శాంతియుత సహజీవనం (కథ)

ఇరుగుపొరుగులతో శాంతియుతసహజీవనం చేయాలని యుగయుగాలుగా మనకి కథలున్నా నాతలకెక్కింది మాత్రం నెహ్రూ చైనాతో ఈ “శాంతియుత సహజీవన” మంత్రం ప్రారంభించేకే. పూర్వం కట్టిన ఇళ్ళు ఇంటిచుట్టూ పెరడూ, ప్రహరీ గోడా, ఇంటిముందు అరుగూ ఇలా ఉండేవి. అరుగుమీద కూర్చునో ప్రహరిగోడవార నిలబడో వండుకున్న కూర దగ్గర్నుంచి ఊళ్ళో కొత్తకోడలు తీసుకొచ్చిన సారెవరకూ అనేక ఊసులాడుకునేవారు. అప్పట్లో ఇంటిగుట్టు లంకకి చేటు అని సామెతయితే ఉంది గానీ నిత్యజీవితంలో అందరి బతుకులూ అందరికీ తెరిచిన పుస్తకమే. దాపరికాలు లేవు. అప్పటికింకా ప్రైవేసి అన్న పదం తెలుగు మెదళ్ళలో చేరి హఠం వేసుక్కూచోలేదు.

సరేలెండి ఆ సొదంతా ఎందుగ్గానీ ఇప్పుడు పెద్ద పెద్ద మేడలూ అందులో వాటాలపేరుతో కుదించుకుపోయిన నివాసాలూ వచ్చేక మొత్తం జీవనసరళి మారిపోయింది. పది పదిహేనేళ్ళు ఒకే మేడలో పక్క పక్క ఉన్నవాళ్లు ఒకరికొకరు తెలీదు. ఒకవేళ ఒకరికి మాటాడే తీరికా కోరికా ఉన్నా రెండోవారికి ఆ రెండూ ఉండవు. ఇది ఒక సరళి. రెండో సరళి ఏమిటంటే ఆ పక్క వాటాలో వారేం చేస్తున్నారూ, ఈ పక్కవాటాలో వారెక్కడికెళ్ళేరూ, పైవాటాలో కొత్తగా వచ్చినవారు ఎక్కడినుండి వచ్చేరు … అంటూ అదే యావగా జీవితం గడిపేవారు.

నాఖర్మ కాలి, నేను ఈ రెండో జాతిలోకొచ్చి పడ్డాను. అంటే నేనేదో కావాలని అదే పనిగా ఓ పెద్ద పథకం వేసుకు ఆచరణలో పెట్టింది కాదు. పొరుగువారిమీద నిఘా వేసి, డిటెక్టివు పనికి పూనుకోలేదు. అది అనాలోచితంగా అనుకోకుండా అర్థాంతరంగా జరిగిపోయింది. నా ఆత్మశాంతికోసం అవసరమైంది. ఇందులో ఏ కుళ్ళుబుద్ధులూ లేవని భగవద్గీతమీదా బైబిలుమీదా ఇంకా ఏవైనా ఉంటే వాటిమీదా కూడా ప్రమాణం చేసి చెప్పగలను.

జరిగిన సంగతి చెప్పేముందు నాదినచర్యగురించి కొంత చెప్పాలి. రోజులో కనీసం 8 గంటలు నేను ఎక్కడ కూర్చుని ఎలా గడుపుతానో మీకు తెలియాలి. అంటే నా గది ఆకారవికారాలు తెలియాలి మీకు. ఆ ఆకారం ఇలా ఉంది.

