ఊసుపోక 156 – ఎందుకు మళ్లీ “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ఈ కథమీద చర్చలతో తలవాచిపోతోందని నేనే సణుక్కున్నతరవాత మళ్ళీ నేనే ఎందుకు రాస్తున్నానంటే, ఈ నిరవధిక చర్చల, వ్యాసాల ధారవల్ల నాలాటి అర్భకులకు జరిగే అన్యాయం మనవి చేసుకోడానికి!

చాసో గొప్ప కథకుడు అని సాహిత్యవేత్తలూ, సాహిత్యసారథులూ, ఇంకా అనేకరకాల ప్రముఖులూ ఏకగ్రీవంగా నొక్కి వక్కాణించడం జరిగింది, జరుగుతోంది, భవిష్యత్తులో కూడా ఇదే సాగుతూ పోవడానికి ఈనాటి సా.వే.లూ, సా.సా.లూ తదితరులూ రంగం తయారు చేసి పెడుతున్నారు నిర్విరామంగా.
మరి నాబాధేమిటి అంటే ఒక కథనో ఒక రచయితనో ఒక కవినో సర్వకాల సర్వావస్థలయందూ పొగడుతూనో తెగడుతూనో అదే పనిగా ఊదర పెట్టేస్తే నావంటి సాధారణ పాఠకులకి ఉన్న కాస్త ఉత్సాహం కూడా ఉడిగిపోయి మాట తోచకుండా పోతుంది అని. ఆమీదట ఒక రకమైన వైముఖ్యం మనసులోనో తలలోనో చోటు చేసుకుని, మ్, ఏముందీకథలో అనిపించేలా చేస్తుంది. పునః పునః పీకి పాకాన పెట్టుటచేత ఆ పాకం నా బుర్రకెక్కకుండా పోతుంది.

కందిరీగలరొద మధ్య బుర్ర పని చేయనట్టే పైకథ తీసి చదవబోతే నాకు దిక్కు తోచలేదు. ఈ విషయమే అతి సర్వత్ర వర్జయేత్ అన్న శీర్షికతో ఫేస్బుక్ లో పెట్టేక కొందరు మిత్రులు సరళభాషలో నాకు అర్థమయేలా వివరించేరు. ఇది నాందీ ప్రస్తావన.

ఈ కథ నాకు తొలిసారిగా పరిచయం చేసినవారు శారద (ఆస్ట్రేలియా). 2007లో శారద ఈకథని ఆంగ్లంలోకి అనువదించి తూలిక.నెట్ లో ప్రచురణకి పంపినప్పుడు తెలిసింది. (అనువాదానికి లింకు ఇక్కడ). నాకు బాగా జ్ఞాపకం లేదు కానీ ఆరోజుల్లో శారద నాకు ఈకథగురించి కొంచెం వివరించేరనుకుంటాను.

నిన్న మళ్ళీ ఈ కథ చదివేను. మంచి కథ. మంచికథ చదివేను అన్న అనుభూతి కలిగించిన కథ. కథలో పాత్రలు, సంభాషణలు చాలా కాలం గుర్తు పెట్టుకుంటాను. ఫేస్బుక్కులో నాటపాకింద ఎ.వి. రమణమూర్తిగారు ఈకథమీద వచ్చిన కొన్ని విశ్లేషణలు, చిన్న వ్యాఖ్యలతో నాకు అందించేరు. ఆ లింకులన్నీ ఈవ్యాసం చివర మీకు అందిస్తున్నాను రమణమూర్తిగారి సౌజన్యంతో.

ఆవ్యాసాలు, వాటికింద వ్యాఖ్యలలో కూడా షరా మామూలే అన్నట్టు వైవిధ్యం ఉంది. అందులో ఆశ్చర్యం లేదు. పాఠకులస్పందన సాధారణంగా వారిమనస్తత్వం, పరిస్థితులు, అనుభవాలమీద ఆధారపడి ఉంటుంది కనక. కొందరికి కన్నీరు పిలిచిన పలుకు తల్లి. నెత్తిమీద నీళ్ళకుండ ఎల్లవేళలా సిద్ధమై ఉంటుంది. నాకు మాఅమ్మ పోయినప్పుడే ఏడుపు రాలేదు. ఏ కథ గానీ చదివేక ఏవిధమైన మనోవికారాలమాట అసలే లేదు. మంచి కథ అయితే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటాను. వాటిలో కొన్ని వాక్యాలు కూడా గుర్తుండిపోతాయి. బహుశా వినేవాళ్ళుంటే చదవమని చెప్తానేమో కూడా. అంతే.

