పతంజలి యోగసూత్రములు – ఉపసంహారము

సంగ్రహంగా ఈ యోగసూత్రాలలో నాకు అర్థమయినది ఇది. సమాధి పొందడానికి ముందు సాధకునికి సమాధి అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏమి చెయ్యాలి అన్నవిషయాలలో స్పష్టమైన అవగాహన కావాలి.

మొదటి అధ్యాయం సాధన పాదంలో పతంజలి మహర్షి యోగసాధనకి అవసరమైన మనోధర్మాలను, నిష్ఠను పరిచయం చేసి, తరవాత మిగతా మూడు పాదాలలో వాటిని విస్తరించి వివరించేరు.

సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.

మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.

అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.

సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకువంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవుసరమైన ప్రశాంతత పొందవచ్చు.

చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.

వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.

సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.

ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.

పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.

తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.

సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.

సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.

ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.

ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించేరు.

ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనసును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.

ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.

ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలూ, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.

సత్వ తమో రజోగుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.

సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.

సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో ఈ పాదము ముగుస్తుంది.

ధారణ, ధ్యానం, సమాధి – అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.

పరమోత్కృష్టమయిన సమాధి (పరమపురుషునిలో లీనమవడం) విషయంలో నాకు సమగ్రమైన అవగాహన లేదు. నాకు అనేక విధాలుగా సహాయపడిన లక్ష్మీ దేవి గారి వివరణ యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను, లక్ష్మీ దేవిగారి సౌజన్యంతో.

“ప్రకృతికి విస్తారమైన అర్థంలో తీసుకోవాలి. అంటే పుట్టుక, నాశనం కలది ప్రకృతి. ఆ ప్రకృతిలో సమస్తం వస్తుంది. నేను అనుకుంటున్న ఈ శరీరం కూడా. అదంతా ఒకనాటికి పురుషుడు (పరమాత్మ, లేదా మూలశక్తి లేదా ఆదిశక్తి లేదా పరబ్రహ్మం లేదా ఇదంతా ఏర్పడడానికి , నడవడానికి, నశించడానికి కారణమైన శక్తి)లో కలుస్తుంది. ప్రకృతి = ఆత్మ అనుకోరాదు. ప్రకృతి నశించేది. ఈ శరీరం, శరీరంతో అనుభవం పొందేది అంటే కనిపించేదీ, వినిపించేదీ అన్నీ. ఆత్మ కనిపిస్తున్న ప్రకృతే నేను అనుకోవడం తప్పు. అంటే శరీరమే నేను అనుకునేంత వరకూ అజ్ఞానం. ఆ స్థితి దాటగలిగిన శక్తి ఆత్మకుంటుంది. (ప్రకృతి కుండదు) దాటినపుడు పరమాత్మలో లీనమే.”

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసినది ప్రకృతి పురుషుడు అంటే జీవాత్మ పరమాత్మ అని. (ప్రాచుర్యంలో ఉన్న స్త్రీ పురుషులు అన్న పరిమిత అర్థంలో కాదు)

ప్రకృతి పురుషుని అనుభవంకొరకు సృష్టింపబడింది. ప్రకృతి పురుషుల సమాగమమే సమాధి. ప్రకృతి ఆ సమాగమం పొందడానికి పురుషుని (దృశ్యము) తేజస్సు, క్రియాశీలత, ఆచరణ, ఇంద్రియానుభవాలు సాధకాలు అవుతాయి. అవిద్య తొలగినతరవాత పురుషుని కర్తవ్యం సమాప్తమవుతుంది. ప్రకృతికి అదే విముక్తి.

———

కృతజ్ఞతలు.

నా ఈ ప్రయత్నంలో సహాయసహకారాలు అందించినవారిలో శ్రీమతి లక్ష్మీ దేవి గారికి ఎంతో ఋణ పడి ఉన్నాను. సర్వశ్రీ ఏల్చూరి మురళీధరరావు, కొలిచాల సురేశ్, లలిత గూడ, గుండు మధుసూదన్, నారాయణ స్వామి, రాధ మండువ గారలు సందర్బానుసారం అందించిన సహాయానికి ధన్యవాదాలు. ప్రోత్సహించిన మిత్రులకు నమస్సులు.

నా అనుకృతిలో దోషాలకి నాదే బాధ్యత. మీకు దోషములు కనిపిస్తే, నాకు తెలియజేస్తే, దిద్దుకోగలను.

