విల్లు రాసి చూడు

“నువ్వెలాగా ఇల్లు కట్టబోవడం లేదు. పిల్లలకి పెళ్లిళ్ళా నువ్వు చెయ్యఖ్ఖర్లేకుండానే అయిపోయాయి. వాళ్లే చేసేసుకున్నారు. అసలు నన్నడిగితే ఈ రోజుల్లో ఇల్లు కట్టడం, పెళ్ళి చెయ్యడం కూడా డబ్బు పారేస్తే అయిపోతాయి. నువ్వు కుర్చీలో కూర్చునో పక్కమీంచి దిగకుండానో లాప్టాపెక్కి అన్నీ అరణ్యమెంట్లూ చేసీవొచ్చు,” అంటూ మొదలు పెట్టి స్నేహితుడు వాసు యాజులుగారికి లౌకికమైన మరియు ముఖ్యమైన విషయం ఊదర పెట్టేసేడు.

చావు అవాాచ్యం. చావుగురించి మాటాడ్డం అమంగళం. అదే తన చావుగురించయితే మరీ కష్టం. ఇహ కొడుకులూ, కోడళ్ళూ, వాళ్ళ పిల్లల ??? భయంకరం. అంతకన్న నరకం మరోటి లేదు

అస్పష్టంగానో అవ్యక్తంగానో అట్టడుగు పొరల్లో అణిగిమణిగి ఉన్న వాస్తవాన్ని కెలికి వెలికి తీసేడు వాసు. యాజులుగారికి అదేమంత హత్తలేదు. నిరామయంగా పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఊరుకున్నారు.

వాసు మళ్ళీ అందుకున్నాడు, “వీలునామా అలా కాదు. పండిత పరమేశ్వరశాస్త్రిలా నీకేమీ తికమకలు లేవని నాకూ తెలుసు. తగూలేసుకోడానికి దాయాదులు – అమ్మవంకో అబ్బవంకో ఆకాశంనించి ఊడి పడబోయేవారు ఎవరూ లేరను. కిమ్మనకుండా నమ్ముతాను. కానీ నువ్వున్నది ఇక్కడ దేశం కాని దేశంలో. నీకు ఇక్కడి చిక్కులు తెలీవు. నాయనా, ఇక్కడ చావంటే మాటలు కాదు. ఆ బుర్రకి కొంచెం పని పెట్టు. నీకే తెలుస్తుంది. నీకు ఏమున్నా లేకున్నా శరీరం అంటూ ఒకటుందా? దాన్ని కాల్చాలా? పూడ్చాలా? అదీ ఇదీ కాకపోతే మరేదో గౌరవం దానికంటగట్టి, వివిధ ముక్కలు సద్వినియోగానికి పెట్టాలా? అలా చేసినా అక్కడితో అయిపోదు. ఆ మీదట కొరవ ముక్కల్ని ఏం చెయ్యాలి అన్నది కూడా పెద్ద ప్రశ్నే నువ్వు హరీమనగానే. సరేలే వీటిసంగతి తరవాత చూద్దాం అనకు. చావు మనచేతిలో లేదని ఏరోజు టీవీలో వార్తలు చూసినా తెలుస్తుంది కద. వీధిలోకి అడుగెడితే ఏ కారు నుండో ఊడిపడి చెల్లా చెదురుగా దర్శనమిచ్చే గాజు పెంకులూ ఇనపముక్కలూ చెప్తాయి మన బతుక్కి నిజ వ్యాఖ్యానాలు.”

అంతవరకూ కళ్ళప్పగించి వింటున్న యాజులుగారు ఠక్కున లేచి నిలబడ్డారు. “బాబూ, నీకో దణ్ణం. నావల్ల కాదు ఈ సోది భరించడం.”

“సరే నామాట వినకు. మరో కథ చెప్తాను. ఇదే ఆఖరు. నువ్వు కాదంటే మళ్ళీ ఈ ఊసెత్తను. మన ఊళ్ళోనే పాతికేళ్ళక్రితం మాఅక్కయ పోయింది. ఒంటరి. బాగానే సంపాదించింది. కానీ ఎక్కడ ఏం ఉన్నాయో ఎవరికీ చెప్పలేదు. పైగా ఇదుగో ఇప్పుడు నాలాగే ఎవరైనా విల్లు రాయమని చెప్తే, అదేదో గొప్ప హాస్యం అయినట్టు విల్లు రాయమంటున్నారు, హాహా అంటూ నవ్వేసేది. ఆవిడగారు హాయిగానే పోయింది కానీ పోతూ పోతూ ఈ భూప్రపంచకంలో వదిలేసిన చిక్కులు నానెత్తిన పడ్డాయి. ఎక్కడెక్కడ ఖాతాలున్నాయో, ఎవరికి అప్పులిచ్చిందో, ఎవరిదగ్గర తీసుకుందో, ఎక్కడ ఏంవేం పెట్టిబళ్లు పెట్టిందో, ఏ బాంకుల్లో ఏ ఖాతాలున్నాయో, బంగారం ఎక్కడ దాచిందో అవన్నీ కనుక్కుని చిక్కులు విప్పి ఎలా పంపకాలు పెట్టాలో తేల్చుకోడానికి మూడున్నరేళ్లు పట్టింది నాకు. ఇప్పుడు కూడా రావలసిందంతా వచ్చిందన్న నమ్మకం లేదు.”

