మనలో మనమాట 4 – పేరు పడిపోతాది బగమంతుడా!

నాజీవితంలోనే రచయితలకు పేరు పడిపోకుండా పట్టుకోవలసిన అవుసరం వస్తుందని నేను అనుకోలేదు. ఆ సమయం వచ్చిందని తెలిసేక కొన్ని సుళువులు కనిపెట్టవలసిన అవుసరం కూడా వచ్చింది మరి! ఈమధ్య వర్థమాన మాత్రమే కాక ఓ మోస్తరు పేరు గల రచయితలు కూడా ఈ విషయం మహోద్ధృతంగా చర్చిస్తున్నారు. ఇది “పేరు తెచ్చుకోడం, నిలబెట్టుకోడం” అను ప్రక్రియకి పెరటిదారి కావచ్చు. ఏమైనా ఉడతాభక్తిగా నావంతు సేవ చేసి తరించడం అవసరమే కాదు నాబాధ్యత కూడాను.

000

కుడిచేత్తో పళ్ళబుట్టా, ఎడంచేత్తో చాక్లెట్ పెట్టే పుచ్చుకుని అడుగులో అడుగేసుకుంటూ సంద్రాలు పక్కకి చేరేను.

సంద్రాలు పక్కవాటుగా తల వాల్చి నావేపు చూసి కొంచెం అటు జరిగి తనపక్కన చోటు చేసింది నాకు.

“ఏంటి కథ?” అన్నాను కళ్ళు చిట్లించి ఆవిడమొహంలోకి చూస్తూ.

“కతేటి?” అంది సంద్రాలు అలవాటయిన అమాయకత్వంతో.

“మామూలుగా ఎందుకొచ్చేవూ అంటూ కసుర్తావు కదా.”

“నివ్ మాతరం. అయేటి?” అంది సంద్రాలు నాచేతిలో సంభావనలు పరీక్షగా చూస్తూ.

అమ్. దొరికిపోయేను. మారు మాట లేకుండా తలొంచుకుని ఆవిడ చూపిన చోట కూలబడ్డాను ఉస్సురనుకుంటూ.

“ఏటయిందేటి?” అంది సంద్రాలు సానుభూతి మొహం పెట్టి. అమ్మో, ఆవులిస్తే పేవులు లెక్కేట్టుస్తుంది!

పెదిమలు బిగించి ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను.

“సెప్పులె. పర్నేదు.”

ఆఖరికి నోరు పెగుల్చుకు నిదానంగానూ విచారంతోనూ మొదలుపెట్టేను. “అది కాదు, సంద్రాలూ. నీక్కూడా తెలుసు కదా. మనకి తెలిసిందేదో రాసి ఓ పత్రిక్కి పంపేసి ఊరుకునేవాళ్ళం. వేసుకుంటే వేసుకున్నారు, లేపోతే లేదు. మరి ఇప్పుడేంవో ఈ సాహిత్య సభలూ, సన్మానాలూ, అభిమానసంఘాలూ వచ్చేసి అటు పాఠకుల్నీ ఇటు రచయితల్నీ ఊపిరాడకుండా చేసేస్తున్నాయి. నా చిన్నతనంలో లేదు ఈ సంత కనక నాకు గందరగోళం అయిపోతోంది,” అన్నాను.

సంద్రాలు తల అడ్డంగా ఊపింది అందులో ఆశ్చర్యం లేదన్నట్టు. “ఉప్పుడన్ని సోట్ల అంతే మరి. రాసేవోల్లే గాదు సనిమల్ల, ఉజ్జోగాల్ల అన్నిట అట్నె ఔతాది. మీదికి పోవలంటే మందిల తిరగాల, పదిమంది కల్ల బడాల. రచీతలంద్రూ ఓరికి ఆరే పేరు నిలబెట్కోనానికి శంవ పడాల,” అంది.

