మేమంతా క్షేమం – 3. మహారాణిపేటలో అమ్మమేడ

విశాఖపట్నంలో మహారాణీపేటలో కలక్టరేటు జంక్షనుకి రెండిళ్ళవతల మాతాతగారు మాఅమ్మకి కట్టించిన మేడ అది.

కళ్ళు చికిలించి ఆ కవరు వేపు చూసేను. ఆ నీలిరంగు 3×2.5 అంగుళాల కవరు మడతల్లో చెప్పలేనంత చరిత్ర ఉంది. ఆ ఇల్లు నేను పుట్టిన ఏడే కట్టించేరు. ఆధునికంగా దొడ్లు కట్టించింది అక్కయ్య అని రాసింది అమ్మ. 2,500 రూపాయలైందిట. మరేవో చిన్న చిన్న రిపేర్లు 200 అయేయి. అక్కయ్య చేస్తోంది, నాన్నగారు పట్టించుకోరు. నేను ఎండలు భరించలేకుండా ఉన్నాను అంటూ రాసింది అమ్మ.

ఆ ఇంటికీ నాకూ అవినాభావసంబంధం ఉంది. “అమ్మఆస్తి, అందులో నాకు భాగం ఉంది” అని కాదు. నా భావాలూ, వ్యక్తిత్వమూ రూపు దిద్దుకుని నన్ను కథలవేపు నడిపించింది ఆ మేడే.

నేను అమెరికాకి ప్రయాణం అయిన రాత్రి మళ్ళీ నన్ను చూడనేమో అనుకుంటూ కంట నీరు పెట్టుకుందిట మా అమ్మ. అలాగే జరిగింది. 1973 నవంబరు17 తేదీన నేను అమెరికాలో దిగేను. 1975 మే 8వ తేదీన అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఈ ఉత్తరాలన్నీ ఆ 18 నెలలకాలంలో రాసినవే. ఆ ఉత్తరాల్లో ఏ రెండు వాక్యాలు తీసుకున్నా, ఆ వెనక ఎంతో కథ ఉంటుంది. నేను చాలా రాయొచ్చు కానీ రాస్తే ఏమవుతుంది? ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నబాధ రాయొద్దంటోంది. చాలామందికి పడికట్టుమాటలే అర్థం అవుతాయి. ఆంతర్యం గ్రహించడానికి ఎంతమంది ప్రయత్నిస్తారు? నా ఆలోచనలు మాటల్లో పెట్టడం అంత తేలిక కాదు కదా. అదీ అపార్థాలకీ, అనర్థాలకీ తావు లేకుండా!

ఆలోచిస్తూనే ఏరోగ్రాం మళ్లీ తీసేను. చదవబోతే మనసు మొద్దు బారిపోయింది. ఈపూటకి జరగదు అనుకుని నా నిత్యసంచారానికి బయల్దేరేను ఏం రాయనా అని ఆలోచించుకుంటూ. ఇప్పటికే నా మామూలు రెండు విడతలు అయిపోయేయి. ఇది మూడోది.

రెండస్థులమేడ మనసులో మెదులుతోంది. ఆ ఇల్లు మాఅమ్మకి తాతగారు కట్టించి ఇచ్చేరు, నేను పుట్టిన సంవత్సరమే. నాదగ్గర ఆనాటి దస్తావేజు కాపీ ఉంది.

“రు 6000 కిమ్మతు గల పెంకుటిమేడ అందులో నివేశనముకు (gift deed) 1941 సం.రం జూన్ నెల తే 4దిని విశాఖపట్నం డి. విశాఖపట్నం టవును కాపురస్తులు బ్రాహ్మణులు యినాందారు కొచ్చెర్లకోట వెంకటరామస్వామి పంతులుగారి కుమారుడు సూర్యారావు, retired superintendent of Telegraphs, విశాఖపట్నం డి. నరసన్నపేట సబు డి. గొల్లలవలస గ్రామం కాపురస్తులు బ్రాహ్మణులు యినాందారు నిడదవోలు జగన్నాథరావు పంతులుగారి భార్య శేషమ్మగారికి వ్రాయించి యిచ్చిన gift deed. సదరు శేషమ్మ నాకు ఏక జననకుమార్తె అయి ఉన్నది. ఆమె యెడల నాకు ఉండుకున్న ప్రేమాతిశయముచేతను …”

“సదురు శేషమ్మకు పసుపుకుంకుమ నిమిత్తము gift గా ఇచ్చి యావెంటనే ఆమె స్వాధీనము చేయడమయినది.”