“సర్లెద్దూ. నాకేముంది అంత ఆర్భాటం చెయ్యడానికి. నెలసరి వచ్చిన పింఛను గాజులబేరం భోజనానికే సరి,” అన్నారు యాజులు గారు.

“అదే నేను చెప్తున్నది. మనూళ్ళలోనే ఉంటే బహుశా నీ ఖర్చులు పోగా నీ ఆదాయంలో మిగిలిందాంతోనో లేకపోతే తామే ఖర్చులు పెట్టుకునో నిన్ను తగలేసేస్తారు. అక్కడితో అన్ని ఋణాలూ తీరిపోతాయి, కథ అయిపోతుంది. ఈ దేశంలో అలా కాదు. పోన్లే, నామాట వినొద్దు. అదో కాలక్షేపం అనుకో. ఊరికే ఓ లాయరుని కలుసుకుని దాన్లో లుకలుకలు తెలుసుకుందాం,” అన్నాడు వాసు వదలకుండా.

వాళ్ళిద్దరూ ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుని ఒక పంచన పెరిగినవాళ్ళు కారు. కానీ ఈ దేశం వచ్చేక “మనవాళ్ళ మొహాలూ” మాటా కలిపి ఊసులాడుకునేవాళ్ళూ అంత తేలిగ్గా దొరకరు కనక, అంతటి స్నేహమూ కుదిరింది వారిద్దరిమధ్యా. అచిరకాలంలోనే నువ్వూ నువ్వూ అనుకోడం కూడా మొదలెట్టేరు. వారి అర్థాంగులతో వదినవరసలు కూడా కలుపుకునీసేరు. యాజులుగారి భార్య పోయేకే అమెరికాకి తరలివచ్చేరు కొడుకుల ప్రోద్బలంతో. వాసు ఆవిడని ఎరగడు కానీ మాటల్లో మాత్రం వదినగారనే.

ఆ పూట వాసుమూలంగా యాజులుగారికి శిష్టాచారములు చక్కగ పాటించు ఉత్కృష్టమైన అమెరికాదేశములో తన అశాశ్వత శరీరంగురించీ, దాన్ని అంతమొందించు విధానముగురించి ఆలోచించే మహదవకాశం లభించింది. ప్రస్తుతం ఇది సమాచారయుగం కనక సమాచారము సేకరించుట తన ధర్మం అని నిశ్చయించుకున్నారు. అయితే ఈ చావుతో చచ్చే చావు అని లాయరుని కలిసినతరవాత కానీ తెలీలేదు.

మళ్ళీ వాసుదేవుని కాళ్ళు పట్టుకోలేదు కానీ అతనిమొహంతో, “పద, ఎవరో లాయరున్నారన్నావు కదా,” అన్నారు. ఆయనకి తన కుమారులతో సంప్రదించడానికి మనసొప్పలేదు. చూస్తూ చూస్తూ “నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావో ఇప్పుడు అత్యవసరంగా చెప్పేసెయ్” అని ఎలా అడగడం? కొందరికి అదేం విడ్డూరం కాకపోవచ్చు. యాజులుగారికి మాత్రం నోరు రాలేదు. అంచేత వారు వాసుదేవుని శరణు జొచ్చిరి.

వాసు కళ్ళు చిట్లించి చిన్ముద్ర పట్టి రెండో పాఠం పెట్టేడు, “నాయనా, ఏదో నీదగ్గరున్న నాలుగు పరకలూ నీ ఇద్దరు పిల్లలకి సమంగా పంచిపెట్టేస్తానంటే అయిపోతుందనుకుంటున్నావు నువ్వు. లేదు తండ్రీ, అంత తేలికభాషలో చెప్తే ఈ న్యాయ ప్రభువులకు అర్థం కాదు. ఈ గవర్నమెంటోళ్ళు ఏ స్కూల్లో చదివేరో కానీ నువ్వూ నేనూ చదివిన బళ్ళో మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అసలు వాళ్లకి ఇంగ్లీషు రాదేమో అని కూడా నా అనుమానం. అంచేత వీలునామా అను పత్రం ఎలా మొదలవుతుందో సూక్ష్మంగా వివరిస్తాను, విను.