” మహాకవులందరూ నాపేరు చెప్పుకోండి, నాపేరు రాసుకోండి అంటూ ఎవరివెంటా పడలేదు కదా. పోతనా, పెద్దనా, అచ్చమాంబగారిలాటి వాళ్ళమాట వొదిలెయ్. యాభై ఏళ్ళక్రితం కూడా పేరు ప్రతిష్ఠలకోసం ఎవరికీ ఇంత రంధి ఉన్నట్టు కనిపించదు. నామటుకు నేను కొందరిని పరిచయం చేసేను కానీ రాయి రాయి అంటూ వాళ్ళు నావెంట పడ్డంవల్ల కాదు. నాకు నచ్చేయి. రాసేను అంతే.”

“మరి ఉప్పుడు ఆల్లని పట్టించుకోట్ననేదని నివ్వే రాసీస్తున్నవా నేదా?”

సంద్రాలు అలా నన్ను నిలదీసి అడిగేసరికి నాకు మాట తోచలేదు. నిజమే మరి. నాచిన్నతనంలో మంచి పేరుగల రచయితలగురించి ఈనాటి పాఠకులకి అసలు తెలీను కూడా తెలీదని నేను పని వాళ్ళని గట్టుకు మళ్ళీ వాళ్ళందర్నీ తవ్వి తీసి పునః పరిచయం చేస్తున్నాను. అంటే వాళ్ళ “పేరు” నిలబెట్టాలని కాదు. వాళ్ళు సృష్టించిన సాహిత్యం విలువైనది అని.

“నేను కూడా అదే అంటున్నానమ్మా.”

నేను ఉలిక్కిపడి అటు చూసేను. అనంతంగారు! నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు, “చాలా మంది ఉన్నారమ్మా పేరుకోసం కాక ఆశయసిద్దికోసం, లోకకల్యాణంకోసం సాహిత్యకృషి చేసినవారు. కనుపర్తి వరలక్ష్మమ్మ, వట్టికొండ విశాలక్షి, కొమ్మూరి పద్మావతీదేవి, వేదుల మీనాక్షీదేవి, అంగర వెంకటకృష్ణారావు, జి.వి. కృష్ణరావు – ఇలా ఎందరో మహానుభావులు. వీళ్ల పేర్లు విన్న పాఠకులు ఈనాడు ఎంతమంది ఉన్నారంటావు? తిరగా బోర్లా వేసి ఎన్నిమార్లు చెప్పినా ఆ చలం, ఈ విశ్వనాథ, మరో కుటుంబరావు – వీళ్ళపేర్లే మళ్ళీ మళ్ళీ వల్లిస్తారు. ఈమధ్య చాసో పేరు మళ్ళీ కొంచెం వినిపిస్తోంది. కానీ ఎందరో రచయితలు ఉన్నారనీ, వాళ్ళు చాలా మంచి కథలు రాసేరనీ చాలామందికి తెలీదు. యూనివర్శిటీ క్లాసుల్లో తెలుగు సాహిత్య చరిత్ర పాఠాలు చెప్పేవారికి కొంచెం తెలుసేమో. ఏడాదికోమారు ఏదో ఓ సభ పెట్టడం, తద్దినాలు పెట్టినాట్టే. నలుగురు ఉపన్యాసాలు ఇవ్వడం. లేదా జయంతిసంచిక వర్థంతి సంచిక అంటూ పదిమంది వ్యాసాలూ … వాటిల్లో ప్రసంగవశాత్తు ఈ గతించిన రచయితలని స్మరించుకోడమే తప్ప ఇంకేముందు. వెనకటి సుప్రసిద్ధ రచయితల పేర్లు ఓపది చెప్పండని ఎవరినైనా అడిగితే మాత్రం తెల్లమొహాలేయడం ఖాయం,” అనంతంగారు ఆ తలపులతో వచ్చిన ఆవేశాన్ని ఆచుకోడానికి ఓ నిముషం ఆగేరు. ఇంకా ఏం చెప్తారో అని చూస్తూ కూర్చున్నాను.

