ఊసుపోక 154 – నా సంగీతసేవ

హా, సాహిత్యం అయింది ఇంక సంగీతమ్మీద పడ్డావా అని మీరనుకుంటే క్షమించవలెను. ఈ మధ్య సాహిత్యపరంగా నేను రాయగలిగేదేమీ లేదని తెలిసేక, సంగీతంమీద పడ్డాను. కేవలం నాకు ఊసుపోకే. వినగ వినగ రాగమతిశయిల్లగ, ఉండబట్టలేక ఫేస్బుక్కులో ఇది వినండి ఇది వినండి అంటూ ప్రచారం చేస్తుంటే, అది విని ఆనందించేవారు కనిపించేరు. ఆ మీదట “మేమంతా క్షేమం” ధారకి కొనసాగింపుగా నాకీ సంగీతం యావ చిన్నప్పుడు ఎలా ఉండేదో చెప్పాలనిపించింది. సూక్ష్మంగా ఈ టపాకి పరిచయంవాక్యం.

నా సంగీతసేవ కూడా మీ అందరిలాగే రేడియో, సినిమాసంగీతంతోనే మొదలయింది.DSC02398

సూక్ష్మంగా నాకు సంగీతం వినడం ఇష్టం. నేను సంగీతం నేర్చుకోడం మాఅమ్మకి ఇష్టం.

అంచేత ఆవిడ ప్రయత్నలోపమేమీ లేకుండా, నాకూ, మాఅక్కయ్యకీ కూడా నానావిధాలా సంగీతం నేర్పించడానికి ప్రయత్నించింది. ఆరోజుల్లో పెళ్ళిసంగీతం అనబడే గాత్రంతోనే మొదలుపెట్టేను. మీలో కొందరికైనా తెలిసే ఉండాలి రేడియోలో సంగీతప్పాఠాలు. ఓరోజు అది వింటూ నేను పాడబోతే, ఇల్లు తుడుస్తున్న అప్పమ్మ ఝడుసుకుని ఓలమ్మో అంటూ చీపురు వదిలేసింది. మాఅమ్మ అది చూసే కాబోలు నన్ను వయొలినుకీ ఆ తరవాత వీణకీ మార్చింది. అలా ఒకటి తరవాత ఒకటి ఆరేసి నెలలచొప్పున కుస్తీ పట్టి నావల్ల కాదులే అని తప్పుకున్నాను. మాఅక్కయ్య మాత్రం పట్టుదలగా సాగించి, వీణ ఓ మోస్తరుగా “బాగానే” వాయించేస్థాయి చేరుకుంది.

పాపం, మాసంగీత మేష్టరు ఎంతో మృదువుగా “నీకు స్వరజ్ఞానం ఉందమ్మా. సాధన చేస్తే బాగా వస్తుంది,” అని చెప్పడానికి సర్వవిధాల నన్ను నమ్మించడానికి ప్రయత్నించేరు కానీ నాకు ఆ బుద్ధి, ఆ మంచి బుద్ది, లోపించినందున నాసంగీతప్పాఠాలు అనతికాలంలోనే ఆగిపోయేయి. కాకపోతే ఆ సంగీతప్పాఠాలమూలంగా జంటస్వరాలూ, వర్ణాలూ, తాళం, శృతిలాటి నాలుగు మాటలు పట్టుబడ్డాయి. పొరబడకండి, మాటలు మాత్రమే నాకు తెలిసింది.

అది అట్లుండగా

నేను నాచదువు అయిందనిపించుకుని విజయనగరం మహరాజావారి మహిళా కళాశాలలో లైబ్రేరియనుగా కుదురుకున్నాను. విజీనారం మాఊరు కానందున ఆ కళాశాల ప్రభువులు ఏర్పరిచిన గుఱ్ఱాలశాలలో మకాం పెట్టేను. లేదులెండి అప్పుడక్కడ గుఱ్ఱాలూ లేవు. మహారాజుగారూ లేరు. రాజుగారి భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కళాశాలగా మార్చేశారు. ఇంతకీ గుఱ్ఱాలశాలని వాసయోగ్యం చేసి, నాలాటి పొరుగూళ్లనుండి వచ్చిన పంతులమ్మలకి నివాసం కల్పించేరు.

ఆ వసతిగృహంలోనే విజయవాడనుండి వచ్చిన నిర్మల అను పేరుగల హిస్టరీ లెక్చరరుతో నాకు స్నేహం అయింది. ఆవిడకి సంగీతం వచ్చు. అంచేత కచేరీలకి వెళ్తూ, నన్ను కూడా ఈడ్చుకెళ్లేది. “నన్ను శృతి పెట్టె అయినా వాయించనివ్వవు, (తను సాధన చేస్తున్నప్పుడు), నేను రాను” అని కొంచెం పేచీ పెట్టి, కొంచెంసేపు మురిపించి బతిమాలించుకుని వెళ్ళేదాన్ని. (జనాంతికం – ఈ నువ్వు ప్రయోగంమీద మరో టపా రాయాలనుకుంటా!)

