మనలో మనమాట 8 – నేను కూడా పద్యం రాసేను!

నాకిది మరో ప్రస్థానం. చాలా కాలంగా పద్యం ఎలా రాయాలి అన్న అంశంమీద ఏ బ్లాగులోనో జాలపత్రికలోనో వ్యాసాలు కనిపించినప్పుడల్లా ఒస్ ఇంతేనా అనుకుని ఓ రెండ్రోజులు కుస్తీ పట్టడం, తరవాత చూద్దాంలే అనుకుని వదిలేయడం జరుగుతూ వచ్చింది. సాధారణంగా ఏ పనైనా చేతనయినవారికి ఆ పని చేయలేనివారి బాధ అర్థం కాదు. వ్యాసాలు ఒస్ ఇంతేనా అనిపించేలా ఉంటాయి కానీ చేతకానివారికి అదొక యజ్ఞం. ఇది నిత్యసత్యం.
ఈమధ్య ఇటు బ్లాగులోనూ అటు ముఖపుస్తకంలోనూ పద్యాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ అవలీలగా మంచినీళ్ళప్రాయంగా రాసేస్తున్నట్టు అనిపించి, నాకు మాత్రం ఎందుకు రాదూ అని పౌరుషం పొడుచుకొచ్చింది. ఇక్కడ మరోసంగతి కూడా ఒప్పుకోవాలి. నాకు ఏ సాహిత్యతెగులు తగిలినా నాముఖపత్రంలో చెప్పుకుంటే తెలిసినవారు చక్కని చిట్కాలు ఇస్తారు సాదరంగా.

ఆ విధంగా నా సరదా తీరింది పది రోజులక్రితం. నా ముఖపత్రంలో “సూర్యగణం, చంద్రగణం, యమాతారాజభానస లాటి సూత్రాల ఊసు లేకుంండా పద్యం రాయడానికి అడ్డదార్లేమైనా ఉంటే చెప్పమ”ని అడిగేను. నాసంగతి తెలిసినవారు మంచి సూచనలు కొన్ని ఇచ్చేరు. కందపద్యం, తేటగీతికి కావలసిన మాత్రలు కూడా సూక్ష్మంగా ఇచ్చేరు. సుమారుగా ఓ టెంప్లేటు అనుకోవచ్చు. వేమన, సుమతి శతకాలు, పోతన భాగవతంలో పద్యాలు చదివి నడక ఎలా సాగిందో పరీక్షించి చూసుకుంటే తేలిక అవుతుందని కూడా చెప్పేరు.
మళ్ళీ జీవితంలో రెండోసారి “ఒస్ ఇంతేనా” అనుకుని పన్నెండోసారి పద్య అక్షరాభ్యాసం చేసేను లాపుటాపు ఒడిలోకి తీసుకుని. అప్పుడూ అసలు కిటుకు తెలిసింది. అదేమిటంటే నాకు కథలూ, కబుర్లూ, వ్యాసాలూ రాయడం కదా అలవాటు. అంచేత ఏ విషయంమీద పద్యం రాయబోయినా … అసలేం జరిగిందంటే,

చెప్పొచ్చేదేమిటంటే లేదా అనగా అనగా ఒక ఊళ్ళో – ఇలా వస్తున్నాయి వాక్యాలు. కథకి క్లుప్తత కావాలంటారు కానీ పద్యానికి ఇంకా చాలా చాలా క్లుప్తత కావాలి. అంచేత ఒక పాదం రాసేననుకుని చూసిన ప్రతిసారీ కథకి పనికొచ్చే వాక్యమయి తేల్తోంది.
పద్యం మొదలు పెట్టడం అలా కాదని తెలుసుకోడానికి రెండు పూటలు పట్టింది. ఇది ప్రథమ తప్పు. రెండోది ఏ అంశంమీద రాస్తాం అన్నది కూడా చాలా నిశితంగా పరీక్షించి చూసుకోవాలని తెలియడం. చెప్పేను కదా ఏ విషయం తలుచుకున్నా చెప్పవలసింది బోలెడు ఉండి కనీసం ఒక పేజీ పట్టేటట్టుంది. అది నాలుగు పాదాల్లో ఇరికించడం ఎలా? స్వతస్సిద్ధంగా కవులయినవారికి ఇది చాలా తేలిక కావచ్చు. కానీ నాలాటి కొత్త బిచ్చగాళ్ళకి మాత్రం కొంత శ్రమ తప్పదు ఏ కబురు నాలుగు పాదాల్లో ఇరికించగలం, అది చదివేవారికి కొంతలో కొంతైనా ఇంపుగా ఉండునా లాటివి గ్రహించడానికి.
సరే ఈ పద్యరచనసంగతి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటే మంచిది అనుకుని అంతర్జాలంలో వెతికేను. చాలా వ్యాసాలు ఒస్ ఇంతేనా అనిపించేలాగానే ఉన్నాయి. రాత మొదలు పెట్టేసరికి కథ మామూలే. అలా కొన్ని కుస్తీ పట్లు పట్టి ఓ పద్యం పూర్తి చేసేను. కానీ అది సరిగా ఉందో లేదో తెలియాలి కదా. కిటుకులు చెప్పిన స్నేహితులనే మళ్ళీ అడగడానికి మొహమాటం. ఏదో చిట్కాలంటే చెప్పేం కానీ నీ పద్యాలన్నీ దిద్దుకుంటూ కూర్చోడానికి మాకేం పన్లేదా అని వారు అనరు కానీ వారిని అలా అనిపించవలసిన స్థితిలో పెట్టడం నాకే భావ్యం కాదు కదా.

