మేమంతా క్షేమం 6 – నా అమెరికన్ మిత్రులు

అమెరికాలో నాస్నేహాలన్నీ ప్రధానంగా జాతి ప్రాతిపదికమీద రూపొందినవే. తెలుగువాళ్లయితే “మనం, మనం” అనీ, అమెరికనులయితే జాతి నేపథ్యంలోనూ అభిరుచులూ, ఆశయాలూ చోటు చేసుకున్నాయి. నాకు అమెరికాలో ఎదురైన ప్రతివారూ కాక “స్నేహాలు” అని చెప్పుకోదగ్గవి సుమారు 5, 6 ఉన్నాయి. ప్రస్తుతం నేను ఏ స్నేహాన్ని స్నేహం అంటానన్న విషయం విశదం చేయడానికి ఇక్కడ ఇద్దరిగురించి సూచనప్రాయంగా చెప్తాను. ఇద్దరూ కూడా “అమెరికన్” విశేషణానికి అతీతులే ఒక విధంగా చూస్తే. ఇది చదివినతరవాత మీకు “ఇలాటి అమెరికనులు కూడా ఉంటారా?” అనిపిస్తే నేనేమీ చెప్పలేను. నాకు మాత్రం వీరు నా సాహిత్యప్రస్థానానికీ, కొంతవరకూ అస్తిత్వానికీ కూడా బలం ఇచ్చేరు.

మొదటి వ్యక్తి – ఈకథనంకోసం ఆమె పేరు బిజీ అనుకుందాం. యూనివర్సిటీలో నేను తెలుగుపాఠాలు చెప్తున్న రోజుల్లో ఆమె తమిళసాహిత్యం అధ్యయనం ప్రారంభించింది. తనకి ఆ అభిరుచి ఎలా ఏర్పడిందో నాకు తెలీదు. అడిగే ఉంటాను కానీ జవాబు తను ఏం చెప్పిందో ఇప్పుడు జ్ఞాపకం లేదు.

సాధారణంగా ఇలాటివారు నాలాటివారితో స్నేహం చేయడానికి కారణం తమ సంస్కృతిలో లోటుపాట్లూ, మన సంస్కృతియొక్క ఘనతా గురించిన విశ్వాసాలు సుమారుగా మనవారి విశ్వాసాలనే పోలి ఉంటాయి. అవి సూక్ష్మ పరీక్షకి నిలబడగలవా అన్నది అప్రస్తుతం. వీరితో మనకి స్నేహాలూ తేలిగ్గా కుదురుతాయనీ, సంభాషణలూ, ప్రవర్తనా కూడా వాటిననుసరించే ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. బిజీతో నాకు స్నేహం ఏర్పడడానికి అదే కారణం.

నాకు తనతో పరిచయమయింది 80వ దశకంలో నేను యూనివర్సిటీలో తెలుగు పాఠాలు చెప్పేరోజులలో. అప్పటికే ఆమె వయసు 40 దాటి ఉండవచ్చు. అంటే మిగతా విద్యార్థులకంటే కొంచెం పెద్ద. మా ఇద్దరికీ ఉభయసామాన్యమైన విషయాలలో మొదట చెప్పుకోవలసింది సాంస్కృతికం. ఇద్దరకీ కూడా రెండు సంస్కృతులపట్ల గల అవగాహనతోపాటు జనబాహుళ్యంలో గల అపోహల విషయంలో కూడా ఏకాభిప్రాయమే. అంచేత వాటిగురించి ఏ అరమరికలూ లేకుండా స్వేచ్ఛగా వ్యాఖ్యానించుకుంటూ వచ్చేం. రెండోది అనువాదాలు. తను తమిళకథలూ నేను తెలుగు కథలూ అనువదిస్తూండడంచేత అనువాదం విషయాలలో అనేక అంశాలు చర్చించుకునే అవకాశం కలిగింది మాకు.

