మధురాంతకం రాజారాంగారికథాయాత్ర సాగినబాటవెంట

ఇది ప్రత్యేకించి మధురాంతకం రాజారాంగారి పుస్తకంమీద సమీక్ష అనడం ఉచితం కాదు.

ఈ పుస్తకం నాచేతికొచ్చి పదేళ్లకి పైనే అయింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి చదువుతుంటే మళ్లీ కొత్తగా చదువుతున్నట్టే ఉంది. రాజారాంగారు ప్రస్తావించిన విషయాలు అలా ఉండగా, సందర్భానుసారంగా నాకు తెలిసిన ఇతర కథలూ, రచయితలగురించిన ఆలోచనలు రాసాగేయి. అవే ఈ వ్యాసం. అందుచేత ఇది నాకు కలిగిన ఇతర సందేహాలు, సమాధానాల సమాహారం అనొచ్చు.

రాజారాంగారి “కథాయాత్ర” వివిధ సమయాల్లో వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాల సంకలనం. మొదటిభాగం తెలుగుకథ ప్రస్థానం వివరించిన చారిత్ర్యకవ్యాసాలయితే, రెండోభాగంలో మైలురాళ్ళు అనిపించుకున్న కొంతమంది రచయితలమీద పరిశీలనాత్మక వ్యాసాలు ఉన్నాయి. మూడోభాగం దారి దీపాలు అని వారు మెచ్చుకున్నకథలమీద విశ్లేషణాత్మకవ్యాసాలు.

వేరు వేరు సమయాల్లో రాసిన వ్యాసాలు కనక సహజంగానే పునరావృతమైన సంగతులు ఉన్నాయి. నేను ఏ పుస్తకం ఏకధాటిగా ఆపకుండా చదవలేను. కొన్ని పేజీలు చదివి కొంతసేపు ఆగి మళ్ళీ మొదలుపెడితే, పొరపాటున నేను చదివిందే మళ్ళీ చదువుతున్నట్టు అనిపించింది కొన్నిచోట్ల. పేజీలు వెనక్కి తిప్పి శీర్షిక చూస్తే తెలిసింది రాజారాంగారు అవే వాక్యాలు వేరు వేరు సందర్భాలలో వేరు వేరు కోణాలు స్పృశించి పరామర్శించడానికి వాడుకున్నారని.

దశాబ్దాలవారిగా కథాచరిత్రను విభజించి ఆనాటిరచయితలనూ, రచనలనూ ప్రస్తావించడం నాకు చాలా నచ్చింది. రాజారాంగారి కథావ్యాసంగం ఎలా మొదలయిందో వివరించినభాగంలో మనం తెలుసుకోవలసిన, తెలిసిఉంటే మరొకమారు మననం చేసుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. “కథలు రాయడం ఎలా” అని ప్రశ్నించే ప్రతివారు గమనించవలసిన సంగతులు రాజారాంగారు స్వానుభవపరంగా వివరించేరు. “శిల్పలక్షణాలు బట్టీ పట్టి కథారచనకి పూనుకున్నవాణ్ణి కాను” అని చెప్పి, భారతి, ఆంధ్రపత్రికలూ చదివి కథనవిధానం ఆకళించుకున్నానంటారు. అప్పుడే నాకు అనిపించింది ఆనాటి పత్రికలు ఆ స్థాయి కథలు ప్రచురించేయి అని. రచయితలూ పాఠకులూ కూడా చెప్పుకుని గర్వించ దగ్గస్థాయిలో ఉండేవి ఆనాటి పత్రికలు. రాజారాంగారు ఇచ్చిన ఉదాహరణలన్నీ ఇక్కడ నేను పునరుద్ఘాటిస్తే వారి రచనకి న్యాయం చేకూరదు. ఆసక్తి గలవారు వారివ్యాసమే చదివి వారిమాటలలో వింటేనే అందం.

