పతంజలి యోగసూత్రాలలో సాహిత్యం

పతంజలి యోగసూత్రాలలో ప్రధానంగా నన్ను ఆకట్టుకున్నది వాక్యనిర్మాణం, వస్తునిర్మాణం. ప్రతి సూత్రం అతి తక్కువ పదాలతో చెప్పలేనంత అర్థవంతంగా ఉండడం, పదాడంబరం లేకున్నా ఆలోచించుకోడానికి ఆస్కారం కావడం నన్ను ఆకర్షించేయి. మొత్తం పుస్తకం, 199 సూత్రాలు, ఇటుకమీద ఇటుక పేర్చినట్టు అమిరి ప్రతిభావంతంగా చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. మూడు వేల ఏళ్ళక్రితం ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యంతో ఈనాటికీ నిత్యజీవితంలో మన ప్రవర్తనకీ, మన వ్యక్తిత్వాలని తీర్చి దిద్దుకోడానికీ ఉపయోగపడగల జ్ఞానం ప్రసాదించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పతంజలి మహర్షికి ప్రణామములు.

ఇంగ్లీషు పుస్తకాల పేర్లు The Art of Living, Enlightened living లాటివి చూస్తే ఈ సూత్రాలను కార్యశీలకంగా అవిష్కరించినట్టు కనిపిస్తుంది. నేను ఈ పుస్తకాలు చూడకముందు కూడా నాకు అలాగే అనిపించింది.

అసలు యోగమంటే ఏమిటి? చిత్తవృత్తులను నిరోధించడం. ఇక్కడ నిరోధించడం అంటే అదుపులో ఉంచడం అని తరవాతి సూత్రాలు చూసేక అర్థమయింది నాకు. అసలు చిత్తవృత్తులు ఏవి అంటే యోగానికి సంబంధించి నంతవరకూ ప్రమాణం, ప్రత్యయం, వికల్పం, నిద్ర, స్మతి. తరవాతి సూత్రంలో వివరిస్తారు – ప్రమాణం అంటే మనకి ప్రత్యక్షంగా తెలిసినది, తర్కంద్వారా అంటే ప్రశ్నలు-సమధానాలద్వారా తెలుసుకోగలది, ఆగమాలు (పరంపరానుగతంగా మనకి గల శాస్త్రాలు) అని. ఇలా ప్రారంభంలో ఒకొక సూత్రం వివరణ తరవాతి సూత్రాలలో కనిపిస్తూ సాగుతుంది.

సహజంగానే ఈ సూత్రాలలో పునర్జన్మ, జన్మరాహిత్యం, బ్రహ్మైక్యం వంటి విషయాలచర్చ కూడా ఉంది. అవి చర్చించేంత తాత్త్విక పరిజ్ఞానం నాకు లేదు. ప్రస్తుతం ఈ సూత్రాలను తెలుగు భాషలో పెట్టడం మాత్రమే నా ధ్యేయంగా నిర్ణయించుకున్నాను. పతంజలి మహర్షే అంతర్నిహితంగా ఈ సూత్రనిర్మాణంలో సూచించేరు పదం తరవాత పదం అని.

ఈ సూత్రాలు అర్థం చేసుకోడానికి ఇది తొలిపాదం. అంటే మొదట ఈ సూత్రాలు నన్ను నేను అర్థం చేసుకోడానికీ, నిత్యజీవితంలో నా ప్రవృత్తిని తీర్చి దిద్దుకోడానికీ పనికొస్తాయి అనుకుంటున్నాను. ఉదాహరణకి, పైన చెప్పిన ప్రమాణం నిత్యవ్యవహారాలలో మన ఆలోచనాసరళికి అన్వయించుకోవచ్చు. అలాగే తరవాతి భాగం క్రియాయోగంలో పతంజలి చర్చించిన పంచక్లేశాలు – అవిద్య, అస్మిత (నేను అన్న భావం), రాగం, ద్వేషం. అభినివేశం కూడా. అభినివేశము అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి కానీ ఈ సూత్రాలలో బహుశా మితి మీరిన అభిలాష, అన్న అర్థం కనిపిస్తోంది. ఇవన్నీ మనకి నిత్యజీవితంలో అనుభవమే. విషయాన్ని ఇలా సమీకరించినందువల్ల మనం కూడా ఈ అంశాలను ఆలోచించుకోడానికి ఈ సూత్రాలు తోడ్పడతాయి. నాకు కావలసింది కేవలం సంస్కృతంలో ఉన్న సూత్రాలకి తెలుగు వాక్యాలు మాత్రమే. నేను అంతరార్థాలజోలికి పోవడం లేదు.

ఇలాటి విషయాలు నాకు ఇంగ్లీషులో అర్థం కావు. నిజానికి సగటు మానవులకి ఎవరికీ అర్థం కావేమో ఆ ఆంగ్లపండితులు సృష్టించిన సాంకేతిక పదజాలం. ఉదాహరణకి non-operation of the vibrational modes, drawn into birth in this world by their remaining latent impressions of ignorance వంటి వాక్యాలకి తెలుగులో అర్థం తెలుసుకునేసరికి అసలు విషయం ఏమిటో గుర్తుండడం లేదు. అంతే కాదు భారతీయులు ఇంగ్లీషులో రాసిన పుస్తకాలలో కూడా పదసంపద ఇలాగే ఉంది. ఇది నా అవగాహనలో లోపమేమో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఈ సూత్రాలు తెలుగులోనే కావాలన్న పట్టుదల హెచ్చింది.

