పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము

 1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః

(జన్మ ఔషధి మంత్ర తపః సమాదిజాః సిద్ధయః)

– (విభూతి పాదంలో ప్రస్తావించిన) సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులతో గానీ, మననం, సాధన, ధ్యానంతో గానీ సాధించవచ్చు.

 1. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్.

(జాతి అంతర పరిణామః ప్రకృతి అపూరాత్)

– ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి.

 1. నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్.

(నిమిత్తమ్ అప్రయోజకమ్ ప్రకృతీనామ్ వరణ భేదః తు తతః క్షేత్రికవత్)

– పునర్జన్మకి పాపపుణ్యాలు స్వయంగా కారణాలు కావు.అవి కేవలం సహజ పరిమాణంలో అవాంతరాలను దాటడానికి ఉపయోగపడతాయి. రైతు ఏటినీరు పారుదలకి అడ్డమైన వాటిని తొలగించి పారుదల సుఖకరం చేసినట్టే.

 1. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్.

(నిర్మాణ చిత్తాని అస్మితా మాత్రాత్)

– చిత్తమును అస్మిత మాత్రమే సృష్టించగలదు.

 1. ప్రవృత్తిభేదే ప్రయోజకమ్ చిత్తమేకమనేకేషామ్.

(ప్రవృత్తి భేదే ప్రయోజకమ్ చిత్తమ్ ఏకమ్ అనేకేషామ్)

– వేరు వేరు జీవుల చిత్తముల ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వీటి అన్నిటిమీద ఆధిపత్యం వహించేది ఒకే చిత్తము.

 1. తత్ర ధ్యానజమనాశయమ్.

(తత్ర ధ్యానజమ్ అనాశయమ్)

– చిత్తములు భిన్నరూపాలలో అన్నిటిలోనూ ఉన్నా, స్వచ్ఛమైన చిత్తము మాత్రమే సమాధిద్వారా అంతరాంతరాల అణగి ఉన్న కర్మఫలితాలనుండి కోరికలనుండీ విముక్తి పొందినది.

 1. కర్మాశుక్లాకృష్ణమ్ యోగినస్త్రివిధమితరేషామ్

(కర్మ అశుక్ల అకృష్ణమ్ యోగినః త్రివిధమ్ ఇతరేషామ్)

– యోగికి మంచి కర్మా చెడు కర్మా అంటూ లేవు. ఇతరులకు కర్మ మూడు విధములు, మంచిఫలితాలనిచ్చేది, చెడుఫలితాలనిచ్చేది లేదా మిశ్రమ ఫలితాలనిచ్చేది.

 1. తతస్తద్విపాకానుగుణానామేవాఽభివ్యక్తర్వాసనానామ్

(తతః తత్ విపాక అనుగుణానామ్ ఏవ అభివ్యక్తిః వాసనానామ్)

– ఒక జన్మలో చేసిన కర్మయొక్క ఫలితాలు వాసనలుగా మరుజన్మలో వ్యక్తమవుతాయి.

 1. జాతిదేశకాలవ్యవహితానామప్యానంతర్య్యమ్ స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్

(జాతి దేశ కాల వ్యవహితానామ్ అపి ఆనంతర్య్యమ్ స్మృతి సంస్కారయోః ఏకరూపత్వాత్)

– దేశము, కాలము, స్థూలరూపము(జన్మ) వేరు అయినా స్మృతి, సంస్కారములలో వ్యత్యాసము ఉండదు. అంచేత వాసనలు వ్యక్తమవడానికి తగిన సమయంలో అనుగుణమైన జన్మ కలిగినప్పుడు మళ్ళీ వ్యక్తమవుతాయి.

 1. తాసామనాదిత్వమ్ చాశిషో నిత్యత్వాత్.

(తాసామ్ అనాదిత్వమ్ చ ఆశిషః నిత్యత్వాత్)

– వీటికి మొదలు లేదు కనక జీవించవలెననే కోరికకి కూడా అంతం లేదు. జీవితేచ్ఛ అనంతంగా సాగుతూనే ఉంటుంది.

 1. హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వాదేషామభావే తదభావః

(హేతు ఫల ఆశ్రయ ఆలంబనైః సంగృహీతత్వాత్ ఏషాం అభావే తత్ అభావః)

– హేతువు, ఫలము, క్రియ ఆధారంగా వాసనలు ప్రోది అవుతాయి కనక వాటిని తొలగిస్తే, వాటికి కారణమైన అవిద్య నశిస్తుంది.

 1. అతీతానాగతమ్ స్వరూపతోఽస్త్యధ్వభేదాద్ధర్మాణామ్.

(అతీత అనాగతమ్ స్వరూపతః అస్తి అధ్వభేదాత్ ధర్మాణామ్.)