ఇప్పుడు ఆ పాత ఉత్తరాలు తీసి చదువుతుంటే కథలు చదువుతున్నట్టుంది. ప్రధానంగా ఇంత కాలం అయిపోయినతరవాత, “ఉత్తరాలకి” ఉండే ఆవశ్యకత తొలగిపోయి, కథనస్థాయి సంతరించుకున్నాయి అవి. చిన్నపిల్లలు కళ్లూ చేతులూ ఆడిస్తూ, చుక్కలూ తోకచుక్కలూ లేకుండా ప్రవాహంలా చెప్పుకుంటూ పోయినట్టు సాగిపోయేయి ఆ ఉత్తరాలలో వాక్యాలు. చేత్తోనే రాసినవి కొన్ని, పాతకాలపు రెమింగ్టన్ టైపురైటరుమీద టైపు చేసినవి కొన్ని.

మా ఇద్దరి జీవనవిధానాలు అతిసామాన్యమైనవే. తనగదిలో టీవీ లేదు. కారూ, కంప్యూటరు బహు పురాతనమైనవి. 90వ దశకంలో కూడా మోడెమ్ ఎలా సెటప్ చేయాలో తెలీక, ప్రయత్నిస్తే కంప్యూటరు విరిగిపోతుందేమోనన్న పిరికితనంతో చేత్తోనే రాయడానికి నిర్ణయించుకున్నాను అని రాసిందంటే మీరు ఊహించుకోవచ్చు ఆమె తత్త్వం.

అంటే తెలివితేటలు లేవని కాదు. యంత్రాలయందు తనకి గల విముఖత అది. నిజానికి బిజీ సూక్ష్మగ్రాహి. “తమిళసమాజంలో మానవయత్నం, కర్మ” అన్న అంశంమీద పిహెచ్.డి చేసింది. కొంతకాలం తమిళనాడులో ఉండి సమాచారం సేకరించింది. చాలామందిలా పిహెచ్.డి అయిపోగానే ఉద్యోగం రాలేదు. ఆ డిపార్ట్‌మెంట్లు అలాటివి. ఈ South Asian Languages studies ఉత్సవవిగ్రహాలలా యూనివర్సిటీలవాళ్లు ఘనంగా చెప్పుకోడానికే కానీ కూడు పెట్టేవి కావు చాలా మటుకు. వాటికి కావలసిన చెక్కభజనలు కూడా బిజీకి అలవాటు లేదు కనక ఉద్యోగం అంత తేలిగ్గా దొరకలేదు. కొంతకాలం అయేక, వాషింగ్టన్ యూనివర్సిటీలో తాత్కాలికంగా చేరింది. దరిమిలా అక్కడే స్థిరపడింది. ఈ ఉత్తరాలన్నీ అక్కడున్న 15 ఏళ్ళలో రాసినవే.

ఒక ఉత్తరంలో ఊరు మారడంగురించి రాస్తూ, “ఇక్కడ (అమెరికాలో) చాలామంది మార్పు భరించలేరు. కాళ్లకింద తివాసీ లాగేసేవరకూ అలా జరగగలదన్న, అలా జరిగితే తామేం చెయ్యాలో ఆలోచించుకోవాలన్న ఆలోచన లేనివాళ్ళు.”

మామూలుగా నాతో అంతో ఇంతో పరిచయం ఉన్నవారు నాది wry humor అంటారు. ఈ పదానికి తెలుగేమిటో నాకు తెలీదు. వక్ర, వికృత లేదా విపరీత హాస్యం అనవచ్చునేమో. ఈ కార్డు ఒక ఉదాహరణ తన హాస్య చతురతకి.
DSC02376ఈ కార్డులో విద్యావిధానంగురించీ, తనక్లాసులో విద్యార్థుల స్పందనలగురించీ వ్యాఖ్యానించింది. వాళ్లమొహాలు చూస్తే – బయట కనిపిస్తున్నది అస్థిరం, అమానుషం అయిన పిచ్చిమాలోకం. బయట ప్రపంచంలో కాలు మోపేక, తమని తాము సంబాళించుకుని, తాము సాధించవలసినవాటిలో ఏది ముందో ఏది వెనకో జాగ్రత్తగా బేరీజు వేసుకుని చూసుకోవాలి. ఈ విద్యాసంస్థలేమో పనికి మాలిన, ఎందుకూ కొరగాని నీతులూ, విలువలూ తమ బుర్రల్లోకి కూరుతున్నారు – అన్నట్టు ఉంటాయిట. బిజీ చాలా చక్కగా వర్ణించింది కానీ అనువాదంలో ఆ సొగసులు తప్పిపోయేయి. ప్చ్.

