మనలో మనమాట 2 – ఔతె నివ్ కుసింత ఎక్కవ సమానంవంటవేటి?

మాటకి మాట అచ్చంగా అవే మాటలు అనలేదు సంద్రాలు. ఏమిటందో తరవాత చెప్తాను. ముందు ఈ ఎక్కువతక్కువలగురించి కొంచెం చెప్పుకుందాం.

పిల్లని “ఇచ్చేచోట పైమెట్టూ, తెచ్చుకునేచోట కిందిమెట్టూ” చూడమంటారు. ఓ మెట్టు పైనున్నవారింట పిల్ల సుఖపడుతుంది. ఓ మెట్టుకింద అయితే అణకువగా ఉంటుంది అని. అసలు ఈ ఎక్కువతక్కువలు – చిన్నా పెద్దా, పొడుగూ పొట్టీ, బలవంతులూ అర్భకులూ, పండితులూ అపండితులూ – అన్నీసృష్టిలోనే అమర్చబడి ఉన్నాయి. పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటే చీమ నుండి బ్రహ్మాండంవరకూ అని. చీమ చాలా అల్పజీవి కనకనే కదా చీమనించీ అన్నది. అలాగే కయ్యమూ వియ్యమూను. అవి సరి తూగాలంటారు కానీ మనం అందరం అనుక్షణమూ పైమెట్టూ కిందిమెట్టూ లెక్కలేసి చూసుకుంటూనే ఉంటాం, మాటల్లో చెప్పినా చెప్పకపోయినా.

వియ్యాల్లాటివే నెయ్యాలూను. నాకంటే ఎక్కువ తెలిసినవారితో స్నేహం చెయ్యాలని నేను ఆశ పడతాను. వాళ్ళదగ్గర్నుంచి నేను తెలుసుకోగల సంగతులు ఎక్కువ ఉంటాయి కనక. అలాగే నాకు తెలిసినపాటి అయినా తెలీనివారు నాస్నేహం కోరడంలో కూడా ఆశ్చర్యం లేదు. అంతా అదే కాదులే. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. మన్లో మాట సంద్రాలుమాటల్లో తెనుగు బాగుంటాదని ఆమెమాటలు వింటార్ట! అలా అని విన్నాను మరి.

అయితే ఈ ఎక్కువతక్కువలు రాతిమీద చెక్కడాలు కావు. ప్రతి నెయ్యమూ సమయాన్నిబట్టీ సందర్భాన్నిబట్టీ అడుగడునా మారిపోతూ ఉంటుంది. ఏ ఇద్దరిస్నేహం తీసుకున్నా, సందర్భాన్నిబట్టి పైనా కిందా అవుతారే కానీ ఏ ఒక్కరూ పైమెట్టుమీదే తిష్ఠ వేసుకుని కూర్చోడం జరగదు. అలా జరిగితే ఆ స్నేహం అట్టే కాలం నిలవదు.

పన్యాల రంగనాథరావుగారు “అంతస్తులు” అని ఒక కథ రాసేరు. 1952లో భారతిలో వచ్చింది. ఆ కథ ఇప్పటికీ నాకు గుర్తుండడానికి కారణం కథలో ప్రధానాంశం ఇందాకా చెప్పిన మాటే. చిన్ననాటి స్నేహితులు ఇద్దరు ప్రధానపాత్రలు. ఒకరు సాంఘికంగా అంచెలంచెలుగా పైమెట్టుకి ఎగబాకిపోయేరు. పెద్ద ఉద్యోగం, పలుకుబడి, కారూ, మేడా అన్నీ చక్కగా అమిరేయి. పైకొచ్చేడు అన్నమాటకి మచ్చుతునకలా అన్నమాట. రెండోవాడి పరిస్థితి పరమ హీనంగా ఉంది. ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తాడేమోనని, మిత్రుడిని సాయం అడగడానికి వస్తాడు. ఆ మిత్రుడు మంచివాడే. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు. తప్పక సహాయం చేస్తానని మాటిస్తాడు. ఉద్యోగం వచ్చేవరకూ తనఇంట్లో ఉండమంటాడు. ఆ తరవాతి కథే అసలు కథ. సాయం అడగవచ్చిన వాడికి ఆ స్నేహితుడు అన్న ప్రతిమాటలోనూ హెచ్చుతగ్గులు కనిపించి కలవరపెడతాయి. కారులో తిరుగుతున్న స్నేహితుడు తన పాత సైకిలు అతన్ని వాడుకోమంటాడు. నాకు కథంతా వివరంగా జ్ఞాపకం లేదు కానీ సహృదయంతో సాయం చేయడానికి తలపడ్డ స్నేహితుడి ప్రతి మాటా, ప్రతి వాక్యంలో తన “కింది మెట్టు” కనిపిస్తుంది ఆ కథానాయకుడికి. అతనికి అర్థం కాక కాదు. మనసు తలతో ఆడే ఆట అది. ఆ మిత్రుడికి ఉత్తరం రాసో, ముఖాముఖి చెప్పో నాకు సరిగా జ్ఞాపకం లేదు కానీ ఏదోవిధంగా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ నాకు అంతగా మనసున హత్తుకోడానికి కారణం మనస్తత్వాలవిషయంలో రచయిత అవగాహన. రెండో అతనికి ఆత్మన్యూనతాభావము అంటూ తీసి పారేయకు. మనస్తత్వం లోతుగా పరిశీలించినవారికి మాత్రమే తెలుస్తుంది ఇది. “ఛీ ఛీ ఇది ఆత్మన్యూనతాభావము, నేనిలా అనుకోకూడదు, పాపం వాడు మంచితనంతోనే చేస్తున్నాడు” అని తెలుసుకున్నా – నిజానికి కథలో అదే జరిగింది – దాన్ని కాదని సమాధానపడడం మాత్రం తేలిక కాదు.

