మేమంతా క్షేమం! – 2. నా జన్మపత్రిక

జ్యేష్ట బహుళ విదియ స్థిరవాసరము – తెలుగు పంచాంగంప్రకారం నేను పుట్టిన శుభదినం.

1937

[Dear Jagannatha Rao,You have been blessed with a daughter at 10/20 on the 26th instant. Both mother and baby are safe. Diet will be given today. …

Yours

Kotcherlakota Surya Rao]

నెలరోజుల క్రితం నా భోషాణం తెరిచి అట్టడుగు కాయితాలు తవ్వి తీసి చూస్తుంటే ఈ పురావిశేషం దొరికింది – గత శతాబ్దంలో రాసింది. ఏడు పదులు దాటి ఏడు సంవత్సరాలక్రితం ఒక శుభసందర్భాన మాతాతగారు మానాన్నగారికి రాసిన పోస్టు కార్డు అది. ఆ కార్డుమీద తేదీ 28 అని ఉంది. కార్డులో సమాచారాన్ని బట్టి అప్పటికి నావయసు మూడు రోజులన్నమాట. అది విశాఖపట్నంనించి అడయారులో ఉన్న మానాన్నగారికి చేరడానికి మరో మూడు రోజులు వేసుకున్నా, మానాన్నగారికి నాజన్మవృత్తాంతం తెలిసేసరికి ఆరు రోజులు గడిచిపోయేయి తేలిగ్గా.

మా తాతగారు టెలిగ్రాఫ్ సూపరెంటెండెంటుగా ఉద్యోగం చేసి రిటైరయేరు. ఆయన పోస్టాఫీసులో అట్టడుగు స్థానంలో ప్రారంభించి, జాతీయస్థాయిలో బొంబాయిలో head officeలో సూపరెంటెండెటు స్థానం చేరుకున్నారని మాఅమ్మ చెప్తూ ఉండేది. ఆయన రిటైరయినతరవాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. అప్పట్లో ఊళ్ళో అందరూ ఆకుటుంబాన్ని బొంబాయివారు అనేవారుట. బొంబాయి ఇంటిపేరుగా కూడా కొంతకాలం చెలామణి అయిందిట. అన్నిటికంటే ముఖ్యంగా మాఅమ్మఘనంగా చెప్పుకున్న విషయం – మా తాతగారు వారి చిన్నప్పట్టి తుండుగుడ్డ ఒకటి ఎప్పుడూ దగ్గర ఉంచుకున్నారుట, “నాజీవితం మొదలయింది దీనితోనే. అది నేను ఎప్పుడూ మరిచిపోను. ఇదే శాశ్వతం,” అని. నేను మాతాతగారిని చూడలేదు కానీ మాఅమ్మ ఆయన గొప్ప నైష్ఠికుడనీ, ఎంతో నియమనిష్ఠలతో జీవితం సాగించుకున్నారనీ చెప్పేది.

నేను ఉత్తరాలకుప్పవేపు మరి కొన్ని క్షణాలు చూసి, ఆలోచించి, మరో ప్రశ్న నన్ను నేనే వేసుకుని సమాధానం కూడా చెప్పేసుకున్నాను. తుండుగుడ్డకి సంబంధించిన విషయం కాదు. శాస్త్రములు అభ్యసించినవారు, కార్యసాధకులు అని పేరు గడించిన మాతాతగారు “నా జననసమాచారం మానాన్నగారికి ఎందుకు టెలిగ్రాం ఇవ్వలేదు” అని అడుగుకొని, “ఆరోజుల్లో ఇప్పటిలా ఉరుకులూ పరుగులూ లేవు,” అని జవాబు చెప్పేసుకున్నాను. సమస్తకార్యాలు సమయానుకూలంగా సాగుతాయి. జరిగేవి జరుగుతాయి. తెలిసేవి తెలుస్తాయి. కొంచెం ముందూ వెనకా, అంతే కదా. అంతలో ఏం ములిగిపోయేది ఏమీ లేదు!

