మేమంతా క్షేమం – 1. పత్తరాలు

తూలిక అభిమానపాఠకులకు,

పాఠకులకు (1218x1280)

 

 

ఇట్లు

మాలతి

—————–

నాల్రోజులక్రితం లంకెలబిందెలాటి అట్టపెట్టెలో దొరికిన పాత ఉత్తరాలు. వరదల్లో తడిసి పోస్టాఫీసు యంత్రాల్లో నలిగి రంగు మాసిపోయి రాత అలుక్కుపోయి మిగిలిన ఈ ఉత్తరాల గుట్ట.DSC02362ఏ మధ్యాహ్నాలో అర్థరాత్రులో భోజనాలయేక, నిత్యనైమిత్తికాలు ముగించుకు తీరిగ్గా కూర్చుని నిదానంగా రాసుకుపోయిన ఊసులు. బుర్రల్లో పుట్టి రక్తనాళాలద్వారా వేళ్ళల్లోకి ప్రవహించి కలం ఇంకులోకి సీదాగా జారి కాగితాలమీద రూపు కట్టిన కబుర్లు.

తుడుపులూ కొట్టివేతలూ లేవు. Cut and paste లేదు. ఎంత హాయి అవి!

నేను కూడా అంత తీరిగ్గానూ కూర్చుని కళ్ళు పొడుచుకు చూస్తున్నా అలుక్కుపోయిన అక్షరాలు ఊహించుకుంటూ అర్థాలు వెతుక్కుంటూ చదువుతున్నా తోచినవి తోచినట్టు కథలు అల్లుకుంటే ఎలా ఉంటుందో?!

అహో, ఉత్తరాలూ పత్తరాలూ గుట్టగా – శిశిరమేతంచెనంటూ గలగల్లాడుతూ రాలిన పండు పత్రాల్లాగ, ఆరముగ్గిన అరటిపండు తొక్కలా మాగి కమిలిపోయి అక్షరాలు అలుక్కుపోయి వరదలో నాని చివికిపోయి పోస్టాపీసు సార్టరులో చిత్తుగా నలిగి, చిరుగులు పడి మిగిలిన అర్థ పత్రాలు, అర్థరహిత పత్తరాలూ. చదవనా?

కనీసం 15 ఏళ్ళకి ముందు 30 ఏళ్ళ కాలవ్యవధిలో అందుకున్నవి ఇప్పుడు చదివితే ఎలా ఉంటుంది? అసలు అర్థం అవుతాయా? ఎన్ని మరిచిపోయేనో …ఇప్పుడు అవి మళ్ళీ ఏమి గుర్తుకి తెస్తాయో, ఏవి నాబుర్రని తొలిచేసి మరింత గందరగోళంలో ముంచేస్తాయో.

తదేకదృష్టితో వాటివేపు గుచ్చి గుచ్చి చూస్తున్నాను – అమ్మా, నాన్నగారూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ, స్నేహితురాళ్ళు రాసినవి వివిధ దశల్లో వేరు వేరు ఊళ్ళనుండి – విశాఖపట్నంనుండి వాషింగ్టన్ డీసీ వరకూ.

ఏది ఎవరిదగ్గరనుండి అయిఉంటుందో – అదొక పజిలు. నాతోనే పందెం వేసుకుని కళ్లు చికిలించి చూస్తున్నాను. కొన్ని సుళువుగానే తెలుస్తున్నాయి కానీ కొన్ని చిక్కుప్రశ్నలయి సవాళ్ళు విస్తుర్తున్నాయి.

ఆలోచిస్తుంటే ఏదో కథ గుర్తొచ్చింది. కుటుంబరావో సుబ్రహ్మణ్యశాస్త్రిగారో జ్ఞాపకం లేదు. అల్లుళ్ళకాలేజీ చదువులకి మామగార్లు మదుపు పెట్టే రోజులు. కథలో మా అల్లుడి ఉత్తరం ఆఖరివాక్యం చదివితే చాలు అంటాడు కథకుడు. బాగా చదువుకుంటున్నాను అని మొదలు పెట్టి, కాలేజీలో వ్యాపకాలన్నీ రాసి, చివర “కాబట్టి … రూపాయలు పంపవలెను,” అని ఉంటుందిట. నాఉత్తరాలు అలా ఉండవులెండి. ఊరికే నాకు గుర్తొచ్చిందంతే.

ఒకొక ఉత్తరం రంగూ, ఉత్తరంలో భాషా, కాలక్రమంలో మారుతూ వచ్చిన కవర్లూ, ఆకారాలూ, వాటిమీద ముద్రలూ చూస్తూ ఆలోచిస్తూ కాలయాపన కొంత సేపు. ఎవరు ఏం రాసి ఉంటారో గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ మరికొంత జాప్యం.