ఒకసారి “ద్వారం వెంకటస్వామినాయుడుగారి కచేరీ, పద,” అన్నప్పుడు కూడా నేను కొంచెం నస పెట్టేను కానీ వెళ్ళేను. నాకు ఇప్పటికీ ప్రత్యేకంగా జ్ఞాపకం ఉండిపోయిన కచేరి అది.

“ఆయన పెద్దవారయిపోయేరు. మళ్ళీ ఎప్పుడో … పద, పద,” అని నిర్మల పట్టు పట్టి, తీసుకెళ్ళింది నన్ను. ఈ విషయంలో నేను నిర్మలకి ఋణపడి ఉన్నాను. నాయుడుగారు చేసిన ఆఖరికచేరి అదే. మహా వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు నవంబరు 1964లో పరమపదానికి తరలిపోయేరు.

ఇక మూడోదశ నేను తిరపతిలోనూ అనంతపురంలోనూ ఉద్యోగాలు వెలగబెట్టినప్పుడు. అదేమిటో! వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వెళ్ళిన ప్రతిచోటా మిత్రరూపంలో నన్ను సంగీతంవేపు లాగేవాళ్ళు ఒకరో ఇద్దరూ తటస్థపడుతూనే వచ్చేరు. ప్రధానంగా చెప్పుకోవలసింది తిరుపతిలో సుప్రసిద్ధులయిన మహా విద్వాంసుల కచేరీలు ఉచితంగా సకల జనులకు అందించడం. అప్పటికే మద్రాసులోనూ హైదరాబాదులోనూ టికెట్టుకి యాభయ్యో వందో ఖర్చు పెట్టవలసివచ్చేది అని గుర్తు (ఈమాట ఒక కథలో రాసేను కనక). తిరపతిలో ప్రభావతీ, అనంతపురంలో మీరాబాయి నాసంగీతాభిరుచిని ఎగసన తోస్తూ వచ్చేరు. తిరపతిలో ఉండగానే, నా సంగీత అజ్ఞానాన్ని స్పష్టం చేస్తూ రాసిన కథ “రససిద్ధి” మీకు గుర్తుండే ఉంటుంది. వెనకటి టపాల్లో వివరించినట్టు అది నావిపరీత హాస్యానికి చిహ్నమే కానీ నాకు సంగీతం అంటేనూ, సంగీత విద్వాంసులంటేనూ చులకన భావం లేదు. ఒకరకంగా నామీద నాకే కలిగిన చిరాకు కావచ్చు.

ఇంతకీ మళ్లీ మంచి సంగీతంమీదికి నాదృష్టి మళ్ళించింది 80వ దశకంలో అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదువుకోడానికి వచ్చిన కామేశం అని ఒక అబ్బాయి. బహుశా పాతికేళ్ళలోపే అనుకుంటాను. మరో తెలుగువారింట విందువేళ కలిసేం. నాకు సంగీతం అంటే సరదా అని అతనికి ఎలా తెలిసిందో కానీ మొత్తంమీద మాకు స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు మాఇంటికొచ్చేవాడు తనదగ్గరున్న టేపులతో. ఒకొకప్పుడు టేపు పెట్టేసి తన్మయుడై పాడుతూ ఉంటే నేను చూసి ఆనందిస్తుండేదాన్ని. మాకు 3 గంటలదూరంలో ఉన్న షికాగోలో వసంతకుమారివంటి విద్వాంసులు కచేరీలు చేసినప్పుడు ఇద్దరం వెళ్ళేవాళ్ళం. నేనే సారధిని!

“మాయింట్లో గోడలు కూడా పాడతాయండి,” అన్నాడు తనకి సంగీతంమీద అభిరుచి ఎలా కలిగిందో చెప్పడానికి. నలుగురు అక్కలుట, అందరూ సంగీతం నేర్చేరుట. కర్ణాటక సంగీతానికీ ఉత్తరాది సంగీతానికీ మధ్య గల వ్యత్యాసంగురించి మాటాడుతూ తనకి, “కర్ణాటక సంగీతం ఎక్కువ అర్థం అవుతుందనీ, ఉత్తరాది సంగీతం ఎక్కువ ఇష్టం,” అనీ అన్నాడు.

చెప్పేను కదా ఇది 80వ దశకంలో. చెప్తే మీరు నమ్మకపోవచ్చు కానీ ఆ వాక్యం నాకు ఇంతకాలం అయినతరవాత ఇప్పుడు అర్థమయింది! ఇది ముగిసేవేళకి మీకే తెలుస్తుందిలెండి.