ముందు నీ గోత్రనామాలు చెప్పుకుంటావు. అదేలే ఇక్కడ గోత్రనామాలు అనరు. ఫలానావారి కొడుకు, కూతురు, భార్య ఇలా మొదలవుతుంది. ఆ ఫలానావారికి గల అస్తిత్వం ఏమిటో నాకర్థం కాదు. నువ్వు చింతామల వెంకటపండిత చొక్కరాయలు కుమారుడిని అంటావనుకో. మరి ఆ చింతామల వెంకటపండిత చొక్కరాయలు ఎవరో కోర్టువారి దివ్యసమ్ముఖానికి తెలిసేడుస్తుందేమిటి? ఏ కాలువపక్కనో కునుకు తీస్తున్న ఏ ముసలాయన్నో తెచ్చి ఈయనే చింతామల వెంకటపండిత చొక్కరాయలు అని నువ్వు చెప్తే వాళ్ళు ఒప్పేసుకుంటారు. మరో సంగతి – ఇక్కడ వీళ్లు పదే పదే వల్లించే ఓ సూక్తి ఉంది వినే ఉంటావు తగుసమయము, తగు స్థానము అని. అలాగే నువ్వు చచ్చేసమయానికి తగుస్థానంలో తగినవారు ఉంటే నీపని నీకు తగ్గట్టు అయిపోతుంది. లేదా, రెండు జరగడానికి అవకాశం ఉంది. నీదగ్గరున్న అణా పరకా ఎలా ఎవరికి చెందాలో నిర్ణయించి అలా నిర్ణయించినందుకు ఖర్చులపేరుతో తినేస్తారు ప్రబేటు కోర్టువారు. నీపిల్లలకి మిగిలేది కాయితపుముక్క మాత్రమే. లేదా ఏ లాయరో నీకేసు అదేలే నీకొడుకులకేసు చేపట్టి, తగువు నీకు సుముఖంగా తీర్పు ఇప్పించేస్తారు. సందేహం లేదు. కానీ ఆ తరవాత ఆ తీర్పు అలా నీకు అనుకూలంగా ఇప్పించినందుకుగాను ఖర్చులంటూ వారు మింగేస్తారు. మళ్ళీ నీపుత్రులకు మిగిలేది గెలిచేం అని చెప్పుకు తిరగడానికి పనికొచ్చే కాయితమ్ముక్క మాత్రమే.”

యాజులుగారు చిన్న కునుకు తీసి, కళ్ళు తెరిచి, “సరే,” అన్నారు. ఆయన ఎంత విన్నారో వాసు పట్టించుకోలేదు. తనకి తెలిసినదంతా చెప్పేసేనన్న ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడాయన. మొత్తమ్మీద యాజులుగారు వీలునామా రాయించడానికి సన్నిద్ధులయేరు. వాసు తనకి తెలిసిన లాయరుతో మాటాడి సుముహూర్తం నిర్ణయించేరు. వచ్చే మంగళవారం ఉదయం పదిన్నర దివ్యంగా ఉందిట. లాయరు ఆపీసు కూడా యాజులుగారింటికి అట్టే దూరం కాదు. వాసు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళడానికి నిశ్చయమయింది.

సదరు మంగళవారం ఇద్దరూ లాయరుగారి ఆఫీసు చేరుకున్నారు ఖచ్చితంగా అనుకున్న సమయానికి.

శాస్త్రప్రకారం కుశలప్రశ్నలయేక, లాయరు అసలు విషయం ప్రారంభించేడు.

లాయరు, “ముందు కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతాను.”

యాజులు, “అలా కాదు. ముందు నేను ఉన్నసంగతి చెప్పేస్తాను.”

లా – “సరే. చెప్పండి.”

యా – “నాకేమీ లక్షలూ కోట్లూ ఆస్తుల్లేవు. ఉన్న నాలుగు డబ్బులూ ఒకే బాంకులో ఒకే ఖాతాలో ఉన్నాయి. అప్పులు అస్సలు లేవు. ఆ కాస్త సొమ్మూ ఇద్దరు కొడుకులకీ చెరి సగం అని రాసేయండి. అంతే. అదే నా విల్లు.”

లాయరు అంతా విని, “నేను కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతాను,” అని మొదలు పెట్టేడు. వాసు నెమ్మదిగా, “వాళ్ళపద్ధతిలో మాత్రమే వాళ్లు పని చేయగలరు. అది వాళ్ళ సిద్ధాంతం. నువ్వు ఏం చెప్పినా లెఖ్ఖ లేదు. వాళ్ళ ప్రశ్నలకి జవాబులు చెప్పేస్తే సరిపోతుంది,” అన్నాడు.

యాజులు తలూపేరు.

“నీకు ఎన్ని ఖాతాలు ఎన్ని బాంకుల్లో ఉన్నాయి?”

“ఎన్ని అప్పులు? ఎక్కడెక్కడ? ఎంత అప్పు?”

“ఇతర చరాస్తులు – బంగారం, వెండిసామాను, కార్లు, పురానాణెములు, స్టాంపులలాటివి?”

“జీవితభీమా ఏ కంపెనీ, ఎంతకి?”

యాజులుగారు అనన్యసామాన్యమైన ఓపికతో జవాబులు చెప్పి తన విధి నిర్వర్తించేరు.

