మేమంతా క్షేమం – 4 ఎవరూ ఏకాకి కారు!

“పెళ్ళి చేసుకుంటే వస్తానని రాసేను.”

“కట్నం ఇస్తాం అన్నా కామాక్షిపెళ్ళి కాలేదు. నీకు ఏ కట్నమూ లేకుండా అయిపోయింది. … నిన్ను నేను కోరేది ఒక్కటే. నేను పోయేక దాన్ని మీరే చూసుకోవాలి.”

ఉత్తరం పట్టుకుని కూర్చున్నాను. కిటికీలోంచి కనిపించే సుందరదృశ్యాలేమీ లేవు. నిస్సారంగా పక్కింటి సిమెంటు గోడా, వరండామీద సెటిలైటు డిప్పా, దానిపక్కన బల్లమీద నిన్న రాత్రి ఖాళీ చేసినవి కాబోలు బీరు కాయలూ – వారి జీవితఅనుభవసారం అదీ.

అప్రయత్నంగానే ఓ నిట్టూర్పు వెలువడింది. ఆనాటి సంగతులే కాక ఆ తరవాత రామం నాతో అన్న మాటలు కూడా మనసులో మెదిలేయి. 2000 జనవరిలో ఇండియా వెళ్ళినప్పుడు మాటాడుకున్నాం కొంతవరకూ. చెప్పేను కదా మాయింట్లో “మాటాడుకోడాలు” లేవు. ఆరోజు మాత్రం ఎందుకో చిన్న సంభాషణ ప్రారంభించేం.

“అమ్మ ఆనాటివారితో పోలిస్తే చాలా ఆధునికం అనే అనిపిస్తుంది,” అన్నాను.

“ఏం కాదు. అమ్మకి పాతకాలపు పట్టదలలు ఎక్కువే,” అన్నాడు రామం.

74లో రాసిన ఉత్తరంలో వాక్యం పైన నేను ఉదహరించింది. అప్పటిమాట చెప్తున్నాడు రామం. తనకి పెళ్ళిమీద ఇచ్ఛ లేదుట. అమ్మ పెళ్ళి చేసుకోమని పోరు పెడుతోంది. అది కూడా బ్రాహ్మణపడుచు అయిఉండాలిట. అసలు పెళ్ళే వద్దన్నప్పుడు బ్రాహ్మణ, అబ్రాహ్మణప్రశ్న ఎలా వచ్చిందో నాకర్థం కాలేదు. ఆ సమయంలోనే నేను అన్నది అమ్మవి ఆధునికభావాలు అని. నాకు ఈ అభిప్రాయం ఎలా ఏర్పడిందంటే చిన్నప్పట్నుంచీ దాదాపు నాస్నేహితులు అందరూ అబ్రాహ్మణులే. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒకసారి నా క్రిస్టియన్ స్నేహితురాలు వాళ్ళమ్మని మాయింటికి తీసుకొచ్చింది. మాఅమ్మ ఆవిడకి ఇల్లంతా చూపిస్తూ వంటింట్లోకి కూడా తీసుకెళ్ళింది. ఆ తరవాత అడిగేను మరి నీకు పరవాలేదా అని. ఆ తరవాత తన అన్నయ్య విశాఖపట్నం వచ్చినప్పుడు నాలుగు రోజులు మాయింట్లోనే ఉన్నాడు. మరి ఆరోజుల్లో అలాటి పట్టింపులుండేవి కదా. కుటుంబంలో వాళ్ళే విదేశం వెళ్లొస్తే వంటింట్లో భోజనం పెట్టని రోజులవి. మాఅమ్మ “ఏంలేదు. శుభ్రంగా పసుపుకొమ్ములా ఉంది ఆవిడ,” అంది. పసుపుకొమ్ము అంటే తొక్కరంగు కాదు మాఅమ్మ అంటున్నది. పరిశుభ్రంగా ఉందని మాత్రమే. నేను ఈమాట చెప్పినా రామం నమ్మలేదు. ఒకవేళ మాఅమ్మ కాలక్రమంలో అభిప్రాయాలు మార్చుకుందేమో అనుకున్నాను.