కార్డుమీద ఎడంపక్క కిందివేపు ఓ మూలకి కనిపిస్తున్న చతురశ్రంలో చేతివ్రాత మానాన్నగారిది. బహుశా నామకరణ మహోత్సవం అయినతరవాత ఇంగ్లీషు తేదీ కార్డుమీద నమోదు చేసి ఉంటారు! మానాన్నగారికి కూడా ప్రతివిషయంలోనూ క్రమశిక్షణ ఉంది.

నేను పుట్టేనాటికి పోస్టుకార్డు స్టాంపు తొమ్మిది pies (కార్డుమీద గుణింతాన్ని బట్టి తరవాతికాలంలో (1957లో) వచ్చిన నయా పైసా కాదు ఇది. నా కార్డుమీద పైసలు “అణాకి నాలుగు పైసలు” లెక్కలోవి. మరి కార్డు అంతకు పూర్వం ఇంకా చవగ్గా ఉండేదో, మూడు పైసలతోనే మొదలయిందో తెలీదు మరి. తెవికీ చూసేను కానీ ఈ వివరాలు లేవు. 1937 B నేను ఆ కార్డు పట్టుకుని, పరీక్షగా చూస్తూ కూచున్నాను. నాజీవితంలో చెప్పుకోదగ్గ విశేషాలన్నీ ఆలస్యంగానే జరిగేయి కానీ జననంలో మాత్రం జాప్యం లేదు. ఉదయం వంట చేస్తున్న తాయారమ్మగారితో మాఅమ్మ”నొప్పులొస్తున్నాయి” అనో అలాటిదే ఏదో అందిట. అప్పట్లో పురుళ్లు ఇంట్లోనే. మంత్రసానికి కబురు చేసేరు కానీ ఆవిడ వచ్చేలోపున వంటావిడసాయంతో నేను ఈ భూమిపై అవతరించడం అయిపోయింది.

ఆ తరవాత, చాలా చాలా ఏళ్ళతరవాత, నేను తిరపతిలో ఉద్యోగం చేస్తుండగా, ఒకసారి విశాఖపట్నం శలవులకి వెళ్ళినప్పుడు అలనాటి వంటావిడ నన్ను చూడడానికి వచ్చేరు. బాగా పెద్దవారయిపోయేరు. అయినా శ్రమ పడి నేను ఎంత ఎదిగేనో చూడడానికి వచ్చేరుట. నేను పుట్టినప్పుడు ఆవిడ ఎలా ఉండేవారో నాకు తెలీదు కానీ నన్ను చూడ్డానికి వచ్చిననాటి ఆవిడరూపం మాత్రం ఈనాటికీ నాకళ్లలో మెదుల్తుంది తలుచుకుంటే.

ప్రస్తుతానికి నా జననవృత్తాంతం ఇంతే.

మిగతా జీర్ణపత్రాల కబుర్లు క్రమముగా వినగలరు.

000

(జూన్ 4, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “మేమంతా క్షేమం! – 2. నా జన్మపత్రిక”

 1. ఆ తరవాత, చాలా చాలా ఏళ్ళతరవాత, నేను తిరపతిలో ఉద్యోగం చేస్తుండగా, ఒకసారి విశాఖపట్నం శలవులకి వెళ్ళినప్పుడు అలనాటి వంటావిడ నన్ను చూడడానికి వచ్చేరు. బాగా పెద్దవారయిపోయేరు. అయినా శ్రమ పడి నేను ఎంత ఎదిగేనో చూడడానికి వచ్చేరుట.
  ఆ అప్యాయతలు వేరు.

