ఊసుపోక 150 – అర్థాంతరీకరణము

భాషాంతరీకరణము అనగా ఒక భాషలో వాక్యాలు మరొక భాషలోకి మార్చడం. అర్థాంతరన్యాసములో ఒక విషయానికి మరొక విషయాన్ని అదే భాషలో జత చేయుట.

ఇటీవల కొంతకాలంగా అంతర్జాలంలో కథలూ, కబుర్లూ చూస్తుంటే ఒకభాషలో ఒకమాటకి వేరొక భాషలో వేరొక అర్థం ఇచ్చుట ఇనుమిక్కిలిగా కనిపిస్తోంది. నేను కొంచెం చదువుకున్నదానినే అయినా ప్రస్తుతం నాకు తెలుగూ ఇంగ్లీషూ కూడా రాదేమో అన్నంత గందరగోళం అయిపోతోంది. ఆ పైన తెలుగులిపిలో రాసిన ఇంగ్లీషయితే ఇహ చెప్పక్కర్లేదు నా అవస్థ. అంచేత అన్నమాట ఈ అర్థాంతరీరణము వివరించడానికి పూనుకున్నాను, నాలాటివారు మరి కొంతమంది ఉండకపోతారా అన్న ధీమాతో.

అతి సూటిగా నున్నది మరియు నాకు తప్ప అందరికీ తెలిసినదీ, అత్యంతము ప్రచారములో ఉన్నదీ హాండిచ్చుట. హాండిచ్చేరు అంటే సహాయపూర్వకంగా చెయ్యి అందించేడు అనే అనుకున్నాను చాలాకాలం. గత ఏడాది దాని నిజఅర్థం తెలుసుకుని ధన్యత చెందేను.

ప్రస్తుతం –

మాయింటికి అరమైలు దూరంలో ఒక దేశీదుకాణం ఉంది. అక్కడ మన పప్పులు, కారాలూ, నామమాత్రంగా సొరకాయ, కాకరకాయలూ ఉన్నాయి. ఆహా, నడిచివెళ్ళి తెచ్చుకునేదూరంలో మన కిరాణాకొట్టు అనుకుని మురిసిపోయేను.

నెలరోజులక్రితం యాజమాన్యం చేతులు మారింది. కొత్త కొట్టువాడు – కొత్త కొట్టు కాదు, కొట్టు యజమాని – నన్ను చూడగానే, పరమానందపడిపోయి, పొంగిపోతున్న ఉత్సాహంతో ఆహ్వానించి, ఇదేమిటి, అదేమిటి అని నన్ను అడగడం మొదలు పెట్టేడు! కంగారు పడకండి. దేశీజనాలకి ఇది సర్వసాధారణం. ఇలాటి సన్నివేశాలు నాకు చాలానే తగిలేయి. ఏళ్లతరబడి ఈ దేశంలో ఉన్న దేశీ వ్యాపారస్థులు కూడా భాషా, ఊసులదగ్గరికి వచ్చేసరికి నిన్నో మొన్నో దిగినట్టు కనిపిస్తారు. అంచేత అతనికి ఇంగ్లీషు పదం తెలీదు కాబోలు అనుకుని అదేమిటో చెప్పేను. మూడోపదం దగ్గరికి వచ్చేసరికి నాకు తెలివొచ్చింది. ఆ ప్రశ్నలన్నీ నాచేత ఆ సామగ్రి అంతా కొనిపించడానికేనని తెలుసుకున్నాను.

“నాకు నీసామగ్రి అక్కర్లేదు” అని చేతిలో ఉన్న సంచులు అక్కడే పారేసి వెనక్కి తిరిగేను. “లేదు, లేదు, తీసుకో” అంటూ వెనక్కి తగ్గేడు.

వారంరోజులతరవాత మళ్ళీ వెళ్ళేను. ఈసారి అతను నావెంట బడలేదు కానీ, ఎంత అయిందో చెప్పమంటే, “నాలుగు డాలర్లియ్యి” అన్నాడు.

“అలా కాదు, తూకం వేసి చెప్పు,” అన్నాను.

అన్నిటికీ లెక్కలు గట్టి, “4.85” అన్నాడు. రవంత విచారం కూడా వెలిబుచ్చేడు నేను మొదట చెప్పినధర అంగీకరించనందుకు. నేను మాటాడకుండా, ఐదు డాలర్ల నోటిచ్చేను.

“అయితే నువ్వు ఒంటరిగా ఉంటున్నావా?”

ఈ ప్రశ్న కూడా నేను ఇదివరలో విన్నదే. మామూలుగా కొంచెమే కొంటున్నాననీ, చాలా కాలంగా కనిపించలేదనీ … ఏదో అంటారు. నాకు ఎక్కువ ఖర్చు కాదు, నేనొక్కదాన్నే కదా ఎంత తింటాను ఇలా జవాబులు చెప్పుకొస్తాను. కానీ పైప్రశ్నవరకూ ఎవరూ రాలేదు. “సొంతవిషయాలు అడక్కు,” అని అతనికో ఓ చిన్నపాఠం చెప్పేను కొన్నసామాను సంచీలో పెట్టుకుని బయట పడ్డాను.