చెప్పొచ్చేదేమిటంటే, స్నేహంలో ఈ కిందామీదా అడుగడుగునా సవరించుకుంటూ, సమర్థించుకుంటూ పోవడం తాటిమీద సాములాటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నాపట్నం చెరుకు ముక్కా నీకో ముక్కా నాకో ముక్కా అని పాడుకున్నట్టు నువ్వోమారూ నేనోమారూ అని ఖచ్చితంగా చెప్పలేవు నువ్వు. నీకూ తెలుసు కదా సమయాన్ని బట్టి సర్దుకుపోతూ, రంగం చదును చేసినప్పుడే స్నేహం నిలుస్తుంది. ఇది అరుదే కానీ కలకాలం స్నేహాన్ని నిలిపేది కూడా అదే.

నేనిలా ఏవో పనికిమాలిన ఊహల్లో పడి కొట్టుకుంటుంటే హఠాత్తుగా ఓవేపునించి మారుని గన్న వీరభద్రునివలె వగరుస్తూ వచ్చి నాపక్కన కూలబడింది సంద్రాలు.

ఏమైందని అడగబోయేను.

“మాటాడక, నాకసలే మండిపోతన్నది,” అంటూ కసురుకుంది.

నోరు ఠక్కున మూసేసుకున్నాను. మాటాడొద్దన్నతరవాత ఏమైందని మాత్రం ఎలా అడగను?

గుక్కెడు నీళ్ళు తాగితే చల్లారుతుందేమోనని నీళ్ళకోసం లేవబోయేను.

“యాడికి?” అంది మళ్ళీ ఉరిమి చూస్తూ.

నాకు ఏం చెయ్యాలో తోచలేదు. సంద్రాల్ని ఈ అవతారంలో నేనెప్పుడూ చూళ్ళేదు మరి.

“నానూ నివ్వూ సమానఁవేనా?” అంది నన్ను గుచ్చి చూస్తూ.

ఇదేదో పరీక్ష కాబోలు, ఆ ప్రశ్నలో ఏదో మెలిక ఉంది కాబోలు అనుకుని ఆలోచిస్తూ సంద్రాలుమొహంలోకి తేరి చూసేను.

“నీకు తెలీదేమిటి?” అన్నాను గోడమీద పిల్లి వాటంగా.

సంద్రాలు పళ్ళు గిట్టకరిచి అటూ ఇటూ చూసి, అడిగింది మళ్ళీ, “నాను సేసీపనీ నివ్ సేసీపనీ సమానంవేనా?”

“సమానఁవే,” అన్నాను. అందరూ అంటారు కదా అని అన్నానే కానీ నాకామాటలో నమ్మకం లేదు. నీకూ తెలుసు కదా ఈ రోజుల్లో విలువ కడుతున్నది పనికి కాదు మనిషికి అని. అది కూడా అణాపైసల్లోనే. ఎవడిదగ్గర ఎక్కువ పైసలుంటే ఉంటే వాడే జగద్విజేత.

