మేమంతా క్షేమం 5 – ఉత్తరాల్లో “నేను” నేనేనా?

మైత్రిగురించి వెనక రెండు మూడు టపాలు రాసేను (లింకులు చివర ఇచ్చేను). కానీ ఈ ఉత్తరాలసందర్భంలో మరో రకం ఆలోచనలు వచ్చేయి. అవే ఇవి.

స్నేహం విషయంలో అందరి అనుభవాలూ ఒక్కలాగే ఉండవు. స్నేహాలు ఎలా ఏర్పడతాయో నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. స్థలం, కాలం, సమాజంలో తమస్థాయి, కులం, గోత్రం, ఉద్యోగాలూ, అభిరుచులూ – ఏవైనా కావచ్చు ఇద్దరిని ఒకచోటికి చేర్చడానికి. ఎటొచ్చీ, నావిషయంలో ఒక సంగతి మాత్రం నిజం. నాకు నేనై ఎవరితోనూ స్నేహం చేసుకోడానికి ప్రయత్నించలేదు. నాస్నేహితులంతా వారు నన్ను ఎంచుకున్నందున మొదలయినవే. ఇప్పటికీ నానుంచి ఫోను అందుకునేవారు ఏడాదికొకరు కూడా లేరు. అందుకు ప్రత్యేకకారణం నేనేదో దిగొచ్చేననని కాదు. నాగురించి నాకున్న భయాలే నాకు అడ్డొస్తాయి. నాతో మాటాడ్డం వారికి ఇష్టం ఉంటుందో ఉండదో, వారికి నచ్చినపద్ధతిలో నేను సంభాషణ సాగించలేనేమో … ఇలా ఆలోచిస్తూ ఊరుకుంటాను. అందుకు తగ్గట్టు కారణాలు వెతుక్కుంటాను. పొద్దున్నా, సాయంత్రం, రేపూ, ఆదివారం, వాళ్లు పన్లో ఉంటారేమో, భోజనాలవేళేమో, శలవురోజు అతిథులు ఉంటారేమో ఇంట్లో … ఇలా నాకు నేనే సాకులు చెప్పుకుని వాయిదాలు వేసుకుంటూ పోతాను.

నా పూర్వమిత్రులు రాసిన ఉత్తరాలు చూస్తుంటే ఇప్పుడు కొత్తగా మరో విషయం స్ఫురించింది. వీరందరూ కోరినది నాస్నేహమా, వారు “ఊహించుకున్న మాలతి” న్నేహమా? వాళ్ళు ఊహించుకున్న “మాలతి” ఎలా ఉంటుంది?

అలా అనుకోడానికి కారణం ఆ ఉత్తరాల్లోని ఉదాత్త మధుర, మనోజ్ఞ భావాలు. అవి చదువుతుంటే ఒక్కొక్కరూ తమ ప్రవృత్తులని నామీదకి ప్రసరింపజేస్తున్నారేమో అన్న సందేహం కలిగింది నాకు. అలాటిసందేహం ఎందుకొచ్చిందంటే – సాధారణంగా ప్రతి హృదయం సృష్టిలో అందాలకి స్పందిస్తుంది. ముఖ్యంగా నవయౌవన్మేషణవేళ. వాళ్ళు కవితలు అంటూ పేరు పెట్టుకు ఏమీ రాయకపోవచ్చు. కథలు అల్లకపోవచ్చు. అలాటివారిలో చాలామంది అందమైన వస్తువు చూసినప్పుడు, తమ ఊహలని సుందరమైన పదాలలో ప్రకటితం చేస్తారు. అది ఈ ఉత్తరాలలో నాకు కనిపించింది. అవి చదువుతుంటే ఆ ఉత్తరాలు అందుకుంటున్న నేను కనిపించలేదు నాకు. రాసినవారి మనోభావాలే వాటినిండా!

యూనివర్సిటీకాలంలో ఒక స్నేహితురాలు. శలవులకి ఇంటికెళ్ళినప్పుడు రాసింది – When I think of you, I think of early dawn and its reflection in a dew drop అని. తరళబిందువులో ప్రతిఫలించిన ఉదయకిరణాల సోయగాలు! ఎంత అందమైన భావన! ఆరోజుల్లో అంటే 17, 18 ఏళ్ళవయసులో అటువంటి కమ్మని భావశకలాలు మనోఫలకంమీద నర్తిస్తాయి. ఆ తరవాత క్రమంగా డిగ్రీలూ, పెళ్ళిళ్లూ, పిల్లలూ, ఉద్యోగాలూ వంటి లౌకికవ్యాపారాల్లో పడినతరవాత ఈ సుందరభావాలకి చోటూ ఉండదు, కాలమూ దొరకదు నూటికి తొంభై పాళ్లు.

