మా మే స్త్రీత్వమ్

ఆకునంటిపెట్టుకుని గూడు కట్టుకున్న గొంగళిపురుగులా భూదేవిని నమ్ముకుని పడుకున్న ఆ ఊరిప్రజల్లో చలనం కలిగించగలిగినవి చాలా తక్కువ. ఎలక్షన్లవంటి ప్రాపంచికవిషయాలూ, బాలయోగులవంటి ఆముష్మికచింతనలకూ కూడా అతీతులు వాళ్ళు. కళ్ళెదుట ఖూనీ జరిగితే ఓమారటు చూసి చుట్ట వెలిగించుకు వెళ్ళిపోయే జాతి అది. అక్కడ అన్యాయం లేదు. ఎందుకంటే ఎవడూ ఎవణ్ణీ కొట్టడు కనక. అక్కడ న్యాయం లేదు. ఎందుకంటే ఎవడికైనా దెబ్బ తగిలితే రెండోవాడు కలగజేసుకోడు కనక. స్వర్గమూ నరకమూ రెండూ తెలీవు వాళ్ళకి.

ఆ స్తబ్ధజగతిలో కించిత్ చలనం కలిగించింది ఆమె రాక. ఆమె అక్కడికి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలీదు. ఒకానొక సుప్రభాతాన ఊరు ఆవులించి కళ్ళు విప్పితే ఆమె కనిపించింది. అంతే.

“ఎవరు నువ్వు?” అని ఎవరూ అడగలేదు. ఊరిచివర కూలిపోతున్న పాడు దేవాలయంలో ఆమె పాతచీర పరుచుకుని పడుకుంటే ఎవరూ కాదనలేదు.

మర్నాడు స్నగ్ధత్వం విరిసే కన్నులతో, చిరునవ్వులొలికే వదనంతో వీధిలోకి వచ్ిచంది. ఆ వీధుల్లో ఎవరూ కొంపలంటుకుపోతున్నట్టు పరుగులు పెట్టడం లేదు. పని గట్టుకుని 144 సెక్షను వ్యతిరేకిస్తున్నట్టు రోడ్డుకడ్డంగా సైకిళ్ళు పట్టు నిలబడి అప్రస్తుతాలు చర్చించే గుంపులు లేవు. ఆమె ముందుకి సాగిపోతూనే ఉంది.

ఒకచోట ఆగింది. అక్కడ ఒక లేగదూడ పడి లేవలేక అవస్థ పడుతోంది. ఆమె చుట్టూ చూసింది. ఎవరూ లేగదూడని గమనించినట్టు లేదు. తనే వెళ్ళి మెల్లిగా దాన్ని లేవదీసింది. అతికష్టంమీద దాన్ని ఇంటికి చేర్చింది.

దారిలో ఒకరిద్దరు ఆమెని వింతగా చూసేరు. “నీకెందుకు ఈ బాధంతా?”

ఆమె మౌనంగా సాగిపోయింది. ఇంటికి దాన్ని తీసుకెళ్ళి ఆకుపసరు రాసింది. రెండు రోజులు పట్టింది దూడ లేచి తిరగడానికి. మూడోరోజు దూడయజమాని వచ్చి దాన్ని తోలుకుపోయేడు. వెళ్తూ వెళ్తూ తన విశాలమైన కళ్ళతో ఓమారు ఆమెవేపు చూసి వెళ్ళిపోయింది ఆ లేగదూడ.

000

మరొకరోజు, చాలా రోజులతరవాత, అలా వెళ్తుంటే ఒక పదేళ్ళకుర్రాడు ఏడుస్తూ కనిపించేడు.

“ఎందుకేడుస్తున్నావు?” అని అడిగింది ఆవిడ.

“నీకెందుకూ?” అన్నాడు ఆ కుర్రాడు.

“అవును. నీకెందుకూ?” అంది ఆ కుర్రాడిపక్కనే ఉన్న తల్లి.

“ఊరికే అడిగేను,” అంది ఆమె మందహాసంతో.

ఆ కుర్రాడూ, తల్లీ ఇద్దరూ ఆశ్చర్యపోయేరు.

“మాయింటికి వస్తావా?” అంది ఆమె.

“సరే”నని ఆ బాలుడు ఆమెననుసరించేడు.

ఇది కొత్త విషయమే. అయినా అందరికీ సహజంగానే తోచింది. ఆ కుర్రాడు వరసగా వారంరోజులు ఆమెయింటికి వెళ్ళేడు.

ఒకరోజు అడిగేడు, “ఎందుకు నన్ను ఇలా రమ్మంటున్నావు?” అని.

“నాకు నీలాటి కొడుకు ఉండేవాడు. నిన్ను చూస్తే వాడిని చూసినట్టు ఉంటుంది,” అని ఆమె సమాధానం చెప్పింది.

“ఓహో,” అన్నాడు కుర్రాడు సరిగ్గా అర్థం కాకపోయినా.

ఊళ్ళో అందరూ కొత్తమ్మ కోరుకున్నకొడుకు అని అతన్ని హేళన చేసేరు.

