మనలో మనమాట 9 – పరువు తీసీసినాది బాబో !

గల గల నవ్వుతూ వచ్చింది సంద్రాలు.

“ఏంటి సంగతి, అంత నవ్వుతున్నావు?” అన్నాను.

“ఆ బాబు,” అంటూ మరి కొంచెంసేపు నవ్వి, “ఆరి పరువు పోనాదంట,” అంది, నాపక్కనే చతికిలపడుతూ.

“అసలేంవయిందో చెప్పరాదా,” అన్నాను చిరాకు నణుచుకుంటూ.

“ఏటయినాదంటే మామావ అదె మా అప్పమొగుడు ఆడిసేత ఆర్నెల్లు సాకిరీ సేయించుకు కూలీనాంకి గింజుకుంతన్నడాబాబు.”

“ఇస్తార్లే. ఇవ్వకేం చేస్తారు, కాస్త ముందూ వెనకా అంతే,” అన్నాను సద్ది చెప్తూ.

“ఉన్నోళ్ళందురికీ అదే రొగం. మన్సేత పనేంవో సేయిచ్చుకుంతరు సిటవంత దోకా రారాదందల. పన్చేయిచ్చుకోనానికున్న ఉసారు డబ్బులిదల్చనానికుండదు. మనకే నిరవాకం సేత్తున్నట్టె నానుస్తరు.”

అవును. నేనూ చూసేను ఈ ధోరణి. వాళ్ళపని కావల్సినంతసేపూ ఉత్తరాలమీద ఉత్తరాలు గుప్పిస్తారు “ఏదీ, ఇంకా కాలేదా, ఇంకా కాలేదా అంటూ. నేను కూడా పడ్డాను అలాటివాళ్లవాత. వాళ్ళవంత పని వాళ్ళు చేయడానికి, డబ్బివ్వడానికీ మాత్రం ఎక్కడలేని ఆటంకాలూ ఎదురవతాయి.

“అసలేంవయింది?” అనడిగేను మళ్ళీ.

పెద్ద మేస్త్రీ సంద్రాలు అక్కమొగుడిచేత ఆర్నెల్లు పని చేయించుకున్నాడు. పని పూర్తి చేసి మరో ఆర్నెల్లయింది. మొదట్లో ఓ నెలరోజులపాటు ఇదుగో అదుగో అంటూ బులిబుచ్చికబుర్లు చెప్పి కాలక్షేపం చేసేడు. ఆ తరవాత కిమిన్నాస్తి. అయిపు లేకుండా పోయేడు. ఇంటికెళ్తే ఇంట్లో ఉండీ లేడని చెప్పిస్తాడు పెళ్ళాంచేత. ఆఫీసుకెళ్తే కాంపుకెళ్ళేడంటారు. ఊళ్ళో మరెవళ్ళో పెద్దోళ్ళొచ్చేరు, వాళ్ళకి తైనాతి పనుల్తో సరిపోతోంది, నాకష్టాలు ఇన్నిన్ని కావంటూ ఎదురు ఆయనగారి కష్టాలు కచేరీ పెడతాడు. “మాకు రావాల్సిన రొక్కం మాకీడం మాత్తరం ఆరి పని గాదా అంటాది మాయప్ప,” అంది సంద్రాలు.

“ఇంతకీ నవ్వెందుకొచ్చిందో చెప్పేవు కావు.”

“ఏటంటే మాయప్పకి మాసెడ్డం కోపం వచ్చీసినాది. ఆర్నెల్లూరుకున్నారిద్దురూను. ఎంతకాలం ఊర్కొంతరు ఎవురు మాత్తరం. మాయప్ప కత రాసీసినాది. దాంత తల తరిగి నోట్లోకొచ్చినాదంట ఆబాబుకి. నాపరువు పోనాదంటా అర్సకుంట ఎగిరిపడ్డాడంట,” అంది సంద్రాలు మళ్ళీ గలగల నవ్వుతూ.

“అందులో నవ్వడానికేమీ లేదు,” అన్నాను నేను చిరాకునణుచుకుంటూ.

సంద్రాలు వెంటనే మొహం గంభీరంగా పెట్టి, “అంతేలె నవ్తానికేంవుంది. నవరాదు,” అంది.

సంద్రాలు మొహం చూస్తే నాకు నవ్వాగలేదు. “నీకు నవ్వులాటగా ఉంది కానీ పాపం ఆబాబుకి మిగతా ఉద్యోగులముందూ. ఆయనచేతికింద పనిచేసేవారిముందూ అవమానం, పెద్దోళ్ళదృష్టిలో చిన్నతనం అయిపోదూ,” అన్నాను ఆ పెద్దమనిషిని తలుచుకుని జాలి పడుతూ.