livingroomవికారాలమాట – హాలుకేమీ లేవు కానీ నాకున్నాయి కొన్ని. మాయింట్లో గదులన్నీ బోడిగా అయ్యవారి నట్టిల్లులా ఉంటాయి. “అయ్యవారి నట్టిల్లు” అని ఎందుకంటారో నాకు తెలీదు కానీ ఖాళీగా ఉన్నఇంటిని అలా అనేది మాఅమ్మ. నా గోడలమీద బొమ్మల్లేవు. హాలులో ఓ రెండు సోఫాల్లాటివి ఉన్నాయి కానీ కంటికి నదురుగా కనిపించే అలంకరణాలు లేవు. రెండో వికారం ఎలెట్రీ దీపాలు వెలిగించను తప్పనిసరయితే తప్ప.   బయటినుండి వచ్చే గుడ్డి వెలుగు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే నేనేదో వెలట్రీ పొదుపు చేసి లోకాన్ని ఉద్ధరించేస్తున్నానని కాదు. ఎందుకో తెలీదు కానీ నాకు ఆ కృతక వెలుగులు ఇబ్బందిగా ఉంటాయి. సాధారణంగా వంట చేసినప్పుడూ, ఇంటికెవరైనా వచ్చినప్పుడూ తప్పనిసరి అవుతుంది. నావంటగది చీమలు దూరని చిట్టడివి కాకులుదూరని కారడవిలా ఉంటుంది. వంటగదిలో దీపం ఉన్నంతసేపూ హాల్లో గోడవారనున్న సోఫాలో అంటే క్రీనీడలో కూర్చుంటాను. నాకు బుద్ధి చెప్పడానికేమో అన్నట్టు నాగదికి ఎదురుగా ఉన్న మేడ కిందివాటాలో ఉన్నాయన రాత్రీ పగలూ కూడా లైటు వేసే ఉంచుతారు. అయినా నాకు బుద్ధి రాలేదనుకోండి అది వేరే సంగతి. ఇటీవల జరిగిన ఉదంతంమూలంగా మరొక సౌంజ్ఞ కూడా ఏర్పాటు చేసుకున్నాను. వంటింట్లో దీపం వెలిగినంతసేపూ అగ్నిహోత్రం రాజుకుంటున్నట్టే లెఖ్ఖ. ఆ నిర్ణయాలతో పొయ్యి మండుతోందని మరిచిపోయే ప్రమాదాలు తక్కువ కదా. ఇంతకీ కృతక సంగతులమాట చెప్పాలంటే నాకు ప్రాణసమానమయినవి ఈ సాంకేతిక పరికరాలే! టివీ ఆన్‌లో ఉంటే వచ్చే వెలుగు చాలు నాపనులు చేసుకోడానికి. ఇతి వికారాల అధ్యాయం సమాప్తం.

ఇదివరకు నేను ఉన్న అన్ని ఇళ్ళల్లోనూ ఏ గదిలోకెళ్ళినా బయటిప్రపంచంలో ఉండే చెట్టూ చేమా పిట్టా ఉడతా కనిపిస్తూ నాకు అమందానందం కలిగిస్తూ ఉండేవి. ప్రస్తుతం ఆ సౌభాగ్యం మృగ్యం. ప్రస్తుతం నాలోకం అంతా టీవీ, లాప్టాప్ మాత్రమే.

ఇప్పుడు చూడండి. నేను సోఫాలో కూర్చుని కళ్ళెత్తి చూస్తే ఏం కనిపిస్తుందో.

2 aptsఎదురుగా రెండు వాటాల్లో ఉన్నవారు – పైవాటాలో ఒక అమ్మాయీ అబ్బాయీ, కింద వాటాలో ఒక అబ్బాయి – వాళ్ళు అటూ తిరుగుతూంటే నాకు నలుపు-తెలుపు మూకీ ప్రదర్శన అన్నమాట. మొదట్లో వాళ్ళకి నేనే మాటలూ పాటలూ ఊహించుకుని వినోదించేను కొంతకాలం. ఏం చెయ్యను మరి?నాకు టీవీ, లాప్టాపూ విసుగొచ్చేక కళ్ళెత్తి చూస్తే కనిపించే దృశ్యం అదే.

పైవాటాలో వాళ్ళు ప్రవేశించగానే వాళ్ళ ప్లాస్టిక్ తెర బార్లా తెరిచేసేరు. నేను ఉలిక్కి పడి నా తెర బద్దలు కోణం మార్చేను. వాళ్ళకి నేను కళ్ళబడకుండా. ఆ తరవాత వాళ్ళు నలుగురు అతిథులని పిలుచుకుని, ఎలెట్రీ గ్రిల్లుమీద వంటలు మొదలెట్టేరు. వాళ్ళ వరండాలో దీపం దేదీప్యమానంగా వెలిగింది. నేను గబుక్కున లేచి నా తెర పూర్తిగా మూసేసేను. నా అభిప్రాయం వాళ్లు గ్రహించేరేమో ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ ఆ దీపం వెలగలేదు. అదీ నేను అంటున్నది శాంతియుత సహజీవనం. నోటితో చెప్పకుండా ఎవరికి ఏమి ఇష్టమో తెలియజేసి తదనుగుణంగా నడుచుకుంటున్నాం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఒక మొక్క కూడా కొని చిన్న ఉపతెర సృష్టించేను. వారికీ నాకూ మధ్య. (చూ. బొమ్మ).

