ఊసుపోక 157 – ఇష్ట గాయనీగాయకులు 2

ఊసుపోక టపా 155 లో నాకు నచ్చిన గాయనీగాయకులగురించి ప్రస్తావించేను కదా. ఫేస్బుక్కులో మిత్రుల ప్రోత్సాహంతో నా ఉత్సాహం రెట్టింపయింది. నాకు అదో పెద్ద వ్యాపకం అయిపోయింది. రోజూ కనీసం 3, 4 గంటలు యూట్యూబులో గడిపి నాకు నచ్చిన విద్వాంసులని కనిపెడుతున్నాను. అందులో ఏదో ఒక ప్రత్యేకత గల, కనీసం నాకు అలా అనిపించిన గానం అయితే ఫేస్బుక్కులో పెట్టడం, అక్కడ అనేకులు ఆ సంగీతాన్ని విని ఆనందం వెలిబుచ్చడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఆ టపాలో చెప్పిన మరో విషయం సాహిత్యం తెలిస్తేనే సంగీతం ఆస్వాదించగలనని. దానికి ఇప్పుడొక మినహాయింపు నందినీ రావు గజర్ పాడుతున్న పురందరదాసు కృతులు. అసలు ఆ అమ్మాయి పాడిన పాటల్లో నన్ను అమితంగా ఆకర్షించింది స్వాగతం కృష్ణా. లింకు https://www.youtube.com/watch?v=RBrBtdAGiNM. ఇది ఊత్తుక్కాడు వెంకట సుబ్బయ్యర్ రచన. ఇది నేను ఫేస్బుక్కులో పెడితే 60కి పైగా లైకులు, 19 వ్యాఖ్యలు వచ్చేయి. మరో 19 మంది షేర్ చేసేరంటే ఆలోచించండి ఆ గానమాధుర్యం ప్రతిభ. ఆ స్పందన చూసి నేను ఉబ్బి తబ్బిబ్బయిపోయేను. అందుకే ఇక్కడ కూడా మీతో పంచుకుందాం అని ఈ టపా రాస్తున్నాను.

ఈ టపాకోసం తరిచి తరిచి ఆలోచిస్తుంటే, నందిని రావు నన్ను అంత ఆకట్టుకోడానికి కారణం – మొట్టమొదట చెప్పుకోవలసింది ఆ కంఠమాధుర్యమే, ఆ పైన ఎత్తుగడ. ఏదో ఆలోచిస్తూ విడియో తెరిస్తే, ఎంత చెలువగె అంటూ పైస్థాయిలోఆ అమ్మాయి పాట అందుకునేృసరికి మెదడులో అంతవరకూ ఉన్న ఆలోచనలన్నీ మూకఉమ్మడిగా చెల్లా చెదరయిపోయి, మనసు ఆ గానంమీదకి మళ్ళి అక్కడే నిలిచిపోతుంది. బహుశా ఇది లలిత శాస్త్రీయ సంగీతం స్థాయిలో ఉంది అని కూడా అనుకోవచ్చేమో. తెలుగు సినిమాల్లో మల్లాది రామకృష్ణశాస్త్రిగారివంటి కవులూ, బానుమతివంటి గాయకులూ ప్రవేశపెట్టిన శాస్త్రీయసంగీతం కొంతవరకూ ఇలాటిదే.

వెనకటి టపాలో నేను మనసు బాగులేనప్పుడు మంచి సంగీతం ఆస్వాదించలేనని రాసేను. గతవారం నాకు చిరాగ్గా ఉన్నప్పుడు నందిని రావు పాడిన స్వాగతం కృష్ణా నామనసుని స్థిమితపరచి నాకు ఉల్లాసం కలిగించింది. ఇది చాలనుకుంటాను ఈఅమ్మాయి గానసామర్థ్యం తెలియజెప్పడానికి. సంగీత పరిజ్ఞానం అట్టే లేని శ్రోతలని తన సంగీతంలోకి లాక్కోగల కొద్దిమంది విద్వాంసులలో నందిని రావు గజర్ ఒకరు అని నా అభిప్రాయం.

