ఊసుపోక 161 – సంద్రాల్తో సముద్రతీరాన

“మనూర్ల ఉన్నట్టు నేదు,” అంది సంద్రాలు చూపానినంత మేరకు జలజల పారుతున్న అలలు అదే యావగా పరికిస్తూ.

నేను నవ్వేను, “సముద్రం సముద్రమే. ఎక్కడయినా ఆ ఉప్పునీళ్ళే కదా.”.IMG_6971

సంద్రాలు విసురుగా తలాడించింది ఇరువేపులకీ. “ఉహుఁ. నేదు. మనసంద్రం మనసంద్రంవే. నీలు ఉప్పైతె ఊరు ఉప్పౌతాదేటి?”

నాకు కొంచెం తికమకయింది. నేనేదో అన్నాను అట్టే ఆలోచన లేకుండా. సంద్రాలేమో ఏదో వేదాంతం మాటాడుతోంది.

“నిన్నే సూడు. బూదేవి ఆకొసనించి ఈకొసకొచ్చిపడ్డవ్. ఆడ ఏటికి మూడు సుట్లు వాయుగుణ్ణాలు, తుపానులూ ఒచ్చి మొత్తం జాలారిపేట తుడిసిపెట్టేస్తాది. ఈడ నివ్వు సుకంగా ఎసిగదిలో ముడుసుక కూకుంటవు.”

అవును, గాలివానలొచ్చి జాలారిపేట కొట్టుకుపోవడం చాలామాట్లే విన్నాను. “మరి మీవాళ్లు మళ్ళీ అక్కడే గుడిసెలేసుకోడం ఎందుకు? దూరంగా వేసుకోవచ్చు కదా,” అన్నాను.

“యాడికి పోతం? యాడికీ పోం. పోనేం. సచ్చినా బత్కినా ఆడ్నే మాబతుకులు ఆ సంద్రంతోని. వాలిండియ రేడియో బోరుమని గోలెట్టేస్తది పాననస్టం, ఆస్తినస్టం అంటా. మానాటోల్ని పట్టించుకొనె పెబువుల్నేరు. మాకు ఒరిగీదేటీ నేదు.”

రెండు నిముషాలూరుకుని, మళ్ళీ సంద్రాలే అంది. “నివ్వు సదిగే సాయిత్తెం సంవద్రమంటిదె. నివ్వు పొస్తకాలు సదూతవ్. నాను సంద్రం సదూతాను.”

“సాహిత్యం సముద్రంలాటిదంటావా. అవున్లే. రెండూ కూడా అనంతమే కదా,” అన్నాను దూరంగా క్షితిజరేఖనపక్కనే నడయాడుతున్న అంబరపు అంచులు చూస్తూ. అక్కడ మొదలై చిరు తరగలుగా మొదలయి మావేపు హుషారుగా పరుగులు తీస్తూ వచ్చి మరిన్ని నీళ్ళు కలుపుకుని ఆకసంవైపుకి అప్పుడే నిద్ర లేచిన కొదమసింగంలా లేచి పడుచుదనపు పెళుసుదనంతో ఫెళ్ళున విరిగి పడుతున్నాయి, తుప్పరలు మామీదికి చల్లుతూ.

“ఉహుం, నేదు, పొస్తకాలకన్న సంవద్రంవే గొప్పది.”

“రెండూ ఒక్కలాటింవే అన్నావు కదా?” అన్నాను.

సంద్రాలు తల అడ్డంగా ఊపింది, “అదీ ఇదీ సమానం గాదు. పుస్తకం నిజిం గాదు. ఒవురికి తోసింది ఆలు రాసీస్తరు. సంద్రం సాసితం.”

“ఇది మహ బావుంది. నీమాట నువ్వే కాదంటున్నావు. ఇంక నేను వాదించక్కర్లేదు. సరే. ఇంతకీ సముద్రం ఏమిటి నేర్పిందయితే?”

“నివ్ ఈత్తావ?”

“ఈతా? రాదు. నీకొచ్చా?”