వాడికి రోషం వచ్చింది. ఆమెయింటికి వెళ్ళడం మానేశాజు. ఆరాత్రి ఆమె కన్నీటితో కనిపించింది, “మాయింటికి ఎందుకు రాలేదు?” అని అడిగినట్టనిపించింది. నిద్ర లేవగానే పరుగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళేడు.

ఆమె చెంపన చేయి చేర్చి దిగంతాల్లోకి చూపులు నిగిడ్చి చూస్తూ కూర్చుని ఉంది.

“నేనొచ్చేనమ్మా!” అన్నాడు ఉవ్వెత్తుగా పొంగుతున్న గుండెలను కంఠస్వరంలో విశదం చేస్తూ.

ఆమె అతడివేపు తిరిగింది, “ఫో, ఫో. ఎందుకొచ్చావ్. ఇక్కడేం దాచిపెట్టేవా రోజూ రావడానికి? నేనేమేనా నీకు అచ్చున్నానా నీకు చేసిపెట్టడానికి .. వేలు చూపితే మండ మింగే రకాలు. ఛీ. ఛీ. ఇంకెప్పుడూ ఈచాయలకు రాకు.”

అబ్బాయికి అంతా అయోమయంగా ఉంది. ఆమెమాటలు ఏమీ అర్థం కాలేదు. “ఫో” అన్న మాట ఒక్కటే తెలిసింది. వాడు గిరుక్కున తిరిగి వెళ్ళిపోయేడు. దారిలో ఓ చెట్టుకింద కూచుని ఏడిచేడు కొంచెంసేపు.

తలెత్తి చూస్తే ఆమె రెండు పూతరేకులు పట్టుకుని నించుని ఉంది. “ఇంద,” అంది.

“నాకేం అఖ్ఖర్లేదు,” అంటూ లేచి పరుగెట్టుకు వెళ్ళిపోయేడు.

“పోతే ఫో. బ్రతిమాలితే గీరెక్కువవుతుంది. పుణ్యానికి పుట్టెడు బియ్యం ఇస్తే పిచ్చకుంచంతో కొలిచేవని పోట్లాడిందిట. నేనేమీ ఎవరికీ ఋణపడిలేను,” అంటూ ఆమె గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

క్రమంగా ఆమెనుగూర్చి ప్రజలు గుంపులు గుంపులుగా చేరి చెప్పుకోసాగేరు. “ఎవరెలా పోతే నాకేం?” అన్న భావం మంచులో విడిపోతోంది. ప్రతివాళ్ళూ మాటసాయం కావాలనో పనిసాయం కావాలనో ఆమెదగ్గరికి వస్తున్నారు. ఒక మంచిపని చేసి “కొత్తమ్మ”తో గొప్పగా చెప్పుకునేవాళ్ళు అనేకులు ఉన్నారు.

ఒకొప్పుడు ఆమె హర్షం వెలిబుచ్చుతుంది. ఒకొకప్పుడు “అదీ గొప్పేనా?” అంటూ తేల్చిపారేస్తుంది. మరోసారి, “అలా కాదు, ఇలా చెయ్యాలి,” అని చెబుతుంది. లేదా తనే చేసి చూపిస్తుంది. ఒకమారు పాలమనిషి ఆము కొమ్ము విసిరి మంచం పట్టిందని వాళ్ళింట్లో వారంరోజులుండి సేవ చేసిందిట. మరోరోజు నారపరాజుగారి చిన్నకోడలు “కాస్త నలతగా ఉంది. చూసి పో,” అని కబురు చేస్తే, “ఏం కావరం ఇంటికి రమ్మని కబురు చేయడానికి. ఫో, ఫో. రానని చెప్పు,” అని కసిరికొట్టిందిట. అయినా ఆమె అంటే అందరికీ ఎనలేని ఆపేక్షా, భయమూను. ఒకమారు కాకపోతే ఒకమారైనా ఎక్కువ చనువు చూపగలిగింది అబ్బాయి ఒక్కడే. వాటికి ఆమె కసుర్లూ, విసుర్లూ, ఆగ్రహమూ, అనుగ్రహమూ – అన్నీ ఒకటే. ఒక్కొక్కమారు వాడికి రోషం వస్తుంది. కోపం వస్తుంది. అవన్నీ వాడు ఆమెదగ్గర్నుంచే నేర్చుకున్నాడు.

అలాగ రోజులూ, వారాలూ, నెలలూగా నాలుగు సంవత్సరాలు జారిపోయేయి. అబ్బాయి కొంచెం పెద్దవాడయేడు. ఆమెలో కొంచెం వార్థక్యపుఛాయలు కనిపిస్తున్నాయి. ఊళ్ళో ఉత్తేజం కనిపిస్తోంది.

