మనలో మనమాట 6 – వంటింటి సంబరాలు!

గ్రామము చేత నుండి పరికల్పిత ధాన్యము నింట నుండి శ్రీ
రామ కటాక్ష వీక్షణ పరంపరచే గడతేఱె గాక మా
రామయమంత్రి భోజన పరాక్రమ మేమని చెప్పవచ్చు నా
స్వామి యెఱుంగు దత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్.

ఇది శ్రీనాథుని చాటువు. తెలుగువారు భోజనప్రియులు అని ఎక్కడో విన్నాను. ఆమాటకొస్తే భోజనప్రియులు కానివారెక్కడున్నారు కనక? ఏ ప్రియులైనా కాకపోయినా భోజనప్రియులవడం మాత్రం నిశ్చయం ఏజాతి అయినా గానీ. తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అని ఎందుకన్నారంటే భోజనంలో లోపం చెయ్యడనే. ఏమో, ఆలోచిస్తే తిమ్మరాజుని ఎందుకనడం అని కూడా అనిపిస్తోంది.

ఇంతకీ నాతిండి మాటకొస్తే, నాకు రెండు ఆనవాయితీలు ఉన్నాయి. మొదటిది – నేరుగా తినగలిగింది కూడా దానికి మరేవో నగిషీలు చెక్కకుండా తినలేను. ఆపిలుందనుకో. చాలామంది దాన్ని కడిగి చొక్కాకి రుద్దుకుని – ఇదెందుకు చేస్తారో నాకు తెలీదు కానీ చాలామంది అలా చెయ్యడం చూసేను – కొరుక్కు తినేస్తారు. జాంపండయినా అంతే. నేను మాత్రం తీరిగ్గా ఓ కత్తీ, చిన్న పళ్ళెం తెచ్చుకుని బల్లదగ్గర కూర్చుని, తొక్క తీసి, ముక్కలు కోసి, ఆ ముక్కలమీద కొంచెం పంచదారా దాల్చినచెక్క పొడి చల్లి మైక్రొవేవులో పావుగంట ఉడికించి కాని తినలేను. ఈ పద్ధతి సుమారుగా Apple pie లాగే కానీ నాపద్ధతిలో చేసేను కదా. రెండోది – కృష్ణశాస్త్రిగారికి ఉగాదులూ ఉషస్సులూ లేవు. నాకు కొలతలు, తయారీ విధానాలూ లేవు. నావెనక తరతరాలుగా ఎవరూ ఇన్ని కప్పులు, ఇన్ని గ్రాములూ, ఇంతసేపూ, ఇంత వేడి అంటూ లెఖ్ఖలు కట్టలేదు కదా. చారెడు పప్పు ఉడకబెట్టి చిటికెడు ఉప్పేసి, ఆవాలూ మినప్పప్పూ ఓ మిరపకాయా, ఇంగువా పోప్పెట్టేస్తే పప్పయిపోయింది. మళ్ళీ పోపేసి కూరముక్కలు … ఇలాగే కదా. ఇందులో ఉన్న గొప్ప సౌకర్యం ఏమిటంటే ఏ కూరా ఒకరోజు వచ్చిన రుచి మరో రోజు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త రుచే. అనుపమ రెండేళ్ళగా నావంట తింటోంది కానీ ఒక్కమారైనా సరదాకైనా ఈ కూరేంటి కిందటిమాటు తిన్నకూరలా లేదు అనలేదు. ప్రతి మారూ అబ్భ ఎంత బాగుందో అంటుంది.