ఆలాపన, స్వరప్రస్తారాలు విస్తృతంగా ఉన్నకచేరీలు ఆమె చేసేరో లేదో నాకు తెలీదు కానీ యూట్యూబులో మాత్రం లేవు. ఆమె సంగీతవైదుష్యాన్ని విమర్శించడానికి కావలసిన సంగీత పరిజ్ఞానం నాకు లేదు.

పురందరదాసు కృతులు యం.యస్. సుబ్బలక్ష్మి, యం.యల్. వసంతకుమారి, రాధ జయలక్ష్మి వంటి ప్రసిద్ధ గాయనీమణులు పాడినప్పుడు విన్నాను. చాలా బాగున్నాయని కూడా అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నందిని రావు పాడిన రెండు పాటలు నన్ను చెప్పలేనంతగా ఆకర్షించేయి. అవి – రామమంత్రవ జపిసో, ఎంత చెలువగె. ఈసారి నాకు సాహిత్యం తెలుసుకునే అవకాశం కూడా లభించింది.

కన్నడ భాషా పరిజ్ఞానం చక్కగా గలిగిన జెజ్జాల కృష్ణ మోహన రావు గారు, లక్ష్మీ దేవి గారు ఈ రెండు కృతులకు అనువాదాలు చేసి ఇచ్చేరు. వారి సౌజన్యంతో ఆ అనువాదాలు, నందిని రావు గానానికి లింకులు ఇక్కడ మీకు అందిస్తున్నాను.

  1. లక్ష్మీ దేవిగారి అనువాదం రామమంత్రవ జపిసో పాటకి.

లింకు – https://www.youtube.com/watch?v=_lKyd7P_ZA0

కాచే దైవం నీవే, కొలువ దైవం నీవే
కైవల్యఫలదాత కేశవుడు నీవే.
ఇంకే దైవంలోనూ ఈ వైభవం చూడలేదు
రావణాంతక స్వామి శ్రీ పురందరవిఠల!!

రామమంత్రము జపించరా, ఓ మనుజా! రామమంత్రము జపించరా!
ఆ మంత్రమీమంత్రము మెచ్చీవు (మెచ్చి+ఈవు) చెడబోకు
సోమశేఖరుడు తన భామకు చెప్పిన
రామమంత్రము జపించరా!

కులహీనుడైననూ ­ఎలుగెత్తి పలికే మంత్రం
అల వీధినైనా ఉచ్చరించు మంత్రం
పలు పాపముల అంతమొందించే మంత్రం
సులభముగ మోక్షము దోచే మంత్రము

జ్ఞాననిధి మన దాసులవారి
సానురాగపు నిత్య సేవామంత్రం
భానుకులాంబుధి సోము దలచు మన
దీనరక్షక పురందర విఠలుని మంత్రం.

(వేర్వేరు రూపాలు దొరుకుతున్నాయి ఈ పాటకు)

——–

  1. జెజ్జాల కృష్ణ మోహన రావు గారి అనువాదం ఎంత చలువెగె మగళను కొట్టను పాటకి

నందిని రావు గానానికి లింకు – https://www.youtube.com/watch?v=EEAkDazrGRY

ప. ఎంథా చలువెగె మగళను కొట్టను
గిరిరాజను నోడమ్మమ్మా
అను. కంతుహర శివ చెలువనెన్నుత
మెచ్చిదను నోడమ్మమ్మా

ప. ఎంతటి చెలువుని కొసగెను పుత్రిని
గిరిరాయడు చూడమ్మమ్మా
అను. కంతుహరు డతి చెలువుడు శివుడని
మెచ్చెనుగ చూడమ్మమ్మా

చ-1. మోరె ఐదు మూరు కణ్ణు
విపరీతవ నోడమ్మమ్మా

కొరళొళు రుండ మాలె ధరిసిద
ఉరగభూషణన నోడమ్మమ్మా

ముఖము లైదు మూడు కనులు
విపరీతము చూడమ్మమ్మా
గళమున పుఱ్ఱె మాల దాల్చెను
ఉరగభూషణుని జూడమ్మమ్మా

చ-2. తలెయొందు నోడిదరె
జడె హొళెయుతిదె నోడమ్మమ్మా
హలవు కాలది తపిసి రుద్రన
మై బూదియ నోడమ్మమ్మా