ఆ భాషా, వంశచరిత్రా చదువుతుంటే నామనసు ఆర్ద్రమయింది. యినాందారు అంటే ఏమిటో. బ్రాహ్మణులు అని ప్రత్యేకించి చెప్పడం ఎందుకో.

రెండిళ్ళు కట్టించేరు ఒకటి మాఅమ్మకీ, రెండోది మామామయ్యకీ. తాతగారికి చాలామంది పిల్లలే పుట్టేరుట కానీ మిగిలింది వీళ్ళిద్దరే. మరొకావిడ పెళ్ళయేవరకూ బతికుంది అనుకుంటాను, కానీ ఈ ఇల్లు కట్టించడానికి ముందే ఆవిడ గతించిపోయేరేమో. ఆవిడగురించి నాకు గుర్తున్న ఒకే విషయం – పెళ్ళయి అత్తారింటికి పంపినప్పుడు మాఅమ్మమ్మ ప్రత్యేకంగా చెప్పింది వియ్యపురాలికి, “మాపిల్లకి ఆకలెక్కువ. రాత్రి భోజనాలయేక మరోగిన్నెలో పెరుగు అన్నం కలిపి, కాల్చిన అప్పడం ఒకటి దానిమీద మూతలా పెడితే, అర్థరాత్రి లేచి తింటుంది,” అని. మరి ఎప్పుడు ఎలా చనిపోయేరో తెలీదు.

ఇంతకీ మాయిల్లు చెప్పేను కదా రెండస్తులమేడ. కింద రెండుగదులూ, వెనకవేపు వంటిల్లూ, వరండా, మేడమీద ఒకే పెద్దగది, కిందనున్న రెండుగదులమీదకి పరుచుకుని.

మాతాతగారు ఆ ఇల్లు కట్టించడంలో ఎంత శ్రద్ద చూపించేరో మా అమ్మ చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. గానుగపక్కన కూచుని సిమెంటు గానుగ పర్యవేక్షణ చేసేవారుట. గానుగెద్దు నూరుమార్లు తిరగాలి. తాతగారు నూరు రాళ్ళు కుప్ప పోసుకుని, ఒకొకమారు ఎద్దు ఆయనని దాటినప్పుడల్లా ఒకొక రాయి పక్కన పెడుతూ పని పూర్తి చేయించేరుట. ఆ గోడలు ఎంత గట్టిగా ఉండేవో మాఅమ్మ చెప్పింది. మా మామయ్య తన ఇల్లు అమ్మేశారు. కొనుక్కున్నవారు మెట్లు ఇంట్లో ఉంటే బాగులేదని, వాటిని కొట్టించి, వీధివేపుకి పెట్టించేరు. ఇంట్లో మెట్లు కూలీలు పడగొట్టినప్పుడు గునపాలు వంగిపోయేయిట. అంత గట్టిగా ఉండేవి ఆ గోడలు. మాడాబామీంచి బంగాళాఖాతం కనిపిస్తుంది. సముద్రపు హోరు వినిపిస్తుంది. సాయంత్రాలు వరండాలో చాప వేసుకుని వెల్లకిలా పడుకుంటే, చీకటి పడ్డాక, లైటుహౌస్ కిరణాలు 20 క్షణాలకోమారు గోడమీద వెలిగేవి. నేను అలా ఎన్ని సార్లు లెక్క పెట్టేనో!

ఇంటికెవరైనా వస్తే, ఇంట్లో ఏమీ లేకపోతే చెట్టునించి ఓ కాయ కోసి వారిచేతిలో పెట్టొచ్చనిట వివిధ ఫల, పుష్పజాతులు మొక్కలు నాటించేరు తాతగారు. అరటి, జామ, గంగా బోండాలు (కొబ్బరి) – కాయలు. పారిజాతం, మందార, మల్లెలు, కాశీరత్నం, సంపెంగ, సువర్ణగన్నేరు పూల చెట్లు.