“అది కాదు. నేను దగ్గర్లో ఇల్లు అద్దెకి తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్న వాటా కాదు, ఇల్లే. షేర్ చెయ్యడానికి,” అన్నాడు.

నేను తలడ్డంగా విసురుగా ఊపి బయట పడ్డాను. గుమ్మందగ్గర అక్కడే పని చేసే మరొకడు కనిపిస్తే, “అతనికి మాటాడ్డం రాదు,” అని చెప్పి ఇంటికొచ్చేసేను. నాకు చిరాగ్గా ఉన్నా, ఈ దుకాణాల్లో దేశీజనాలు ఇంగ్లీషు మాటాడినప్పుడు అలాగే ఉంటుందని కూడా నాకు తెలుసు. సున్నితంగా మాటాడ్డానికి భాష బాగా తెలిసుండాలి. నిజానికి ఇదే మనదేశంలో అయితే, నేను కోపగించుకుంటే, “పోనిద్దూ పాపం, వాడికి మాటతీరు తెలీదు,” అనేస్తారు సద్దుబాటుతనం సూచిస్తూ. నేనూ అలాగే అనుకుని ఊరుకున్నాను.

ఆ తరవాత –

అమ్మదినం రోజున మాఅమ్మాయి వచ్చి, “ఎక్కడికెళ్దాం?” అంటే “నీయిష్టం” అన్నాను. ఏదో హోటలుకి వెళ్ళి, లంచి తిన్నతరవాత, “కూరలూ అవీ ఏమైనా కావాలంటే చెప్పు, వెళ్దాం,” అంది.

“సరే పద.”

మరొ దేశీదుకాణానికి వెళ్ళేం. ధారిలో చెప్పేను, “నాకు ఇంటిదగ్గర దుకాణం సౌకర్యంగానే ఉంది. కానీ ఆ షాపు యజమానిపద్ధతి నచ్చలేదు,” అని.

“వ్హాట్,” అంది మాఅమ్మాయి. “నేనిప్పుడు వెంటనే ఆ షాపుకి వెళ్ళాలి. వాడితో మాటాడాలి,” అని కూడా అంది.

మామూలుగా మాటాడని మా అల్లుడు, “that is weird.” అన్నాడు. ఆ తరవాత మూడు క్షణాల్లోనూ మూడు సార్లు అదే వాక్యం ఉచ్చరించేడు – దట్, ఈజ్, వియర్డ్ – ఒకొక పదానికి ఒకొకసారి స్వరం మారుస్తూ.

“నేనక్కడికి వెళ్ళాలి,” అంది మా అమ్మాయి మరోసారి ముక్తాయింపుగా.

అదుగో అప్పుడే, నాకు రావిశాస్త్రిగారి జరీఅంచు తెల్లచీరె కథా, ఆకథలో వామనరావు గుర్తుకొచ్చేరు. అంతవరకూ నావయసూ, మొహంలో ముడతలూ చూసి ఎవరు గానీ నాతో సరసాలాడగలరని నాకు తోచలేదు. అలాటి ఆలోచన షాపువాడికి వచ్చిందో లేదో కానీ అమ్మాయికీ అల్లుడుగారికీ విశేషార్థంగా ధ్వనించింది!

మాఅమ్మాయికి నాక్షేమంగురించిన అపేక్ష ఉన్నందుకు నేను పొంగిపోయేను ఆంతర్యంలోనే. అప్పుడే మరో ఉదంతం గుర్తుకొచ్చింది.

సుమారు 20 ఏళ్ళక్రితం –

ఓ చిన్న కాలేజీలో ఓ ప్రొఫెసరుకి సహాయకారిగా పని చేస్తున్నాను. ఒకసారి, ఆయన ఆఫీసులో లేని సమయంలో ఒక స్టూడెంటుబాబు వచ్చి ఏదో అడిగేడు. నేను తగు సమాధానం ఇచ్చేను. ఇచ్చేననే అనుకున్నాను. కానీ అతడికి కోపం వచ్చింది. “నేను తలుచుకుంటే ఏం చేస్తానో నీకు తెలీదు,” అన్నాడు.

నేను సీదాగా తలూపేను సరే అనిపించేట్టు.

ఇక్కడ నాగురించి మరోమాట చెప్పాలి. ఎవరైనా నన్ను ఏదైనా అంటే, నేను ఠపీమని మాటకి మాట సమాధానం ఇచ్చేసి క్షణాలమీద అప్పు తీర్చేసుకోలేను. ఆమాట నాతలకెక్కేసరికి కొంత సమయం పడుతుంది. దీన్ని కూడా అర్థాంతరీకరణం చెయ్యొచ్చు. 1. మందబుద్ధి. 2. నిదానస్తురాలు. ఆలోచించి గాని జవాబు చెప్పదు.