సంద్రాలు మొహం గుప్పున మతాబాలా వెలిగిపోయింది. పోటు తగిలిన సముద్రంలా పొంగిపోతూ, “ఈతా … అబ్బో … అడక్క. సేపలకి ఈత నేరిపిచ్చీగల్ను. నడక రాకముందలే నీలలో సబురీనునాగ దూసుకుపోయీదాన్ని అంటాది మాయమ్మ.”

IMG_6965“అమ్మో, సబ్ మెరీన్ లాగే?” అన్నాను నవ్వుతూ.

రెండు నిముషాలు మాటలు లేవు. నిశ్శబ్దమూ లేదు. సముద్రపు హోరు పెడుతూనే ఉంది తన ధర్మం నిర్వర్తిస్తూ. ఇసకలో ఓ నత్త నిదానంగా ముడచుకునీ సాగుతూనూ ముందుకు ప్రయాణం సాగిస్తోంది. హవామహల్ బీచిలో కనిపించే రావణాసురుడి తలలకోసం వెతుకుతున్నాయి నాకళ్ళు.

“ఇందలక సంద్రం సాయిత్తెం అంటిది అన్న ఎందుకు తెల్సా?”

“ఎందుకు?”

“సంద్రంల రాల్లుంటయి. రతనాలుంటాయ్. ముత్తేలుంటయ్. మొసల్లుంటయి. నివ్ కానుకోపొతె సుడిగుణ్ణాలు సప్పరించీసత్తయి.”

“పుస్తకాలూ అంతే కదా మరి. వాటిలోనూ మంచివీ ఉన్నాయి. పనికిమాలినవీ ఉంటాయి. కొన్ని చదివితే ఉత్సాహం, కొన్ని చదివితే విజ్ఞానం. అలాగే వికారం కలిగించేవి కూడాను,” అన్నాను. పుస్తకాలవిలువ పరిరక్షించవలసిన అవుసరం అత్యవసరంగా కనిపించింది నాకు మరి.

సంద్రాలు ఒప్పుకోలేదు. తల విసురుగా ఆడించింది ఊహుహూ అంటూ.

“పొత్కాలు నివ్వు చదువుతవ్. అయి మల్ల రాసీస్తవ్. నేదా ఆరికీ ఈరికీ చెప్తవ్. ముందూ ఎనకా కూడా నీ బుర్ర కాలీయే. ఈడున్న దాక తీసి ఆడెట్టినట్టే నీ సదుగూను.”

నాకు నవ్వొచ్చింది. “అయితే పుస్తకాలు చదివి నేను కొత్తగా నేర్చుకున్నదేమీ లేదంటావేమిటి?” అన్నాను.

“నేదు. అయి సదివి నివ్ నేర్సుకున్నదేటీ నేదు.”

నేను ఆలోచిస్తున్నాను.

“అస్లు సాయిత్తెం ఎట్ట ఒచ్చింది సెప్పు,” అంది.

ఏం చెప్పను? ఆదిమానవుడు వేటాడిన జంతువులను తెచ్చి ఇస్తే ఆడమనిషి వండి వడ్డించేక తింటూ ఆనాటి సాహసగాథలు వర్ణించడంతో మొదలయిందని చెప్పనా? సూతుడు శౌనకాది మహామునులకు చెప్పగా, నారదుడు వ్యాసునికి చెప్పగా, శుకుడు పరీక్షత్ మహారాజుకు చెప్పగా … అంటూ సాగించనా?

“నాకు తెలీదు. నువ్వే చెప్పు,” అన్నాను.

సంద్రాలు గంభీరంగా ఊపిరి తీసుకుని మొదలు పెట్టింది. “ముందస్తుగా ఈ మడుసులూ, పెపంచకం ఏంవీ నేవు. నీలు తప్ప ఇంకేటీ నేవు. నివ్వు ఇన్నవు గద జలమయంవని. అప్డు ఇస్నుమూరితోరు ఉద్బవించీరు. ఆరికి రూపు రేకలు ఎట్టొచ్చినయ్ అని నన్నడక్క. ఆరు పుట్టీరు. అంతె. ఆయనేంవో బెమ్మని పుట్టించినాడు. బెమ్మ “నన్ను పుట్టించీసినావు. ఉప్డు నానేం సేయను?” అని గోలెట్టీసినాడు. అంతట విస్నుమూరితోరు సరే పెపంచకం చేసి, మడుసుల్ని సేసి ఆడుకో అని చెప్పీసీరు. అదన్నమాట. అనాగ పెపంచకం వచ్చీసినాది. మరి నీలు అంటె ఈ సముదరం ముందె ఉన్నది గద. అందుసేత సముదరంవే గనం.” అంది సగర్వంగా నొక్కి పలుకుతూ.

