166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ!

కాపీ చేయుట చాలాకాలము క్రితము కనిపెట్టబడినది. మొదట అతి సాధారణమైనదీ అనాదిగా అభ్యాసములో నున్నదీ చెప్పుకుందాం. అక్షరాభ్యాసం చేసి పిల్లలకి ఓ పలకా బలపం ఇచ్చి అక్షరాలు దిద్దించడంతో ఇది ప్రారంభం. ఆ తరవాత చూచి వ్రాత రెండోపాదం. మూడోపాదంలో నీతి వాక్యాలు – అబద్ధమాడరాదు, ఒరులసొమ్ము తస్కరించరాదు –వంటివి కాపీ పుస్తకంలో చూచి రాయడం వచ్చింది. నా చిన్నతనంలో కాపీ చేయుట అంటే అంతే.

ఆ తరవాత పుస్తకాలు వచ్చేయి. చేతివ్రాత రూపంలో కాపీ చేయడం జరిగేది. అవి అపురూపం అనేక కారణాలవల్ల. అది శ్రమతో కూడిన పని అని మనకి బాగానే తెలుసు కదా. రెండోది వ్రాయసకారుల పొరపాట్లవల్ల పాఠ్యం. అర్థాలు మారిపోయే ప్రమాదం ఉండేది. అచ్చుయంత్రాలొచ్చేక కాపీ రాయడం అయితే తప్పింది కానీ అచ్చుకోసం galleyలో అక్షరాలు పేర్చేవారివల్ల కూడా పొరపాట్లు జరిగే అవకాశం కొనసాగుతూనే ఉండేది. ఇది కాపీ కథలో పూర్వార్థం.

20వ శతాబ్దం నాలుగోపాదంలో మొదలయి. 21వ శతాబ్దంలో కాపీ చేయుట అంటే విశేషమైన అర్థంలో ప్రచారంలోకి వచ్చింది. ఒక కథకి అనేక కాపీలుండవచ్చు. అంటే నేను ఒక కథ రాసి, ఆ తరవాత మనసు మార్చుకునో, తప్పులు దిద్దుకునే ప్రయత్నంలోనో మరొక కాపీ తయారు చేస్తాను. క్రమంగా ఇదో పత్రికకీ అదో పత్రికకీ పంపడం కూడా జరిగింది. అయితే ఈ రూపాలన్నీ రచయిత స్వయంకృతం.

ప్రింటు పత్రికలని వెనక్కి పెట్టేసి, బ్లాగులూ, జాలపత్రికలూ, ముఖపత్రాలూ మహోధృతంగా విజృంభించేసి, నియమాలను పోల్చుకోలేనంతగా మార్చేసేయి. వీటిల్లో కూడా తొలిపాదంలో ఎవరో ఒకరు ఆధిపత్యం వహించి తమ దృక్పథాలకి అనుగుణంగా రచయితలచేత మార్పులు చేయించి వివిధ కాపీలు తయారు చేయించి వారిపేరుమీదే ప్రచురించడం జరిగింది.

గత ముప్పై ఏళ్ళలో రాసేవారు ఎక్కువయిపోయేరు. రాయాలన్న తపన పెచ్చు పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ రాయాలన్న, రాసి తీరాలన్న, రాయకపోతే పేరు పడిపోతుందన్న అద్భుతమైన ఆలోచన మొత్తం సాహిత్యక్షేత్రాన్ని సంపూర్ణంగా మార్చేసింది. దాంతో మొదలయింది ఇక్కడివక్కడా అక్కడివిక్కడా పెట్టడం. కొందరు తమవే పెట్టుకుంటే మరి కొందరు వేరేవారివి పెట్టడం కూడా మొదలు పెట్టేరు. చెప్పి కొందరు, చెప్పకుండా కొందరు కూడా పునశ్చరణ పెంచుకుంటూ వచ్చేరు.

