ఊసుపోక 158 – ఎదుగుట ఆగిపోయిందేమో అనిపించే క్షణాలు!

కొంతకాలం క్రితం నలుగురిమధ్య కూచుని మాటాడుతుండగా ఈ ఎదగడం మాట వచ్చింది. “కొందర్ని చూస్తే వాళ్ళు ఏ పదిహేనో ఏటో ఎదగడం మానేసేరేమో అనిపిస్తుంది,” అన్నాను.

ఎవరిగురించి మాటాడుకుంటున్నామా? ఇంకెవరు? మగాళ్ళమాటే -:p. ఎంతసేపూ తమమాటే నెగ్గాలని మంకు పట్టు పట్టడం, అడిగింది ఇవ్వకపోతే కేకలూ పెడబొబ్బలూ… అప్పుడన్నమాట అన్నాను కొందరు ఎదగరు అని. అప్పుడలా అన్నాను కానీ ఈమధ్య నాగురించే నాకు అనుమానం వస్తోంది. పైగా సరయు కూడా ఒక రోజు అంది, “నిన్ను చూస్తే ఒకొకప్పుడు నాకు ఆశ్చర్యం ఇంతకాలం ఈ దేశంలో ఎలా నెగ్గుకొచ్చేవని” అని. నిజమే, కొన్ని విషయాలు నాబుర్రకెక్కవు. కొన్ని ఎక్కించుకునే ఉద్దేశం నాకే లేదు. ఏతా వాతా నేను ఇక్కడ
NM10

ఎదగడం మానేసేనేమో అనిపిస్తోంది.

నిన్న ఒక చిన్న అద్భుతం జరిగింది. అంటే నాప్రాణానికి అది అద్భుతమే. ఎందుకంటే అది జరిగేక నేను ఇంటికొచ్చేవరకూ దారిపొడుగునా నవ్వుకుంటూనే ఉన్నాను. ఇంకా చిన్ననవ్వు మిగిలే ఉంది ఇప్పటికీ.

చాలా చిన్నవిషయం చాలు నాకు పరమానందం కలిగించడానికి. నానిత్యసంచారంలో ఏ మొక్కదగ్గరో మోడుదగ్గరో నిలబడిపోయి నవ్వుకోగలను నేను. ఆ సమయంలో నన్ను చూసినవాళ్ళు నేను వాళ్ళని చూసే నవ్వుతున్నాననుకుని, ఆగి పలకరించి, నేను ఎందుకు నవ్వుతున్నానో అర్థం కాక, నాకు మతి స్థిమితం లేదేమో అనుకుని కాస్త దూరం జరిగి గబగబా వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు జాలి పడుట అను “ఫీలింగు మ్యుచువలు” కూడా కావచ్చు. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం కదా! అసలామాటకొస్తే మీరు కూడా ఇలాటి సందర్భంలో అలాగే ప్రవర్తించవచ్చు. ఎవరైనా అనుకోవచ్చు పాపం ఈ మనిషికి మతి లేదు అని.

నిన్న మధ్యాన్నం ఏం జరగిందంటే, నానిత్యసంచారంలో పైన చెప్పినట్టు ఓ ఇంటిదగ్గర ఆగి వారి కంచెమీదకి పాకిన ఓ లతనీ, ఆ లతనంటిపెట్టుకుని ఉన్న ఓ తీగెమీద వరసగా దీపతోరణంలా వేలాడుతూ పచ్చ పచ్చగా మెరిసి పడి పోతున్న కాయలనీ చూస్తున్నాను.
Passion fruit

అవి నాకు చూడ్డానికి అందంగా కనిపించేయి. బొమ్మ తీసుకోడానికి ఏ కోణం బాగుంటుందా అని కళ్ళు చికిలించి చూస్తున్నాను.

ఇంతలో హలో వినిపించి, ఉలికిపడి చుట్టూ చూసేను.

మూడో హలోకి తెలిసింది ఆ సుస్వరం ఎక్కడినించి వస్తోంది. కంచెకి అటువేపు ఆఇంటి మరియు పెరటి యజమాని. ఆయన అలా ప్రత్యక్షమవగానే నాకు కలిగిన మొదటి స్పందన – నేనేదో వారి కాయలు దొంగిలించేస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు అని. ఎవరిఆస్తి వారు వెయ్యికళ్ళతో కాపాడుకోడం ఈనాటి ధర్మమూ, నీతీ కూడా కదా.