కథల్లో “వాస్తవికత” అన్న వ్యాసంలో తెలుగు పేర్లు పెట్టినంతమాత్రాన తెలుగుకథ అయిపోదు అంటూ నిజమైన తెలుగు జీవనం పల్లెల్లోనే ఉంది. ఈనాటి రచయితలు బస్తీజీవితాలగురించే రాస్తున్నారు అని వ్యాఖ్యానించేరు. ఈవిషయం మనం ఇంకా నిశితంగా పరిశీలించవలసి ఉంది. ఈనాటి రచయితల్లో ఎక్కువ భాగం పట్టణాలలోనూ, విదేశాల్లోనూ ఉండి అక్కడ తాము చూస్తున్న అనుభవిస్తున్న జీవితంగురించి రాస్తున్నారు. మరి అది వాస్తవికత కాదా? ఆ జీవితాన్ని తీసుకుని మనదైన ఆత్మముద్రతో కథ రాయడం సాధ్యం అవుతుందా, అవదా? ఏది వాస్తవికత అవుతుంది? ఈవిషయమై నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి ఒక అంశం మాత్రం ప్రస్తావిస్తాను. నాకు అభ్యంతరం భాష విషయంలో. మేం ఇలాగే మాటాడుతున్నాం కదా అని మూడింట రెండొంతులు ఇంగ్లీషు మాటలతో కథ రాస్తే అది తెలుగు కథ అవుతుందా అన్నది. నామటుకు నాకు కాదు. ఈనాటి యువకులకు చాలామందికి అది అపహాస్యంగా తోచదు. అయితే మరొక కోణం తెలుగుసంస్కృతికి సంబంధించని అనేక అంశాలకి ఇంగ్లీషు పదాలే రచయిత కోణాన్ని వాచ్యం చేయగలవు అన్నది కూడా వాస్తవమే. మన సంస్కృతిలో ధన్యవాదాలూ, శుభోదయాలూ వాచ్యం చెయ్యడం లేదు. మీ ఊళ్లో “వాతావరణం” ఎలా ఉంది అని ఏ తెలుగుతల్లీ అడగదు. కానీ “లేటయిందేం?” అనదు కూడా. “ఆలస్యమయిందేం?” అనే తెలుగు ప్రశ్న. రచయితలు ఇలాటివి ఆలోచించుకుని తెలుగుభాషని కథల్లో నిలుపుకుంటూ రాస్తే బాగుంటుందనే అనుకుంటున్నాను.

1910 లో వచ్చిన “దిద్దుబాటు” తొలి ఆధునిక తెలుగుకథగా గుర్తించి, ఆతరవాత రెండు దశాబ్దాలలో తెలుగుకథ ఎలా అభివృద్ధి పొందిందో వివరించేరు రాజారాంగారు. నాకు మటుకు దిద్దుబాటు గొప్ప సాంఘికసమస్యని స్పృశించిన స్ఫూర్తిదాయకమైన కథగా తోచదు. అసలు ఏది తొలి తెలుగు కథ అన్న చర్చ అవసరమా అని కూడా నా సందేహం. విలక్షణమైన తెలుగుకథ ఆదికావ్యంలో ఆఖ్యానాలనుండి అనేక రూపాలు సంతరించుకుంది. ఆ ప్రస్థానంలో దిద్దుబాటు ఒక కథ. చదువుకోడానికి సరదాగా ఉందేమో కానీ పాఠకుని కదిలించి, స్త్రీలోలుత్వాన్నిగురించి తీవ్రంగా ఆలోచింపజేయగలిగినంత బలంగా ఆ కథ లేదనే నా అభిప్రాయం.

ఈ భాగంలో వట్టికొండ విశాలాక్షి, కల్యాణిసుందరీ జగన్నాథ్ కథలు ప్రస్తావించేరు. నిజానికి స్త్రీలు ఆరోజుల్లో అంతకంటె ఎక్కువగానే రచనలు చేసేరని నేను అనుకుంటున్నాను. ఈవిషయానికి మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి, వట్టికొండ విశాలాక్షిగారి కథ “ఆమె” సంగ్రహంగా ఇది – ఒక బుద్ధిమంతుడు పెళ్ళి చేసుకుని, ఆమెని పుట్టింటికి తోలేసి, మరొకామెను చేసుకుని, ఆమె చనిపోగా, మరెవరూ పిల్లనివ్వడానికి ముందుకి రాకపోవడమే కారణంగా మొదటి భార్యని తిరిగివచ్చి కాపురం చేసుకోమని కోరతాడు. ఆమె అంగీకరిస్తుంది. కథలో ప్రధానపాత్ర అయిన “ఆమె” పేరు కథలో లేదుట. కారణం “ఆమె” మనదేశంలో అనేకమంది స్త్రీలకి ప్రతీక అంటారు రాజారాంగారు (పు. 60-61). కావచ్చు. నాకు తోచిన మరొక కారణం – ఆ “ఆమె”కి తనదంటూ ఒక వ్యక్తిత్వం లేదని చెప్పడం కూడా కావచ్చు. ఈ రెండూ ఒకటే అనిపించినా సూక్ష్మంగా ఆలోచిస్తే వ్యత్యాసం కనిపిస్తుంది. వ్యక్తిత్వం లేని ఒక పాత్రని చిత్రించడం వేరు, స్త్రీలు అందరూ అలాటివారే అనడం వేరూ.