పెరట్లో నుయ్యి మళ్ళీ అంత కథాను. ఆ ప్రాంతంలో అందరిళ్లల్లోనూ నూతినీళ్ళు ఉప్పుకషాయం. తాతగారు ప్రత్యేకంగా శాస్త్రజ్ఞులని పిలిపించి, చక్రం వేయించి, నుయ్యి తవ్వించేరని మాఅమ్మ అంటుండేది. తొంగి చూస్తే నీళ్ళు కనిపించేవి కావు. నూతిలోకి తొంగి చూసి కో అంటే కో అని ప్రతిధ్వని వినిపించేది. తాగితే మాత్రం తియ్యగా కొబ్బరినీళ్ళని మరిపించేలా ఉండేవి. ఎటొచ్చీ ఆ నూతితో తకరారెక్కడ వచ్చిందంటే, శాస్త్రజ్ఞులు చూపించిన స్థలం మామామయ్య పెరట్లో ఉంది. మాతాతగారు రెండిళ్ళకీ మధ్య అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు శాస్త్రప్రకారం. ఈ నుయ్యి వాడకంవిషయంలో కూడా దస్తావేజులో స్పష్టం చేసేరు.

“Plot 2 లో నేను త్రవ్వించిన నూరు అడుగుల లోతుగల మంచినీళ్ళ నుయ్యి. … సదరు నూతినీళ్ళను ఆమె యింటివాడుకనిమిత్తం మోయించుకొని పోవుటకు మాత్రమే సదరు శేషమ్మకున్ను ఆమె వారసులకు హక్కు యివ్వడమైనది గాని స్నానపానీయాదులు నూతివద్ద చేయుటకు హక్కు లేదు. నూతినూళ్ళు తోడుటకు కావలసిన (Manila rope), బాల్చీలు మరమ్మత్తులు వగైరాలకు అయ్యే ఖర్చులు చెరిసమానముగా వుభయులు భరించవలెను. … సదరు నూతివాడుక రాత్రులందు వాడుక చేయుటకు వీలు లేదు.”

***

ఇంటికెదురుగా వీధికి అటుపక్క పెద్ద మట్టిదిబ్బ, సుమారు 15 అడుగుల ఎత్తు. ఉపరితలం చదునుగా ఉంది, గన్నేరు మొక్కలతో. రాతిలోని కప్పని రక్షించువాడెవరు అన్నట్టు ఆ మొక్కలకి వాననీళ్లే అయినా పుష్కలంగా పూసేవి. రోజూ పొద్దున్నే కాఫీ తాగి, చిన్న గిన్నె తీసుకుని ఆదిబ్బఎక్కి మాఅమ్మ పూజకి పువ్వులు కోసుకొచ్చేదాన్ని. ఇంట్లో పారిజాతాలు, సంపెంగ, మందార, సువర్ణగన్నేరు ఉన్నాయి. ఎందుకో మరి అక్కడికెళ్ళి ఆ పువ్వులు కూడా కోసుకొచ్చేదాన్ని. సాయంత్రాలు ఏటవాలుగా ఉన్న ఆ దిబ్బఅంచుమీంచి కిందకి జారేవాళ్లం పిల్లలం. మాకు అదే ఆట.

ఆ తరవాత నాకు పదేళ్ళప్పుడు మా నాన్నగారు ఆడయారు ఉద్యోగం వదిలేసుకుని వేరే ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నకాలంలో ఒక ఏడాదిపాటు ఆ ఇంట్లో ఉన్నాం. ఆవేళకి స్కూళ్ళు మొదలయిపోయేయి. కొత్తగా వచ్చినపిల్లలకి ప్రవేశాలు లేవు. ఊరికే ఇంట్లో కూచోడం ఏమిటని మాఅమ్మ నన్ను కలక్టరాఫీసువెనక ఉన్న దుంపలబడికి తోలింది. ఆవిధంగా నేను 5వతరగతి రెండుసార్లు చదివేను. ఏం చదివేనో తెలీదు కానీ ఆ ఏడాది అలా గడిచిపోయింది.

ఆరోజుల్లోనే మేడమీద అంత పెద్దగది ఎందుకని, మధ్యలో గోడ కట్టించి రెండు గదులు చేయించింది. అయినా రెండు గదులూ పెద్దవే. తేలిగ్గా 14, 15 చదరపు అడుగులు.

ఆ మరుసటి సంవత్సరం మానాన్నగారు మంగళగిరిలో హెడ్ మాస్టరుగా చేరేరు. అక్కడ నాలుగేళ్ళున్నాం. ఆ తరవాత ఆ చుట్టు పక్కల మరో 3, 4 ఏళ్ళపాటు వేరు వేరు స్కూళ్లలో పని చేసేరు. ఆ చక్రభ్రమణంలో నా ఆఖరుమజిలీ ఎడ్లపాడు అని ఓ చిన్న పల్లె. నాకు హైస్కూలు ఆఖరిసంవత్సరం. యస్సెల్సీ పరీక్ష ఫెయిలయేను.

