మనలో మనమాట 7 – బరువు గోల!

ఏంటో బరువు అనగానే నాకు ఠక్కున గుర్తుకొచ్చేది మ్రోయింపకోయి మురళి కృష్ణా మ్రోయింపకోయి, తీయతేనియబరువు మోయలేదీ బ్రతుకు అన్నపాట. చిన్నప్పుడు రేడియోలో వినేదాన్ని ఎంతో ఇష్టంగా. ఇప్పుడు ఆ బరువుల్లేవు.

ఇప్పుడంతా బరువు బరువంటూ బరువుగురించి పడే ఆవేదనలే ఎక్కడ చూసినా. నేను ఇంతవరకూ బరువుమీద రాయలేదు కొంతవరకూ అరువుమీదా కరువుమీదా రాసేను, అరుపులమీద కూడా కొంచెం గిలికినట్టున్నాను కానీ ఈ బరువుమాట మాత్రం ఇదుగో ఇప్పుడే మొదలు. నిజానికి నాకు ఈ బరువుమీద రాయాలంటే కొంచెం భయం. “నీకేం హాయిగా చీపురుపుల్లలా ఉన్నావు కనక ఎన్నిమాటలేనా చెప్తావు” అని కోపగించుకుంటావు నువ్వు. రెండు మేడలూ, నాలుగు వాహనాలూ, మునిమాపువేళ మూడుగుర్రాలసేవా నోచుకున్న మహారచయితలు బీదల బాధలగురించి కవిత్వాలు రాసినట్టే అని కూడా దెప్పుతావు. హీహీహీ అద్సరే గానీ పుల్లలా అంటే అను గానీ చీపురుపుల్ల ఏమిటి … ఛీ. సరేలే. అసలు సంగతి నీకు తెలీదు కానీ నాకూ ఉంది బరువు … నీకు కనిపించనిచోట. అంచేత ఆ ఊసెత్తెకు నాదగ్గర.

మాటవరసకి చెప్పేను కదా బరువులు పలు రూపములలో వచ్చునని – పరువు బరువు, అరువు బరువు, కరువు బరువు. ఆడవారికి నగలే అందం అని కొందరంటే నగలు బరువు అనేవారూ ఉన్నారు. ఎవరిబరువులు వారివి.

వాటన్నిటిసంగతీ ఇప్పుడొద్దు కానీ ఒంటి బరువుమాట కొంచెం చెప్పుకుందాం. అసలు నిజం చెప్పాలంటే నాక్కూడా చిరాకే “అందం మనసులో ఉండాలి కానీ మొహంమీద కాదం”టూ ఓదార్చేవాళ్ళని చూస్తే. ఇలా అనేవాళ్ళందరూ ఓ మోస్తరుగా అందంగా ఉన్నవాళ్ళే. లేదా ఉన్నాం అనుకునేవాళ్ళే అయిఉంటారు. వాళ్ళు కూడా గంటకోమారు బాగున్నానా ఇంకొంచెం చివరి తీర్పులు అవుసరమా అనుకుంటూ అద్దమును సంప్రదించకుండా ఊరుకోరు. చాలామంది విషయంలో అది అసంకల్పంగా జరిగిపోతుంది కూడాను. అందుకే ఆమాట వదిలెయ్
నేనూ ఒప్పుకుంటాను కొందరివిషయంలో స్థూలశరీరం అనేక కారణాలమూలంగా బాధాకరం అవుతుంది. వాళ్ళని నేను తప్పు పట్టను. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటే మంచిదే. కానీ పొద్దు పొడిచీ పొడవకముందే లేచి ఆ బరువుమెషీనుకి అతుక్కుపోయి పౌను తరిగేను, పౌను పెరిగేను అంటూ లెక్కలు చూసుకోడం మాత్రం ఆరోగ్యం కాదనే నా అభిప్రాయం.