ఆ కథ నేను చదవలేదు కానీ సమీక్ష చదువుతున్నప్పుడు ద్వివేదుల విశాలాక్షిగారి “మారిన విలువలు”గురించేమో అనిపించింది కానీ ఇది చిన్న కథ కాదు, నవల. సంగ్రహంగా కథ మాత్రం అదే, ముగింపు తప్ప. ఈనవలలో పాత్రకి పేరు ఉంది – జానకి. పై కథకి భిన్నంగా, ఈనవలలో జానకి “రాను పొమ్మని” జవాబిస్తుంది ఆ ప్రబుద్ధుడికి. రాజారాంగారు ఇదే పుస్తకంలో మరొక వ్యాసంలో మూడు కథలు తీసుకుని ఈవిధమైన తేడా కథల్లో ఎత్తి చూపుతూ తెలుగుకథ ఎలా ఎదిగిందో, సమాజంలో ఎలాటి మార్పులు వచ్చేయో చూపేరు. ఆయన విశాలాక్షిగారి కథ ప్రస్తావించలేదు కానీ ఈనవల కూడా స్త్రీల ఆలోచనాధోరణిలో అప్పటికి వచ్చిన మార్పుని ఆయన గుర్తించేరనే అనిపించింది.

“గుంటూరు” కథమూలంగా రాచకొండ విశ్వనాథశాస్త్రిగారిపేరు తనమనసులో స్థిరనివాసం చేసుకుంది అన్నారు. ఈ కథలో ప్రాంతీయాభిమానాలు మనస్తత్వాలమీద చూపే ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో చిత్రించబడింది. “పువ్వులు” కథగురించి చక్కని విమర్శ చేసేరు. నాక్కూడా “పువ్వులు” చాలా ఇష్టమయిన కథే కానీ రావిశాస్త్రిగారి ఒకే ఒక్క కథపేరు చెప్పమంటే మాత్రం నేను “మాయ” కానీ “కోర్టుకి రాని సాక్షులు” కానీ చెప్తాను. “మాయ”లో ముత్యాలమ్మ ఆనాటి కోర్టు వ్యవహారాలమీద ఇచ్చిన ఉపన్యాసం ఆనాటికీ ఈనాటికీ నిలవగల కఠోరసత్యం. ఈభాగం విశ్వసాహిత్యంలో చేర్చదగ్గ వచనం అన్నారు శ్రీశ్రీ. ఏ కాలేజీ చదువులూ లేకపోయినా లోకజ్ఞానం పుష్కలంగా గల ఆడమనిషినోట, “నానంతా జూయిస్సినా” అంటూ పరిపుష్టమైన వాక్యాలు పలికించడం విశేషం. కాలేజీలో చక్కగా చదువుకుని సీనియర్ లాయరుగారిదగ్గర అంతకంటె ఎక్కువగా శిక్షణ పొందిన మూర్తి ఆమెమాటలు వింటూ నోట మాట రాక నిలబడిపోవడం పాఠకులమనసులో శాశ్వతంగా నాటుకోగల దృశ్యం. అలాగే “కోర్టుకి రాని సాక్షులు” కథలో ప్రతివాదిగా నిలబడి అక్కడ మగాడెవరైనా ఉంటే వాదికి బుద్ధి చెప్తే, నానూ నవ్వుతాను అని సవాలు చేసిన ఆడమనిషి. నాకు తెలిసినంతతవరకూ ఇటువంటి సన్నివేశాలు ఇంత శక్తిమంతంగా చిత్రించగలవారు అరుదు.

రాజారాంగారు స్త్రీలరచనలగురించి విస్తృతంగా ప్రస్తావించలేదు. ఈ విషయంలో నేను చాలా పరిశోధన చేసేను. నా అభిప్రాయాలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు (నాపుస్తకం Telugu Women’s Writing, 1950-175, Analytical Study లో నా విపుల చర్చ చూడవచ్చు).

1945-55 దశకంలో తెలుగుకథ మహోన్నతస్థాయిని చేరుకుంది. కథకులసంఖ్యా పాఠకులసంఖ్యా ఉరుకులూ పరుగులతో వృద్ధి పొందింది. అందుకు ప్రధానకారణం పత్రికలు దేశపునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్త్రీవిద్యనూ, దానికి అనుగుణంగా స్త్రీల రచనలనూ ప్రోత్సహించడం.