ఇంతకీ రామం తనకి పెళ్ళివిషయంలో తన విముఖతకి కారణం దరిమిలా తెలిసిందిట. ఒకసారి మధురై వెళ్ళినట్టు, అక్కడ ఒక స్వామి దర్శనమయిట్టు కల వచ్చింది. తరవాత మధురై వెళ్ళేడు. అక్కడ కలలో కనిపించిన స్వామి ప్రత్యక్షంగా కనిపించేరు. ఆయన చెప్పేరుట వాడివైముఖ్యతకి కారణం వెనకటి జన్మలో తను దైవసేవకే జీవితం అంకితం చేయడం అని. ఆయన మరోమాట కూడా చెప్పేరు. “మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి, అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు,” అని. రామం ఇల్లు చేరేవేళకి కామాక్షి మరణించింది.

నాఆలోచనలు ఆనాటి సాంఘికపరిస్థితులవేపు సాగేయి. నాచిన్నతనంలో పెళ్ళికూతుళ్ళవయసు 8, 10 నించి 14, 16, 18కి హెచ్చింది. దేశపునర్మిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలచదువులు కనీసం హైస్కూలువరకూ సాగేయి. అయితే ఈ విద్య వీరేశలింగంగారు కలగన్న పతిసేవ, సతీధర్మాలు, పిల్లలపెంపకం కాదు. ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, సైన్సు చెప్పే స్కూళ్ళు వచ్చేయి. పెళ్లికీ చదువుకీ ముడి పడింది. పెళ్ళి కుదరలేదు, చదువుకోనీలే అని చదువు, చదువుతోంది కదా, పెళ్ళి సంగతి తరవాత చూదాంలే అని పెళ్ళీ – పీటముళ్ళు పడి, ఆ సుడిగుండంలో కొందరు అవివాహితలుగా ఉండిపోవడం జరిగింది.

ఈ పరిస్థితికి మరోకోణం, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో, చదువుకున్న ఆడపిల్లలు పెళ్లయేవరకూ ఊరికే ఇంట్లో కూచోడం ఎందుకు, నాలుగు రాళ్ళు తేవచ్చు కదా అని ఉద్యోగాల్లో చేరడం, ఆ తరవాత ఆ నాలుగు రాళ్లూ పెళ్లి సందర్భాలలో కూడా ప్రముఖస్థానం పొందడం అయింది. పుట్టిళ్ళలో తమ్ముళ్లనీ చెల్లెళ్లనీ చదివించడం, వాళ్ల పెళ్ళిళ్లు కుదర్చడం, అత్తవారిళ్ళల్లో “చన్నీళ్ళకి వేణ్ణీళ్ళు తోడుగా” ఉంటుందని కోడలిని ఉద్యోగంలో పెట్టడం – ఇలా స్త్రీవిద్యా, ఆర్థికస్వాతంత్ర్యం అనిపించుకోడానికి వీల్లేని ఆర్జనా కూడా కుటుంబజనాభాకి పనికొచ్చేయి కానీ వ్యక్తిగా ఆమెకి ఒక అస్తిత్వం అంటూ ఏర్పడే వసతి ఏర్పడలేదు. మాయింట్లో అచ్చంగా ఇలాగే జరిగిందని చెప్పలేను కానీ కామాక్షి, రామం అవివాహితలుగానే ఉండిపోయేరు ఆజన్మాంతం. కామాక్షి పెళ్ళి కాలేదనీ, తనకి మేం అంటే మిగతా పిల్లలం తోడుగా ఉండాలని అమ్మకోరిక కానీ కామాక్షికి అలాటి అభిప్రాయం లేదు. తనే అందరిబాధ్యతలూ – ఇంట్లో వాళ్ళవీ, ఊరివాళ్ళవీ కూడా నెత్తిన వేసుకుని చూసింది. అమ్మ ఒక ఉత్తరంలో అది కూడా రాసింది, “ఇంటికి రిపేర్లు కావాలి, కామాక్షే చూస్తోంది, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా,” అని. కామాక్షి అనేక విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నా, పెళ్ళి కాలేదని కొరత! ప్చ్, ఏమిటో అనిపించింది ఆ ఉత్తరం చదువుతుంటే.

