మనలో మనమాట 3 – దురలవాటుకి విరుగుడు

(గుర్తుంచుకో: 1. తెలుగులోనే రాయాలన్న పట్టుదలతో కొన్ని కొత్తవి సృష్టించడం జరిగింది ఇక్కడ. 2. మనసులో అనేక పొరలు. మొదటిపొరలో కథ జరుగుతుండగా, రెండో పొరలో కలిగే ఆలోచనలు కుండలీకరణంలో ఉన్నాయి.)

ఏదైనా మప్పొచ్చు కానీ తిప్పలేం అనేది మాఅమ్మ. అలవాటవడం తేలిగ్గానే అయిపోతుంది. దాన్ని వదిలించుకోడానికే నానా అవస్థాను. అలవాటు మితి మీరితే దానికి “ప్రతిపచ్చ ఆలోసిన సేసి” అరికట్టడానికి విరుగుడు అనేక విధాలు. గంటకి మూడు నాలుగు వందలు పుచ్చుకు మందులు రాసిచ్చే వైద్యశిఖామణులు ఉన్నా, ఎవరికి వారు కొంత ఆలోచనలు చేసి అలవాట్లను వదిలించుకోడానికి ప్రయత్నించవచ్చు. నేను ఎప్పుడూ ముందు నాకు నేను చేసుకోగల వైద్యసహాయం చూసుకుని, నావల్ల కాదని నూటికి నూరుపాళ్ళు తెలిసినతరవాతే ధన్వంతరిని శరణు. ఈకథ విస్తరించడానికి ముందు నాదినము ఎలా మొదలవుతుందో చెప్పాలి.

కనుచీకటి ఉండగానే, లేచి మామూలు అవసరాలు గబగబ ముగించేసుకుని వేడి వేడి కాఫీ కప్పు కుడిచేత పుచ్చుకు, సోఫాలో సుఖాశీనురాలినై టీవీ, లాప్టాపూ తెరుస్తాను. టీవీలో ప్రకటనలు లంకించుకోగానే మెరుపులతో వెలిగే లేఖలూ మెరికల్లాటి కతలూ చూస్తాను. టాపు తెరవగానే తెరమీద ఎదురయేవి లంకెలమీద లెంకెలూ, కొత్తగా ప్రాణం పోసుకున్న పాత “పుటోగ్రాఫులూ”, సభలూ, సంతర్పణలూ పంచుకోళ్ళూ తలమునకలుగా ప్రత్యక్షమవుతాయి. పది బొమ్మలు కనిపిస్తే, అందులో ఒక బొమ్మలో నాకు తెలిసినవాళ్ళు ఒకరు కనిపిస్తే గొప్ప. లింకులయితే అసలు అవేమిటో కూడా తెలీదు. అంచేత వాటిని కప్పదాటులేసుకుంటూ జయజయహో అనుకుంటూ ముందుకు పోవడమే. అలా జల్లెడ పట్టడం మొదటి మెట్టు.

మరో మాట – టీవీలో ప్రకటనలసమయమే టీవీ మూసేయడానికి కూడా తగు సమయం. వార్తలు వింటున్నంతసేపూ సరదాగానే ఉంటుంది. అంతలో ఏ ఆధునిక సుందరో సినిమా తారో నా ముఖకమలం మెరుగు పరుచుకునే సాధనాలగురించి కచేరీ పెట్టిన సమయము మంచి సమయము టీవీనుండి తప్పుకోడానికి. అప్పుడు టీవీ కట్టేసి, యూట్యూబులో కర్నాటసంగీతం కచేరీ చూసుకు, రెండో మెట్టు ప్రవేశిస్తాను.

రెండోమెట్టు – ఏదో ఒక టపాదగ్గర ఓ క్షణం ఆగి “ఓహా అదా సంగతి” అని తెలుసుకున్నదానినై ముందుకు సాగడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తూ మధ్యే మధ్యే పానీయం సేవిస్తాను. అట్టి సంక్లిష్టదశలో పొగలు కక్కుతున్నకాఫీమూలంగా అక్షరాలు అలుక్కుపోయి మసక మసగ్గా కనిపించడం కూడా కద్దు. అప్పుడే ఒక టపాదగ్గర వ్యాఖ్యానిస్తున్నాను అనుకుని మరో టపాదగ్గర నాజ్ఞానమో అజ్ఞానమో వెల్లడి చేసుకోడం జరిగేది కూడా.