ఇంతకీ ఇవాళ తీపీ, కారం వంటకాలు కొలువుకి పూనుకున్నాను. కొంతకాలం క్రితం ఎవరో “రాగిపిండి బలం, తిను” అంటే సరేనని కొనుక్కొచ్చేను. దానికోసం రెండు మూడు దుకాణాలు తిరిగినప్పుడే గ్రహించేను ఏ పొట్లాం చూసినా మిలెట్ పొడి అనే ఉంటుంది కానీ తరవాత తెలిసింది సజ్జ పిండి, రాగిపిండి, జొన్న పిండి అన్నిటినీ వాళ్ళు మిలెట్ అనేస్తున్నారని. ఇంత అకటావికటపు మనుషుల్ని నేనెక్కడా చూళ్ళేదు అని నాలుగు నిముషాలపాటు చిరాకు పడ్డాను. కొన్నిటిమీద రాగి పొడి అని ఉంటుంది ఇంగ్లీషులోనే. ఇహ పోతే నేను చూసిన రోజున ఏది కనిపిస్తుంది అన్నది గ్రహస్థానాలను బట్టీ నా జాతకాన్నిబట్టీ ఉంటుంది. అసలు నిజం – నాకు ఈ గోల్మాలంతా తెలీనినాడు మిలెట్ ఫ్లోరు అని ఉన్న పొట్లం కొనీసేను. తీరా చూస్తే అది సజ్జ పిండిట. తేడా ఏమిటంటే దీనికి చిరుచేదు ఉంది. ఈ విషయమై అనంత పరిశోధనలు చేసీ, అంతర్జాలంలో అనేక ప్రాణమిత్రుల సలహాలు సంగ్రహించీ కొన్ని కొత్త తయారీ పద్ధతులు తెలుసుకున్నాను.

ప్రధానంగా పిండి ముందు వేయించాలి. తరవాత 1. దోసెపిండిలో ఎత్తుకెత్తు కలిపి దోసెలేసుకోవచ్చు. 2. అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్రా దంచి కొ్ట్టి సజ్జపిండిలో కలిపి పకోడీలు చేయవచ్చు. 3. గోధుమపిండిలో కలిపి పూరీ చెయ్యొచ్చు.

నా ప్రయోగాల్లో మొదటిది సజ్జపిండితో తీపి పదార్థాలు చెయ్యడం. కొంచెం నెయ్యి వేడి చేసి, పంచదార పాకం పట్టి అందులో శనగపిండి, సెజ్జ పిండి కలిపి మైసూరుపాకులా తిప్పడం మొదలు పెట్టేను. అది చూడ్డానికి మరీ మట్టిరంగులో ఉంది. తినడానికి ఎలా ఉంటుందో ఇంకా తెలీదు. మందేం పోయింది అక్కడక్కడా అమావాస్యనాడు చుక్కల్లా తెలుపు కనిపిస్తుంది అని ఓ గుప్పెడు కొబ్బరికోరు వేసి మరోమారు కలిపి దింపేసేను.

అంతా దగ్గర పడ్డాక, పొయ్యిమీంచి తీసి పక్కన పెట్టేను. ఓ అరగంట ఊరుకుని చూస్తే, ఉండలు చెయ్యడానికి తగినంత వేడిలో ఉంది. సరే ఉండలు చేస్తున్నాను కదా అవి నువ్వులు అద్దితే మరింత ఆరోగ్యం కదా అనిపించింది. పంటికింద

DSC02397

 

DSC00025

పలుకు తగులుతుంది కూడాను అని నువ్వులు వేసేను. అన్నట్టు చెప్పడం మరిచేను పళ్ళు ఉన్నంత కాలం వాటికి పని పెట్టాలనే నా అభిమతము. అవి ఊడిపోయేక ఎలాగా గంజినీళ్ళే కదా గతి అని నమలడానికి వీలుగా తీపయినా కారం అయినా చేస్తాను. “తయారీ విధానము”లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను పప్పులు కూడా కలిపేస్తూంటాను.

