పుచ్చుకొన్ననాటి ముచ్చట!

ఏ సూత్రానికి గానీ ఏ కాలంలోనూ మినహాయింపులుంటాయి. వీటినే ఆపద్ధర్మం అంటారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకున్నా ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్నా ఫరవాలేదన్నదందుకే. అబద్ధమాడరాదు, ప్రాణిహింస చేయరాదు – ఇవి సూత్రాలు. పైన చెప్పినవి మినహాయింపులు. ఆ మినహాయింపులకి సమర్థింపులు ఉన్నాయి. అలాగే కోర్టుల్లో, వార్తల్లో చూస్తున్నాను. నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా క్రూరంగా మరొకరిని కాల్చి పారేసినవారు కూడా ఏవో కారణాలు చెప్పి తప్పు తమది కాదంటారు. అలా అనడానికి వీలుగా చట్టం సౌకర్యాలు కల్పించింది. ఇంతా లోతుగా సుదీర్ఘంగా నిశితంగా పరిశీలించి చూచుకొనవలసిన అవుసరం ఇప్పుడు నాకెందుకొచ్చిందో చెప్తాను.
ముందు ఇచ్చిపుచ్చుకోడాలతో మొదలు పెడతాను. ఏదో ఓ పండుగపేరు చెప్పి అనవసర ఇచ్చిపుచ్చుకోడాలకి వ్యతిరేకిని అని ఇంతకుముందు చెప్పేను కదా. మరి పుచ్చుకోడం జరిగితే దానికి సమాధానం ఇచ్చుకోవాలి కనక. చేసిన పాపం చెప్తే పోతుందంటారు అన్నారు కనక. ఇన్ని “కనక”ల మధ్య అసలు కథ చెప్పలేదని అనకండి. ఇదుగో మొదలు పెట్టేస్తున్నా.

ఆ కథాక్రమంబెట్టినదనిన – నెల రోజులయింది నా కెమెరా బొమ్మలు తీయాలన్న నాకోరికతో సహకరించడం మానేసి.

ఇక్కడే మరోమాట చెప్పుకోవాలి. మామూలుగా ఎంత చిన్న వస్తువు కొన్నా దానిని ఎల్లవేళలా ఉపయోగపడేలా ఉంచడానికి అంటే maintenance అనబడు కార్యక్రమానికి మరో నాలుగు వస్తువులు కొనవలసివస్తుంది. ఎంత చిన్న వస్తువయినా సరే దాన్ని నీటుగానూ, భద్రంగానూ ఉంచడానికి ఏ నోమో వ్రతమో చేసేటప్పుడు ఉన్నంత తతంగం ఉంటుంది.

ఉదాహరణకి కెమెరామాటే తీసుకోండి. దానికి అమర్చిన రెండున్నర అంగుళాల యల్సీడీ తెర తుడవాలంటే కేవలం అది తుడవడానికి మాత్రమే సృష్టింపబడిన గుడ్డముక్క ఒకటుంటుంది. అది ఏదో ఒక్క దుకాణంలో మాత్రమే దొరుకుతుంది. ఆరో పదో డాలర్లు పెట్టి కొనాలి. దానితోపాటు చిన్న కుంచె, చిటికెడు పొడి, ఇంకా ఏవేవో కూడా వస్తాయి. ఏది ఏ చేత్తో ఎన్ని వేళ్ళతో ఎలా పట్టుకోవాలో బొమ్మలతో సహా సక్రమపద్ధతి వివరించబడి ఉంటుంది. అచ్చంగా ఇలాగే కాకపోవచ్చు కానీ సుమారుగా ఇలాగే ఉంటాయి ఇక్కడి వ్యవహారాలన్నీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ పాత పీలిక తీసుకు తుడుస్తూ ఉండండి అప్పుడప్పుడు అని ఒక్కమాటలో చెప్పడం మాత్రం జరగదు.

ఇంతకీ నా పూర్వ కెమెరా సంగతి. పైన వివరించిన శుభ్రపరుచు విధానం ఉంది కానీ అంతర్జాలంలో చూస్తే ఓ చుక్క నీళ్ళతో తుడిస్తే చాలు అని తెలిసింది. ఆ విషయం కనిపెట్టేసిన ఆనందంతో పొంగిపోతూ వంటింట్లో కొళాయిదగ్గర ఆ కాస్త చదరపుముక్క శుభ్రపరిచి గిరుక్కున వెనుతిరిగేను. నా ఉత్సాహంపాలు శృతి మించినట్టుంది నేను వెనుదిరగడంలో. ఆ విసురుకి కెమెరా చేతిలోంచి జారి ఠప్పున లినోలియం నేలమీద పడి మట్టి కరిచింది. ఏమైందో అనుకుంటూ ఆన్ చేసి రెండు మూడు బొమ్మలు తీసేను. బాగానే వచ్చేయి. సరే, ఇంకా దానికాలం చెల్లలేదు అనుకుని సంతోషించేను.