ఈ కార్యక్రమం “నాకు అలవాటయిపోయింది” అంటే చప్పగానూ అరుచిగానూ ఉంటుంది. ఇదొక జబ్బు అయిపోయిందనే చెప్పాలి. తెలుగులో దీన్ని “దుర్వ్యసనము” అంటారు కానీ నిజానికి అది తెలుగు కాదు. పైగా దుర్వ్యసనంలో దుర్ ఉపసర్గ నాకు నచ్చలేదు. ఇంగ్లీషులో addiction అంటారు. ఇది చూసినప్పుడు మాత్రం నాకు అర్థమవుతుంది జనాలు ఇంగ్లీషు భాషనే ఎందుకు వరిస్తారో. add అంటే జత కూర్చుట కదా. హీ హీ. అంటే స్వతస్సిద్ధంగా ఉన్న తత్త్వానికిది “యాడు” చేయబడినది అని. లేదులే. దానికే మనం అతుక్కుపోయేం తుమ్మజిగురు వేసి అతికించినట్టు అని నాకు తెలుసు కానీ నాకు నేనిచ్చుకున్న టీకే నాకు బావుంది.

“మనం దేనికీ అతుక్కుపోకూడదు” అని వేదాంతగ్రంథాలన్నీ మూకుమ్మడిగా ఘోషిస్తున్నాయి. (ముఖపుస్తకంలో కూడా ఇలాటి సుభాషితాలు రోజుకి పది కనిపిస్తాయి. ఇవాళ ఏం వచ్చేయో). అలా అతుక్కున్నదానిని “వితుక్కు”చేయడం అంటే వాటిని వదిలించుకోడం చెయ్యాలి. దీనికే “విషపరిహారము” అని పేరు. ఏంటో మనబతుకంతా అంతే. మొదట అతుక్కునేదాకా ఆరాటం. ఆ తరవాత వదిలించుకోడానికి పోరాటం. బతుకంతా అతుకులూ వితుకులే! అన్నట్టు “వితుక్కు” కోసం నిఘంటువులు వెతకకు. వితుష్టుడు కనిపిస్తుంది కానీ వితుకు కనిపించదు. నేనే భాషని పుష్టితరం చేయడానికి సృష్టించేను.

ఇప్పుడు ముఖపత్ర పట్టు లేదా గుప్పిట్లోంచి వితుక్కోడానికి నేనేం చేస్తానో చెప్తాను. తరవాత వీలయితే నువ్వూ నేనూ కలిసి ఒక సిద్ధాంతం తయారు చేసి ప్రచారం చేద్దాం. నువ్వు నీ మిత్రసమితితో పంచుకో. అన్నట్టు నాపేరు కూడా చేర్చాలి సుమా. ఈ ఆలోచన అచ్చంగా నాదే, నేనే శ్రీకారం చుట్టేను కనక నాపేరు కలపడం ధర్మం.

ఈ విరుగుడు నెమ్మదిగా మెట్టుమెట్టుగా సాగాలి. పైన చెప్పేను కదా మామూలుగా కాఫీ కప్పుతో టీవి తెరుస్తాను కానీ లాప్టాపు తెరవకూడదు. తెరవాలని మనసు పీకుతుంది. చేయి అటే లాగుతూ ఉంటుంది. లాప్టాపువేపు దిగులుగా చూస్తాను. ఏవైనా అత్యవసరమైనవి ఉండొచ్చు. ఎవరైనా నాగోడమీద వ్యాఖ్యలు పెడితే నేను వెంటనే జవాబు ఇవ్వకపోతే ఏం బాగుంటుందీ? లేదా రుచీపచీ లేని తెంగ్లిషులో ఎవరైనా రాస్తే వారికి నేను హెచ్చరిక వెంటనే పెట్టకపోతే, మరో నాలుగు ఆ భాషలోనే వచ్చేస్తాయి. అది అంటువ్యాధేమో అనిపించేటంతగా. అక్కణ్ణుంచి నానియమాలన్నీ గోవిందా. …

నాకు అర్థం కాని మరో సంగతి కూడా ఇక్కడే చెప్పుకోవాలి – తెంగ్లీషు, ఇంగ్లీషులో రాసే ఆప్తవాక్యాలకి అదే భాషలో మరిన్ని వాక్యాలు పొలోమంటూ వచ్చి పడిపోతాయి, బంగాళాఖాతంలో తుపానులాగే. కానీ తెలుగులో రాస్తే మాత్రం అదే నుడికారంతో రావడం జరగదు. జరిగినా ఒకటో రెండో, అంతే! అదేం ఖర్మో మరి …