మరో రకం. పాకం తీసి అందులో పాలపొడి వేసి కోవా చేసేను. ముందు రోజు చేసిన సజ్జ మైసూరుపాకుమీద ఈ పాలపాకం పరిచేను చూడ్డానికి రెండు రంగులతో కన్నులపండువు, జిహ్వకి విందూ అని.DSC00024తీపి అయిపోయింది మరి కారం చెయ్యకపోతే ఏం బాగుంటుందీ అని ముప్ఫై ఏళ్ళగా మూలపడి మూలుగుతున్న బూందిచట్రాలు తీసేను. దుమ్ము దులిపి, తుప్పు కడిగి, శనగపిండి కలిపి పూస కొట్టడం అయేక, జంతికలు చేయ్యకపోతే ఎలా అని జంతికలు చేసేను. పన్లో పని వేరుశనగ గింజలు వేయించి కలిపేను. అవన్నీ చక్కగా ఓ గిన్నెలో వేసి కలిపితే కరివేపాకు లేని లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కరివేపాకు లేని మిక్స్చరు అంటే నవ్విపోరూ అనుకుని హడావుడిగా బజారుకెళ్ళి కరివేపాకు కొనుక్కొచ్చేను. ఆ ఆకులు కడిగి, తుడిచి, వేయిస్తుంటే ఘమఘమలు ఇల్లంతా వ్యాపించేయి. బహుశా పొరుగువారికి కూడా తగిలే ఉంటుంది కానీ ఆ సుమధుర తావి ఆపను ఎవరి తరం అని ఊరుకున్నాను.DSC00171నిజంగా ఇది నేను నా వంటింట్లో చేసిన మిక్స్చరు ఈ బూందీచట్రాల సాక్ష్యంగా.

000

(ఫిబ్రవరి 25, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “మనలో మనమాట 6 – వంటింటి సంబరాలు!”

 1. దంతసిరి కలవారు మీరు… ఎవరు లేకుండా చూసి మరీ ఇంత క్రియేటివ్ గా వండుకు తింటారా? అర్జంటుగా విమాణం (మా ఊర్లో ఇలాగే అంటారు) ఎక్కేసి మీఇంటికి పలారానికి వచ్చేయాలని పించింది…

  మెచ్చుకోండి

 2. < " తెలుగువారు భోజనప్రియులు అని ఎక్కడో విన్నాను. ఆమాటకొస్తే భోజనప్రియులు కానివారెక్కడున్నారు కనక?"

  బాగా చెప్పారు. అటువంటివి అర్ధంలేని అపవాదులు. మంచి భోజనం దొరికితే ఆస్వాదించడానికి భాషాభేదం, జాతిభేదం ఏమిటి !

  జంతికల ఫుటో పెట్టలేదే 🙂

  మెచ్చుకోండి

 3. నేను గుంటూరులో కొన్నాళ్ళు ఉన్నాను కానీ అపకలు అన్నపదం వినలేదు. బాగుంది. మీకు ఈ కబుర్లు నచ్చుతున్నందుకు సంతోషం వనజగారూ.

  మెచ్చుకోండి

 4. బూందీ చట్రాలు అంటే ఏమిటో అనుకున్నాను . వీటిని కృష్ణా ప్రాంతంలో అపకలు అంటారు. మాలతీ గారు మీ వంట తీరు , వంటింటి కబుర్లూ చాలా బాగున్నాయి.

  మెచ్చుకోండి

 5. “మా లైట్” గారు 🙂

  రెండింటి లోనూ వ్యత్యాసం లేదు ! వ్యాఖ్య పెట్టా క కనిపించ క పోయే సరికి పబ్లిష్ గాలేదే మో అనుకుని మళ్ళీ సరి దిద్ది “ప్రచురించు” బొత్తాము నొక్కా ! అంతే ! రెండు మార్లు వచ్చినా యన్న మాట !

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

 6. ఇదేమిటండీ, రెండూ ఒక్కలాగే ఉన్నాయి పదాలు విరుపులో తేడా తప్ప. అదేదో కొత్త ప్రయోగం అనుకుని రెండూ అంగీకరిస్తున్నాను. వీలయితే వివరించగలరు.

  మెచ్చుకోండి

 7. తెలుగు తూలిక వంటింటి తెలుగు వంట
  తెలుపు ననుకొని వచ్చితి తెలియ వచ్చె
  తెలిసె తలపుల కలయిక తీయ ననగ
  నిడదవోలు మాలతి టపా నిక్క ము గద !

  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s