ఊసుపోక 159 – నిరవధిక చిరునవ్వు కష్టతరము!

“నిరవధిక చిరునవ్వు కష్టతరము!”
ఇది నా ప్రవచనం కాదు. 1953లో రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం సందర్భంలో అన్నారని విన్నాను.

అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకు కష్టమో కూడా ఆవిడే చెప్పేరు. పట్టాభిషేకం మహోత్సవం అంటే రోజంతా కొన్ని లక్షల ప్రజలు ఆవిడని చుట్టముట్టేసి ఉంటారు. అంటే అన్నిజతల కళ్లు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆ ప్రజావాహిని సంఖ్యకి రెట్టింపు సంఖ్యలో కళ్ళు ఆవిడమీద కేంద్రీకృతమయి ఉంటాయి. అంతసేపూ ఆవిడ మొహంమీద నవ్వు చెక్కు చెదరరాదు. ఆ మందహాసం ఏమాత్రం చెదిరినా, వెంటనే పక్కనున్నవారు కళవళి పడిపోతారు. “ఏమైందేమైందేమైంది? రాణీగారికి ఎందుకు కోపం వచ్చింది? అంటూ తొక్కిసలాడుతూ ఆమెమోమున మళ్ళీ ఆ మందహాసం పునఃప్రతిష్ఠ చేయడానికి ఆరాటపడిపోతారు.

దూరంగా ఉన్నవారికి ఆ “నవ్వు వెలిసిన మొహము” కనిపించకపోవచ్చు, కానీ దగ్గర ఉన్నవారు ఆ “నవ్వు లేని మోము” చూసి కంగారు పడినందున మిగతా జనసందోహం ఆ దగ్గరున్నవారి కంగారు చూసి, ఏం జరిగిందో తెలీక మరింత కంగారు పడతారు. అలా కంగారుమీద కంగారు పడుతూ పడుతూ లేస్తూండడంచేత మొత్తం ప్రదర్శనంతా కంగాళీ అయిపోతుంది. అదన్నమాట మహా రాణీగారి బాధ!

ఆ క్షణంలో, “ఏమీ లేదూ, అలా ఆపకుండా నవ్వు నిలబెట్టి ఉంచుటచేత చెంపలు పీకుతున్నాయి” అని చెప్పడం ఆవిడకి సాధ్యం కాదనే అనుకుంటున్నాను.
మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ నిజానికి అది – అంటే అలా “నెమ్మోమున ఎడ తెగని చిరుహాసము నిలుపుట” చాలా కష్టం. అది నెత్తిమీద నీళ్ళకుండ నిలపడం కంటె ఎక్కువ కష్టం. పల్లెపడుచులు నీళ్ళకుండలో కూరల తట్టలో నెత్తిన పెట్టుకుని విలాసంగా చేతులూపుకుంటూ చులాగ్గా మైళ్ళకి మైళ్ళు నడిచి పోవడం చూసేను కానీ రోజంతా చిరునవ్వు మొహాన అమ్మవారి ఆలయంలో నిశ్చలదివ్వెవలె వెలయించి నిలబెట్టినవారిని చూడలేదు. కారణాలు అడగండి, చెప్తాను. సుమారుగా నాకు తెలిసినవి ఇవి –

1. చెంపలు పీకుతాయని ముందే చెప్పుకున్నాం కదా.

2. ఏదో కనిపించి మరేదో ఆలోచన వచ్చి నవ్వడం మరిచిపోతాం.

3. ఎవరైనా తమ కష్టాలు వెళ్ళబోసుకుంటుంటే వారికి ఓదార్పుగా నవ్వు మాని విచారమో జాలో చూపవలసిన అగత్యం ఏర్పడుతుంది.

4. ఇవేవీ కాని, నేను ఊహించలేని మరేదో జరుగుతుంది.

ఇహ ప్రస్తుతానికి వస్తే, నామటుకు నాకు, నేను మహారాజ్ఞిని కాకపోయినా, నాకు ఏ పట్టాభిషేకమూ జరక్కపోయినా, “సదానంద మొహం” కుదరదు.
ఇక్కడ మీకు మరో రహస్యం చెప్పాలి. నేనున్న వాటాలో అద్దాలు కొంచెం ఎక్కువే. ఒక గోడంతా నిలువుటద్దమే! అది నేను కోరీ వేడీ పెట్టించుకున్నది కాదు. అది ఇల్లు కట్టించినవారి మేధోవిలాసం. ఆధునికయుగంలో “కనిపించడానికి” ఉన్న విలువ ఇంతా అంతా కాదని చెప్పడానికి ఇంత కన్న ఋజువు అక్కర్లేదు నన్నడిగితే. ఎటు తిరిగినా ఎలా ఉన్నావో చూసుకోమంటూ ఈ దిక్కు మాలిన అద్దాలు. అద్దం అంటే ఆదర్శం అని అర్థం ఉంది కానీ నాకు అలాటి తలపు కలిగే సమయం కాదిది.

ఇంతకీ జరుగుతున్నదేమిటంటే ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు నాకు నేను కనిపిస్తుంటాను. ఈ కొంపలో చేరిన కొత్తలో అయితే గదిలో మరో మనిషి ఉందననుకుని ఉలికిపడుతూ వచ్చేను కూడా. దరిమిలా అది నేనే అని అర్థం చేసుకున్న తరవాత, ఎలా “కనిపిస్తున్నాను” అని చూసుకున్నాను. ఆశ్చర్యం! నేను నిన్నా మొన్నా తీసుకున్న బొ్మ్మల్లోలా లేను. చిరునవ్వులు, దరహాసాలు లేవు. చుట్టపక్కల ఎవరూ లేనప్పుడు, ఏదో ఆలోచనల్లో పడిపోయినప్పుడు, లేదా బుర్ర పూర్తిగా ఖాళీ అయిపోయినప్పుడు ఇలా ఉండుదును అని జ్ఞానోదయమయింది అప్పుడే!

ఇది మీరు కూడా చేయొచ్చు. మీ ముఖాన్ని మీరు పరీక్షకి పెట్టి చూసుకోండి. ఇంటినిండా అద్దాలు ఉండక్కర్లేదు. ఈరోజుల్లో ఏ బజారుకెళ్ళినా అద్దాలగోడలు, అద్దాల బీరువాలు … ఎక్కడ చూసినా అద్దాలే అద్దాలు – “ఎక్కడ చూసినా నువ్వే” కథలోలాగ. అంచేత ఎటు తిరిగినా మీ వదనం మీకు దర్శనమవుతుంది. అప్పుడు మీ మోము ఎలా ఉంది? లాటరీలో లక్ష గెల్చుకున్నట్టు అమందానందంతో వెలిగిపోతోందా? దారి తప్పిన పిల్లాడిమొహంలాగానో, లక్ష రూపాయిలా లాటరీలో వచ్చిన టికెట్టు మీది కాదని తెలిసిన క్షణంలోలాగానో కనిపిస్తోందా? ఇంతెందుకు గానీ , ఒక్క మాటలో ముఖ పరీక్షకి తిరుగు లేని ఆదర్శం ఇది.
నలుగురిమధ్య ఉన్నప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ కనిపించడం సాధారణమే. కొందరయితే తమ కళ్ళల్లో నవ్వులు వెలిగించి మనల్ని అలరిస్తారు. వారిని “పుట్టు నవ్వుల”వారు అనొచ్చు. కొందరికి పళ్ళు రవంత ఎత్తయి, చిరునవ్వులు చిందిస్తున్న భ్రమ కలిగిస్తాయి ఆ మొహం తాలూకు మెదడు ప్రత్యేకించి చేసిన ఏర్పాటేమీ లేకపోయినా. దానికి ప్రతి అంటే ప్రత్యామ్నాయంగా పళ్ళు కనిపించకుండా పెదిమలు బిగిస్తే, మూతి ముడుచుకున్నట్టు కనిపించి “వీరికి కోపం సర్వసాధారణం కానోపు” అనిపించొచ్చు. కొందరు మాత్రం, మొహమంతా నవ్వు చేసుకుని, “పుట్టు స్మితులు” (స్మితము స్వతస్సిద్ధంగా పుట్టుకతోనే గలవారు) అయినట్టు కనిపిస్తుంటారు సదా. అలాటి అదృష్టవంతులు అరుదు.

నాతరంవరకూ ఈ ఫొటోల మేళా లేదు. ఊరికో ఫొటోగ్రాఫరుంటే గొప్ప. ఏదో ప్రత్యేకమైన సందర్భంలో ఆ “బొమ్మ పెట్టి” నిపుణుడిని పిలిపించి కుటుంబం హోల్మొత్తం ఏ పదేళ్ళకో ఓ మారు ఫొటో దిగేవారు. అప్పట్లో “సే ఛీజు”లు లేవు సరి కదా ఎవరైనా నవ్వు ప్రదర్శిస్తే, పళ్ళు కనిపిస్తే, “టూత్ పేస్ట్ ప్రకటన” అని వెక్కిరించేవాళ్ళు మిగతావాళ్ళు.

