పతంజలి యోగసూత్రములు – III. విభూతి పాదము

 1. దేశబంధశ్చిత్తస్య ధారణా

(దేశ బంధః చిత్తస్య ధారణా)

– చిత్తమును ఒక స్థానములో స్థిరముగా ఉంచడం ధారణ.

 1. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్

(తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్)

– ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.

 1. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః

(తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః)

– ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ మించి ఉన్నదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.

 1. త్రయమేకత్ర సంయమః

(త్రయమ్ ఏకత్ర సంయమః)

– ఈ మూడింటినీ (ధారణ, ధ్యానము, సమాధి) కలిసికట్టుగా సంయమము అంటారు.

 1. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః

(తత్ జయాత్ ప్రజ్ఞా ఆలోకః)

– సంయమమువలన ప్రజ్ఞ లభిస్తుంది.

 1. తస్య భూమిషు వినియోగః

– ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.

 1. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః

(త్రయమ్ అంతరంగమ్ పూర్వేభ్యః)

– సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధానాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.

 1. తదపి బహిరంగమ్ నిర్బీజస్య

(తత్ అపి బహిరంగమ్ నిర్బీజస్య)

– అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.

 1. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః

(వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షమ చిత్త అన్వయః నిరోధ పరిణామః)

– ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.

 1. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్

(తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్)

– ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.

11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః

(సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః)

– చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితికి చేరువ అవుతుంది ఈ దశలో.

 1. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః

(తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రతా పరిణామః)

– ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.

 1. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః

(ఏతేన భూత ఇంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః)

– చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.

 1. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ

(శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మ అనుపాతీ ధర్మీ)

– ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.

 1. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః

(క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతుః)

– పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)

 1. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్

(పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానమ్)

– ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.

 1. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః

తత్ ప్రవిభాగసంయమాత్సర్వభూతరుతజ్ఞానమ్

(శబ్ద అర్థ ప్రత్యాయానామ్ ఇతర ఇతర అధ్యాసాత్ సంకరః

తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వ భూత రుత జ్ఞానమ్)

– శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.

 1. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్

(సంస్కార సాక్షాత్ కరణాత్ పూర్వ జాతి జ్ఞానమ్)

– సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.

 1. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్

(ప్రత్యయస్య పర చిత్త జ్ఞానమ్)

– ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.

 1. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్

(న చ తత్ సాలంబనమ్ తస్య అవిషయీ భూతత్వాత్)

– అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కానీ ఆ స్వభావానికి మూలమయిన చిత్తవృత్తులను, తెలుసుకోవడం సాధ్యం కాదు, ఒకొక జీవికి ఒకొకవిధంగా ఉండడంచేత. ఈ సంయమంయొక్క ధ్యేయం అది కాదు.

(గమనిక: సూత్రాల వరస 22-24 కొన్ని పుస్తకాలలో భిన్నంగా ఉంది. కొన్ని పుస్తకాలలో 22వ సూత్రం లేదు గానీ ఇక్కడ చేర్చేను. అందుచేత ఇక్కడినుండి సూత్రములసంఖ్య మారవచ్చు.)

 1. కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుష్ప్రకాశాసంప్రయోగేఽన్తర్ధానమ్

(కాయ రూప సంయమాత్ తత్ గ్రాహ్య శక్తి స్తంభే చక్షుః ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానమ్)

– శరీరాన్ని కేంద్రము చేసుకుని సంయమం ఆచరించడంద్వారా ఆ దేహానికీ, దానిని చూచే కళ్ళకీ మధ్య గల సంబంధం తెగిపోతుంది. తద్వారా ఆ దేహం ఇతరులకి అగోచరము అవుతుంది.

 1. ఏతేన శబ్దాద్యంతర్ధానముక్తమ్.

(ఏతేన శబ్ద ఆది అంతర్ధానమ్ ఉక్తమ్)

– అదేవిధంగా శబ్దము మొదలైనవి కూడా ఎదుటివారికి అనుభవము కావు.