పోనీ, టీవీ, లాప్టాపు విసుగొచ్చినప్పుడు ఓ పుస్తకం తీసి చదువుకుందాం అన్నా, కళ్ళు కాయితమ్మీద నిలవవు. నాలుగు వాక్యాలు చదివేలోపున మరేవో ఆలోచన వస్తాయి. కళ్ళు మరో పనికి మళ్ళిపోతాయి. అంటే నా ఆ patio తలుపులకి ఉన్న ప్లాస్టిక్ బద్దలలోంచి బయటికి చూడ్డం.

పైవాటాలో వాళ్ళు వాళ్ళవరండాలో కూర్చుని బీరు తాగుతూ, కబుర్లాడుకుంటూ, బొగ్గుల గ్రిల్లుమీద ఏవో కాల్చుకుంటూ, అతిథులతో కబుర్లు కాల్చుకుంటూ దర్శనమిస్తారు. కిందవాటాలో ఒక్కడే అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తాడు కానీ నాలాగే ఒంటిపిల్లి రాకాసి కాబోలు అట్టే ఆర్భాటం కనిపించదు ఆ ఇంట్లో.

ఇలా మేం ఎంతో అండరుస్టాండింగుతో కాలము పుచ్చుచుండగా, మరొ వింత జరిగింది. అదే అసలు కథ. నెల రోజులక్రితం. టీవీ చూస్తుండగా హఠాత్తుగా కనుకొల్లో ఒక చిత్రం మెదిలింది లీలగా. అటు తిరిగి చూస్తే, కిందవాటాలో ఉన్నతను వారి patioతలుపు బార్లా తీసి నావేపు తిరిగి చేతులు బారజాపి, తల విసురుగా ఊపుతూ ఏదో చెప్తున్నాడు.

మొదట ఉలిక్కి పడ్డాను. తరవాత అటువేపు చూడకుండా ఉండడానికి ప్రయత్నించేను. గుండెలు గిలక్కాయలా గలగల్లాడుతున్నాయి. కాళ్ళలో రక్తం చివ్వున ఎగిసింది ఆకాశగంగ కిందినించి మీదకి ప్రవహిస్తున్నట్టు. అతను ఏమిటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, నేనేం తప్పు చేసేను అని ఆలోచించడం మొదలు పెట్టేను కళ్లు టీవీమీద దృఢంగా నిలిపి. నాకు భయం వేసిందని మీదగ్గర మాత్రం ఒప్పుకుంటాను. కానీ అతనికి తెలియజేయాలా వద్దా అన్నదే సంశయం. నామొదటి ఆలోచన అక్కడినుండి లేచి పక్కగదిలోకి వెళ్ళిపోవచ్చు అని. కానీ అలా చేస్తే నేను భయపడుతున్నానని అతనికి తెలుస్తుంది. అలా తెలిస్తే విజయం అతనిదే. అది నాకు ఏమాత్రమున్నూ సమ్మతం కాదు. నా సిద్ధాంతం ఏమిటంటే భయం మానవనైజం. భయం కలగడం సహజం కానీ మనం భయపడుతున్నామని ఎదటివారికి తెలియనివ్వకూడదు. (ఇది రిపబ్లిక్ నాయకులు గ్రహించవలె). కానీ గుండెలు మాత్రం దబదబ కొట్టుకుంటూనే ఉన్నాయి.