తొలి వరుస ప్రశ్నోత్తరాలు తయారయేయి. నిజానికి అంతా ఒకే వాక్యం. ఒకే బాంకులో ఖాతా. ఆయనున్న కాండో పెద్దవాడు పెట్టుబడికింద కొన్నాడు కనక అది వాడిదే. చిన్నవాడికి కార్ల సరదా. రెండేళ్ళకోమారు కొత్త కారు కొంటాడు. అలా తన ముందటి కారు తండ్రికి ఇచ్చేడు. అంచేత ఆ కారు వాడిదే. మరేం లేవు ఆస్తిపాస్తులని చెప్పుకోడానికి.

“సరే. ఇప్పుడు చెప్పు. నీవారసులెవరు?”

“ఇద్దరు కొడుకులు. అంతా వారికి చెరి సగం సమానంగా చెందుతుంది.”

అంతవరకూ ఫరవాలేదనే అనిపించిందాయనకి. కానీ ఆ తరవాత లాయరు వేసిన ప్రశ్నలు యాజులుగారిని విపరీతంగా కలిచివేసినవి.

మా పాఠకులకు ఇదే హెచ్చరిక దయతో గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకు మున్ను చెప్పిన సాధారణప్రశ్నలు అయినతరవాత జరిగిన సంభాషణ సున్నితమనస్కులకు తగినది కాకపోవచ్చు. మీకు ఇతోధికమైన బాధ కలుగుటకు అవకాశము కలదని మేము నమ్ముచున్నాము.

నిజానికి లాయరుగారు తమ బిజినెస్ 101లో నేర్చుకున్న విద్యనంతా ఉపయోగించి, ఎంతో మృదువుగా చావన్నమాట నోట పలకకుండా, పంచదారపూతలతో వాక్యాలను అష్టవంకరలూ తిప్పుతూ అనేక డొంకలు తిరుగుతూ సాగించేరు. కానీ యాజులుగారిమాటలలో చెప్పమంటే ఆ సంభాషణ వారి మాటలలో ఎలా ఉంటుందో ఇక్కడ ఇస్తున్నాను. నిజంగా జరిగే సంభాషణకీ జవాబులు ఇచ్చుకునేవారికి ఆ సంభాషణ ఎలా మనసులో నాటుకుంటుందో తెల్లమయేది ఆయనమాటల్లోనే చెప్తేనే. అదీ ఈ హెచ్చరిక సారాంశం!

ఆ ప్రశ్నోత్తరములు యాజులుగారి మాటలలో ఇలా సాగేయి:

“నీ వీలునామా executor ఎవరు?”

“హాఁ?”

“అదేనయ్యా నువ్వు చచ్చేక ఎవరు దిక్కని?”

“కొడుకులే కదా?”

“ఇద్దరియితే వాడోమాటా వీడో మాట అవొచ్చు. ఒక పేరు చెప్పు.”

“సరే. పెద్దవాడిపేరు రాసుకో.”

“పెద్దవాడు. మరి ఆ పెద్దవాడు చస్తే?”

“చిన్నవాడు.”

“పెద్దవాడిసొమ్ము ఎవడికి దక్కుతుంది?”

“వాడి పెళ్ళానికే కదా.”

“ఆవిడ చస్తే?”

“పిల్లలకి చెందదూ, మళ్ళీ అడగాలా?”

“వాళ్ళు చస్తే?”

“చిన్నవాడు అంతా చూసుకుంటాడు.”

“పెద్ద కోడలు ఆస్తి తనదని పేచీ పెట్టొచ్చు. మరో పెళ్లి చేసుకోవచ్చు”

“ఆవిడ అలాటి మనిషి కాదు.”

“వారిద్దరిమధ్య ఆ ఏర్పాటు ఉందా?”

“ఉందనే అనుకుంటున్నాను.”

“చిన్నవాడు చస్తే?”

“చిన్న కోడలు చూసుకుంటుంది.”

“చిన్నకోడలు చస్తే?”

“నా ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఎంతమందో తెలీదు కానీ ప్రస్తుతానికి ముగ్గురు మనవలూ, ఇంకా ఉంటే మునిమనవలూ … అంతా గాలివానకి తుడిచిపెట్టుకు పోయినట్టు ఒఖ్ఖమారే లేదా వరసక్రమంలో ఒకరి తరవాత ఒకరు చస్తే ఆ పైన నేను కాదు నా డబ్బేం అవుతుందని మీ ప్రశ్న. అలా మొత్తం నాకుటుంబం సర్వనాశనం అయేక నేనింకా బతికుంటాననేనా?”

“నువ్వచ్చుకున్న వెయ్యి డాలర్లకి నీకు ఇదంతా చెప్పడం నావిధి. నీకు పరిపూర్ణంగా తృప్తినిచ్చేలా నేను వివరాలు ఇస్తున్నాను. నువ్వూ నీవాళ్లూ అందరూ చచ్చేక, నీ ఆస్తి ఏమవుతుందో చెప్పకపోతే, గవుర్నమెంటువారికి పోతుంది.”

“ఈ మారణహోమం ముగిసేక ఇంకెవరున్నారు నాసొమ్ము తినడానికి?”

“సాదారణంగా ఏ సాంఘికసేవా సంస్థకో రాసిస్తారు.”