మరో ఉత్తరంలో ఇప్పుడు మనుషులు ఉత్తరాలు రాయడం ఎందుకు మానేసేరు? అని ప్రశ్నించి, తాను ఇచ్చుకున్న జవాబు – ఒక కాయితంమీద ఉత్తరం రాసి, దాన్ని ఐమూలలుగా మూడువేపుల మడిచి అంటించిన మరో కాయితంలోకి జొనిపి, దానివెనక మరో చిన్న చదరపు ముక్క అతికించి, బయట ఏ వీధిచివరో ఉన్న ఒక రేకుడబ్బాలో పడేయడం శ్రమతో కూడిన పని అని కాబోలు అని. ఆవిడ ఏ విషయం తీసుకున్నా ఇలా సుదీర్ఘ వర్ణనలే!

నాకు ప్రత్యేకించి నవ్వు తెప్పించిన ఉత్తరం – తన పూర్వ సంచయం తీసి చూస్తుంటే కనిపించిన కొన్ని కథలగురించి రాసినది. “వీటిలో అనుకోకుండా కనిపించిన కథల్లో ఒకటి పా. పద్మరాజు కథ, రచయితే అనువదించింది. రెండోది వి. సేతునారాయణన్ కథ, అనువాదం అల్ కార్ల్సన్. వాటిని చులాగ్గా విసిరిపారేశాను. దీంతో (జత పరిచిన) ఈ రెండు కథలు వెంటనే ప్రజలలో పడేయకపోయినా, భవిష్యత్తులో వాటికి మోక్షం ఉంటుందేమో.”

నేను నవ్వుకున్నది పద్మరాజుగారిమీద గౌరవం లేక కాదు. ఒక విదేశీ పాఠకుడిదృష్టిలో వాటివిలువ ఏమిటి అని ప్రశ్నించుకుంటే బిజీ చర్య నవ్వు తెప్పించింది. అందులోనూ బిజీకి దక్షిణాంధ్ర సాహిత్యం, సంస్కృతీ అంటే గౌరవం గలది కనక.

అంతకు పూర్వం మేమిద్దరం ఒక జాతివారికథకి మరొక జాతివారు ఎలా స్పందిస్తారు అన్న విషయం చాలానే మాటాడుకున్నాం. ఆ నేపథ్యంలో పద్మరాజుగారి అనువాదం ఆమెని ఆకట్టుకోలేకపోవడానికి కారణం ఏమైయి ఉంటుంది అని కొంచెంసేపు ఆలోచించేను.

“పద్మరాజుగారు తెలుగుకథకి అంతర్జాతీయఖ్యాతి తెచ్చేరు” అని మనవాళ్ళు వేదికలమీదా వ్యాసాల్లోనూ పదే పదే చెప్తారు. కానీ ఆరు దశాబ్దాలక్రితం (ఉత్తరం రాసేనాటికి నాలుగు దశాబ్దాలే) ఒక కథకి ఒక బహుమతి వస్తే సరిపోతుందా తెలుగుకథకి గొప్ప ఖ్యాతి వచ్చేసిందని మనం చాటుకోడానికి? ఖ్యాతి అంటే ఆ రచయితపేరు కానీ ఆ కథ కానీ విదేశాలలో అనేకమంది పాఠకులదృష్టిని ఆకర్షించాలి. అంతే కానీ కేవలం తెలుగువాళ్ళు తెలుగువాళ్ళమధ్య కూర్చుని తెలుగువాళ్లతో మాత్రమే పదే పదే చెప్పుకోడాన్ని “అంతర్జాతీయ ఖ్యాతి” అని అనగలమా?

బిజీ ఉదహరించిన రెండో రచయిత సేతునారాయణన్ తమిళరచయిత కావచ్చు కానీ జాలంలో వెతికితే ఆ పేరు కనిపించలేదు. “జత పరిచేను” అని రాసింది కానీ మరిచిపోయినట్టుంది. నాకు అందలేదు.