ప్రస్తుతం మనం ఈ దశలో ఉన్నాం. విశాల హృదయం లేని కొందరు ఈ ప్రక్రియని గ్రంథచౌర్యం అంటున్నారు కానీ అది సబబు కాదనే నేననుకుంటున్నాను. ఇది చివరివరకూ చదివిన తరవాత, మీరు కూడా అంగీకరిస్తారు ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ అని. ఇప్పుడు ఈ దశ రూపురేఖలేమిటో వివరంగా తెలుసుకుందాం. శాస్త్రప్రకారం – అదేలెండి నూతనంగా వ్రాయబడిన శాస్త్రప్రకారం – అచ్చులో వచ్చిన కథ జాలంలో, జాలంలో కత అచ్చు పత్రికలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాయి. కాపీరైటు నియమాలకి ఇది విరుద్ధం కాదు. కానీ వేరేవారివి కూడా ఈ shell gameలోలాగ చేయడం మాత్రం కాపీరైటు నియమాల్లో లేదు.

ఇటీవల ఇది ఎక్కువయిపోయింది. జాలంలోనే ఒకరిపేజీలో కనిపించింది మరొకరు వారిపేజీలోనో మరో సమూహపేజీలోనో పెట్టేయడం మొదలయింది. మూలరచయిత పేరు నూటికి 90వంతులు కనిపించదు. పదుగురాడుమాట పాటియై చెల్లు అంటారు కనక పదేమిటి ముఫ్పైమంది అలా చెప్పకుండా ప్రచురిస్తున్నట్టు కనిపిస్తోంది కనక అదే నిజమైన నియమం. “అయితే చెప్పఖ్ఖర్లేదంటారా?” అని మళ్లీ నన్ను అడక్కండి. అలా అడగడం చాదస్తం. ఇది ఎవరూ చెప్పని, చెప్పకూడని రూలు అని మీకు మీరు రహస్యంగా రాసుకోండి.

మూలరచయిత పేరు చెప్పకుండా వేరేవారి రచనలు పూర్తిగానో సగంసగమో తమవిగా ప్రచురించుకోడం అంచెలంచెలుగా పట్టపట్ట పగ్గాల్లేకుండా అభివృద్దిగా చెందేసింది. నా వ్యాసాలు, కథలు కూడా ఈ అసాధారణగౌరవానికి నోచుకున్నాయి. మూలరచయితలు అమాయకులైతే, “అయ్యో. అది నారాత. నాఖర్మ,” అని నొచ్చుకుని ఊరుకుంటారని ఆ కాపీరచయితలు, నేను కాపికేయులు అంటాను ప్రస్తుతానికి – ఆశిస్తారు. కానీ రచయితలు ముఖ్యంగా నాలాటి రచయితలయితే ఊరుకోరు. అట్టే రచ్చ చెయ్యకపోవచ్చు. చాలా మర్యాదగా కాపికేయులకి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ఉత్తరం సుమారుగా ఇలా ఉంటుంది, “మీరు ప్రచురించిన కథ/కవిత/వ్యాసం నేను రాసేను. … పత్రికలో … తేదీన ప్రచురించడం జరిగింది. మీరు చూడక పొరపాటున మీదనుకుని ప్రచురించినట్టున్నారు (హాహా. చూడకపోతే కాపీ చేయడం జరగదు అని చాదస్తంగా అడక్కండి). మీరు పెద్దవారు. మిమ్మల్ని తప్పు పట్టుట నా అభిమతం కాదు. మీరు మూలరచయితగా నాపేరు కూడా చెప్తే బాగుండేది కదా. లేదా మీరు మీ పేజీలోనుండి తొలగించినను నేను అపార్థం చేసుకోను.”

దానికి సమాధానం, “మీరు రాసినట్టు నాకు తెలీదు. నేను అసలు ఆ పత్రిక చూడలేదు. చూడను. కానీ మీరు నిజంగా చాలా బాగా రాసేరు. నాకు చాలా నచ్చింది. అందుచేత నాస్నేహితులు కూడా చూసి ఆనందిస్తారని నాపేజీలో ప్రచురించేను. ఆ క్రెడిటంతా మీకే.”

“క్షమించండి. నేను సరిగా చెప్పలేదులా ఉంది. మీరు నాపేరు చెప్పలేదు కనక నాకు మీపేజీలో క్రెడిటు రాదండి.”