నాకు ఏం అనడానికీ తోచలేదు. సంద్రాలు వాదన న్యాయమేనా అన్న ఆలోచన లేదు నాకు. సంద్రాలు తన అభిప్రాయాలని అంత గాఢంగా విశ్వసించడమే నాకు నచ్చింది.

“సరే. అలాగే అనుకుందాం. నువ్వు సముద్రంలో ఈత కొడ్తూ ఏం నేర్చుకున్నావో చెప్పు.”

సంద్రాలు ఆలోచనలో పడింది. మళ్లీ ఓ పది నిముషాలు మాటల్లేవు సముద్రపు హోరు, ఉండీ ఉడిగీ దూరంగా ఎవరో చెప్పుకుంటున్న కబుర్లలోంచి వినిపిస్తున్న శబ్దతరంగాలూ తప్పిస్తే.

హవామహల్ సముద్రపొడ్డున గౌనుల్లో, పరికిణీల్లో, చీరెల్లో తిరుగాడుతూ, తడి ఇసకలో పాదం జొనిపి పిచిగ్గూళ్ళు కట్టి, పిచికలు వచ్చి గుడ్లు పెడతాయని ఎదురు చూసిననాడు, అరికాళ్ళలో అలలు కితకితలు పెట్టిననాడు, తుప్పగా తడిసి ఇసక అంటుకుని మణుగు బరువెక్కిన పరికిణీ ఈడ్చుకుంటూ ఇల్లు చేరినరోజు …

డాబామీద చాపమీద వెల్లకిలా పడుకుని గోడమీద 20 క్షణాలకోమారు మెరిసే లైట్ హౌస్ దీపం వెలుగు ఎన్నిమార్లు లెక్క పెట్టేనో బంగాళాఖాతం హోరు పెడుతూంటే, ఆ కెరటాలమీంచి పిల్లగాలులు పిట్టగోడ దాటి ఎదిగిన సంపెంగచెట్టుమీంచి మోసుకొచ్చిన వాసనలు ఆఘ్రాణిస్తూ.

“ఇంటన్నవ?” సంద్రాలు సతాయింపుతో ఉలికి పడి ప్రస్తుతంలోకి వచ్చి పడ్డాను.

సంద్రాలే అందుకుంది మళ్ళీ, “నావలేవీ అగుపిచ్చవ్ ఈడ. నీకూ ఎరికే గద. జాలారిపేటకాడ సీకటితోనె గుడిసెల్లోంచి ఈతలకొత్తె సూణ్ణానికి రొండు కల్లు సాలవు. గుంపులు గుంపులుగ నావలు. అయి సూస్తనె పానం లేచొస్తది. ఏటి నేర్సుకున్ననని అడగ్తన్నవు. సెప్పినాను గద. మున్నీరు గర్బంలో రాల్లుంటయి. రతనాలుంటయి. రాల్లు ఒగ్గీస్తం. రతనాలు ఏరుకుంతం. మొసల్లనోట బడకుండ కాస్కుంతం. సేపలట్టి మన నోళ్లల పడేస్కుంతం. అదీ సాస్తరం.”

“చిన్న చేపని పెద్ద చేపలు గుటకాయస్వాహా చేసేయడమే శాస్త్రం అంటావు!”

“అంతి గద. సంవుందరం అయిన అంతె, పెపంచికంవైన అంతె. మనల్ని ముసల్లు తినికండ కాస్కోవాల. మనం తినీయి పట్టిడం తెల్సుకోవాల.”

