2015కి వీడుకోలు చెప్తూ!

2015 వెనక్కి పెట్టి 2016లో ప్రవేశిస్తున్న సందర్భంలో గత ఏడే కాక నా సాహిత్యప్రస్థానం మొత్తం, వైయక్తిక స్నేహాలూ కూడా పునః పరిశీలించుకోవాలనిపించింది.

ఏడాదిక్రితం నేను అనుకోనివీ, ఎదురు చూడనివీ, జరగగలవని ఊహించనివీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పోస్టులో మొదటి భాగం అది. రెండోభాగంలో సాహిత్యపరంగానూ వ్యక్తిగతస్థాయిలోనూ నాస్నేహాలస్వరూపం సూక్ష్మంగా ప్రస్తావిస్తాను. నేనిలా ఎందుకనుకోవలసివచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. నేను జరిగినవి మాత్రం చెప్తాను.

 1. తెవికీ లో నా సాహిత్యప్రస్థానం నమోదు అయింది.
 2. చాలాకాలంగా చెయ్యాలనుకున్న పతంజలి యోగసూత్రాలు సరళమైన తెలుగులోకి అనువదించడం ఈ ఏడు సాధ్యమయింది. పుస్తకాలసాయంతోనూ, సాటి సాహిత్యాభిమానులు, ప్రత్యేకించి లక్ష్మీ దేవి గారి సహకారంతోనూ పూర్తి చేయగలిగేను.
 3. ఈ తెలుగు సూత్రాలు తెవికీలో పతంజలి పేజీలో కూడా చేర్చబడినాయి. ఆ పేజీలో ఉన్న వ్యాసం రాసింది నేను కాదు. అంతకు పూర్వం ప్రచురించినవ్యాసంలో ఈ తెలుగు సూత్రాలు చేర్చడం జరిగింది. నాబాధ్యత సూత్రాలవరకే.

నేను తీవ్రంగా ఆలోచించుకున్న మరొక విషయం – స్థూలంగా గత ఆరు దశాబ్దాలలోనూ సాగిన నా సాహిత్యప్రస్థానానికి సాహిత్యచరిత్రలో ఉన్న స్థానం ఏమిటి అని. వీలయినంతవరకూ నాసాహిత్యాన్ని దూరంనుండి పరిశీలించడానికే ప్రయత్నించేను. నాలుగేళ్ళక్రితం ఒకాయన అన్నారు “మీకథలు మీబ్లాగులో తప్ప ఎక్కడా కనిపించవు, మీపేరు ఎక్కడా వినిపించదు” అని. “మీరూ ఒక రచయితేనా?” అని సూటిగా అనలేదు కానీ పేజీన్నర పొడుగు ఉత్తరంలో ప్రధానాంశం అదే. ఆమాటలో నిజం ఎంత అని ఆలోచించేను. పత్రికలలో నాపేరు కనిపించకపోవడానికి కారణం నేనే పత్రికలకి నాకథలు పంపడం మానేయడం. మరి నాపేరు ఉపన్యాసాలలో వినిపించకపోవడానికీ, సాహిత్యవ్యాసాలలో సంకలనాలలో కనిపించకపోవడానికీ కారణం ఏమిటి అంటే సాహిత్య చరిత్ర కారులే చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసింది ఏమిటంటే ఈ పండితులు, మహా రచయితలు, విమర్శకులు నేను ఎదురు పడితే, “మీరు గొప్ప సాహిత్యసేవ చేస్తున్నారు” అంటూ పొగడ్తలు గుప్పిస్తారు. కానీ తరిచి చూసుకుంటే, నాకు కనిపించినంతవరకూ ముగ్గురో నలుగురో నాపుస్తకాలమీద సమీక్షలు రాసేరే తప్ప సామూహికంగా 20 శతాబ్దపు రచయిత్రుల సాహిత్యసేవ పరిశీలిస్తున్నప్పుడు వాటిలో నా ప్రసక్తి లేదు. అలాటి సామూహిక పరిశీలన “స్వాతంత్ర్యానంతర రచయిత్రులు”లో నన్ను చేర్చిన ఒకే ఒక రచయిత్రి, విమర్శకురాలు పి. సత్యవతిగారు, నాకు తెలిసినంతవరకూ (లింకు ఇక్కడ). ఇది ఒక కోణం.