ఎప్పుడు కానీ తగువు కనుచూపుమేరలో కనిపిస్తే, దాన్ని ఛిద్రం చేయడానికి ఉత్తమపద్ధతి అమాయకంగా మొహం పెట్టేసి, ఇదేమిటి అని అడగడమే అని చాలాకాలం క్రితమే కనిపెట్టేసేను. నిజం చెప్పాలంటే పిల్లలందరికీ ఇది పుట్టుకతో వచ్చిన విద్య. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతకంటె ముందు ఇదే నేర్పేడు. మూతినిండా వెన్న పులుముకుని, నాకేం తెలీదు అన్నరోజునే ఈ ఆది పాఠం పుట్టింది. ఇలా ఆలోచిస్తుంటే నేను కూడా ఏ తొమ్మిదీ పదో వచ్చేసరికి ఎదగడం మానేసేననే అనిపిస్తోంది. అందుకే ఇప్పటికీ మీరెవరైనా ఏదైనా అడిగితే నాకు మొదట కొంటె సమాధానాలు వచ్చి, తరవాతే నిజసమాధానాలు వస్తాయి.

సరే, మళ్ళీ మొదటిపేజీకి వస్తాను. నిన్న మధ్యాన్నం నా సంచారసమయంలో – ఆ హలోవక్త ఉన్న స్థలం నేను గుర్తించేక, అది వారిఇల్లు అని విదితమయినతరవాత, నేను చేయగలగింది ఒకటే. అమాయకంగా మొహం పెట్టేసి, “ఇవేమిటి?” అని ఆయన్ని మరోవిషయం మాటాడనీయకుండా చేయడం.

అదే చేసేను ఆ లతవేపు చూస్తూ.

అవి passion fruit అని చెప్పి “కోసుకో కావలిసినన్ని” అన్నాడు.

నేను ఆశ్చర్యపోయేను. “చెట్టుమీద చెయ్యేస్తే పళ్లు రాల్తాయి” అనే తప్ప “తీసుకో, తీసుకో” అనడం విని కొన్ని దశాబ్దాలు అయింది.

“చూడ్డానికి బాగున్నాయి క్రిస్మస్ దీపాల్లా. తింటారా?” అన్నాను.

“తినొచ్చు. గింజలుంటాయి. తీసుకో,” అన్నాడు మళ్ళీ.

నేను ఒక కాయ తీసుకుని చూస్తానని చెప్పి, బొమ్మ కూడా తీసుకుని నవ్వుకుంటూ వస్తున్నాను. నవ్వెందుకా? నాకు తెలీదు. అలాటి సందర్భాల్లో నా మొహమ్మీద నవ్వు ఒక అసంకల్ప ప్రతీకారచర్య.

నేను అవ్విధమున ఒక చేతిలో కెమెరాతోనూ, రెండో చేతిలో ఒక పాషను పండుతోనూ నవ్వుకుంటూ నడుస్తుండగా నాకు ఎదురుగా మరొకావిడ వస్తూ కనిపించింది. మీకు తెలుసు కదా అమెరికాలో వీధుల్లో నడిచేవారు చాలా చాలా తక్కువ. నడిచేవాళ్ళని చూసి మెచ్చుకునేవాళ్ళు ఎక్కువ. నడవడం అపురూపం కనక, అలా నడిచేవారు ఒకరికొకరు హలోలు చెప్పుకుంటూ పోతారు. ఒకొకప్పుడు నామొహం చూసి నమస్తే కూడా చెప్తారు.
అలా నాకు ఎదురైన ఒక జవరాలు హలో అంది దూరం నించే. నేను నావంతు హలో చెప్పేను. ఆవిడ ఇంకొంచెం దగ్గరకొచ్చేక మళ్ళీ “అంత పెద్ద నవ్వు …” అంది చేతులు గాలిలోకి విసిరి ఎంత పెద్ద నవ్వో అభినయం చేస్తూ.

“నేనెందుకు నవ్వుతున్నానంటే అక్కడ ఓ పెద్దమనిషి ..” అంటూ చెప్పబోయేను చేతిలో పండు చూపుతూ.

నా నోట్లో మాట నోట్లో ఉండగానే, “తీసుకో నీకు కావలిసినన్ని. అది మాయిల్లే.” అంది.

నాకు ఇంకా నవ్వొచ్చింది. ఓయ్ బాబోయ్ అనుకుంటున్నా. “తీసుకో. గులాబీలు కూడా ఉన్నాయి. కావలిసినన్ని కోసుకో,” అంది మళ్ళీ.

మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ అమెరికాలో గులాబీలు చాలా చాలా ఖరీదు. ఎవరైనా ఎవరికైనా నాలుగు గులాబీలు ఇచ్చేరంటే ఇచ్చివారికి ఇవ్వబడినవారంటే ఇబ్బడి ముబ్బడి ప్రేమ ఉన్నట్టు లెఖ్ఖ (భర్త భార్యకి డజను “రోజులు” తెచ్చేడంటే క్షమించరాని నేరం చేసేడన్నమాటే).

మరి గులాబీలు ఉచితంగా కోసేసుకో అంటే ఆశ్చర్యం కాదూ?

అలా నాకు ఇల్లూ పెరడు లేకపోయినా, పెరట్లో పళ్ళూ, పువ్వులూ లేకపోయినా, అక్షరాలా కొమ్మనుండి తాజా తాజాగా కోసుకోగల అవకాశం వచ్చేసింది. ఇది చాలదూ గుండెలనిండా నవ్వు నింపేసుకు పొంగిపోడానికి?

అవున్నాకు తెల్సు. చాలామంది పెద్దవాళ్ళకి నవ్వు రాకపోవచ్చు. అలా నవ్వడం సిల్లీగా కూడా ఉండొచ్చు 😦

ఇప్పుడు మీకు నాప్రశ్న ఒక్కటే – మీరెప్పుడు ఎదగడం మానేసేరో మీకు తెలుసా?
———
(సెప్టెంబరు 28, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక 158 – ఎదుగుట ఆగిపోయిందేమో అనిపించే క్షణాలు!”

 1. ఎదుగుదల సంగతి ఎలాఉన్నా కొన్నిసార్లు నేను నవ్విన వెర్రినవ్వుల కి అర్థం ఎదుటివాళ్ళకి తెలీక వాళ్ళగురించి నవ్వాను అనుకుని అపార్థాలు చేసుకున్న సందర్భాలు ఎన్నో….పిల్లలు జ్ఞానులు పిచ్చివాళ్ళు ఒకటే అంటారు.మీరు జ్ఞానులయితే: మేము పిచ్చివాళ్ళ జాబితా లోని వారము…

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. లేదండీ, నిజంగానే నాకు తెలీకే అడిగేను. మీరన్నది నిజమే కానీ నేను అంటున్న ఎదుగుదల వేరు. ఈ టపాలో కొందరు 15 ఏళ్ళతరవాత ఎదగడం మానేసేరనిపిస్తుంది అని నేను అన్నప్పుడు అది హేళనగానే. అంటే 30, 40 దాటినా చిన్నపిల్లల్లా మంకు పట్టు పట్టడం, ఎదటివారిమాట వినిపించుకోకపోవడం వంటివి. నా ఎదుగుదల 9 ఏళ్ళకే ఆగిపోయింది అంటే సూక్ష్మవిషయాలకే ఆనందించడం పిల్లలాగే. అది మీరు ఎప్పుడయినా ఎక్కడయినా చెయ్యవచ్చు ఆ mental set up ఉండాలి. అంతే.

  మెచ్చుకోండి

 3. వావ్! ఆ పళ్ళు ఏమిటో నిజంగానే భలే వున్నాయి!
  మీకు అవి తెలిసినా తప్పించుకోవడానికి “ఇవేమిటి” అని అడిగారా?

  నాకూ ఈ ముక్క, ఎదుగుదల ఆగిపోయిందనిపించడం ఇండియా వెళ్ళిన ప్రతిసారీ అనిపిస్తుంది. అక్కడ నా తర్వాత పదేళ్ళకు పుట్టినవాళ్ళ మెచ్యూరిటీ కూడా నాకు లేదనిపిస్తుంది. ఇండియా వదిలి వచ్చే రోజుదగ్గరే నా పరిణితి ఆగిపోయిందని నేనెప్పుడూ అంటుంటుంటాను.
  ఇక్కడికొచ్చాక నిజం చెప్పాలంటే కీబోర్డు సావాసం తప్ప మనుషుల సావాసం లేదాయె! వున్నదల్లా హలో, హౌఆర్యూ వరకే పరిమితమాయె! ఇంకెలా ఎదుగుతాను.

  మెచ్చుకోండి

 4. @మా ఇంటికి వస్తూ “ఏమిస్తావు” , వాళ్ళింటికి వెళ్తే “ఏం తెచ్చావు” అని అడిగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారేమో అనిపిస్తుంటుంది – అవునండి. అందుకే ఇది కథ అయింది. సర్వసాధారణం అయితే ప్రత్యేకించి దాన్నిగురించి రాయం కదా. ఇదివరకు ఉండేది మనవి మరొకరితో సంతోషంగా పంచుకోడం. నావాక్యం – తీసుకో తీసుకో అన్నమాట విని దశాబ్దాలు అయింది – అని.