దాంతో మా అమ్మ పిల్లలచదువులు పాడయిపోతున్నాయని, విశాఖపట్నం వచ్చేసింది మమ్మల్ని తీసుకుని. మానాన్నగారు కూడా మరో రెండేళ్ళు అలాటి ఉద్యోగాలే చేసి, రిటైరయి విశాఖపట్నం వచ్చేసేరు. మానాన్నగారు ట్యుటోరియల్ కాలేజీ పెట్టేరు. అది కూడా ఘనంగా సాగలేదు కానీ ఆ కాలేజీపేరుతో పుస్తకాలు కొనిపడేయడం మాత్రం నాకు లాభించింది.

నేను సెప్టెంబరులో యస్సెల్సీ పరీక్ష రాసి, అయిందనిపించుకుని, మళ్ళీ కాలేజీలు తెరిచేవరకూ మరేం పని లేదు కనక పత్రికలూ, పుస్తకాలూ చదవడం మొదలు పెట్టేను.

ఆరోజుల్లో ఒక పత్రిక కొంటే ఆ కొన్నవాళ్ళొక్కళ్లే కాదు, ఆ కుటుంబంలో వాళ్ళే కాదు, మరో రెండుమూడు కుటుంబాలు కూడా సమష్టిగా పంచుకు చదివేవాళ్ళం. అందుకే అంటాను నేను అమ్మకం అయిన పత్రికలసంఖ్యని బట్టి ఎంతమంది చదివేరు అని మనదేశంలో లెక్క కట్టలేం.

మానాన్నగారు అడయారులో ఫిలాసిఫికల్ సొసైటీవారి స్కూల్లో లెక్కల మాస్టారుగా పని చేసేరు. మేడమ్ బ్లవట్స్కీ అభ్యుదయభావాలు కూడా సంతరించుకున్నారు. రుక్మిణిదేవి చూచాయగా గుర్తున్నారు నాకు. ఆడపిల్లలు ఇవి చదవకూడదు, ఇలా చెయ్యకూడదు వంటి ఆంక్షలు లేవు మాయింట్లో. నిజానికి మాఅమ్మా, నాన్నగారివేపూ కూడా మొట్టమొదట కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల మాఅక్కయ్యే.

ఇక్కడే మరోమాట కూడా చెప్పాలి. ఇంట్లో పనులేమీ నన్ను చెయ్యనిచ్చేవారు కారు మా అమ్మా, అక్కయ్యా. ఎప్పుడేనా వంటింటిగుమ్మంలో సందిగ్ధంగా అటోకాలూ ఇటో కాలూ వేసి నిలబడి “నేనేమైనా చెయ్యనా?” అని అడిగితే, మాఅమ్మ “పనిమనిషికి చెప్పినట్టు చెప్పాలేమిటి ఇంట్లో మనిషికి. నీఅంతట నీకై తోచాలి గానీ” అనేది. ఊరికే అలా అన్నా, “ఏంలేదు. వెళ్ళి ఆడుకో” అనడమే ఎక్కువ.

అయితే నేను బయటికి వెళ్ళి మిగతా పిల్లలతో ఆడుకోడం తక్కువే. ఎక్కువగా డాబామీద కూచుని పత్రికల పారాయణా, నాచుట్టూ జరుగుతున్న దైనందిన జగన్నాటకంలో ఏదో ఒక విషయం తీసుకుని మనసులోనే కథలు అల్లుకోడం అలవాటయింది నాకు. ఈ విషయంలో మాఅమ్మ తరుచూ అనే మరోవాక్యం,”ఎందుకలా ఎప్పుడూ ఆలోచిస్తూ కూచుంటావు, మైండు చెడిపోతుంది,” అని. “మైండు” అనే ఆమె అనడం నాకు బాగా గుర్తుంది. దానిమీద ఇప్పుడు అనుకుంటాను, “బుర్ర చెడిపోలేదు కానీ బతుకు చెడిపోయింద”ని. అంటే  పదాలపొందిక బాగుందనే కానీ నిజంగా నేనలా అనుకుని అంతరాంతరాల కుమిలి కుమిలి కృశించిపోతున్నానని కాదు (నవ్వుతూ). రచయిత్రిని కదా, అంచేత అలాటి వాక్యాలు తోస్తాయి!