అసలు బరువూ, ఉరువు గొడవ తెచ్చిపెట్టినవాళ్ళెవరో తెలుసా మరో పనీ పాటూ లేనివాళ్ళు. ఆడవాళ్ళని నిండుకుండమీద మరో కుండ బోర్లించినట్టు ఉండాలనీ, నీటిగడియారంలా ఉండాలనీ తీర్పులు చెప్పింది ఏ మహరాజు ప్రాపకంలోనో పూటుగా ముప్పొద్దులా మూడు కంచాలు చెల్లించి, తూగుటూయలలో ఊగుతూ అరమోడ్పుకనులతో ఆ కాంతామణులని దర్శించుకుని ఆరూపములను సృష్టించిన కవులు కాదూ? కళ్ళు అర మూసుకుపోవడంచేత ఎదట నిలిచి కప్పురవిడెములు అందించే అన్నులమిన్నలు సగమే కనిపించేరేమో వారికి మరి. మరీ అలిపిరిగా ఉండి ఆ ఆడవాళ్ళు వారి అర కన్నులకి ఆనలేదేమో. అంచేత అలా తమ వర్ణనలతో ఆడవారి ఉరువు వంకరటింకరగా పెంచేసేరు. ఇంకా కొందరు అందగత్తెలంటే సన్నగా చువ్వల్లా గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉండాలన్నారు. వారివెంట పడి పాఠకమహాశయులు దానికి వంత పాడేరు. ఇంతలో జెన్నీ క్రేగ్ కంపెనీలు తగులుకున్నాయి. ఇహ ఓప్రా విన్ఫ్రీలు చేరి ఆ సంగీతమే మరింత పైస్థాయిలో కాకలీస్వనంలో పాడుతున్నారు.

అంతెందుకూ, మన గుడిగోడలమీద నాట్యకత్తెలూ గర్భగుడిలో అమ్మవారూ అందరికీ – అవే బరువులు కదా. ఆ శిలామూర్తులేవీ గాలికి ఎగిరిపోయేట్టుండవు. గుడిలో మూలపీఠం అధిష్ఠించిన రాజరాజేశ్వరీ విగ్రహం పటిష్ఠంగా గంభీరంగా వర్ణనలకందనంత హుందాగా ఉంటుంది కానీ రివటలా కాదు కదా. కొన్ని శిల్పాలు చూస్తే జపాను సుమో మల్లయుద్ధవీరులని జ్ఞాపకం తేవూ? బాలాత్రిపురసుందరి, కన్యాకుమారి – వీరివి సూక్ష్మశరీరాలేలే. సూక్ష్మంగా ఒక్కమాటలో గత రెండు వేల సంవత్సరాలలోనూ గాలిబుడగలా అనన్యసామాన్య వంపులు పుంజుకున్న సౌందర్యము యొక్క చరిత్ర ఇదీ.

మాటవరసకి అడుగుతున్నాను. తెల్లారి లేచి మొహం కడుక్కుని, కాఫ్యాదులు సేవించి వీధిలోకి బయల్దేరేముందు ఎవరైనా ఆడ గానీ మొగ కానీ మరోమారు అద్దంలో చూసుకోకుండా వెళ్తున్నారా లేదా? ఎందుకంటే ఎలా కనిపిస్తాం అన్నది ప్రధానం. అయితే దానికోసం అన్నపానాదులు మానేసి రాత్రీ పగలూ దిగులు పడిపోతూ కళ్ళబడ్డ ప్రతి ఉపాయం, వినిపించిన ప్రతి సలహా అనుసరించాలా అన్నప్రశ్న ప్రస్తుతం ఆలోచించాలి. ఈ విషయం మనం అందరం సుదీర్ఘంగా కొన్ని నెలలపాటు మహోధృతస్థాయిలో తర్కవితర్కాలూ సాగించాలి. అలా తర్కించడంలోనూ, తర్కించడానికి ఉద్యుక్తులవడంలోనూ బుద్ధీ కాలమూ వెచ్చించబడి, బరువుమీంచి మన మనసు మరలిపోతుంది. ఇది ఒక ఉపాయము.

మాటొచ్చింది కనక నా డైటు ప్లానులు కూడా చెప్తాను.

మొదటిది – నాకు తినాలనిపించినప్పుడు పుష్కలంగా నిర్మహమాటంగా నెయ్యీ పంచదారా ఉక్కిరిబిక్కిరి చేసేంతగా వేసి చేసిన తీపిమిఠాయిలు తనివి తీరా తినేస్తాను. అప్పుడు మొహం మొత్తేసి మళ్ళీ ఆర్నెల్లపాటు వాటివేపైనా చూడ్డానికి మనసు రాదు.

రెండోది – ఈ ఉపాయం చాలామందికి చాలా తేలిక అనే అనుకుంటున్నాను. నన్ను ఓ మనిషి నొప్పించేడనుకో. వాణ్ణీ వాడి ప్రవర్తననీ ఒక్కమారు తలుచుకుంటే చాలు మరింక ఆ దెబ్బతో అన్నపానీయాలు సయించవు. ఆ మహానుభావుడే నా డైటు ప్లాను. నిన్ను నొప్పించినవాడు ఇంకా పుట్టలేదంటావా. సరే. నామటుకు ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడనే నా నమ్మకం.