 1. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్

అపరాంతజ్ఞానమరిష్టేభ్యో వా.

(సః ఉపక్రమమ్ నిరుపక్రమమ్ చ కర్మ తత్ సంయమాత్

అపరాంత జ్ఞానమ్ అరిష్టేభ్యః వా)

– కర్మ ఫలితాలు రెండు విధాలు. ఫలితం వెంటనే కనిపించేవీ, కొంతం సమయం గడిచేక కనిపించేవి. ఈ రెండు రకాల కర్మలను సంయమంద్వారా స్వాధీనం చేసుకుంటే శకునములద్వారా మృత్యువు గురించి తెలుసుకోగలడు.

 1. మైత్ర్యాదిషు బలాని.

(మైత్రీ ఆదిషు బలాని)

– అలాగే మైత్రివంటి గుణములు (మొదటి పాదం సూ. 33లో చెప్పిన కరుణ, ఆనందము, ఉపేక్ష) సంయమనంద్వారా వృద్ధి పొందుతాయి.

 1. బలేషు హస్తిబలాదీని.

(బలేషు హస్తి బల ఆదీని)

– ఏనుగుగురించి సంయమం చేస్తే ఏనుగుబలం పొందుతాడు.

 1. ప్రవృత్త్యాలోకన్యాసాత్సూక్ష్మవ్యవహితవిప్రకృష్టజ్ఞానమ్

(ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత ప్రకృష్ట జ్ఞానమ్)

– హృదయకమలంలో ప్రతిష్ఠమైన అంతర్జ్యోతిని సంయమం చేస్తే సూక్ష్మ విషయాలూ, కంటికి కనిపించనవీ, బహుదూరంలో ఉన్నవీ గూర్చిన జ్ఞానము కలుగుతుంది.

 1. భువనజ్ఞానమ్ సూర్యే సంయమాత్.

– సూర్యునిగూర్చి సంయమువలన సూర్యమండలం గురించిన జ్ఞానము కలుగుతుంది.

 1. చంద్రే తారావ్యూహజ్ఞానమ్.

(చంద్రే తారా వ్యూహ జ్ఞానమ్)

– చంద్రుని గూర్చి సంయమువలన చంద్ర, నక్షత్రమండలములకు సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.

 1. ధృవే తద్గతజ్ఞానమ్.

(ధృవే తత్ గత జ్ఞానమ్)

– ధృవునిగూర్చి చేసిన సంయమువలన ధృవమండలంలోని గ్రహములు, తారలగురించిన జ్ఞానం కలుగుతుంది.

 1. నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్.

(నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానమ్)

– నాభితో సంయమము చేస్తే నాడీజ్ఞానము గురించిన జ్ఞానము కలుగుతుంది.

 1. కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః.

(కంఠ కూపే క్షుత్ పిపాసా నివృత్తిః)

– కంఠంతో సంయమము చేస్తే ఆకలి దప్పులను అరికట్టగలడు.

 1. కూర్మనాడ్యాం స్థైర్యమ్.

(కూర్మ నాడ్యాం స్థైర్యమ్)

– గొంతులో నాలుకకింద ఉండే కూర్మనాడితో సంయమము చేస్తే శరీర స్థైర్యం కలగుతుంది.

 1. మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనమ్.

(మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనమ్)

– శిరసుయందు సంయమము చేస్తే సిద్ధులదర్శనము లభిస్తుంది.

 1. ప్రతిభాద్వా సర్వమ్.

(ప్రతిభాత్ వా సర్వమ్)

– అసాధారణమైన మేధవలన సర్వ విషయాలనూ తెలుసుకోగలుగుతాడు.

 1. హృదయే చిత్తసంవిత్.

(హృదయే చిత్త సంవిత్)

– హృదయంతో సంయమము చేస్తే మనోభావనలకి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.

