మనలో మనమాట 5 – అస్తి నాస్తి

“పూజలూ వ్రతాలూ మానేసేను,” అన్నాను అనుపమతో.

“ఎందుకు మానీసేవు?” అంది అనుపమ నామొహంలోకి చూస్తూ.

గొప్ప చిక్కొచ్చి పడింది. నాకారణాలు నావి. ఆ పిల్లకి నమ్మకాలున్నాయి. ప్రత్యేకించి నేను ఇప్పుడు నా నమ్మకం ఎందుకు ఎలా పోయిందో చెప్పినందువల్ల ఏమిటి లాభం? అనూ తన అభిప్రాయం మార్చుకుంటుందా? తను మార్చుకున్నా మార్చుకోకపోయినా నాకు ప్రత్యేకించి కలిసొచ్చేదేమీ లేదు. దేవుడు లేడు అంటూ గోలెట్టడం నాకిష్టం లేదు. నాకారణాలు నావి. ఆ కారణాలు నాకు మాత్రమే పరిమితం.

అసలు ముందు నేను పెరిగిన వాతావరణం చెప్తాను. మాయింట్లోనే అన్ని రకాలూ ఉన్నారు నిప్పూ నీళ్ళూ కడిగేంత చాదస్తంనించి నమ్మకాలు ఉన్నవాళ్ళని హేళన చేసేవాళ్ళవరకూ. వీళ్ళమధ్య పెరగడంచేతేనేమో నేను ఉన్నాడనిపించినప్పుడు ఉన్నాడు కాబోలనీ, లేడనిపించినప్పుడు లేడనీ నాకు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక సందర్భంలో “ఇదుగో, దేవుడూ! దేవుడూ! మరేమో నీలోకంలో నువ్వుండి నీపనేదో నువ్వు చేసుకో. నేను నాలోకంలో ఉంటూ నాపని నేను చూసుకుంటాను, నువ్వు నాజోలికి రాకు, నేను నీజోలికి రాను,” అని శ్రీముఖం కూడా ఇచ్చేసేను. చూసేరా, అలా అంటే దేవుడున్నాడని ఒప్పుకున్నట్టే కదా. మరి లేనివాడితో మాటాడేనంటే అది నమ్మకమైనా కావాలి, పిచ్చి అయినా కావాలి కద!

నేను రోజూ నడిచేదారిలో ఈ చిన్న కట్టడం ఉంది. ఇదేమిటో తెలీదు కానీ దాన్ని చూసినప్పుడల్లా నాకు పాడుపడిన శివాలయమో ఆంజనేయస్వామి గుడో తలపుకొస్తుంది.

DSC02339దాని ముఖద్వారం కూడా విలక్షణంగానే ఉంది.

ఆ తరవాత నాకు విస్కాన్సిన్ లో పరిచయమైన ఒక తమిళావిడ గుర్తొస్తారు. ఆవిడకి సంప్రదాయాలంటే గౌరవం. పూజలూ వ్రతాలు శ్రద్ధగా చేస్తారు. ఆవిడ ఒక రోజు అన్నారు. “ఇక్కడ మనకి ఏ్ గుడీ లేదు. నేను రోజూ ఆఫీసుకి వెళ్ళేదారిలో చర్చి ఉంది. ఆ పక్కనించి వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది ఏ దేవుడైనా దేవుడే కదా అని,” అంది లెంపలేసుకుంటూ. అంటే ఆ సమయంలో అలా చేస్తుందని 30 మైళ్ళవేగంతో కారు నడుపుతూ. పైన నేను చెప్పిన కట్టడం చూడండి. దీపపు స్తంభాల్లా లేవూ అ నిలువు స్తంభాలు? మనం పెరిగిన వాతావరణాన్నిబట్టే మన తలుపులు కూడాను మరి. అదేదో మూఢనమ్మకం అనుకోలేను నేను.

నాకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళూ పైవాళ్ళూ, చుట్టాలూ పక్కాలూ చేసే హడావుడి ఇంతా అంతా కాదు. ఆస్తికులు అదే పనిగా ఈ పుస్తకం చదువు, ఆ పూజ చెయ్యి, ఈ వ్రతమాచరించు, ఆ సాధువుని చూడు, ఈ బాబాని దర్శించుకో అంటూ వేధిస్తారు ఒక పక్క. మరో పక్క నాస్తికులు, హేతువాదులు అవన్నీ మూఢనమ్మకాలు అంటూ వేదాల్లోనూ పురాణాల్లోనూ కథలు అవాస్తవాలు, అభూతకల్పనలు, కమండలంలోంచి మనిషి పుట్టడం ఏమిటి మట్టి బొమ్మకి ప్రాణం పొయ్యడమేమిటి, దానికి మళ్ళీ ఏనుగుతల అతికించడమేమిటి అంటూ నాకు మహోత్సాహంతో హేతువాదం నూరి పోస్తారు. గొప్ప హేతువాదిగా పేరు పొందిన రచయిత కూడా ఇలా రాయడం నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. సాహిత్యం అంతా ప్రతీత్మకమే. పంచతంత్రంకథల్లో కుందేలు మాటాడ్డమేమిటి, సింహం మాటాడ్డమేమిటి అని ఎవరూ అడగడం లేదు కదా. ఏ కథ తీసుకున్నా ప్రతీత్మకంగా ఆకథలో ప్రధానాంశం ఏమిటో చూడాలి. వేదశాస్త్రాల్లో జ్ఞానం నమ్మనివాళ్ళు శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మమంటారు. ఏదైనా  శాస్త్రమే కదా అనిపిస్తుంది నాకైతే. సైతాను సైతం తనకి పనికొచ్చే ఉదాహరణలు చూపగలడు బైబిల్లో కూడా అని ఆంగ్లసామెత.

కాఫీ మంచిది కాదన్నారు ఒకొప్పుడు. ఇప్పుడు రోజుకి రెండు కప్పులు తాగితే మంచిదంటున్నారు. తాగుడు మంచిది కాదన్నారు వెనక. నిన్న చూసేను రోజుకి ఒక కప్పు వైను పుచ్చుకుంటే రెండేళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందిట. ప్చ్. ఇంత ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు మొదలు పెడితే నాఆయుర్దాయం ఎంత పెరుగుతుందో ఎలా లెఖ్ఖ కట్టడం? నేను లెఖ్ఖలు కట్టి తాగడం మొదలు పెట్టేక మళ్ళీ ఈ సైన్సు మరో సిద్ధాంతం చేస్తే అప్పుడేం చెయ్యడం? ముఖ్యంగా breast implants విషయంలో జరుగుతున్న తర్జనభర్జనలూ, ఆ implantsమూలంగా అనేక బాధలకు లోనైన ఆడవాళ్ళనీ తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. ఏమైనా నేను పురాణాలూ చదవలేదు, హేతువాద నాస్తికవాద మానవతావాద గ్రంథాలూ చదవలేదు. ఒక్కమాటలో నేను ఒఠ్ఠి పనికిమాలిన నేలబారు మనిషిని. ఏ చదువూ సంధ్యా లేని కోటానుకోట్ల జనాల్లో ఒక రేణువుని. అంచేత ఈ చర్చ ఆ మేధావులకీ, కాయితాలు నెమరేసే మేతావులకీ వదిలేసి నాకత కొనసాగిస్తాను.

స్థూలంగా నా నమ్మకాలు – ‘దేవుడు ఉన్నాడు’ అని నిర్దుష్టంగా నమ్మినవాళ్ళు నమ్మండి. ‘దేవుడు లేడు’ అని దృఢతరంగా నమ్మినవాళ్ళు అలాగే మీ నమ్మకాలు నిలుపుకోండి. ఎవరి నమ్మకాలు వారివి. నాకు తంటా అంతా అటో ఇటో నన్ను నమ్మించడానికి ఆరాటపడిపోయేవాళ్ళతోనే.

వాళ్ళందరికీ “నాబాధలు నేను పడతాను. అసలు అవి బాధలు కావు అని కూడా అనుకుంటున్నాను. అంచేత బాధలంటూ ఉంటే గింటే నేనే పడతాను కానీ నాబాధలు మీరు పడుతూ ఆయాసపడిపోకండి,” అని చెప్పి నేనే వాళ్ళని ఓదార్చాల్సిన పరిస్థితి అయిపోయింది.

నేను మాఅమ్మవెనక తిరుగుతూ పెరిగేను. అంచేత ఏ భారతమో, భాగవతమో ఆవిడ చదువుకుంటూ అప్పుడప్పుడు నాకు కథలు చెప్తుండడంచేత ఆ కథలు సుమారుగా తెలిసేయి కానీ నాకు నేనయి అవేవీ చదవలేదు. అలాగే మాటల్లో సందర్భం వచ్చినప్పుడు చెప్పే కథలు కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. అలాటి కథల్లో ఇదొకటి.