అమ్మ ఉత్తరంలో మొదటిభాగం – నాపెళ్ళి తేలిగ్గా అయిపోయినందుకు వెలిబుచ్చిన ఆనందం – ఆ భావంతోనే ఆవిడ జీవితం ముగిసిపోయినందుకు నాకు ఒకవిధంగా మంచిదే అనిపించింది. పట్టి చూస్తే, ఎవరిజీవితంలోనైనా జరిగేది అదేనేమో. ఎవరైనా జీవితంలో ఏం కోరుకుంటారు? సుఖసంతోషాలే కదా. అప్పటికది నిజం. ఆ తృప్తితో ఆమె గతించింది. తరవాత ఏం జరిగినా ఆమెకి సంబంధం లేదు. అదే జీవితసత్యం. ప్రతి సంఘటనా తాత్కాలికం. బహుశా కామాక్షి పెళ్ళి కాలేదని బాధ పడకుండా ఉండి ఉంటే బాగుండును అని కూడా అనిపించింది.

ఇక్కడే మరోమాట చెప్పుకోవాలి. పెళ్లి చెయ్యడం, అవడం-కాకపోవడం, చేసుకోకపోవడం – ఇలా ఏదైనా జరగవచ్చు ఒక వ్యక్తి అవివాహితగా ఉండడానికి. అసలు చాలాసార్లు ఒక వ్యక్తి విషయంలో ఏ కారణం అన్నది నిర్ధారణగా చెప్పడం కూడా కష్టమే. కామాక్షివిషయయంలో నాన్నగారు పట్టించుకోకపోడం అని అమ్మ అభిప్రాయం. రామంవిషయంలో మాత్రం ఖచ్చితంగా తనకు తానై చేసుకున్న నిర్ణయమే. ప్రేమపెళ్ళిళ్ళు మరో కథ. ఇప్పుడు సాధారణమే కానీ ఆ రోజుల్లో ఇంకా కొంత ముసుగు తప్పలేదు. పిల్లా పిల్లాడు నిర్ణయించుకున్నతరవాత, పెద్దలు “పెళ్ళి చేసేం” అనే చెప్పుకుంటూ వచ్చేరు. ఒకసారి మాయింట్లోనే, సరోజగారు, “మాచెల్లెల్ని రాజబాబుకిచ్చి పెళ్ళి చేసేం,” అంటే, మహాకవిగారు, “ఇచ్చి చేయడం ఏమిటి, వాడే లేవదీసుకుపోయేడు,” అన్నారు. తమరిపెళ్లి సుమారుగా అలాటిదే మరి. అది ఆయన ఎలా వాచ్యం చేసి ఉండేవారో కానీ నేను అడగలేదు!

మొత్తం మాకుటుంబంలోనూ, చుట్టాల్లోనూ పెళ్ళి కాకో చేసుకోకుండానో ఉండిపోయినవాళ్ళని నలుగురిని నాకు తెలుసు. వాళ్లలో ఏ ఒక్కరూ ప్రత్యేకించి “ఒంటరి జీవితాలు” గడపలేదు. ప్రతి ఒక్కరూ మరొక కుటుంబంలో భాగం అయిపోయేరు. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ గానీ స్నేహితులు గానీ తనవాళ్ళుగా స్వీకరించి, ఆ కుటుంబం వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర వహించి, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు.