“సూడు బుల్లెమ్మా. నీకోపాలి సెప్పేను. నామాట గాదులె. మీయమ్మ అంటా ఉండీది. జలమెత్తినాంక పెతివోడికీ ఓ దరమం ఉన్నాది. ఎనకటి టయాం ఏరు. నీకింకా తెలవదు, వొప్పట్ల ఎవురిపని ఆరు సేసుకుపోవడంవే. నీపనీ నాపనీ అన్నేదు. ఎవురికి ఏది సేతనైతే అది సేసీవోరు. అందురూ సుకంగా ఉండీవోరు. ఒకమ్మకో ఒకబ్బకో కస్టం వొస్తే అందురూ తలో సెయ్యీ ఏసి కాసుకునీవోరు. ఉప్పుడేంవో డబ్బే నోకంవయిపోనాది. ఆబాబు వెందుకు అలా గిలగిల్లాడిపోనాడు. ఆరిజోబులనుంచీ ఇయట్నేదు గంద. నాను సెప్త. ఆబాబుగోరి పరువేదో డామీజీ అయిపోనాదన్నాడంట. పరువూ నేదు సింతకాయా నేదు. ఓరయిన పెస్నిస్తె ఏమి సెప్తరో నాకు తెల్దేటి. మాయప్పకి అరదం కానేదంతరు. బేంకు కాతాల ఏదో తకరారొచ్చినాది, అందుసేత ఆలీసం అయిపోనాదని సెప్తన్నరు బయటోల్లతోనీ. మాక్కూడ సెప్పినర్లే తకరారొచ్చినాది, నీకు డాపుటిస్తం అనీ. నిజిం ఏటంటే ఆ డాపుటు బేంకొల్లు ఈరికిచ్చి రెన్నెల్లు పయినయిపోనాది. ఆడాప్టు తలకిందెట్టుకుని తొంగున్నారు రెన్నెల్లగ. మాయప్ప కత రాసీసీనాంకే పతిర్కల అందురూ సదివినాంకే మాకు ఆ డాపుటిచ్చినారు. ఎనకటికి ఈయన్లాటి పెద్దమ్మే ఏలిమీన గోరు మొలిసింది ఏరుండు మగడా అందంట. ఈరు సెప్పే వొంకలు అనాగుంటయి. నాననీదేటంటె కూలిపని సెయ్నం మాదరమం అవుతె ఆ పనికి ఇలువిచ్చి పైసలు మాసేతల ఎట్నం ఆరి దరమం. కూటికి లేనెదవ ఆడేటి సేస్తడులె అని మమ్ముల్ని నిర్లచ్చెం సేసేస్తె మాం ఊరుకుంతం అనుకున్నడు. ఊరుకున్నం ఓపినంత కాలం. కానీ మాం మాత్తరం వెంతదనుక కుక్కిన పేలల్ల పడుంటం. తీరటం నేదని ఆరు జీతం డబ్బులు తీస్కోనం మానీసేరేటి? టంచనుగ నెల తిరిగీతలికి ఉచ్చుకోనం నేదా? ఆరి అవుసరాల్లాటియే మా అవుసరాలూ గాదా?”

సంద్రాలు గుక్కతిప్పుకోడానికి ఆగింది. నాకు ఆవిడ మాటలు సబబుగానే ఉన్నాయి. మరేవో పనులొచ్చేయనడం సబబు కాదు మరి. పది రోజులు కాకపోతే ఓ నెల రోజులయితే సరే అనుకోవచ్చు. ఆర్నెల్లపాటు ఉలుకూ పలుకూ లేదంటే ఎవరికి మాత్రం మండదు?
“అసల్కి మాయప్పకి మహ కోపం వెందుకొచ్చీసినాదంటే ఊర్ల పెద్దలొస్తన్నరు. ఒందమంది వస్తరు. ఆరందరికీ అరణ్యమెంటులు సేస్తన్నం. అందుసేత టయాం లేదన్నారంట. ఆరి పెద్దరికం ఆరికే ఉణ్ణి. మాకు రావాల్సినయి మాకీడం కూడా అనాటి పనే అని ఆరికి తెలియాల. … సంద్రంలో ఎన్నో సేపలు సూసినా సిన్నయీ పెద్దయీ గూడ. నివ్వూ సూసినవ్ గద. ఎంత సిన్న సేపయిన గేలానికి సిక్కితే గిలగిల్లాడతాది. అది గిలగిల్లాడితే అలల్లేస్తయి. అలల్లేసినయని నివ్వు లబలబాడితె ఏటి నాబం. ఎంత సిన్నసేపయినా గిలగిల్లాడిత అలల్నేస్తయి. అది నివు మనసున ఎట్టుకోవాల,” అంది లేచి వెళ్ళిపోతూ.

సంద్రాలు మొహం అటు తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుకోడం నాదృష్టి దాటిపోలేదు. అవును మరి, ఎంత చేపయినా అలలు రేపగలదు. అలా అలలు రేపగలిగినందుకు మురిసిపోగలదు కూడా. దాని అస్తిత్వానికి అదే బలం మరి!
000
(మార్చి 3, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “మనలో మనమాట 9 – పరువు తీసీసినాది బాబో !”

 1. యింత సిన్ని సేప కొంతయు గిలగిల
  లాడ అలలు లేచి లావు లవుర
  యెంత పెద్ద అలయు యెవరి నడిగి వచ్చు
  నిదియె గదవె సంద్ర నీదు కిటుకు

  సావేజిత
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s