరి అందే, వెంకట్ టేకుమళ్ళ, లక్ష్మీవసంత,విజయ కర్రా, శ్రీనివాస్ మేరు సూరిసెట్టి, లలిత గూడ, సుభద్ర శీలా. మీరు మీ అబిప్రాయాలు రాసినందుకు ఇవే నా కృతజ్ఞతలు.

 

(మే 8, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s