నామాట నమ్మకపోతే, మీ పెద్దల పాతకాలపు ఫొటోలు తీసి చూడండి. అసలు అప్పట్లో బొమ్మ తీస్తే చిక్కిపోతారన్న భయం కూడా ఉండేది. అప్పుడు చేతి సెల్లులన్నమాటే లేదు సరి కదా ఈ పాయింటెన్షూటు పెట్టె కూడా అపురూపమే. తీసిన లేదా తీయబడిన ఏ బొమ్మ చూసినా “గంభీరంగారావు” లై కనిపిస్తుండేవారు ఆరోజుల్లో!

ఇంతకీ ఇదంతా ఎందుకు మొదలు పెట్టేనంటే కిందటివారం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్న నేపథ్యంలో నాక్కూడా ఓ సెల్ఫీ తీసుకుందాం అని సరదా పుట్టింది. నాకు ఐఫోనూ లేదు, ఐపాడూ లేదు. అసలు ఏ పాడూ లేదు. నాకున్న పాతకాలపు పాయింటెన్షూటు కెమెరాతోనే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఓ నొక్కు నొక్కేను. ఆ తరవాత మరో నొక్కు, మళ్ళీ మరోటీ … బేటరీ ఆరిపోయేవరకూ చేసేను. తీరా చూస్తే చాలా బొమ్మల్లో కింద గచ్చూ, మీద చూరూ, ఆ పక్క కుర్చీ, ఈ పక్క టీవీ … ఇలా చాలా బొమ్మలే వచ్చేయి. అవన్నీ నా మొహాలు కావని తెలియడానికి అట్టే కాలం పట్టలేదు. మళ్ళీ బేటరీకి బలము కూర్చి, రెండో వరస తీసేను.

ఆ గందరగోళం మధ్య వచ్చిన ఒక బొమ్మ రోజూ మా అద్దాలవాటాలో కనిపించే మొహంలా ఉంది. నిజానికి ఇదే రోజులో ఎక్కువసేపు నాకు కనిపించే మొహం కనక ఇదే “నిజ నేను” అని తెలుసుకొనిన దాననై, నా నిజాయితీని నిరూపించుకోడానికి ఫేస్బుక్కులో పెట్టేను. అక్కడ అందరూ నా ప్రాణమిత్రులు కనక, వారికి నా నిజస్వరూపం తెలియజేయడం నా విధ్యుక్తధర్మం అని పెట్టేను.

అదే ఊపులోనే సరయుకి కూడా పంపేను “సెల్ఫీ తీసుకున్నానోచ్” అని సగర్వంగా. నేను కూడా ఆధునికయుగం చేరుకున్నాను అని ఆ పిల్లకి తెలియజేయడం కూడా నా విధ్యక్తధర్మమే అనిపించినందున. ఆ పిల్ల మాత్రం అలా అనుకోలేదు. “బొమ్మ బాగుంది. కానీ ఎందుకంత కోపంగా ఉన్నావు?” అని తిరుగుటపాలో ప్రశ్న పంపింది.

“అది కోపమోము కాదు, నా ఆలోచనామోము,” అని తిరుగుతిరుగు మెయిలిచ్చేను.

హాహాహహాహ అని మళ్ళీ మెయిలు. ఆ అధ్యాయం అలా ముగిసింది. మొత్తమ్మీద నాకు అర్థమయిందేమిటంటే మారోజుల్లో మొహంలో ఏ భావమూ కనిపించకపోతే, “ఏమిటాలోచిస్తున్నావు?” అనేవాళ్లం. ఇప్పుడు, “ఎందుకంత కోపం?” అంటున్నారు. “ముఖము చదువుట”లో మనం సాధించిన ప్రగతి అనుకుంటానిది.
ఇక్కడే మరో పిట్టకథ కూడా చెప్పాలనిపిస్తోంది. కింద ఇచ్చిన బొమ్మల్లో మొదటి బొమ్మ చూడండి. అది నవ్వుమొహం కదా. అది కూడా నా డొక్కుకెమెరాతో తీసుకున్నదే. అది చూసి సరయు చాలా ఆనందించేసి, తన స్నేహితులతో పంచుకుంది. నాకథకి సంబంధించింతవరకూ ఆ పంచుకోలుకి పెట్టిన వాక్కులే గమనార్హం. మేకప్పు లేదంది. అదేం వింత కాదు కానీ తరవాతి మాట చూసి ఉలిక్కిపడ్డాను. “no Botox”! … నాకు బోటాక్స్ అంటే ఏమిటో తెలీదనీ కాదు, నేనెప్పుడూ వినలేదనీ కాదు నేను ఉలిక్కి పడడం. తెల్లారి లేస్తే టీవీనిండా అవే కదా ప్రకటనలు. నాకు ఆశ్చర్యం కలిగించింది నావిషయంలో మనవాళ్ళవిషయంలో ఇలాటి తలుపు ఎవరికొస్తుందని. మళ్లీ నాకు నేనే జవాబిచ్చుకున్నాను – ఆపిల్ల ఉన్న రంగం అలాటిది కనక అని. పుట్టు అందానికున్న విలువ పెట్టు అందానికి లేదు అనేది మాఅమ్మ. నేను ఆ వాతావరణంలో పెరిగేను మరి.