సోమయాజులుగారి కథలో పిల్లవాడికి చదువుకోవాలన్న కోరిక చిత్రణ, స్కూలు ఆవరణలో పిల్లల సంభాషణలు చాలా వాస్తవికంగా ఉన్నాయి. తల్లిదండ్రులు చదువుగురించి చర్చించుకుంటున్నప్పుడు ఆమాటలు వింటున్నవాడి మనస్తత్వం కూడా నైపుణ్యంతో ఆవిష్కరించేరు. పాఠకలోకాన్ని ఆకట్టుకున్న విషయాలివి. ఏ కథలోనైనా పిల్లలపాత్రలు ఆకర్షణీయమే. మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబాల్లో పిల్లల చదువులగురించిన ఆందోళనలు సర్వసాధారణం. కథ చదువుతున్నంతసేపూ పాత్రలు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. ఇవి చా.సో. నిస్సందేహంగా విమర్శకులనీ, పాఠకులనీ కూడా ఆకట్టుకున్న అంశాలు.

(శాఖాచంక్రమణమే అయినా మరొకవిషయం చెప్పాలనిపిస్తోంది – ఈకథకి రాంబాబు ఆర్లె గారు గీసిన చిత్రం ఎంతో సహజంగా ఉంది. రాంబాబుగారు తూలిక.నెట్ లో ఈకథ అనువాదంకోసం ప్రత్యేకంగా రచించిన చిత్రం ఇది. అరిపిరాల సత్యప్రసాద్ గారి విశ్లేషణకి సారంగ.నెట్ లో వాడుకున్నారు. నాకు చెప్పకపోయినా, కనీసం చిత్రకారుడు ఆర్లె రాంబాబు గారికి క్రెడిట్ ఇస్తే బాగుండేది. ఈసంగతి ఆవ్యాసందగ్గర నేను వ్యాఖ్యానించేను కూడా.).

ముగింపు వాక్యం కథకి శీర్షిక అయిన ప్రశ్న “ఎందుకు పారేస్తాను నాన్నా?” మీద కూడా కొంత చర్చ జరిగింది. నిజానికి నాక్కూడా చాలా కాలం అర్థం కానిది ఆ శీర్షికమూలానే.
ఇప్పుడు మళ్ళీ ఆ కథ చదివిన తరవాత నాకు తోచిన జవాబు – అది కేవలం మన కుటుంబాల్లో నిత్యం జరిగే చిన్న సంభాషణ అని. సాధారణంగా ఇద్దరు సంభాషించుకుంటున్నప్పుడు, ఒకరికి ఇబ్బంది అయిన మాట వస్తే వారు మాట తప్పిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు పెద్దవారు, రెండోవారు చిన్నవారు అయితే, పెద్దవారికి ఇది మరింత సౌకర్యం. పిల్లవాడికి స్కూల్ ఫీజు కట్టాలి. అది ఆయనబాధ్యత. వాడిభవిష్యత్తు దానిమీద ఆధారపడి ఉంది. ఆయనకేమో చుట్ట లేకపోతే పొద్దు గడవదు. చుట్ట తనకి ఉపశమనం కలిగిస్తుంది. తన ఉపశమనం ముఖ్యమా, పిల్లవాడిభవిష్యత్తు ముఖ్యమా, చుట్టా? చదువా? అని ప్రశ్నిస్తే పిల్లవాడి భవిష్యత్తే అంటారు ఎవరైనా. కానీ నిజజీవితంలో గబుక్కున ఆ ఆలోచన తోచదు. ఈ సంగతి ఆయన భార్యకిచ్చిన జవాబుల్లో కూడా కనిపిస్తుంది. స్కూలు ఆవరణలో పిల్లవాడు ఎదురు జవాబు చెప్పినప్పుడు ఆయనకి చూచాయగా అర్థమయింది ఆ సంగతి. అర్థమయినతరవాత వాడిని ఎలా సమాధానపరచాలో తోచలేదు. అంచేత చర్చని తనమీదనుండి పిల్లవాడిమీదకీ, వాడికిచ్చిన డబ్బుమీదకీ మరల్చే చిన్న కిటుకు ఆ ప్రశ్న. కొంతవరకూ కుత్సితం అని కూడా అనొచ్చు. ఈ కిటుకులూ, కుతంత్రాలూ ఆ వయసు పిల్లల అవగాహనలో ఉండవు. అంచేత ఆ పిల్లవాడు అమాయకంగా “ఎందుకు పారేస్తానూ?” అని తిరిగి ప్రశ్నించేడు. “అదేం ప్రశ్న? నేను పారేస్తానని ఎందుకనుకున్నావూ?” అన్న ధ్వని ఉంది ఆ ప్రశ్నలో.

ఈ కథలో సోమయాజులుగారు గొప్ప ఆర్థికసూత్రాన్ని ఆవిష్కరించేరా అంటే నాకు తెలీదు. నామటుకు నాకు ఏ సూత్రాలూ వల్లించుకోకపోయినా ఇది మంచి కథే. రచయితే చెప్పేరు పాఠకులు రెండు వర్గాలనీ, ఆ రెండు వర్గాలూ ఆదరిస్తేనే అది మంచి కథ అనీ. ఇందులో సోమయాజులుగారు చెప్పిన మొదటి వర్గంలో ఉన్నాను నేను.
పోతే సూత్రాలపరంగా ఈకథ ఈనాటి సమాజానికి వర్తించదు. ఈ కథాకాలంనాటికి చిన్నక్లాసులకి కూడా జీతం కట్టవలసి వచ్చేది. ఇప్పుడు అది లేదు.
సిద్ధాంతాలు మాటాడాలంటే, ఈనాటి సమాజంలో పిల్లలచదువులకి ఆర్థికపరిస్థితులు ఆటంకం అయినసందర్భంలో కూడా దానికి కారణం స్కూలు ఫీజు కాదు. వారికి సమస్య కాలం. ఏ పూటకా పూట కూటికోసం పిల్లలని కూలిపనిలో పెట్టవలసివస్తోంది కనక స్కూలికి పంపరు. అంతే కాదు, స్కూలికి వెళ్ళిన పిల్లలకి ఎలాటి ఉద్యోగాలు దొరుకుతున్నాయి? తన్మూలంగా వారిళ్ళల్లో కొత్తగా వస్తున్న సమస్యలేమిటి? ఈనాటి సమాజానికి వర్తించే ప్రశ్నలు ఇవీ. నాదృష్టిలో చా.సో. రాసిన గొప్ప ఆర్థికసూత్రం వివరించే కథ అన్నది యం.ఫిల్లులకీ డాక్టరేటులకీ పనికొస్తుంది కానీ ఈతరం యువతీయువకులకి కాదు. అసలు ఈ లెక్కన మరో రెండు తరాలు పోతే చాసో, కొకు తప్ప రచయితలే లేరనుకుంటారేమో కూడా.

కాగా ఇలా కొట్టినపిండే కొట్టుకుంటూ పోవడంవల్ల మనసాహిత్యచరిత్రకి కొత్తగా ఒరిగేదేమీ లేదు. భావితరాలకి సమగ్రమైన తెలుగు కథాసాహిత్య చరిత్ర తెలియజెప్పాలంటే మిగతా రచయితలనుగురించి, మిగతా కోణాలు కూడా ప్రస్తావించాలి.