“ఆ సంస్థ మాత్రం ఎల్లకాలం ఉంటుందనేముంది? సంస్థ యజమానులు తినేయొచ్చు. అది దివాలా తీయొచ్చు. అప్పుడేమవుతుంది?”

“సంస్థ అప్పులాళ్ళకి పోతుంది మీ ఆస్తితో సహా.”

“ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు ఏ దగుల్బాజీ అప్పులో తీర్చడానికా ఈ తాపత్రయం అంతా?”

“సిస్టములు అలాగే పని చేస్తాయి,” అన్నాడు లాయరు నిరామయంగా.

“ఇంతమంది చచ్చిక నేనింకా ఉంటాననే అనుకోండి. ఈ నిర్ణయాలేవో అప్పుడే నేను చేసుకోవచ్చు కదా.”

“అవును. ఇప్పుడు మరో ప్రశ్న. నువ్వు నిర్ణయించుకోగల స్థితిలో ఉంటావనేముంది? చావూ బతుకూ కాని దిక్కుమాలిన స్థితిలో మంచంలో పడి నెలలతరబడి ఉండిపోవచ్చు. ఆమాటకొస్తే సంవత్సరాలతరబడి కూడా అలా కుళ్లి కృశించిపోయినవాళ్ళున్నారు.”

“?”

“అలా జరుగుతుందని కాదు. ఇదంతా ముందుచూపు. బతుకు ఎంత నికృష్టమో, నువ్వు ఎలాటి దురవస్థపాలు కావడానికి అవకాశం ఉందో వాటన్నిటికీ సమాధానాలు సిద్ధపరచి ఉంచాలి. అది విడమర్చి చెప్పడం నా విధి.”

“నేను మంచంలో ఉండి నిర్ణయాలు చేయకూడదా?”

“నిర్ణయం చేయగల మతిస్తిమితం ఉంటుందనే అశిస్తాం. ఒకొకప్పుడు కోమాలోనో, మతి మాలిన స్థితిలోనో నెలలూ, సంవత్సరాలూ కూడా ఉండడం జరుగుతుంది. నువ్వు Health Directive సిద్ధం చేసి ఉంచడం నీకే మంచిది.”

మరో నాలుగు కాయితాలు తీసేడు లాయరు. మళ్ళీ పైన చెప్పిన పేర్లే మరోమారు అదే వరసలో చెప్పబడ్డాయి. ఆ క్షణంలో తన కొడుకులకి రామా, కృష్ణా అని పేర్లు పెట్టనందుకు యాజులు రవంత విచారించేరు.

మరో వరస ప్రశ్నలు –

“నీ శవాన్ని సంపూర్ణంగా రూపు మాపడం ఎలా?”

“కొడుకులే ఆ సమయానికి వాళ్లకి సుగమం అయినమార్గంలో కానిచ్చేయమని రాయి. నాకు ఏ విధమైన అభ్యంతరాలూ లేవు.”

“మీకు ఏది ఇష్టం?”

“అయ్యా! లాయరుగారూ, నాప్రాణం పోయినతరవాత ఈ శరీరం నాది కాదు. నేనే నిత్యం కాదు. శరీరం ఏమవుతుంది అని నేను విచారించాలా?”

“నువ్వు ఇప్పుడు స్పష్టంగా చెప్తే వారికి తేలిక అవుతుంది. ఇద్దరున్నారు కదా. ఇద్దరికీ చెరో ఆలోచనా రావొచ్చు. దాంతో తగువు.”

“సరే. ఊళ్లో ఆస్పత్రికి ఇచ్చేయమని చెప్పండి.”

“మళ్లీ వాళ్ళు నీ కాయాన్ని వినియోగించే విధానం నాలుగు ఉన్నాయి. 1. క్లాసులో పాఠాలకి 2. పరిశోధన 3 అవరసరమైనభాగాలు అవసరమైనవారికి దానం 4. therapy.”

“అవసరమైన భాగాలు అవసరమైనవారికి ఇవ్వమని రాయి.”

“ఆ భాగాలు తొలగించిన తరవాత మిగతా భాగాలు ఏం చెయ్యమంటారు?”

“కూరొండుకోమను. లేదా పులుసులో ముక్కలు చేసుకోమను” అన్నారు వాసుతో తెలుగులో.

ఆయన వాసుని సలహా అడుగుతున్నారనుకున్నాడు లాయరు. వాసుతో “అది తప్పనిసరిగా చెప్పాలని కాదు. కానీ ఇప్పుడు అంతా పకడ్బందీగా రాసేస్తే ఆ తరవాత executor కి శ్రమ తప్పుతుంది.”

ఎందుకొచ్చిన గోల అడుగడుక్కీ అవరోధం అనుకుని, “కాల్చీమను” అన్నారు యాజులుగారు.

ఆ క్షణంలో ఆయన వీలు రాయించడానికి కొడుకులని తీసుకురానందుకు మనసులోనే సంతోషించేరు.

లాయరు ఆ మాట రాసుకుని, తలెత్తి తనపని సక్రమంగా నిర్వర్తించిన ఆనందంతో, “అంతా అయిపోయినట్టే. మరో రెండు చిన్నవిషయాలున్నాయి,” అన్నాడు.