సాధారణంగా మనసు బాగులేనప్పుడు సంగీతం వింటాం అంటారు కొందరు, ఉపశమనంగా ఉంటుందని. నేను మాత్రం మనసు బాగుంటేనే మంచి సంగీతం వినగలగడం. కామేశం చదువు ముగించుకుని ఉద్యోగానికి న్యూ జెర్సీకి వెళ్ళిపోయేక నేను సంగీతం వినడం తగ్గిపోయింది. మధ్యలో సుధ అని మరో స్నేహితురాలు ఇండియా వెళ్ళినప్పుడల్లా టేపులు కొనుక్కొచ్చి నాకు ఇవ్వడంతో కొంత కాలక్షేపం అయింది. ఆవిడ సంగీతం నేర్చుకోలేదు కానీ నేర్చుకోవాలన్న తపన ఉండేది. అంచేత ఆ టేపులు విని సాహిత్యం రాసే పని నాకు ఒప్పగించింది. ఆ రాయసపని మూలంగా కొంతకాలం సంగీతాభిరుచి నిలిచింది. అది బహుశా ఓ పదేళ్ళు సాగిందేమో. 90వ దశకం వచ్చేసరికి నాకు సంగీతాభిమానం మంగళం పాడేసుకుంది.

అప్పటివరకూ పోగేసుకున్న టేపులు ఉంచలేకా పారేయలేకా సతమతమవుతూ మరో పదేళ్ళు గడిపేను. మొత్తమ్మీద ఆఖరికి సంగీతం అంటే వీరికి ఇష్టమయి ఉండనోపు అని ఇద్దరు ముగ్గురిని ఎంచుకుని, నాదగ్గర మంచి టేపులున్నాయనీ, కావలిస్తే పంపగలననీ ప్రకటించేను. అప్పుడయితే పంపమన్నారు కానీ ఇప్పుడు వారిని గురించి మరికొంత తెలిసినతరవాత నా అమాయకత్వం అర్థమయింది. వాళ్లకి ఈ టేపులు అవసరం లేదు. వారిదగ్గర చాలా చాలా మంచి సీడీలూ, లైవు కచేరీలూ ఇంకా ఏవో చాలానే ఉన్నాయి. ఇహ నాదగ్గరున్న మిగతా టేపులగురించి మాటాడను.

ఈ తికమకలో పడి కొట్టుకుంటుండగా, ఫేస్బుక్ ప్రవేశించేను, రెండేళ్లయిందనుకుంటాను. అక్కడ కొందరు మంచి మంచి పాటలకి అప్పుడప్పుడు లింకులివ్వడంతో మళ్ళీ నాకు సంగీతం వినాలన్న ఉత్సాహం పుట్టుకొచ్చింది. (పైన మూడోపేజీలో ఉటంకించిన సిద్ధాంతంప్రకారం మనస్తిమితం అన్నమాట).

అక్కడ్నించి యూట్యూబుమీద దాడి ప్రకటించేను. నాకే ఆశ్చర్యం. ఇదివరకూ, రాగం, తానం, తిల్లానావంటివి విని ఆనందించే జ్ఞానం లేదు. ఇప్పుడు అవి వింటుంటే అబ్భ, ఎంత బాగుంది అనిపిస్తోంది. ఇవ్విధమున నాసంగీతాభిలాష ఒక మెట్టు పైకి చేరినట్టు అనిపించింది.

ఆ ఉత్సాహం పట్టలేక, ఫేస్బుక్కులో లింకులిస్తే, రసజ్ఞులు ఆనందించడమే కాక, ఆ కీర్తనలగురించి, గాయకులగురించి అనేక వివరాలు ఇస్తున్నారు. తద్వారా నాఉత్సాహం మరింత పుంజుకుంది.

అంచేత వచ్చే జన్మలో నేను గాయకురాలిగా పుడతాననుకుంటున్నాను. చిత్రగుప్తుడో, బ్రహ్మదేవుడో “నువ్వెవరివిగా పుట్టాలనుకుంటున్నావు?” అని నన్నడిగితే, ఆ పరిస్థితి వస్తే, “నన్ను కనీసం ఓ మోస్తరు స్థాయి గాయనిని లేదా గాయకుడిని చేయుము మహాప్రభో,” అని చెప్పేస్తాను నిస్సందేహంగా.

ఇంత దూరం వచ్చేక, మరి మీకు నన్ను ఇంతగా ఆకర్షించిన ఆ గాయకులెవరో తెలుసుకోవాలనుందా? కావాలంటే నేను ఏ గాయకులసంగీతం విని ఆనందించేనో, ఎవ్విధమున ఆనందించేనో, లేదా అవి వింటున్నప్పుడు నాకేమనిపించిందో చెప్తాను మీకు కావాలంటేనే.

అన్నట్టు చెప్పడం మరిచేను వీరిలో కొందరు మరీ చిన్నపిల్లలు. 10-18 ఏళ్ళమధ్య వాళ్ళు. వయసుమాట వదిలేయండి. బొమ్మ చూడకుండా, వారి సంగీతం వింటే ఆరితేరిన విద్వాంసుల స్థాయిలో పాడుతున్నారని మీకే తెలుస్తుంది. “వృద్ధిలోకి వస్తున్న గాయకులు” అనలేం, వృద్ధిలోకి వచ్చేసినవిద్వాంసులే అనిపించే స్థాయిలో పాడుతున్నారు.

———

(ఆగస్ట్ 3, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s