మనలో మనమాట 10 – కుట్టుమిసను యవ్వారం!

కుట్టుమిషను చూస్తే నాకు పుట్టింటికెళ్ళినట్టే ఉంటుంది. నాచిన్నతనంలో ఆడపిల్లలున్న ఇంట్లో వీణా వైలినూలాగే కుట్టుమిషను కూడా అవసరమైన పరికరం. కుట్టుమిషను అవతారించే మరో చోటు కథలు.

బతుకుతెరువుకోసం కుట్టుమిషను పెట్టుకునే ఆడవాళ్ళూ, ఆరుగులమీద కుట్టుమిషను పెట్టుకునే సాయిబులు కూడా చాలా కథల్లో చూస్తాం. మాయింట్లో నాచిన్నప్పుడు మాఅక్కయ్య నా పరికిణీలూ, గౌన్లూ కుట్టేది. పెద్గయాక నాకంటూ ఓ ఇల్లు కుదిరేక నాజాకట్లన్నీ నేనే కుట్టుకుంటూ వచ్చేను. మళ్ళీ మాఅమ్మాయికి మూడేళ్ళవరకూ కొన్ని గౌనులు కుట్టేను. ఆ తరవాత బజారులో షోకైన డ్రెస్సులు (ఇక్కడ గౌను అనరు, వాటిని డ్రస్ అనే అనాలి) కనిపించేక అవి మాత్రమే వాడుతూ వచ్చేను.

ఇప్పుడు మళ్ళీ కుట్టుమిషను తీసేను. మళ్ళీ అని ఎందుకంటున్నానో తరవాత చెప్తాను. మొదట మీకు జ్ఞాపకం చేయవలసింది ఇంట్లో ఏ వస్తువు కనిపించినా దాన్ని ఏదో ఓ రకంగా మార్చకపోతే నాకు చెయ్యి విరుచుకున్నట్టుంటుందని. ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచలేకపోవడం నా దౌర్బల్యం.

ఆర్నల్ల క్రితం ఓ బొంత కొన్నాను. కొన్నవెంటనే చూడలేదు కానీ క్రమంగా కొన్నాళ్ళకి అర్థం అయింది నేను నాకు కావలసినదానికంటె చాలా పెద్దది కొన్నాను అని. ఇక్కడ ఇదో బాధ. ఏ వస్తువు చూసినా చాలా సూక్ష్మంగా ఏదో ఒక్క వాడుకకి మాత్రమే ఉండేలా తయారు చేయబడి ఉంటాయి. వంకాయకో కత్తీ, ఉల్లిపాయకో కత్తీ, అల్లం తరుక్కోడానికీ మరోటీ, దారం తెంపుకోడానికి కత్తి కాదులే మరేదో … ఇలా ఉంటాయి. అంచేత నేను నాకు కావలసిన మట్టు గొంగళీ కనిపించిందని కొనీసేను కానీ అది నామంచంకంటె పెద్దసైజుకి కూడా పనికివచ్చును అని గ్రహించలేదు. అయితే ఏం అని అడుగు చెప్తాను.

రోజూ పొద్దున్న లేచేక, దుప్పట్లు, తలగడాలూ మళ్ళీ చూడచక్కగా అమర్చుకోవాలి కదా. నాచిన్నప్పుడు పరుపు చక్కగా చుట్ట చుట్టేసి ఓ మూల పెట్టేసేవాళ్ళం. హాయిగా క్షణాలమీద అయిపోయేది. ఇప్పుడలా కాదు. … సరేలే ఇప్పటి కర్మకాండ నీకు కూడా తెలుసు కదా. ఆ దుప్పట్లూ, తలగడాలూ సరి చేసి, ఈ బొంత సరిగా దానిమీద పరిచేవేళకి నాకు పావుగంట బస్కీలు తీసినంత పనవుతోంది.

‘’బాగే. కండ పడతాది.”