నేను అమెరికా వచ్చేక అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకున్నామేమో కానీ ప్రస్తుతం నాముందు ఉన్న ఒకే ఒక ఉత్తరం తన అన్న హఠాత్తుగా చనిపోయేయిన వార్త మోసుకొచ్చినది. చిన్నవాడే. యాభైలోపునే కావచ్చు. అసలు ఆ అమ్మాయి నాకంటే రెండు, మూడేళ్ళు చిన్న. నాకు పరిచయమైన 30 ఏళ్ళలోనూ తండ్రి రోడ్డుప్రమాదంలో పోయేరు. తరవాత అన్న, తల్లి, బావ, … 30-40 ఏళ్ళ వ్యవధిలో ఇన్ని మరణాలు ఒక వ్యక్తికి అనుభవమయితే ఆవ్యక్తి మానసికస్థితి ఎలా ఉంటుంది? “మీలాగ కర్మ అనుకోమంటావా. నేనలా అనుకోలేను,” అని రాసింది. మీలాగ అంటే హిందువులని. ఆవిడ హిందువు కాదు. కానీ నొప్పి అందరికీ ఒకటే కదా. మనసుని సమాధానపరుచుకోడంలో మతపరమైన తేడా ఉంటుందా? కర్మ కాకపోతే వాళ్లు మరేదో అనొచ్చు. ఎంత ఆలోచించినా ఈ ఉత్తరానికి నేనేం జవాబు రాసేనో జ్ఞాపకం రావడంలేదు. నేను అట్టే మాటాడకపోయినా నామీద తనకి ప్రత్యేకమైన అభిమానం ఉందనే అనుకుంటాను. వాళ్లనాన్నగారు పోయినప్పుడు మేమింకా యూనివర్సిటీలో చదువుతున్నాం. శలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది ప్రమాదం. తరవాత తిరిగి క్లాసులు మొదలయినప్పుడు వచ్చేక చెప్పింది నాకు 10 పేజీల ఉత్తరం రాసిందిట. అది నాకు అందలేదు. అప్పటికే కనీసం మా పోస్ట్‌మాన్‌కి తెలుసు నేను రచయిత్రిని అని. నిడదవోలు మాలతి, విశాఖపట్నం-2 అని కవరుమీద ఉంటే, నాకు అందేది. అలాటిది ఎంతో వేదనతో నాస్నేహితురాలు రాసిన ఉత్తరం నాకు అందలేదు. ఏమనుకోడం? మరి కర్మ అనుకోవాలా?

మధ్యాహ్నాలు క్లాసుకీ క్లాసుకీ మధ్య టిఫిను తినడానికి, విశ్రాంతికీ షష్ఠిపూర్తి మహల్ అని ఒక రెండు గదుల ఇల్లు ఉండేది. ఇప్పుడూ ఉందేమోలెండి ఆ ఆవరణలో. దానివెనక ఉన్న జీడి తోటల్లో ఇద్దరం తిరిగేవాళ్ళం మా విశ్రాంతి సమయాల్లో. అట్టే మాటల్లేవు. ఇద్దరం ఎవరి ఆలోచనల్లో వాళ్లు ములిగి తోటలో తిరిగేం. అది నాకొక మధురస్మృతి. ఆ తరవాత చదువు ముగిసి చెరో దారీ అయిపోయిన తరవాత, ఉత్తరాలు చాలా తగ్గిపోయేయి. దాదాపు 40 ఏళ్ళతరవాత మళ్లీ వాళ్ళఊరు వెళ్లేను తనని చూడడానికి. సాంఘికంగా బాగా పైకొచ్చింది, ఇల్లూ, కారూ, కొడుకూ, కోడలూ, మనవరాలూ … అన్నీ వరసగా లెక్కప్రకారం జరిగిపోయేయి.నేనంటే ఉన్న అభిమానం మారిపోయింది అనను కానీ తన వ్యక్తిత్వంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. నేనింకా తన ఊహల్లో ఉన్న నేనేనేమో కానీ తను మాత్రం నాఊహల్లో ఉన్ననాటి తను కాదు!

