ఊసుపోక 155 – నా ఇష్ట గాయనీగాయకులు

వెనక చెప్పేను కదా నా గానవినోదం రేడియోలో నిలయవిద్వాంసులతో మొదలయిందని. ఆరోజుల్లో వారిని “నిలవ”విద్వాంసులని హాస్యమాడినా, ఈనాటికీ గుర్తున్న పేర్లు వింజమూరి లక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతి. నిలయవిద్వాంసులు కాదు గానీ తరుచూ టంగుటూరి సూర్యకుమారి, పి. లీల, రావు బాలసరస్వతి, సీతాఅనుసూయ వంటివారు అందంచిన లలిత సంగీతం మనోరంజకంగా ఉండేది.త్యాగరాజకీర్తనలు

అట్టే సంగీతజ్ఞానం లేనివారికి సాహిత్యం తోడ్పాటు ఉంటుంది. “సాగరరాజా చిన్నదోయీ నా హృదయనావ, తెరచాపా చుక్కానీ నావి కావు కానీ” “అమరావతీపట్టణమున బౌద్ధులు స్తూపములు స్థాపించునాడు”వంటి సాహిత్యం నాకు ఇప్పటికీ మనసులో మెదుల్తూనే ఉంటుంది ఉండీ ఉడిగీ.
ఆతరవాత తిరపతిలో ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా యం.యస్. సుబ్బలక్ష్మిగారి గానం విని పరవశించి అహో శాస్త్రీయసంగీతం అంటే ఇలా ఉంటుందన్నమాట అని అనుకున్నది. మళ్ళీ అమెరికా వచ్చేక, ముందు చెప్పినట్టు కామేశం కర్నాటక సంగీతంతో నాకు మంచి పరిచయమే ప్రసాదించేడు. చెప్పేను కదా ఉత్తరాది సంగీతం తనకి నచ్చుతుందన్నాడని. అప్పట్లో అతను నాకిచ్చిన కిషోరీ అమోంకర్ టేపు ఒకటి ఇప్పటికీ ఉంది నాదగ్గర. ఈనాటికి అది విని ఆనందించగల స్తోమత వచ్చింది, సుమారుగా. :).

ఆరోజుల్లోనే అంటే 80వ దశకంలో ప్రియ సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్, బాలమురళీకృష్ణ, వసంతకుమారి, బాల మురళీకృష్ణ షికాగో వచ్చినప్పుడు వారి ప్రత్యక్ష కచేరీలు విన్నాను. ఆ తరవాత చాలాకాలం అదేపనిగా ప్రియ సిస్టర్స్, సుధా రఘునాథన్‌తోపాటు మహరాజపురం సంతానం, నూకల చిన సత్యనారాయణ, బాలమురళీకృష్ణ, జేసుదాస్, యం.యస్. సుబ్బలక్ష్మి, యం.యల్ వసంతకుమారి, రాధ జయలక్ష్మి సంగీతం వింటూ వచ్చేను. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి రెండున్నాయి – డి.కె. పట్టమ్మాళ్ శ్యామలాదండకం, బొంబే సిస్టర్స్ సౌందర్యలహరి. ఈ రెండూ టేపు అరిగిపోయేవరకూ విన్నాను.

ఇలా రాస్తుంటే నాకు మరో పిట్ట కథ గుర్తొస్తోంది. మా అమ్మాయి పుట్టినప్పుడు నాకు జోలపాటలేమీ రావు కనక సుబ్బలక్ష్మిగారి జో అచ్యుతానంద టేపు పెట్టేసేదాన్ని. వింటూ బాగానే నిద్రపోయేది. ఆ తరవాత దానికి తొమ్మిదేళ్ళప్పుడు ఇండియా వెళ్ళేం. ముత్యాలముగ్గు సినిమా చూసేం. ఆదిలోనే హంసపాదు. ఆ సినిమా ప్రారంభిస్తూనే రావు గోపాలరావు భయంకరంగా తెరమీద కనిపించేసరికి మాఅమ్మాయి ఝుడుసుకుంది. కానీ ఆ సినిమాలో పాట మాత్రం “ముత్యమంత ముగ్గు” పాడుతుండేది. ఆ తరవాత రామచంద్రాయ రాజజామనోహరాయ కూడా నేర్చేసుకుంది బాలమురళీకృష్ణ టేపు విని. దానిపాట విన్నవాళ్ళు మంచి స్వరజ్ఞానం ఉందని మెచ్చుకున్నారు కూడాను. ఇప్పటికీ రామచంద్రాయ అని మొదలు పెడుతుంది. మిగతా అంతా మరిచిపోయింది. అది వేరే సంగతి.

