164 ఊసుపోక – అరటి చెట్టు

కిందటివారం చైనా ప్రభుత్వం “ఒక్క బిడ్డని మాత్రమే కనాలి చట్టం” సడలించి, “ఇవాళ్టినించీ మీరు ఇద్దరు బిడ్డలని కనుక్కోండి,” అంటూ సవరణ ప్రకటించేరన్న వార్త విన్నతరవాత నాకు ఆలోచనలు అనేకం కలిగేయి. అవేమిటో చెప్తాను.

ఆ ఒక్క బిడ్డ మాత్రమే మాత్రమే కనుక్కోండి అన్నరోజుల్లో మరి కవలలు పుడితే ఒక బిడ్డని మాత్రమే బతికి బట్ట కట్టడానికి అనుమతించేరా? అయే ఉంటుంది. ఏ బిడ్డ బతకొచ్చో ఎలా నిర్ణయించేరు? ఏమో మరి! ఆ ప్రభువులకే తెలియాలి.

బిడ్డలు భగవత్ప్రసాదం అనుకునేరోజులు పోయేయి. చైనాలో ప్రభువులదయ. భారతదేశంలో దంపతులే (ఒకొకప్పుడు భర్త మాత్రమే) కర్తా, కర్మా కూడా కావచ్చు. మనదేశంలోనూ గవుర్నమెంటోరు ఏవో త్రికోణపాటలు పాడేరు కానీ అవి చట్టబద్ధం కాలేదనుకుంటాను. కేవలం అదొక ఉచిత సలహా మాత్రమే.

ప్రస్తుతానికి మనం ఎన్నుకున్న నాయకులు మనకి గరపే బుద్ధులమాట అలా ఉంచి, పెరట్లో పెరిగే పచ్చని అరటిమొక్కగురించి మాటాడుకుందాం. నామటుకు నాకు అరటి మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. అరటి చెట్టు, మిగతా చెట్లలా కరుగ్గానూ మట్టిరంగులోనూ ఉండదు. బోదె అంతా లేతఆకుపచ్చరంగు నారే అయినా దిట్టంగానే ఉండే నార. ఆకులు వెడదకనులలా విచ్చుకుని విలాసంగా గాలిలో ఊయ్యాలలూగుతూ దరి చేరినవారికి వింజామరలు వీస్తుంటాయి. ఆకులమధ్యలోంచి కరవాలంలాగ పొడుచుకొచ్చి సుతారంగా ఒంగిన గెలా, దాని కొనల ఊదారంగు పువ్వుతో నిండుగా హుందాగా

banana tree

ముచ్చటగా పండు ముత్తైదువలా అలరిస్తుంది.కనిపిస్తుంది. అరటి చెట్టుకి అట్టే సేవలు అక్కర్లేదు. మాయింట్లో స్నానాలగది గోడనానుకుని ఉండేవి రెండు చెట్లు. మా స్నానాలతో వాటికి నీళ్ళు పెట్టడం అయిపోయేది. అప్పాయమ్మ గిన్నెలు కడగడం కూడా అక్కడే.

అరటిమొక్క కనీసం ఒకటైనా ఇంట్లో ఉండాలంటూ మాతాతగారు చెప్పిన కారణం మాఅమ్మ మాటల్లో, “ఇల్లు అన్న తరవాత పూజకోసం పువ్వులుండాలి. అభ్యాగతులు (పిలుపులూ, రావచ్చా అంటూ అనుమతి కోరడాలూ లేకుండా అకస్మాత్తుగా వాకిట్లో ప్రత్యక్షమయే చుట్టాలు, స్నేహితులు) వచ్చినప్పుడు కూరకి తడుముకోకుండా, చెట్టు కాయొహటి కోసి కూరొండి పెట్టడానికి అరటి మొక్క ఉండాలి. విస్తరాకుకి తడుముకోకుండా అరటి ఆకు ఉంటుంది,” అనిట. మీకు తెలుసా అరటిపండుని రంభాఫలం అనీ అరటిచెట్టుని రంభావృక్షము అనీ కూడా అంటారుట. ఎలా వచ్చేయో ఈ పేర్లు!