మరోవారం రోజులు పోయేక వీధిలోకి వెళ్తే చెట్లు కొట్టేస్తూ కనిపించేరు సిటీవారు. ఇక్కడ శిశిరం ప్రవేశిస్తుండగానే ఎంత పెద్ద చెట్టయినా సరే నిచ్చెనలేసుకుని మరీ కొమ్మలు నరికేస్తారు. ఈ క్షవరకల్యాణానికి tree maintenance service అని పేరు. పాతిక అడుగులు ఎదిగిన చెట్టు. పది పదిహేను బారలు సాగిన కొమ్మలను హృదయవిదారకంగా నరికేసే ఆ క్రియావిశేషాన్ని maintenance అనడం నాకయితే హాస్యాస్పదంగానే ఉంది.

అలా నవ్వుకుంటూ నేను ఆరోజు వెనక్కెళ్ళి నా కెమెరా తీసుకు మళ్ళీ అక్కడికి చేరుకున్నాను ఆ మెయింటెనెన్సు విశేషం నా బొమ్మలడబ్బాలో భద్రపరచడానికి. రెండు బొమ్మలు తీసినట్టే కనిపించింది. మరో నాలుగడుగులేసి, మరో బొమ్మ తియ్యబోతే పొరబాటొచ్చింది. “ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చెయ్యమం”టూ ఆదేశం జారీ చేసింది. మరి పెట్టె చిన్నదే అయినా దానిమాటకే మనం లొంగాలి. నేను అలా చేస్తాను. చేసేను కూడా బుద్ధిగా. మళ్ళీ అదే సందేశం. రెండోమారు, మూడోమారు, నాలుగూ, ఐదూ … అలా ఆ చిన్నపెట్టెతో గంటసేపు ముచ్చట్లాడి, ఇహ ఇది పనికిరాదని అర్థం చేసుకున్నాను.
నాప్రాణసమానమైన కెమెరా నీలిగిపోయినందుకు నా హృదయం బావురమని ఘోషించింది. ఆవెంటనే నాకు ఇతర ఆలోచనలు వచ్చేయి. “ఏటుండిపోతాది,” అన్న సంద్రాలు మాట మననం చేసుకున్నాను. తరవాత ఒకచోట స్థిరంగా స్థిమితంగా కూర్చుని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టేను.

ఎందుకీ తాపత్రయం అన్న ప్రశ్నతో ప్రారంభించి సదరు కెమెరా ఉండుటవల్లను, ఉండకపోవుటవల్లనూ నాకు కలుగగల మంచి చెడ్డలు బేరీజు వేసుకున్నాను. నాకు కెమెరా అవసరం ఉందా? ఏ స్థాయిలో ఉంది? నేను తీసే బొమ్మలతో ఏం చేస్తాను అని ఆలోచించాను. అందరూ ఏం చేస్తున్నారో గుర్తు తెచ్చుకున్నాను. పండుగవేడుకలు, పుట్టినరోజులు, విహారయాత్రలు, సత్కారాలు, సమావేశాలు, ఆవిష్కరణసభలు – వీటిలో ఒక్కటి కూడా కనిపించలేదు నాకు అన్వయించుకోగలది ఎంత బుర్ర చించుకున్నా.

రెండో స్థాయిలో ఇంతవరకూ ఏం చేసేనో ఆలోచించేను. నేను తీసిన చెట్టూ, పుట్టా, పువ్వూ, కొమ్మా బొమ్మలు ముఖపత్రంలో పెట్టేను. ఓ పూట వెలుగుతుంది. అంతటితో వాటి జీవితం సరి. ఆ మాత్రందానికి కెమెరా కొనాలా? గత 30 ఏళ్ళలోనూ నేను తీసిన బొమ్మలతో నా తెరజీవితం గడిచిపోతుంది కదా. చదువరులకు అవి పాత బొమ్మలని తెలిసే అవకాశం లేదు నేను చెప్తే తప్ప, మరియు నా తొమ్మిదో ఏడునాటి బొమ్మ పెడితే తప్ప.

“పెతిపచ్చం ఆలోచిన సేయాలని మారుసులు సెప్పేరు గద,” అంది సంద్రాలు.