మరొక కోణం – నా బ్లాగులో ఏ టపా తీసుకున్నా 300-500 మధ్య ఉంటున్నాయి చూపులు. వీళ్ళు మందపత్రాలతోనూ ఇతర ప్రచారసాధనాలతోనూ నాబ్లాగుకి లాక్కురాబడినవాళ్లు కారు. వీళ్ళలో సుమరుగా 20మందితో వ్యాఖ్యలమూలంగానూ, నేను ఇండియా వచ్చినప్పుడు కలుసుకోడంద్వారాను నాకు కొంత పరిచయం కలిగింది. ఇంకో పదిమంది తూలిక చూస్తున్నారని Facebookలో చేరేక తెలిసింది. మిగతావారు ఎవరో ఎక్కడుంటారో నాకు ఛాయామాత్రంగానైనా తెలీదు. కానీ కొత్త టపా పెట్టినప్పుడల్లా చూస్తున్నారని మాత్రమే తెలుస్తోంది. “ఆరోజుల్లో నేను చదివేను”, “మాఅమ్మకి మీరు తెలుసుట” లాటి మెయిళ్లు నాతరంవారో ఆ తరవాతితరంవారో ఇవ్వడం కూడా ఈ ఏడే ఇతోధికంగా జరిగింది. ఆ కోణంలో ఆలోచిస్తే, నారచనలు విమర్శకుల, సాహిత్యచరిత్రకారుల దృష్టిని ఆకట్టుకోకపోయినా, పాఠకులదృష్టిని ఆకట్టుకున్నాయనే అనిపిస్తోంది.

Facebookలో నా అనుభవాలు మరో టపా రాయడానికి సరిపడా ఉన్నాయి కానీ ఇక్కడే వీలయినంత సూక్ష్మంగా చెప్పి ముగించేస్తాను.

నూటికి తొంభైతొమ్మిది వంతులు ఫేస్బుక్కులో కనిపించే విషయాలు నాకు అయోమయం. అయోమయం అంటే అర్థం “యేమీ కానరానంత సముద్ర మధ్యభాగం” అని ఆంధ్రభారతిలో ఉంది. అది నాకు నూటికి నూరు పాళ్ళూ సరిపోతుంది అచ్చు గుద్దినట్టు. పొరపాటున ఏదో ఓ టపా నాకు అర్థమయింది అనుకుని ఒక వ్యాఖ్య పెడితే వెంటనే నాకు తెలిసేది నాకేమీ తెలియలేదనే! ఇలా నాకూ నాటపాలు చదివేవారికీ ఉభయసామాన్యం అయినవి ఆవంత అయినా లేని దుస్తర పరిస్థితి నాది. అయినా నాపేజీ చూస్తున్నవారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందంటే అది నా అదృష్టం.

నేను శాస్త్రీయసంగీతం ఆస్వాదించగల స్థాయి కూడా రవంత మెరుగుపడింది ఫేస్బుక్ లో సంగీతం చక్కగా తెలిసినవారిమూలంగానే.

తెలుగు భాషగురించి ఒక మాట.

తెంగ్లీషుగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంకరభాష నాకు ఈ జన్మలో అలవాటయే సూచనలు లేవు. అందుచేత, “తెలుగు ఫాంట్సు ఉపయోగించి తెలుగులో రాయండ”ని అని నేను వేడుకుంటే, నా మొరాలకించి తెలుగులో రాస్తున్నారు నాటపాలయందు ఆసక్తి గలవారు. నిజానికి ఆ ఆలోచన లేనివారు కూడా తెలుగు పాంట్స్ దింపుకుని తెలుగులోనే రాస్తున్నారు. ఇది నాకు పరమానందం కలిగించే విషయం. కానీ ఇదే కారణంగా కొందరు నాపేజీ చూడడం మానేసేరని కూడా గ్రహించేను. అయ్యో అనుకోడంకంటె నేను చేయగలిగింది ఏమీ లేదు.

గత పదేళ్ళగా సాగిన నా స్నేహం తీరుతెన్నులు వివరించి ఈ టపా ముగిస్తాను. నేను నాస్నేహాలను పరిశీలించుకుని, ఒక నిర్ణయానికి రావడానికి ఫేస్బుక్‌ పరిచయాలు బాగానే తోడ్పడ్డాయి.

గత పదేళ్ళలోనూ తూలిక.నెట్ సైటులోనూ, తెలుగుతూలిక బ్లాగులోనూ నారచనలమూలంగా పరిచయాలు మొదలయినా అవి అనతికాలంలోనే, స్వవిషయాల ప్రస్తావనలతో సాగి వ్యక్తిగత స్నేహాలుగా మారిపోయేయి. అందులో నా పాలు కూడా ఉందేమో. కానీ కొంతకాలం అయేక అవి నాకు ఇబ్బందికరంగా తయారయేయి.

క్రమంగా ఆ స్నేహాలకి చుక్క పెడుతూ వచ్చేను. ఇప్పుడు కబుర్లు అన్నీ సాహిత్యానికీ సంగీతానికి పరిమితం చేస్తున్నాను. “మాఅమ్మ ఇలాగా, అత్త అలాగా, మాఅవిడ, మాఆయన” అంటూ చెప్పే స్నేహాలకు ఈనాటితో స్వస్తి.