ఈ దశకంలోనే స్త్రీలు సాంఘికసమస్యలను తీసుకుని కథలు రాయడం ప్రారంభించేరు. తొలిదశలో కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, కొమ్మూరి పద్మావతీదేవివంటి రచయిత్రులు వివిధ అంశాలను తీసుకుని రచనలు చేసి అశేషపాఠకుల ఆదరణ చూరగొన్నారు. మలిదశలో 1950 తరవాత, లత, రంగనాయకమ్మ, సీతాదేవి, సులోచనారాణివంటి రచయిత్రులు కలం పట్టి కథనరంగంలో అక్షరాలా వీరవిహారం చేసేరు. ఆరోజుల్లో “నేనేం రాసినా పత్రికలు వెంటనే వేసుకున్నాయి” అని రచయిత్రులు అంటే అదొక ప్రమాణం అనుకున్నాను ఒకప్పుడు. కానీ ఆనాటి ఆర్థిక, సాంఘిక, కౌటుంబిక పరిస్థితులు తరచి చూసినతరవాత, ఆ ప్రచురణలకి కారణం స్త్రీవిద్య, రచనలను ప్రోత్సహించడం అని నాకు అర్థమయింది. ఆ రోజుల్లో కొన్ని “ప్రముఖ”రచనలు – స్త్రీలే కాదు పురుషులు రాసినవి కూడా – ఇప్పుడు చదివితే ఈసంగతి మరింత స్పష్టం కాగలదు. నిజానికి కుటుంబజీవనానికి సాంఘికసమస్యలు జోడించినందునే వారి రచనలకి అంత ఆదరణ లభించింది.

తెలుగు రచయిత్రులు సాహిత్యానికి చేసిన సేవ పాఠకులను పెంచడం అని కాళీపట్నం రామారావుగారు కూడా అంగీకరించేరు. అది ఘనాపాఠీ రచయితలతో పోల్చదగ్గ సాహిత్యం అవునా కాదా అన్నది చర్చించదలుచుకుంటే ఏది సాహిత్యం అన్నప్రశ్న ముందు వేసుకోవాలి. పండితులు మెచ్చిందే సాహిత్యం అన్న వాదం వెనకబట్టి సామాన్యప్రజానీకం అంతా చదువుకుని ఆనందించదగ్గది అన్న వాదానికి బలం చేకూరుతోంది. కనక సామాన్యపాఠకులని అలరించేదీ సాహిత్యమే అనుకుంటే స్త్రీల రచనలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలి. జానపదసాహిత్యానికి సాహిత్యస్థాయి లభించింది 40 దశకంలోనే అని తెలుసు కదా. 50వ దశకంలో స్త్రీలు సృష్టించిన సాహిత్యాన్ని నిశితంగా నిష్పాక్షికంగా పరిశీలించడం ఇంతవరకూ జరగలేదు నాకు తెలిసినంతవరకూ. విశ్వవిద్యాలయాలు ఒకొక రచయిత్రిని విడిగా తీసుకుని పరిశోధనలు చేస్తున్నారు కానీ సాహిత్యచరిత్రలో సామూహికంగా రచయిత్రులస్థానం పరిశీలించినట్టు కనిపించదు.

ఈ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది తెన్నేటి హేమలత (లత) రాసిన “గాలిపడగలు – నీటిబుడగలు.” రచనాకాలం 1950. అంతకుపూర్వం రచయితలు వేశ్యని కుటుంబాలను కూలద్రోసిన కులటగానో, నృత్యగానాలలో ఆరితేరిన విదుషీమణులుగానో మాత్రమే చిత్రించేరు. అందుకు భిన్నంగా అనునిత్యం అనేక క్రూరహింసలకు గురయిన స్త్రీలుగా వారిని తెలుగు కథాసాహిత్యంలో తొలిసారిగా చిత్రించినది లతే. ఇది సాహిత్యంలో మైలురాయి.

భానుమతీ రామకృష్ణ తొలి హాస్యరచయిత్రి అన్న పేరు గడించినా, సాంఘికసమస్యలు, మనస్తత్వచిత్రణ ప్రధానాంశాలుగా తీసుకుని ఆవిష్కరించిన కథలు కూడా ఉన్నాయి.