సరే మళ్ళీ అసలు విషయానికొస్తాను. 15-20 ఏళ్ళు అయిపోయేక ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా నాకు సౌందర్యలహరి వినాలన్న కోరిక పుట్టింది. హడావుడిగా ఆ గానంకోసం యూట్యూబు వెతుకుతూ తదితర విద్వాంసులని కనిపెట్టేసేను.

ఇందాకా చెప్పినట్టు, నేను సాహిత్యంమీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వినడంతో నాకు ఒక సుళువు తెలిసింది. టేపులు లేనప్పుడు కూడా ఏ వీధుల్లోనో తిరుగుతున్నప్పుడు ఈ సాహిత్యం మనసులో మెదుల్తూ సంగీతం వింటున్న అనుభూతి కలుగుతుంది! అంటే అది రక్తంలో ఇంకిపోయింది. సంగీతవిద్వాంసులు నా బ్రెయిను వాష్ చేసేసేరు అనుకోండి! నూకల చినసత్యనారాయణగారి క్షీరసాగరశయనా, మహరాజపురం సంతానంగారి రామా నిన్నె నమ్మినవారము ఎంతగా నామనసులో ముద్ర పడిపోయేయో మాటల్లో చెప్పడం కష్టం. ఇందులో నష్టం ఏమిటంటే ఆ తరవాత వేరే ఎవరు ఆ కీర్తనలు పాడినా అంత బాగున్నట్టు అనిపించదు.

గత రెండు నెలల్లో ఆ సిద్ధాంతానికి గంటు పడింది ఒక చిన్న గాయని మూలంగా. చిన్న అంటే వయసులోనే కానీ వైదుష్యంలో కాదు. సుబ్బలక్ష్మిగారి మునిమనుమరాలు, రాధ విశ్వనాథన్ గారి మనుమరాలు అయిన యస్. ఐశ్వర్య పాడుతుంటే, సుబ్బలక్ష్మిగారు మనసులోకి వచ్చేసేరు. ముఖ్యంగా ఈ అమ్మాయి చంద్రశేఖరగురుం అన్న శ్లోకంతో మొదలు పెట్టినప్పుడు, మనవ్యాలకించరాదా, సీతమ్మ మాయమ్మ, అపరాధముల మన్నించి లాటి కీర్తనలు పాడుతున్నప్పుడు మనసుని సూటిగా తాకుతుంది ఆ ఆదిమ మధురస్వరం. చిన్న హెచ్చరిక – యూట్యూబులో యస్. ఐశ్వర్య అనే చూడాలి. కేవలం “ఐశ్వర్య” అని టైపు చేస్తే సినీతార దర్శనమిస్తుంది.

అసలు నేను యూట్యూబులో సంగీతం వినడం మొదలు పెట్టేక, మొదట నాకు చెప్పలేనంత గొప్పగా అనిపించింది శ్రీరంజని సంతానగోపాలన్, నేవేలి ఆర్. సంతానగోపాలన్‌గారి కుమార్తె. ఆయన మహా విద్వాంసులని కూడా నేను ఇప్పుడే కనుగొనడం (ఆమాత్రం తెలియదా అని మళ్ళీ నామీద కళ్ళురమకండి మరి.). ఈ అమ్మాయి కంఠస్వరం మధురం. వైదుష్యం అసాధారణం.