మరో ఉత్తరం తీసేను. అది నా 5వ ఫారం (10వ తరగతి)నాటి స్నేహితురాలు గత ఏడాది రాసిన ఉత్తరం. ఆనాటి మరొక క్లాస్మేటు అమెరికా వచ్చి, నా ఆచూకీ లాగి పట్టుకని, మాఇద్దరినీ మళ్ళీ జత కూర్చింది. ఆనాటి ఈశ్వరి మళ్లీ అదే స్థాయిలో “మల్లెపూవుల్లా పరిమళిస్తూ నీ ఉత్తరాలు …” అన్న వాక్యం చూసి ముగ్ధురాలినయిపోయేను. తనకి కూడా మధురోహలు అలాగే ఉన్నాయన్నమాట అనుకోకుండా ఉండలేకపోయేను!

కొందరు “అమ్మలా” “అక్కలా” అనో “నేను మీకూతురిని అనుకున్నా కోడలిని అనుకున్నా మీఇష్టం” అనో తేలిగ్గా అనేవాళ్లు చాలామందే తగిలేరు. ఈ చుట్టరికాలు కలుపుకోడం మనదేశంలో ఎక్కువనుకుంటాను. నన్ను మాత్రం వాళ్ళు అలా అనుకోడానికి నేనేం చేసేను అన్న సందేహం పట్టి పీడిస్తుంది.

60వ దశకంలో పరిచయమైన స్నేహితురాలు రాసిన ఒక ఉత్తరంలో “మనిద్దరిమధ్య వయోబేధం అట్టే లేకపోయినా, అమ్మ లేదన్న వేదన మరిచిపోయేలా చేసేవు,” అన్న వాక్యం చదువుతుంటే ఆ రోజుల్లో నేనేం చేసి ఉంటాను అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను కానీ ఒక్క సందర్భం కూడా తోచలేదు. అది నాకు సాధ్యం అని నేను అనుకోలేనసలు. ఆ అమ్మాయికి అలాటి సాంత్వన కలగడానికి తనే ఆ పరిస్థితికి మానసికంగా సిద్ధమయి ఉందేమో. నేను ఆ సమయంలో అక్కడ ఉండడం కాకతాళీయం. ఇంగ్లీషులో దీన్నే “తగుసమయం తగుస్థానం” అంటారు. కాలం, ఖర్మం కలిసి రావడం అంటాం మనం. ఇదంతా నాకు మరింత ప్రస్ఫుటంగా ఎందుకు మనసులో మెదులుతోందంటే, ఆ అమ్మాయి అమెరికా వచ్చినప్పుడు, నాకు మెయిలిస్తే, నేను జవాబు ఇవ్వలేదు. ఇవ్వలేకపోయేను. ఎందుకంటే ఆ రోజుల్లో “అమ్మతనం” ప్రదర్శించే స్థితిలో లేను. నాకు తెలుసు మీరు దారుణం అంటారని. సాధారణంగా ప్రతివారూ ఆనాటి నేస్తాలకోసం ఆవురావురని ఎదురు చూస్తుంటారు కదా. మరి నాకెందుకు జవాబివ్వాలనిపించలేదు అంటే నా మానసికస్థితీ, సామాజికస్థాయి కూడా అంత వ్యత్యస్తంగా మారిపోయింది కనక.

నేనెంత మారిపోయేనో ఎత్తి చూపుతున్నాయి ఆ ఉత్తరాలు. ఒక జీవితకాలంలో 30, 40 ఏళ్ళు అంటే దాదాపు సగం జీవితకాలం అనుకోవచ్చు. నేను చాలా మారిపోయేను. ఆనాటి ప్రవృత్తి ఇప్పుడు నాకు లేదు. నాఅభిప్రాయాలు చాలా మారిపోయాయి. నిజానికి ఒకరకంగా మొద్దు బారిపోయేనేమో కూడా. ఒకొక ఉత్తరం చదివి పక్కన పెట్టేసేను. నాలో ఏ స్పందనా లేదు సరి కదా చాలామంది చెప్పేలా, “చలించిపోయేను, మనసు ఆర్ద్రమయింది” అని కూడా అనిపించలేదు. నిర్లిప్తతతోనే చదివేను. ఇంకా ఏ దాపరికాలూ డొంకతిరుగుళ్ళూ లేకుండా చెప్పాలంటే, హాస్యాస్పదంగా కూడా అనిపించేయి. ఇంకొంచెంసేపు ఆలోచించేక, ఆనాటి స్వభావము అది. వారంతా వల్లమాలిన అభిమానాలు ప్రదర్శించేరు ఆ ఉత్తరాల్లో.