అలా ఆలోచిస్తూ మళ్ళీ జాలంమీద పడ్డాను. ఇదేదో నాకోసమే అన్నట్టు ఒక మంచి వనరు దొరికింది పేదకు పెన్నిధివలె. ఆ సైటు http://chandam.apphb.com/. పద్యరచనకి కావలిసిన అనేక అంశాలు సూక్ష్మంగా వివరించడమే కాక రాసిన పద్యాలను సరి చూసుకోడానికి వసతి ఏర్పాటు చేసేరు. అంటే మనం రాసిన పద్యం అక్కడ పెట్టెలో పెడితే, గణాలలెక్క, గురువులూ, లఘువులూ అన్నీ ఎక్కడ సరిగా లేవో స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ఆ పెట్టెలోనే మనం దిద్దుకుంటూ సరిచూసుకుంటూ పోవచ్చు. నిజంగా ఈ సైటు నాకొక వరమే. ఆ సైటు నిర్వాహకులకు నమోవాకములు.
అలా మిత్రులు ఇచ్చిన కొండగుర్తులతో నాలుగు పాదాలు రాసి, పైన చెప్పిన ఛందస్సు సైటులో సరి చూసుకుని పద్యం రాసేసేను అనిపించుకున్నాను. ఇది నామొదటి పద్యం.

అల సాగినశాఖ కొనలు
వాలిచి శిఖ అందుకొమ్మనె మధు రుచితరము
పులకము చేరె ముదమునన్
అల ఆతిథ్యము అందముగా అమరె గదా.

ఈ పద్యానికి స్ఫూర్తి నేను రోజూ నడిచే దారిలో కనిపించిన ఒక మొక్కా, దానిమీద తిరగాడుతున్న తేనెటీగలూ. ఎటొచ్చీ మర్నాడు నేను కెమెరా పుచ్చుకు ఆ బొమ్మ తీద్దాం అని చూస్తే, తేనెటీగలు శలవులో ఉన్నట్టున్నాయి ఒక్కటి కూడా కనిపించలేదు.
DSC00213నా తొలి పద్యం ముఖపత్రంలో ప్రచురిస్తే మిత్రులు బాగానే ప్రోత్సహించేరు. నాకే అంత తృప్తిగా లేదు. అంచేత నా ప్రయత్నాలు కొనసాగించడానికే నిశ్చయించుకున్నాను.
నా రెండో పద్యం

చెన్నుమీరంగ నీపోస్టు చదవకున్న
కన్నులారంగ బొమ్మలు చూడకున్న
అన్న చక్కని గానము చేయకున్న
ఎన్ని పోస్టులు వెట్టిన వెతయె గాదె

వేరే చెప్పక్కర్లేదు కదా ఇది ముఖపుస్తకంగురించే అని.
ఈ రెండు పద్యాలూ అయేక ఇంక రాయననుకున్నాను కానీ ఛందస్సు సైటు చూస్తే మాత్రం నాకు భలే సరదాగా ఉంది. ఆ హుషారులోనే మరో రెండు కూడా రాసేసేను.

ఎందుకొచ్చిన రంధి యమ్యే బియేలు
పొందుగ చదువు ముఖపుస్తకం టపాలు
చెప్పును కథలూ కవితలూ చూపు పూలు
మీరు ఇచ్చిన ఒక లైకు మోదము మరి

కానీ, మరోమాట కూడా ఇక్కడే చెప్పుకోవాలి. ఇలా గణాల్లోనూ యతిప్రాసల్లోనూ గురువులూ లఘువుల్లోనూ నాఆలోచనలు ఇలా ఇరికించేడం అంతగా నచ్చలేదు.
నాకెలా తోస్తే అలా రాసుకుపోవడమే హాయిగా ఉంది. అవి చదివి ఆమోదించేవారుండడం నా అదృష్టం.

