ఊసుపోక 162 – నటనల భ్రమయకు నా మనసా!

నా దినసరి సంచారంలో చెట్లూ పుట్టలూ చూస్తూ నాకళ్ళనాకట్టుకున్నవి కెమెరాతో పట్టుకు దాచుకుంటాను. కొన్ని మీతో పంచుకుంటాను కూడా కదా. ఇవాళ అలాగే మరో బొమ్మ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చిన్న కథ కూడా ఉంది.

నేను ప్రస్తావిస్తున్న మొక్క ఒకటి సుమారు రెండు నెలలకిందట నాకళ్ళపడింది. ఇక్కడ మీతో పంచుకునేముందు చట్రం ఉరవు పెంచితే, ఆ నేపథ్యంతో మరింత హుందాగా కనిపిస్తుందనిపించి మరోమారు ఆ చెట్టుకోసం బయల్దేరేను కెమేరా పుచ్చుకుని.

రెండువారాలయింది ఈ తిరగడం మొదలెట్టి. మొదట రోజూ మామూలుగా నడిచే దారిలో వెళ్ళేను. కనిపించలేదు.

అప్పుడప్పుడు వెళ్ళే దారులు చూసేను. కనిపించలేదు.

ఆ తరవాత ఆ పక్కదారీ, ఈ పక్కదారీ, మూడోపక్క దారీ అలా కనిపించిన దారల్లా తిరిగేను. క …లేదు.

ఇంటికొచ్చి నాదగ్గరున్న బొమ్మ తీసి పరీక్షగా చూసేను. భూతద్దంలోంచి చూసేను. బొమ్మలో చెట్టువెనక నీడల్లా కనిపిస్తున్న ఇళ్ళు, దారిపక్కనున్న కార్లు కళ్ళు పొడుచుకు చూసేను. అవి ఆనవాలుగా ఎక్కడుండి ఉంటుందో పట్టుకోగలనేమో అని.

తరవాత కెమేరాలో ఆ బొమ్మకి ముందూ వెనకా తీసిన బొమ్మలు వరసగా చూసేను. అవి ఆనవాలుగా స్థలనిర్ణయం చేయగలనేమోనని నాఆశ. పరిశోధక చక్రవర్తులు కూడా ఇంత పరీక్షగా వనరులకోసం వెతికి ఉండరు. అంత అవస్థ పడ్డానన్నమాట.

రెండు రోజులయింది భోజనం చేసి. అన్నం సయించడం లేదు. మరీ నాలుక పీక్కుపోయినప్పుడు రెండు చుక్కలు నీళ్ళతో గొంతు తడుపుకుంటున్నానే కానీ సోడాలు, పాలూ, పళ్ళరసాలూ లేవు. పంచాంగం తీసి చూడలేదు కానీ ఏకాదశో శివరాత్రో అయితే తప్పకుండా కటిక ఉపవాసం చేసిన ఫలం దక్కేది.

ఆవ్విధమున మా చుట్టుపక్కల రెండున్నర మైళ్ళ పరిధిలో రోజుకో దిక్కు చొప్పున తిరిగేను. హుమ్. ఏమైపోయుంటుంది ఇంత చెట్టు అన్న ప్రశ్నకి సమాధానం లేదు.

మిగిలిన మొద్దు ఉరవు చూస్తే ఆరడుగులున్నట్టుంది. పెద్ద చెట్టే అని తెలుస్తూనే ఉంది. అది కొట్టేసేక, ఏమూలో కొనఊపిరితో కొట్టుకుంటున్న ఓ మొలక మళ్లీ ననలు తొడిగి కొమ్మలు వేసి ప్రవృద్ధమానం అయింది. ఆ కొమ్మలు చూసినా అదక్కడ చాలాకాలంగా ఉండే ఉండాలి. ఇప్పుడది హఠాత్తుగా, అదృశ్యమయిపోయిందంటే, కర్పూరం హరించిపోయినట్టు, ఆశ్చర్యం కాదూ?

ఇక్కడే మరోమాట కూడా చెప్పుకోవాలి. ఏడాదిగా చూస్తున్నాను. ఈ ఊళ్ళో చెట్లు నేలమట్టం చేసేయడం అతి తేలిగ్గా, సర్వసాధారణంగా, నిత్యవ్యవహారంగా జరిగిపోతూనే ఉంటుంది. కానీ ఓ మహావృక్షాన్ని నరికేసి, ఆ మిగిలిన మొద్దులోంచి కొనఊపిరితో కొట్టుకుంటున్న ఓ జీవాన్ని ననలు తొడగనిచ్చి, విష్ణుమూర్తి నాభిలోనించీ కమలం పుట్టినట్టు లేచిన ఆ మొక్కని నాలుగడుగులఎత్తు ఎదగనిచ్చి మళ్ళీ కొట్టేయడం ఎవరైనా చేస్తారా? దారుణం కాదూ? ఎంతటి కర్కోటకుడయినా అలాటి దుర్మార్గానికి పూనుకోడనే నా నమ్మకం. నా పట్టుదల హెచ్చింది ఎందుకు కనిపించదని. మతి పోతోందేమో అన్న సందేహం కూడా కలిగింది. కొంచెం కోపం కూడా వచ్చింది. నాచిన్నప్పుడు ఎవరిల్లయినా వెతుక్కుంటూ బయల్దేరితే, ఎవర్నడిగినా, “అటెళ్ళండి, వాకిట్లో వేపచెట్టు, గేటుమీద మల్లె పందిరీ …” అంటూ ఆనవాళ్ళు చెప్పేవారు. చెట్టు శాశ్వతం. చెట్టు ఎన్నో కథలు చెప్తుంది. చెట్టుకి ఎంతో చరిత్ర ఉంటుంది.