– గతమూ, భవిష్యత్తూ స్వరూపాలు వేరుగా ఉంటాయి. వాటి తత్త్వాలు వాటి మార్గాలను అనుసరించి ఉంటాయి.

 1. తే వ్యక్తసూక్ష్మా గుణాత్మానః

(తే వ్యక్త సూక్ష్మాః గుణ ఆత్మానః)

– అవి స్థూలంగానో సూక్ష్మంగానో వాటి సహజప్రకృతులని అనుసరించి వ్యక్తమవుతాయి.

14.పరిణామేకత్వాద్వస్తుతత్త్వమ్

(పరిణామ ఏకత్వాత్ వస్తు తత్త్వమ్)

– వస్తుతత్త్వం ఆ వస్తువు మార్పు చెందే విధానాన్నిబట్టి ఉంటుంది.

 1. వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్త పంథాః

(వస్తు సామ్యే చిత్తభేదాత్ తయోః విభక్తః పంథాః)

– వేరు వేరు సాధకుల చిత్తములు వేరు వేరుగా ఉంటాయి కనక ఒకే వస్తువుగురించిన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి.

 1. న చైకచిత్తతంత్రమ్ వస్తు తదప్రమాణకమ్ తదా కిం స్యాత్?

(న చ ఏకచిత్త తంత్రమ్ వస్తు తత్ అప్రమాణకమ్ తదా కిమ్ స్యాత్?)

– ఒక వస్తువుయొక్క అస్తిత్వం ఒక వ్యక్తి చిత్తముమీద మాత్రమే ఆధారపడి ఉండదు. మరి ఆ వస్తువును ఆ వ్యక్తి గమనించనప్పుడు ఏమవుతుంది?

 1. తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్.

(తత్ ఉపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతమ్)

– వస్తువు ఉంది అని తెలియడానికి కానీ తెలియకపోవడానికి గానీ చిత్తమునకు వస్తువుగురించిన ఆలోచనలు ఉండాలి.

 1. సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయస్తత్ ప్రభోః పురుషస్యాపరిణామిత్వాత్.

(సదా జ్ఞాతాః చిత్తవృత్తయః తత్ ప్రభోః పురుషస్య అపరిణామిత్వాత్)

– పరమపురుషుడు మార్పు లేనివాడు, సమస్త చిత్తవృత్తులలో మార్పులను గ్రహించగలవాడు.

 1. నతత్స్వాభాసమ్ దృశ్యత్వాత్.

(న తత్ స్వాభాసమ్ దృశ్యత్వాత్)

– ఆ చిత్తము స్వయంప్రకాశము కాదు. ఇతరులకు మాత్రమే చిత్తమును పరిశీలించడం సాధ్యము.

 1. ఏకసమయే చోభయఽనవధారణమ్

(ఏక సమయే చ ఉభయ అనవధారణమ్)

– చిత్తమునకు ఒకే సమయంలో రెంటిమీదా – ఆత్మ, ద్రష్టలమీద- ధ్యానము నిలడం సాధ్యము కాదు.

 1. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుధ్ధేరతిప్రసంగః స్మృతిసంకరశ్చ.

(చిత్త అంతర దృశ్యే బుద్ధి బుద్ధేః అతి ప్రసంగః స్మృతి సంకరః చ)

– చిత్తము వేరొక చిత్తమును అర్థం చేసుకొనడానికి ఆ రెంటికంటే వేరు అయిన మరొక బుద్ధి కావాలి వాటిని పరిశీలించడానికి. అది అసంగతం కనక స్మృతులలో అయోమయం కలిగించడానికి కారణమవుతుంది.

 1. చిత్తేరప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనమ్.

(చిత్తేః అప్రతిసంక్రమాయాః తత్ ఆకార ఆపత్తౌ స్వ బుద్ధి సంవేదనమ్)

– ఒక ప్రవృత్తినుండి మరొక ప్రవృత్తికి మారని స్థితి చిత్తమునకు కలిగినతరవాత స్వబుద్ధిని తెలుసుకోగలదు.

 1. ద్రష్టృద్దృశ్యోపరక్తం చిత్తం సర్వార్ధమ్.

(ద్రష్టృ దృశ్య ఉపరక్తమ్ చిత్తమ్ సర్వ అర్థమ్)

– ద్రష్ట, దృశ్యముల ప్రవృత్తులను గ్రహించిన చిత్తమునకు తానే ద్రష్ట అయి ఆ చిత్తమును పరిశీలించగల శక్తిని పొందగలదు.

 1. తదసంఖ్యేయవాసనాభిశ్చిత్రమపి పరార్థమ్ సంహత్యకారిత్వాత్.