ఆయనే మళ్ళీ అందుకున్నారు. “అంచేత పేరు పడిపోతుందన్న బాధలో కొంత అర్థం ఉంది. కానీ నిలబెట్టడం ఎలా జరుగుతుంది? ఎవరు నిలబెడతారు? ఈనాడు మనం తలుచుకుంటున్న రచయితలని చూడు. వాళ్ళెవరు గానీ నాపేరు నిలబెట్టు బాబూ అని ఎవర్నైనా యాచించేరా? లేదు. నా అభిప్రాయం ఏమిటంటే ఆ రోజుల్లో దృక్పథంలో మార్పు.”

“ఎవరి దృక్పథమండీ?” అన్నాను నెమ్మదిగా.

“రచయితలూ, పాఠకులూ – ఇద్దరిదృక్పథంలోనూ మార్పులొచ్చేయి. దానికి వెనక కారణం స్థూలంగా సమాజంలో వచ్చిన మార్పే. రెండోది – అప్పట్లో రాసేవారు తక్కువ, రాసి ప్రచురించుకోగల వసతులు తక్కువ. చదివి ఆస్వాదించినవారే ఎక్కువ. ఇప్పుడు అనేక మాధ్యమాలు కలిగించిన వసతితోనూ, చదువుకున్నవారు ఎక్కువ అవడంతోనూ రాయడం ఎక్కువయిపోయింది. దానికి తోడు ‘నేను, నాపేరు’ అంటూ వ్యక్తివిజయంపేరుతో ఆత్మప్రదక్షిణలు ఎక్కువయిపోయేయి కూడాను. వెనక సమాజంతోనే తను అన్న ఆలోచన, ఇప్పుడు నాతోనే సమాజం అన్న అహంకారం. ప్రతివాడికీ కేవలం తన అస్తిత్వమే ప్రధానం అయిపోయింది. ప్రతివారికీ ఆలోచనలు ఉంటాయి కాదనను. కానీ అవి పంచుకోవాలన్న ఆరాటం మాత్రం మితి మీరిందనే అనిపిస్తోంది. రోజుకు 24 గంటలు అని మితి ఉన్నట్టే మెదడుకి కూడా మితి ఉంది. ఒక్క చదవడమే చేసినప్పుడున్నంత ఏకాగ్రత – మరి ఏకాగ్రత అన్నమాటలోనే ఉంది కదా – ఆ శ్రద్ధ రెండూ చేసినప్పుడు ఉండే అవకాశం లేదు. పంపకాలతో కాలం ముక్కలు కాక తప్పదు. మేధ వేరు వేరు వ్యాపకాలకు పంచి పెట్టబడుతుంది. ఎవరు మాత్రం ఎంతకని చదువుతూ, రాస్తూ, ఆలోచించుకుంటూ పోగలరు కనక. పోలేరు. ఈనాడు ప్రతివారూ తాము నాలుగైదు పనులు చెయ్యగలం అని దర్పాలకి పోతున్నారు కానీ నిజంగా ఒక్క గంట ఒక్క పనిమీదే దృష్టి పెట్టి పని చేస్తే తేడా తెలుస్తుంది.

పైగా ఇప్పుడు పరిస్థితి చూడు. అచ్చు పత్రికలూ, జాల పత్రికలూ ప్రచురించే కథలు నాకు రూఢిగా లెక్క తెలీదు కానీ నెలకి కనీసం వంద అయినా పాఠకలోకంమీదకి వదుల్తున్నట్టుంది. ఉద్యోగాలూ సద్యోగాలూ చూసుకుంటూ, పిల్లా పాపా చూసుకుంటూ ఏ ఒక్కరు గానీ అన్ని కథలు చదవగలరా, పేరాశ కాకపోతే! ఇవి చాలనట్టు, బ్లాగుల్లోనూ, ముఖపత్రాల్లోనూ వచ్చేవాటిని లెక్కెట్టడం కన్నా చుక్కలు లెక్క పెట్టడం తేలిక. కోకొల్లలు. వాటిలో మళ్ళీ లంకెలూ, విడియోలూను. మొత్తమ్మీద రాసి పోసేస్తున్నారు రచయితలు. వాటిని ఎత్తి పోసేస్తున్నారు అప్పారాయుళ్ళు. వీళ్ళకి మూలరచయితలు ఏమనుకుంటారన్న బాధ లేదు. చదువుట తగ్గిపోయింది కదా అన్న ధైర్యమో, ఎవరు చూడొచ్చేర్లే అనో. … ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి చాలామందికి కాకపోతే సగంమందికి కేవలం తమపేరు తెరమీదో కాయితంమీదో కనిపించడమే ప్రధానం అనిపిస్తుంది. అయితే వారికి కూడా తెలుసు ఈ తెరమీదో కాయితంమీదో పాఠకుడి కళ్ళు ఉన్నంతసేపే వాటి జీవనప్రమాణం అని. ఆ తరవాత సమస్తం అంతర్థానం. అదన్నమాట రచీతలందరూ ప్రతిరోజూ ఏదో ఓ పత్రికలోనూ పేరూ కనిపించకపోతే పడిపోతుందన్న అభిప్రాయం అన్న వాదన ప్రబలడానికి కారణం.”

