విల్లు రాసీసేక ఇహ పండుగే!

“ఊర్ల అందుర్కి బుద్ది సెప్తవు, నివ్వెందకు రాయవూ?” అంది సంద్రాలు చిరాగ్గా.

“రాస్తాను.”

“పదవుతే. ఏటాలీసం?”

“ఆలస్యం అదేదో అశుభం అని కాదు.”

“మరేటవుతె?”

“ఇప్పటికే మూడు రాసేను కదా. అంచేత ఈమారు రాసింది ఆఖరిది కావాలి. ఇహ మరే మార్పులూ ఉండవు నాజీవితంలో అని గట్టిగా నమ్మకం కుదిరేక రాసేద్దాం అని ఆగేను.”

“బాగున్నాది. మారుపులు సెప్పొస్తాయేటి. ఒప్పటికప్పుడె అదె నిజిం. నాకస్లు ఇదె ఆకరనిపిస్తన్నాది,” అంది సంద్రాలు.

నేను సుదీర్ఘంగా నిట్టూర్చేను. అంతే మరి. ఎప్పుడనుకున్నాను నాబతుకు ఇన్ని సుళ్లు తిరుగుతుందని. స్థితిగతులు మారిన ప్రతి మారూ అయిపోయిందనే అనుకున్నాను. ఇప్పటికి మూడయేయి. అక్కయ్య పోయేక వీలునామా లేనందున అన్నయ్య పడ్డ అవస్థలన్నీ తలుచుకుని తొలిసారి రాసీసేను. ఆ తరవాత ఇల్లు కొన్నప్పుడు, మళ్ళీ ఆ యిల్లమ్ముకున్నాక, ఊరు మారినప్పుడు ఇలా రాస్తూనే ఉన్నాను ఓనమాలనాడు ఒరవడి దిద్దుకున్నట్టే. తుడుపులూ, కొట్టివేతలూ, తిరిగి రాయడాలూ … బతుకంతా ఇలా పునః పునః రాస్తూనే ఉన్నాను. మ్. ప్చ్. హుమ్ … ఊ …

“ఏటాలోసిస్తన్నవ్?”

“ఏం లేదులే పద,” అన్నాను.

అవును మరి. రాయి రాయంటూ అయినవాళ్ళనీ కానివాళ్ళనీ అందర్నీ పోరి పోరీ, ఇప్పుడు నావంతు వచ్చేసరికి చూదాం చూదాం అంటూ వాయిదాలెయ్యడం ఏం న్యాయం!

నావిల్లు రాసి రాగల సమస్యలన్నీ ఓ కొలిక్కి తీసుకురాగల వీలునామా విజ్ఞాని తేలిగ్గానే దొరికేడు.

ఇద్దరం అనుకున్నరోజున వారి ఆఫీసుకి వెళ్లేం.

వెనకటికథలో విల్లు రాసినప్పుడు ఎదురయే ప్రశ్నలన్నీ రాసేను కనక మళ్ళీ అవన్నీ ఇక్కడ ఏకరువు పెట్టను కానీ మీ వినోదార్థం కొన్ని కబుర్లు మాత్రం చెప్తాను.

“ఎవరెవరికి ఏమేం ఇవ్వాలో ఏ రూపంలో ఇవ్వాలో చెప్పు.”

ఒక్క క్షణం ఆలోచించి అన్నాను, “అంత పంపకాలకి నాకేమీ దివాణాలూ, సంస్థానాలూ లేవు. ఉన్నదేదో ఈమెకే,” అన్నాను సంద్రాలివేపు చూసి.

“అంతానా?”

“చెప్పేను కదా నాలుగు డబ్బులు బాంకులో తప్పిస్తే మరేం లేవు.”

“కొందరు కొంత సొమ్ము ధర్మసంస్థలకి కేటాయిస్తారు.”

“రాయక్కర్లేదు. నేనూ ఆవిడా వేరే మాటాడుకుంటాంలెండి ఆవిషయాలు.”

సంద్రాలు నావేపు చూసి, “అయేయో సైటులున్నయి గద. అయన్నీ సూట్టం నాకు తెల్దు.” అంది.

“లేవులే. వాటిమాట ఇప్పుడొద్దు. తరవాతిసంగతి చెప్పండి,” అన్నాను.

“సైటులకి విలువుంది తెలుసా?” అన్నాడు విజ్ఞాని.