మరొక ఉత్తరంలో పద్మరాజుగారి కథ కాదు కానీ మరొక కథవిషయంలో తన స్పందనా, దానికి కారణాలూ వివరించింది. నేను వెనకటివ్యాసాల్లో ప్రస్తావించేను ఒక జాతివారి కథలు మరొక జాతివారికి అర్థమవాలంటే అనువాదం వారి ఆలోచనలూ, స్ఫూర్తి తెలుసుకుని ఆ కోణంలోనుండి చేయాలని. బిజీ మాటల్లో మరొక కోణం కనిపించింది.

తన అనువాదం పునః పరిశీలిస్తుంటే, తాను అమెరికనులకి సర్వసాధారణమైన భ్రమలే ఆ అనువాదంలో కనిపించి, తనని కలవరపరిచేయి అని రాసింది. ఉదాహరణకి మనకథల్లో మనం చిత్రించే అభిమానాలూ, ఆత్మీయతలూ వారికి చిన్నపిల్లల చేష్టలలా అపరిపక్వంగానో నటనగానో తోచే అవకాశాలే ఎక్కువ మనం అనువాదం సరిగా చేయకపోతే. బిజీ అనువదిస్తున్న ఒక కథలో ఒక స్త్రీ పాత్ర చిత్రణగురించి తను కూడా అందరు అమెరికనులలాగే ఆ పాత్ర మరీ చిన్నపిల్లలా ప్రవర్తించింది, మాటాడింది అనే అనుకుందిట. తరవాత తరిచి చూసుకుని, తాను ఆ అభిప్రాయానికి రావడానికి కారణం ఆలోచిస్తే, తన వెనకటి అనుభవాలు అని తెలిసింది. ఇది అనువాదకులందరూ ఆలోచించికోవలసిన ఒక ముఖ్యమైన కోణం అని అనిపించింది నాకు. మనం కథని మరొకరికోసం భాషాంతరీకరణ చేస్తున్నప్పుడు మన ఆంతర్యంలోకి పరీక్షగా చూసుకోవలసిన అగత్యం కూడా ఉందని ఆ ఉత్తరంద్వారా నాకు స్పష్టమయింది.

ఉల్లిపొరల్లా ఎన్ని పొరలు ఈ అనువాదంలో! ఇంగ్లీషులో palimpsest అని ఒక పదం ఉంది. పూర్వం తాటాకులమీద రాసింది చెరిపి దానిమీద మళ్ళీ రాసేవారుట. అలా చెరిపినప్పుడు, వెనకటి రాత పూర్తిగా చెరిగిపోదు. లీలగా అడుగుపొరల్లో ద్యోతకమవుతుంది అంటారు. అలాగే తరతరాలుగా మనరక్తంలో జీర్ణించుకుపోయిన నమ్మకాలూ సంప్రదాయాలూ కూడా కదా. జాగ్రదవస్థలో మనం వాటిని అధిగమించేం అనుకున్నా, అట్టడుగు పొరల్లో వాటిఛాయలు మనకి తెలియకుండానే మన మాటల్లో చేతల్లో (ఇక్కడ అనువాదాల్లో) చోటు చేసుకోవచ్చు. బిజీ భావాలు క్రోడికరిస్తే సుమారుగా ఇలా ఉన్నాయి.

నాసంస్కృతి మా అనుకుందాం. బిజీ సంస్కృతి.
1. మా విలువలూ, సంస్కృతి
2. బిజీ ఒక వ్యక్తిగా తన విలువలూ, సంస్కృతి,
3. సామూహికంగా వారి జాతిలో పాతుకుపోయిన విలువలు, విశ్వాసాలు.
4. మా కథ బిజీ జాతివారికోసం చేసిన అనువాదం
5. మా కథ బిజీ జాతివారికోసం బిజీ చేసిన అనువాదం
ఇవి చాలవనుకుంటే మరో కోణం చూడండి – మా బిజీ జాతివారికోసం చేసిన అనువాదం మా జాతివారిదృష్టిలో ఎలా ఉంటుందన్నది.