ఇలా ఆలోచనల్లో పడి కొట్టుకుంటుండగా, ఏదైనా తినాలనిపిస్తుంది. వంటింట్లో చూస్తే ఎదురుగా సీరియలు డొక్కూ, అరటిపళ్లూ ఇలా తీసుకు అలా తినేయడానికి నాకోసమే ఎదురు చూస్తూ కనిపిస్తాయి. ఇంకా అదృష్టం బావుంటే, మంచు బీరువాలో నిన్నటి ఉప్మావో ఇడ్లీలో కూడా దొరుకుతాయి. కానీ వాటికిది తగు తరుణం కాదు. ఎందుకంటావా? తెలీడంలేదూ, ముఖపత్రంమీద మనసు పడకుండా ఆపాలంటే మనసుని మరోదానిమీదికి మళ్ళించాలి. అంటే పుష్కలంగా చేతినిండా పని కల్పించుకోవాలి. ఈ సూత్రం కూడా ఏదో పుస్తకంలోనో ఏ మహానుభావుడో చెప్పే ఉంటాడు.

సరే, తీరిగ్గా ఉల్లిపాయలు తరగడం మొదలు పెడతాను దాంతో చేస్తానో తేల్చుకోకుండానే. ఉప్మా కాదులే. చెప్పేను కదా అది మంచుబీరువాలో ఉందని. (టొమెటో పచ్చడి చేయు విధానము ముఖపత్రంలో కనిపిస్తుందేమో).

ఉల్లిపాయలతరవాత బంగాళదుంపలు (శేఖర్ ఆప్తవాక్యం పెట్టేడేమో. రేపు చూసుకోవచ్చులే!!)

తీరిగ్గా తొక్క తీసి ముక్కలు తరుగుతాను. సరే ఎలాగా బంగాళదుంపల కూర ఉంది కదా అని పూరీపిండి కలుపుతాను. (వసంత విశాఖబొమ్మలు పెట్టెనా?).

బంగాళదుంపలకూర చేయు విధానం అంతా ఇక్కడ పెట్టను. నీకూ తెలుసు కదా మళ్ళీ ఎందుకు సోది. (అయ్యో, హైదరాబాదులో సభలూ, సమావేశాలూ ఏం జరిగిపోతున్నాయో … అయినా వాటికి ఢోకా లేదు. నిన్న జరిగిందంటూ రేపు ఎవరో ఒకరు లంకె పెట్టకపోతారా. లేదా పంచుకోలు. ఎన్ని రోజులు చూడకపోయినా అదృశ్యం కానివి సభలరభసలే.)

ఇలా ఇంచుమించు పూట సాగదీస్తాను. లేదులే. నాలుగు పూరీలు చెయ్యడానికి ఓపూటంతా పట్టదు. (ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థిగురించి ఎందుకిన్ని టపాలంటూ గోల పెట్టే టపాలెన్నో!)

మూణ్ణెల్లుగా అనుకుంటున్నాను ఫోను కంపెనీ మార్చాలని. మార్చాలంటే మరో కంపెనీవాణ్ణి పిలిచి అడగాలి. అదుగో అక్కడే నాకు తంటా. అసలు కంపెనీలే కాదు తెలిసినవాళ్ళకైనా సరే ఫోనంటే నాకు ఏడుపు. ఇవాళా, రేపూ, అన్నం తిన్నతరవాత, పడుకుని లేచినతరవాత … అంటూ వాయిదాలేసుకుంటూ పోతాను. (పోనీ, ఒక్కమారు తెరిచి చూస్తే పోలే? ఒక వాక్యం రాస్తే వాళ్ళకి నేను ఇంకా ఉన్నానని ఋజువు చేసుకోవచ్చు).

తినడం, గిన్నెలు కడుక్కోడం, మంచినీళ్ళు తాగడం చేస్తూనే ఉన్నాను. (రాయడానికేం లేకపోతే ఏ పెద్దల సువాక్కో ఓ ముక్క గిలకొచ్చు కదా. అన్నట్టు సామెతలు బాగా చలామణీ అవుతున్నాయి.)

ఆశ్చర్యం, ఇంకా ఏం చెయ్యొచ్చో ఆలోచిస్తుండగానే అటున్న సూర్యుడు ఇటు తిరిగేడు. మధ్యాహ్నం అయిపోయింది. (సభలు, సమావేశాలు, ఆ బొమ్మల్లో ఉన్నవారి పంపకాలతో మరో మూడు తెరలు నిడివి సాగుతాయి. ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. పోనిద్దూ)