అవ్విధమున మొదలయింది నా సాహిత్యసేవ తాతగారు ఏర్పాటు చేసిన పంచన. మరొకమాట ఇప్పుడే చెప్పేస్తాను -ఐదో క్లాసూ, పదకొండో క్లాసూ (నాకాలంలో పదకొండు ఏళ్ళేస్కూలు చదువు) రెండుసార్లు సాగిస్తేనే కథలు రాయగలం అని కాదు ఇందలి నీతి. ఇది నేను మాత్రమే చేసుకున్న పూర్వజన్మ పుణ్యసంచితార్థముగా గ్రహించవలెను. నా కాలేజీ, యూనివర్సిటీ చదువులు ఆ ఇంట్లో ఉండగానే పూర్తయేయి. మాఅమ్మ జీవితం ఆ మేడలోనే ముగిసింది. ఇలా ఆ మేడ నాజీవితంలో ప్రముఖంగా నిలిచిపోయింది.

ఆయింట్లోనే నేను నిరభ్యంతరంగా పుస్తకాలు, పత్రికలు చదువుతూ, “ఒస్ నేను మాత్రం రాయలేనేమిటి” అనుకుని రాయడం మొదలు పెట్టేను. (లేదులెండి, నిజానికి నేను పదోక్లాసులో ఉండగా, స్కూలు మేగజీనుకి “చాదస్తం” అని ఓ కథ రాసేనని, దానిమీద చాదస్తులయిన మా ఇంగ్లీషు మాస్టారుకి కోపం వచ్చిందనీ ఈమధ్యనే అమెరికా వచ్చిన నా పదోక్లాసు క్లాసుమేటు చెప్పింది).

ఏమైనా పత్రికలకి రాయడం విశాఖపట్నంలో మాఅమ్మమేడలోనే మొదలయింది. ఓ చిన్న స్కెచ్ రాసి తెలుగు స్వంతత్రకి పంపేను. కుటుంబరావుగారు ఆకాలంలోనే నారాతలవంటి రచనలకి స్కెచ్ అని పేరు పెట్టేరు. ఏదో పాపం ఆడపిల్ల పంపింది కదా అని కాబోలు వాళ్ళు వేసుకున్నారు. వాళ్లు వేసుకున్నారు కదా అని నేను మరొకటి రాసి పంపేను వెంటనే. నేను పంపేను కదా అని వాళ్ళు వేసుకున్నారు. అలా నేను పంపేనని వాళ్లు వేసుకోడం, వాళ్ళు వేసుకుంటున్నారు కదా అని నేను రాయడం జరిగింది కొంతకాలం.

ఆ తరవాత స్కెచ్చిలు సాగదీసి, కథలు అనిపించుకోగలవి రాయడం వచ్చేక, ఏడాదికి రెండు, మూడు కంటె ఎక్కువ రాయలేదు. “మాలతి కథలు రాస్తుందని మరిచిపోయేవేళకి మరో కథ రాస్తుంది,” అని నాకు వచ్చిన యోగ్యతాపత్రం ఆరోజుల్లో.

అమ్మ పోయిన మరో పదేళ్లకి కాబోలు అక్కయ్య మళ్ళీ రాసింది. “ఇంటికి రిపేర్లు చేయించవలసి వస్తోంది. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేస్తే, ఇద్దరం చూసుకోవచ్చు. నేను ఒక్కదాన్నీ చెయ్యలేను,” అని. ఆ తరవాత కొన్నాళ్ళకి, “ఇంత పెద్ద ఇల్లు నాకొక్కదానికీ ఎందుకు. నువ్వు రాకపోతే అమ్మేద్దాం,” అని రాసింది. నేను సరే అమ్మేయమన్నాను. “మంచి జంక్షనులో ఉంది. ధరలు పెరిగిపోతున్నాయి. అమ్మొద్దని చెప్పు,” అని నా శ్రేయోభిలాషులు పదే పదే నొక్కి చెప్తూ వచ్చేరు. నాకు మాత్రం అది న్యాయంగా అనిపించలేదు. నేను వెళ్ళి సాయం చెయ్యలేనప్పుడు, తను చెయ్యలేనంటుంటే, అమ్మొద్దు అని ఎలా చెప్పడం?

అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది. కానీ ఆ మేడకీ నా జీవనహేలకీ, వ్యక్తిత్వపుతీరుకీ ఉన్న అవినాభావసంబంధం శాశ్వతం. దరిమిలా నాజీవితంలో మరో రెండిళ్ళు వచ్చి పోయేయి. రెండస్తులమేడనించి, మూడు పడగ్గదుల ఇల్లు, రెండుగదుల అద్దె వాటా, ఒక గది వాటా – ఇలా సాగింది నా నివాసచరిత్ర.