ఆఖరిప్రయత్నంగా సంద్రాల్ని పిలిచి, “పద. నాక్కనిపించనివి నీకు కనిపిస్తాయి,” అంటూ ఆవిడని తీసుకు మళ్ళీ బయల్దేరేను.

అటు సూడు, ఇటు సూడు అంటూ సంద్రాలు నిర్దేశిస్తుంటే మా ప్రాంతం అంతా గింగరాలు తిరిగేం మూడు గంటలసేపు. కనిపించలేదు.

తిరగడం అయేక, సంద్రాలు నిర్ధారణ చేసేసింది. “సూసినానని నివ్వనుకుంతన్నవ్. నిజింగ ఆడ సెట్టున్నదా నేదా ఓరు సెప్పగల్రు? ఓరూ సెప్పనేరు. నివ్ అనుకుంతన్నవు సూసినానని. సత్తెంవేటంటే నివ్ సూణ్ణేదు. ఆడ సెట్టు నేదు.”

“బాగానే ఉంది నీమాట. చెట్టుందని నేను భ్రమ పడుతున్నానంటావేమిటి?” అన్నాను సహం హాస్యానికీ, సహం సందేహంతోనూ. ఆ క్షణంలో నామేధమీద నాకే అనుమానం కలిగింది.

“అస్లంతె మడుసులబుద్దే అంత. నివ్వు ఉందనుకుంతవు. ఉందనుకోనం నీ బెమ. కనిపిచ్చనేదు గెనక నేదనుకుంతన్నవు. అదిన్నూ బెమే. అది ఎల్లపుడూ ఆణ్ణే ఉంటది. నీకు తెలవదంతె.”

నాకెందుకో ఇది చాలా లోతైన విషయంలా అనిపించింది.

“ఎక్కడ నేర్చేవు ఈ వేదాంతం? మీ దొర మన వేదాంతం పుస్తకాలూ చదువుతాడేమిటి?” అన్నాను సంద్రాలు మొహం తేరి చూస్తూ.

“నేదు. సదూతారు గానీ ఆ బాబు నాకు సెప్పనేదు. మీయమ్మే సొరగాన ఉన్నది సల్లనితల్లి చెప్పినాది. నాను జిగినీసాయిబుయింట వున్నపుడు కూరగాయలు తెచ్చీదాన్ని గద మీయమ్మకి. ఒప్పుడు సెప్తాఉండీది. ఈనోకంలో సమస్తమూ ఎట్ల జరగాలో అట్ల జరిగిపోతాదంట. అనాగే మనం ఉందనుకుంతం. అదేమీ నేదు. మనం నేదనుకుంతం. అది ఉంటది. మనం అయన్ని పెస్నించరాదు.”

అమ్మని ఎంతమంది తలుచుకుంటారో నాకు తెలుసు. మ్. మాయామేయమిదం జగత్సర్వం అని కూడా అమ్మే చెప్తుండేది. ఏమయితేనేం గానీ చెట్టు మాటెలా ఉన్నా కాళ్ళు పీకేస్తున్నాయన్నది నిశ్చయం. లేదు. ఇది భ్రమ కాదు.

“సరేలే, చెట్టు లేదు. నాకు మాత్రం కాళ్ళు పీకేస్తున్నాయి, పద ఇంటికి” అన్నాను వెనక్కి తిరిగి. ఈ తిరుగుడుతో పాటు అమ్మని తలుచుకున్నందున కూడా నాకు నీరసం వచ్చేసింది. చెట్టు అస్తిత్వం అనుమానం అవచ్చు కానీ కాళ్ళు పీకడం మాత్రం వాస్తవమే. మాపిల్ల అన్నట్టు అది కూడా నా భ్రమే అనుకుంటే తప్ప. నేను అలా అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే కాళ్ళనొప్పి నాకు తెలుస్తోంది. అడుగు దీసి అడుగు పడడంలేదు మరి!

ఓయీ చదువరీ! ఇదీ నా హృదయవిదారక వృక్ష వెతుకులాట కథ. ఇప్పుడు నీవే చెప్పుము. నేను ఈ కథ చివర్న పెట్టిన లేదా పెట్టేను అనుకుంటున్న బొమ్మలో నరికేసిన తరుమూలం, ఆమూలంలోనుండి మొలిచిన మొక్క నీకు కనిపిస్తోందా?

కనిపించినయెడల, నీకున్నూ మొక్క కనిపిస్తోందని భ్రమ పడుతున్నానేమో అన్న సందేహం కలుగుతున్నదా? నువ్వు కూడా లేని దానిని ఉందనుకుంటున్నట్టు ఊహిస్తున్నావేమో ఆలోచించేవా?

కుదురులోమొక్క

 

(నవంబరు 6, 2015­)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఊసుపోక 162 – నటనల భ్రమయకు నా మనసా!”

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s