ఊసుపోక 165 శుభాకాంక్షలకార్డు కథ

పండుగబహుమతుల తరవాత శుభాకాంక్షల దినాలగురించి కూడా చెప్పుకకోపోతే ఎలా మరి! వీధి చివరనుండి పొంచి చూస్తూ వస్తున్నా వస్తున్నా అంటూ ఊరిస్తోంది కొత్తసంవత్సరం తొలి దినం. వెనక కొంత రాసేనేమో గానీ ఇప్పుడు ఇంకొంచెం ఏడ్చేయాలనిపించింది ­­(ఏడ్ చేయు = జత చేయు).

చెప్పేను కదా బహుమతుల వ్యవహారం – నవంబరు ముగిసీ ముగియకముందే మొదలు పెట్టేస్తారు ఎవరికి ఏం ఇవ్వాలి? ఎవరు మనకి ఏమి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కడ ఏ వస్తువు ఎప్పుడు తగ్గింపుధరలో ఉండగలదు లాటి ప్రశ్నలతో ప్రజలు గిలగిల్లాడిపోతూంటారు. ఫోను తీస్తే అవే కబుర్లు, అదుగో అక్కడ ప్రత్యేక ధరలు, ఇదుగో ఇక్కడ దివాలా (closeout sales) అమ్మకాలు అంటూ ఒకరికొకరు ఆచూకీలు ఇచ్చేసుకుంటూంటారు. దాన్నిగురించి రాయడం అయిపోయింది కనక శుభాకాంక్షలగురించి చెప్పుకుందాం.

శుభాకాంక్షల చరిత్ర ఎట్టిదనిన పూర్వకాలమందు అంటే నా చిన్నతనంలో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అని చెప్పేను కదా. అంటే కలమో పెన్సిలో పిడికిట పుచ్చుకుని కాయితంమీద కుటుంబంమొత్తం పేరు పేరునా, ఇంకా ఇరుగూ పొరుగూ, దూరపుచుట్టాలు అందరి సంగతులు వరసగా రాసేసి, ఆ రెండు కాయితాలూ కవరులో కుక్కి, దానిమీద చిరునామా రాసి, స్టాంపు అతికించి వీదిచివరనున్న తపాల్ డబ్బాలో పడేసి, జవాబుకోసం నెలో రెణ్ణెల్లో ఎదురు చూసేవి. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీలో కొందరికైనా ఇది కనివిని ఎరగని సంగతి అయి ఉండొచ్చు అనుకుని.

క్రమంగా ఉద్యోగాలూ, సంసారాలతో ఎవరికి వారు చాలా బిజీ (ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు అనొచ్చు కానీ మీ “బిజీ”కి సరిపోదు లేదా అర్థం కాదు అనుకుంటున్నా) అయిపోడంతో ఉత్తరాలు కేవలం అవసరార్థం, అంటే ఏదో ఒక ముఖ్యవిషయం తెలియజేయడానికి మాత్రమే అయింది. అపుడయినా ఓ కార్డుముక్క రాసి పడేయడంగా కొన్నాళ్లు సాగింది. మా పెద్దన్నయ్య వాటిని vital statistics అనేవాడు. అంటే బాలసారె, అపరకర్మలు, వివాహమహోత్సవాలు, కదాచితుగా కొత్త ఉద్యోగాలూ (చిరునామా ఇవ్వడానికి) వంటి వార్తలు అందించడానికి ఆ కార్డుముక్కలు రాసుకోడం ఆనవాయితీ అయిందని.

ఆ వెనకే బాపూబొమ్మలతో రంగు హంగులతో కార్డులు అనబడు శుభాకాంక్షల అట్టముక్కలొచ్చేయి. అవి అట్టేకాలం నిలిచినట్టు లేదు. అనతికాలంలోనే అవి ఎన్ని రూపాంతరాలు చెందేయో నాకంటే మీకే ఎక్కువ తెలుసు.