“హా” ఉలిక్కిపడ్డాను. సంద్రాలు ఋషులవాక్కులను కూడా వల్లిస్తోందంటే ఇంకేం చెప్పను?

“ఎదరింట్లున్న జానిపాప గూడ అదె గద సెప్పీది,” అని మరో విసురు విసిరింది. ఎదురింట్లో ఉన్న జానిపాప అంటే జానెట్. ఆవిడ సైకోతెరపిస్టు. గంటకి మూడొందలు పుచ్చుకుని ఆవిడిచ్చే సలహాలకంటే తన లోకజ్ఞానమే మేలని సంద్రాలు గట్టిగా నమ్మింది. వాళ్ళదొరబాబు కొడుకు కోడలుమధ్య తగువులొచ్చినప్పుడు ఆ జానిపాప ఇచ్చిన సలహాలకీ తను ఇచ్చిన సలహాలకీ తేడా లేదనీ, అందుకు వారు అంత డబ్బు తగలేసేరనీ సంద్రాలికి కోపం.

ఇంతకీ సంద్రాలుమాట నాక్కూడా సబబుగానే తోచింది. మహర్షులు చెప్పేదీ సైకోతెరపిస్టుల చెప్పేదీ కూడా ఒకే మంత్రం – మనం కావాలన్నది నిజంగా మనకి అవసరం లేదని మనని మనం నమ్మించుకోవాలి అని. అంటే మనం ఎందుకు కావాలనుకుంటున్నామో ఆ కారణాలకి ప్రతి కారణాలు ఆలోచించడం.
ఆకోణంలోనుండి చూస్తే నా ఆలోచనలు ఇలా సాగేయి – నేను బొమ్మలు తీయకపోతే లోకానికేమీ నష్టం లేదు, బొమ్మలు తీయుట నా వృత్తి కాదు. నాకు ఏ ఛాయాచిత్రకారుల సంఘాల్లోనూ సభ్యత్వం లేదు. ఏ జాతీయ, అంతర్జాతీయపోటీలలోనూ పాల్గొనబోవడం లేదు.

వీటన్నిటికంటే మరో పెద్ద కారణం కూడా ఉంది. నాల్రోజులకిందట ముఖపత్ర అధిపతులు ఇదుగో ఇదీ నువ్వు గత ఏడు సాధించిన ఘనకార్యం – వారిభాషలో గతసంవత్సరం పునరావలోకనం – అంటూ కొన్ని బొమ్మలు ఎంచి నాకు అందించేరు. మిగతావారితో పంచుకో అని కూడా శలవిచ్చేరు. తీరా చూస్తే అవి అన్నీ నాముఖారవిందాలే! అది నేను నా ముఖపత్రమిత్రులతో పంచుకుని ఉంటే ఈమనిషికి ఇంత ఈగో ఏమిటీ అంటూ యాగీ చేసేయరా అనిపించింది నాకు. ఇలా ఆలోచించినకొద్దీ కొత్త కెమెరా కొనకుండుటే మేలు అని నిశ్చయంగా తెలిసింది. నాకు సంతృప్తికరం అనిపించేక, కెమెరాసంగతి వదిలేసి ఇతర వ్యాపకాల్లో పడ్డాను.

పది రోజులయింది. నీ నిత్యసంచారంలో ఇది బొమ్మ తీస్తే బాగుండు, అది ఎంత బాగుందో అనిపించినా, చూసి సంతోషిస్తున్నాను కదా అనుకుని ఆనందిస్తున్నాను. ఒకొకప్పుడు అక్కడే మరో రెండు నిముషాలు నిలబడి పరికించి చూస్తున్నాను. నిజానికి అలా చూడడంలో మరింత అందంగా కూడా కనిపిస్తున్నాయని గ్రహించేను. చూసేరా, ఇదే సంద్రాలు చెప్పిన “పెతిపచ్చ ఆలోసిన్లు”.

రెండు వారాలయింది. “మేం మాలుకెళ్తున్నాం. వస్తావా?” సరయు పిలిచింది. సరేనన్నాను కాలక్షేపంగానూ ఉంటుంది, వాళ్ళిద్దరితో కొంచెంసేపు గడపొచ్చు అని. అలా ముగ్గురం బజారులో తేలేం.
మీరు సూక్ష్మగ్రాహులు కనక ఆ తరవాతేమయిందో గ్రహించేసి ఉంటారు ఈసరికి. అయినా చెప్పడం నాధర్మం కనక చెప్తాను.

“ఎలాగా వచ్చేం కదా కెమెరా చూడు.”