ఇల్లు స్థిరాస్తి అంటారు. స్థిరం అనుకున్న ఇల్లు ఇప్పుడు లేదు. అశాశ్వతమైన నేను ఉన్నానింకా. నాకు వచ్చినవన్నీ నేనట్టే శ్రమ పడకుండా వచ్చేయి. పోవడం అంత చులాగ్గానూ పోయేయి.

ఈ అనుభవాలమూలంగా నాకు మాత్రం “వదిలేసుకోగలగడం” చాలా తేలికయింది. ఎంత ఖరీదయినదయినా సరే, పోయినతరవాత పోయిందన్న విచారం లేదు.

000

(మే 8, 2015)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “మేమంతా క్షేమం – 3. మహారాణిపేటలో అమ్మమేడ”

 1. వస్తువును పట్టుకోకుండా వదిలేయగలగటం దానిగురించి మరలావిచారించక పోవడం నిజంగా ఖరీదైన విషయమే అలాగే విలువ మార్కెట్ బట్టీ కాదు మన అనుబంధం బట్టీ ఉంటుంది

  మెచ్చుకోండి

 2. @ దుంపలబడి – ఆ పాఠశాలలో చెప్పే పాఠాలు ఏమీ లేవు కానీ పక్కన బొగ్గులకుంపటిమీద కాల్చిన ఎర్రదుంపలు దొరికేవి. అంచేత వచ్చిందేమో ఆ పేరు.

  మెచ్చుకోండి

 3. సంతోషం ప్రసాద్ చరసాలగారూ మీకు ఈ సోది నచ్చినందుకు. అదే మా కుటుంబాల్లో ఎవరికి ఏ సందర్భంలో ఇనాంగా ఇవ్వబడి ఉంటుందో మరి. బహుశా ఆనాటి బ్రాహ్మణులలో చాలామంది ఇనాందారులే అయిఉన్నారేమో.

  మెచ్చుకోండి

 4. అనిల్ అట్లూరి, ధన్యవాదాలండీ ఓపిగ్గా నాకథ చదివి, మీ స్పందనలు అందించినందుకు. అష్టలక్ష్మి గుడి జ్ఞాపకం లేదు. మర్రిచెట్టు మాత్రం మళ్లీ 1998లో వెళ్ళినప్పుడు చూసేను. ఫొటో కూడా తీసేను, ఇప్పుడెక్కడుందో తెలీదు. :p.

  మెచ్చుకోండి

 5. బాగుందండీ అప్పటి విశయాలని నెమరువేసుకోవటం.
  ఈ “ఇనాందారు” అనేపదం మా వైపు ఇప్పటికీ బాగా వాడుకలో వుంది. ఇనాం (బహుమతి) పొందినవాడు ఇనాందారు.

  మెచ్చుకోండి

 6. దుంపలబడి – ఆపేరు ఎందుకు వచ్చిందో?

  ఆ పూల పేర్లు చదువుతుంటే, తెనాలి లో మా తాతగారి సూతాశ్రమం , అక్కడి నుయ్యి గుర్తు వచ్చినవి. వాటితో పాటు మా అమమ్మ.

  “గుమ్మం మీద కూర్చోకూడదు” అని “అలా అటో కాలు ఇటోకాలు వేసుకుని నుంఛోకూడదు” అని అనేవారు!
  ఫిఫ్త్ ఫార్మ్ తరువాత అప్పట్లో ఎస్ ఎస్ ఎల్ సి ఉండేది. అయితే మీకు అడయారు మర్రిచెట్టు కూడా తెలుసన్నమాట. అష్టలక్షి గుడికి వెళ్ళారా?

  కాబట్టి ఆవ్విధంబున జగన్నాథరావు పంతులుగారి మనుమరాలు, మహరాణి పేటలోని అమ్మమేడలో మొదటి స్కెచ్చి గీకి, కుటుంబ రావు గారితో ‘మాలతి స్కెచ్ బాగా రాస్తుంది’ అనిపించుకుంటూ ఇక్కడి దాక వచ్చారన్నమాట.

  ఆ ఏయిరోగ్రామ్‌తో ఎంత కథ అల్లారో చూసారా!
  ఉన్నవాళ్ళకి పోయినవాళ్ల గేపకంశాశ్వతం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.