మాకామాక్షిని తనస్నేహితులఇంట్లో చూసేను ఏస్థాయిలో వాళ్ళఇంట్లో పెత్తనం సంపాదించిందో. ఒంటరిగానే ఉన్నట్టు పైకి కనిపించినా అనేక కుటుంబాలకి మూలస్తంభం అయిందనుకుంటాను. మాత్ లెక్టరర్‌గా పని చేసి, రిటైరయేక ఆధ్యాత్మిక చింతనలో పడి, క్రమంగా శిష్యుగణాన్ని కూడా చేరదీసి గురుస్థానం స్వీకరించింది. నాకు మాత్రం తన కొన్ని అలవాట్లూ వ్యవహారాలూ చూస్తే మహ చిరాకుగా ఉండేది. అరిషడ్వర్గాలు అన్నిటిమాటా నాకు తెలీదు కానీ కోపం, మమకారం, అహంకారం మాత్రం ఎక్కువే అనిపించేది నాకు. తాను ఆచరణలో పెట్టలేనివి ఇతరులకి బోధించడంలో అర్థం లేదు. కానీ అది నాదృష్టిలోపం కూడా కావచ్చు. ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే, తను మరణించినతరవాత నేను దేశం వెళ్ళినప్పుడు మామామయ్య కూతుళ్ళిద్దరు నన్ను చూడడానికి వచ్చేరు. ఒకమ్మాయి, “కామాక్షి గతించింది. ఆలోటు నువ్వే తీర్చాలి,” అంది. రెండోఅమ్మాయి వెంటనే, “కామాక్షి వేరు. మళ్ళీ అలాటివాళ్ళు మరొకరు దొరకరు,” అంది. ఎంతమంది అలా అనుకుంటున్నారో తననిగురించి. అలాటి అభిమానం కానీ గౌరవం కానీ అంత తేలిగ్గా రాదు కదా.

మేం ఐదుగురం ఐదు జీవనవిధానాలకి ప్రతీకలనుకోవచ్చు. అసలు మాకు మొహాల్లో కూడా అట్టే పోలికలు కనిపించవు. ప్రవృత్తి తీసుకుంటే, పెద్దన్నయ్యని మాత్రమే అన్నయ్య అనేవాళ్లం, వాడికీ ఆ తరవాత పుట్టిన కామాక్షికీ 7 ఏళ్లు తేడా ఉండడంతో. నాకయితే అసలు వాడు ఇంట్లో వాడనే అనిపించదు. నాకు పదేళ్ళప్పుడు మేం అడయారునించి విశాఖపట్నం వచ్చేం అని చెప్పేను కదా. అప్పటికే అన్నయ్య క్రోంపేటలో ఐఐటీలో ఇంజినీరింగు చదువుతున్నాడు. అంచేతన్నమాట వాడు ఇంట్లో ఉన్న స్ఫురణ నాకు లేదు. ఆ తరవాత ఉద్యోగంకోసం ఖరగ్పూర్ వెళ్లిపోయేడు. మొదట్నుంచీ పూర్తిగా పాశ్చాత్యసంస్కృతిని ఆకళించుకుని ఆచరణలో పెట్టేడు. వాడు పిల్లలని కూడా అదే పద్ధతిలో పెంచడానికి ప్రయత్నించేడు కానీ అది అంత విజయవంతంగా సాగినట్టు లేదు. అదంతా మరో పెద్ద కథ. తరవాత ఎప్పుడైనా చెప్తాను.

ప్రస్తుతం అవివాహితులమాట – వాడి పెద్దకూతురు కూడా అవివాహితే. కానీ తమ్ముడిపిల్లలజీవితాల్లో జోక్యం చేసుకోడం చూసేను, తమ్ముడికి అంగీకారం కానివిషయాల్లో కూడా. తమ్ముడు 12 ఏళ్ళకూతురికి సెల్ ఫోను కొనివ్వడానికి ఒప్పుకోలేదు. అక్కగారు మేనగోడలిని పిలిచి, స్కూలునించి తిన్నగా ఇంటికి రాకుండా తప్పిపోయినట్టు నటించమని సలహా ఇచ్చిందిట. తను అలా చేసినందుకు గర్వపడిపోయింది కానీ నాకు మాత్రం అన్యాయమనే అనిపించింది. నేనెప్పుడూ ఇలా ఎవరిజీవితాల్లోనూ కలగజేసుకోను. ఎవరైనా అడిగినా కూడా, “నీ పరిస్థితులూ, నీ మనస్తత్వం నీకు తెలిసినట్టు మరెవరికీ తెలీదు. నువ్వే ఆలోచించుకోవాలి,” అని చెప్తాను. డైవోర్స్‌గురించి నన్ను కొందరు అడిగినప్పుడు అదే చెప్పేను. ఆలా ఆలోచిస్తుంటే, నేను ఏ స్వాములారి బోధనలూ లేకుండానే నిర్మోహం నిస్సంగత్వం సాధించేసేను అనిపిస్తోంది.

