ఊసుపోక 152 – కథకుడు కథలో ఒక పాత్ర!

ఇది యమర్జెంటుగా రాయాలనిపించిన కారణం చెప్తాను – మామూలుగా బ్లాగులో ఎక్కువ భాగం తమ జీవితాల్లో సన్నివేశాలూ, విహారయాత్రలూ,హాస్యాలూ కదాచితుగా మనస్తాపాలూ రాసుకుంటారు. నిజమే. నేను కూడా అలాటివి రాసేను. మళ్ళీ చెప్తున్నా – అవి హాస్యానికి మాత్రమే, వాటిలో కూడా కల్పన ఉంటుంది. అవి నా సొంతబాధలు చెప్పుకోడానికి మాత్రం కాదు. నాకు వేరే జీవితం ఉంది. అది నాబ్లాగులో కనిపించేది కాదు.

పాఠకులలో సగానికి సగం నాబ్లాగుకి సాహిత్యస్థాయి ఉన్నట్టు గుర్తించేరు. స్పందనలలో కూడా ఆ కోణం కనిపిస్తుంది. మీరు కాదంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఈ విషయంలో నాకు పేచీ లేదు.

ఇంతకీ యమర్జెన్సీగురించి కదూ మొదలు పెట్టేను. అక్కడికే వస్తున్నా. నాల్రోజులక్రితం నా లేఖాసంపదలో కనుగొన్న”ఉత్తరాలలో సంగతులు చదువుతుంటే నాకు కలిగిన ఆలోచనలతో కథలు రాయాలని” అనిపించింది. ఆ విషయం ప్రత్యేకించి ఒక ఉత్తరం కూడా రాసేను మీకు. ఉత్తరం చూడనివారి సౌకర్యార్థం తొలి పోస్టులోనే “కథలు” అని కూడా విశదం చేసేను.

అడుగులోనే హంసపాదు అని మొదటి టపాతోనే వచ్చింది కలకలం. “రెండేళ్ళుంటానేమో” అనడం “నా మానసికారోగ్యం”గురించిన ఆందోళనకి తావిచ్చినట్టుంది. “అయ్యయ్యో, జీవితం ఆనందమయం కదా, అలా ఎందుకంటున్నారు” అని ఒక పాఠకుడు ప్రశ్నించేరు. ఆ తరవాత “జీవితం బహు సుందరం” అనో అలాటిదే మరో గీతమో కలిగిన మరో వ్యాసం పంపేరు. అప్పుడే నాకు గాభరా పుట్టింది. ఇంకా నయం. మాఊళ్లోనే ఉంటే 9-1-1 వారికి ఫోను చేసేసేవారేమో అని కూడా అనిపించింది. మరి రానున్న కాలంలో నేను ఓ ముష్టివాడిగురించి రాస్తే, ముష్టెత్తుతున్నాననీ, కుష్టిరోగిని గురించి రాస్తే కుష్టురోగంతో కుళ్ళిపోతున్నాననీ కూడా అనుకోగల ప్రమాదం కూడా ఉంది కదా. నాశీ తుపాకీమీద కథ రాస్తే, “పిల్లలున్న ఇంట్లో తుపాకీలెందుకు పెట్టుకున్నారూ?” అంటూ ఆయనని ఎవరేనా అడిగేరా? రేపు ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాలి.

అదన్నమాట. ఈ విషయం – అంటే కథ రాసినవాడు కథ చెప్పేవాడు ఒకరు కారు. ఇది స్ఫష్టం చేయడానికే ఈ సోది. “మేమంతా క్షేమం” శీర్షికతో నేను రాస్తున్న పోస్టులు నా ఆత్మకథ అని భ్రమ పడి, సైకో థెరపీ సెషను పెడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది.

రానున్న పోస్టులలో ఇలాటివి అనేకం రావచ్చు. గత 70 ఏళ్లలో (బాలాప్రాయం 8 తీసేస్తే), నేను తెలుసుకున్న, చూసిన అనేక విషయాలు పరామర్శించడం కనక మరణంవార్తలు పునశ్చరణ కావచ్చు. నాకు ఏ ఆలోచనలు వస్తాయో, వాటిని కథలో ఎలా ఇరికిస్తానో అన్నది ఇప్పుడప్పుడే చెప్పలేను కానీ నేను రాసిన ప్రతి వాక్యం నాజీవితానికి ఆపాదించి ఆందోళన ప్రకటించకండి. అలాటి అవుసరం నారాతలమూలంగా రాదని ఇదే – వ్రాతమూలకంగా హామీ ఇస్తున్నాను.

నా అభిప్రాయం చెప్పేను. నాకు మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఉంది.

నా ప్రశ్న –

రచయిత వేరూ, కథకుడు వేరూ అని ఎంతమంది అనుకుంటున్నారు? కథలోని ప్రతి అంశం రచయితజీవితంనుండి మాత్రమే వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు?

ఈ విషయంమీద నా ఇతర వ్యాసాలు – రచయితా కథకుడూ.