మళ్లీ వెనక్కొస్తాను. నేను ఫేస్బుక్కులో ప్రచురించిన బొమ్మ చాలామందే బాగుందన్నారు. కొందరు నచ్చలేదు అనలేదు కానీ కోపం ప్రసక్తి మాత్రం తెచ్చేరు. అంచేత అన్నమాట ఈ టపా.

ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ బొమ్మలు. దయచేసి ఇది వినోదార్థమే అని జ్ఞాపకం ఉంచుకోండి –

ఇది నవ్వు మొహం
Smiling

ఇది ప్రశాంత …
Prasantaface

ఇది సర్వకాల లేక ఆలోచన ..
thinking face.

ఇది కోప ..
Angry gace
.
చూసేరు కదూ ఇవన్నీ అస్మదీయ నిజముఖములే!
ఇప్పుడు మీకు నేనొక సలహా ఇస్తాను. ఇది ఉచితం. మీరేం చెయ్యాలంటే, ఒకమారు అద్దంముందు నిలబడి మీకు ఎన్ని మొహాలున్నాయో చూసుకోండి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం ఆరోగ్యానికి మంచిది.
—–
(అక్టోబరు 12, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక 159 – నిరవధిక చిరునవ్వు కష్టతరము!”

 1. Nice post Malathi garu. I remember in my college days, every time I was in a picture, my friends always used to say “Colgate smile” I just can’t help it but smile with my teeth showing. It comes naturally to me. I enjoyed reading it. Tried to post this comment but for some reason I was not able to. 😦

  Talk to you soon.

  Aruna

  మెచ్చుకోండి

 2. విన్నకోట నరసింహారావుగారూ, అవునండి అది కూడా నిజమే. అందుకే చెప్పేను కదా నేను ఊహించలేనివి కూడా ఉంటాయని. మీరు అది ఏమిటో తెలిపినందుకు ధన్యవాదాలు. plastic smile మొహానికి తగిలించున్నట్టు ఉంటుంది.
  ఫేస్బుక్కులో పెట్టింది మూడో బొమ్మ :). నాకు ఇప్పటికీ ఎన్నిమార్లు చూసినా సీరియస్ గానే కనిపిస్తోంది కానీ కోపం కనిపించడం లేదు మరి.

  మెచ్చుకోండి

 3. మీరు చెప్పిన కారణాలతో బాటు నా అభిప్రాయంలో మరో కారణం కూడా ఉందండోయ్. ఎల్లవేళలా “నిరవధిక చిరునవ్వు” తగిలించుకుని కనిపిస్తే కృత్రిమంగా ఉంటుంది. false smile అనుకోవచ్చు.
  —————-
  < "అప్పట్లో “సే ఛీజు”లు లేవు "
  కరక్టండి. పైపెచ్చు ఆరోజుల్లో ఫొటో కోసం పొరపాటున నవ్వుమొహం పెడదామని ప్రయత్నిస్తే "బొమ్మపెట్టి" వాడు "పళ్ళు కనబడకూడదండి" అని మందలించేవాడు. ("పుట్టు స్మితులు" కానివారికి ఆ రోజుల్లో ఇదొక ఇబ్బంది మరి) 😦
  —————–
  < “ఏమిటాలోచిస్తున్నావు?” అనేవాళ్లం. ఇప్పుడు, “ఎందుకంత కోపం?” అంటున్నారు. “ముఖము చదువుట”లో మనం సాధించిన ప్రగతి అనుకుంటానిది."
  బాగా చెప్పారు.
  —————–
  మీ ఫోటొలు బాగానే ఉన్నాయండీ. ఇంతకీ వీటిల్లో ఫేస్ బుక్ లో పెట్టిన ఫోటో ఏదంటారు? చివరిదా? (నేను ఫేస్ బుక్ ఖాతాదారుడిని కాదు లెండి)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s