“ఇవి అలాటివి కాదులెండి. ఇవి అణాపైసల్లో లెక్క లేనివి.”

“మీకు తెలీదు. సైటుపేరు చెప్పండి. విలువ చెప్తాను.”

“అవసరంలేదు. తరవాతి ప్రశ్న చెప్పండి.”

“అడగ్తన్నరు సెప్పరాదా అయేటో,” అంది సంద్రాలు కసుర్తున్నట్టు.

నాక్కూడా చిరుకోపం వచ్చింది. “చెప్తున్నా కదా. డాలరు పణం పెట్టి వేలం వేస్తే డైముకి చెల్లవు అవి. అయినా నీకెందుకు? నీకెలాగా వాటిమీద ఆశ లేదు,” అన్నాను విసురుగా.

సంద్రాలు మొహం ముడుచుకుంది. “ఆశుందన్నేదు. నీకే గద అదంత గొప్ప.”

“మీకు తెలీదు …” అంటూ మళ్ళీ లాయరెత్తుకున్నాడు కానీ నేను సాగనివ్వలేదు.

“నీకు చెప్పలేదు. నీకవి నడిపే ఓపికా లేదు, చేతా కాదు కదా అని వేరేవాళ్ళకి తరలించేసేను,” అని వీ.వి­­­­­­జ్ఞానివేపు తిరిగి, “పదండి పైవిషయానికి,” అన్నాను గుండెలు చిక్కబట్టుకుని.

భౌతికకాయాన్ని మన్ను చేయడమా, మసి చేయడమా? అదీ ఇదీ కాదు, తరిగి ముక్కలు పంచిపెట్టడమా? అనిట.

ఆ అంశంమీద మళ్ళీ మరో పాఠం మొదలు. వింటుంటే అది నాగురించి కాక మరేదో వస్తువుగురించిలా ఉంది. “నేను నేను కాద”న్నసంగతి కొట్టొచ్చినట్టు కనిపించింది. నా దేహం గాజుపెట్టెలో వస్తువులా కనిపిస్తోంది. మరి ఈ దేహము నాది కానప్పుడు ప్రాణం పోయేక అది ఏమవుతుందో అని విచారించడం మాత్రం ఎందుకూ. అందులో వైరుధ్యం కూడా కనిపిస్తోంది. నాది కాని దేహం ఏమి చేయాలో, ఆవిషయంలో నా అభీష్టం ఏమిటో ఇప్పుడు నేను నిర్ణయించాలంటే నవ్వు రాదూ ఎవరికైనా?

“నవ్తావేటి ఆరు అడ్గతంటే. సెప్పు,” అంది సంద్రాలు. చూడగా చూడగా సంద్రాలు నామీదా నాశరీరంమీదా ఆధిపత్యం తీసేసుకున్నట్టనిపిస్తోంది. ఆ అధికారం నేనే ఇచ్చేనేమో.

మొత్తంమీద తంతు ముగిసేక, దక్షిణ సమర్పించుకునే సమయం వచ్చింది.

ఆయన చెప్పిన అంకె విని ఉలికిపడ్డాను కానీ పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. పడ్డాననే అనుకున్నాను కానీ ఆయన విజ్ఞాని కదా. మీకు తెలీకపోవచ్చు కానీ లా విజ్ఞానులు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలరు.

చిన్న దగ్గు దగ్గి, క్షమించమని చెప్పి పక్కగదిలోకి వెళ్ళేడు నీళ్ళకోసం అన్నట్టు. అది నాకు ఆలోచించుకోడానికి టైము ఇవ్వడం నాకు తెలుసు. ఇలాటి ఎత్తులు చాలానే చూసేను.

“ఏటాలోసిస్తన్నవ్,” అంది సంద్రాలు.