పి. శ్రీదేవి రాసిన “వాళ్ళు పాడిన భూపాలరాగం” కథలో మధ్యతరగతి మనస్తత్వాలు, కుహనావిలువలు అద్భుతంగా చిత్రించేరు. హైస్కూలు చదువు అయేక, తండ్రి ఉద్యోగం చూసుకోమని పట్నానికి తోలితే, అక్కడ ఆ కుర్రవాడికి కళ్ళు తెరిపించినవాళ్ళు ఆత్మగౌరవం కించిత్తయినా లేని బంధువులూ, వారిదృష్టిలో “నీతిమాలిన” శ్రీనివాసులు. ఇది rite of passage కథ. అందులోనూ అమ్మాయి కాక అబ్బాయిని ప్రధానపాత్రగా మలచడం విశేషం. ఇదే అమ్మాయిని ప్రధానపాత్ర చేసి ఉంటే “స్త్రీవాద” కథ అని వేరు పెట్టేవారు. నిజానికి లోకరీతి గ్రహించడంలో లింగబేధం లేదు. ఏవిధంగా చూసినా – అంటే లింగబేధాలను పాటించే మనస్తత్వం వదిలించుకుని చూస్తే – కథగా ఇది ఉత్తమ కథే.

ఈ స్త్రీల రచనల్లో మరొక విశేషం వారు తమ కథల్లోనూ నవలల్లోనూ స్త్రీపాత్రలను ఆవిష్కరించిన తీరు. స్త్రీ పాత్రలు ఆత్మస్థైర్యం, ముందుచూపుతో తమజీవితాలను తీరిచి దిద్దుకుని, తమ్ముళ్ళనూ చెల్లెళ్ళనూ ఆదుకున్నవారయితే, తండ్రులూ, కొడుకులూ సంప్రదాయంపేరున పిరికితనం ప్రదర్శిస్తారు. నాకు చిన్నకథలు గుర్తులేవు కానీ ద్వివేదుల విశాలాక్షిగారి “మారినవిలువలు” నవలలో ఇంటికి పెద్దకొడుకు సూర్యారావు కుటుంబగౌరవానికి భంగం అని తమ్ముడు పేపర్లు అమ్ముకోడాన్ని నిరసిస్తాడు. ఇంటినించి పారిపోయిన చెల్లెలు తిరిగివస్తే గుమ్మంలో అడుగుపెట్టనివ్వడు ఆ కుటుంబగౌరవం పేరుతోనే. ఇద్దరినీ ఆదుకున్నది పెద్దకూతురు జానకి.

రాజారాంగారు ఈభాగం స్థాలీపులాకన్యాయంగానైనా స్పృశించి ఉంటే తెలుగు రచయిత్రుల సాహిత్యకృషిగురించి మనకి కొన్ని కొత్తకోణాలు తెలిసిఉండేవి. బహుశా ఆయన అంత అర్థంతరంగా దివికి వెళ్ళిపోకపోతే ఆ కొరత తీర్చి ఉండేవారేమో.

ఈ సందర్భంలోనే మరొక మాట నిష్ఠురమే అయినా చెప్పకతప్పదు. ఇంట్లో ఆడవారిని మనిషిగా చూడని సంఘసేవాతత్పరులకూ, కాల్పనికసాహిత్యంలో స్త్రీలకృషిని గుర్తించని విమర్శకులకూ అట్టే తేడా లేదు. “మాలతి అనువాదాలు చేస్తోంది”లాటి మొక్కుబడి వాక్యాలకంటె హేయం మరొకటి లేదు. సుప్రసిద్ధులు అనిపించుకున్న విమర్శకులవ్యాసాలలో స్త్రీల రచనలగురించి ఉటంకించిన వాక్యాలు సహేతుకంగా లేవు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, కేతు విశ్వనాథరెడ్డిగారివంటి ప్రముఖులు రచయిత్రులకృషిని సూచనప్రాయంగా పరామర్శించినా మెచ్చుకుంటూ మాత్రం కాదు. ఉదాహరణకి కేతు విశ్వనాథరెడ్డిగారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయం చూడండి.

“శ్రీదేవి, సరళాదేవి, తురగా జానకీరాణి, కల్యాణసుందరీ జగన్నాథ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మల ప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మవంటి రచయిత్రులు కూడా కథానికా శిల్పంలో Katherine Mansfield లా సాధించిన ప్రత్యేకత ఉందని చెప్పలేం. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు రచయిత్రులు కథనసారళ్యంలో కూడా సాధించినదేమీ లేకపోవడమే.” (దృష్టి, 1998. పు. 73).