నాకు అట్టే నచ్చని జనవాక్యం ఒకటి కూడా ఆ రోజుల్లోనే విన్నాను. అరటిచెట్టుని ఒంటి గొడ్రాలు అనడం. ఒంటి గొడ్రాలు అన్న సుజనవాక్కుకి కారణం ఒక చెట్టు ఒక్క గెల మాత్రమే వేయడం.

అరటి గెలదీనికి అనుబంధమేమో అనిపించే మరో జనవాక్యం ” ఒక్క కన్ను కన్నూ కాదు, ఒక్క కొడుకు కొడుకూ కాడు” అని. కొడుకులు వంశోద్ధారకులు కనక, ఆ ఉన్న ఒక్క కొడుకుకూ ఏమైనా అయితే, ఏమైనా ఏమిటిలెండి చస్తే అని, వంశోద్ధారణ జరిగే అవకాశాలు మన్ను కొట్టుకుపోతాయని వారి బాధ. మరి ఆ పుట్టిన ఒక్క బిడ్డా ఆడపిల్ల అయితే, ఇహ చెప్పక్కర్లేదు కాబోలు. ఇంతకీ ఈ నానుడులు కారణంగానే ఉదయం లేస్తూనే అరటి చెట్టు చూడకూడదని, గుమ్మాలకి ఎదురుగా అరటిమొక్కలు నాటరు అని కూడా మాఅమ్మదగ్గరే విన్నాను. అలా అంటారు కానీ పెళ్ళిళ్ళలోనూ, ఇతర శుభకార్యాల్లోనూ, అరటిచెట్టు మొత్తం సహా తెచ్చిపందిళ్లలో స్తంభాలకి జత చేస్తారు. దేవాలయాల్లో కూడా అరటి చెట్లకి ప్రాముఖ్యం ఉంది కదా.

మరి నాకు నచ్చిన మరో ఉపమానం చెప్పకుండా ఈ పేరా ముగించలేను. ఇది సామెత అవునో, దీవెన అవునో నాకు తెలీదు కానీ “అరటిపిలకల్లా ఇంటినిండా కలకల్లాడుతూ పిల్లలు” అన్న వాక్యం విన్నాను. ఈ చెట్టుకి అంటు కట్టడం, విత్తులు నాటడంవంటి సేవలేమీ అవసరం లేదు. అరటిమొదలు పిలకలేసి దానికదే పెంచేసుకుంటుంది సంతానం. అందువల్లనే వచ్చిఉండొచ్చు పై మాట.

అసలు అరటి మొక్కలో దాదాపు అన్ని భాగాలూ పనికొచ్చేవే. కాయ, పువ్వు, ఆకులు, దొప్పలు అన్నీ ఏదో విధంగా వాడుకునేవే. అరటి బోదె ఉల్లిపాయలా పొరలు పొరలుగా – అంత సుకుమారం కాదులెండి – ఒలిచి, మూరెడు ముక్కలుగా తరిగి, ఆ దొప్పల్లో సంపెంగపూలు పొట్లాలు కట్టి అమ్ముతారు. ఆ దొప్పలో తేమమూలాన పువ్వులు చాలాసేపు వాడకుండా తాజా తాజాగా కళకళల్లాడుతూనూ ఘుమఘుమలాడుతూనూ ఉంటాయి. అసలు ఆంధ్రభారతిలో పొట్లము అంటే అర్థం ఏం ఇచ్చేరో చూడండి – పువ్వులు మొదలగువానిని ఆకులు లోనగువానియందుంచి మడిచిన మడుపు అని. ఆ పొట్లాలు చల్లగా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటాయో తెలుసుకోడానికేనా మీరు విసాపట్నంవో సింవాచెలంవో ఓమారైనా వెళ్ళితీరాలని నా తీర్మానం. ఇంత చెప్పేక అరటిపువ్వు కూర చేయు విధానము చెప్పకపోతే నాకు మాట దక్కదు కదా. అసలు అరటిపువ్వు Banana_flower_edit2వొలిచి కూరకి సిద్ధం చేయడమే ఒక గొప్ప కళ. ముందు ఊదారంగు దొప్పలు ఒకొకటే ఒలుస్తాం. పైన చెప్పిన బోదె దొప్పలమాట కాదు నేను చెప్పేది. ఈ దొప్పలు వేరు. వీటితో కూడా ఏదో చేస్తారు కానీ ఏం చేస్తారో నాకు జ్ఞాపకం లేదు. నేతిలో తడిపిన వత్తులేసి, కార్తీక దీపాలు పెట్టుకోవచ్చునేమో!