ఉదాహరణకి పన్యాల రంగనాథరావు అంటే కొందరికి ఆయన తొలికప్పు కాఫీతో అందించే వార్తలు గుర్తు రావొచ్చు. ఆయన మంచి కథలు రాసేరని ఎంతమందికి తెలుసు? మీరు ఆర్థికసమస్యలు చర్చించదలుచుకుంటే “దరిద్రం” అని ఒక కథ రాసేరు రంగనాథరావుగారు. కథలో పిల్లలు లేరు కానీ దరిద్రం ఉంది. ఆర్థికంగా చితికిపోయిన భర్త మానసికక్షోభ అది. ఆయనే రాసిన మరో కథ “అంతస్తులు”. చక్కని మనోవిశ్లేషణ కనిపిస్తుంది అందులో. ఇద్దరు మిత్రులగురించి రాసిన ఈ కథలో దుర్మార్గులు లేరు. ఆర్థికపరిస్థితులమూలంగా ఒకొకరిలో ఎలాటి ఆలోచనలు ఆవిర్భవిస్తాయో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించినకథ ఇది. జి.వి. కృష్ణరావుగారి “కీలుబొమ్మలు” నవలలో మానసికవిశ్లేషణ – ఒక వ్యక్తి అబద్ధం ఆడినతరవాత అదే నిజమని తనని తనే ఎలా నమ్మించుకుంటాడో – కృష్ణరావుగారు అద్భుతంగా చిత్రించేరు. ఈనవల “చివరిమిగిలేది” నవలకి తీసిపోదు శిల్పం దృష్ట్యా. ఎటొచ్చీ కృష్ణరావుగారి నవల కాంతాసమ్మితం కాదు. ఉద్వేగ్నత కలిగించే సన్నివేశాలు లేవు. ఆయనకి భజనసంఘాలు లేకపోవడం కూడా కారణం కావచ్చు ఆ నవలని గురించి మన పండితులు మాటాడకపోవడానికి. లత “గాలిపడగలూ నీటి బుడగలూ” మొత్తం సాహిత్యచరిత్రలోనే తొలిసారిగా వేశ్యలు అనుభవించే అమానుషహింసలు చిత్రించిన కథ. మాలతీ చందూర్ కథలన్నీ నాకు నచ్చవు కానీ ఆవిడ రాసిన “డాబా ఇల్లు” ఋణభ్రమణాలమీద బలమైన వ్యాఖ్యానం. అప్పు అప్పే. ఆ అప్పుకు నియమాలున్నాయి. సమయానికి తీర్చకపోతే ఋణదాత చట్టబద్ధంగానే ఇల్లు హక్కుభుక్తం చేసుకోవచ్చు. ఇది ఈనాటికీ వర్తించే నిత్యసత్యం. అలాగే పి. శ్రీదేవిగారి “వాళ్ళు పాడిన భూపాలరాగం” coming of age కథ. పి. సరళాదేవిగారి “ఎదురు చూసిన ముహూర్తం” స్త్రీ అస్తిత్వాన్ని ప్రశ్నించిన కథ. మునిపల్లె రాజుగారి “బోధివృక్ష ఛాయలో” మనిషికి ప్రకృతితో గల అనుబంధాన్ని చిత్రించిన కథ. “నిశ్శబ్దం” మనసంస్కృతిలో మౌనానికి గల ప్రముఖపాత్రని ప్రయోగాత్మకంగా ఆవిష్కరించిన కథ. చూడాలే కానీ వందలకొద్దీ కనిపిస్తాయి మనం సగర్వంగా చెప్పుకోదగ్గ కథలు తెలుగు సాహిత్యచరిత్రలో. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది వెనకటి రచనలు మాటాడదలుచుకుంటే వస్తువైవిధ్యం కూడా గమనంలోకి తీసుకోవాలి. లేకపోతే చరిత్ర సమగ్రం కాదు.