ఏం తోచదు. అన్నట్టు అసలు ఈనాటి హడావుడి బతుకుల్లో తోచదు అన్నమాట వినిపించదు. అసలు అలాటి పదం ఒకటి ఉందని కూడా మరిచిపోయేరేమో అనిపిస్తుంది. ఎవరి నోట విన్నా, ఊపిరాడ్డం లేదు, రోజుకి 36 గంటలుంటే బాగుండు అనేవాళ్ళే. … మళ్ళీ టీవీ వెలిగిస్తాను రాబోయే ఎన్నికల్లో కాబోయే లేదా కావాలని ఆశించే నాయకమ్మన్యులు వల్లించే ధర్మపన్నాలు ఓపికున్నంత సేపు వింటాను. వీళ్ళు మనని ఎలా ఉద్ధరించగలరో చెప్పేసంగతులకంటే, ఎదటివాడు “ఎసుమంటి యెదవో” చెప్పే కతలే ఎక్కువ. అవన్నీ ఓ పట్టిక తయారు చేస్తే, నాయకుడు అనిపించుకోగలవాడు ఒక్కడు కూడా మిగలడు. ఇహ నావోటు నాకే నీవోటు నాకే అని పాడుకోవాలి.

అన్నట్టు దుప్పట్లు కొందాం అనుకున్నాను. బయల్దేరనా? ఇప్పుడు వర్జ్యమేమో? (… ఇవాళ చూడొద్దనుకున్నాను కదా. రేపు చూడొచ్చు. నామొహంలాగే ఉంది. ఇవాళ వర్జ్యం ఎప్పుడో రేపు చూస్తే ఏం లాభం? అది కాదు, రేపు బయల్దేరేముందు …­­)

అన్నట్టు నిన్న యోగసూత్రాలు చూస్తుంటే మళ్ళీ తప్పులు కనిపించేయి. అదేం ఖర్మో ఎన్ని మార్లు దిద్దినా ఇంకా తప్పులు కనిపిస్తూనే ఉంటాయి. “విస్తరి మొర్రి సంసారం మొర్రి” అనేది అమ్మ. ఆ రెంటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొర్రి పూడ్చడం సాధ్యం కాదని. నారాతల్లో తప్పులూ అంతే కాబోలు. నిజానికి బ్లాగు ప్రారంభించిన కొత్తలో తప్పులున్నాయని ఎవరైనా అంటే, సరేనని మళ్ళీ చూసుకుని దిద్దుకుంటూ వచ్చేను.

నాకు ఆనందం కలిగించే మంచిమాట ముందు చెప్తాను. అది – భాష చక్కగా తెలిసినవారు ఎక్కడ తప్పుందో చూపడం. ఒకొకప్పుడు ఏది ఒప్పో కూడా చెప్తారు. అందువల్ల నాభాషా పరిజ్ఞానం మెరుగు పడే అవకాశం ఉంది కనక ఆనందం అన్నమాట. అంతే కాదు, వారు నిజంగా నాకథ చదివేరు అని కూడా తెలుస్తుంది. ఇది సంతోషం కలిగించే రెండో విషయం.

పోతే, తప్పులన్నాయి అంటూ ఒక సాధరణీకరణ పారేసేవారు అలా అనడానికి కారణాలు అనేకం.

సమారుగా ఇలా ఉంటాయి. చూడు –

 1. నిజంగా ఆవిడకి లేదా ఆయనకి నీకథ చదవడం ఇష్టం లేదు.
 2. తప్పులెంచడం ఇవాల్టి సంప్రదాయం.
 3. “నీకామాత్రం తెలీలేదు” హీ హీ.
 4. “నాకు తెలుసు” హా హా.

– ఇక్కడ మళ్ళీ చిన్న తకరారుంది. అది తప్పులు కానివాటిని తప్పులని ఎత్తి చూపడం. అప్పుడు ప్రెగడ నరసరాజు నామనమున మెదులుతాడు. నాక్కూడా తెనాలి రామకృష్ణుడికొచ్చినంత ఉత్సాహం పుంజుకొచ్చేస్తుంది కానీ నాకు ఆయనలా పద్యాలు చెప్పేయడం రాదు. అంచేత చాలా మర్యాదగా వారికి చెప్పుకుంటాను నేను రాసింది తప్పు కాదని.

మొదట్లో కొంతకాలం ఎవరు తప్పుంది అన్నా, ఆ మాట నమ్మి, మళ్లీ మళ్ళీ చూసుకుంటూ వచ్చేను. తరవాత ఈ క్రింది విషయాలు గ్రహించేను.