సరే, అరటిపువ్వు – ఊదా రంగు దొప్ప ఒకొకటే ఊడదీసి, రేసులు (తెల్లనివి) ఏరి ఓ పళ్లెంలో పెట్టుకోండి. ఈ రేసులే దరిమిలా కాలగతిలో – అదే మనం కోసుకు తినేయకపోతే – కాయలయేది. అలా ఒకొక దొప్పా, తీసేస్తూ, రేసులు తీసుకుని దాచుకుంటూ పోతే, ఆఖరికి, ఆ పువ్వు కోలగా చిన్న శంఖం రూపంలో మొగ్గ మిగులుతుంది. ఒలవడానికి రేసులుంటాయి కానీ చాలా సున్నితంగా ఉండి ముట్టుకుంటే కందిపోతాయేమో అన్నట్టుంటాయి. తలవేపు నలిపితే దొంగలు దొరకవు. (దొంగలంటే ఏమిటో తరవాతి పేరాలో వివరించేను). అలా మిగిలిన మొగ్గని అలా ఉన్నదున్నట్టు కొరుక్కు తినేయడమే! చెప్పలేదనకండి. చిన్న కస తగుల్తుంది నాలుకకి. నాకు ఆ కస ఇష్టమే మరి. అలా పసిమొగ్గ తినేసిన తరవాత –

ఇప్పుడు వేరే పెట్టుకున్న రేసులు ఒకొకటే తలవేపు చిదిపితే, లోపలి కాండం తల గట్టిగా తగులుతుంది. ఆ తల పుచ్చుకు ఆ కాండం పీకేయండి. వాటిని దొంగలు అంటారు. ఈ దొంగల్ని కూడా ఏం చెయ్యలేం. పారేయడమే.

రేసుల్ని కొత్తిమీర తరిగినట్టు తరిగి, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలూ పోపేసి అందులో పడేసి, ఉప్పేసి కొంచెంసేపు మూత పెట్టండి. అవి ఉడికేక, ఆవ పెట్టి (ఓ పచ్చిమిరపకాయ, ఆవాలు, చిటికెడు ఉప్పు, చిటికెడు బియ్యప్పిండి మెత్తగా నూరి) కూరలో కలిపి, రెండు నిముషాలతరవాత, పొయ్యిమీంచి తీసి పక్కన పెట్టేయండి. ఆకూర రుచి చూడడానికి కూడా మీరు ఏ విసాపట్నంవాసుల్నో స్నేయితం చేస్కోవాల్సిందే.

అలాగే అరటిదవ్వ కూర. ముందు చెప్పినట్టు అరటిబోదె కూడా అలా ఒలుచుకుంటూ పోతే, కొంతసేపయేక, మరి దొప్పలు రావు. మధ్యలో కాండం – దీన్నే దవ్వ, దూట అంటారు – తెల్లగా ముల్లంగిలా ఉంటుంది. ఇది కూడా ఆవ పెట్టి ముల్లంగిలాగే కూర చేసుకోవచ్చు.

చివరి మాటగా – అరటికాయ, అరటాకుల్లో భోజనం కూడా చాలా చాలా ఆరోగ్యంట. తేలిగ్గా అంతర్జాలంలో వివరాలన్నీ మళ్ళీ ఇక్కడెందుకని ఇవ్వడం లేదు. మీకు సరదా ఉంటే తెవికీవంటి వనరులు చూడొచ్చు. బోలెడు సమాచారం దొరుకుతుంది.

——

Photo credits.

1. Creative commons free download

2. నాకే.