ఆరోజు పోలేరమ్మావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన పర్వదినం. అబ్బాయి అప్పటికి నాలుగు రోజులుగా అమ్మదగ్గరికి వెళ్ళలేదు అలిగి. అదే మరోసందర్భంలో ఐతే ఆమె స్వయంగా వచ్చి పిలుచుకు వెళ్ళేది. కానీ ఈమారు రాలేదు. అబ్బాయికి ఓర్పు నశించింది. ఏ విషయం ముఖాముఖీ తేల్చుకోవాలనుకున్నాడు. విసురుగా లేచి నిముషాలమీద ఆమె జీర్ణకుటీరం చేరుకున్నాడు. అక్కడ ఆమె ఒంటరిగా లేదు. ఒక బాలుడిని అక్కున చేర్చుకుని లాలిస్తోంది. నెన్నుదురు మృదువుగా చుంబిస్తోంది. వాడి చెంపలు నిమురుతోంది.

ఒక మధ్యవయస్కుడు ఇదంతా ఇష్టం లేనట్టు గవాక్షం దగ్గర నిల్చుని సుదూరాల్లోకి చూస్తున్నాడు. ఆగి ఆగి తూచినట్టు ఒక్కొక్క మాటే పలుకుతున్నాడు, “జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వచ్చేయమ్మా అంటే నీకెందుకింత పట్టుదల? నిన్నేమైనా నేనక్కడ రాళ్ళు మొయ్యమన్నానా? అదీ నాకోసం అయితే నేనింతగా పాకులాడనే ఆడను. .. ఆ పసివాడికోసం … ఇంతకీ నీకు … మాకంటే .. ఈ పసివాడికంటే వీళ్ళే ఎక్కువయిపోయారు.” చివరిమాటలు అంటుంటే అతడికంఠం గద్గదమయింది.

“చాల్లే, మాటలు నేర్చేవు,” అని కసిరింది ఆమె. కానీ ఆ స్వరంలో కాఠిన్యంకంటే మార్దవమే హెచ్చు. గెలుపెవరిదో తెలిసిపోయింది.

అబ్బాయి గిరుక్కున వెనక్కి తిరిగేడు. ఝంఝంమారుతంలా ఊరివేపు సాగి, దారిలో చెట్టుకింద ఆగేడు. అదనికన్నులలో ఎరుపుజీర మెరుస్తూంది. హృదయం తీవ్రంగా కొట్టుకుంటూంది. “సరే, సరే” అనుకుంటూ కదలిపోయేడు. దారిలో అడిగనవాళ్ళకీ అడగనివాళ్ళకీ వివరించి చెప్పేడు. కనిపించనివాళ్ళకి కబురు చేసేడు. కొందరు అతన్ని ఓదార్చేరు. కొందరు అతన్నే చీవాట్లు వేసేరు. మరి కొందరు ఉచిత సలహాలు ఇచ్చేరు.

అబ్బాయికి తోచడంలేదు.

ఏదో అన్యాయం జరుగుతోంది.

అదేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.

మాటలు దొరకడంలేదు.

తమస్సు కమ్ముకొస్తోంది.

లోకం నిద్రకొరిగింది.

… …  …

“అమ్మా!” చీకట్లు చీల్చుకు ఒక పసివాడి ఆక్రందన దిక్కుల పిక్కటిల్లింది.

జరిగింది తనకి తెలీదంటూ కర్మసాక్షి అప్పుడే ఉదయించేడు.

ఆమె గదిమధ్య నిలబడి ఉంది నిశ్చలంగా.

మంచంమీద పసివాడు నీరసంగా పడి ఉన్నాడు.

వాడిని తీసుకువచ్చిన మధ్య వయస్కుడు దూరంగా గోడనానుకుని నిల్చుని ఉన్నాడు.

గోడవతల అబ్బాయి పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు.

ముగ్గురు మూర్ఖులు ఆమెపాదాలు పట్టుకు వదలడంలేదు. “నువ్వు క్షమించాను అన్నదాకా మేం వదలం. క్షణికమైన ఆవేశాలకు లొంగిపోయేం. మావంటి పాపాత్ములు లోకంలో మరి ఉండరు. మా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. చెప్పు తల్లీ, ఏ శిక్ష అయినా అనుభవిస్తాం. నీ కోపాగ్ని మాత్రం భరించలేం. … చెప్పు .. క్షమించు.”

ఆమె వాళ్ళవేపు చూసింది. వీళ్ళని ఈ స్థితికి తెచ్చిందెవరు?

మంచంమీద పసివాడివేపు చూసింది. “నాకెందుకు ఈ శిక్ష?” అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది ఆమెకి.

కనురెప్పలు బరువుగా కదిల్చి కుడివేపు గోడవారకి దృష్టి మళ్ళించింది.

“ఇప్పుడేం చెయ్యగలవు?” అని నిందిస్తున్నాడు అతను మౌనంగానే.

ఆమె కనులు మూసుకుంది. మనోఫలకంపైన అబ్బాయి చిత్తరువు అస్పష్టంగా కదిలింది. ఆమె పెదవులు కదిలేయి.

భగవాన్!

మా మే స్త్రీత్వమ్

మా మూర్ఖత్వమ్

మిధ్యా దృష్టిర్మా ..

జాతౌ జౌతౌ … మా మే స్త్రీత్వమ్ …

000

(అక్టోబరు 1966 కృష్ణవేణి మాసపత్రికలో ప్రచురితం.)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మా మే స్త్రీత్వమ్”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s