పావుగంట అయింది. పొగలు కక్కుతూ సంద్రాలూ, బిక్కుబిక్కుమంటూ చూస్తూ నేనూ కొంచెంసేపు గడిపేం.

“నీకు సెప్పేనా మనూర్నుంచే ఓ బొట్టొచ్చినాది అదేదో సదుగంట. మూన్నెల్లుంటాదన్నడు దొరబాబు,” అంది ఆఖరికి గుక్క తిప్పుకుని.

“ఆహా, అలాగా.”

“ఆ యమ్మవోటం నాకు మా సిరాగ్గున్నాది.”

నాజాగ్రత్తలో నేనుండాలి కనక నాకు మౌనమే శరణ్యం.

“కాపీ సేస్తానా. నాకు సెయ్ ఉసుల్నేకపోతే మా దొరబాబయితే ఆయినే వొచ్చి తీసుకుంతరు. ఈ యమ్మ అనాగ కాదు. ఆంవె కూసున్నసోటికి నాను ఒట్టికెల్లి సేతికియ్యాలంట. బల్లమీదెట్టినా సాల్దంట, సేతికే ఇయ్యాలంట.”

“ఓ,” అన్నాను స్వరం బాగా తగ్గించి.

“అది గాదు. మల్ల మాటలేంవో సెప్తాది నివ్వూ నానూ అందురుంవూ సమానంవే అంటా ఒదలకండ సేవనమాసంలో ఒరసాలు కురుస్తయి సూడు అనాగే ఇడకండా రొద.”

ఇప్పటికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. “పోన్లెద్దూ. ఒక్కొక్కళ్లు ఒక్కొక్క రకం అని నీకూ తెలుసు కదా” అన్నాను జంకుతూనే.

“అస్లు నివ్వూ నానూ సమానఁవే అంటది ఆయమ్మ. నాను సేసీ పనీ నివ్వు సేసీ పనీ సమానఁవే అంటది. మరి అందురుంవూ, అన్ని పన్లూ సమానఁవే ఔతే ఆయమ్మ నొచ్చి నాయింట బొచ్చలు కడగమను, నా సీరెలుతకమను. నాకు ఆరిచ్చీ సొమ్మే నానిస్తను ఆయమ్మకి.”

“హాఁ!!!” గుండె ఎగిరిపడి గొంతులో గిలగిల్లాడింది.

“ఏఁవీ? ఆరూ నానూ సమానఁవే అయితే ఆయమ్మొచ్చి నాయింట బొచ్చెలేల కడగరాదూ?”

నాకు పది నిముషాలు పట్టింది తేరుకుని ఆలోచించి సమాధానం చెప్పడానికి.

“అది కాదు. నువ్వు చేసేపని ఆవిడ చేయగలదులే. అది కష్టం కాదు. కానీ ఆవిడ చేసేపని నువ్వు చెయ్యలేవు కదా. అలా చూస్తే ఆవిడ చేసే పని ఎక్కువే కదా మరి,” అన్నాను.

“ఏరవుతాది గానీ ఎక్కవెట్టౌవుతాది?”

హా!!!

“హా. బాగా అడిగేవు. నిజమేలే. … కానీ నువ్వు … అదేలే … మనం మరోమాట కూడా ఆలోచించాలి. మాటవరసకి ఆవిడ నీఇంట గిన్నెలు కడగడానికి వస్తుందనుకో. నువ్వు ఇచ్చే డబ్బు ఆవిడ ఇప్పుడు చేస్తున్న పనిమూలంగా తెచ్చుకుంటున్న ఆదాయంతో సమానం కాదు కదా. అంటే ఆవిడకి నీఇంట పని చేస్తే, ఆ ఆదాయంలో నువ్విచ్చిన మొత్తం తీసేసినా, ఇంకా ఆవిడకే నష్టం. అంచేత …” అంటూ నీళ్ళు నమిలేను. నాకు తెలుసు నా తర్కంలో లోపం. సంద్రాలు ప్రశ్న అది కాదు. కానీ ఏం చెయ్యను? ఒప్పుకోడానికి మనసొప్పదు కానీ నేనూ “ఆ గుంపు”లో మడిసినే, ఆ గూటి చిలకనే. నాకొచ్చినవీ ఆ పలుకులే మరి!

“అయినా ఆమధ్య కొందరు బీదలు ఎలా బతుకుతున్నారో అనుభవించి తెలుసుకోడానికి తాము కూడా అలాటి తిండి తింటూ బతకేరుట వారం రోజులు,” అన్నాను నన్నూ, నాలాటివారినీ రక్షించుకోడానికి.