 1. తప్పులు దిద్దడం నాకు పనే తప్ప ఆ తప్పుల పట్టువారికి ఏమాత్రమున్నూ లెఖ్ఖ లేదు.
 2. నాకథ చదవడానికి ఇష్టపడ్డవాళ్లు తప్పులు పట్టించుకోకుండా చదువుతున్నారు.
 3. తప్పులెన్నడమే పనిగా పెట్టుకున్నవారు తప్పులు లేని కథ ఇస్తే కూడా చదవడం లేదు!! నేను రోజులతరబడి తప్పులు దిద్దుకుంటూ కూర్చున్నంతమాత్రాన పాఠకులసంఖ్య పెరగలేదు.

ఏంటీ సొద అని విసుక్కోకు. ఇది కూడా విషహరణ ఆచారంలో భాగమే. ఏదో ఒక సొద పెట్టుకుని ముఖపత్రాలమీదినించీ నా యావ మరోవేపుకి మరలించడమే ప్రధానం అని ఇక్కడ గ్రహించాలి మరి. అన్నట్టు నువ్విది ఇంతవరకూ చదువుతూ వచ్చేవంటే నీకు కూడా ఆ యావ కొంత తగ్గించేనన్నమాటే కదా.

ఇంతకీ ప్రస్తుతానికి వస్తే, నేను ముఖపత్రంమీద పడకుండా, వేరే పనులు చూసుకోడమే నా ప్రదాన కార్యక్రమం కనకనూ, వేరేవారి రచనల్లో తప్పులు పట్టుట నాపని కాదు కనకనూ, నారాతలే మళ్ళీ చూసుకుందాం అని మొదలుపెట్టేను. దాంతో మరో గంట గడిచిపోయింది. ఇన్ని ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి నిద్ర ముంచుకొచ్చేసింది.

మొత్తంమీద సాయంత్రందాకా నెట్టుకొచ్చేసేను. ఇంకా కొంచెంసేపు సంగీతం వింటాను. కొెంచెంసేపు స్క్రాబులాడతాను. నీకు స్క్రాబులాట రాకపోతే మరో ఆట చూసుకో. మనసు స్థిమితపరుచుకోడానికి అంతకంటె గొప్ప సాధనం లేదు. అసలు నాకే గొడవలొచ్చినా స్క్రాబులాడితే మనసు స్థిమితపడిపోతుంది. లేదింకా అది “అలవాటు” కాలేదు, హీహీ

దాదాపు రోజంతా గడిపేసేను కనక ఒక్కసారి, ఒక్కసారి అంటే ఒఖ్ఖసారే ముఖపత్రం చూసి ఈరోజుకి మంగళం పాడేద్దాం అనుకుంటున్నాను.అలా అన్నమాట దురలవాటుని సదలవాటుగా మార్చుకోడం.

అసలు ఈ జాలంలో పడి ఎన్ని రోజులుగా ఎన్ని పనులు వాయిదా వేసుకుంటూ వస్తున్నావో ఓరోజు కూర్చుని ఆలోచిస్తేనే చాలు రోజు గడిచిపోతుంది.

ఇప్పటికి ఇంతే సంగతులు. ఇంకా ఏవైనా తోస్తే రేపు చెప్తాను.

ఉండనా మరి.

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 3 – దురలవాటుకి విరుగుడు”

 1. సంతోషం వనజగారూ. వితుకులు బాగుందన్నారు కనక ప్రచారం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బతుకంతా వితుకులుగానే ఉంది కత్తిరించి అతికించుట కదా.

  మెచ్చుకోండి

 2. భలే బాగుంది. నేను కూడా ఈ దుర్వ్యసనం నుండి బయటపడటానికి ఇలాగే చేస్తాను . పొగలు కక్కుతున్నకాఫీమూలంగా అక్షరాలు అలుక్కుపోయి మసక మసగ్గా కనిపించడం …. కూడా అచ్చు అలాగే ! మాలతీ గారు “వితుకులు” కనిపెట్టిన పదం మరీ బావుంది .

  మెచ్చుకోండి

 3. గోడపై నుండి ముచ్చట్లు – హాహా మంచి పోలిక. కానీ ఆ ముచ్చట్లకి ఏదో ఒక సమయం ఉంది. ఈ ముఖపత్రాలు మాత్రం రోజంతా కదా.

  మెచ్చుకోండి

 4. వదినా కూరేంటి ? అని గోడపై నుండి ముచ్చట్లు మొదలెట్టి కూర మాడ పెట్టే ఇరుగుపొరుగు కబుర్ల కాలం నుండి ముఖ పత్రాల కాలం దాకా వచ్చాం. కానీ వ్యసనం మాత్రం అదే ఇది వదిలేదికాదు అలాగని ఉపయోగమెంతో తేలేదు ఇది మన అలవాటు ఒక కాఫీలాగా అంతే వదలాలని అనుకున్నకొద్ది బలపడుతుంది….

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s