అప్పుడే నాకు మరో చిన్న కథ గుర్తొచ్చింది. ఈ పేరు పడిపోతుందేమోనన్న పిరికితనం ఇప్పుడే వచ్చింది కాదు. 60లలోనే ఈ లేడీరచయితలు కుప్పలు తిప్పలుగా రాసి పారేస్తూ పత్రికలలో వీరవిహారం చేస్తున్నరోజుల్లోనే విన్నాను అలా కుప్పలుతిప్పలుగా రాయడం పేరు నిలబెట్టుకోడానికే అని. “పేరు పడిపోడం ఏమిటి” అని ఒక ప్రముఖ రచయిత్రి నాతో అని నవ్వడం నాకు ఇప్పటికీ మనసులో మెదుల్తూనే ఉంటుంది పేరు పడిపోడం మాట విన్నప్పుడల్లా.

“ఏటి ఆలోసిన్ల పడిపోనావ్?” సంద్రాలు అనడంతో తేరుకున్నాను.

“అనంతంగారేదో చెప్తుంటేనూ …” అంటూ అటు చూసేను. ఎవరూ కనిపించలేదు. “ఏంలేదులే,” అన్నాను మాట మారుస్తూ, “ఏం లేదు. వెనకటిరోజుల్లో రచయితలగురించి ఆలోచిస్తున్నాను.”

“ఏటని?”

“ఆరోజుల్లో ఎవరూ నాపేరు నిలపండహో అంటూ గోలెట్టట్లేదు కదా.”

“సర్నే. ఆలిప్పుడు నేరు గద. అందుసేత ఆరికి తెలవదు ఎవురేటనుకుంతన్నరో అనుకోట్నం నేదో.”

“ఇంతకీ అసలు విషయం – ఇప్పుడు అందరూ మనని మనమే ప్రచారం చేసుకోవాలంటున్నారు. అదెలాగా అని ఆలోచిస్తున్నాను.”

అదా సంగతి అన్నట్టు సంద్రాలు తలూపింది.

“నువ్వు నాలుగు లోకాలూ చూసినదానివి. ఏమైనా సలహా చెప్తావేమోనని వచ్చేను,” అన్నాను. చల్లకొచ్చి ముంత దాచడంవేల?

“ఔను. మనగురించి మనంవే సెప్కోవాల. ఏలనంటె రాసీవోరు ఎక్కువైపోనారు. కతలు యేలకి యేలు ఒచ్చి పడిపోతన్నయ్ దినదినంవూని. సదీతాన్కి ఏరికీ టయాం నేదెక్కడాను. అందుసేత మనయి సదమని పాతకులముందలికి మనఁవే తేచ్చీవాల. అదే రాసీవోల దరమం విప్డు.”

సరే, సంద్రాలు కూడా అదే అభిప్రాయానికొచ్చేసింది కనక ఇహ నాకూ అదే దిక్కు.

“అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?”

“రచీతలని కొలుసుకో. ఆరి పొత్కాలగూర్చి రాసీ. ఆ యెనక ఊరూర సబలెట్టు. సంతలో సరుకు అమ్ముకొనీవోరు నాసరుకు సూడు నాసరుకు సూడు అంట పోటీ పడ్రూ, ఇదీ అట్టనే.”