చిన్న సూచన. కొత్తగా పద్యరచన చేయాలనుకునేవారికి మరో మంచి వనరు కంది శంకరయ్యగారి http://kandishankaraiah.blogspot.com/. ఇక్కడ చాలా చక్కగా వివరించేరు శంకరయ్యగారు. వారికి నమోవాకములు.

(మార్చి 12, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “మనలో మనమాట 8 – నేను కూడా పద్యం రాసేను!”

 1. ధన్యవాదాలు నారాయణస్వామీ, మీరు చెప్పినపేర్లు నాకు పరిచయమే. వాళ్ళు చిన్నవాళ్ళు కదా మెదడు పదునెక్కువ :p. అలాగే మీరు చెప్పిన కవుల కావ్యాలు కూడా చూస్తాను. నాకు కూడా పూర్తిగా వదిలేయని లేదు. మీ ప్రోత్సాహానికి ఎంతైనా కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 2. జిలేబి గారు చమత్కారం బానే ఉంది గాని
  యల్ మన … అన్నప్పుడు రెండో అక్షరం ల్మ సంయుక్తంగా గణించ బడుతుంది, ప్రాస కుదరదు 🙂
  మాలతి గారు, మీకు ఉత్సాహం కలగాలని ఒక ఇద్దరి ఉదాహరణలు చెబుతాను.
  రానారె అనే పొట్టి పేరుతొ ప్రసిద్ధుడైన రామనాథ రెడ్డి, నేను బ్లాగు మొదలెట్టే సమయానికే ప్రముఖ బ్లాగరి. ఒకసారి నా బ్లాగులో రెండు సరదా కంద పద్యాలు చదివి ఉత్సాహపడి ఆరు నెలల్లో కవి సమ్మేళనంలో సమస్యా పూరణలు చేసే పరిణతి సాధించాడు.
  రాకేశ్వర అని ఇంకో యువకుడి కథ ఇంకా విచిత్రం. ఆతను బళ్ళో తెలుగు చదివుకోలేదు. అమెరికాలో మాస్టర్సు చదువుతూ తెలుగు మీద ప్రేమతో తెలుగు బ్లాగు మొదలెట్టాడు. భాష బీభత్సంగా ఉండేది. ఆతను కూడా ఈ ప్రోద్బలంతో భాషతో పాటు ఛందస్సు కూడా నేర్చుకుని అతను కూడా కవిసమ్మేళనంలో చక్కటి పద్యాలూ రాసాడు. గిరి అనే ఇంకో యువకుడు కూడా.
  పద్యం రాయడం గురించి మీ గమనికలు చాల సమంజసంగా ఉన్నాయ్. క్లుప్తత ముఖ్యం. కాస్త పొడుగాటి విషయం చెప్పాలి అంటే పద్య మాలికలు కానీ లేదా సీసం లాంటి పొడుగాటి పద్య రూపాన్ని ఉపయోగించు కోవచ్చ్చు. ఇంకో చిన్న సూచన. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను, జాషువా గారి పద్యాలను పరిశీలించండి
  ఇద్దరూ చక్కటి వాడుక భాషలో లాలితమయిన పద్యాలు రాసారు.

  మెచ్చుకోండి

 3. సరళపు చెలువపు తెలుగున
  గిరగిర పలుకుల నడకల కిటుకుల లక్కా
  కు రచన లజూచి నేర్వన్
  కరముగ శ్రీపాద గురువు కరుణన గంటిన్

  మెచ్చుకోండి

 4. శ్యామల తాడిగ డపరా
  యల్ మన మోహన జిలేబి యాగము జేసెన్
  ఆ మాస్టారు అనుకరణ
  నే మది గొనినిటు బుడిబుడి నేర్చితి గనుమా

  కందివరుల కొలువున నే
  బొందితి ఆదరణ, నాదు పొడిపొడి పలుకున్
  అందముగ జేసి నేర్పిరి
  కందము, కవి శంకరయ్య కవనపు రాజుల్

  చందము సాఫ్టున మరిమరి
  డెందపు అమరిక నిఘంటు డేటా బట్టన్
  అందపు బ్లాగుల కామిం
  ట్లందరి జేరెను జిలేబి టపటప వేసెన్ 🙂

  వేసిన కామింట్ల చదివి
  ఆశీస్సులనిచ్చిరిగద ఆదరువు గనన్
  కాసిని తెలుగును నేర్చితి
  మా సిరి యిదియే జిలేబి మాటన్ గనుమా

  మెచ్చుకోండి

 5. పట్టెను పాఠము మాలతి
  గట్టెను పద్యపు విరుపుల గట్టిగ నిచటన్
  బెట్టెను టపాన పద్యము
  గట్టి నిడదవోలు తూలికా రమణి యిటన్

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s