“ఇప్పుడు చెప్తున్నాను కదా. అయినా మీరు ఇలా సతాయించడం బాగా లేదు. మంచి సాహిత్యం వీలయినంత ఎక్కువగా ప్రచారం పొందడమే న్యాయమని నా దృఢవిశ్వాసము.”

దాంతో మూలరచయిత బాధ మూల పడిపోతుంది. అలాటి కాపికేయులు చెప్పే ఇతర కారణాలు –

కారణం 2. “అమ్మా లేదా అయ్యా, మీరు అది రాసేరని నాకు తెలీదు. అసలు నేను మీపేరే వినలేదు. ఓహో, మీరు కూడా రచయితేనన్నమాట. చాలా సంతోషం. తప్పకుండా రాస్తూ ఉండండి.”

కారణం 3. “అమ్మా లేక అయ్యా, నాది పొరపాటే. మీరు నొచ్చుకోగలరని నేననుకోలేదు. నాకు కంప్యూటరుమీద తెలుగు టైపు చేయడం రాదు. నా మిత్రులనడిగితే, వారు తీసి ఇచ్చేరు. నేను చేసింది కేవలం కాపీ చేసి పేస్ట్ చెయ్యడం మాత్రమే.”

నాలుగోది కారణం కాదు, సాకు లేక నెపం అనాలి. “నేను డబ్బు చేసుకోలేదు ఆ ప్రచురణతో. ఇంకా చెప్పాలంటే నేను మీకు నిస్వార్థంగా ప్రచారం తెచ్చేను. మీరు సంతోషిస్తారనుకున్నాను.”

“నాపేరు చెప్పకపోతే నాపేరు ప్రచారానికి తావేదీ?” అని అడగరాదు.

ఇక్కడ మరోమాట చెప్పుకోవాలి. ఈ కాపీ విశేషాన్ని నేను సాహిత్య ప్రక్రియ అనడానికి కారణం ఇప్పుడు కొన్ని పత్రికలు కూడా బ్లాగుల్లోంచి తీసుకుని (తస్కరించి అనడం మర్యాద కాదుట) ఇలాగే చేస్తున్నారని వార్త. బహుశా రచయిత పేరు కూడా అక్కడ పెడుతున్నారో లేదో నాకు తెలీదు.

ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినతరవాత నాకు అర్థమయిన పరమసత్యము – కాపీ చేయుట కలియుగం నాల్గవపాదంలో అఖండద్వీపం అంటే యావత్ ప్రపంచంలోనూ అనధికారంగా ఆచరణలో పెట్టబడిన నీతి. అందుకే నామాట విని, “కాపీలనాపరాదు. కాపీ చేయలేనివాడు చిల్లుకానీకి కొరగాడు,” అని ఓ కాయితంమీద రాసి, లేదా ఇదే ఫొటో తీసుకుని మీ ఫ్రిజిమీద పెట్టుకోండి. వంటింటిలోకి రాని మగవారు మీఇంట్లో ఉంటే, ఆ కాయితం తలవాకిలికి అంటించండి. రోజూ లేస్తూనే తొలికప్పు కాపీతోపాటు కాపీ కాపీ అంటూ మూడుసార్లు మననం చేసుకోండి.

కాపీ చేయు విద్య – సూక్ష్మంగా కా.వి. అందాం – సాహిత్య ప్రక్రియ స్థాయి తెచ్చుకునేసిందని నా నిశ్చితాభిప్రాయం.మనం. అచిరకాలంలోనే ఈ విద్యకి జ్ఞానపీఠ్ పురస్కారం, నోబెల్ బహుమానం వంటివి కూడా ప్రతిష్ఠించవచ్చు ఏ అమీరికా రెడ్డిగారో రాజుగారో నాయుడుగారో.

ఇది సాహిత్య ప్రక్రియ అని తేలిపోయింది కనక కొత్తగా ఈ ప్రక్రియ చేపట్టదలుచుకున్నవారికి కొన్ని కిటుకులు బోధించడం కూడా నాధర్మం. ప్రత్యేకించి ఇటీవల కాపి చేసినవారు పట్టుబడిపోవడం కూడా జరుగుతోంది కనక. ఇప్పుడు కొత్త కాపికేశ్వరులకి ఇస్తాను.