సూక్ష్మంగా నాకథ ఇది. నేను ఇప్పటికే చాలా వీలునామాలు రాసి పారేసేనని చెప్పేను కదా. విల్లులు రాయడం నాకు మంచినీళ్ళప్రాయం. మొదటిసారి పాతికేళ్ళక్రితం రాసినప్పుడు ప్రముఖ విల్లెండు ఎస్టేటు ప్లానింగు విజ్ఞానినే సంప్రదించేను. అప్పట్లో మూడొందలయింది. ఆ తరవాత నాకున్న ఆస్తిపాస్తులకి అదేం అవసరం లేదని అర్థమయింది. అంతర్జాలంలో ఫారములు తీసుకుని, సూక్ష్మంగా నా సొమ్మంతా ఫలానావారికి అని ఓ ముక్క గిలికి, ఇద్దరిచేత సాక్షి సంతకాలు పెట్టిస్తే పని అయిపోతుంది. ఆ తరవాత మరో రాష్ట్రానికి మారినప్పుడు, ఈ స్టేటులో ఎస్టేటు నిబంధనలలో కొన్ని తికమకలున్నాయని తెలిసింది. వేరు చెప్పనేల అంతర్జాలం మూలంగానే. అది నమ్మి మరో న్యాయపురుషుని శరణు జొచ్చేను. ఈసరికి ఖర్చు మూడునించి ఏడయింది. ఇలా ఆదాయం పెరగకపోయినా, ఖర్చు పెరుగుతూ వస్తోంది. ఇలా మరో నాలుగు విల్లులు రాసేనంటే, ఇంక వారసులకి పంచిపెట్టడానికి ఏమీ మిగలకపోవచ్చు, హా హా.

“నిన్నే,” అంటూ మళ్ళీ రొకాయించింది సంద్రాలు.

ఈ పరిస్థితికి మరో కోణం – మామూలుగా నాకు తక్కువఖర్చుతో అయిపోయేదానికి ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు. కారణాలు కూడా చెప్తాను. ఉదాహరణకి కంప్యూటరు కొనాలని వెళ్తాననుకోండి. ఎంత చెట్టుకంత గాలిలాగే ఆ కంప్యూటరుధరకీ దాని బలాబలాలకీ అనులోమ సంబంధం ఉంది. ఎక్కువ పెడితే ఎక్కువ విశేషాలుంటాయి spreadsheet, presentations, faster లాటివి. నాకు అవి అఖ్ఖర్లేకపోతే, నేనిచ్చుకున్న అధిక సొమ్ము వృథా. రెండోది, ఎక్కువ ధర పెట్టి కొన్న వస్తువులు ఎక్కువ కాలం మన్నుతాయన్న హామీ లేదు. ఇది స్వానుభవంతోనే చెప్తున్నాను. అంచేత చవకలో కొంటే అది పనికిరాకుండా పోయినప్పుడు, పారవేయు సమయం వచ్చినప్పుడు “అంత సొమ్ము పోసి కొన్నానే,” అన్న బాధ ఉండదు. అది పారేసి కొత్తది, మరో చవకది తేలిగ్గా కొనుక్కోవచ్చు.

విజ్ఞాని మంచినీళ్ళ సీసాతో వచ్చేడు. అంతా నటనే.

“కానిచ్చీ. ఉప్పుడు నివ్వు రెండు డబ్బులు పోనాయని ఇసారిస్తె ఆ యెనక నాను కోరట్లసుట్టు తిరగనేక సవ్వాల.”

నేను సంద్రాలువేపు పరీక్షగా చూసేను.

“ఆమె సొమ్ము కదా,” అన్నాడు వి.వి.

హమ్మ ఎంత ఆలోచన! మొత్తమ్మీద జ్ఞాని అనిపించుకున్నాడు. నిజమే, సంద్రాలుకి లేని బాధ నాకెందుకు?

సరే కానిమ్మని తలూపేను. మరో గంట తరవాత బయట పడ్డాం హమ్మయ్య అనుకుంటూ.

అక్కడ్నించీ వీధిలోకి వెళ్ళినప్పుడల్లా, ఈ దేహము నాది కాదు అనే కాక దారిన పోయేవారిలో ఎవరు ఏ భాగానికి సరిపోతారో ఆలోచిస్తూ కూడా వస్తున్నానిప్పుడు.

ఇంతలో పండుగరోజులొచ్చేయి. పండుగ అమ్మకాలహోరు మొదలయింది. నా కెమెరా విరిగిపోయింది కదా ఒకటి చూదాం అని బయల్దేరేను.

ఓ దుకాణంలో ధరలు చూస్తున్నాను. చీకటిలో కూడా బొమ్మ తీయగలిగితే చుక్కల్నీ చందమామనీ కూడా పట్టొచ్చు. Action underwater photography అక్కర్లేదు. నవ్వు మొహం గుర్తించేది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. మైక్రో కూడా అంతే. ముద్దుగా ఎర్రగా నిగనిగలాడుతూ అరచేతిలో గువ్వపిట్టలా అమరిపోయే కెమెరావేపు చూస్తూ ఆలోచిస్తున్నాను. మూడు వందలదాకా అవుతుంది టాక్సులూ అవీ కలుపుకుని.

