ఊసుపోక 163 – మహా వీర చక్ర అనుభవం మళ్ళీ

పాతికేళ్ళకిందట రక్షకభటుడొకడు నాకారు వెంట బడ్డాడని ఏడేళ్ళకిందట రాసేను, మీలో కొందరికైనా జ్ఞాపకం ఉండే ఉండాలి. మళ్లీ ఆ అదృష్టం నిన్న కలిగింది.

అసలు నేను ఇక్కడికొచ్చేక కారు చోదకక్రియ మానేసేను. కారణాలు రెండో మూడో ఉన్నాయి కానీ ప్రధానకారణం మాఅమ్మాయిని ఉపయోగించుకోడమే. (మాఅమ్మాయి ఇది చదవదన్న ధైర్యంతోనూ, మీరు నామీద చాడీలు చెప్పి నన్ను ఇరుకున పెట్టరన్న నమ్మకంతోనూ రాస్తున్నానేనీమాట.). నేను మాయింటి చుట్టుపట్ల 6మైళ్ళ పరిధిలో కూరా కాయా పాలూ గట్రా తెచ్చుకోడానికి మాత్రమే కారు తీస్తాను.

నిన్న అలాగే బయల్దేరేను. పంచాంగం చూసుకోలేదు నేను బయల్దేరినవేళ వర్జ్యం అదీ ఏమైనా ఉందేమో అని. వీధి మలుపు తిరిగేనో లేదో పొలోమంటు ఎరుపూ నీలం రంగుల దీపాలు ఝళిపిస్తూ కాపు కారు నావెంట బడింది. మొదట నాకోసమే వేంచేస్తున్నారు రాజభటులు అని నేను గ్రహించలేదు. అలాటి కార్లకి మనం తప్పుకోవాలి అన్న నిబంధననుసరించి పక్కకి తప్పుకున్నాను. ఆ రక్షకభటుడు నాకోసమే ఆ దీపతోరణాలు అని తెలియజేస్తూ నావెనకే తనకారు ఆపేడు.

నా అరిపాదాలలో రక్తం గుండెలకెగదన్ని నసాళాననికంటింది. ఇదేం ఖర్మరా, నేను స్పీడు లిమిటు దాటలేదు, ఎడమవైపుకి తిరుగుతున్నాన్ని సౌంజ్ఞ చేసి, వెళ్ళు అని పచ్చబాణం అనుమతిచ్చిన తరవాతే తిరిగేను కదా అని చూస్తున్నాను.

ఆ శిక్షకభటుడు తీరిగ్గా మూడు నిముషాలతరవాత వచ్చి, తన పేరు చెప్పుకుని, “నిన్నెందుకు ఆపేనో తెలుసా?” అన్నాడు.

తెలీదన్నాను.

“నీకారు వెనక ఎడమవైపు దీపం ఆరిపోయింది, తెలుసా?”

“తెలీదు.”

“సరే. నీ డ్రైవింగ్ లైసెన్సు చూపించు.”

తీసి ఇచ్చేను.

ఇన్సూరెన్సు ఉందా?

ఉంది. తీసిచ్చేను.

“ఇక్కడే ఉండు,” అని ఆ రెండు కార్డులు తీసుకుని వెళ్ళిపోయేడు. కొన్ని యుగాలయేక, మరో అమ్మాయి వచ్చి, నాకార్డులు నాకిచ్చి, “నిన్నెందుకు ఆపేమో తెలుసా?”

రెడ్డొచ్చే మొదలాడు. అదయేక, “ఇదుగో. ఇది వార్నింగు. నువ్వు కోర్టుకెళ్ళక్కర్లేదు. తప్పు ఇచ్చుకోనక్కర్లేదు,” అంది ఆవిడ రాసిన టికెట్టు నాకు ప్రేమగా అందిస్తూ.

“అది నా రికార్డెక్కుతుందా?” అనడిగేను. నాకు ఇలాటివి అట్టే అలవాటు లేవు మరి.