నేను కాలేజీలో సంస్కృతం చదువుకున్నాను కానీ అదంతా అక్కడే వదిలేసినట్టున్నాను. ప్రస్తుతం ఈ సూత్రాలు చూస్తుంటే ఏదో తెలిసినట్టూ ఉంది, తెలియకుండా పోతున్నట్టూ ఉంది.

నారాయణస్వామి ఒక తెలుగు పుస్తకం పంపించేరు. మొత్తం నాలుగు ఇంగ్లీషు భాష్యాలూ, ఒక తెలుగు భాష్యమూ చేరేయి నాదగ్గర. అన్ని పుస్తకాలలోనూ తాత్విక చర్చ మహోన్నతస్థాయిలో ఉంది. రెండోది, ఈ భాష్యకారులందరూ పాఠకుడికి ఎంతో కొంత మన వేదాంతం తెలిసే ఉంటుందన్న ప్రాతిపదికమీద సాగించేరు వారి చర్చ.

ఈ కారణాలు అన్నిటిమూలంగా ఈ పుస్తకాలు చదివి నాకొచ్చిన తెలుగులో రాసుకోడానికి నేనే రాసుకోడానికి పూనుకున్నాను. అయితే నా ఈ ప్రయత్నం అంత తేలిక కాదని నాక్కూడా తెలుసు.

ఫేస్బుక్కులో ఓ పేజీ తెరిచి, సంస్కృత భాషా పరిజ్ఞానం గలవారి సహాయం కోరేను. ఒకరిద్దరు సాయం చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి పేర్లు ఇక్కడ పెట్టడం న్యాయం కాదనుకుంటాను. అదేదో శ్లోకంలో చెప్పినట్టు “విహితం అవిహితం వా” తెలిసీ తెలియకా నేను చేసిన తప్పులన్నిటికీ వారిని బాధ్యులని చేయడం న్యాయం కాదు కదా. నా ప్రయత్నం పూర్తయేక, “ఫలప్రదంగా ముగిసింది, దీనిమూలంగా కొంత లాభం ఉంది” అనిపిస్తే, నాకు సహాయ సహకారాలు అందించినవారిపేర్లు వారి అనుమతితో చెప్తాను. ఏతా వాతా ఇది కేవలం పతంజలి సూత్రాలకి పరిచయమాత్రంగానైనా ఉపయోగపడగలదు అనుకుంటే, మరొకసారి సంస్కరించి, దోషాలు పరిష్కరించి, ఒక చోట పెడతాను. అప్పుడు దాన్ని బాహాటంగా అందరికి అందించగలను.

 

—–

(ఆగస్ట్ 31, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “పతంజలి యోగసూత్రాలలో సాహిత్యం”

 1. పింగుబ్యాకు: వీక్షణం-151 | పుస్తకం
 2. kinghari010, మీతో కలిపి ముగ్గురు ఈ విషయంలో ఆసక్తి చూపడం నాకు చాలా సంతోషంగా ఉంది. నావ్యాసంలో చెప్పినట్టు నేను కూడా మీలాగే అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. వేరే పేజీ పెట్టడానికి ప్రయత్నిస్తాను.

  మెచ్చుకోండి

 3. నాకు మరీ ఆసక్తిగా ఉంది!
  నాకసలు యేమీ తెలియదు గాబట్టి పర్స్నలు వేసి మిమ్మల్ని విసిగించను.
  మీ శుభారంబహం కోసం యెద్రు చూస్తున్నాను.

  మెచ్చుకోండి

 4. చూస్తానండి. ఇక్కడ బాహాటంగా ప్రచురిస్తే, తలొకరూ తలొక మాటా అంటారని భయంగా ఉంది. ఇంకా కృత్యద్యవస్థలో ఉంది. నాకు కొంచెం స్పష్టమయినతరవాత ఇక్కడ కనీసం మరో పేజీ పెట్టి ఆ సూత్రాలు మీతో పంచుకుంటాను

  మెచ్చుకోండి

 5. మాలాటి సామాన్యులకు పతంజలి మీ ద్వారా చేరబోతున్నందుకు సంతోషం.మరీ ముఖ్యంగా భాషాపరంగా! చదవాలని,తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉంది.fb a/c లేనివారికీ అందేటట్లు చూడగలరు-డా.సుమన్ లత

  మెచ్చుకోండి

 6. సంతోషం జిలేబి గారు. బ్లాగుద్వారా బాహాటంగా పెట్టే ధైర్యం లేదింకా. మీకు Faceook ఖాతా ఉంటే అక్కడ చూడవచ్చు Patanjali Yoga sutramulu అని నా పేజీ. అది Closed group. మీరు సభ్యులుగా చేరితే చూడవచ్చు.

  మెచ్చుకోండి

 7. మంచి ప్రయత్నం.

  బ్లాగు టపా మూలకం గా పతంజలి యోగ సూత్రాలను మీరు “అర్థం” చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరి తో పంచు కుంటారని ఆశిస్తా . టపాలు ఎప్పటి నించి మొదలవుతాయి ?

  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s