కథనసారళ్యం అంటే ఏమిటి? స్త్రీలు రాసిన నవలలు అంత కఠినపదజాలంతో, క్లిష్టసంస్కృత సమాసాలతో కూడుకుని ఉన్నాయా? అంతే కాదు. మరొకసంస్కతిలోని రచనలతో పోల్చడం కూడా అసమంజసమే అనుకుంటాను నేను. ప్రతి సాహిత్యం ఆ జాతివాతావరణంలోనుండి పుట్టుకువస్తుంది. వారిసంస్కృతిని ప్రతిఫలిస్తుంది. ఆనాడు మూడింట రెండు వంతులు విదేశీసాహిత్యానికి నకలు కనకనే వాటిలో తెలుగు ఆత్మ కొరవడిందని కొందరు రచయితలు విచారం వెలిబుచ్చేరు. అసలు అమెరికన్ రచయిత్రి Katherine Mansfield రచనలమీద వచ్చిన విమర్శ చూడండి.

Katherine Mansfield is accused “of writing plotless stories” and using atmosphere to decorate a story, and that it could not exist without its trimmings. (Valerie Shaw. The Short Story. 1983).

అంటే, ఈ విమర్శలేవీ కూడా నిష్పాక్షికంగా, వస్తునిష్ఠతో చేసినవి కావు.

అలాగే, పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు రెండేళ్ళు తేడాగా వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలలో పొంతన లేదు.

“చాలామంది రచయిత్రులు తమ కథలో స్త్రీతో ముడిపడి ఉన్నంతమేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు. కానీ పురుషప్రపంచంగురించి బొత్తిగా వారికేమీ తెలియదని వారి రచనలు చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషాదారిద్ర్యం అపారం. ఏమీ చదవరు. ఆత్మస్తుతి, పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవప్రతిమలు తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయప్రపంచం పాఠకులస్థాయిని దిగజార్చి, గడియారాన్ని యాభై ఏళ్లు వెనక్కి తిప్పింది. (తెలుగుకథ – విమర్శానాత్మక వ్యాససంపుటి. ఆంధ్ర సారస్వతసమితి, 1974. పు. 74).

ఆ తరవాత రెండేళ్ళకి అంటే 1976లో ఆ శర్మగారే ఏమన్నారో చిత్తగించండి. మొదట సందర్భం చెప్తాను. అదేమిటంటే – ఆంద్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీవారు బహుమతికి అర్హమైన నవలలు లేవని ఆ ఏడు బహుమతి రద్దు చేసేరు. ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చేసిన ప్రకటన ఇది. “ఇదివరకు బహుమతులిచ్చిన నవలలతో పోలిస్తే, వాటికేమీ తీసిపోవు. మాదిరెడ్డి సులోచన, యద్దనపూడి సులోచనారాణి, పరిమళా సోమేశ్వర్, డి. కామేశ్వరి, కావిలిపాటి విజయలక్ష్మి, ఐ.వి.యస్. అచ్యుతవల్లి ఎన్నో మంచి నవలలు రాసేరు. మునుపెన్నడూ కని విని ఎరగనంతగా పుస్తక ప్రచురణకర్తలు ఈ సంవత్సరం ఈపాటికి సుమారు 300 కొత్త నవలలు ప్రచురించారు.

ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి సహజ, సరళ గంభీరమైన శైలిలో పాఠకులను విశేషంగా అలరించేవిధంగా రాసారు.

వీరందరినీ, ముఖ్యంగా వారి నవలలనే కాక, వ్యక్తిగతంగా వారు చేసిన సాహిత్యకృషిని మనం అభినందించాలి.

ఈనాడు తెలుగు నవలారచన విస్తృతంగా జరుగుతున్నదనీ, దానిని గమనించక కళ్ళు మూసుకుంటే విజ్ఞత కాదనీ మేము ఎకాడమీకి మనవి చేయదలుచుకున్నాము.”

(ఆంధ్ర జ్యో్తి. 19-11-1976, లోకాభిప్రాయం.)

దరిమిలా అదే పత్రికలో ఈ ప్రకటనమీద వరసగా కొన్ని వారాలపాటు కుటుంబరావు, రామమోహనరావు వంటి హేమాహేమీలతోపాటు అనేకమంది పాఠకులు చర్చ కొనసాగించేరు. అవన్నీ నేనిక్కడ తిరిగి రాయలేను కానీ సూక్ష్మంగా విషయం మాత్రం రచయిత్రులని పొగిడేవారు కొందరయితే, తెగిడేవారు మరికొందరు అయేరు. మళ్లీ ఈ విమర్శకులే ఏ రచయిత్రో ముందుమాట రాయమంటే, ఇహ పొగడ్తలకి అంతుండదు.

భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చవచ్చు కానీ ఒకే రచయితమీద ఒకే విమర్శకుడు ఇలా భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చడం నాకు బాధ్యతారహితమైనదిగానే అనిపిస్తుంది.