సరేనంటూ తలూపేను.

“గొడ్డునాగ తలూపతావేటి. రాస్కో.” నేను బుద్దిగా రాసుకున్నాను అరచేతిలో.

“మల్ల రాజుగోరు, రెడ్డిగోరు, నాయుడుగోరు, సౌదిరిగోరు – ఆలంత సాయిత్తెం దున్నిపారేస్తన్నరు గద బారతయుద్దంలో యీరుల్నాగే. ఆరి పేపకం సంపాయిచ్చు.”

“సాహిత్యం దున్నిపారేయడమా?”

“యవసాయంనాగన్నమాట సాయిత్తింవూని.”

“సరే,” అన్నాను నీరసంగా తలూపి. ఆ రాజుగారూ, రెడ్డిగారూ, చౌదరిగారూ వాళ్ళంతా అతిరథులూ మహారథులూను. వాళ్ళకళ్ళు నామీద పడాలంటే వారు తమ అక్షిగోళాలను అరవై డిగ్రీలు కిందకి దింపాలి. లేదా నేను వారి కనుగవస్థాయికి అంటే పదడుగుల ఎత్తుకి ఎదగాలి. రెంటికన్నా ఆకాశకుసుమాలు కోసుకురావడం తేలిక.

“నీకెవురో శాస్తుర్లు తెల్సంటివి గద.”

నేను తల అడ్డంగా ఆడించేను. “శాస్తుర్లూ, శర్మలూ, ఆచార్లూ పనికి రారులే. వారికి అంత బలగం లేదు. అసలు వాళ్ళే ఈ రాజుగార్లకీ, రెడ్డిగార్లకీ సేవలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు.”

మాటలోనే తారకం వచ్చేడు.

“ఏం బాబూ ఇలా దయ చేసేవు?” అన్నాను. ఈమధ్య అతడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. అంచేత కోపంగా ఉంది.

“మీకేదో కోపం వచ్చినట్టుంది.”

“కోపం తెచ్చుకోడానికి నేనెంతటిదాన్ని తండ్రీ. నాకేం పేరా ప్రతిష్ఠా.”

“అందుకే వచ్చేనండి. మీకు రావలసిన ప్రతిష్ఠ రాలేదు. అంచేత నేనే పూనుకుని మీకు పేరు తెప్పించేదాం అనుకుంటున్నాను.”

“అంటే ఏం చేస్తావేమిటి? నాపేరూ ముఖారవిందమూ ఓ వెయ్యి కాయితాలమీద అచ్చేయించి వీధీ వీధీ చెట్లమీదా, గోడలమీదా అతికించేస్తావేమిటి తప్పిపోయినవాళ్ళల్లా?”

“అది కాదండి. మీరేం చెయ్యాలంటే వారం వారం ఏదో ఒకటి రాసేస్తూండండి. నేనేమో దానిమీద వ్యాఖ్యలూ, వాటిగురించి సమీక్షలూ, వాటికి వ్యతిరేకంగా వ్యాసాలూ రాసేస్తూంటాను. అలా నాపేరుకీ మీపేరుకీ కూడా ఢోకా ఉండదు.”

“అంతేనా, ఇంకా ఏమైనా ఉందా?”

“సభలండి సభలు. సభలూ సత్కారాలూ ఏడాదికోమారు సంతర్పణలూను. నెలకో సభ పెట్టి కనీసం నలుగురికి శాలువాలు కప్పాలి.”

“బాగుంది. వారానికో సత్కారం అన్నమాట.”

“మరి దానికి మదుపు కావాలి కదా?”

“దానిక్కూడా ఓ చిట్కా ఉంది లెండి. కొత్తగా కలం పట్టినవాళ్ళకి సత్కారం చేస్తాం అంటే వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. అలాగే కొందరు డబ్బు మూలుగుతున్న సాహిత్యాభిమానులు కూడా సాయం చేస్తారు వాళ్ళ బొమ్మలు పత్రికలలో పడితే చాలు.”

సరే అన్నాను. ఏం చేస్తాం, కాలం నదిలాటిది అంటారు. మరి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే, దేవుడా ఇంత చేసేవా అనుకుంటూ.