హాహాహా కండ పట్టకేం, నాకసలే ఆకలెక్కువ. ఆరు గంటలనించి పన్నెండువరకూ తింటూనే ఉంటాను. నీమాటే సరి అనుకుంటే నేను పక్క సర్దడం పన్నెండు తరవాతే కావాలి.

“మిసనుమాట చెప్పీదున్నాదా ఇప్పట్ల, పైయేటిదనుకామంతవా?”

అయ్యయ్యో, లేదు, లేదు. చెప్తాను. మళ్ళీ మిషను తీసేను.

“మల్ల అంటన్నవు, మునుపో పాలి తీసేవేటి?”

ఆఁ. ఆగదిలోంచి ఈగదిలోకి ఈగదిలోకీ ఆగదిలోకీ, ఢిల్లీనించి దేవగరికీ దేవగిరినించి ఢిల్లీకీ ..

“పిచ్చి తుగలకునాగా.”

నువ్వు మరీ అలా మాటల్లో చెప్తే బాగులేదు. నేనేం చేసినా ఓ పద్ధతిగానే చేస్తాను.

“సర్లే, ఏటా పద్దతి?”

అలా కుట్టుమిషను ముందుగదిలో బల్లమీదకి తీసుకురావడం ఒక మెట్టు. సత్యవారాయణవ్రతవిధానంలాగే ఈ కుట్టడం కూడాను. దానికో పద్ధతి ఉంది. మొదట సంకల్పం. ఏదో ఒకటి కుట్టాలి అనుకోడం. ఆ తరవాత మిషను తెచ్చి ముందుగదిలో బల్లమీద స్థాపన చేయడం. మామూలుగా ఏమిటి కుట్టడం అన్నది కూడా ఈ మెట్టుతరవాతే జరుగుతుంది కానీ ఈమాటు మాత్రం మొదట్లో చెప్పిన బొంత పొడుగు తగ్గించడం అన్నది నిర్ణయం అయిపోయింది.
అలా ఆ మిషను, బొంత ముందుగదిలో భొజనాలబల్లని తాత్కాలికంగా కుట్టుమిషనుబల్లగా మార్చి కాఫీ తరవాత, భోజనం చేసిక, ముఖపత్రంలో రెండు టపాలు చూసేక, వీధిలో కొంచెంసేపు తిరిగొచ్చి, పొద్దున్న మధ్యాహ్నం. సాయంత్రం అనుకుంటూ రెండు రోజులు గడిపేను. ఆఖరికి, నేను మిషనుముందు కూర్చుని కుట్టుపని మొదలుపెట్టే ముహూర్తం వచ్చింది.

బొంత కత్తిరించేక అంచు మడతపెట్టి కుట్టాలి కదా. అంత మందం నామిషను కుట్టగలదో లేదో అనుకుంటూ మొదలు
పెట్టేను కానీ నన్ను ఆశ్చర్యపరిచేసి, మిషను తేలిగ్గా బీచిరోడ్డుమీద కొత్తకారులా హాయిగా కుట్టేసింది. మొత్తం పని మూడు నిముషాల్లో అయిపోయింది. ఒస్, ఈమాత్రానికేనా ఇన్ని రోజులు ఆరాటపడ్డాను అని కొంచెంసేపు విచారించేను.
ఆ ఊపులోనే కత్తిరించేసిన రెండో ముక్కవేపు చూసేను. ఆ ముక్క నన్ను ఊరికే పారేస్తావా అని జాలిగా నావేపు చూసింది. నా మనసు గోదావరిలా ద్రవించేసింది ఆ చూపుతో. కొంచెం ఆలోచించి రెండు చిన్న తలగడాలు అవుతాయి, చేతికి దన్నుగా పనికొస్తాయి అని నిర్ధారణ చేసేను. మరి తలగడ అంటే దాన్లో కూరిపెట్టడానికి దూది కావాలి కదా. టార్గెట్టులో హస్తకళలకి పరికరాలు ఉంటాయని వెళ్తే దూది కట్టలు లేవు. ఇదేం ఊరో అనుకుంటూ దుకాణంలో తిరుగుతుంటే తలగడాలు కనిపించేయి. పట్టుకు చూస్తే మెత్తగా చాలా బాగున్నాయి. సరే ఓ తలగడా కొనుక్కొచ్చి, అది చింపేసి ఆ దూదితో రెండు చిన్న తలగడాలు తయారు చేసేసేను. ఇవన్నీ చాలా గబగబా అయిపోయేయి.
ఇప్పుడు మరో చిన్న ముక్కలు రెండు మిగిలేయి. వాటిని పరీశీలించి చూస్తే ఒక టీకోజీ తయారు చేయొచ్చు అనిపించింది.
DSC00216
“నీకు టీముంత నేదు గద, అదెందుకు?”