రామంది మరొక రకం సంప్రదాయం. cost analyst గా బాగానే సంపాదించినా నిత్యజీవితంలో అతిసామాన్యంగా గడిపేడు. రెండే రెండు చొక్కాలూ, పైజామాలే తప్ప ఆస్తి ఏమీ పోగు చేసుకోలేదు. జీవితం నిస్వార్థంగా ఇతరుల యోగక్షేమాలకే అంకితం చేసేడు. రిటైరయింతరవాత అనుకుంటాను తాత్వికమైన ఆలోచనలు వాటంతట అవే వస్తున్నాయి అని రాసేడు. క్రమంగా కల్కి భగవాన్లతో పరిచయమయింది. నాకు కూడా ఆయన పాటలు టేపులు, పుస్తకాలూ పంపేడు. తనకి ప్రత్యక్షంసాక్ష్యాలు కనిపిస్తున్నాయిట. తనకంటే తమ్ముడు సూర్యంకీ, వాడికొడుక్కీ అనుకున్నవన్నీ జరుగుతున్నాయిట. నియమనిష్ఠలేమీ లేవు. భక్తి, శ్రద్ధా ఉండాలి. అంతే. నిశ్చలధ్యానంతో ఆ స్వామివారి ప్రతిని చూస్తూ ధ్యానం చెయ్యాలి, అంతే. కాలానుగుణంగా నిబంధనలు మార్చేరుట. పూర్వకాలంలోలా స్నానాలూ, ద్యానాలు చేసినట్టు ఇప్పుడు చెయ్యమంటే ఎవరూ చెయ్యరు, చెయ్యలేరు కదా. పైగా అచంచలదీక్షతో అతి సామాన్య జీవితం గడిపిన తనజీవితం చివరిదశలో కష్టాలపాలు కావడం కూడా నాకు ఈ నమ్మకాలు లేకుండా చేసేయి. జీవితం అంతా నిస్సంగత్వంతో గడిపి అంత్యదశలో అన్నయ్య చిన్నకూతురికుటుంబంలో వాళ్లపిల్లలమీద మమకారం పెంచుకుని జడభరతునిలా బాధ అనుభవించేడు అని కూడా అనుకుంటాను. (పూర్తి పేరు నిడదవోలు సీతారామారావు. అతనిగురించి మరింత తెలుసుకోగోరువారు ఈ లింకు చూడండి.)

నాకు మానవాకారంలోని భగవానవతారాలలో నమ్మకం లేదు. కొంతవరకూ వారి జీవనసరళే కారణం. వాళ్లచేతుల్లో సెల్ ఫోనులూ, చేతికి రిస్టువాచీలూ, ఇంటిముందు కార్లూ – ఇవన్నీ అవసరమే కావచ్చు కానీ నాకు మాత్రం వారు తమకి లేని నిర్మోహం పరులకి బోధిస్తున్నారనిపిస్తుంది. అందుకు తగ్గట్టే  సూర్యం కోరుకున్న కోరికలు తీరేయి అని కూడా రాసేడు. కోరికలు ఉండకూడదని కదా మనశాస్త్రాలు చెప్తున్నాయి? మరి అది కావాలి, ఇది కావాలి అని కోరుకుని, ఆ కోరికలు తీరేయని ఆనందించడం సమంజసమేనా? నేను బాధ పడుతున్నాననీ, ఆ బాధలు తొలగిపోవాలనీ వాడి ఆరాటం అని నాకు బాగానే తెలుస్తోంది కానీ సూచించిన మార్గాలు మాత్రం నాకు రుచించలేదు.

ఆ ఉత్తరం చూస్తూంటే నాకు మరో సందేహం వచ్చింది. నేను ఆ ఉత్తరానికి జవాబు ఏం రాసి ఉంటానా అని.