3. Photo 1 fromhttps://commons.wikimedia.org/wiki/File:Banana_flower_edit2.jpg

(నవంబరు 16, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “164 ఊసుపోక – అరటి చెట్టు”

 1. మాలతి గారికి ధన్యవాదాలు .మీరు నా వ్యాఖ్య ను గురించి అడగటం సంతోషం .నాకూ అనిపించింది మీరు ఇచ్చిన పతంజలి సూత్రాలను గురించి నేనేమీ వ్రాయలేదని .అయితే మళ్ళీ ఒక్కసారి అన్నిటినీ వరసగా చదివి మరింత గంభీరంగా యోచించాలి.అసలు దానిగురించి నేను ఏమి రాయగలను అని అనిపించింది.ఇతరత్రా పనుల వలన కుదురుగా చదవటం కాలేదు.అదీ నా బాధ .తప్పక టపా రాస్తాను .సుమన్ లత

  మెచ్చుకోండి

 2. అరటి పువ్వు ఆఖర్న వచ్చే శిఖరం తినటానికి కస ఉండదు .అక్కడ ఉండే బుజ్జి అత్తాలు ఆచ్చం చంటి పిల్లల వేళ్ళ లాగ మృదువు గా నున్నగా అబ్బో నిమిరితే కంది పోతాయనిపిస్తూ ఉంటాయి .సుమన్ లత

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ ,మీ లాగే నాకు కూడా అరటి గెల -చైనా /కు.ని. వంటి విషయాలు గుర్తొస్తాయి .ఉత్తర భారత దేశం లో సీమంతం చేస్తున్నప్పుడు ఆ గర్భిణి స్త్రీ కి అరటి పళ్ళు పెట్టరు ,ఒక గెల తరవాత చెట్టు కొట్టేస్తామని!. మీకు గుర్తు ఉండే ఉంటుంది ఉప్పల వారి రచన “అతడు -ఆమె ” లో దొంగాళ్ళు-పిల్లెళ్ళు ఏరటం ఎంత విపులంగా వర్ణించారో! నేను కూర చేస్తున్నప్పుడల్లా తల్చుకుంటాను .ఇంట్లో చెట్లు ఉండటం వలన చాలా తరుచు గా చేయటం .అయితే కస చాలా హెచ్చు గనక చాలా సార్లు కడగటం ,ఉదికిన్చేక కూడా పదే -పదే కడిగి నీళ్ళు పోసి పిండుతే గాని కస పోదు ఆవ -పులుపు వేసిన కూర రుచి చాలా బాగున్నా కొన్నిసార్లు విసుగు గా అనిపించ వచ్చు. అరిటి దవ్వ కూర చూపుకి ,రుచికి కూడా పులిహారే
  !మనవాళ్ళు కనీసం రెండు -మూడు నెలలకి ఒక సారి అయినా దవ్వ కూర,పచ్చడి తినా లనేవారు ఆహార నాళం శుభ్రం అయి కడుపు లో రాళ్ళు చేరవు i అందుకే కిడ్నీ సమస్యలు ఇంట రావు అనీ చెప్పేవారు .మీ ధర్మాన మరోసారి అందరితో పంచుకునే అవకాశం దొరికింది .
  ఈ రెండు కూరలు బాగా చేస్తానని నాకు ఖితాబ్ కూడా ఉంది .
  సుమన్ లత

  మెచ్చుకోండి

 4. ఎవరో చెప్పగా విన్నాను, సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ రూల్ తెచ్చి, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న వాళ్లకి బలవంతంగా ఆపరేషన్ చేయిన్చేసే వారట. ఇక అరటి పువ్వు కూర గురించి చదివాక, ఒక్క సారి అరటి కూర ప్రయోగం చేస్తే బాగున్ను అనిపించింది. ఇప్పటిదాకా వినటమే కాని, ఎప్పుడూ తిన్నది లేదు 🙂

  మెచ్చుకోండి

 5. ఎందుకు లేదూ భారత ప్రభుత్వం కూడా ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలను కనవద్దంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే వారిని. ప్రభుత్యోగులకు ఇచ్చే LTC ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇస్తారు. అలాగే ఎడ్యుకేషన్ ఎలవెన్స్ కూడా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇస్తారు. ఈ మధ్య నాకు కొత్తగా తెలిసిన విషయం SC/ST/OBC సర్టిఫికేట్లు అలాగే Income certificate (స్కూళ్లల్లో రాయతీల పొందడానికి, స్కాలర్ షిప్పులకు ఇతరత్రా) ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇస్తారు ట!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.