 1. సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః

ప్రత్యయావిశేషాత్ భోగః పరార్థత్వాత్

స్వార్థసంయమాత్ పురుషజ్ఞానమ్

(సత్త్వ పురుషయోః అత్యంత అసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః

పర అర్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానమ్)

– సత్త్వము (చిత్తము), పరమపురుషుడు – ఈరెంటిమధ్య గల విశేషమైన వ్యత్యాసాన్ని గుర్తించకపోవడంచేత ప్రాపంచికసౌఖ్యం అనుభవంలోకి వస్తుంది. ఆ వ్యత్యాసం ఉందని గ్రహించి పరమపురుషునితో సంయమం చేసిన సాధకుడు పరమపురుష జ్ఞానము పొందుతాడు.

 1. తతః ప్రాతిభశ్రావణ వేదనాఽఽదర్శాఽఽస్వాదవార్తా జాయంతే

(తతః ప్రాతిభ శ్రావణ వేదనా ఆదర్శా ఆస్వాద వార్తా జాయంతే)

– ఆ సంయమంవలన పరమ పురుషునికి సంబంధించిన శ్రవణం, దృష్టి, అవగాహన, రుచి, వాసన సాధకునికి అనుభవం అవుతాయి.

 1. తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః

(తే సమాధౌ ఉపసర్గా వ్యుత్థానే సిద్దయః)

– ఆ అనుభవ ప్రభావాలు బాహ్యప్రపంచంలో అలౌకిక శక్తులుగా గోచరమవుతాయి. అవి సమాధికి ప్రతిబంధకాలు.

 1. బంధకారణశైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్ఛ చిత్తస్య పరశరీరావేశః

(బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాత్ చ చిత్తస్య పర శరీర ఆవేశః)

– బంధనాలకి కారణమైన చిత్తవృత్తులను తెంచుకుని, సమాధివైపు సాధన కొనసాగిస్తే,

మరొక దేహం ప్రవేశించగలడు.

 1. ఉదానజయాజ్జల పంకకంటకాదిష్వసంగ ఉత్క్‌క్రాంతిశ్చ

(ఉదాన జయాత్ జల పంక కంటక ఆదిషు అసంగః ఉత్ క్రాంతిః చ)

– ఉదానవాయువును స్వాధీనం చేసుకుంటే నీరు, బురద, ముండ్లపైన నడవగల సామర్థ్యము కలుగుతుంది.

 1. సమానజయాజ్జ్వలనమ్.

(సమాన జయాత్ జ్వలనమ్)

– సమానవాయువును జయించినవాని శరీరం ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.

 1. శ్రోత్రాఽకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రమ్

(శ్రోత్రా ఆకాశయోః సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రమ్)

– ఆకాశంతో చెవులను సంయమం చేయడంవల్ల దివ్యశ్రవణ శక్తి కలుగుతుంది.

 1. కాయాఽకాశయోస్సంబంధసంయమాతే

లఘుతూలసమాపత్తేశ్చ ఆకాశగమనమ్.

(కాయ ఆకాశయోః సంబంధ సంయమాత్ లఘు తూల సమాపత్తేః చ ఆకాశ గమనమ్)

– శరీరమును ఆకాశముతో సంయమం చేయడంవల్ల శరీరము దూదివలె తేలిక అయి ఆకాశ సంచారము చేయగల శక్తి కలుగుతుంది.

 1. బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః

(బహిః అకల్పితా వృత్తిః మహా విదేహా తతః ప్రకాశ ఆవరణ క్షయః)

– ఆత్మను పరమాత్మతో సంయమం చేస్తే కలిగే స్థితికి మహావిదేహము (దేహం లేని స్థితి) అని పేరు. ఆ స్థితిలో పరమాత్మని కప్పిన అంధకారపు తెర తొలగిపోతుంది.

 1. స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్తవత్ త్వసంయమాద్భూతజయః

(స్థూల స్వరూప సూక్ష్మాత్ అన్వయ ఆర్తవత్ త్వ సంయమాత్ భూత జయః)

– స్థూలశరీరము, సూక్ష్మ శరీరము, వాటి మూలతత్వాలు, గుణములయందు సంయమము చేస్తే పంచభూతములపై విజయము సాధించగలడు.