ఏం చేస్తాం, టీముంత కొనుక్కోవాలంతే.

“గోసీపాత పదిలం సేస్కోనానికి లంపటాలు తగిలిచ్చుకున్న సన్నాసినాగ,” సంద్రాలు నవ్వింది.
సంద్రాలు నవ్వితే నాకు ఉక్రోషం వస్తుంది. టీకెటిలు కొనుక్కుంటే తప్పేంటి, ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు పనికొస్తుంది
కదా.

“నివ్వు ఎవుల్నీ రానీవు గద.”

చటుక్కున మరో ఆలోచన వచ్చింది. టీ పాత్ర కాదు. ఇక్కడ చలికాలంలో ఇంట్లో హీటున్నా, ఇడ్లీ పిండి పులియడంలేదు. ఈ ముక్కలు ఆ గిన్నెమీద టీకోజీలగే కప్పితే వెచ్చగా ఉండి పిండి పులియవచ్చు అనిపించింది.
ఆ తరవాత మిషను మళ్ళీ పక్కగదిలో యథాస్థానానికి మార్చడానికి మరో నాలుగు రోజులు పట్టింది. అలా దానిస్థానం మార్చేలోపున మరో విషయం గుర్తొచ్చింది. దాదాపు పదేళ్ళగా నా దుస్తులలో పొడుగు తగ్గించుకోవలసిన కాళ్ళూ, చేతులూ, తొలగించుకావాలనుకున్న కాలర్లు – వీటికి కూడా కాలం వచ్చిందని నిర్ణయించి ఆ పనులు మొదలు పెట్టేను. ఏదైనా ఆరంభించడం కష్టం కానీ ఆ తరవాత పనులు అవి పూర్తి చేసేవరకూ తోచదు నాకు. మొత్తంమీద అవి కూడా అయిందనిపించేసి, కుట్టు మిషనుని యథాస్థానానికి తరలించేసేను. బహుశా మరో పదేళ్ళవరకూ దానివంక చూడకపోవచ్చు నేను.

000

(మార్చి 28, 2016)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “మనలో మనమాట 10 – కుట్టుమిసను యవ్వారం!”

 1. నేను కుట్లు అల్లికలు ముగ్గులు ఇత్యాది 64 కళలలో శానా ఎందుకు పనికిరాను నిద్ర తిండి ఈరెండు ఒకవేళ వాటిలో ఉంటే వాటికి మినహాయింపు…మీ కుట్టు కౌశలం చదువుతుంటే ముచ్చటేసి పోయిందంటే నమ్మండి….చక్కటి పోస్ట్.

  మెచ్చుకోండి

 2. ఉషా వారి కుట్టు మిషను పీడీఎఫ్ సెహ భేషు !

  ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కి ఈ పుస్తకాన్ని చూడడం !

  @సోము గారు !

  ఆ పుస్తకాన్ని ఆర్కైవ్ డాట్ ఆర్గ్ (archive.org) లో కూడా పెట్టండి ! భావి తరానికి పని కొస్తుంది !