“ఇంకా ఏమున్నాయి?”

“ఇల్లు, కారు, ఇంకా ఏవైనా విలువైన వస్తువులు ఉంటే ఎవరికి ఏమి ఇస్తారో చెప్పండి.”

“చెప్పేను కదా. ఇల్లు పెద్దవాడిది, కారు చిన్నవాడిది అని.”

“నగా, నట్రా వదినగారివి తెచ్చేసుకున్నానన్నావు కదా,” అన్నాడు వాసు స్వరం తగ్గించి.

యాజులుగారు ఇబ్బందిగా మొహం పెట్టేరు. నిజమే. ఇల్లాలు పోయేక, ఆవిడ నగలు తనదగ్గరే ఉంచుకున్నారు. వాటికి తనమనసులో ఉన్న విలువ ఇంకెవరికీ అర్థం కాదు చెప్పినా కూడా. లాయరుతో మాత్రం ఏమీ లేవని చెప్పేసేడు.

“Conservator గా ఎవర్ని నిర్ణయిస్తారు?”

“మళ్ళీ అదేమిటి? కొడుకులూ, వాళ్ళ పెళ్ళాలు, వాళ్ల పిల్లలు … ఇంతమంది ఉండగా.”

“ఏదైనా తగువొస్తే, తీర్చడానికి.”

“ఎలాటి తగువులొస్తాయి?”

“ఇప్పుడు చెప్పలేం. ఎలాటివైనా రావొచ్చు.”

వాసుకి తనపేరు చెప్పొచ్చు కదా అని ఉంది కానీ నాపేరు పెట్టు అని చెప్పడానికి నోరు రాలేదు. “ఫ్లోరిడాలోనో ఎక్కడో మీ చినతాతగారి మూడో అల్లుడి తమ్ముడు ఉన్నాడన్నావు కదా?”

“బతికుండగా మాటా మంతీ లేదు చచ్చేక వస్తాడా?,” అని వాసుకి చెప్పి, “నిజంగా తగువంటూ వస్తే ఆవేళకి ఎలాటి తగువో దాన్ని బట్టి ఎవరో తగిన లాయరుని వాళ్లే చూసుకుంటారులెండి,” అన్నారు లాయరుతో.

అక్కడికి ఆ తగువులు ముగిసేయి. ముగిసేయి అని యాజులుగారు అనుకున్నారు.

లాయరు గారు నిటారుగా సర్దుకుని కూర్చుని, “దాదాపు అంతా అయిపోయినట్టే” అన్నాడు మూడో మారు.

“అంటే ఇంకా ఏవో ధర్మవిధులు ఉన్నాయనా?”

“ట్రస్టు కూడా సిద్దం చేసేస్తే అయిపోతుంది.”

“ఇంతసేపూ చెప్పిందేమిటి. అంత ట్రస్టు సృష్టించేంత ఆస్తులేం లేవంటున్నాను కదా.”

“ఇక్కడ లక్షకి మించి బాంకులో ఉంటే, పన్నులు ఎక్కువ కట్టుకోవలసివస్తుంది వారసులు.”

“లక్షెక్కడుంది. లేదు లెండి.”

“ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఏ స్టాకుల్లోనో పెడితే పెరుగుతుంది కదా. అంతే కాదు. ఇవాళ మన స్టేటు లక్ష అంటున్నారు. ఆ రూలు అలాగే ఉంటుందనేముంది? రేపు యాభైయే అనొచ్చు.”

యాజులుగారికి కళ్ళనీళ్ళపర్యంతమయింది. “కనీసం ఈ బాధలు తప్పించుకోడానికైనా నేను చావకుండా ఉండాలేమో,” అన్నారు మిత్రుడితో.

“అంతే మరి. ఈ ప్రభుత్వాలు బతకడానికి దారి చూపవు కానీ చస్తే లక్ష ఆంక్షలు. ఆత్మహత్య నేరం అని పట్టుకు జైల్లో పడేసినట్టు. అక్కడ జైల్లో మరోవిధంగా చస్తే ఏమీ చెయ్యలేరు.”

పాఠకులారా, ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది. ఇంక కథ సాగించలేను. కానీ ఒక్కమాటలో ట్రస్టీగా ఎవరిని నియమించాలి అని మొదలు పెట్టి పైన చెప్పిన వరసలోనే ఆ పేర్లే మరోమారు చదివి అయిందనిపించేరు.

లాయరు ఆపీసునించి బయటికి వచ్చేక, వాసు, “భోజనంవేళ దాటిపోయింది. ఇక్కడ తినేసి పోదామా?” అని అడిగేడు.

యాజులు నీరసంగా తల అడ్డంగా ఊపుతూ, “నేనిప్పుడేం తినలేను. ఇంటికి పోదాం పద,” అన్నారు.