“మూడు జన్మల ముష్టివాడొచ్చేడు, ముష్టి వెయ్యి,” అన్నాట్ట వీధి అరుగుమీద కూర్చున్న ఒకాయన లోపలిగదిలో ఉన్న ఇల్లాలితో.

ఏ సందర్భంలో అమ్మ ఈ మాట అందో నాకు జ్ఞాపకం లేదు కానీ నేను దానిమీద ప్రశ్నించడం మాత్రం జ్ఞాపకం ఉంది.

“మూడు జన్మలలో ముష్టివాడని ఆయనకి ఎలా తెలుసు?” అని అడిగేను.

“వెనకటిజన్మలో డబ్బు ఉన్నా దానం చెయ్యలేదు కనక ముష్టివాడే. అంచేతే ఈ జన్మలో ముష్టివాడయేడు. ఇప్పుడు ఇద్దామన్నా ఇవ్వడానికేమీ లేదు కనక మళ్ళీ ముష్టివాడుగానే పుడతాడు,” అంది.

నేను వదిలిపెట్టలేదు. “అయితే మూడు జన్మలే ఎందుకవాలి? తరవాత కూడా అంతే కావచ్చు కదా,” అన్నాను.

“మూడు జన్మలలో దానం చెయ్యనివాడు ఇంకేం చేస్తాడు? ఏ పశువుగానో పుడతాడు,” అంది అమ్మ.

ఈ కథ నాకు చాలా నచ్చింది. అంటే పునర్జన్మ, పశువుగా పుట్టడం – వీటివల్ల కాదు. ఈ కథలో ప్రధానాంశం దానం. అదీ నాకు నచ్చింది. హైందవ సంప్రదాయంలో మనిషి ఆర్జనలో నాలుగోవంతు దానం చెయ్యమంటారుట. అది కూడా అమ్మే చెప్పింది. తల్లిదండ్రులని పోషించడానికి ఒక వంతు – అది అప్పు తీర్చడం. రెండోవంతు పిల్లల పోషణ అప్పు ఇవ్వడం. మూడోది ఏమిటో జ్ఞాపకం లేదు. నాలుగోవంతు దానం. ఈనాడు సంఘసేవలన్నిటిలోనూ అంతర్గతంగా ఉన్ననీతి కూడా ఇదే కదా.

20 ఏళ్ళక్రితం ఇండియాకి వెళ్ళేను. ఆ ప్రయాణం అంతా కేవలం దేవాలయాలు దర్శించడానికే కేటాయించేను. 16 రోజులలో 18 దేవాలయాలు దర్శించుకున్నాను మా రెండో అన్నయ్య ధర్మమా అని. నాకు అవుసరమైన ఏర్పాట్లన్నీ చేసి, నాతో తిరిగేడు మాఅన్నయ్య. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఆ ప్రయాణంలో నేను ఆకళించుకున్నదేమిటో నామమాత్రంగానైనా జ్ఞాపకం రావడంలేదు. ఆ దర్శనాలన్నీ నా మనోఫలకంమీద ఎలాటి ముద్రలూ వేయలేదు. వెళ్ళినచోటల్లా తీసిన బొమ్మలు మాత్రం జాగ్రత్తగా ఓ ఆల్బంలో పెట్టేను. అవి చూసుకుని ఓహో ఇక్కడికి వెళ్ళేను అన్నమాట అనుకోవలసి వస్తోందిప్పుడు. ఇది కూడా ఒక కారణమే నాకు నమ్మకాలు అట్టే బలంగా స్థిరపడకపోవడానికి. ఇంతకీ ఈ ప్రయాణంలో ఒక అనుభవం –

చెప్పేను కదా మాఇంట్లో అన్ని రకాలూ ఉన్నారని. మా పెద్దన్నయ్య పరమ నాస్తికుడు. రెండో అన్నయ్య, నాతో తిరిగినవాడు, నమ్మకాలున్నవాడే కానీ మూఢనమ్మకం స్థాయి లేదు. ఆ ప్రయాణంలో పుణే దగ్గర ఉన్న ఏదో కొండమీద ఆలయానికి బయల్దేరేం. మంచి ఎండలు. పైగా అమెరికా వాతావరణానికి అలవాటు పడ్డానేమో నాకు మరీ కష్టం అయింది. మాఅన్నయ్య చెమటలు కక్కుతున్నాడు. “మనవల్ల కాదులే. పద, వెనక్కి పోదాం,” అన్నాను. ఇంటికొచ్చేక మా పెద్దన్నయ్యతో చెప్తే, “ఏం, నీదేవుడు నిన్ను కొండ ఎక్కించలేకపోయేడేమిటి?” అని నవ్వేడు.