మరీ అంత కరువైతే, ఓ జాలమందలోనో చేరిపో. ఇనుమిక్కిలి ప్రసిద్ధుడైన మహా రచయితనో నాయకుడినో వినాయకుడినో విమర్శపేరుతో ఓ పుల్లవిరుపుమాట పారేస్తే సరి. క్షణాలమీద కొంపలంటుకుపోతున్నట్టు ముప్ఫైమంది బరిలోకురికి ఈకకి ఈక పీకి నిన్ను ఉతికి ఆరేసేస్తారు. అంటే తలా తోకా లేని ఒక వితండవాదము మొదలు పెట్టాలి. ఇదీ రెండో ఉపాయము.

అయ్యో, ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలడం మ్ నాకిది మామూలయిపోయినట్టుంది. బరువుగురించి బరువైన ఆలోచన చేసి, మిడిమిడి పాండిత్యం ఒలకబోస్తూ ఏవో రెండు అద్భుత సూచనలు ఇద్దాం అని మొదలు పెట్టేనా ప్చ్. బహుశా చెప్పడానికేం లేకపోవడంచేత అనుకుంటా ఇలా పనికిమాలిన కబుర్లు దొర్లుకొచ్చేయి. క్షమించవలెను.

000

(మార్చి 7, 2015)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “మనలో మనమాట 7 – బరువు గోల!”

 1. బరువుమాటెలా ఉన్నా మీ పద్యం బాగుందండీ. ఈ పద్యాలన్నీ వేరే తీసి పెట్టుకుని ఓ చిన్న పుస్తకం వేసుకోవచ్చు. సంతోషం జిలేబీగారు జాలమందలమీద పడి మీబరువు వారికి రవాణా చేస్తున్నందుకు.

  ఇష్టం

 2. ప్రస్తుతానికి మా వంతు గ జాలమంద ల మీద, మీడియా మీద పడి మా ‘బరువు’ ని తగ్గించు కుంటున్నాం🙂

  మీ బరువు కథ (మాలతి తూలిక ఈ రెండింట్లో ఏది బరువు తక్కువో తెలియదు🙂 ) బాగుందండి !

  చెప్పిన ఉపాయాలు తరుణోపాయాలు సెహభేషు🙂

  కరువు మీద ముందు కథలను జెప్పితి
  పరువు మీర కూడి పట్టు బడితి
  బరువు మీద నేడు బడితిని చదువరి
  అరువు ఉరువు కరువు బరువు నెలవు

  చీర్స్
  జిలేబి

  ఇష్టం

 3. ఫరవాలేదండి. ఎవరి చిట్కాలు వారివి. మీకు అదే బాగుంది కదా. అంతే కావలసింది. హాయిగా తినేస్తూండండి.

  ఇష్టం

 4. నెయ్యి, పంచదారా విషయం భలే నచ్చిందండి😀. నేనూ అంతే ఇష్టమొచ్చింది మొకమాటం లేకుండా తినేస్తాను. కానీ, మీలా నాకు మొహం మొత్తడం అనేది జరగదు, అదే సమస్య…:(. బాగా తినటం .. తరువాత ఏ జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు ట్రెడ్మిల్ పై పరుగులు, బరువులు ఎత్తడం… మా అన్న అంటుంటాడు “తినటం ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు” అని😦

  ఇష్టం

 5. మీరు ఖచ్చితం గా సన్నగానే ఉన్నారు ఎందుకంటె ఇంత బరువైన కథని అంత వీజీగా తేలికగా రాయలేరు. భారం తో చెయ్యి కూడా కదలటం లేదు మరి మాకు.భారములు 3 రకములు. శిరోభారం(నా రచనలన్నమాట) హృదయభారము(నా రచనలు చదివినాక మీరు గుండె పట్టుకుంటారు) శరీర భారము (మావూళ్ళో ఉన్న అన్నిరకాల జిమ్ముల వాళ్ళ దగ్గర నా బరువు చిట్టా ఉంది).

  Liked by 1 వ్యక్తి

 6. సరే అడుగుతున్నా. వివరంగా చెప్పండి. అయినా నేను సన్నగా ఉన్నానని నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నిజం అవునో కాదో మీకు తెలీదు. హీహీ

  ఇష్టం

 7. మాంచి బరువైన విషయం చర్చించారు….మీకేం మీరు ఏమైనా చెప్తారు సన్నగా ఉన్నారు కనుక బరువు కధను బరువున్న వాళ్ళను అడిగి చూడండి చెప్తాము…

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s