మిగతావారిలో నన్ను బలంగా ఆకట్టుకున్నది మాస్టర్ అనంతరామన్. 12 వయసులో ఇతడు చేసిన కచేరి ప్రథమశ్రేణి గాయకులస్థాయిలో ఉంది. ఇది నామాట కాదు. యూట్యూబులో ఆ కచేరీదగ్గర వ్యాఖ్యలు చూడండి. ఇతను కొంచెం పెద్దవాడయేక అంటే 15, 16 ఏళ్ళు వచ్చేక, ఈరోడ్ అనంతరామన్‌గా, విద్వాన్ అనంతరామన్‌గా ప్రసిద్ధుడయేడు. సుమారుగా ఇప్పుడు అతని వయసు అదే అనుకుంటాను. అశ్వత్ నారాయణన్ గానం కూడా మనోజ్ఞంగా ఉంది. ఇతను కూడా 17, 18 ఏళ్ళకే విద్వాన్ అనిపించుకున్నాడు.

కొంతకాలంగా కచేరీలు చేస్తూన్న ప్రముఖగాయకులలో నేను కొత్తగా మొదటిసారి వింటూనే చకితురాలినయింది మండా సుధారాణి గానం. ఆమె కంఠస్వరం కంచుకంఠమే. ఖంగున మోగినట్టనిపిస్తుంది ఆలాపన ఎత్తుకోగానే. ఆవిడ స్వతస్సిద్ధమైన బాణీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఆమె ప్రయోగం మీరు వినదలుచుకుంటే, యూట్యూబులో “రాజరాజరాజితే” (అసలు పాఠం రాజరాజారాధితే అనిట. కానీ యూట్యూబులో …రాజితే అని ఉంది.) చూడండి. ఇది చాలా వేగంగా పాడతారు. నిరోష్ఠ కృతి అంటే ప, మ స్వరాలు లేకుండా అనిట. ఇదంతా ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకున్నది. ముఖ్యంగా పల్లవి గానవిశేషంలో అనేక ప్రయోగాలు ప్రవేశపెట్టేరుట. అన్నట్టు పల్లవి అంటే నేను కీర్తనలో ఒక పాదమనే అనుకున్నాను కానీ ప – పదం, ల – లయ, వి – విన్యాసం అనిట. ప్రముఖ వైయొలిన్ విద్వాంసులు ఇవటూరి వెంకటేశ్వరరావుగారి శిష్యురాలు ఈమె. సుధారాణిగారి కుమార్తె మండా శృతి రవళి. ఈ అమ్మాయికి తల్లికంఠస్వరం రాలేదేమో అనిపించింది నాకు. (తా. క. ఈ టపా రాసేక, మళ్ళీ ఈ కచేరీ వింటుంటే, శృతి రవళి గానం కూడా నచ్చింది. బహుశా నేను సరిగా వినలేదనుకుంటా మొదటిసారి.  డిసెంబరు 11, 2015)

కొంచెం విచిత్రంగా అనిపించిన చిన్నకథ – శ్రుతి రవళి వారి సద్గురు సత్యనారాయణమూర్తి గారి సమక్షంలో కచేరీ చేసింది. ఆ సమయంలో విడియో కెమెరా రెండు మూడు సార్లు ఆ స్వామి పాదసంవాహన దృశ్యం చూపడం జరిగింది. కనీసం అంతసేపు కెమెరా వారిమీద నిలపడం నాకు వింతగానే తోచింది.

మరొక గాయకునివిషయంలో కొన్ని విషయాలు ప్రస్తావించాలి. ఒక విదేశీ – మలేషియన్ చైనీస్ చంగ్ చ్యూ సెన్ (Chong Chiu Sen) కర్ణాటకసంగీతంలో నిష్ణాతుడు. ఆయన డి.కె. పట్టమ్మాళ్ తో ప్రారంభించి, ఆ తరవాత వరసగా పట్టమ్మాళ్ కుమారుడు డి.కె. జయరామన్, మనుమరాలు గాయత్రి సుందరరామన్ శిష్యరికంలో సంగీతం అభ్యసించేడుట. అతను చేసిన కచేరీలో తెలుగు, తమిళం, సంస్కతకృతులు ఉన్నాయి. ఇతని ఉచ్చారణ నన్ను అవాక్ చేసింది.