నాకు మంచి సమయస్ఫూర్తి కలిగిన సమయాల్లో ఇదొకటి. “ఎంతవరకూ వెళ్ళగలనో, ఎప్పుడు వెనక్కి తిరగాలో తెలుసుకోగల జ్ఞానం ఇచ్చేడు,” అన్నాను. వాడు మరి మాటాడలేదు.

ఇంతకీ ఇదంతా ఎందుకొచ్చిందంటే, అనుపమకి నామాటమీద గొప్ప నమ్మకం ఏర్పడిపోయింది గత ఐదారేళ్ళలో. “మీయింటికొస్తే అమ్మగారింటికొచ్చినట్టు ఉంటుంది,” అంటుంది. అలా నాకో బాధ్యత ఏర్పడిపోయింది. నిత్యవ్యవహారంలో మా మాటలూ చేతలూ అదే అర్థం స్ఫురింపజేస్తాయి. అంచేతన్నమాట నేను చిక్కులో పడ్డాను. ఏం చెప్పను? ఆ పిల్లకి తెలీదు నాకథంతా పూర్తిగా. సుమారుగా తెలుసు కానీ అట్టే వివరాలు తెలీవు. చెప్పే ఉద్దేశం నాకు లేదు.

స్థూలంగా నా నమ్మకాలు – నిజానికి దేవుడు ఉన్నాడు అని నిర్దుష్టంగా నమ్మినవాళ్ళతో నాకు పేచీ లేదు. దేవుడు లేడు అని దృఢంగా నమ్మినవారితో కూడా నాకు పేచీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి కదా. కానీ నాకు తంటా అంతా దేవుడు ఉన్నాడనో లేడనో నన్ను నమ్మించడానికి ఆరాటపడిపోయేవాళ్ళతోనే అన్నమాట.

పైన చెప్పినట్టు గుళ్ళూ గోపురాలూ తిరిగినప్పుడు నాకు అధికంగా కలిగిన అభీష్టసిద్ధి ఏమీ లేదు. పూజలు మానేసినందున ప్రత్యేకించి వచ్చిన కష్టాలూ లేవు సత్యనారాయణ వ్రతకథలోలాగ. అసలు నాజాతకంలోనే ఉంది “ఈ జాతకురాలికి భుక్తికి లోపము ఉండదు,” అని. అలాగే కూటికీ గూటికీ లోపం లేకుండా జరిగిపోతోంది. ఏదో ఒక ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తే తప్ప నేను ఏ పనీ చేయను. చేసినా చెయ్యకపోయినా ఒక్కలాగే ఉంటే, చెయ్యకపోవడమే నా మతమూ, అభిమతమూను. మరి ఈరాతలెందుకూ అని అడక్కు. ఈ రాతలఉపయోగం దినము గడుపుట లేదా కాలము చంపుట.

నేను పూజలు చేయడం ఎందుకు మానీసేనో అనుపమకి చెప్పాలంటే పైకథంతా చెప్పాలి. ఇంకా చాలా వివరాలు కూడా చెప్పాలి. నేను మాఅమ్మని అడిగినట్టే అనూ కూడా నన్ను అడుగుతుంది కదా. అప్పుడు నేను వాటన్నిటికీ జవాబులు చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోవడంలో “నాకు నమ్మకం లేదు కనక నువ్వు కూడా నమ్మకు” అని ఆ పిల్లని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదూ? కనిపించి తీరుతుంది. అది కూడా నాకు సమ్మతం లేదు. అంటే నానమ్మకాలకి విరుద్ధం!

“ఆదివారం వినాయకచవితిట. జాలంలో చూసేను.”

“పూజ చేస్తున్నావా?”

“నాకు తెలీదు ఎలా చెయ్యాలో. నువ్వేమో పూజలు మానీసేనంటున్నావు,” అంది నిష్ఠూరంగా.