ఇంటిముందు కారాగేక, ఆయన వాసుకి ధన్యవాదాలు చెప్పి కారు దిగేరు. వాసు ఆఁ ఏముంది ధన్యవాదాలకి అని తేలిగ్గా అనేసి వెళ్ళిపోయేడు.

యాజులుగారు మెట్లమీద నిలబడి అట్టే వాసు కనుమరుగయేవరకూ చూసేరు. మ్. ఈ వాసు కలలో కూడా ఊహించని ఒక పని తనచేత చేయించేడు. తనజీవితంలోకి ఇతను ఇందుకే వచ్చేడా? ఎంతమంది తన జీవితంలో వచ్చి పోయేరో తలుచుకుంటూ తలుపు తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టేరు.

హఠాత్తుగా జేబు ఖాళీ అయిపోయినట్టుంది, మొత్తం శరీరమే తేలికగా దూదిపింజెలా అనిపిస్తోంది. “బుల్లిపాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేడు”. అసలు తాను పోగు చేసిన వస్తువుసంచయం అట్టే లేనే లేదు. ఉన్న నాలుగు వస్తువులు కూడా తనవి కానట్టు ఉంది. గది కలయజూస్తుంటే ఎదుట అల్మైరాలో పాతికేళ్లక్రితం తనకి చిన్నతాతగారిచ్చిన పుస్తకం కనిపించింది. నెమ్మదిగా లేచి వెళ్ళి, నెమ్మదిగా చేతిలోకి తీసుకుని, దుమ్ము దులిపి తెరిచేరు.

అథ! …

000

(అథ పదానికి వివరణ – పతంజలి యోగసూత్రాలలో మొదటి సూత్రం “అథ యోగానుశాసనమ్”. అందులో మొదటి పదం “అథ”. ఆ పదానికి పండితులు ఇచ్చిన వ్యాఖ్యానం ఏమిటంటే గృహస్థధర్మాలు నిర్వర్తించిన తరవాత మనిషి యోగసాధనగురించిన ఆలోచనతో యోగ్యుడయిన గురువుని ఆశ్రయించినప్పుడు, “ఇప్పుడు నువ్వు యోగసాధన మొదలు” అని.)

(సెప్టెంబరు 8, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

24 thoughts on “విల్లు రాసి చూడు”

 1. వీలునామా రాయటం మంచిదే. వారసులు కి మనం ఒక విధానమునకు దారి చూపటం మరియు నడవడికల మంచి, చెడుల జీవనయానము తెలియచేయుట.

  మెచ్చుకోండి

 2. లక్ష్మీ రాఘవగారూ, మీ స్పందనకి కృతజ్ఞతలు. బహుశా ఇండియాలో ఇంత హడావుడి ఉండకపోవచ్చు ముఖ్యంగా సౌధారణ మధ్యతరగతి అయితే అనుకుంటున్నా. ఏమైనా లాయరుని సంప్రదించడం మాత్రం మంచిదే. శుభం.

  మెచ్చుకోండి

 3. >బాగానే సంపాదించింది. కానీ ఎక్కడ ఏం ఉన్నాయో ఎవరికీ చెప్పలేదు.< ఇది మా దొడ్డమ్మ భర్త( పెద్దనాన్నగారు) చేసినట్టే ఉంది.
  “ఎక్కడెక్కడ ఖాతాలున్నాయో, ఎవరికి అప్పులిచ్చిందో, ఎవరిదగ్గర తీసుకుందో, ఎక్కడ ఏంవేం పెట్టిబళ్లు పెట్టిందో, ఏ బాంకుల్లో ఏ ఖాతాలున్నాయో, బంగారం ఎక్కడ దాచిందో అవన్నీ కనుక్కుని చిక్కులు విప్పి ఎలా పంపకాలు పెట్టాలో తేల్చుకోడానికి మూడున్నరేళ్లు పట్టింది నాకు”
  అవి ఇన్నేళ్ళయినా ఇప్పటికీ తెలియలేదెవరికీ..
  ““అంచేత వారు వాసుదేవుని శరణు జొచ్చిరి.” “కనీసం ఈ బాధలు తప్పించుకోడానికైనా నేను చావకుండా ఉండాలేమో,” Great humor 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. కథ చాలా బాగుందండి. ఈ కథ చదువుతుంటే మేము పడ్డ కష్టాలన్నీ గుర్తోచ్చాయండి. కాని మా పరిస్థితి ఈ కథకి బిన్నంగా ఉన్నింది. మా తాత గారికి వీలునామలు రాసే హాబీ ఉండేది. ఏడాదికి ఒక వీలునామా రాసేసే వారట. మా నాన గారు అందుకు పూర్తి విరుద్ధం. వారిద్దరూ చనిపోయాక, ఈ ఎక్కువ వీలునామాల సమస్య, అసలు వీలునామా లేని మా నాన సమస్య, చాలా కష్ట పడ్డాం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. నీహారిక గారు, మేము మా మేనత్తకి కేవలం ఒకటిన్నర ఎకరం భూమి ఇచ్చినందుకే మా ఊరివాళ్ళు అభ్యంతరం చెప్పారు, వాళ్ళకి కూడా ఆడపిల్లలు ఆస్తిలో వాటా అడుగుతారని.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. నరసింహారావుగారూ, హింస అని నాకు తట్టలేదు.బాగుంది. నిజమేనండి. అసలు అమెరికాలో కూడా వేరు వేరు రాష్ట్రాలలో వేరు రూల్సు. నేనిక్కడ కథకోసం కొంచెం అతి కూడా చేసేను లెండి. పోతే ఇండియాలోనే ఒకావిడ విల్లు రాయకపోవడంవల్ల తమ్ముడు నానా అవస్థలు పడ్డమాట మాత్రం నిజం. అసలు మనదేశంలో విల్లుదాకా ఎందుకు నాటకంలో చావు ఉన్న పాత్ర – లోహితాస్యుడు పాత్ర నిడుదవోలు వెంకటరావుగారు వేయడానికి వారి తల్లిగారు ఒప్పుకోలేదుట.