వాటికి నేనేం జవాబులు రాసేనో తెలీదు. ఇవి చూస్తుంటే పక్కన కూచుని సెల్ఫోనులో మాటాడేవారూ, పక్కన పడుకుని కలవరించేవాళ్లు తలపుకొచ్చేరు. అవతలివారు ఏం మాటాడుతున్నారో మనకి తెలీదు. వీరిమాటలనిబట్టి వారి మాటలు ఊహించుకోవాల్సిందే. ఇక్కడ ఐరనీ ఏమిటంటే నామాటలే నాకు తెలీదు. ఈఉత్తరాలు వారివ్యక్తిత్వాలని ఆవిష్కరిస్తున్నాయి. ఆ ఉత్తరాల్లో “నేను” నేను కానని నా అంతరాత్మ ఘోష పెట్టింది. ఇది మరో ఆలోచనకి దారి తీసింది.

గత పదేళ్ళలో నాకు పరిచయమైనవాళ్ళలో చాలామంది – ముఖ్యంగా నాబ్లాగుద్వారా పరిచయమైనవాళ్ళు – నాకు స్నేహబుద్ధి ఎక్కువే అనుకుంటారు. నన్ను అడిగితే అది సైబర్ స్నేహం సృష్టించే భ్రమ అంటాను. ఫేస్బుక్కు ప్రవేశించేక ఈ రీతి స్నేహాలు కొంచెం శృతి మించేయేమో అని కూడా అనిపించింది నాకైతే. ప్రధానంగా నీలితెరమాటున పుట్టి ప్రవరృద్ధమయిన స్నేహాలు కనక వీటిలో ఊహాగానాలకి ఆస్కారం అనంతం మరియు అపారం.

చిన్నతనంలో ఏ అరిసెముక్కో అయిపోతుందేమోనన్న బెంగతో కొసరి కొసరి కొరుక్కుతింటారు పిల్లలు. అలాగే స్నేహాలూను – స్కూల్లో కలిసిన స్నేహితులు చదువయేక ఉద్యోగాలు వెతుక్కుంటూ మరో ఊరు పోతారేమో. పొరుగింటిఅబ్బాయి మరోయింటికి మారిపోయి దూరం అవుతాడేమో. ఆఫీసులో స్నేహితురాలు పెళ్ళి చేసుకు మరో ఊరు వెళ్లిపోతుందేమో అనుకుంటూ అనుక్షణం తపన పడిపోతారు. పెద్దయేక ఇవన్నీ సర్వసాధారణమే, ఈ స్నేహాలలో చాలా భాగం ఇలాగే ముగుస్తాయి అని గ్రహిస్తారు. ఆ భావనకి అలవాటు పడిపోతారు. నేను పడిపోయేను.

నా అమెరికను స్నేహాలు మరోరకంగా సాగేయి. సూక్ష్మంగా పట్టి చూస్తే, అలనాటి మిత్రత్వాలు మనసుని తాకేవి అయితే అమెరికనులతో స్నేహాలు మెదడుకి మేత పెట్టేవి అయేయి. విదేశీయులు మనవాళ్ళలా బంధుత్వాలు కలుపుకోరు. ఆత్మీయతలు వెల్లడించినా గజం దూరంలో నిలబడే. అమెరికనులకి నేనొక “స్టడీ.” మన సంస్కృతిగురించి తెలుసుకోడానికి కోరిక గలవారే నాతో స్నేహం చేస్తారు. అలాటివారు నాకు ముగ్గురు బాగా దగ్గరయేరు. నేను విస్కాన్సిన్‌లో ఉన్నప్పుడు పరిచయం అయి, తరవాత ఊరు మారినా పరిచయం నిలుపుకుంటూనే వచ్చేరు ఉత్తరాలద్వారా.

వారిగురించి వచ్చేవారం చెప్పి ముగిస్తాను.

——-

స్నేహాలమీద పాతరాతలకి లింకులు

నేనెవరో చెప్పుకో చూదాం ఇక్కడ

మిత్రభావము సేసి 1 – ఇక్కడ

మిత్రభావము, 2 ఇక్కడ

 

(జులై 8, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.