ఫేస్బుక్ ఏర్పడింది బొమ్మలకీ పోచికోలు కబుర్లకే అయినా నాకు ఇష్టమైనట్టు మలుచుకోడానికి వీలు అవడం నాసుకృతం.

నాకలమే నా అస్తిత్వానికి ప్రతీక. నారచనలేని నేను లేను. ఈ అభిప్రాయం నాకు ఏడాదిక్రితం కలిగింది. ఇప్పుడు స్థిరపడింది. నా సాహిత్యప్రస్థానాన్ని ప్రోత్సహిస్తూన్న సాహితీమిత్రులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

100_0318 (2)

గతానికి వీడుకోలు!

కొత్త సంవత్సరానికి సుస్వాగతం!

పలుకుతూ, ప్రస్తుతానికి శలవు తీసుకుంటాను.

000

(డిసెంబరు 30, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

23 thoughts on “2015కి వీడుకోలు చెప్తూ!”

 1. Lakshmi Raghava గారూ, ధన్యవాదాలు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నా రచనలు ఇష్టపడేవారున్నారు కనకనే. _()_ నేను ఇక్కడ చెప్తున్నది నా స్థానం నేను గ్రహించేననీ అది నాకు సమ్మతమేననీను. అంతే.

  మెచ్చుకోండి

 2. మీకు మీరే గుర్తింపు తెచ్చుకుని chalaa కాలమైంది. గుర్తింపు తో ఎక్కడెక్కడో వెళ్లి పోవాలని మీరు కోరుకోలేదు అయిన మీరచన లు ఇష్టపడే vyaktigaa ఇంకా ఎంతోమంది వున్నారని చెప్పగలను
  2016 లో ఇంకా కొత్త రచనలు రాస్తారని ఎదురు చూస్తూ …

  మెచ్చుకోండి

 3. ఈ వ్యాసం బాగుంది. నేను కూడా తెవికీ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తాను. పతంజలి యోగసూత్రాలు సరళమైన తెలుగులోనికి అనువదించినందుకు అభినందనలు. మీ‌ దృష్టిలోనికి ఇంకా వచ్చి ఉండకపోతే ఒక పుస్తకాన్ని ప్రస్తావించాలి ఈ‌విషయంలో. శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారని ఒకాయన ‘పతంజలి యోగదర్శనము’ అని ఈ యోగసూత్రాలను చాలా అందమైన సరళమైన తెలుగులో (అంటే వ్యావహారికభాషలో) చక్కటి విపులవ్యాఖ్యతో‌ ఒక పుస్తకంగా వ్రాసారు. కొన్నేళ్ళ క్రిందట ఆ పుస్తకాన్ని సికంద్రాబాదు రైల్వేష్టేషన్లో కొన్నాను. మీరు కూడా పరిశీలించండి.

  గత కొన్నేళ్ళుగా నా శ్యామలీయం‌ బ్లాగులో‌ నేనూ‌ సాహిత్యవ్యవసాయం చేస్తున్నాను. నా కృషి కూడా అంతా నా బ్లాగులోనే ఉంది.
  (ఈ టపాకి సంబంధించని సమాచారం తొలగించబడినది. – మాలతి)

  మెచ్చుకోండి

 4. Venkat Suresh, ఈ రోజు నాకు సుదినం. మీరూ మీలాటివారూ ఈ యజ్ఞాన్ని కొనసాగించాలి. తెంగ్లిష్ భాష కాదు. రోమన్ స్క్రిప్ట్ అని ఉంది కానీ ఈ తెంగ్లీషువారు అదీ సరిగా అనుసరించడం లేదు. స్నేహాలవిషయంలో కూడా మీరు ఆమోదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శుభమస్తు.

  మెచ్చుకోండి

 5. “ఇప్పుడు కబుర్లు అన్నీ సాహిత్యానికీ సంగీతానికి పరిమితం చేస్తున్నాను. “మాఅమ్మ ఇలాగా, అత్త అలాగా, మాఅవిడ, మాఆయన” అంటూ చెప్పే స్నేహాలకు ఈనాటితో స్వస్తి.” నాకూ అదే కావాలండి. పిచ్చి మాటలు కావాలి అంటే ఎన్నైనా వస్తాయి. ఎం లాభం?. మీరు ఎంచుకొన్న రెండూ విషయాలు నాకూ బాగా ఇష్టమైన విషయాలు కనుక.. ఇక నుంచి అవే మాట్లాడుకొంటాము అనర్గళంగా. మీరు ఈ బ్లాగ్ లో చెప్పినట్లు నేనూ తెంగ్లిష్ రాసేసే వాడిని. మీరే మమల్ని దారిలో పెట్టారు. ఇప్పుడు తెంగ్లిష్ ఎక్కడ రాయాలి అన్నా, వొణుకు…మీ కంట పడుతుందేమో అన్న భయం వచ్చేసింది 😀 😀