శిరము నెదుట జూడగను
జడ కనబడెను జూడమ్మమ్మా
చాల కాలపు తపసి రుద్రుని
మెయి బూడిద చూడమ్మమ్మా

చ-3. భూతప్రేత పిశాచిగళెల్ల
పరిహారవు నోడమ్మమ్మా
ఈతన నామవ ఒందే మంగళ
ముప్పు హరన నోడమ్మమ్మా

భూతప్రేత పిశాచములెల్ల
పరిహారము చూడమ్మమ్మా
ఈతని నామ మ్మొకటే మంగళ
మిచ్చు హరుని చూడమ్మా

చ-4. మనెయెంబుద స్మశానవు నోడె
గజచర్మాంబరవమ్మ
హణవొందాదరు కైయొళగిల్ల
కప్పరవను నోడమ్మమ్మా

గృహ మన్నది స్మశానమె చూడు
గజచర్మాంబరు డమ్మమ్మా
ధన మేదేనియు జేతుల లేదు
బిచ్చగాడె చూడమ్మమ్మా

చ-5. నందివాహన నీలకంఠన
నిర్గుణవ నోడమ్మమ్మా
ఇందిరె రమణం శ్రీ పురందర విఠలన
పొందిదవన నోడమ్మమ్మా

నందివాహను నీలకంఠుని
నిర్గుణము చూడమ్మమ్మా
ఇందిర రమణు శ్రీపురందర విఠలుని
పొందుకానిని జూడమ్మమ్మా

(విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు)

————

గానం, గాయని, సాహిత్యం మీముందుంది. ఇంక నేను చెప్పడానికేముంది? విని ఆనందించండి.

మిగతా గాయకులలో నేను ప్రత్యేకంగా చెప్పుకునేది యస్. ఐశ్వర్య గానం. ముందు చెప్పేను కదా ఈ అమ్మాయి అమరగాయని యం.యస్. సుబ్బలక్ష్మిగారి మునిమనుమరాలు. ఆ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న యువగాయని.

నేను పని గట్టుకుని కొన్ని కీర్తనలు – మనవ్యాలకించరాదటే, సీతమ్మ మాయమ్మ – వరసగా ఒకటి తరవాత ఒకటి ఇద్దరి గానం విన్నాను వ్యత్యాసాలేమిటో గమనించడానికి. ఐశ్వర్యగానం వింటుంటే సుబ్బలక్ష్మిగారు చిన్నతనంలో ఇలాగే పాడేవారేమో అనిపించింది. సుబ్బలక్ష్మిగారి కంఠస్వరంలో పరిణతి, ఐశ్వర్య గళంలో యౌవనధృతి. దేనికదే గొప్ప సౌందర్యం. ఐశ్వర్య కూడా ముత్తమ్మమ్మవలె అత్యంత భక్తితో పాడడం గమనించేను.

చిన్నవిషయమే అయినా చెప్పాలనిపిస్తోంది. సాధారణంగా శాస్త్రీయ సంగీతం గానం చేసే విద్వాంసులు అందరూ కూడా పాడుతున్నప్పుడు మధ్య మధ్యలో చేతులు జోడించి తమ వినయాన్ని ప్రకటించుకుంటారు. కొందరు పాట అయినతరవాత సభాసదులకు నమస్కారం చేస్తారు. అందుకు రవంత భిన్నంగా ఈ ఇద్దరు గాయనీమణులూ కూడా పాట మధ్యలో భగవంతుని పేరు వచ్చినప్పుడో, కృతికర్త పేరు (ఉదా. త్యాగరాజు, పురందరదాసు) వచ్చినప్పుడో చేతులు జోడించడం చేస్తే నామనసు ఆర్ద్రతతో చలించిపోయింది. ఆ క్షణంలో కేవలం వారు కచేరీ చేసే విద్వాంసులుగా మాత్రమే కాక భక్తిభావంతో సంగీతజలధిలో పరవశించి తలమునకలైపోయిన గానకళాస్వరూపాలవలె గోచరిస్తారు.

నేను ఈ సంగీతం ఇంతగా ఆస్వాదించడానికి దోహదం చేసిన ప్రత్యక్ష, పరోక్ష మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ

ఇంతే.

000

(సెప్టెంబరు 13, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక 157 – ఇష్ట గాయనీగాయకులు 2”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s