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

 3. హాహా. ఏదో పని కల్పించుకుని చేయడం – ఎవరో చెప్పేరులెండి పంచెలు చింపి గావంచాలు, గావంచాలు చింపి జేబు రుమాళ్ళూ … అనవసరంగా అమెరికావారికి పేరొచ్చింది కానీ రిసైకిలింగుకి మనదేశమే పెట్టింది పేరు. 🙂

  మెచ్చుకోండి

 4. నాకు కూడ కుట్టు మిషనుతో చాల అనుబంధముంది.మా అమ్మగారి కుట్టు మిషను చిన్నతనంనుండి ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లల్లో ఒక మగపిల్లవాడినయిన నేనే ఎక్కువగా ఏదో ఒకటి కుడుతూ ఉండేవాడిని.మా అక్కయ్య పెళ్ళి తరవాత ఆమె పట్టికెళిపోతే బాధ కలిగింది.కొన్ని దశాబ్దాలకి కూడ ఆ అనుబంధం చావక ఈ మధ్య ఓ కొత్త ఉషా మిషను కొని తిరిగి కుడుతున్నాను.నా కొత్త మిషను చూసి ముచ్చటపడి వయసు పై బడిన మా అమ్మగారు కూడ హుషారుగా ఓసారి మళ్ళా కుట్టారు దానిమీద.ఆవిడెపుడో అరవై దశకంలో ఉషాకుట్టు పరీక్షకి వెళ్ళి పాసయారు.అప్పటి ఉషావారి తెలుగు కుట్టు పుస్తకం ఇంకా నాదగ్గర జాగర్తగా ఉంది, అది డిజిటైజ్ చేసి పిడిఎప్ పుస్తకంగా మార్చి నెట్ లో పెట్టాను కూడ.ఎవరైనా ఆసక్తి గలవారు డౌన్ లోడ్ చేసి వాడుకోవచ్చు.దాని ద్వారా ఏ డ్రస్సు అయినా సొంతంగా కుట్టవచ్చు.దాని లింకు ఇక్కడ ఇస్తున్నాను.ఇది రాసినవారికి నా ప్రశంసలు.

  https://www.mediafire.com/?2a0xzta7vo7fz97

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. బొంతముక్కల తలగడాలోకి దూది కోసం – కొత్త తలగడ కొనితెచ్చి దాంట్లోని దూది పీకి బొంతముక్కల తలగడాలోకి ఎక్కించడం, బాగుందండీ ఉపాయం 😉 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. నేను మా అమ్మ దగ్గర నుండి వారసత్వంగా కుట్టుమిషన్ తెచ్చుకున్నాను. మా బుల్లి కుటీరంలో దానికి చోటులేక బయట స్టోర్ రూం లోకి నెట్టబడింది. పాత హంగులన్నీ తీసివేసి కొత్త మోటర్ కూడా బిగించుకున్నాను కానీ ఏదైనా కుట్టాలంటే ఇంట్లోకి తెచ్చుకోవడానికే నాలుగు రోజులు పడుతుంది.ఇంట్లోకి తెచ్చాక నాలుగు రోజులు పడుతుంది.ఇపుడు కంప్యూటర్ వచ్చాక బుజ్జి దాన్ని పట్టించుకోవడం లేదుగానీ ఎన్ని గౌనులు కుట్టానో,ఎన్ని మోడల్స్ కుట్టానో నాకే తెలుసు.నాలాంటి వారూ ఉన్నారన్నమాట !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. కుట్టు ‘మిసను’ యవ్వారం బాగుందండీ !

  మీ చేత ఏ మేటరు అయినా తూలిక/తేలిక/ఏలిక/మేలీక 🙂

  కుట్టు మిసను కథను కువకువ లాడించె
  తూలికా రమణియు తురగము గనె !
  సంద్ర కూడ వచ్చె సరసపు మాటల
  జోలె గట్టె నిడదవోలు లతిక !

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.