ఈకార్డు కథ ముగించేముందు, బహుమతులకీ కార్డుకథకీ ముడిపెట్టే మరో కోణంగురించి చెప్పాలి. అది gift card. ఎవరికి ఏ బహుమతి అన్నవిషయంలో రాగల కష్టాలగురించి వెనక “అభిమానాలకి కొలమానాలు” అన్న టపాలో చెప్పేను. ఇప్పుడు చెప్పేదేమిటంటే ఆ కష్టాలమూలంగా బహుమతికార్డులు వచ్చేయి. సూక్ష్మంగా ఏదో దుకాణంలో ఓ డబ్బుకార్డు కొని అదిచ్చేసి “నీక్కావలసింది అక్కణ్ణించి తెచ్చుకో” అని ఆదేశించడం అన్నమాట. వీటిలో కూడా లుకలుకలున్నాయని రాధి రాధిక చెప్పేకే తెలిసింది నాకు. ఆ వ్యాఖ్య కూడా పైన చెప్పిన టపాకింద చూడగలరు.

మనం “సుళువుల కాలం”లో ఉన్నాం కదా. ఏది ఎక్కువ సుళువు అన్నది వెతుక్కుంటూ రోజులకి రోజులు గడిపేస్తాం. నేను కనిపెట్టిన సుళువు ఓ చెక్కు రాసిచ్చేయడం. దానివల్ల దుకాణాలవెంట తిరగడం కూడా తప్పుతుంది. అప్పుడు ఆ సమయం కూడా కలిసొచ్చినట్టే కదా. చెక్కులు అందరికీ రాసివ్వలేం లెండి. అవును, దానిక్కూడా కార్డులున్నాయి ఇదుగో నీ బహుమతి అంటూ.

ఇంతకీ శుభాకాంక్షలమాట – మొదటి దశలో కవరులో పెట్టి తపాలా డబ్బాలో పడేసేవారనుకున్నాం కదా. తరవాత ఫోనులో చెప్పుకోడాలు వచ్చేయి. ఇప్పుడు పూర్తిగా లాప్టాపూ, టాబ్లెట్, మొబైలు మెసెంజరులోంచి చెప్పేస్తే సరిపోతోంది.

చాలాకాలం క్రితం ఎవరో పెళ్ళి శుభలేఖ ఇలా కంప్యూటరులో పంపితే అది సీరియస్ ఆహ్వానం కాదనుకుని నేను జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే పూర్వం ఇంటికొచ్చి బొట్టు పెట్టి పిలిస్తేనే మర్యాద. దారిన పోతూ “ఇదుగో మాయింట్లో పెళ్ళి పైవారం. రా,” అంటే అది పిలుపు కాదు. మాటవరసకి విషయం తెలియజేస్తున్నట్టు లెక్క. గుంటూరు దగ్గర ఏదో పల్లెలో ఫలానా ఇంట్లో పెళ్ళి భోజనానికి రండహో అని దండోరా వేసేవారుట. ఆ పల్లెలో వారికి అంత చనువు ఉండి ఉండాలి మరి.

మరో మాట. పోస్టుడబ్బాలో పడేసే కార్డు ముక్కలకి మితి ఉండేది. ఖర్చు కావచ్చు, కాలప్రమాణం కావచ్చు, ఆత్మీయత ఎంతలో ఉంది అన్నదాన్నిబట్టి కావచ్చు. ఏ నలుగురికో, మహా అయితే పదిమందికి మాత్రం పంపేవారు. ఇప్పుడలా కాదు. తెలిసినవాళ్ళకీ తెలీనివాళ్ళకీ, “ఈవిడ లేక ఈయన మనకి తెలిసి ఉంటుందిలే లేక ఉంటాడులే” అనుకుంటూనూ, ఇంకా మరొకరి మందపత్రాలలోంచి కొట్టేసిన ఐడీ జాబితాలకీ – కుప్పలుతిప్పలుగా వచ్చేస్తున్నాయి విద్యుత్ వార్తావాహినిలో.