 1. వీలయినంతవరకూ మధ్యస్తమైన ప్రాచుర్యం పొందిన రచయితని ఎంచుకోండి.
 2. కథాంశం ఎంత సంప్రదాయ విరుద్ధమైతే అంత మంచిది. నాకూ అలాటి ఆలోచన రాకూడదేముంది అని దబాయించడానికి వీలు.
 3. ఆ రచయిత ఏ పత్రికలు, ఫేస్బుక్ పేజీలు చూస్తారో తెలుసుకుంటే మంచిది. వాటికి కొంచె దూరంగా మరోచోట ప్రచురించుకోడం ఉత్తమ పద్ధతి.
 4. కొంత వాక్చాతుర్యం కూడా అవుసరం. కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికీ తికతికగా జవాబులివ్వడం నేర్చుకుని సిద్ధంగా ఉండాలి.

కాపీలలో కూడా భిన్న పద్ధతులున్నాయి.

 1. ఒక వాక్యం ఉన్నదున్నట్టు కాపీ చెయ్యడం. ఇది చాలా తేలిక. ఎందుకంటే మీరూ ఆ రచయితా కూడా నిఘంటువులో ఉన్నపదాలే కదా వాడేది. ఇద్దరు అవే పదాలు ఎంచుకోకూడదని ఎక్కడా లేదు.
 2. ఒక పేరా అయితే ఒత్తులూ, గుణింతాలు మార్చడం ఉత్తమం. మరో ప్రాంతీయభాషలోకి మారిస్తే భేషుగ్గా ఉంటుంది.
 3. మొత్తం పాఠం అంతా ఉన్నదున్నట్టు పెట్టేసుకున్నప్పుడు, రచయిత పేరు కూడా ఏదో మూల ఇరికించడమే క్షేమమే అని నా తలపు.
 4. రచయిత పేరు చెప్పకుండా ఎక్కడోక్కడ ప్రచురించేసి, ఏమీ తెలియనట్టు ఊరుకోడం కూడా సాధ్యమే.

ఇంక అసలు విషయానికి వస్తాను. నేను ఈ విషయం ఎంతో ఆలోచించి, శల్యపరీక్ష చేసి, ఒక ఆలోచన చేసేను. ఇదుగో నేను కనిపెట్టిన ధర్మసూక్ష్మం ఇక్కడ ఇస్తున్నాను. తెలుగు దినపత్రికలలోనూ వారపత్రికలలోనూ, నాముఖపత్రంలోనూ ప్రకటన ఇస్తున్నాను కూడా.

“కాపీరచయితలకు అభ్యర్థన. దయ చేసి, ఈ కిందివాక్యం కాపీ చేసి మీ కాపీరచనకి జత చేయగోరుచున్నాను. మీకు కాపీ చేయడం వచ్చు కనక ఇది తేలిక పద్ధతి.

“ఇది స్వీయరచన కాదు. కాపీ చేయడంవరకే నా బాధ్యత. ఇట్లు, (మీ దివ్య నామధేయం).”

ఇంకా ఆలోచిస్తుంటే, ఈ అంశంమీద ఓ శతకం రాయొచ్చు అని కూడా అనిపించింది. నా ముఖపత్రంలో మిత్రులనడిగితే, వారు రాసి ఇచ్చిన కొన్ని పద్యాలు మరో టపాలో ఇస్తున్నాను. లింకు

గమనిక – ఈ పోస్టుకి Facebookలో నాటపాకి స్పందిస్తూ అందించిన హాస్యమే స్ఫూర్తి. అంచేత ఈ రచన వారికి వినయంగా అంకితం అర్పించుకుంటున్నాను.

000

(జనవరి 5, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

17 thoughts on “166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ!”