కొసమెరుపుగా నేను ఈ సుప్రసిద్ధులయిన, ప్రజ్ఞావంతులయిన విమర్శకులనందరినీ అడుగుతున్న ప్రశ్న – 40వ దశకంలో కనుపర్తి వరలక్ష్మమ్మగారు “కథ ఎట్లా ఉండాలె?” అని ఒక కథ రాసేరు. అందులో ఆమె ఆనాటి విమర్శకులమీద ఘాటైన విమర్శలే విసిరేరు. మీరు ఆ కథ చదివేరా? 40వ దశకంలో ఆమె లేవదీసిన ప్రశ్న 70 ఏళ్ళతరవాత ఈనాటికీ సత్యదూరం కాదని గమనించేరా? (నవ్వు).

ఈవ్యాసంలో ఉదహరించిన కొన్ని కథలకి అనువాదాలు –

కనుపర్తి వరలక్ష్మమ్మ. కథ ఎట్లా ఉండాలె

లత. గాలిపడగలు నీటిబుడగలు

పి. శ్రీదేవి. వాళ్ళు పాడిన భూపాలరాగం

పి. సరళాదేవి. ఎదురు చూసిన ముహూర్తం

తెలుగు కథలు (కథానిలయంలో)

పన్యాల రంగనాథరావు. దరిద్రం

——————-
ఎ.వి. రమణమూర్తిగారి అభిప్రాయం, వారిచ్చిన లింకు వివరాలు –
ఎందుకు పారేస్తాను నాన్నా?’ కథ గురించి అప్పుడప్పుడూ ఎవరో ఒకరు ఓ వ్యాసం రాయడం, మరొకరు దాన్ని ఏదో ఓ రూపంలో ఖండించడం జరుగుతూ వస్తున్నాయి. స్థూలంగా పరిశీలిస్తే:
• నచ్చినవాళ్ళకి ఆ కథలో పోషింపబడ్డ కరుణరసం చాలా అద్భుతంగా నచ్చింది.
• నచ్చనివాళ్ళకి – వాస్తవికతని సెంటిమెంటల్ ముగింపుకి చేర్చిన శిల్పప్రక్రియ నచ్చలేదు.

ఈ కథమీద ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని వ్యాసాలు:
1. జంపాల చౌదరి గారు రాసిన వ్యాసం. ఇందులో మెహెర్ గారు రాసిన ఓ వ్యాఖ్య చూడదగ్గది.
http://eemaata.com/em/issues/201111/1848.html

2. పై కథారచన గురించి చాసో గారు స్వయంగా చెప్పిన వ్యాసం. ఈ వ్యాసం చివర్లో లైలా యెర్నేని గారి వ్యాఖ్య గమనించదగ్గది. పిల్లవాడు చదువుకోవడంలేదని కన్నీరు మున్నీరై పోయే పాఠక హృదయాలు, కథ మొదలయ్యాక మూడో లైన్లోనే ఆ అనుభూతికి లోనవ్వాలి కదా, కథ ముగింపులోనే వాళ్ళకి అలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నని సంధించారు.
http://eemaata.com/em/issues/201201/1884.html

3. అరిపిరాల సత్యప్రసాద్ ఈ క్రింది వ్యాసంలో “కోపం ఎవరిమీదో తెలీకపోతే అది దుఃఖంగా మారుతుంది” అని అంటారు.
http://goo.gl/LTyW1R

4. ”’ప్ప…ప్ప….ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను, నాన్నా” అంటాడు కృష్ణుడు కథ ముగింపులో. ఎందుకు పారేస్తాను నాన్నా అనడంలోనే అనేక అర్థాల్ని స్ఫురింపచేస్తాడు చాసో. అది పిల్లవాడి ఆత్మవిశ్వాస ప్రకటన. ఒక నిర్వ్యాపకత్వం నుంచి, నిరాశనుంచి మొదలైన కథ పిల్లవాడి ప్రతిఘటనా ధోరణి ద్వారా సాగి ఒక ఆశావహ దృక్పథంలో కథ ముగించి పాఠకుడి చైతన్య స్థాయిని పెంచడం చాసో లక్ష్యం.” – కాట్రగడ్డ దయానంద్
http://54.243.62.7/essays/article-145981