“ఉప్పడదెంత ఎట్టి ఎందుకూ?” అంది సంద్రాలు వెనకనించి.

“ఎంతేమిటి? అసలు కెమెరాకి 300 అంటే లెక్కలోకి రాదు. మూడు వేలెట్టి కొనేవాళ్ళు ఎంతమందో తెలుసా?”

“ఆలంతా దేసాలు తిర్గతరు. పెల్లిల్లు, పెరంటాలు, కుటుంబంవూ అయీని. నీకేటున్నది?”

ఆమాట నిజమే కానీ సంద్రాలు అలా అంటుంటే వినడానికి బాగులేదు. “మొన్న నిండుపున్నమినాడు చందురుని చూస్తే ఎంత బాదేసిందో తెలుసా బొమ్మ తీయలేకపోయినందుకు,” అన్నాను ఆనాటి విచారం మళ్ళీ మొహంలోకి తెచ్చుకుని.

“అద్సరె. బొమ్మ తీస్తవు. తరవాతేటి సేస్తవు అంటన్న. తెరమీదికెక్కిస్తవు. పదిమందో ముప్పైమందో సాన బావున్నాదంటరు. ఆపూటయినంక ఏంవుంది? కతయిపోతది.”

“ఏమిటంటావయితే. ఆమాత్రం ఆనందానికైనా నేను నోచుకోలేదా?”

“నోస్కున్నవులె. మనింటెనక దుకానంలో పాతపెట్టి ముప్పైకే దొర్కతది. అది సాల్నీకు.”

రెండు నిముషాలు ఆలోచించేను. ఆమాట నిజమే. నేను తీసే బొమ్మలకీ, ఆ బొమ్మలజన్మ సార్థక్యానికీ 30 పెడితే చాలు. కళ్లు చిట్లించి సంద్రాలువేపు చూసేను.

ఆవెంటనే నాకు పట్టలేనంత నవ్వొచ్చింది. ఫక్కున నవ్వేను అదేదో సినిమాలో సత్యనారాయణలా.

“నాసొమ్ము కాదు కదా!”

000

(డిసెంబరు 10, 2015)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “విల్లు రాసీసేక ఇహ పండుగే!”

 1. మీ కథల్లోలా మీరు కనుక వుంటే ఈ రోజు నుంచి నన్నుకూడా ఇంకో సంద్రాలు అనుకోండి వీలునామా ఒడ్డులేకాని మీ 30 రూపాయల కెమెరా పెట్టె ఐనా ఇప్పిచండి చాలు మీమీద ఎంతో కొంత హక్కు వస్తేచాలు అదే గొప్ప …

  మెచ్చుకోండి

 2. Brilliant. చాలా బావుంది. మా అమ్మ మొదటి సారి ఆదాయపన్ను కట్టవలసి వస్తుందేమో నని ఒక ఆడిటారు దగ్గరికి వెళ్తే ఆయన ఈ ఆస్తి అంతా నీదు కాదు అని జ్ఞాన బోధ చేసేడుట. అప్పటినించీ మా అమ్మ ఇలాగే అంటూ ఉండేది. నా సొమ్ము కాదు గదా!

  మెచ్చుకోండి

 3. మీరు నాకథలు చాలాకాలంగా చదువుతున్నారు. నేను ఆ బిజినెస్ అమెరికాజోలికి పోను అని గ్రహించేఉంటారు. కథలో ప్రధానపాత్ర ఆలోచనలూ, ఆర్థికస్థాయి గమనించేరా?

  మెచ్చుకోండి

 4. విలువైన మాట అన్నారు 🙂

  అద్సరె. బొమ్మ తీస్తవు. తరవాతేటి సేస్తవు అంటన్న. తెరమీదికెక్కిస్తవు. పదిమందో ముప్పైమందో సాన బావున్నాదంటరు. ఆపూటయినంక ఏంవుంది? కతయిపోతది.”

  కాని అమెరికా వాడి కి అన్నీ కాపీ రైట్ ! అందులో మిలియన్ల బిజినెస్స్ ఉంది !

  బిజినెస్స్ సెన్స్ అండ్ కామన్సెన్స్ కి దూరం కొద్ది గ ఎక్కువే నను కుంటా 🙂 నా సొమ్ము కాదు గదా 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s