 1. ఒక రకంగా చూస్తే కాపీనే బెటరేమో. లేకపోతే అసలు రచనలకీ, వాటిలోని పాత్రలకి కూడా వాళ్లకి తోచినట్లు కళ్లు, ముక్కు, చెవులు etc తగిలించి పూర్తిగా మార్చేస్తారు. కావాలంటే inspiration అనో లేక స్వేచ్ఛానువాదం (భాష మారితే) అనో అంటారు. ఈ మధ్య ప్రఖ్యాత కథలనీ, పాత్రలనీ, పాత సినిమా పాటలనీ కూడా అలాగే మార్చేస్తున్నారు కదా. కనీసం కాపీ చేస్తే అసలు రచన ఎక్కడో అక్కడ భద్రంగా ఉంటుంది. (ఎక్కడ ఉన్నా పిల్లలు సుఖంగా ఉన్నట్టు తల్లితండ్రులు అనుకున్నట్టు). కాబట్టి original రచన భద్రంగా ఉండాలంటే ఇలాంటి కాపీలని ప్రొత్సహించాల్సిందే. copying is the best compliment అని సంతోషపడాల్సిందే

  చిత్రంగా ఈనెల కౌముదిలో యర్రంశెట్టి శాయి గారి కథ ‘హామీపత్రం’ దీనిమేదే వచ్చింది. వీలైతే, లింక్ చూడండి
  http://www.koumudi.net/Monthly/2016/january/index.html

  మెచ్చుకోండి

 2. హా, మీరు నాకంటే ముందే రాసేశారా. అందుకే అంటారు ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన చెవులు వాడి అని. కాపీ కౌపీనం బాగుంది. మీరచన ఇక్కడ పేస్టయిపోవడంలో నా ప్రమేయం లేదని గమనించగలరు :p

  మెచ్చుకోండి

 3. మీ 2) దగ్గర దొంగిలించనివా దొంగలించినవా. ఏమైనా పూర్వకవులందరూ అంతేనండి. మీవంటి ఈనాటికవులనుండి తస్కరించినవే. ఏం చేస్తాం, కాలం వెనక్కి నడుస్తోంది. 🙂

  మెచ్చుకోండి

 4. వామ్మో వామ్మో ! నా బ్లాగు లోని టపా మొత్తం ఇక్కడ కాపీ పేష్టు అయిపోనాది 🙂 జేకే !

  బాగుందండి మీ కాపీ సాహిత్య ప్రక్రియ ! ఈ ప్రక్రియ కి నేను పెట్టు కున్న పేరు కాపీ కౌపీనం 🙂

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. స్వకపోల కల్పిత మనో
  జ్ఞకళా గతి కెట్టులౌను సరి? ఛాయా చో
  రక రుచి సందర్భం బని
  ముకురము నగు కరణి నవ్వు మోము చెలంగన్

  నేను వ్రాసిన ఈ కవితను చేమకూర అనే ఆయన తన విజయవిలాసము అనే కావ్యములో వాడేసుకున్నాడు. పైగా ఇలా రెండర్థాలు చెప్పాడు

  1) సుభద్ర అద్దములో చూసుకుంది. అద్దము లోని అందము సుభద్ర ముఖకళలను దొంగిలించుట వలన కలిగినదే కావున సహజ సుందరమైన సుభద్ర ముఖమునకు సాటి వచ్చునది కాదు… అన్నాడు. ఎందుకు సాటిరాదండి? కొంతమంది అద్దములో బాగుంటారు.. 🙂

  2) చోరకవి కవిత్వమునకు ఉన్నట్టి మెరుగులు స్వతంత్ర సత్కవీశ్వరుల రచనలనుండి దొంగిలించనవే అని భావము. నా కవిత్వము వాడుకుని పైగా ఇలా అంటన్నాడు, చూసారా ఎంత అన్యాయమో!!!

  మెచ్చుకున్నవారు 2 జనాలు

 6. మొదటగా మీ టపాలో నా పామర పద్యాలకి చోటు ఇచ్చి నందుకు ధన్యవాదములు… బాధని హాస్యముగా మార్చి నవ్వుతూ నవ్విస్తూ నే చురకలు అంటించారు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. < "కారణం 2. …….. ఓహో, మీరు కూడా రచయితేనన్నమాట. ….."