 1. తతోఽణిమాదిప్రాదుర్భావ కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ

(తతః అణిమ ఆది ప్రాదుర్భావ కాయ సంపత్ తత్ ధర్మ అనభిఘాతః చ)

– తద్వారా అణిమాది సిద్ధులు, శరీరసంపద (రూపం, సౌష్ఠవం) పొందగలడు. శరీరానికి సంబంధించిన అవధులను అధిగమించగలడు.

 1. రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాసంపత్

(రూప లావణ్య బల వజ్ర సంహననత్వాని కాయసంపత్)

– దేహానికి రూప, లావణ్యాలు, వజ్రఘాతాన్ని తట్టుకోగల బలము కలుగుతాయి.

 1. గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్త్వసంయమాదింద్రియజయః

(గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థత్త్వ సంయమాత్ ఇంద్రియ జయః)

– గ్రహణేంద్రియాలను, గ్రహించగలశక్తినీ, వాటి మూలస్థానాలతోనూ, అస్మితతోనూ సంయమం చేస్తే ఇంద్రియాలను జయించగలడు.

 1. తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ

(తతః మనః జవిత్వమ్ వికరణాభావః ప్రధాన జయః చ)

– అప్పుడు స్థూలశరీరంనుండి విడివడి మనోదారుఢ్యం సంతరించుకోగలడు సాధకుడు.

 1. సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ

(సత్త్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వ భావ అధిష్ఠాతృత్వం సర్వ జ్ఞాతృత్వం చ)

– సత్త్వము (చిత్తము) పరమపురుషుల మధ్య గల విబేధంతో సంయమము చేసి పొందిన జ్ఞానమువలన సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు కాగలడు.

 1. తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్

(తత్ వైరాగ్యాత్ అపి దోష బీజ క్షయే కైవల్యమ్)

– ఆ వైరాగ్యమువలన చివరికి మిగిలిన బీజము (జ్ఞాని అన్న భావం) కూడా నశించి కైవల్యం సిద్ధిస్తుంది.

 1. స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్

(స్థాని ఉపనిమంత్రణే సంగ స్మయ అకరణమ్ పునః అనిష్ట ప్రసంగాత్)

– ఆవిధంగా భగవంతుని ఆదరణ పొందిన సమయంలో సంగత్వం, అహంకారాలకు లోను కారాదు. అలా చేసినట్లయితే, తిరిగి అవాంఛనీయ విషయాలు తలెత్తుతాయి.

 1. క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్

(క్షణ తత్ క్రమయోః సంయమాత్ వివేకజం జ్ఞానమ్)

– ఆ జ్ఞానము (అంటే భగవంతుని సమాదరణ లభించిందన్న జ్ఞానము), ఆ జ్ఞానము పొందడానికి కారణమైన వరుస క్రమం – వీటితో సంయమం చేయడంతో ఆ బీజము కూడా నశించి సంపూర్ణ సమాధి లభిస్తుంది.

 1. జాతిలక్షణదేశైరన్యతానవచ్ఛేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తిః

(జాతి లక్షణ దేశైః అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయోః తతః ప్రతిపత్తిః)

– సాధారణదృష్టికి ఒక్కలాగే కనిపించే వస్తువులలో జాతి, వస్తులక్షణం, అవి ఉన్న ప్రదేశాలను బట్టి వ్యత్యాసం ఉంటుంది. ఆ వత్యాసాన్ని గుర్తించగల వివేకం ఏర్పడుతుంది ఈ సంయమంవలన.

 1. తారకమ్ సర్వవిషయం సర్వథా విషయమక్రమమ్ చేతి వివేకజం జ్ఞానమ్.

(తారకమ్ సర్వ విషయం సర్వథా విషయమ్ అక్రమమ్ చ ఇతి వివేకజం జ్ఞానమ్)

– సర్వ విషయాలనూ – స్థల, కాల, సమయాలతో సంబంధం లేకుండా – అవగాహన చేసుకోగల వివేకంతో పొందిన జ్ఞానమే పరమోత్కృష్టమైన జ్ఞానము.

విభూతి పాదము సమాప్తము.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s