అంచేత చెప్తున్నాను. 50వ దశకంలో బంగాళాఖాతంలో వాయుగుండంలా మహాధృతంగా విరుచుకుపడిన రచయిత్రులరచనలకి ఏమాత్రమూ విలువ లేదనడం న్యాయం కాదు. రాజారాంగారి పుస్తకంలో నాకు నచ్చిన మరొక వ్యాసం “కథకుడి అనుభవాలు”. ఇందులో “కుబేరుడికి వాహనం నరుడు” అనడంలో “ఔచిత్యాన్ని ఎంతగా కొనియాడినా తనివి తీరదు” అంటారు. డబ్బుకీ మనిషికీ మధ్య గల లంకెకి ప్రతీక అది. ఈ వ్యాసంలోనే సత్కారాలగురించి చెప్పిన మాటలు అక్షరలక్షలు విలువ చేస్తాయి. “నాదగ్గర డబ్బుంటే మీకు సత్కారం చేసి ఉండివాడిని” అన్నారుట ఒకరు రాజారాంగారితో. దానికి ఆయన సమాధానం, “బాబూ, వద్దు. అలాటిపని తలపెట్టకు” అంటూ ఐదు కారణాలు చెప్పేరు. ఆవాక్యాలకి ఫ్రేము కట్టించి ప్రతి రచయితా గోడమీద పెట్టుకోవాలి అనిపించింది నాకైతే. ఆ క్షణంలోనే గత పదేళ్ళలో నాకు జరిగిన సత్కారాలు గుర్తొచ్చేయి. ఆ ఐదు కారణాలే కాక, నావిషయంలో ఆరో కారణం చెప్తాను – నన్ను సన్మానించిన కార్యనిర్వాహకులకి నేను ఏం రాసేనో తెలీదు. తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు. ఏడేళ్ళ వ్యవధిలో మూడు సత్కారాలు జరిపిన పండితురాలు, “అయితే మీరేం రాసేరు?” అని నన్నే ఏడేళ్ళతరవాత అడిగేరంటే, ఆ సత్కారాల రభస బోధపడుతోంది కదా. తత్సంబంధిత జ్ఞానం నాకు కలిగినతరవాత ఈ “సంభావనలు” అంగీకరించడం విరమించుకున్నాను. ఈవిషయంలో మరొకసారి నా అభిప్రాయం స్పష్టంగా చెప్తాను.

మీరు ఏ రచయితకి సన్మానం తలపెట్టినా, ఆ రచయిత కృషిగురించి కొంతలో కొంతయినా తెలుసుకుని, మీకు అది సమ్మతం అవునో కాదో నిర్ణయించుకుని చెయ్యండి. అంతే గానీ అమెరికానించి వచ్చిందనో, ఆడమనిషి అనో, ఒంటరి ఆడమనిషి ఎలా ఉంటుందో చూదాం అనో సభలు పెట్టి హంగామా చేస్తే అది సాహిత్యసేవ కాదు కదా, నాదృష్టిలో అది మహా పాతకం.” (ఇది అరణ్యరోదనే అయినా మరోమారు చెప్పకుండా ఉండలేకపోతున్నాను!). ఇంటర్వూలయినా అంతే. ఏ వ్యక్తి గానీ వారి కృషిని అధ్యయనం చేయకుండా ఇంటర్వ్యూలకి తలపడడం హేయం.

ఇక్కడ ప్రస్తావించవలసిన మరొకఅంశం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. అది బాల, చందమామ తెలుగుకథకి చేసిన మహత్ సేవ. కుటుంబరావుగారిగురించి రాస్తూ ఆయనని చందమామ కుటుంబరావు అంటారని రాజారాంగారు రాసేరు. ఆ చందమామ, బాల పత్రికలే మనలో చాలామందికి కథలయందు ఆసక్తి కలిగించింది. నిజానికి పిల్లలకథలు రాయడం అంత తేలిక కాదు. నామటుకు నేను ఆరోజుల్లో ఒకటో రెండో ప్రయత్నించి వదిలేసేను. న్యాయపతి రాఘవరావుగారు బాల పత్రిక ద్వారా చేసిన సేవ గణనీయం. ఇది కూడా తెలుగు కథాచరిత్రలో అక్షరగతం కావాలి.

చివరిమాట లేదా నా కోరిక ఏమిటంటే, రాజారాంగారి ఈ యాత్ర ఈ పుస్తకంతో ముగియలేదు. ఈనాటి విమర్శకులు గానీ, పరిశీలనాదృష్టిగల కథకులు గానీ మనకథా చరిత్ర మిగతా భాగాలు కూడా ఇలా వ్యాసాలరూపంలో అందిస్తే బాగుంటుంది.