పైగా నిన్ననే నా ఇంసూరెన్సు కంపెనీ నా ఉత్తమ కారుచోదక రికార్డుని అభినందిస్తూ ప్రీమియము తగ్గిస్తున్నట్టు తెలియజేసింది.

“లేదు. నీ రికార్డులోకి ఎక్కదు. ఊరికే వార్నింగు ఇచ్చేం అంతే. ఆ దీపం మరామత్తు చేయించు,” అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది.

ఆ అమ్మాయి అందించిన కాయితం చూసేను. దానిమీద పెద్దక్షరాలతో Traffic Violation Notification అని ఉంది. ఆ మూడు ముక్కల్లో మధ్య ముక్క నాకు ముల్లులా గుచ్చుకుంది.

నా తప్పు లేకపోతే, నారికార్డులోకి ఎక్కకపోతే ఆ కాయితమ్ముక్క మాత్రం ఎందుకూ?

ఎందుకంటే వాళ్ళ రికార్డులో రాసుకోడానికి. వాళ్ళు ఎన్ని తాంబూలాలిస్తే అంత ఘనంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్టుట.

మీకు గుర్తు లేకపోతే నా పూర్వానుభవం, మహా వీర చక్ర ఇక్కడ చూడండి. అన్నట్టు ఈ మహా వీరచక్ర బిరుదు నాకు నేనే యిచ్చుకున్నాను కనక తిరిగి ఇవ్వబడదు.

——–

(నవంబరు 8, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “ఊసుపోక 163 – మహా వీర చక్ర అనుభవం మళ్ళీ”

 1. >తప్పు ఇచ్చుకోనక్కర్లేదు< మంచి కాపు.
  నేను తప్పులిచ్చుకున్న సందర్భాలెన్నో!
  ఎప్పుడూ దుర్మార్గపు కాపులే ఎదురవతారు.:(

  మెచ్చుకోండి

 2. విన్నకోట నరసింహారావు గారూ. చోదకక్రియ మానేసారా. బాగుంది. పోతే పురస్కారాలు తిరిగిచ్చేయడం కూడా ఒక ప్రమో అనే నాకు అనిపిస్తోంది. పుచ్చుకున్నప్పుడు ఒక హడావుడి, తిరిగిచ్చేసినప్పుడు మళ్ళీ హడావుడి, బహుశా. మళ్ళీ తిరిగి పుచ్చుకుంటారేమో కూడా.

  మెచ్చుకోండి

 3. మా దేశంలో పోలీసుల నెలాఖరి కేసుల ఆరాటం అర్ధమయిన తర్వాత నేను నెలాఖరు రోజుల్లో నా బండి బయటకు తీసేవాడిని కాదు చాలా కాలం; సిటీ బస్సు గాని, ఆటో గానీ ఉపయోగించేవాడిని. ఇప్పుడు అసలు “చోదకక్రియే” మానేసాను – ఈ భయంకరమయిన, అడ్డదిడ్డమయిన ట్రాఫిక్ తట్టుకోలేక. మళ్ళీ ఆటో / కాబ్ గానీ, సిటీబస్సు గానీ మాత్రమే.

  <"ఈ మహా వీరచక్ర బిరుదు నాకు నేనే యిచ్చుకున్నాను కనక తిరిగి ఇవ్వబడదు." హ హ్హ హ్హ, మీ పోస్ట్ కొసమెరుపు బాగుందండి. భారతదేశంలో ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న – పురస్కారాలు తిరిగి ఇచ్చెయ్యడం అనే – ప్రక్రియ మీద మంచి విసురు 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. అరుణ గారూ, నాబ్లాగులో కామెంట్సుకి moderation ఉంది. నేను చూసి అంగీకరించేవరకూ మీకు కనిపించదు. మీ కామెంటుకు థాంక్స్. అవును చెప్పుకు నవ్వుకోడాని పనికొస్తాయి. మీరు తెలుగు టైపింగు నేర్చుకోండి. అదేమంత కష్టం కాదు. ఏదో ఒక సాఫ్టువేర్ తీసుకుంటే ఇంగ్లీషులో రాసినంత తేలిగ్గానూ తెలుగులో కూడా రాయవచ్చు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.