ఇంతకీ అసలు విషయం –

మా ప్రొఫెసరుకు చెప్తే, ఆయన, “నేను అతనికోసం చూస్తున్నానని చెప్పు.”

మా అమ్మాయికి చెప్తే, అమ్మాయి, “నేను నల్లపటకా (black belt) అని చెప్పు.”

నేను నవ్వేను, “సరే, ఓ బోర్డు తయారు చేయిస్తాను – నాబాసు ఆరున్నర అడుగులు. మాపిల్ల నల్ల పటకా. నాజోలికి రాకండి – అని” అన్నాను.

పై రెండు వాక్యాలకీ విశేషార్థం – సున్నంలోకి ఎముకలు లేకుండా చితకకొట్టబడుదువు.

ఇంకా వెనక్కి వెళ్తే, 50 ఏళ్ళక్రితం –

అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరేను. ఖర్మవశాత్తు ఒకవిధంగా నాశక్తికి మించిన అధికారం చేతిలోకి వచ్చింది. సరిగా జ్ఞాపకం లేదు కానీ పాతికమంది వరకూ ఉన్నారు నాఅదుపాజ్ఞలలో పని చేయవలసినవారు.

ఒక గుమాస్తా ఏదో జబ్బుతో ఆస్పత్రిలో పడ్డాడు. వారం రోజులుపోయేక ప్రమాదస్థితి అని విన్నాను. మర్నాడు మరొక గుమాస్తా వచ్చి అతను మరణించేడని చెప్పేడు. ఆనవాయితీ ప్రకారం నేను శలవు ప్రకటించేను. అదీ సందర్భం. వారంరోజులతరవాత అతను (చనిపోయేడని నేను అనుకున్నవాడు) ఆఫీసుకి వచ్చేడు. నేను శలవు ప్రకటించినందుకు కోపగించుకున్నాడు. న్యాయమే. నేను శక్తివంచన లేకుండా క్షమాపణలు వేడుకున్నాను. అంతటితో అతను ఊరుకుంటే కథే లేదు.

ఆ సాయంత్రం మాయింటికి వచ్చేడు. మళ్ళీ అదేమాట చెప్పేడు.మరొకరిమాట వినడం నాతప్పే అని మళ్ళీ గట్టిగా ఒప్పుకున్నాను. అయినా అతను శాంతించలేదు. ఆఖరికి, “నాసంగతి మీకు తెలీదు,” అన్నాడు. అదన్నమాట అర్థాంతరీకరణమునకు అర్హమయిన వాక్యం.

పైన చెప్పేను నేను మాటకి మాట వెంటనే జవాబు చెప్పలేనని. కానీ ఆ క్షణంలో మాత్రం వాగ్దేవి నన్ను కటాక్షించిందో, లేక గ్రహాలన్నీతమ తమ స్థానాల్లో ఉన్నాయో కానీ నాకు జవాబు తోచింది.

“ఆమాత్రం గుండెబలం లేకుండానే ఇంతదూరం ఈ ఉద్యోగానికి వచ్చేననుకుంటున్నావా?” అన్నాను.

అతను మొహం ముడుచుకుని వెళ్ళిపోయేడు.

మాఅమ్మ పక్కగదిలో ఉంది. నాలుగు రోజులు నాదగ్గర ఉండడానికి వచ్చింది. నామాటలు విందో లేదో వింటే ఏమనుకుందో నాకు తెలీదు అప్పట్లో. ఆ తరవాత ఆఫీసులో కూడా మరే ప్రమాదాలు జరగలేదు. ఇద్దరం మామూలుగా మాపనులు నిర్వర్తించుకుంటూ పోయేం.

కొంతకాలం అయేక, శలవులకి నేను విశాఖపట్నం వెళ్ళేను. నేను పక్కగదిలో ఉన్నాను. మాఅమ్మ నడవలో ఎవరితోనో మాటాడుతోంది. పై వృత్తాంతం చెప్పి, “నేను దాన్నిగురించి భయపడఖ్ఖర్లేదు. బాగా చెప్పింది వాడికి,” అంది.

అప్పుడు తెలిసింది నాకు నేను గొప్పజవాబు చెప్పేనని.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే – భాష ఎవరబ్బ సొమ్మూ కాదు. అందరూ వాడుకోవచ్చు. వారు వాడుకునేవిధమూ ఎదటివారికి అర్థమయేవిధమూ ఒకటే కావడం సాధారణంగా జరగదు. అది మాటాడేవారందరూ సదా మననం చేసుకోవాలి.

ఇందలి నీతి – ఈసారి ఎవరైనా మీదగ్గర “ఆడవారిమాటలకు అర్థాలే వేరులే” అని పాడితే, “ఆ మనిషికోసం నేను – అంటే నేనే – చూస్తున్నాను” అని చెప్పండి. అన్నట్టు మా అమ్మాయి black belt కూడాను నిజంగానే. :p.

 

(మే 13, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక 150 – అర్థాంతరీకరణము”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.