 

—-

(మే 30, 2015)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “ఊసుపోక 152 – కథకుడు కథలో ఒక పాత్ర!”

 1. మీ సాహిత్యానికి ఓ స్పెషాలిటీ ఉంది మీ రాసేవి అన్నీ మీ జీవితంనుండి తొగిచూసిన అంశాలులాగా అనిపిస్తాయి మీ హాస్యాన్ని మీకు ఆపాదించు కున్నట్లుగానే ప్రతి మాటని తీసుకుంటాం మాకు తెలీకుండానే మీరు దీన్ని మీ సాహితీ విజయం గానే తీసుకోవాలి మరి…

  మెచ్చుకోండి

 2. పవన్ సంతోష్ గారూ, వెనకటి స్పందనలు కొన్ని, నేను తిరస్కరించిన స్పందనలు కొన్ని మనసులో పెట్టుకుని రాసిన ఊసుపోక ఇది. నేను మొదలు పెట్టిన -మేమంతా క్షేమం – మరీ వ్యక్తిగతమైన ఉత్తరాలతో పని కనక ముందు జాగ్రత్త పడ్డానన్నమాట. ఊసుపోక కనక తేలిగ్గా తీసుకోవచ్చు.

  మెచ్చుకోండి

 3. వ్యాసం చదివాకా ఏమీ అనిపించడలేదు కానీ కింద కామెంట్లు చూశాకా గాభరా కలిగింది. ఇదంతా కల్పన అనుకుంటున్నానే.. నిజమా అని. మీరు సమాధానం కూడా ఇది కల్పన అని వివరించినట్టు ఇవ్వలేదనుకుంటా అక్కడ.

  మెచ్చుకోండి

 4. పింగుబ్యాకు: వీక్షణం-138 | పుస్తకం
 5. “మరి రానున్న కాలంలో నేను ఓ ముష్టివాడిగురించి రాస్తే, ముష్టెత్తుతున్నాననీ, కుష్టిరోగిని గురించి రాస్తే కుష్టురోగంతో కుళ్ళిపోతున్నాననీ కూడా అనుకోగల ప్రమాదం కూడా ఉంది కదా”….హహ్హహ.. మీరు సూపరసలు!

  మెచ్చుకోండి

 6. సరే బకెట్ లిస్ట్ తెలిసింది. లేదు, చెయ్యను కూడా. లిస్టు అక్కర్లేకుండా తలుచుకోడం, అమలులో పెట్టడం ఏకకాలంలో జరుగుతున్నాయి.

  మెచ్చుకోండి

 7. ఓ. బకెట్ లిస్ట్ అన్న పదం పరిచయమైనట్టే ఉంది కానీ ఈ సినిమా, నేపథ్యం తెలీదులెండి. నా వల్మీకంలో నేను ఉంటాననడానికి మరోమారు రుజువయింది కదా. 🙂
  ఇంతకీ మీతుపాకీ కథ వచ్చేక, మీకెవరైనా పాఠం పెట్టేరో లేదో చెప్పలేదు, మ్,

  మెచ్చుకోండి

 8. అదేంటి, మీకు బకెట్ లిస్టు తెలీదా? ఆశ్చర్యమే? ఆ పేరుతో ఆ మధ్యన జాక్ నికొల్సన్ సినిమా కూడా వచ్చింది. జీవితం ముగుస్తోంది అనిపించినప్పుడు (ఈ మధ్యకాలంలో అనిపించక పోయినా కూడా) వెళ్ళిపోయే లోపల చెయ్య వలసిన పనులు, చూడ వలసిన ప్రదేశాలూ ఇలాంటివి లిస్టులు తయారు చేసుకుంటారు .. Things to do before one kicks the bucket .. అన్న మాట. నేను నలభైలలో ఉండగా రాసుకున్న లిస్టులో ఒక కోరిక తీరింది. ఒక సీజన్ అంతా చెన్నై లో ఉండి చెవులకి బిరడా తీసినట్టు కచేరీలు విన్నాను.

  మెచ్చుకోండి

 9. అనిల్ అట్లూరి, హాహా, మీకు అలాటి ఆలోచన రాదని నాకు తెలుసులెండి. నాశీకి ఇంకా ఫోన్ చెయ్యలేదు. వీకెండు పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు పిలిస్తే నయం కదా 😛
  ఇంతకీ బకెట్ లిస్ట్ అంటే ఏమిటి

  మెచ్చుకోండి

 10. అబ్బే, నాకు ఆ ఆలోచన అస్సలు రాలేదండి! నేను ఎలాగు 911 దేశంలో లేను. మీకు పిసైఖో థెరపీ అవుసరం అనికూడ అనిపించలేదు! బాలాప్రాయం తీసేస్తే మరో డైబ్భై ఏళ్ళు ఉండరూ! ఆనక చూద్దాం బాల్చి తన్నేసే విషయం గురించి. బకెట్‌లిస్టు తీసారా? నాశీ గారికి ఫోను కలిపారా? ఏవన్నారు ఆయన?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.