“నేను చెయ్యనన్నాను కానీ నిన్ను చెయ్యొద్దు అనలేదు కదా. నేను చేయిస్తాలే. కావలసిన సంభారాలు సమకూర్చుకు రా,” అన్నాను.

ఎవరికి ఏం చేస్తే మనశ్శాంతి కలుగుతుందో అది వారు చెయ్యడమే మతములలోకెల్ల ఉత్తమ మతము అని నా మతము. మిగతావన్నీ ఉట్టుట్టి మాటలే.

000

(జనవరి 20, 2016)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మనలో మనమాట 5 – అస్తి నాస్తి”

 1. అయ్యో అలా అనకండి. మీకు ఈ రచన అర్థవంతంగా కనిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ముఖపత్రంలో పంచుకోడంతో ఆనందం ఇనుమడించింది. మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మాలతిగారూ, సరిగ్గా ప్రతిబింబాన్ని చూసుకున్నట్టయింది. బాగా రాసారని కితాబులివ్వడానికి నేనెంతటిదానను?అభినందనలు!

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. చాలా సంతోషం చంద్రిక గారూ, మీ విపులవ్యాఖ్యకీ, నారచనలు చదువుతున్నందుకూ. కాలగతిననుసరించి చిన్న సవరణలు చేసుకుంటూ పోవడమే ఆరోగ్యం మరి.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు!! మీ ముఖపత్రం టపాలు, అప్పుడప్పుడు మీ బ్లాగు చదువుతుంటాను. విషయాన్నీచాలా బాగా చెప్తారు మీరు. వసుధ రాణి గారు చెప్పినట్లు సమాజం కోసమే ఇవన్నీ!! చాదస్తం గా, ఎందుకు చేస్తున్నామో తెలీక చేస్తుంటే చిరాకు, జాలి కలుగుతుంది. దీపావళి ఎందుకు చేసుకుంటామో చాలా కథలు చెప్తారు. Halloween, దీపావళి దాదాపు ఒకే సమయం లో జరుపుకున్నాక గమనించింది ఏంటంటే పగటి సమయం తగ్గటం గడియారాలు వెనక్కి తిప్పటం కూడా అదే సమయం లో జరుగుతోంది అని. ఏదో ఒక కథ చెప్పక పోతే దీపాలు వెలిగించే వారు ఉండరు కదా మరి !! పూర్వ జన్మ ఉందో లేదో ఎంత మంది చూసారో తెలీదు కానీ ఏదైనా ఆపద వచ్చినపుడు, ఏమి చేయలేని పరిస్థితి లో ఏ మనిషికైనా ‘Why me?’ ప్రశ్న వెంటనే ఉంటుంది. పూర్వ జన్మ లో చేసిన పాపం అనుకుంటే కాసేపు ఆత్మ సంతృప్తి.

  మెచ్చుకోండి

 5. చాలా బాగు చెప్పేరు వసుధా రాణీ, నిజానికి అనేక సంప్రదాయాలు సామాజికకోణంలోనుండి వచ్చినవే. వాటిని దుర్వినియోగం చేసే కొందరిమూలంగా అందరికీ, అన్ని ఆచారాలకీ చెడ్డపేరు వస్తోంది. నిజానికి నాస్తికవాదం కూడా అంతే.

  మెచ్చుకోండి

 6. భారతీయ సాంప్రదాయం లో నోములు వ్రతాలు అన్నీ ఏదోఒక ప్రయోజనం కోసం చెప్పబడ్డవే ఐతే గుడ్డిగా ఆచరించటం కాకుండా దానివెనుక అంతరార్ధం తెలుసుకుని పాటించటం ఉత్తమం..ఉదాహరణకి ఇంటికి వచ్చిన వారికి బొట్టుపెట్టి పండు ఇవ్వమనటం వెనుక ఇతరులతో పంచుకోవటం నేర్పించటం ……మీరు చెప్పింది నిజమే ప్రతి వ్యక్తి తన ఇష్ట మైన దాన్ని మనస్పూర్తిగా ఆచరించ వచ్చు ఐతే తను పాటించే పద్ధతిలో ఉండమని ఇంకొకరిని ప్రభావితం చేయాలని చూడరాదు వీలైతే వేరేవారి మనోభావలని గౌరవిస్తే మరీ మంచిది…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s