మరో అవివాహిత – మా చుట్టాలో ఒక అమ్మాయి – అమ్మాయి అంటున్నాను కానీ కథాకాలంనాటికి 50 దాటేయి – అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ బాగానే చూసుకుంటున్నా, తనతో చదువుకున్న ఒకమ్మాయిని ఆప్తురాలు చేసుకుని, దరిమిలా ఆవిడకుటుంబాన్ని తనకుటుంబంగా చేసుకుని, తనకు తండ్రి కట్టించి ఇచ్చిన యింటిని వాళ్లపరం చేసి, వాళ్ల పిల్లలచదువులకీ రోగాలకీ సంపాదనంతా ఖర్చు పెట్టి అప్పులపాలయింది. ఎందుకలా చేసేవంటే, “వాళ్ళిద్దరూ నన్ను ఆత్మీయంగా చూసుకుంటారు” అంది. అది తనఇష్టం అన్నమాట నిజమే అనుకోండి. నేను ఇక్కడ ప్రతిపాదించదలుచుకున్న అంశం ఎవరు గానీ పెళ్ళి చేసుకోనంతమాత్రాన “ఒంటరి”గా మిగిలిపోరనే. అమ్మ భయపడ్డట్టు కామాక్షి “ఒంటరి” అయిపోలేదు. తను చనిపోయినప్పుడు వందల్లో వచ్చేరుట శిష్యగణం.

అలాగేవివాహజీవితం కాదని సంఘసేవకి అంకితమయినవారిని కూడా చేసేను. గుంటూరులో బాలకుటీర్ నడుపుతున్న మంగాదేవిగారు నాతో అన్నారు, “ఈ పిల్లలని అనాథలు అంటే నేనొప్పుకోను. నేనుండగా వాళ్ళు అనాథలెలా అవుతారు,” అని. ఇదంతా చూస్తుంటే ఈనాడు వివాహానికి వేరే నిర్వచనం ఏర్పడినట్టే, “కుటుంబం” అంటే కేవలం రక్తసంబంధీకులే కానక్కర్లేదని అని అర్థం అవుతోంది కదా. మరోలా చెప్పాలంటే, ఉమ్మడికుటుంబాలు పోయేయేమో కానీ ఆ మనస్తత్వాలు పోలేదు. ఈ ఉమ్మడికుటుంబంతాలూకు ఛాయలు జాలగ్రూపులరూపంలో ఆవిష్కరమయింది.

ఈ ఆలోచనలు నన్ను మరింత విస్తృతపరిథిలోకి లాక్కు పోయేయి. ఇటీవల వ్యక్తిగతస్థాయిలో స్నేహాలకి నేను స్వస్తి చెప్పేను. ప్రస్తుతం బయటిప్రపంచంతో నాసంబంధం అంతర్జాలానికి మాత్రమే పరిమితం. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఫేస్బుక్కులో virtual friends నాకు బాగానే దొరికేరు. ఉమ్మడికుటుంబంలో ఉండగల అభిమానాలూ, హాస్యాలూ, ఎత్తిపొడుపులూ, మూతి ముడుపులతోపాటు అసహనాలూ, స్పర్థలూ, ఆడిపోసుకోడాలూ – ఇవన్నీ అంతర్జాలంలో నూతనంగా రూపు దిద్దుకుంటున్నాయి.

ఒక్క మాటలో, ఒకనాటి ఉమ్మడికుటుంబాలు ఈనాటి గ్రూపురూపాలు.

గమనిక: విషయాన్ని చర్చించేవీ, విస్తరించేవీ అయిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపడును.

 

(జులై 2, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మేమంతా క్షేమం – 4 ఎవరూ ఏకాకి కారు!”

  1. సంఘ జీవనంలో కొన్ని అనివార్యమయినా వాటినునుండి భిన్నంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు…ఐతే ఆ భిన్నత్వం కొంత ఘర్షణని కలిగిస్తుంది దాన్ని ఎదురుకునే దిశలో వాళ్ళు కొంత విభిన్నం గా కనపడే అవకాశంఉంది అంటే మొండివారుగానో కోపదారులుగానో మనుషులపొడ పొసఁగని వారుగానో ..

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.