 

– నిడదవోలు మాలతి

—————

నేను సంప్రదించిన గ్రంథాలు

అంతర్జాలంలో

 1. The Yoga Sutras of Patanjali, the Threads of Union, translated by Bon Giovanni

http://www.sacred-texts.com/hin/yogasutr.htm

 1. బ్రహ్మవిద్యా రత్నాకరము. ద్వితీయ సంపుటము. pp. 86-101. www.siddhashramam.org.
 2. Enlightened Living (yoga sutra of Patanjali) by Swami Venkateswananda. http://www.swamivenkatesananda.org/clientuploads/publications_online/Enlightened_Living_by_Swami_Venkatesananda.pdf

 

అచ్చు పుస్తకాలు

Four Chapters of Freedom. Commentary on Yoga Sutra of Patanjali, by Swami Satyananda Saraswati. 3 Ed. Bihar: Bihar School of Yoga, 1989.

పాతంజలి యోగసూత్రములు. Hyderabad: Sri Krishananda Matham. n.d.

—-

(నవంబరు 12, 2015)

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “పతంజలి యోగసూత్రములు – ఉపసంహారము”

 1. డా. సుమన్ లతగారు, శ్రమ తీసుకుని ఈ పోస్టులు చదివి మీ అభిప్రాయాన్ని వివరంగా రాసినందుకు కృతజ్ఞతలు. అవును. ఇవి తేలిగ్గా అర్థం కావు కానీ చదువుతుంటే ఏదో తృప్తిగా ఉంటుంది. నాకు అట్టే విషయపరిజ్ఞానము కానీ భాషాపరిజ్ఞానము కానీ లేనందున సందేహిస్తూ మొదలు పెట్టేను. మిత్రులసహాయంతో ఓమోస్తరుగా పూర్తి చేసేను. ఇంకా పని చేస్తున్నాను దీనిని మెరుగు పరచడానికి. ఆ సందర్భంలోనే మీ అభిప్రాయం విలువైనది. మరొకమారు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మాలతి గారికి ,ముందుగా మీకు అభినందనలు చెప్పాలి .పతంజలి యోగ సూత్రాలను అర్థం చేసుకోగల జ్ఞానం లేని నాలాటి సాధారణ పాటకులకు దగ్గరగా తెచ్చేరు .అయితే తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం మెండు.మీరు మొదట మూల శ్లోకాన్ని ఇచ్చి కింద దానిని విడదీసి ఇవ్వటం నాకు చాలా బాగుంది .ఒకసారి మీరు ఇచ్చిన క్రమం లో చదివి తిరిగి తెలుగు అర్థం,శ్లోకం విడగొట్టిన భాగం,అటుపైన మళ్ళీ మూల శ్లోకం చదివుతూ అర్థం చేసుకున్డికి ప్రయత్నించాను .ఆరోహణ -అవరోహణ క్రమం లో చదివితే
  .ఇనప గుగ్గిళ్ళు అనుకున్నవి కాస్త స్వాధీన పడుతున్నాయి .అర్థం చేసుకోవటం ,జీవితానికి అన్వయించు కోవటం -వీటికి చాలా సమయం పడుతుంది..భాషాపరంగా చూస్తె కూడాఈ శ్లోకాల అందం ఎంతో బాగుంటుంది కదా.శంకరాచార్యుల వారి రచనలలో కూడ శబ్దాల ప్రయోగం అబ్బురమనిపిస్తుంది.నిజానికి మీరు ఇచ్చిన ఉపసంహారం మొత్తాన్ని ౪-5 సార్లు చదివాను .క్లుప్తంగా మీకు అర్థమయిన దానిని మాకూ చేర్చే మీ ప్రయత్నం మెచ్చుకోవాలి .సాధన పాదమే హెచ్చు సార్లు చదివానేమో may be starting trouble .your expression is reader friendly.
  Thesis essence లాగ అనిపించింది . ఇకమీదట కూడా ఇలాగే వ్రాస్తే ఇటువంటి రచనలను అందరికీ మరింత చేరువ చెయ్యగలరు .పతంజలి made easy అని అనవచ్చు . in a nutshell is what I can just say.and hope that many more such great works will come from you..Hats off to you madam.బహుశా నా భావాలను పూర్తిగా అక్షర బద్ధం చెయ్యలేక పోయానేమో ! సుమన్ లత

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: