మనలో మనమాట – 1. చెప్పొచ్చేదేమిటంటే

మనలో మాట, చెప్పొచ్చేదేమిటంటే, నీక్కనక చెప్తున్నా అనేవారు నీకు ఎక్కడైనా ఎప్పుడైనా తగిలేరా? మళ్ళీ ఎవరితోనూ అనకేం అంటూ మొదలు పెట్టేవాళ్ళని చూసేవా? అలా ఎవరైననా నాతో అన్నప్పుడల్లా, ఆ వెంటనే మళ్ళీ ఎవరతోనూ అనకేం అని కూడా వినిపిస్తుంది. ఆ ఉపవాక్యం మనసులోకి వచ్చేస్తుంది దానంతట అదే. అదన్నమాట సంగతి. ఇక్కడ్నించి కొన్నాళ్ళపాటు నేనిక్కడ చెప్పబోయేవన్నీ అలాటి రహస్యాలే. ఇది మరెక్కడా పొక్కనివ్వకు అని నేను వేరే చెప్పను.

ఇహ ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే మామూలుగా నువ్వూ, నీలాటివాళ్ళూ ఆఫీసుల్లోనూ, లంచీల్లోనూ కంచీల్లోనూ నీకు తెలిసినవాళ్ళతో మామూలుగా మాటాడేవి కావు. ప్రేమాయణాలూ, నువ్వు పూజించే సినీ నాయకీనాయకులూ, చదివే నవలలూ, రాసుకునే కథలూ, ఆడిపోసుకునే రాజకీయాలూ, సతులని పతులూ పతులని సతులూ హేళన చేసే కార్టూనులూ కాదు. అంతేనా, ఇంకా ఏదైనా వదిలేసేనా? అన్నట్టు కనిపించిన ప్రతివాణ్ణీ ఆడిపోసుకునే కుచ్చితులు కూడా ఉండరిక్కడ. ఒక్కమాటలో ఇక్కడ “సామాజికచైతన్యమూ, సామాజికప్రయోజనమూ” ఉండవు. వీటివల్ల “సామాజికోద్ధరణ’’ ఇసుమంతయు లేదు.

మాటవరసకి నేనున్నాను. ఓ మాట చెప్తాను విను. మామూలుగా నాకు మరో పనీ పాటా లేదు కదా. అంచేత టీవీలో ఓ డొక్కు షో చూస్తూ కూర్చుంటాను. అంతలో హఠాత్తుగా మెరుపు మెరిసినట్టు ఒక గొప్ప అద్భుత కనివిని ఎరగని విషయం నామెదడులోకొచ్చేసి తిష్ఠ వేస్తుంది. చెవిలో జోరీగా చెప్పులో రాయిలాగ ఊరుకోనివ్వదు నీకు చెప్పేసేవారకూ. అలాటివన్నమాట ఇక్కడ రాసేదాం అన్న అద్భుత ఆలోచన కలిగింది మూడ్రోజులక్రితం. ఈమధ్య మిత్రులు కూడా “మామూలు మనిషిలా ఉందూ” అన్నాక, ఇది కూడా హఠాత్తుగానే జరిగింది, మామూలుగా ఉంటూ, మామూలు మాటలే చెప్పుకుంటూ నా శేషజీవితం గడపదలుచుకున్నాను. ఇది చాలు కద పరిచయానికి.

ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేస్తాను. మొదట చాలా పాత పిట్టకథ నాకు ఇప్పటికీ గుర్తున్నది చెప్పు చెప్పు అని హోరెట్టేస్తోంది బుర్రలో వసపిట్ట. అంచేత దాంతోనే మొదలుపెడతాను.

ఒక ఇల్లాలు ఆవిడకి ఎంతో ప్రియతముడైన పతిగారికి ఎంతో ఇష్టం అని వంకాయ కూర చేసింది. ఆయన కంచందగ్గర కూర్చుని, కంచంలోకి గుచ్చి చూస్తూ, “ఇవాళ వంకాయకూరా అన్నారు.” అప్పుడు ఆవిడ కూడా ఆయనమొహంలోకి గుచ్చి చూస్తూ, “ఆదివారం వంకాయ కూర అత్యద్భుతంగా ఉందన్నారు. సోంవారం అద్భుతంగా ఉందన్నారు. మంగళవారం మహ బావుందన్నారు. బుధవారం ఆహా ఏమి రుచి అన్నారు. లక్షింవారం ఇవాళ వంకాయ కూరా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మీ వరస నాకర్థం కావడం లేదు,” అందిట గట్టిగా.

నాకు సరిగా జ్ఞాపకం లేదు కానీ ఇది బాపు కార్టూను కావచ్చు. జ్ఞాపకం సరిగా లేదు కనక ఈ మాటలు కూడా అక్షరాలా ఇవే మాటలు ఇవే కావడానికి అవకాశాలు తక్కువే. కానీ సుమారుగా సంగతి తెలుస్తోంది కదా.

ఇప్పుడీకథ ఎందుకొచ్చిందంటే ఏ విషయమైనా ఇంతే. ఒకసారి చెప్తే వింత. నాలుగు సార్లు చెప్తే చాలా బాగుంటుంది. ఇరవైమార్లు చెప్తే విసుగేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే మొదలు పెట్టి అస్తమానంవరకూ టీవీలో గంట గంటకీ అదే ప్రకటన చూడాలంటే, చంపేస్తున్నార్రా బాబూ అని అరవాలనిపించదూ?

కొన్ని ప్రకటనలు సరదాగానే ఉంటాయి. ముఖ్యంగా 10, 15 క్షణాల్లో ముగించేసేవి. నాకు మందులకంపెనీల ప్రకటనలు చూస్తే మాత్రం అసహ్యంగానే కాదు అన్యాయంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తమ మందు ఫలానా జబ్బుకి పనికొస్తుంది అని చెప్పి ఊరుకోరు. ముందు జబ్బు లక్షణాలతో మొదలు పెట్టి, అది మనకి ఉందో లేదో కనుక్కోమంటారు. అక్కడినించీ నాకనుమానం. అవును సుమా నిన్న చేతిమీద ఏదో మచ్చ కనిపించింది. అది చర్మరోగమేమో. అన్నట్టు రాత్రి దగ్గేను కదా. కొంప తీసి నాకు క్షయేమో. … ఇలా లేని ఆలోచనలన్నీ వచ్చేయడం మొదలవుతాయి. ఇంతలో ఆ ప్రకటనకర్త డాక్టరుదగ్గరిని సంప్రదించమంటాడు. సరే అనుకుంటుండగానే ఆ మందు వికటిస్తే రాగల దుష్ఫలితాలు ఏకరువు పెడతాడు. నేను ఎలాగా డాక్టరుదగ్గరికి వెళ్ళడం అంటూ జరిగితే అక్కడ ఆ డాక్టరుబ్రహ్మ చెప్పడా ఏ మందు పనికొస్తుందో, పని చెయ్యకపోతే ఎలా వికటిస్తుందో?

టీవీలో 90 లేక 120 క్షణాలు – నాకు పావుగంట అనిపించే – ఈ కచేరీ పెట్టడం ఎందుకు? నన్ను తప్పు పట్టకు. ఏదో రోగంతో బాధ పడేవాళ్ళంటే నాకు సానుభూతి లేదని కాదు నేనీ సొద మొదలెట్టింది. మాటవరసకి చెప్తున్నా. నాకే ఏదో ఉబ్బసమో, ఆరెచ్చో జెబిపివో – ఏదో ఒక ఎ-టు-జీ పేరుగల రోగమే వచ్చిందనుకో. నిజంగా నేనలా బాధ పడుతుంటే, ఆ బాధ కొంచెంసేపు మరిచిపోదాం అని టీవీ పెట్టుకుంటే, మళ్లీ అదే సొద రోజుకి ముప్ఫై మార్లు వినడానికి నాకు ఆనందంగా ఉంటుందా? ఆ జబ్బులక్షణాలు వాడు చెప్పేదేమిటి, నాకెలాగా ఉంది, నిజానికి వాడికంటే నాకే ఎక్కువ తెలుసు ఆ బాధేమిటో. కదా? అంచేత వాడి పాట నాకు ఏమాత్రమూ ఉపశమనం కలిగించదు కదా? అంతే కాదు. నాకు ఆ జబ్బు లేకపోతే కూడా నాకు ఆ పాట పదే పదే వినడం హర్షదాయకం కాదు కదా. ప్చ్. ఆమందులకంపెనీలవాళ్ళకి ఇంతదూరం ఆలోచించే బుర్ర లేదు. వారికి తోచదు. మేం చెప్పాలనుకున్నాం, చెప్పేం, అంటారంతే.

అలాగే సాయంత్రం ఎంతో ఉవ్విళ్ళూరుతూ చేసుకున్న కంది పచ్చడీ, వంకాయ వేపుడూ, గోంగూర పచ్చడీ, ముక్కలపులుసూ, గడ్డ పెరుగూ కంచంలో పెట్టుకుని మనసారా ఆనందిస్తూ తినడానికి కూర్చున్న సమయంలో కడుపునొప్పీ, అజీర్తి మందులు ఏవి ఎలా పనిచేస్తాయో టీవీవో రేడియోవో హోరెత్తుతుంటే ముద్ద నోట పెట్టగలమా? ఆ ప్రకటనలు ఇవ్వడానికి అదీ సమయం అని ఏ ప్రబుద్ధుడికి తోచిందో నాకు ఈ జన్మలో అర్థం కాదు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే వినదగు ఎవ్వరు చెప్పిన అన్నది ఇక్కడ వర్తించదు. టీవీ కట్టేసి మరో పని చూసుకోడమే.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. కొన్ని ప్రకటనలు మాత్రం సరదాగా ఉంటాయి. ఇవి మందులకంపెనీలవి కాదు. ఆమధ్య ఒక కార్లకంపెనీ ప్రకటన చూసేను. ఒకమ్మాయిని ఇంటికో మరెక్కడికో తీసుకెళ్ళడానికి ఇంకో అమ్మాయి కారు తెస్తుంది. మొదటి అమ్మాయి “నీకారు ఎక్కడ? నాకు కనిపించడం లేదు,” అంటూ దిక్కులు చూస్తూ, ఒక కారు చూసి, “ఆఁ, కనిపించింది,” అని పరుగెత్తుకెళ్ళి ఆ కారు ఎక్కేసి, పక్కనున్న చక్రధారివేపు చూస్తుంది. ఆ అబ్బాయి పాపం తెల్లబోయి ఆ అమ్మాయివేపు చూస్తాడు. ఆ పిల్ల ఎక్కవలసినకారు అది కాదని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. నాకు అది చూసిన ప్రతిసారీ నవ్వొస్తూనే ఉంటుంది. ఆ అబ్బాయి మొహంమీద భావప్రకటన అద్భుతం.

మందులకంపెనీలలాగే ఎన్నికల సంరంభమూను. ప్రతి భవిష్యత్తులో కాగల లేదా కానుంకించిన ప్రతి రాజకీయచతురుడూ కొన్ని లక్షలో కోట్లో తగలేస్తున్నాం కనక మీ ఓటు నాకే అంటూ గోల. దేశాన్ని ఉద్ధరించడానికి తన మహోత్తమ ప్రణాళిక ఉత్తమమే కాదు అదొక్కటే దేశాన్నీ మొత్తం ప్రపంచాన్నీ ఉద్ధరించగలది అని మొత్తుకోడం బాగానే ఉంది. ఆ ధ్యేయాన్ని ఓటర్లందరికీ తెలియజెప్పాలనుకోడం కూడా బాగుంది. కానీ ఆ ఉద్బోధని brainwash స్థాయికి తీసుకుపోవడం మాత్రం దుర్భరం. వందమందికి తెలిస్తే వంద ఓట్లు అనుకోడం ఒక ఎత్తు. అదే పనిగా రాత్రీ పగలూ సుత్తి పెట్టడం మరో ఎత్తు. వాళ్ళు ఖర్చు పెట్టేదంతా మనతలలు తినేయడానికే. రోజుకు ముప్ఫై గంటలు వాగే రేడియోలూ టీవీలు నీకూ నాకూ బోధించే పరమోత్తమ పాఠం ఆయన్నో ఆవిడనో గద్దె ఎక్కించమనే కదా. ఆ పైన నువ్వూ నేనూ హుష్ కాకీ అయిపోతాం. నన్నడిగితే, ఆ డబ్బు ఏ దానధర్మాలకో ఇయ్యి, నీకు ఓటేస్తాను అని చెప్తాను. నన్నడగరనుకో, అది వేరే సంగతి.

అమెరికాలో కథ ఇది. ఇండియాలో కూడా ఇలాగే ఉందో లేదో నాకు తెలీదు. కానీ మొత్తమ్మీద ప్రకటనలపేరుతో నాకు నేను ఆలోచించుకోడానికి వీల్లేకుండా చేన్నారన్నది మాత్రం కఠోరసత్యం. వ్యాపారాలు అంతే రాజకీయాలు అంతే. రాజకీయవ్యాపారాలూ అంతే.

ఇవాల్టికింతే సంగతులు. రేపు కనిపిస్తావు కదూ, ఇంకొన్ని కబుర్లు చెప్తాను.

ఉంటాను మరి.

—-

(జనవరి 21, 2016)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “మనలో మనమాట – 1. చెప్పొచ్చేదేమిటంటే”

 1. “టీవీ, రేడియోలు ఉన్న సుఖము వానిని కట్టివేసినపుడు తెలియును” అని మాకు తెలిసిన పెద్దయ నొకరు అంటుండేవారు..హి హి

  Liked by 1 వ్యక్తి

 2. > ఆ ప్రకటనలు ఇవ్వడానికి అదీ సమయం అని ఏ ప్రబుద్ధుడికి తోచిందో నాకు ఈ జన్మలో అర్థం కాదు.
  మీ ఈ‌టపా చదివాక ఈ వృత్తాంత‌ం ప్రస్తావించాలని అనిపించింది. ఇది మా చిన్నతమ్ముడి చిన్నప్పటి ఘటన. అప్పట్లో దూరదర్శన్ తప్ప వేరే ఛానెళ్ళు లేవు. ఒకరోజు భోజనాలు చేస్తూ ఉంటే వాడు గట్టిగా అరిచాడు ‘అమ్మా ఆ టీవీ‌ కట్టెయ్. అన్నాలు తింటుంటే‌ ఎప్పుడూ పురుగుల్ని చూపిస్తాడే’ అని. దూరదర్శన్ వాళ్ళకి రాత్రి అందరూ‌ భోజనాలు చేసే సమయంలోనే చేలను ఆశించే పురుగులమీద కార్యక్రమాలు వేయటం ఎలా సరదాగా ఉండేదో‌ మరి!

  ఇష్టం

 3. బాగుందండీ మీ యాడుల ప్రహసనం🙂

  యాడులు గనరే అందున
  మూడు విషయములు జరూరు మూడుని మార్చూ
  జోడుగ తలబోవు;మరియు
  వేడుదు రుగొనుమ నిచట్టు వేగమె బోవన్

  జిలేబి !

  Liked by 1 వ్యక్తి

 4. Adblock సరిగా పని చెయ్యడం లేదండి. ఇంకా కొన్ని వస్తూనే ఉన్నాయి. రెండు మూడు బ్లాకులు ప్రయత్నించేను. అందులోనూ తమాషా ఏమిటంటే, రెండు లాప్టాపులు ఉన్నాయి. ఒకే కంపెనీ, ఒకే OS. ఒక దాంట్లో రావడంలేదు ప్రకటనలు కానీ రెండోదాంట్లో కొన్ని దర్శనమవుతూనే ఉన్నాయి. మ్.

  ఇష్టం

 5. నేనయితే అసలు టీవీ చూట్టం మానేసాను, నెట్టులో adblock ఉండనే ఉంది.

  ఇష్టం

 6. హాహా. అది నాకు చేరడం లేదని వాళ్ళకి తెలీడం లేదు. ప్రకటన వచ్చినప్పుడల్లా నేను ఛానెల్ మార్చేస్తాను. లేదా మరో గదిలోకి వెళ్ళి మరో పని చూసుకుంటాను.

  ఇష్టం

 7. ప్రొడక్టు మీద కన్నా ప్రకటనకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంత పోటీ మరి వ్యాపారంలో పాపం వాళ్ళుమాత్రం ఏమి చేస్తారు…ఏదో విధంగా మిమ్మల్ని చేరటమే కదా వాళ్లకి కావాల్సింది

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s