తీసి చూడమంటోంది మనసు. కాదు కాదంటూ మొరాయిస్తోంది చెయ్యి. ఏమూలో బెరుకు, ఇదీ అని వర్ణించలేని పిరికితనం. ఏం చదవాల్సొస్తుందో? మరిచిపోయిన కథలు తిరిగొస్తాయా? ఆనందదాయకం అవుతాయా? అయోమయంలోకి తోస్తాయా. బుర్రలో లేని తలపులు తవ్వి తీసి, లేని కలతలు తెచ్చిపెట్టగలవు కూడా కదా. ఎందుకు సుఖానున్న ప్రాణాన్ని దుఃఖపెట్టుకోడం?

“నీకు ముసల్తనం ఒచ్చీసింది.”

ఇదా ముసిల్తనం?అమ్మలు తన బొమ్మలున్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుపోయి, మళ్ళీ “ఇవి నీవి” అని తిరిగి తీసుకొచ్చి నాముందు పెట్టకపోతే అసలు ఈ ఉత్తరాలమాట తల్చుకునేదాన్నేనా?

“బిడ్డ తిర్గి తెస్తే మాత్తరం నివ్వు చూడాల్నెక్కడున్నాది?”

లేదు.

చూడాలని లేదు. చూడాలని ఉంది కూడా. అవునూ కాదూ. సదసద్సంశయం. బతుకే ఓ ద్వంద్వం. కావాలనుంటుంది. అఖ్ఖర్లేదనీ ఉంటుంది. అడగడుగునా చీలిన దారే! అడుగుడుక్కీ సంశయమే ఆ రెండోదారిలో వెళ్ళి ఉంటే ఏం కనిపించేదో – అస్తమానం అదే యావే!

నాలుగు దశాబ్దాలలో పారేసినవి పారేయగా మిగిలినవి ఇవి.

ప్రతి ఉత్తరంలోనూ ఏదో ఒక విశేషం ఉండే ఉండాలి. నేను అందుకున్న ప్రతి ఉత్తరం దాచలేదు. కొన్ని కొంతకాలం ఉంచి పారేశాను. కొన్ని వెంటనే పారేశాను. కాలగతిలో ఒకొకరే నాజీవితంలోనుండి తప్పుకుంటుంటే, అదే క్రమంలో వారికి సంబంధించిన ఉత్తరాలూ, కాయితాలూ, కార్డులూ చిత్తుకాయితాలబుట్టలోకి విశిరేశాను.

ఎదురుగా కుప్పమధ్యలో ఏరోగ్రాంమీద అమ్మపేరు తొంగి చూస్తోంది. యన్. శేషమ్మ ఇంగ్లీషులో. బహుశా ఉత్తరంమీద ఎడ్రెస్ రాసినవాళ్ళెవరో రాసి ఉండాలి. కాయితంరంగు చూస్తే అది చివరిరోజుల్లో రాసింది కావచ్చు. అమ్మ రాసిన ఉత్తరాలు చింపడానికి చేతులు రావు. హుమ్. అదో భ్రమ. … నేను ఉంచినంత మాత్రాన వాటికి కొత్తగా వచ్చే ఘనత ఏముంది? నాతరవాత ఏమవుతాయి?

ఇదుగో, ఇలాటప్పుడే జీవితంగురించి బహు విశాలదృక్పథం వచ్చేస్తుంది నాకు. కొన్ని శతాబ్దాలూ, యుగాలూ, కల్పాలూ తలుచుకుంటాను.మహా ఋషులూ, చక్రవర్తులూ, వేదాంగవిదులూ కాలగతిలో కలిసిపోయేరు కదా. వాటిమధ్య నేనెంత, నా ఉత్తరాలెంత? నేను ఈరోజు ఏమి చేసినా, చెప్పినా, ఎవరిని పలకరించినా, ఎక్కడికి వెళ్ళినా పూట గడవడానికే తప్ప వాటికి అంతకన్న విలువేముంది అనిపించదూ ఎవరికి మాత్రం?

కానీ … ఇప్పుడు ఇవి పారేస్తే, భవిష్యత్తులో “అయ్యో ఎందుకు పారేసేను, దాచుకుని ఉంటే బాగుండేది కదా” అని విచారించే సమయం వస్తుందా? హుమ్. ఏం భవిష్యత్తు? … మహా అయితే మరో రెండేళ్ళు, అంతే కదా. ఈ మధ్యకాలంలో నా గతంగురించి వగచే రోజు వస్తుందనుకోడం హాస్యాస్పదం కాదూ?