ఇలా ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు కానీ ఇప్పటికే వ్యాసం నిడివి పెరిగిపోయింది. అంచేత మీరే ఆలోచించడం మొదలు పెట్టండి.

000

(మే 18, 2015, స్పష్టతకోసం సంస్కరింపబడింది, మే 23, 2015))

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “మధురాంతకం రాజారాంగారికథాయాత్ర సాగినబాటవెంట”

 1. పింగుబ్యాకు: వీక్షణం-137 | పుస్తకం
 2. ఉమాదేవిగారూ, మీ స్పందనకి ధన్యవాదాలు. ఈవ్యాసంలో స్త్రీలరచనలగురించి రాసిన వాక్యాలు నావి. రాజారాంగారు ఇంత విస్తృతంగా చర్చించలేదు. నావ్యాసం ఆదిలో చెప్పినట్టు ఈ వ్యాసంలో రాడారాంగారి అభిప్రాయాలకంటే నా అభిప్రాయాలే హెచ్చు. గమనించ ప్రార్థన.

  మెచ్చుకోండి

 3. కథలు ..నవలలు మినహాయిస్తే ఇప్పటి తరం రచయిత్రులల్లో మంచి విమర్శకులు . సాహితీ వ్యాసాలు రాసేవారు అరుదయిపోతున్నారు .. మీ రచన మా తరాన్ని ఆ దిశగా ఆలోచించమని
  పురికొల్పుతున్నది. అలాగే .. ఎలాగయినా సరే మనకు ఆధ్యులయిన ఎందరో మహానుభావుల రచనలు ఎలాగయినా సరే చదివితీరాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నది.
  ఏ తరమయిన, ఏ విభాగం లో నయినా మహిళలన్నా వారి పనులన్నా ఎప్పటిలా చిన్న చూపు చూసే మగవారి మనస్తత్వాన్ని మరో సారి ఈ వ్యాసం ద్వారా మధురాంతకం గారు ఎత్తి చూపారు. పలు విషయాలను చాలా ఆసక్తి కరంగా వివరించారు. వారికీ మీకు మరి మరి ధన్య వాదాలు మాలతి గారు

  మెచ్చుకోండి

 4. హనుమంతరావుగారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. ఆనాటి స్త్రీల రచనలమీద ఈవిషయం సవిస్తరంగా చర్చిస్తూ రాసిన Women’s writing, 1950-1975, a critical study, అట్టే ఆదరణ పొందలేదు. అంచేత, ఎవరికీ నచ్చలేదనే అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం నాకు ఇతోధికంగా ఆనందదాయకమైంది. నమస్కారం.

  మెచ్చుకోండి

 5. ఒక విమర్శనాత్మక వ్యాసం చదివి మరో చక్కటి విమర్శనాత్మక వ్యాసం రాసారు మాలతి మ్యాడంగారూ మీరు! అప్పటి రచయిత్రుల రచనలను మీరు సరిగ్గానే అంచనా వేసారని నేను భావిస్తున్నాను. 50వ దశకం తొలినాళ్ళలో స్త్రీల రచనలను అప్పటి పత్రికలు ప్రచురించడం స్త్రీవిద్యకు లభించిన ప్రోత్సాహకంగానే భావించాలని మీరనడం ఇప్పటి స్త్రీవాదులు ఎలాస్వీకరిస్తారో! సాంఘిక సమస్యలు జోడించినందువల్లే ఏ రచనకైనా విలువ చేకూరుతుందన్న మీ మాట నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఒకవంక స్త్రీ కోణంనుంచి ఎంత అద్భుతమైన రచనలు వస్తున్నాయో.. మరో వంకనుంచి అంతే చెత్త స్త్రీసంబంధంగా టీవీ మాధ్యమాలను సీరియళ్ళ రూపంలో చలామణీ అయిపోతున్నది. మంచి నిజాయితీతో కూడిన వ్యాసం అందించినందుకు ధన్యవాదాలండీ మీకు!.

  మెచ్చుకోండి

 6. రమణారావుగారూ, మంచి విషయం చెప్పేరు. అవును, దళిత సాహిత్యంగురించి సవిస్తరమైన విమర్శనాత్మక వ్యాసాలు రావలసిన అవసరం ఉంది.

  మెచ్చుకోండి

 7. మీ వ్యాసం వివరంగా బాగుంది.స్త్రీరచయితల కృషిని కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు.ఈమధ్య వచ్చిన దళిత సాహిత్యాన్ని కూడా బేరీజు వెయ్యవలసి ఉంటుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s