ఉచ్చారణ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను అమెరికనులకి 15 ఏళ్ళకి పైనే తెలుగు నేర్పేను, లేదా నేర్పడానికి ప్రయత్నించేను. వాళ్ళలో ఎవరూ ఈ స్థాయి ఉచ్చారణకి చేరలేదు. ఒత్తులూ ద్విత్వాలూ లేని నా పేరే సరిగ్గా పలకలేని వాళ్లే ఎక్కువ నేను చూసిన అమెరికనులలో. ఆ దృష్టితో చూస్తే ఈవిద్వాంసుడికి నమస్కరించక తప్పదు. ఇతని ఉచ్చారణలో యాస ఉందని ఒకరిద్దరు అన్నారు. ఆ విషయం నేను ఆలోచించేను కొంచెంసేపు. నాకు తోచింది ఏమిటంటే శాస్త్రీయసంగీతంలో ఉచ్చారణలో కొంత సాంకర్యం మనకి కొత్త కాదని. తమిళులు తెలుగు కృతులు పాడినప్పుడు ఉచ్చారణ ఎల్లవేళలా పక్కాగా ఉందని చెప్పలేం. వసంతకుమారి పవమాన “సుతడు” బట్టు … అని పాడేరు. అంతే కాదు తమిళగురువులదగ్గర నేర్చుకున్న తెలుగువారు కూడా ఆ తమిళ ఉచ్చారణతోనే పాడడం కూడా విన్నాను.

ఏమైనా చంగ్ చూ సెన్ విద్వత్ మాత్రం నాకు ఘనంగానే అనిపించింది.

చివరిమాటగా రాగం, తానం, తిల్లానగురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు సాహిత్యంమీద యావ ఎక్కవ అని చె్ప్పేను కదా. రాగం, తానం, తిల్లానా – వీటిలో అంతా సంగీతమే కదా అమూర్త కళలాగ. ఆ కారణంగా ఈ ప్రక్రియలు నన్ను ఆకర్షించలేదు. మరి నేను సంగీతం వినడం మానేసిన 15 ఏళ్ళలో ఏం జరిగిందో నాకు తెలీదు కానీ రెండు నెలలక్రితం తొలిసారి శ్రీరంజని సంతానగోపాలన్ కచేరీ వింటున్నప్పుడు అనిపించింది ఆలోపన మనోహరంగా ఉంటుందని. దానిమీదే మనసుంచి వింటే గాయని తనతోపాటు మనని కూడా దిగంతాలలోకి తీసుకుపోగలదని. క్రమంగా తద్వారా భాష కూడా. తెలుగు కృతలయితేనే వింటానన్న నియమం కూడా తొలగిపోయింది.

వెనకటి టపాలో చెప్పడం మరిచిన మాట – ద్వారం వెంకటస్వామినాయుడిగారి కుమార్తె ద్వారం మంగతాయారు కూడా పేరు గన్న వయొలిన్ విద్వాంసురాలే. అప్పట్లో రేడియోలో ఆమె కచేరీలు వచ్చేవి. అప్పట్లో విన్నా అట్టే ఆసక్తితో మాత్రం కాదు. యూట్యూబులో ఆవిడ సోలో ఒకటి ఉంది.  వింటుంటే బాగుందనే ఇంకా ఇంకా వినాలనే అనిపించింది.

ఈ గానాలు వింటూ మరొక సంగతి గమనించేను. గాయని లేదా గాయకుడు, పక్కవాద్యగాళ్ళు – వీరిమధ్య సమన్వయం. ఒక మంచి సంగతి, ఒక గమకం, స్వరప్రస్తారంలో ఒక విశేషం – వినిపించినప్పుడు చిరునవ్వులతో ఒకరినొకరు సంప్రదించుకుంటూ అమందానందం అనుభవించడం చూస్తే సభికులను, శ్రోతలను అలరించడమే కాదు తాము కూడా అంత అలౌకికమైన అనుభూతి పొందుతున్నారనిపిస్తుంది. ఆక్షణంలో మనకి కూడా అంతటి ఆహ్లాదమూ కలుగుతుంది. అప్రయత్నంగానే మనపెదవులమీద చిరునవ్వు మొలకలెత్తుతుంది.