మరో ఉదాహరణ తీసుకోండి అసందర్భమే అయినా. సాధారణంగా నిష్పాక్షికంగా విమర్శిస్తాను అన్నవారిలో కూడా అంతో ఇంతో పక్షపాతం ఉండకతప్పదు. వారు కొన్ని ప్రమాణాలు ఎంచుకుని ఆ ప్రమాణాలప్రకారం విమర్శిస్తారు. ఆ ప్రమాణాలు వారి అభిరుచులకి అనుగుణంగా ఉంటాయి. అంచేత నిష్పాక్షిక విమర్శ అన్నది సైద్దాంతిక వాస్తవం మాత్రమే. అనువాదాలూ అంతే.

ఒకొకటే తీసి చూస్తుంటే మరో ఉత్తరం కనిపించింది. ఆవిడ వాషింగ్టన్ వెళ్ళేక తన జీవనసరళిలో తప్పనిసరిగా చేసుకోవలసివచ్చిన సవరణలగురించి రాస్తూ, “నా అంతర్మథనం కొనసాగుతోంది బయటి ప్రపంచంతో కుస్తీ పట్టడానికి. … చిన్న అర్జునకాండ అనుకో. కర్మ సన్యాసం నాకు సరిపడదు. కర్మఫలం సంగతి కాదు. నేనంటున్నది యుద్ధరంగంలో నిలిచి పోరాడడం సంగతి. అర్జనుడు యుద్ధభూమి ప్రవేశించి నిలబడగలిగేవాడా ఆ కవచాలూ, ఆయుధాలూ, మద్దతు ఇస్తూ పక్కన శ్రీకృష్ణుడు లేకపోతే? అసలు నా యుద్ధానికి మరింత ఆత్మశోధన కావాలి. నేను కేవలం నిష్పాక్షికంగా నాలోపాలను పరిశీలించి చూసుకోవాలి. తన్మూలంగా కొంతవరకూ మానసికంగా కొంత బలం సముపార్జించుకుంటున్నానేమో కానీ మళ్ళీ ఆ వెనువెంట కొత్త ప్రశ్నలు బయల్దేరుతున్నాయి … రానున్నకాలంలో ఇది నాకు అర్థవంతమైన జ్ఞానం గలిగించి నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చి దిద్దుతుందేమో!”

చివరిసారిగా మాడిసన్‌లో తన స్నేహితులని చూసి, తన మిగతా సామాను తీసుకుపోడానికి వస్తున్నాననీ, నన్ను కలుసుకోవాలని ఉందనీ రాసింది. సంతోషంగా ఆహ్వానించేను మాఇంట్లో ఒక రోజు గడపమని.

తన వేరే స్నేహితులఇంట్లో దిగింది. అనుకున్న ప్రకారం ఒక పూట మాయింటికి వచ్చింది. తన నియమిత ఆహారం తనే తెచ్చుకుంది. తనని చూస్తుంటే అస్థిపంజరం మాటాడుతున్నట్టుంది. నాకేం మాటాడ్డానికి తోచడం లేదు. బిజీ మాడిసన్లో ఉన్నప్పుడు తమిళ కథల అనువాదం విషయంలో ఒక తమిళ స్త్రీని సంప్రదించేదని నాకు తెలుసు. అది జ్ఞాపకం వచ్చి “ఆమెని పిలవనా?” అని అడిగేను.

బిజీ చేతులు జోడించి, నీరసంగా నవ్వుతూ, “ఒద్దొద్దు. దయచేసి ఆవిడకి మాత్రం చెప్పకు. ఆవిణ్ణి భరించే ఓపిక నాకు లేదు,” అంది. ఆ తమిళ స్త్రీ బోళాతనం నాకు బాగానే అనుభవం. శిష్టజనవ్యవహారాలకి సంబంధించిన పడికట్టు పదాలూ, సాంఘికగురువులు చిన్ముద్ర పట్టి ఉద్బోధించే సంఘాచారాలు కంఠతా పట్టి ఆచరణలో పెడుతున్న నమూనా మనిషి ఆవిడ.