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. అవునండీ మనని మనం విశ్లేషించుకోడం కష్టమే. అనుకోకుండానే మనని మనం సమర్థించుకోడంగా మారిపోతుంది. నిజానికి ఇది వారంరోజులుగా అనేక సంస్కరణలకి లోనయింది. మీవ్యాఖ్య చూస్తే, నేను కనీసం కొంతవరకూ ఆ ప్రలోభానికి లోనవలేదనుకుంటున్నాను. మీరింత విపులంగా విశ్లేషించినందుకు, మీ శుభాకాంక్షలకీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. నారాయణస్వామి, అవునండి. నిన్ను నువ్వే విమర్శించుకోడమేమిటి అంటారు కానీ నిజంగా అది చాలా అవుసరం. నిజానికి నాకథ ఒకటి కూడా ఇలా చేసి చూదాం అనుకుంటున్నా. ఏమంటారు.

  మెచ్చుకోండి

 8. Dr. R. Suman Lata, మీవంటి విదుషీమణులు నారచనలను చదవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. _()_ విదేహరాజులా చేయగలిగితే ధన్యోస్మి.

  మెచ్చుకోండి

 9. మీ అస్తిత్వానికి ప్రతీక అయిన కలం నుండి మరిన్ని రచనలు ఎప్పటిలా రావాలని కోరుతున్నాను .పత్రికలలో మీ రచనలు చదివిన వారిలో నేను కూడా ఉన్నాను .మిమ్మల్ని మీరు ఒక “విదేహ రాజులా” విశ్లేషించుకోవటం నాకు మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .అందరికీ కష్టం కాని మీకు ఇష్టమయిన ప్రక్రియ అందుకే బ్లాగు చూసిన నాటినుండి (మే 2015 ) మీ ‘వెంట పడ్డాను ‘ సుమన్ లత

  మెచ్చుకోండి

 10. బాగుంది. నేను కూడ ఎక్కడో రాసుకున్నట్టు, ఇలా బేరీజులు వేసుకోడానికి ఈ కృత్రిమ సంవత్సరాది పండుగ బాగా పనికొస్తుంది.

  మెచ్చుకోండి

 11. మాలతి గారూ !గత ఏడాది మీ కొత్త చదువరుల పట్టిక లో నేనూ ఉన్నాను (.అంటే బ్లాగ్ ద్వారా) .మీరు నాకు పత్రికా రచయిత్రి గా తెలుసు.అందుకే బ్లాగ్ కనపడగానే మీ’ వెంట పడ్డాను’ .మీరు విశాఖ పట్నం మీ ఇంటి జాగరఫీ ఇచ్చేరు కదా .ఆ పరిసరాలలో ఉండి ఇప్పుడు 43 ఏళ్లనుండి హైదరాబాదు లో ఉంటున్నదానిని .నేను మే 2015.లో ఒక నెల అమెరికాలో గడిపినప్పుడు మీ బ్లాగ్ మొదటి సారి చూసి,(vsp గురించి ) మహాదానంద పడిన దానిని మీ పతంజలి యోగ సూత్రాల వ్యాఖ్యల కై బాగా ఎదురు చూసిన వారిలో నేను కూడా ఉన్నాను
  నాకు మిమ్మల్ని మీరు విదేహ రాజు లా విశ్లేషించుకుంటారని అనిపిస్తుంది .మీ ముందటి రచనలకి .ఇప్పటి కీ ఈ తేడా నాకు అనిపించింది .చాలా కష్టమయిన -మీకు ఇష్టమయిన ప్రక్రియ అని కూడా భావిస్తున్నాను కొత్త సంవత్సరం అందరికీ మంచిని ,అందరిలో మంచినీ కలగచేయాలని ఆకాంక్షిస్తూ మీ కొత్త రచన కోసం ఎదురు చూస్తున్నాను –డా .సుమన్ లత

  మెచ్చుకోండి

 12. స్నేహం ఇబ్బంది కరంగా మారితే బలవంతపు బంధంగా మారుతుంది అభిరుచుల కలబోత కాస్త అనవసర అసందర్భ ప్రేలాపన లోకి మారుతుంది..దీన్ని నిలువరించడం కాస్త కష్టమే సుమండీ…

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 13. >నాకలమే నా అస్తిత్వానికి ప్రతీక. నారచనలేని నేను లేను<
  మిగతా సంగతులు మీరు మీ ఫేస్బుక్‍ పోస్టుల్లో చెప్తూనే ఉంటారు కానీ ఈ పోస్టులో మీరు చెప్పినవాటన్నిటిలో నాకు నచ్చినది ఈ మాటే.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s