“వీళ్ళెవరు? వీళ్ళు నాకు ఏ వంక చుట్టాలు? అమ్మవంకా బాబువంకా? లేక ఏ బజారులోనో పెళ్ళిలోనో కలిసామా? ఎక్కడ ఎప్పుడు కలిసేం? నేను వాళ్ళకి ఎలా తెలుసు? వీరు నిజంగా నా శుభం కాంక్షిస్తున్నారా?” లాటి ప్రశ్నలు వేసుకోడం వృథా ప్రయాస. నామటుకు నేను ఓపినంతసేపు “మీక్కూడా” అంటూ జవాబులిస్తాను. ఆ తరవాత ఓహో వీరు నా శుభము కాంక్షిస్తున్నారు అనుకుని సంతసించి ఊరుకుంటాను.

పైగా ఈ తెరాకాంక్ష(తెర+ఆకాంక్ష)ల విషయంలో మరో కిటుకు. పోస్టు, ఫోనూకంటె సమయం కలిసొస్తుందని కూడా చేస్తున్నారు. ఈ కాలపొదుపు విషయంలో మరో గోల మాటలూ వాక్యాలూ అంట కత్తెరేయడం.

అంటే ఏమిటా? చెప్తాను వినండి. ముందు వీరెందుకిలా చేస్తున్నారో చెప్పుకోవాలి. కొందరికి తెలుగు రాదు. అదేలెండి, కంప్యూటరుమీద తెలుగు రాయడం రాదు. కనీసం అది వారి సాకు. నిజానికి తగిన software వాడితే, తెంగ్లిషులో టైపు చేసినట్టే అక్కడాను. అలా నేను పదే పదే మొత్తుకుంటున్నాను కానీ పట్టించుకున్నవారిని వేళ్ళమీద – సుమారుగా రెండు చేతులూ మరియు ఒక కాలు – లెక్క పెట్టొచ్చు. రెండోది కాలం ఆతృత. ఏమాట గానీ తెరమీద కనిపించీ కనిపించగానే జవాబు కొట్టేయాలి. అంచేత చేతిలో ఉన్న మొబైలులో ఠపీఠపీమని రెండు మూడు అక్షరాలు కొట్టేసి, హమ్మయ్య ఒక పని అయిపోయిందనుకుని సుఖపడి పోతారు.

అంటకత్తిరేసిన పదాలు ఇలా ఉంటున్నాయి. tq, tnks, y, u. వీటన్నిటిలో worst నాదృష్టిలో RIP. మాట వచ్చింది కనక చెప్పేస్తున్నాను. నాసమయం వచ్చినప్పుడు నాకు మాత్రం రిప్పని పెట్టకండి. తలచినంతమాత్రనే నన్నూ నాఆత్మనీ రిప్పేసినట్టనిపిస్తోంది ఇప్పుడే🙂.

ఇంతకీ ఇలా కత్తెరేసిన పదాలు ఇప్పటికే అందరికీ, కనీసం నూటికి 99మందికి, అలవాటయిపోయేయి. అంచేత అవి వారికి ఎబ్బెట్టుగా తోచవు సరి కదా, అందులో తప్పేమిటి అని నన్ను నమిలేయగలరు.

దురదృష్టవశాత్తు నేను ఆ మిగతా ఒక వంతులోని మనిషిని. నాకు ఆ పదాల్లో జీవం కనిపించదు. మొక్కుబడిలా అనిపిస్తుంది. నేనిలా అన్నందుకు ఎవరైనా నొచ్చుకుంటే, ఇదుగో ఇప్పుడే క్షమాపణలు కోరుకునేస్తున్నాను.