బిజీ మాట విని నేను నవ్వి ఊరుకున్నాను. మాయింట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ శబ్దాలూ వినిపించవు. ఎదురుగా patio అద్దాలతలుపుల్లోంచి ఈచివరినుండి ఆ చివరకి విస్తరించిన పచ్చని వృక్షసంపద చల్లగా నయనానందం చేస్తుంది. ఆ ప్రశాంతతని ఆస్వాదించి ఆనందిస్తున్న ఆమెని చూస్తూ నేను కూర్చున్నాను. కొంచెంసేపయిన తరవాత భగవద్గీతలో ఒక అధ్యాయం చదవమని అడిగింది.

“ఏ అధ్యాయం?”

“నీఇష్టం.”

నేను భగవద్గీత తీసుకొచ్చి మోక్షసన్యాస యోగం చదివేను. బిజీ నాకు ఎదురుగా మఠం వేసుకు కూర్చుని కళ్ళు మూసుకుని వింది. మాఇద్దరి జీవితాల్లోనూ అదొక ప్రత్యేకమైన రోజు అనిపించింది నాకు.

ఆ తరవాత ఆమె అట్టే కాలం బతకలేదు. బిజీ మరణించిందని మరొక స్నేహితురాలు నాకు చెప్పి, స్మారకసభ పెడుతున్నాం రమ్మని పిలిచింది. సాధారణంగా స్మారకసభలకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ బిజీయందు గల గౌరవంచేత వెళ్ళేను. గుమ్మందాకా వెళ్ళి లోపలికి చూసేను. మైకు పుచ్చుకుని మాటాడుతున్న తమిళ వనితని చూడగానే గతుక్కుమన్నాను. గుమ్మందగ్గరే ఆగిపోయి ఆవిడమాటలు విన్నాను రెండు నిముషాలపాటు. బిజీ తనూ ఎంత ప్రాణస్నేహితులో, తామిద్దరూ కలిసి అనువాదాలలో ఎంత కృషి చేసేరో వివరంగా చెప్తోంది కళ్ళు ఒత్తుకుంటూ. మొత్తం దృశ్యం నాకు రంగస్థలంమీద నాటకంలా తోచింది. తనని పిలుస్తానని చెప్పినప్పుడు బిజీ అన్నమాటలు గుర్తొచ్చేయి. నాకు లోపలికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. గిరుక్కున తిరిగి ఇంటికొచ్చి పడ్డాను. స్నేహం అన్నపదంలోని సూక్ష్మధర్మం వివరించడానికి ఇంత కథ చెప్పవలసివచ్చింది.

బిజీ వాషింగ్టన్ యూనివర్సిటీలో religious studies డిపార్ట్‌మెంటులో దాదాపు 10 ఏళ్ళపాటు పని చేసింది. ఇప్పుడు ఈ వ్యాసంకోసం జాలంలో వెతికితే 5,6 పుస్తకాలలో ఆమె సహాయసహకారాలకి కృతజ్ఞతలు కనిపించేయి. ఆమె ఉద్యోగపర్వం అట్టే కాలం సాగకపోయినా ఉన్నంతలో సాఫల్యం సాధించుకున్న జీవితం అనిపించింది. ఆమె డాక్టరేటు సిద్ధాంతం ప్రస్తుతం అలభ్యం. ఇతర అనువాదాలు Academic journalsలో కనిపించేయి. జీవించింది ఐదున్నర దశాబ్దాలే అయినా ఇంతమందిని ప్రభావితం చేసినందుకు, నాకు ఆమెపరిచయం కలిగినందుకు సంతృప్తిగా ఉంది.

బిజీ స్నేహంలో మేం ఇద్దరం ఎదిగేం. మా ఇద్దరి ఆలోచనాసరళీ ఇద్దరికీ ఉపయోగపడింది. (నాఆలోచనలు తనకి ఉపయోగించేయని ఆమె రాసిన వాక్యాలు ఇక్కడ నేను ఉదహరించడం మర్యాద కాదు కనక చెప్పలేదు.స్నేహం కొనసాగించింది కనక ఏదో పనికొచ్చేననే అనుకుంటున్నాను :p)

మరొక అమెరికన్ స్నేహంగురించి వచ్చేవారం రాస్తాను.
—-
(జులై 15, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.