“అన్నట్టు మరో పద్ధతి కూడా ఉందండి.”

“ఏమిటది?”

“పత్రికలలోవి బ్లాగుల్లోనూ, బ్లాగుల్లోవి పత్రికలలోనూ ప్రచురించడం.”

“నేను రాసినవేనా?”

తారకం విరగబడి నవ్వేడు పొట్ట చేత్తో పట్టుకుని. తేరుకున్న తరవాత, “భలే జోకులేస్తారండీ మీరు. మీవయితే నేను చెప్పేదేమిటి. బాగున్నవి అన్నాను కానీ మీవి అనలేదు కదా.”

“మహ బాగుంది. అ అసలు రచయితలకి తెలిస్తే పరువు పోదూ?”

“దానికి తగ్గ ఆలోచనలు కూడా ఉన్నాయిలెండి.”

నేను నెమ్మదిగా లేచేను, నా పళ్ళబుట్టా చాక్లెట్ పెట్టీ పట్టుకుని.

“ఏటి లేసిపోతన్నవు?”

సంద్రాలు నాచెయ్యి పట్టుకు లాగి కూచోపెట్టేసింది.

“ఒకమాట సెప్త. ఇనుకో. నోకంలో ఎవురూ ఉండిపోరు. ఉప్పుడు అదే పనిగ రాసీసీనా, సబలూ సంబరాలు అంట గోలెట్టిన నివ్వు సచ్చినంక ఏటవుతాది? వప్పుడు ఈలెక్కన దినవూ నీపేరు ఏడ కనిపిస్తాది, రాసిందాన్ల సక్కగుంటె తప్పిస్తే?” అని నిలదీసింది సంద్రాలు.

నిజమే. ఇలా నారాతలు నేనే ప్రచారం చేసుకోవాలంటే, నేనున్నన్నాళ్ళు చేస్తాను కానీ తరవాత?

“నివ్వే అంటివి గద నీ కాయితమ్మీన రాసినవి సదివీవోలు ఆలకి నచ్చి సదాతన్నరు గాని నివ్వు రా రా అని పిలిస్తె రానేదు గద. అది నీకు సంతసం. అంతే. ఇయన్ని పక్కనెట్టీసి, నీపాట్న నివ్వు రాస్కపో. నీకూ నీసేయితులకీ కూడా సుకం,” అంటూ మళ్ళీ దివ్యమంత్రం ఉపదేశించింది.

నాలుగు నిముషాలు మాటాడకుండా కూర్చున్నాను. తరవాత నెమ్మదిగా లేచేను, నా పళ్ళబుట్టా, చాక్లెట్ పెట్టీ పట్టుకుని.

“తారకమంత్రం నావల్ల కాదు గానీ, రాజుగారినో రెడ్డిగారినో ఆశ్రయిస్తాను.”

“అయి పట్టకపోతన్నవేటి?”

“వారిదగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను?”

సంద్రాలు చాక్లెట్ పెట్టె లాక్కుని, “పో,” అంది.

చెప్పనేల, పళ్ళు ఎవరికీ అఖ్ఖర్లేదు.

000

(ఫిబ్రవరి 17, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 4 – పేరు పడిపోతాది బగమంతుడా!”

  1. రెడ్డి గారు రాజుగార్లు మాత్రం శాశ్వతమా చెప్పండి – అంతేలెండి. మౌలికవిలువలకి విలువ పోయి, పై పై ఆర్భాటాలకే అగ్రాసనం అయినంతకాలం ఇలాగే ఉంటుంది సాహిత్యక్షేత్రం.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. ప్రచారం పాఠకుల దగ్గరికి వెళ్లేంత వరకు మాత్రమే ఆతర్వాత సరుకును బట్టీ పేరు సంద్రాలు సరిగ్గానే చెప్పింది మనకి నచ్చ్చింది మనం రాసుకుంటే మనకి మన స్నేహితులకి సుఖం. రెడ్డి గారు రాజుగార్లు మాత్రం శాశ్వతమా చెప్పండి…

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.