మళ్ళీ కుప్పవేపు చూసేను. బహుశా ఆ ఉత్తరాలన్నీ వరసగా పేర్చితే స్టాంపు ధరలు ఎలా పెరిగేయో తెలుస్తుంది. దేశంలో వేరే కాయితాలమీద రాసి మడిచి మరో కవర్లో పెట్టి పోస్టు చేసే సంప్రదాయం మారి ఇన్లాండు కవర్లు వచ్చేక ఆ కవర్లకి వాడే కాయితం మరీ అల్పం అయిపోయింది. కనీసం ఏరోగ్రాములకయినా కాస్త మంచి కాయితం వాడితే బాగుండు.

సందేహిస్తూ ఓ మూలనించి తొంగి చూస్తున్న కార్డు తీసేను నెమ్మదిగా, గట్టిగా పట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టు.

(ఇంకా ఉంది.)

 

(మే 27, 2015)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “మేమంతా క్షేమం – 1. పత్తరాలు”

 1. ఊసు పోక అంటూనే ఎన్నో ఊసులు చెప్తూ ఊసుపోగోడుతున్నారు. ఈ ఊసులు అలా ఉంటూంటే ఎంత బాగుండునో అనిపిస్తోంది.

  ఇష్టం

 2. Sorry. స్వవిషయాలూ, కుటుంబవిషయాల్లోంచి సర్వజనీనమయిన కథలు రాయాలి కదండి. ఆలోచనలు తెగడం లేదు. 4, 5 రోజుల్లో తప్పకుండా మొదలు పెడతాను.

  ఇష్టం

 3. అలా కబుర్లతో కాలం గడిపెస్తున్నారుగానీ, ఒక్క ముక్కా చదవరు కదా. పోనీ, ఆ ఎయిరోగ్రాం లో ఏముందో చదివి, మీ చదువు మొదలు పెట్టండి. వింటాం.

  ఇష్టం

 4. బి-రాజ్, మీరు మరీ అంత దారుణంగా ఆలోచించకండి. అందరు రచయితలలాగే కొన్ని వాస్తవాలు తీసుకుని కల్పితకథలు రాస్తున్నాను. మీ ఇ-మెయిల్ లాగే. మీరు వాస్తవం కానీ మీ ఐడీ కాదు కదా.
  నాకు ఏ వ్యాధీ లేదు, ఏ డాక్టరూ నేను రెండేళ్ళలో చచ్చిపోతానని చెప్పనూ లేదు.

  ఇష్టం

 5. చదువుతుంటే కొత్తగా వినిపించడానికి కారణం మనం మరిచిపోవడమే కదండీ, :p అలాగే, ప్రయత్నిస్తాను. మిరు శ్రద్ధగా వింటున్నందుకు నమోవాకములు

  ఇష్టం

 6. >> హుమ్. ఏం భవిష్యత్తు? … మహా అయితే మరో రెండేళ్ళు, అంతే కదా.

  అదేమిటండోయ్? ఎవరు చెప్పారు రెండేళ్ళని? ఎవరు ఎప్పుడు పోతారో తెలియకపోవడమే జీవితానికున్న అత్యంత శుభప్రదమైన చిహ్నం. విరించి గారికీ, ఆ బ్రహ్మరాత అర్ధమయ్యే (మీరాత బాగానే ఉంది మరి, అంటే ఇందులో నేనూ మీరు కాదని అర్ధమౌతోంది కదా?) మహిష వాహనం ఉన్నాయనకీ తప్ప ఎవరికీ తెలియకపోవడమే జీవించడానికున్న లక్ష్యం, ఆనందమూన్నూ? కాదంటారా? విరించి గారి రాత మనందరికీ అర్ధమైతే జీవితాలు తారుమారైపోయి అనేక గొడవలొచ్చేస్తాయి. రాత్రి పడుకున్నవాడు పొద్దున్న లేస్తాడో లేదో చెప్పలేం – ఏ వయస్సులోనైనా అంతే. ఆఖరికి కేన్సర్ వచ్చి ఆర్నెల్లలో పోతావ్ అని డాక్టర్లు చెప్పినా ఆర్నెల్ల మీద ఇరవై ఏళ్లు బతికిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా? ఇంతకీ ఎవరు చెప్పారు భవిష్యత్తు రెండేళ్లనీ?

  ఇష్టం

 7. పాత వుత్తరాల్లో కొత్తగా యేముంటాయీ అనుకుంటామా.. కానీ చదువుతుంటే అవే కొత్తగా వినిపిస్తాయండీ.. చదవండి.. శ్రధ్ధగా వింటాం..

  ఇష్టం

 8. ఆ మధ్య మరో పెద్దాయన అన్న మాటలు “…fade away”.
  మనం తప్పుకున్న తరువాత ఎలాగు అవి ఫేడ్ ఔట్ అవుతాయి…అప్పటిదాక వీలుంటే దాచుకోవడమే! మనసులో అలజడి పెరిగినప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు. కావాలనుకుంటే.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s