(తత్ అసంఖ్యేయ వాసనాభిః చిత్రమ్ అపి పరార్థమ్ సంహత్య కారిత్వాత్)

– అనేక వాసనలతో నిండి ఉన్నప్పటికీ చిత్తము పరమపురుషునికి చేరువ కావడంచేత, తదనుగుణంగా ప్రవర్తిస్తుంది.

 1. విశేషదర్శిన ఆత్మభావభావనావినివృత్తిః

(విశేష దర్శిన ఆత్మ భావ భావనా వినివృత్తిః)

– అనుభూతి ఆత్మలమధ్య విభేదము గమనించిన సాధకుడు చిత్తమును సంపూర్ణంగా నిరోధించగలడు.

 1. తదా వివేకనిమ్నమ్ కైవల్యప్రాగ్భారమ్ చిత్తమ్

(తదా వివేక నిమ్నమ్ కైవల్య ప్రాగ్ భారమ్ చిత్తమ్)

– అప్పుడే చిత్తము వివేకముతో ప్రాపంచికపరమైన ఆత్మనుండి సంపూర్ణంగా విడివడి పరమపురుషునికి చేరువ అవుతుంది.

 1. తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః

(తత్ ఛిద్రేషు ప్రత్యయః అంతరాణి సంస్కారేభ్యః)

– ఆవిధంగా ప్రశాంతత పొందిన చిత్తములో సూక్ష్మవిషయాలు లేదా స్మృతులు అంతరాంతరాలనుండి తిరిగి వెలువడి గోచరము అవుతాయి.

 1. హానమేషాం క్లేశవదుక్తమ్.

(హానమ్ ఏషామ్ క్లేశవత్ ఉక్తమ్)

– వీటిని కూడా తొలగించడం (ముందు చెప్పుకున్న) చిత్తవృత్తులకి సంబంధించిన క్లేశములను తొలగించడం వంటిదే అని యోగులు చెప్తారు.

 1. ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేర్ధర్మమేఘస్సమాధిః

(ప్రసంఖ్యాన అపి అకుసీదస్య సర్వథా వివేక ఖ్యాతేః ధర్మ మేఘః సమాధిః)

– ఎవరు ఆ సమాధిలో లౌకికలాభమును గమనించరో వారికి ఇతోధికంగా సద్వివేచన లభిస్తుంది, మేఘములు స్వతస్సిద్ధంగా వర్షించినట్టు.

 1. తతః క్లేశకర్మనివృత్తిః

(తతః క్లేశ కర్మ నివృత్తిః)

– అప్పుడు జన్మజన్మల క్లేశములు మళ్ళీ మళ్ళీ వ్యక్తమవడం అంతమవుతుంది.

 1. తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంత్యాజ్ఞేయమల్పమ్.

(తదా సర్వ ఆవరణ మల ఆపేతస్య జ్ఞానస్య ఆనంత్యాత్ జ్ఞేయమ్ అల్పమ్)

– ఆ తరవాత, ఈ ఉత్కృష్ట వివేచనతో పోలిస్తే చిత్తములో వసిస్తున్న మానసికమైన, బౌద్ధికమైన వికారాలు చాలా అల్పమయినవిగానూ అర్థరహితంగానూ కనిపిస్తాయి.

 1. తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిగుణానామ్.

(తతః కృతార్థానాం పరిణామ క్రమ సమాప్తి గుణానామ్)

– ఆ పరిణామ క్రమం పని పూర్తి అవుతుంది. పరిణామదశ అంతమవుతుంది.

 1. క్షణప్రతియోగీ పరిణామాపరాంతనిర్గ్రాహ్యః క్రమః

(క్షణ ప్రతియోగీ పరిణామ అపరాంత నిర్గ్రాహ్యః క్రమః)

– ఆ పరిణామానికి కారణమైన సమయం అంతమవుతుంది. పరిణామక్రమం పూర్తి అయిందన్న విషయం సాధకునికి స్పష్టమవుతుంది.

 1. పురుషార్థశూన్యానామ్ గుణానామ్ ప్రతిప్రసవః

కైవల్యమ్ స్వరూపప్రతిష్ఠా వా చిత్తశక్తిరితి.

(పురుషార్థ శూన్యానామ్ గుణానామ్ ప్రతిప్రసవః

కైవల్యమ్ స్వరూప ప్రతిష్ఠా వా చిత్తశక్తిః ఇతి)

– సాధారణ మానవులకి ధ్యేయం అయిన విషయాలలో ఆత్మ (లౌకికమైన) చిత్తమునుండి, ప్రాపంచిక విషయప్రభావాలనుండి విడివడి, యోగియొక్క భగవత్పరమైన ఆత్మలో లయమవుతుంది. అదే సమాధి.

కైవల్యపాదము సమాప్తము.

 

 

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము”

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s