అసలు మాఅమ్మాయి ఆ మాట అనఖ్ఖర్లేదు.అయస్కాంతం ఇనపముక్కని ఆకర్షించినట్టు నాకాళ్ళు అటువేపు లాగబడతాయి నాకు ఏమీ అఖ్ఖర్లేని రోజుల్లో కూడా. మామూలుగా కొందరు చీరెలూ నగల అల్మారాలవేపు పోతారు. కొందరు సూట్లూ, టైల కౌంటరులదగ్గర చేర్తారు. నేను కెమెరాలు, కంప్యూటర్లూ ఉన్నచోటికి తేలిపోతాను ఏటివాలులో తెప్పలా. (మీలో కొందరికైనా నా ట్రాన్సిస్టార్‌, రేడియో ముచ్చట్లు గుర్తుండే ఉంటాయి) Electronics కౌంటరులు కనిపించడం చర్య. నేనక్కడ తేలడం అ‌సంకల్ప ప్రతీకారచర్య.

ఆనవాయితీప్రకారం నాకళ్ళు ఠక్కున ఓ కెమెరామీద పడ్డాయి. అది ఎంతో ముద్దుగా అచ్చు నా పాత కెమెరాలాగే ఉంది. నాకెమెరా నాచేతిలోనే నాశనమయి నాచేతే దాచివేయబడింది అని నాకు తెలీకపోతే, అది నా కెమెరాయే అనుకునేదాన్నన్నమాట. అంత పోలికలున్నాయి దానికి. “అరె, సరిగ్గా ఇలాటిదే నాది,” అన్నాను హాచ్చెర్యపడిపోతూ.

“తీసుకో.”

వెంటనే నాకు తెలివొచ్చింది. కెమెరా లేకుండా ఎంతకాలం గడపగలనో చూదాం అనుకున్నాను కదా.
“ఇప్పుడొద్దు. తరవాత చూస్తాను.”

పిల్లలదగ్గర తల్లులమాటలు చెల్లవు. నామాట చెల్లలేదు. ఆఖరికి మరో చుట్టు “నేనే కొనుక్కుంటాన”నని నేనూ, “కాదు, మేం కొంటాం” అని వాళ్లూ కొంచెంసేపు వాదులాడుకున్నాం. అక్షరాలా అది ఆటలాగే అనిపించింది. అంచేత “వాదు”లాడుకున్నాం అనే చెప్పాలి.

ప్చ్ ఏం చెయ్యనూ కోరి ఇస్తానంటున్న కూతురూ, మేమిద్దరం ఇవ్వాలనుకున్నాం అంటున్న కొత్తల్లుడూ … వాళ్ళ సరదా చూసి ముచ్చట పడిపోతూ వెనక్కి తగ్గిపోయాను :p.

ఇప్పుడు మళ్ళీ చదవండి మొదటి పేరా. ఎంత మధనపడ్డానో ఈ కానుక పుచ్చుకోడానికి తెలుస్తుంది :p.
ఆ తరవాత కింద బొమ్మ చూడండి. నా సరికొత్త బహుమతితో తీసిన కలబంద వనం!

new camera2015చూడుమదే చెలియా వేడుక తీరా కానుకను పొదివి పుచ్చుకున్న చేతులవే!!
000

(డిసెంబరు 20, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “పుచ్చుకొన్ననాటి ముచ్చట!”

  1. మీనియమానికి అపద్ధర్మంగా మినహాయింపుగా మీరిచ్చిన సలహాకి ఎంతైనా సంతోషంగా ఉంది చరవాణి సంగతి కూడా మాటాడుకున్నాం కానీ అక్కడ నామాట చెల్లింది. గొలుసు అలాగేనండి నాకెలాగా మరో గొలుసులూ లేవు. అంచేత ఇది ధరించడం ఉచితమే. 🙂 🙂

    మెచ్చుకోండి

  2. అయాచిత సలహా లివ్వకూడదని నా నియమము. అపద్ధర్మానుసారముగా చెబుతున్నాను, మీ క్రొత్త ఛాయాచిత్రగ్రాహకాని కో గొలుసుంటుంది. ఆ గొలుసుని మెడలో నెల్లవేళల ధరించండి.
    మీ అమ్మాయికి అల్లుడికి కూడ ఒక సలహా ( అపద్ధర్మమే ), ఛాయాచిత్ర పేటిక క్రిస్మస్ కానుక. సంక్రాంతికి చరవాణి నిస్తే దానితో సుళువుగా మాలతి గారు ఛాయా చిత్రాలు తీసుకుంటారు.
    మీ చిత్రము చాలా బాగుంది.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s