నేను అమెరికా వచ్చేక అందరూ బోలెడు మెచ్చుకుంటున్నారు ఏిమిటో చూదాం అని మైకల్ జాక్సన్, ఎల్విస్ ప్రెస్లీ వంటి వారి గానం వినడానికి ప్రయత్నించేను కానీ నాతరం కాలేదు. స్టేజంతా కదం తొక్కుతూ భయంకరంగా యుద్ధం చేస్తున్నట్టు కనిపించే వారి గానం గాయాలు చేస్తున్నట్టు కనిపించింది. మన గాయకులేమో స్టేజిమీద మఠం వేసుకు కూర్చుని, ప్రశాంతంగా చేతులూపుతూ పాడుతుంటే, ఆ సంగీతం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. చేతులకదిలకతో శబ్దాలు చిత్రిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే.

ప్రతి నియమానికీ ఒకటో రెండో మినహాయింపులు ఉన్నట్టే, ఈ యూట్యూబు సంగీతంలో చిరాకు కలిగించేవి ప్రకటనలు. అయితే ఆధునిక యుగంలో ఉచిత లంచి అన్నది లేదని నాకు కూడా తెలుసు. అంచేత భరించకతప్పదు. కొన్ని పాట అయినతరవాత అయితే, కొన్ని పాటమధ్యలోనే పాట ఆపేసి తమ కచేరీ పెట్టేస్తాయి ఈ ప్రకటనలు. దానిమీద ఎవరో వ్యాఖ్యానించడం, కార్యకర్తలు ఆ ప్రకటనలు తమచేతిలో లేవనీ, వీలయితే ఆ పద్ధతి మార్చడానికి ప్రయత్నిస్తామనీ జవాబిచ్చేరు.

ఇదీ నా సంగీతాభిమాన కథ.
———-
(ఆగస్ట్ 5, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “ఊసుపోక 155 – నా ఇష్ట గాయనీగాయకులు”

 1. నన్ను విడచి కదలకురా కృతి రీతిగౌళ రాగం. సంతానం గారు పాడినది గొప్పగా ఉంటుందేమో నాకు గుర్తు లేదు గానీ, ఎవరు పాడినా చాలా మధురంగా ఉండే అవకాశం ఉన్న కృతి ఇది

  మెచ్చుకోండి

 2. బాగుంది. మీరు మీ వ్యాఖ్యల పెట్టె తిరిగి పొందినందుకు చాలా సంతోషం. నాకు ఇదివరకు తెలియని మరి కొందరు యువ కళాకారులను పరిచయం చేసినందుకు నెనర్లు. ఇంటర్నెట్టు, అందులో ముఖ్యంగా యూట్యూబు నిజంగానే ఎన్నో సంగీత ఖజానాలకు రాజద్వారాల్ని తెరిచింది.

  మెచ్చుకోండి

 3. ఆహా ఏం అదృష్టం. పోనీలెండి నాకు తెలిసినవారు స్వయంగా విన్నారనుకుని ఆనందిస్తాను. పర్వీస్ సుల్తానా పేరు విన్నాను. యూట్యూబులో చూస్తాను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. బాగుందండీ మీ సంగీతాభిమాన కథ. అన్నట్లు మీకు గుర్తుండే ఉంటుంది – కర్ణాటక సంగీతం నేర్చుకున్న విదేశీయుల్లో జాన్ హిగ్గిన్స్ (John Higgins) అనే అమెరికనొకరు ఉండేవారు. కచేరీలు కూడా చేసేవారు. ఈయన్ను “హిగ్గిన్స్ భాగవతార్” అనే వారు.

  మెచ్చుకోండి

 5. చాలా బాగుందండి మీ సంగీతాభిమాన కథ. మీలాగే, నేనూ .. సంతానం గారి నన్ను విడచి కదలకురా కీర్తన విని, తరువాత ఎవరు పాడినా వినలేని పరిస్థితి 😀

  మెచ్చుకోండి

 6. మీరు ఉదహరించిన కొందరిని ,అందులో ముఖ్యంగా సుధారాణి కచేరీని మా వూళ్ళో స్వయంగా విని ఆనందించాను.మరొక మధురమైన అనుభవం పర్వీన్ సుల్తానా కచేరీని వైజాగ్ లో వినడం.సరే youtube లో ఎలాగూ వింటూ ఉంటాను.అదొక అలౌకికానందం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.