మేమంతా క్షేమం 7 – ఇంతే సంగతులు, ఇట్లు

బిజీలాగే నాతో స్నేహం కలుపుకున్న మరొక వ్యక్తి ఫ్రాన్సిస్. ఎలా చూసినా నాకంటె పది రెట్లు అధికులు. వయసులో కూడా పెద్దవారే. యూనివర్సిటీలో సంస్కృతం ఫ్రొఫెసరు. కొంతకాలం డిపార్ట్‌మెంట్ ఛైర్ పదవి కూడా నిర్వహించేరు. స్వతహాగా పార్టీలూ social networking పట్టించుకోని వ్యక్తి. మాటాడుతున్నప్పుడు తప్పిపోయిన ఒకొక పదం వెతికిపట్టుకు పలుకుతున్నట్టు నెమ్మదిగా మాటాడేవారు. మేం ఇద్దరం సమస్థాయి అయినట్టు నాతో సంభాషణ సాగించేవారు. నేను వారిస్థాయి కాదు అన్న స్పృహ నాకు ఉంది అది మా సంభాషణకి ఆటంకం కాలేదు.

ఇంక భాషాపాటవం మాటకొస్తే, నాతమిళం వాంగో పోంగో వరకు, సంస్కృతం రామః రామౌ రామాః వరకు. నాకు తమిళం అట్టే రాదని చెప్పినా బిజీ ఉత్తరాల్లో తమిళపదాలు రాసేస్తూండేది. ఒకసారి మొత్తం ఉత్తరం అంతా తమిళంలోనే రాసేసింది. అది ఇప్పటికీ నాదగ్గరుంది. ఎవరిచేతనైనా చదివించుకుందాం అంటే తను వ్యక్తిగతవిషయాలు ఏమైనా రాసి ఉంటే, మరొకరిచేత చదివించడం న్యాయం కాదు కదా. అలాగే ఫ్రాన్సిస్ కూడా నాసామర్థ్యంమాట వదిలేసి, తన కృషిగురించి మాటాడుతుండేవారు.

నాలుగైదు నెలలకోమారు ఆవిడే పిలిచేవారు కలుద్దాం రమ్మని. నాకు నేనై ఎప్పుడూ పిలవలేదు.మేం సాధారణంగా ఏ కాఫీ షాపులోనో, పుస్తకాలదుకాణంలోనో కలుసుకునేవాళ్ళం. మాడిసన్లో రెండు పుస్తకాలదుకాణాల్లో అలాటి వసతి ఉంది. క్రమం తప్పకుండా ప్రతి ఏడూ ఠంచనుగా గంట కొట్టినట్టు జనవరి 1వ తేదీ శుభాకాంక్షలు కార్డు పంపుతారు. మధ్యలో కూడా అప్పుడప్పుడు అందమైన కార్డులు పంపుతారు. కానీ విశేషాలేం ఉండవు.

ప్రస్తుతం 1998లో ఆవిడ రాసిన ఉత్తరం చూస్తున్నాను. అప్పటికి విస్కాన్సిన్లోనే ఉన్నాను. ఉత్తరం రాయడానికి కారణం ఒక్కటే. కొత్తగా తొలిసారిగా లాప్టాప్ కొన్నారు. దానిమీద సంస్కృతం ఫాంట్సు, ఇమెయిలులాటి కొన్ని సౌకర్యాలు నేను ఆవిడకి చూపించేను. కంప్యూటరు వాడకం ప్రారంభించిన ఉత్సాహంతో రాసిన ఉత్తరం అది.

ఆవిడ కొంతకాలం పుణేలో దక్కన్ కాలేజీలో ఒక సంస్కృతం ఆచార్యులవద్ద చదువుకున్నారు. కృష్ణకర్ణామృతంమీద కృషి చేస్తుండగా గంగాదేవి విరచిత మధురావిజయం చూసేరుట. నాకు పరిచయం అయేనాటికి మధురావిజయం అనువాదం చేస్తున్నారు. ఉత్తరంలో ఆవిడ ప్రస్తావించిన మరొక అంశం – తాంత్రిక్ అన్న పదం ప్రధానంగా ప్రార్థనావిధానం వివరించేదే సంబంధించినదే కానీ లోతైనతాత్త్విక చర్చ కాదనీ, అలా అనడానికి ఆధారం దేవీసప్తశతిక చూస్తే కనిపిస్తోందనీ అన్నారు. సౌందర్యలహరిగురించి కూడా అప్పట్లో కొంచెం మాటాడుకున్నట్టుంది ఈ ఉత్తరం చూస్తుంటే. “ప్రస్తుతం నాదగ్గరున్న అనువాదం నాకంతగా నచ్చలేదు. హాంక్ చేసిన అనువాదం కొంత నయం. ఆయన అందులోని రసవిశేషం బాగా పట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన అనువాదాలు నాకు ఎక్కువ నచ్చుతాయి,” అని, “స్త్రీవాదులకి సంస్కృతభాష పొడ కిట్టదనుకుంటాను” అని జోడించేరు. ఆవిడకి ఎవరో South Asian పండితుడొకాయన చెప్పేరుట ఇంతవరకూ ఎవరూ ఆ గ్రంథంమీద కృషి చేయలేదని. ఆ పండితులు అలా ఎందుకన్నారో కానీ జాలంలో నాకు అనువాదాలు కనిపించేయి మరి.