ఫోను తీసి సరయుని పిలిచేను ఓమాటు రాగలవా అని. మామూలుగా 20 నిముషాల్లో రాగలదు కానీ ఇప్పుడు రోడ్డుమీద రద్దీ తారస్థాయిలో ఉంటుంది. రోజంతా పని చేసి ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా అని ప్రతి ఒక్కరూ తహతహలాడే వేళ. ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది తను రావడానికి. ఈ లోపున ఈ ప్రదర్శన అంతమయిపోవచ్చు. సలీనాని పిలువు అంది. సలీనా మా మేడ మేనేజరు. నాపక్క వాటాలోనే నివాసం. సరే అని ఫోను పెట్టేసేను.

సలీనాని పిలవడానికి నాకు మనసొప్పలేదు. ఎంత మంచి మనిషి అయినా నాకు భయం అని ఆవిడకి తెలియడం నాకిష్టం లేదు. ఈ పూట ఎలాగో గడిచిపోవచ్చు కానీ ఆ తరవాత నేను బతికున్నంతకాలం ధైర్యంపాఠాలు వినాల్సొస్తుంది.

ఆ పాఠాలేవో నాకు నేనే చెప్పుకుంటే పోతుంది కదా అనిపించింది. రచయిత్రిని కదా ఆ మాత్రం నాలుగు వాక్యాలు రాసుకోలేనా? అనుకుని మొదలు పెట్టుకున్నాను – నాయింట్లో నేను ఉన్నాను కానీ వారింట్లో లేను. స్థానబలం అంటారు కదా. నేను కదలకపోతే ఆ మనిషి నన్నేం చెయ్యగలడు? అంతగా అయితే మరింత గట్టిగా అరుస్తాడు. అంతే కదా, అరవనీ. అసలు ఇన్నాళ్లుగా ఉన్నానిక్కడ. ఇదివరకెప్పుడూ లేవు ఇలాటి వేషాలు. మందుమీదున్నాడేమో, లేదా, ఇంకెక్కడో ఇంకేదో జరిగితే అక్కడేం చెయ్యలేక ఇక్కడ ఇలా కక్ష తీర్చుకుంటున్నాడేమో … ఇలా ఆలోచించుకుంటూ నేను సర్దుకుని మరింత దృఢంగా కూర్చున్నాను, కళ్ళు టీవీమీద కట్టిపడేసి. కానీ నాకు మనసు మనసులో లేదు. నాలుగు నిముషాలయేక మళ్ళీ అటు చూసేను.

సీను మారిపోయింది. అతను గదిమధ్యకి జరిగి, చేతులు చాపి ఒక కాలు మునివేళ్ళమీద లేచి గిర్రున తిరిగేడు ballet డాన్సు చేస్తున్నట్టు. అహా, ఏదో పాత్ర ప్రాక్టీసు చేస్తున్నాడు అని అర్థం చేసుకునేశాను. ఆ తరవాత పూటంతా నాకు వినోదమే. మాటలూ, పాటలూ నేనే రాసుకున్నాను తదనుగుణంగా.

అప్పట్నుంచి నాకు అదో కాలక్షేపం అయింది. ఏదో సమయంలో అనాలోచితంగానే అటు చూస్తాను. వారం రోజులు కనిపించకపోతే, సరే ఎక్కడో ప్రదర్శనలకి వెళ్ళేడేమో అనుకుంటాను.

ప్రభలతో వెలిగిపోయింది. సాక్షాత్తు సూర్యభగవానుడు నా నట్టింట వెలిసినట్టే! ఆ వెలుగు వస్తున్నవేపు తిరిగి చూస్తే చూస్తే ఎదురుగదిలో patio doorకి పక్కనే వెలుగు వరదకి అద్దం పడుతూ ఓ పెద్ద గొడుగు – అదో సినిమా సెట్ లా ఉంది. నేను గబుక్కున లేచి నా patio shutters దగ్గరికి లాగేను ఆ తేజస్సునుండి నన్ను నేను రక్షించుకుంటూ.

పదిహేను నిముషాలయింతరవాత ఆ వెలుగులు అదృశ్యమయేయి. సహస్రకోటిప్రభలతో సాక్షాత్కరించిన దేవదేవుడు అంతర్థానయేడు.

సరయుతో చెప్తే, “headshots కాబోలు,” అంది.

మరో రెండు వారాల్లో మరో నాలుగుసార్లు ఆ దేవదేవప్రభలు నాగదిలో వెలిగేక, ఆ తలబొమ్మలు వేరేవారివి కాబోలు, అది అతనికి వ్యాపకం కాబోలు అనుకున్నాను.