  మెచ్చుకోండి

 2. వెంకట రత్నంగారూ, ఇదిగో నాకు లభించిన సమాచారం (అనితా రామ్ గారి సహాయంతో.)
  http://en.m.wikipedia.org/wiki/Indian_rupee. ఒకానొకప్పుడు 1/64 పైసగా చెలామణి అయినట్టు ఉంది.
  The values of the subdivisions of the rupee during British rule (and in the first decade of independence) were:1 rupee = 16 anna (later 100 naye paise)1 artharupee = 8 anna, or 1/2 rupee (later 50 naye paise)1 pavala = 4 anna, or 1/4 rupee (later 25 naye paise)1 beda = 2 anna, or 1/8 rupee (later equivalent to 12.5 naye paise)1 anna = 1/16 rupee (later equivalent to 6.25 naye paise)1 paraka = 1/2 anna (later equivalent to 3.125 naye paise)1 kani (pice) = 1/4 anna (later equivalent to 1.5625 naye paise)1 damidi (pie) = 1/12 anna (later equivalent to 0.520833 naye paise)1 rupee=16 anna Athani (Dheli)= ½ rupee Chavanni= ¼ rupee Davanni = 1/8 rupee Anna/Ekanni = 1/16 rupee Takka/adhanni= 1/32 rupee

  Paisa= 1/64 rupee

  Dhela = 1/128 rupee ( ½ paisa) Paisa=3 pie =1/192 rupee Paisa=4 Damri= 1/256 rupee. * addition

  మెచ్చుకోండి

 3. ఇంటర్నెట్ లో ఆ మానం ఏమిటో తెలియదు గాని, మూడు పైసలు ఒక కాణి, నాలుగు కాణులు ఒక అణా , రెండు అణాలు ఒక బేడ, రెండు బేడలు ఒక పావలా , రెండు పావలాలు ఒక అర్ధ రూపాయి , రెండు అర్ధ రూపాయిలు ఒక రూపాయి. ఇదీ మానం. మీరు వ్రాసిన దాంట్లో మూడు పైసలు ఒక pice అన్నారు. దాని అర్ధం కాణి అని. పైసా అని కాదు. మూడు పైసలు ఒక పైసాకు సమానం అవ్వడం అసంభవం కదా! ఇంగ్లీషులో స్పెల్లింగు మర్సినంతలో విలువ మారదు కదా.

  మెచ్చుకోండి

 4. విన్నకోట నరసింహారావుగారూ, నేను ఈ స్పీడ్ గురించి అనుకున్నాను. అలా ఫోనులో చెప్తే ఇలా కార్డు రికార్డు ఉండదు కదా అని. Of course, ఇప్పుడు రికార్డుల విధానం కూడా వేరే అనుకోండి. ఏదో కాకతాళీయంగా నా కార్డు కనిపించింది. నాకు ప్రత్యేకంగా అనిపించింది. అంతే.

  మెచ్చుకోండి

 5. వెంకట రత్నంగారూ, పైస మన దేశంలో అనేక అవతారాలు ఎత్తినట్టుంది. నాకు ఇంటర్నెట్ లో కనిపించింది ఇది – The official monetary denominations of British colonial India were:

  3 Pies = 1 Pice = 1 Paisa
  4 Pice = 1 Anna
  16 Annas = 1 Rupee
  15 Rupees = 1 Mohur

  మెచ్చుకోండి

 6. మా తమ్ముళ్ళు పుట్టినప్పుడు మా నాన్నగారు కూడా ఉత్తరాలు వ్రాయటం మెల్లిగానే మొదలెట్టేవారు.

  మీరన్నట్లు ఇప్పుడంతా స్పీడ్ యుగం కదా. పైగా చేతిలో ఆ సెల్ ఫోన్ ఉంటోంది. హాస్పిటల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఫలానా బిడ్డ అని లోపలినుంచి కబురు అందగానే వెంటనే ప్రపంచంలో ఏమూలనున్న వారికయినా సరే వార్త క్షణాల మీద చేరుకుంటోంది. ఇంకా ఆ ఫోన్ లోనే ఇంటర్నెట్ కూడా ఉంటుంది కాబట్టి ఫేస్ బుక్ వగైరాల్లోకి కూడా ఎక్కేస్తుంది. ఇక లైకులు, షేర్లు.

  పాతకాలంలో ఇంఫెంట్ మోర్టాలిటీ ఎక్కువ కాబట్టి కబురు తెలియజేసేముందు కాస్త వెయిట్ చేసేవారేమో ఇంట్లోని పెద్దవాళ్ళు (అని నేను అనుకుంటున్నాను).

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.