  మెచ్చుకోండి

 7. చాలామంది ఆస్తులున్నా వీలునామా రాయరు.సెంటిమెంటు ,భయం వల్ల.తరవాత వాళ్ళ వారసులు తగాదాలు పడతారు.(అన్ని కేసుల్లోను అలా జరగక పోవచ్చును).అన్నివిషయాలూ సందిగ్ధం లేకుండా వీలునామా రాయడమేమంచిది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. శ్రీదేవి గారు చెప్పిన “hkmsa” టైపింగ్ పొరపాటు అయ్యుంటుందని, ఆవిడ అనదల్చుకున్నది “himsa” (హింస) అయ్యుంటుందనీ నా అభిప్రాయం.
  మాలతి గారు వర్ణించినది బహుశ: అమెరికాలో విల్లు తయారు చేసే పద్ధతేమో? దాన్ని thoroughness అనాలేమో. మంచిదేలెండి, “కీడెంచి మేలెంచమన్నారు” అన్న సూత్రమే ముఖ్యం కదా ఇటువంటి విషయాల్లో. అమెరికాలో Estate Tax / Inheritance Tax కూడా ఎక్కువేమో? మన దేశంలో (“మేరా భారత్ మహాన్”) అంత క్లిష్టంగా ఉండకపోవచ్చు (అని నా ఆశావాదం). ఏమయినా బాగా గుర్తు చేసారు, “ఆలస్యం అమృతం విషం” అనుకుంటూ నేను కూడా విల్లు వ్రాసే పని మొదలెడితే మంచిదనిపిస్తోంది 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 9. మా తాతగారి వీలునామా చదివి ఎంతో స్పూర్తిని పొందాను.ఆయన తదనంతరం ఎవరికి ఎంత ఇవ్వాలో అన్నీ వివరంగా వ్రాసారు.తను చనిపోయిన తర్వాత దినకర్మ ఖర్చు గురించి కూడా కొంత మూలధనాన్ని ఏర్పాటు చేసారు.
  వీలునామా అనేది మరణశాసనం. ఆయన వీలునామా వ్రాసేనాటికి ఆడపిల్లలకి ఆస్థిలో హక్కులు లేవు.వీలునామా ప్రకారం తనకొడుకు తదనంతరం ఆస్థి మగసంతానమైన మనవళ్ళకే ఆస్థి చెందాలని వ్రాసారు.85 తర్వాత ఆడపిల్లలకీ సమాన హక్కులు చట్టం రావడంతో మా నాన్నగారు ఆడపిల్లలకూ వాటా ఇచ్చారు. వీలునామా ఇపుడు చర్చనీయాంశమైనది.
  ఒక వీలునామా నుండి ఎవరు ఏమి గ్రహిస్తారన్నదీ ముఖ్యమే !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 10. అన్ని చోట్లా ఇలాగే ఉండకపోవచ్చు లెండి. మాతాతగారు మాఅమ్మకి ఇల్లు రాసిచ్చినప్పుడు ఎంత సూక్ష్మంగా అయిపోయిందో – నాదగ్గర కాపీ ఉంది – చూసేక, ప్రస్తుతం ఎంత తతంగం ఉందో చూసింతరవాత రాయాలనిపించింది.

  మెచ్చుకోండి

 11. సంతోషం నీహారికగారూ, మీరిచ్చిన సమాచారానికి. నాకు తెలిసినం.తవరకూ ఆ రోజుల్లో వారసత్వంగా వచ్చిన ఆస్తి కొడుకులకి చెందుతుంది. స్వార్జితం అభిమానంతో పుత్రికలకు కూడా ఇవ్వవచ్చు తండ్రులు. మాతాతగారు రాసిన వీలునామాలో ఉంది అబిమానముతో అని.

  మెచ్చుకోండి

 12. Sreedevi, khmsa ఏమిటో తెలీలేదు కానీ మీకు చాలా నచ్చేసిందని తెలిసింది, సంతోషం.
  Charasala, కథలకి అదొక ప్రయోజనం కదండీ.
  శారద, ధన్యవాదాలండి. మీరు చదివేరంటే నాకు సంతోషంగా ఉంటుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s