ప్రస్తుతానికి వద్దాం. ఇంకా Happy New Year, Merry Christmasకి ఈ తిరుక్షవరం జరిగినట్టు లేదు. కానీ 2016 కొత్త సంవత్సరం శుభసందర్భంలో అవి మొదలవవు అని హామీ ఏమీ లేదు కదా. ఏ ఒకరికి తోచినా చాలు. క్షణాల్లో మొత్తం అంతర్జాలం కార్చిచ్చులా కమ్ముకునేస్తుంది. మళ్ళీ టైపు చేయడం ఎందుకని అదే పంచేసుకుంటూ పోవచ్చు మిగతా మిత్రవర్గం సమస్తం.

మరో సంగతి కూడా చెప్పుకుంటాను. ఇది కేవలం నా ఆత్మఘోష. ఇప్పటికే లైకులతోనూ స్క్రోలులతోనూ వేళ్ళు వాచిపోయేయి.

swollen-e1449414513873ఇవన్నీ ఆలోచించేక నాకు ఒక ఉపాయం తోచింది. నేను ముందు ఒక టపా పెడతాను, సూక్ష్మంగా “శుభాకాంక్షలు” అని.

శుభాకాంక్షలుమీరు లైకు కొడితే చాలు. మీకు నేనూ, మీరు నాకూ ఈ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకోడం అయిపోయినట్టే లెఖ్ఖ. మళ్ళీ tqs, y2 లాటివి మాత్రం పెట్టకండి మరి.

000

(డిసెంబరు 6, 2015)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక 165 శుభాకాంక్షలకార్డు కథ”

 1. M.V.Ramanarao గారూ. 20, 50 అని నేను అనలేదు. నాగేస్రావ్ గారు కూడా ఉదాహరణకే చెప్పినట్టుంది. ఎవరు ఎంత ఇచ్చుకుంటారన్నది వారి ఇష్టం.
  అసలు నాపోస్టులో పాయింటు అది కాదు. ఈ శుభాకాంక్షలు, ముఖ్యంగా కార్డులు మరీ యాంత్రికం అయిపోయి, నిజమైన అభిమానాలకి కొలమానాలు కాకుండా పోయేయనే.

  ఇష్టం

 2. aఇంతేనా?మీ అమెరికాలో 20నుంచి50 dollars 50 డాలర్ర్ల దాకానే గిఫ్టులు ఇస్తారన్నమాట (అంటే1200 నుంచి 3000 రూపాయలదాకా).ఇక్కడ మేము రూ.1000నుంచి 10000 దాకా స్నేహం.బంధుత్వాన్ని బట్టి ఇస్తాము.

  ఇష్టం

 3. ఇంతేనా?మీ అమెరికాలో 20నుంచి50 dollars 50 డాలర్ర్ల దాకానే గిఫ్టులు ఇస్తారన్నమాట (అంటే1200 నుంచి 3000 రూపాయలదాకా).ఇక్కడ మేము రూ.1000నుంచి 10000 దాకా స్నేహం.బంధుత్వాన్ని బట్టి ఇస్తాము.

  ఇష్టం

 4. అవునండి. ఎదురుగా ఉంటే అలాగే చేస్తాను. పోస్టు చె్యాల్సొస్తే మాత్రం అలా కాయితాలు పెట్టను.🙂 కానీ అసలు పాయింటు అది కాదు కదా. శుభాకాంక్షలు ఎన్ని వికారాలు పోతోందో చెప్తున్నాను.
  ఆహా కొత్త సంవత్సరానికి కూడా పొడి అక్షరాలున్నాయన్నమాట.

  ఇష్టం

 5. “నేను కనిపెట్టిన సుళువు ఓ చెక్కు రాసిచ్చేయడం”
  ఇంకో సుళువు కనిపెట్టేనండోయ్ నేను, ఇరవయ్యో, యాభయ్యో డాలర్ల కాగితం ఒక కవర్లో పెట్టి ఇవ్వడం.
  మరోవిషయం, నేను కొత్తసంవత్సరానికీ, జన్మదినానికీ కూడా HNY (happy new year) అని మెయిలు కొడతానండోయ్.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s