ఆవిడ నారచనలని, ముఖ్యంగా అనువాదాలు చాలా ప్రోత్సహించేరు. అవి చదివి తన అభిప్రాయాలు చెప్పేవారు. నాతొలి సంకలనం, Short stories from Andhra Pradesh (Jaico publication)కి ముందుమాట రాసేరు. అంచేతే నాకు ఆవిడతో స్నేహం హర్షదాయకంగా ఉంది.

చిన్నతనమే అయినా చెప్పుకోక తప్పదు. నాకు ఇలాటి స్నేహాలు తెలుగువారిలో ఒకరిద్దరితో తప్పిస్తే కూడలేదు. దాదాపు అందరూ నాకథలూ గట్రా చదివేం అంటూ మొదలు పెడతారు కానీ, మూడో చుట్టుకి సాహిత్యం వదిలేసి, గాలికబుర్లలోకి దిగిపోతారు. అక్కడినుంచి మాఅమ్మా, తమ్ముడూ, మాఆయనా లేదా ఆవిడా, కొడుకులూ, కూతుళ్లూ … ఇంతే. ఇలాటివి కొంతకాలం బాగానే ఉన్నాయేమో కానీ రాను రాను అవే విశేషాలు పునరావృతం కావడంచేత నాకు విసుగేయడం మొదలయింది. కొత్తగా పరిచయం అయినవారయినా అంతే. సాహిత్యసభలకెళ్తే “మీ కథలు చదివేను” అన్నవారు ఒక్కరూ కనిపించలేదు ఇంతవరకూ. “మీఆయన్ని చూసేం” అన్నవాళ్ళు కనీసం ఇద్దరయినా తగుల్తారు, నేనేదో ఆయన్ని వెతుకి పట్టుకోడానికే అక్కడికి వెళ్ళినట్టు!

ఈ స్నేహాలతో, పరిచయాలతో చాలాకాలం సతమతమయేను. ఇతరులస్నేహాలు పరీక్షించి అవలోకించేను. నేను గ్రహించింది సాధారణంగా ఆదిని సాహిత్యచర్చలతో మొదలయినా, అనతికాలంలోనే ఆ కబుర్లు వ్యక్తిగతస్థాయికి చేరి, ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళడం, సన్నిహిత మిత్రులు అయిపోవడం, కలిసి ఊళ్ళు తిరగడంలాటివి జరుగుతున్నాయి. నాపట్ల అది జరగలేదు.

ఫ్రాన్సిస్‌తో కూడా ఇంట్లో కలవడం, విహారయాత్రలు లేవు కానీ మా సంభాషణలు మాఇద్దరి సాహిత్యవ్యాసంగ పరంగానే కొనసాగడంచేత నాకు ఆ స్నేహం ఆనందదాయకమయింది.

నా ఉత్తరాలగుట్టముందు కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తుంటే గత 10 ఏళ్ళలోనూ – అంటే తూలిక సైటూ, తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించేక, నా స్నేహాలన్నిటిలోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది నాతో సంభాషణలు అవతలివారి అధీనంలో ఉండడం. ఎప్పుడు పిలుస్తారు, ఏం మాటాడతారు అన్నది వారే నిర్ణయిస్తున్నారు. అది వారికి బాగుంది. మరి నాకు బాగుందా? అని సుదీర్ఘంగా ఆలోచించేను. లేదు, నాకు బాగులేదు అని తేల్చుకున్నాక ఆ స్నేహాలు కొనసాగించాలన్న సరదా ఆవిరయిపోయింది.

మామూలుగా ప్రాపంచికవిషయాలమీద ఆసక్తి తగ్గిపోయేక, జనులు పూర్వకాలంలో వానప్రస్థం స్వీకరించి అరణ్యాలకి వెళ్ళిపోయేవారుట. అక్కడ తరులతాగుల్మాలు, శుకపికాలూ హరిణశాబకాలూ మందమారుతాలు వారికి చక్కని స్నేహపూరితమైన మరియు సాంత్వనచ కలిగించగల ఆవరణ కల్పించేవి. చుట్టూ చూసేను. ఇక్కడ నాకు దర్శనమిస్తున్నవి సిమెంటు గోడలు మాత్రమే.

ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నన్ను ఆదుకుంది. ఇది కూడా నాజీవితంలో స్వతస్సిద్ధంగా ఏర్పాటయిన విశేషం ఒక తలుపు మూసుకుంటే మరో కిటికీ తెరుచుకోడంలాటిదన్నమాట. అన్నట్టు ఫేస్బుక్‌ని పదచ్ఛేదం చేసి ప్రతిపదార్థంగా ముఖపుస్తకం అని అనువదించేరు కానీ నాకు మాత్రం ముఖపత్రం అనడం ఉచితమనిపిస్తోంది. ఎందుకంటే, అదంతా ఒకే పేజీ. పుస్తకంలోలా పేజీలు తిరగేయడం లేదు. కిందకి, ఇంకా కిందకి, మరింత కిందకి, అధోముఖంగా చూసుకు పోవడమే కనక. ద్రౌపదీదేవి చీరెలా అనంతంగా సాగిపోతుంది ఆ ఒక్క పేజీ.

ఇంతకీ నామటుకు నాకు ఈ ముఖపత్రం ఒక రాదారి బంగళా అనిపిస్తోంది. బాటసారుల్లా మిత్రులు వస్తారు, పోతారు. ఏదీ శాశ్వతం కాదు, జగత్ మిథ్య, జీవి అనిత్యం, బంధుమిత్రులు ఋణదాతలు (వేలిముద్రలు ఇచ్చిపుచ్చుకొను ఆదానప్రదానాలతో) అని నిరూపించిన అద్భుత వరం.

ముఖపత్రంలో వారూ వీరూ అందించిన వ్యాఖ్యానాలతోనూ, లింకులతోనూ నాకు మళ్ళీ సంగీతం వినాలన్న ఉత్సాహం కలిగింది. పాతిక ముఫ్ఫై ఏళ్ళక్రితం పోగుచేసుకున్న కర్ణాటక సంగీతం వినడం మానేసి కనీసం 20 ఏళ్ళయింది. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను. అందులో స్వారస్యం మునపటికంటె కొంచెం ఎక్కువ తెలుస్తోంది. పట్టుమని పాతికేళ్ళు లేని గాయకులు అనిర్వచనీయమైన గానం ఆలాపిస్తుంటే గగుర్పాటుతో విని ఆనందిస్తున్నాను. ఆ ప్రతిభ ప్రవృద్ధమై వీళ్లు ఇంకా ఘనంగా పాడుతున్నప్పుడు వినే అదృష్టం నాకు లేదు కదా అని రవంత విచారంగా కూడా ఉంది.

ఈ ముఖపత్రంలో మరొక సదవకాశం అనేక కొత్త విషయాలు తెలుసుకోడం. Virtual స్థాయిలోనే అయినా విజ్ఞులయినవారితో పరిచయాలు తృప్తినిస్తున్నాయి. నేను కూడా చదివి తెలుసుకోగల అంశాలు సరళతెలుగులో అందుతున్నాయి. కొన్ని తెలుగూ ఇంగ్లీషూ కానీ సంకరభాషలో కూడా ఉంటాయనుకోండి. అవి వదిలేస్తాను. చెప్పేను కదా వర్చువల్ వసతి అది.

వీరిలో కొందరు ప్రొ. ఫ్రాన్సిస్ లాగే నాఉనికికి అంతో ఇంతో గుర్తింపు ఇవ్వడం కూడా నాకు కొంచెం బలమిస్తోంది. ఇదంతా వర్చువలే కనక ఈ స్నేహాలు ఉంటాయా ఊడతాయా అన్న బాధ లేదు. ఎప్పటికప్పుడే పరగడుపు -:).

ఉపసంహారము:

ఈ ధారావాహికలో మొదటి ధారలో నా మరణంగురించి ప్రస్తావించి, తరవాత వివరిస్తానని చెప్పేను. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమయింది. ఎందుకలా అనుకున్నానో, అన్నానో వివరించి ఈధారావాహికకి మంగళం పాడేస్తాను.

  1. మామూలుగా నాకు దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేసి ఊరుకోడమే. అంచేత అయ్యో ఇది చెయ్యకుండా పోతానేమోనన్నబాధ లేదు.

– ఎప్పటికప్పుడు అనుకుని చేసినవి

అ. కథలు రాయాలనుకున్నాను. రాసేను.

ఆ. వ్యాసాలు రాయాలనుకున్నాను. రాసేను.

ఇ. అనువాదాలు నేను అనుకోలేదు కానీ నా అమెరికన్ స్నేహితుల సూచనలు, అభ్యర్థనలూ, సలహాలను పాటించి మొదలు పెట్టేను. అవి పాఠకులకి అందించడానికి సైటు సృష్టించేను.