“వోరం, నెలా సేస్తే ఏటి నాబం. పేపరల్లోనూ టీవీలోనూ బొమ్మలొస్తయి. అందురూ జయ్ జయ్లు కొడతరు. నిజింగా ఆరికీ ఎరికే ఆ ఓరంవో నెలో అయిపోనాక బోజినాలు మమ్ములే.”

నాకు మాట తోచలేదు.

సంద్రాలే మళ్ళీ అందుకుంది, “నాకస్లు ఎందుకు మంటెత్తుతాదంటె ఈలంతా కూలీ నాలీ సేసుకునీవోల బతుకులు బాగుపడాల అని అరస్తరు. సంగ సంస్కరన్లు అంతరు. మాం మంచి సీరె కట్టినా, సెల్పోనులట్టుకున్న ఎక్కిరిస్తరు. మరి సమానఁవే ఔతే మీనాగే మాం మాతరం అయన్నీ అనుబగించరాద? ఆ ఎకసెక్కాలేటి మల్ల?”

“ఛ ఛ. ఎకసెక్కాలేం లేవు. ఎవరూ అలా అనడం లేదు,” అన్నాను గబగబ.

“బుకాయించక. నాకు తెల్సులే. మాయప్ప* కతలు రాస్తదన్సెప్పితి గదా. సదూతది గూడ. అదే సెప్పింది నీలాటోల్లు కతలు కతలు సెప్పుకు నవ్వుకుంతరని.”

“అబ్బే నువ్వలా అనుకోకు. నివ్వు నన్ను కసిర్తే స్నేహంతోనే కదా. అవీ అంతే,” అన్నాను సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.

సంద్రాలుకయితే సమాధానం చెప్పేను కానీ నన్ను వేరే ఆలోచనలు చుట్టుముట్టేయి. ఔను. అందరూ సమానమే, రోజుకూలీ అయినా విశ్వవిద్యాలయాలలో ఆచార్యులైనా శ్రమ శ్రమే అంటూ గొంతులు చించుకుంటారు. తీరా విలువ కట్టడానికొచ్చేసరికి అది వేరు ఇది వేరు. నేను చూసేను యూనివర్సిటీలో చెప్పే పాఠాలు ఒకటే అయినా ప్రొఫెసరు ఆయనకిచ్చే జీతంలో నాలుగోవంతు కూడా ఉండదు స్టూడెంటు అసిస్టెంటు చెప్తే. అడుగడుగునా మనిషివిలువలు నిర్ణయమవుతూనే ఉంటాయి ఏదో రకంగా, సమానంగా మాత్రం కాదు.

కాయకష్టానికున్న విలువ బుద్ధిబలానికున్న విలువతో సమానం కాదు. తెలివి మీరిపోయిన ఆధునిక సమాజంలో ప్రతి పనికీ విలువయితే ఉంది కానీ ఆ విలువ బుద్ధిమంతుల లెక్కప్రకారమే. అది అణాపైసల్లోనే విదితమవుతుంది.

విస్కాన్సినులో రాష్ట్రప్రభువులు సిగరెట్ కంపెనీమీద దావా వేసినప్పుడు వారి న్యాయవాదులు గంటకి 2700 డాలర్లచొప్పున లెక్క కట్టేరు వారి శ్రమకి విలువ. ఆ అంకె ఎలా నిర్ణయించేరో నాకు తెలీదు కానీ మొత్తంమీద ఊళ్ళో ప్రజలు అక్కులు నొక్కుకున్న మాట మాత్రం నిజం.

000

సంద్రాలు లేచింది వెళ్ళడానికి. నాలుగడుగులేసి, వెనక్కి తిరిగి నామొహంలోకి చూస్తూ అంది, “మల్ల మాదొరబాబుతో అనక. ఆరికి అనాటి బుద్దుల్నేవు. ఆయ్న దరమాత్ముడు.”

నేను తలూపేను దిగజారిపోతున్న గుండెలు చిక్కబట్టుకుని.

000

*  అప్ప పాత్ర ఇక్కడ పరిచయం చేయడం జరిగింది.

000

(జనవరి 29, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మనలో మనమాట 2 – ఔతె నివ్ కుసింత ఎక్కవ సమానంవంటవేటి?”

  1. సంద్రాలు ప్రశ్నలు వింటుంటే గుండె దడగా ఉంది. కొరడా చరచినట్లు ఉంది మాలతీ గారు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s