పైవన్నీ ఒక ఎత్తైతే, ఈ కథని అర్థం చేసుకోవడానికి – ఆర్ ఎస్ సుదర్శనం గారు అక్టోబర్ 1980 భారతిలో వ్రాసిన వ్యాఖ్య ఒకటి ఉపకరిస్తుంది: “ఎందుకు పారేస్తాను నాన్నా?” అనే కథలో పిల్లవాడికి చదువుమీద ఉన్న ఆకాంక్షే తండ్రి దారిద్ర్య పరిస్థితిని అధిగమించినట్లూ, చిట్టచివర జీవితమే ఆర్థికసూత్రాలమీద విజయం సాధిస్తుందని తీర్పు ఇస్తూ ముగించారు. ఇటీవలి అభ్యుదయవాదులు (విప్లవవాదులు) ఆర్థికసూత్రాలకు పూర్తిగా దాసోహం అనేస్తున్నారు. పై కథలో నిర్వేదంతో ఆ తండ్రి పిల్లవాణ్ణి చంపి మూట కట్టినట్టు కూడా చిత్రించడానికి పూనుకుని అటువంటి ముగింపే ‘విప్లవానికి’ దోహదం చేస్తుంది అనే ధోరణిలో సమర్థించుకుంటారు నేటి విప్లవవాదులు. చాసో కథల్లో ఎటు చూసినా ‘జీవితా’నికే ప్రాధాన్యం. జీవిత వాస్తవికతలో ఎంతవరకూ ఆర్థిక శక్తులకు స్థానం ఉన్నదో అంతవరకూ మాత్రమే వాటికి ప్రవేశం లభిస్తుంది.”

పై వ్యాఖ్యని విమర్శిస్తూ నారాయణ వేణు గారు (డిసెంబర్ 1980 భారతి) : “…. కొడుకు చదువుకోసం తను చుట్టలు మాని కొడుకుని చదివించాలనుకోవడం ఆర్థికసూత్రాలకు అతీతంగా చేసిన చర్య కాదు. ఆర్థికసూత్రాలకి లోబడి జీవితవిలువలు రూపొందుతాయి కానీ, జీవిత విలువలకి లోబడి ఆర్థికసూత్రాలు రూపొందవు….” [ఫిబ్రవరి 1981 భారతిలో సుదర్శనం గారు తన వ్యాఖ్యలని మెచ్చుకుంటూ చాసో స్వయంగా వ్రాసిన లేఖని ఉదహరిస్తూ పై విమర్శకి ప్రత్యుత్తరం ఇచ్చారు]

RS-NV చర్చ ద్వారా గమనించదగిన ఒకే ఒక విషయం – కథ చివర్లో జీవితపు వాస్తవికత, ఆర్థికసూత్రాల మధ్య ఘర్షణ ప్రవేశపెట్టబడిందీ అనేది!
—————————–

(ఆగస్ట్ 17, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక 156 – ఎందుకు మళ్లీ “ఎందుకు పారేస్తాను నాన్నా?””

  1. ఇది చదివితే నాకు ఈ మధ్యన చదివిన ఒక పుస్తకం గుర్తుకు వచ్చింది పేరు ఎందుకు లేకానిండి శ్రీశ్రీ యుగకవి కాదు అని ఖండిస్తూ రాసిన పుస్తకం మీ రనట్టు ఇంక ఎవరు లేనట్టు ఇంక కవులెవరు రానట్టూ కలి యుగంత మై పోయేవరకు శ్రీశ్రీ ల గురించి చాసో ల గురించి వ్యాసాలు రాసుకోవడమేనా సమకాలీన సాహిత్యాన్ని ఆకళింపు చూసుకునేది ఏమయినా ఉందా?😢

    మెచ్చుకోండి

  2. పింగుబ్యాకు: వీక్షణం-150 | పుస్తకం
  3. తెలుగులో మంచి కథలు చలా ఉన్నాయి.అంతర్జాతీయ స్థాయికి చేరగలిగినవి కూడా ఉన్నాయి.విజ్ఞులు.విమర్శకులు చెప్పేది తెలుగు సాహిత్యం కవిత్వం,కథానిక ఈ రెండిట్లో బాగా ఉన్నతస్థాయి నందుకున్నాయని.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.