ఉ. ఆ అనువాదాలు సంకలనాలుగా వచ్చేయి కానీ అవి పుస్తకరూపం ధరించడానికి కారణం మూలరచయితల ప్రోద్బలమే. వాటిలో నాప్రమేయం తక్కువే.

  1. నేను జీవించి ఉండగానే ఈ కార్యకలాపాలవిలువ నిర్ద్వంద్వంగా నాకు అవగతమయింది. కొందరు మళ్ళీ మళ్లీ తలుచుకుంటున్నాం అంటే కొందరు చదివి పారేయడమే, ఆలోచించుకోడానికేం లేదు అంటున్నారు. Of course, పాఠకుల స్పందనలు వారి వారి అనుభవాలనుబట్టి, పరిస్థితులనుబట్టి ఉంటాయి కనక రెండు అభిప్రాయాలూ లెక్కలోకి తీసుకోదగ్గవే. నామటుకు నేనెందుకు రాసేను అంటే సంఘాన్ని ఉద్ధరించాలన్న దృష్టితో మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అంచేత నారచనలు ముందేమవుతాయో అన్న చింత లేదు. రాస్తున్నరోజుల్లో నాకు సంతృప్తిగానే ఉన్నాయి. మంచి కాలక్షేపమే అయింది. వాటికి అదే.
  2. ఇంక రెండేళ్ళలో పోతానని ఎందుకనుకున్నానంటే –

అ. ఇంక ఏమీ చెయ్యవలసింది కనిపించడం లేదు. ఇవాళా, రేపూ, రెండేళ్ళతరవాతా, ఇరవై ఏళ్లతరవాతా – ఎప్పుడు గూటిలో చిలక ఎగిరిపోయినా ఒకటే.

ఆ. నాకు 50 దాటేసరికి మొదలు పెట్టి ఇప్పటికీ వెంటాడుతున్న ఇంసూరెన్సు కంపెనీలూ, కాల్చే-పూడ్చే సంస్థలూ, రుద్రభూమి యజమానులూ, మంచులకంపెనీల ప్రకటనలూ …

DSC02382ఇ. తెల్లారి లేస్తే వినిపించే, కనిపించే వార్తలు – ఎక్కడో అక్కడ మరణం, హత్య, ఆత్మహత్య, దౌర్జన్యకాండ, కారు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, లేకుండా పొద్దు పోదు. వీధులోకెళ్తే తిరిగొచ్చేవరకూ నమ్మకం లేదు నాముందు పోగేసుకున్న ఉత్తరాల్లో కూడా ఈ ధారావాహికలో చేర్చని చావులు కూడా చాలానే ఉన్నాయి.

ఇలా చావు, చావంటూ చుట్టూ ఎటుచూసినా చావే కనిపిస్తుంటే ఆ ఆలోచన నాకు రావడంలో ఆశ్చర్యం ఏముంది? పైగా పుట్టుట గిట్టుటకొరకే అని చిన్నప్పట్నించీ వింటూనే ఉన్నాను. ఈ ఆలోచన మీకు రాకపోవచ్చు. అందరికీ ఇలాటి ఆలోచనలు రావాలని నియమం లేదు. నాకొస్తోంది అంతే.

ఇహ ఇది ఆఖరి గరికపోచ – నిడదవోలువారి వంశంలో 80 దాటి ఎవరూ బతకలేదు. అది జీన్స్‌లోనే ఉంది అని మా అన్నయ్య చెప్పేడు. నాకుటుంబంలో ఎవరు ఎప్పుడు ఈ జన్మ చాలించేరో తిరిగి చూసుకున్నాను. అమ్మా, నాన్నగారూ, ఇద్దరు అన్నలూ, అక్క, ఇద్దరు చిన్నాన్నలు, వారి పిల్లలూ ఎవరూ 80వ పుట్టినరోజు గడిచి బతికి బట్ట కట్టలేదు.

పై అన్ని కారణాలచేతనూ నేను కూడా అంతే అనుకుంటున్నాను. అలా అనుకోడం నాకు ఒకరకమైన ఊరట కలిగిస్తోంది కూడా.

హెచ్చరిక. నేను ఇలా ఆలోచిస్తున్నాను కనక మీరంతా ఇలాగే ఆలోచించాలని ఇందలి నీతి కాదు. ఇందులో సందేశం లేదు. ఇది ఎవరికీ పాఠంగా ఉపయోగపడదు.

ఇంతే సంగతులు

ఇట్లు

ని. మాలతి వ్రాలు.

—————————-

ఇంతటితో ఈ ధారావాహిక సమాప్తం. ఓపిగ్గా చదివినవారికి ధన్యవాదాలు.

 

(జులై 22, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.