  అద్భుత: (ఇది కూడా కాపీ పదమే) 🙂
  ——————-

  < " …….. నాకూ అలాటి ఆలోచన రాకూడదేముంది ……."

  మీరన్నట్లు ఇలా "దబాయిం"చే వాళ్ళు ఉంటారు. మా కాలేజ్ చదువు రోజుల్లో ఓ ప్రముఖ వారపత్రికలో ఓ సీరియల్ ప్రారంభమైంది (వారపత్రిక పేరు, సీరియల్ రచయిత్రి పేరు నాకిప్పుడు గుర్తు రావడంలేదు). మొదటి వారం కధ చదవగానే మా మిత్రులకి నాకూ ఓ అనుమానం వచ్చింది. Hermina Black అనే రచయిత్రి గారి The Invisible Flame అనే నవలలా ఉందే అని (మేం అంతకుముందే ఆ నవల చదివున్నాం). ఆవిడ పేరు ఎక్కడా పేర్కోలేదు. పాత్రల పేర్లు మాత్రం తెలుగు పేర్లు పెట్టారులెండి. సరే మరో వారం చూద్దాం అని ఆగాం. తర్వాత వారం పత్రిక చూడగానే అనుమానం బలపడి, పత్రికకి పాఠకుల ఉత్తరం వ్రాశాం. కొన్ని వారాల తర్వాత ప్రచురితమైన రచయిత్రి సమాధానంలో, సరిగ్గా మీరు చెప్పినట్లే, ఆ ఆంగ్ల పుస్తకం తెలియదు, తనకూ అవే ఆలోచనలు / భావాలు / స్ఫూర్తి / కధ తట్టాయి లాంటిదేదో అన్నారు. "దబాయిం"పే మరి.
  (ఇటువంటివి చాలానే జరిగుంటాయి / జరుగుతూనే ఉంటాయి. మీ టపా చదువుతుంటే నాకు పై సంఘటన వెంటనే గుర్తొచ్చింది.)
  ————-
  కాపీయే మా రైట్ అని అలనాడు ముళ్ళపూడి వారు వ్యంగ్యంగా అన్నారని గుర్తు. కాపీగత ప్రాణులు ఉంటారు తప్పదు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. మీవంటి రచయితలు సహకరించకపోతే నా కాపీ శతకం ఎలా పూర్తవుతుంది. పోతే, ఈ టపాకి ఫేస్బుక్కులో మిత్రులు అందించిన హాస్యం అంతా ఇక్కడ చిలికింది. అంచేత ఆ కీర్తి అంతా ఆ మిత్రులదే.

  మెచ్చుకోండి

 9. ROFL.
  మీకిది నవ్వులాట కాదని తెలుసు, కానీ మనసుని చాలా బాధె పెట్టే విషయాన్నించి కూడా ఇంత అద్భుతమైన హాస్యాన్ని పండించిన మీ బుద్ధికీ కలానికీ మనస్పూర్తిగా జోహార్!
  నాకు పద్యం రాయాలి అనిపించడం లేదు గానీ ఈ ముక్తాయింపు చెప్పాలనిపిస్తోంది.
  “ఇది నిడదవోలు మాలతి ప్రవచించిన తస్కరణ ముద్రణంబనబడు జాలశాస్త్రమున కాపీ ఉపనిషత్తునందలి సర్వ సూత్రములును సమాప్తము.”

  మెచ్చుకోండి

 10. కాపీచేయుట అనే సాహిత్య ప్రక్రియలో ఆరితేరినవారి గురించి ఈ క్రింది కథలో చదువవచ్చు.
  http://turupumukka.blogspot.in/2012/12/blog-post_5389.html

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 11. మాలతిగారూ, మీరు ఆవిష్కరించిన నూతన సాహిత్యప్రక్రియ ప్రస్తుతకాలానికి సరిగ్గా సరిపోతుందండీ. దీనిని కాపీ చేసుకునే పధ్ధతి కూడా అదే హామీపత్రం రాసే పధ్ధతి కూడా చక్కగా వివరించారు కనుక అందరూ ఈ విధంగా ముందుకు పోవచ్చును.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.