చూసేరా! నేను పనిగట్టుకు వారిమీద నిఘా వేసి ఏదో డిటెక్టివ్ నవలలోగ డిటెక్షను చెయ్యలేదు. నాఇంట్లో నేను కూర్చుని నాపనేదో నేను చేసుకుంటుంటే, నన్ను కదిలించి చూడు చూడమంటూ నాముందుకొచ్చేయి ఆ విశేషాలు.

ఇలా వీధినాటకాలు జరుగుతుండగా, ఒక రోజు రెండు వాటాల్లోనూ దీపాలు వెలగలేదు. అంటే వాళ్లు ఉళ్ళో లేరు. నాకు హఠాత్తుగా మరో చిత్రం – నిండు పున్నమినాటి చంద్రుడు ఎదురింటి గాజుగోడమీద ప్రకాశిస్తున్నాడు ముళ్ళపూడివారి యువరాజులా.

Paurnami

అదీ ఇరుగు పొరుగులతో నా శాంతియుత సహజీవన హేల.

000

(హెచ్చరిక – ఇది కథ. అంటే కల్పితము)

(డిసెంబరు 29, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “శాంతియుత సహజీవనం (కథ)”

 1. Zilebi, మీరు ఎత్తి చూపేక తారస్థాయి మరోసారి చూసుకున్నాను ఎక్కడ ఎలా వాడేనా అని. మీరు భాషమాట తెచ్చేరు కనక ఇది – మీరు చేయి తిరిగిన రాత గలవారని – రాత గలవారు అని ఇదే మొదటిసారి నేను చూడ్డం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. కథ మొత్తానికి ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చిందండి 🙂 -> హెచ్చరిక – ఇది కథ. అంటే కల్పితము

  జేకే !

  అద్భుతః ! తారస్థాయి అని సరిగ్గా రాసినప్పుడే అనుకున్నా మీరు చేయి తిరిగిన రాత గలవారని 🙂

  చీర్స్-
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. ఈ కథ చదివిన మా తమ్ముడు.. వెంటనే నాకు ఈ లింక్ పంపి చదవమని చెప్పాడు. చాలా బాగుందండి కథ (కథ అనాలి అంటే మనసు ఒప్పుకోవటం లేదు … అంత సహజంగా కళ్ళకి కట్టినట్లు రాసారు )

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. మేము మద్రాసులో ఉన్నప్పుడు మా అత్తయ్య, మామ్మ బాల్కనీలో నుంచుని పక్కవాళ్లని, ఎదురువాళ్లని గమనిస్తూ ఇలాగే వాళ్లళ్లో వాళ్లే ఎవేవో మట్లాడుకునేవాళ్లు. అప్పట్లో వాళ్లకదో కాలక్షేపం. ఇద్దరికీ తమిళం రాదు దైరెక్ట్ గా మాట్లాడాలంటే . మీ కథ, కథలో బొమ్మలు చూస్తే అది గుర్తుకి వచ్చింది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. “శాంతియుత సహజీవన హేల” నిజంగానే శాతియుతం (కల్పితం అయినాకానీ.)
  మా ఊళ్ళోనైతే ఈ కల్పితమాత్రానికే జుట్టూ జుట్టూ పట్టుకుని పంజాబీ వాళ్ళందరూ ఒక యుద్ధరంగంలో దూరేవారు.

  మెచ్చుకోండి

 6. అదేనండీ కథల్లో సౌలభ్యమూ, సరదా కూడాను. నిజమూ, కల్పనా కలగాపులగం చేసేస్తే, ఆ తరవాత ఏవైనా తగువులొస్తే అది కథే కదా అని నన్ను నేను రక్షించుకోవచ్చు.

  మెచ్చుకోండి

 7. ఓహ్.. సరయు గారి పేరు చూసి .. నిజంగానే జరిగిన విషయం అని… మిమల్ని, ఆ ఎదురింటి ఆయన్ని ఊహించేసుకొంటూ హుషారుగా చదివేసాను. తీరా ఆఖరున ఈ కల్పితం అన్న హెచ్చరిక. బాగుందండి మీ శాంతియుత సహజీవనం 😀 😀

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s