  మెచ్చుకోండి

 5. అది ఇక్కడి పిల్లల్లో కనపడట లేదు. బహుశ నేను అలా చిన్ని చిన్ని అనుభవాలు పంచుకునే పిల్లల ప్రపంచానికి దూరంగా ఉన్నానేమో! మా ఇంటికి వస్తూ “ఏమిస్తావు” , వాళ్ళింటికి వెళ్తే “ఏం తెచ్చావు” అని అడిగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారేమో అనిపిస్తుంటుంది.

  To give is an art…unfortunately not many know it. Sorry to say that but that seems to be the fact.

  మెచ్చుకోండి

 6. నాకు మరో ఉదాహరణ కూడా చెప్పాలనిపిస్తోంది. ఆకురాలుకాలంలో విస్కాన్సిన్ లో భలే అందంగా ఉంటుంది. రాలిన ఆకులు పండుటాకులే అయినా వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్లలు ఇది చూడు ఎంత బావుందో ఇది చూడు అంటూ ఒక్కొక ఆకే ఏరి చూపిస్తుంటే వాళ్ళ ఆనందం చూడడమే ఒక గొప్ప ఆనందం. ఏముంది ఎండిరాలిన ఆకులు అంటు తీసిపారేయగలమా? లేం. నేనంటున్నది అలాటి సరదా ఎంత ఎదిగినా పోదని, కనీసం కొందరిలో.

  మెచ్చుకోండి

 7. మీ చంద్రుడు ఎర్రగా లేడేమీ. రెడ్ మూన్ అన్నారు కదా ఎవరో. 🙂
  పోతే ఎదగడం రెండు రకాలు లెండి. నిజానికి ఈ టపాలో కొందరు 15 ఏళ్ళతరవాత ఎదగడం మానేసేరనిపిస్తుంది అని నేను అన్నప్పుడు అది హేళనగానే. అంటే 30, 40 దాటినా చిన్నపిల్లల్లా మంకు పట్టు పట్టడం, ఎదటివారిమాట వినిపించుకోకపోవడం వంటివి. నా ఎదుగుదల 9 ఏళ్ళకే ఆగిపోయింది అంటే సూక్ష్మవిషయాలకే ఆనందించడం పిల్లలాగే. నిజానికి మీరు ఎదగడం ఆగిపోలేదు అన్నదీ నేను ఆగిపోయింది అన్నది – రెంటికీ ఒకటే అంతరార్థం. 🙂

  మెచ్చుకోండి

 8. ఈ రోజు ఉదయం ఒక వివాహ అహ్వాన పత్రిక అందుకున్నాను. అది చదివిన తరువాత కూడ మరికొంత ఎదిగాను. రిసెప్షన్‌కి మాత్రమే అహ్వానం. వివాహానికి కాదు. ఒహో, పెపంచకంలో ఇలా కూడా ఉంటుంది కాబోలు అని. కాబట్టి నేను ఎప్పుడు ఎదగడం ఆగిపోలేదు. కాని ఎదగే క్రమంలో ఒకొక్కసారి విరామం ఉంటుంది. అలా ఒకచోట ఆగిపోవడం లేదు, నా మట్టుకు నాకు.

  నిన్న రాత్రి ఫుడ్‌కోసం హంట్ చేసి వెనక్కి తిరుగుతుంటే, ఎందుకో చంద్రుడు కనపడ్డాడు. పుటో తీసుకుంటాను అని అంటే “సరే” అని అన్నాడు. నా మొబైలు తీసాను పట్టుకుందామని.

  నిలబడి తీసుకోబోతుంటే, “మా వాడు. దిష్టి తగులుతుంది” అని మబ్బులు అడ్డం పడుతుంటే వాటితో పోటి పడి మరీ వాడ్ని పట్టుకుందామని ప్రయత్సిస్తుంటే, ఎవరో ఫక్కున నవ్వారనిపించి తిరిగి చూసాను. నన్ను చూసి నవ్వుకుంటూ వెడుతున్నారు. నేను నవ్వుకున్నాను. పిచ్చి వాళ్ళకి, నాకు కాదు. అది ఎదగడం కాదు? ద హ.

  మరిచాను…ఎదగడం కి మీ definition ఏమిటో?

  అన్నట్టు ఇదిగో ఆ చంద్రుడు!

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s