“సరే గానీ, నీగురించి కొంచెం చెప్దూ. వెనకటి కతలు* చదివినవారికి కొంచెం తెలుసు కానీ మళ్లీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేం కదా. చాలామందికి నీగురించి తెలీకపోవచ్చు,” అన్నాను.

“ఏటున్నది చెప్పనానికి. మాం పదకొండు మందిమి. నాను కడసారిదాన్ని. నడాడం ఒచ్చింకాడ్నించి నీల్లలోనే. మాయమ్మకేంవో బయ్యం “సుడిగుణ్ణంల సిక్కి సస్తవె గుంటా, నీల్లల దిగకే” అని అరస్త ఉండీది. నానింటేనా. ఒప్పుడె కిరస్తానీవోల్లొచ్చి ఇస్కులెట్టినారు. మాయమ్మ నన్ను ఇస్కులికి తోలింది సదూకో గుంటా అంట. నాకు పదేల్లప్పుడు పెల్లి సేసింది. ఆమీన నీకూ తెల్సు గద. ఆడిమాటా ఈడిమాటా యిని, ఆడితో ఈడితో గడిపి ఈకాడికొచ్చిన. అందుసేత నాకియ్యన్ని పాతకతలె.”

సంధ్యభానుడు ఉరువు పెంచుకుని ఎరుపు తిరుగుతున్నాడు. చెవిలో రహస్యాలు ఊదుతున్నట్టు కనిపించీ కనిపించకుండా చీకట్లు కమ్ముకుంటున్నాయి.

ఇద్దరం ఇంటిముఖం పట్టేం.

సంద్రాలుమాటే నామనసులో మెదులుతోంది. నీరు ఉప్పయితే ఊరు ఉప్పవుతుందా? అవునూ అనిపిస్తోంది, కాదనీ అనిపిస్తోంది. ఉప్పెక్కువయితే కూర ఉప్పు కషాయం. అంచేత కాదనే అనిపిస్తోంది. ఉప్పురాయి తగుల్తేనే కూరకి రుచి కూడాను. అంచేత అవునూ అనిపిస్తోంది కూడా మరి!

IMG_6861

———

* సంద్రాలు ప్రవేశం నాకథల్లో మొట్టమొదటిసారిగా “అక్షరం పరమం పదం” కథలో అయింది. ఆ తరవాత అనేక కథల్లో అతిథిపాత్రలు నిర్వహిస్తూ మాయావటుడిలా నిలువెత్తు ఎదిగిపోయింది).

బొమ్మలు JB సౌజన్యంతో.

———-

(నవంబరు 1, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక 161 – సంద్రాల్తో సముద్రతీరాన”

 1. నీరు ఉప్పు ఐతే ఊరు ఉప్పు కాక పోవచ్చు గాలి ఉప్పుగాలి ఇనుముని రాతిని కూడా కొరికి తినే ఉప్పుగాలి సంద్రం గాలి మనిషికి మేలు చేస్తది వస్తువుని చెరుపు చేస్తది సంద్రం కూడా ప్రకృతే కదా..

  మెచ్చుకోండి

 2. కృష్ణవేణీ, నీ మొదటి వాక్యం – నీకు నచ్చినందుకు సంతోషం. మాట్లాడకపోయినా సముద్రఘోష ఏదో చెప్తున్నట్టుంటుంది అనిపించింది నాకు.
  రెండో వాక్యం సముద్రపు నీరు ఉప్పు కదా. ఉప్పుకి మనవంటల్లోనూ సాహిత్యంలోనూ కూడా ప్రత్యేకత ఉంది. నా ఉప్పు తిని లాటి సామెతలూ, ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు ప్రాముఖ్యత – ఇలా. ఇవన్నీ చర్చిస్తే, మళ్లీ పాండిత్యం అయిపోతుంది. అంచేత పాఠకులకే వదిలేసేను.

  మెచ్చుకోండి

 3. >రెండు నిముషాలు మాటలు లేవు. నిశ్శబ్దమూ లేదు – ఎంత మంచి భావనో!
  నీరు ఉప్పయితే ఊరు ఉప్పవుతుందా?
  ఏమో మరి. కానీ ఆలోచించవలిసిన సంగతే.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.