మనలో మనమాట 11 – మర్యాదా మప్పితమూ

మనకి మర్యాదలు ఎక్కువ అనుకుంటాం. కనీసం అనుకునేవాళ్ళం. పెద్దలకి పిల్లలు ఎదురు చెప్పకూడదు. పిల్లలని పెద్దలు ప్రేమాభిమానాలతో బుద్ధులు గరుపుతూ పెంచాలి కానీ కసుర్లూ విసుర్లూ కూడదు.

కానీ ఆ రోజుల్లో కసురుకున్నా విసుక్కున్నా అభిమానంతోనే, పిల్లలమంచి కోరే అని సమర్థించేవాళ్లు ఉన్నారు ఇప్పటికీ.

కానీ ఈమధ్య బహుశా గత ముప్ఫై ఏళ్ళలో ఆధునీకరణ ప్రపంచీకరణ పెచ్చు మీరినకొద్దీ ఆ ఆలోచనలకి గంట్లు పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు పదేళ్లు దాటీ దాటకముందే అమ్మనీ నాన్ననీ నువ్వెంత అనే స్థితికి ఎదిగేరు. ఏమంటే ఇంగిలీసు బళ్ళలో ఇంగిలీసు బొక్కులు చదువుకుని నేర్చుకున్న పాఠాలు అవీ. అంటే నా అభ్యంతరం ఇంగిలీసు పుస్తకాలు నేర్చుకోడం తప్పని కాదు. వాటివిషయంలో పూర్తి అవగాహన ఉండాలని. లేకపోతే పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క చందమగును.

నాఆలోచనలు ఈ ధోరణిలో ఉండగానే నాకు మరో ఆలోచన వచ్చింది. అది ఆడవాళ్ళని ఎలా సంబోధిస్తాం అన్నది. నాచిన్నతనంలో అంటే 40, 50 దశకాల్లో ఒకే కుటుంబంలోనూ ఉమ్మడికుటుంబాల్లోనూ అది, వాడు, ఒరే, ఒసేయ్ సర్వసాధారణం. అలాగే మొగుడూ, పెళ్ళాం, (మా, వాళ్ళ) ఆవిడా ఆయనా కూడా మామూలే. అంతే కాదు. ఈనాడు గొప్ప తప్పు అయిన ముండ అన్న పదం కూడా ఆరోజుల్లో కొంచెం తేలిగ్గానే వాడేరు. అమాయకంగా ఉంటే ఆడపిల్లని “పిచ్చిముండ, దానికేం తెలీదు, ఎలా బతుకుతుందో” అని వ్యాఖ్యానించడం ప్రేమతోనే. పనిమనిషిని ఇంకా రాలేదా ఆ ముండ అనడంలో కూడా ఏ దురద్దేశం లేకుండానే. మా అమ్మాయిని అది అనడం నాకు బాగానే ఉంటుంది. ఎదటివారు ఏమనుకుంటారో అని తను అంటున్నాను ఇప్పుడు. నిజానికి నాకు ఇలాటి మర్యాదలు ఎంత అలవాటయిపోయేయంటే నాలుగేళ్ళక్రితం నాకు 5వఫారం స్నేహితురాలు అమెరికా వచ్చేనని ఫోను చేసి, “ఏమిటే, రావే …” అంటూ మాటాడితే నాకేమిటో కొత్తగా ధ్వనించింది. గత 15, 20 ఏళ్ళలోనూ పనివాళ్ళనే కాక చిన్నపిల్లలని కూడా ఆవిడ అని సంబోధించడం చూస్తున్నాను. అలాగే నా వెనకటి టపా స్వయంప్రతిపత్తి సాదించుకున్న పాత్రలు లో అడిగిన ప్రశ్నకి ఒకాయన “పక్కింటి లావుపాటి పెళ్ళాం” అన్నారు. “పక్కింటి లావుపాటి పిన్నిగారు” అంటున్నారేమో అనుకున్నాను కానీ ఆయన బాపూగారి వ్యంగ్యచిత్రాలు చూపించేరు. అంటే అది ఆయన పదప్రయోగం అనుకోవాలి. కానీ నామటుకు ఆ పదబంధం ముళ్ళపూడి వెంకటరమణగారు సృష్టి, బుడుగు పక్కింటావిడని అలా సంబోధిస్తాడు. అంటే అది బుడుగుకోణంనుంచి మాత్రమే. బుడుగు చిన్నవాడు కనక ఆవిడని పిన్నిగారు అనడమే సమంజసం. మీరేమంటారు?

నేనిలా రాస్తున్నానని ఇది స్త్రీవాద టపా అనుకోకండి. మగవాళ్ళవిషయంలో కూడా బహుశా తక్కువేమో కానీ ఉన్నాయి వాడు, అతను, ఒరేయ్, ఏరా వంటి సంబోధనలు వాటివిషయంలో వచ్చిన మార్పులు కూడా ఎవరైనా రాస్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను..

మాటొచ్చింది కనక నువ్వు, మీరు సంబోధనలగురించి కూడా చెప్పుకుందాం. ఇంగ్లీషులో మీరు బాధలేదు. పిడుక్కీ బియ్యానికీ అంటే అరవడానికైనా బతిమాలుకోడానికైనా ఒకటే పదం. మనకి నువ్వూ మీరూ పదాల ప్రయోగంలో సందర్భం మాత్రమే కాదు, కులాలు, ప్రాంతాలూ కూడా గణనలోకి వస్తాయి. తూర్పున ముఖ్యంగా రాజులకుటుంబాల్లో మీరు, అండి వాడకం ఎక్కువ. మరేనండి, ఆయనేమోనండి, నన్ను రమ్మన్నారండీ అంటూ అండీలమీద అండీలు పేర్చుతారు. చిత్తూరుప్రాంతంలో పెద్దలని అన్ని విధాలా చిన్నవాళ్లు నువ్వు అంటూ మాటాడతారు. అందులో తప్పూ లేదు, అవమానమూ లేదు.

ఈ పద ప్రయోగాలతాలూకు పరిణామక్రమం కొంతవరకూ కథల్లో చూడొచ్చు. ఉదాహరణకి కుటుంబరావుకథల్లో ఇలాటి ప్రయోగాలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారికథల్లో కనిపించవు. క్రమంగా కొన్ని ప్రయోగాలు స్త్రీని కించపరిచేవిగా గుర్తించడం జరిగింది. ఎప్పుడు ఎలా మొదలయిందో నేను చెప్పలేను కానీ కొంతవరకూ స్త్రీవాదం కారణం కావచ్చు. నేను మాత్రం ముందే చెప్పినట్టే ఆ కోణంలోనుండి చూడడం లేదు.

మరోమాట కూడా చెప్తాను. ఈనాటి కథల్లో మరొకవిషయం కూడా కనిపిస్తోంది. ఈ ఆధునీకరణపేరున జరిగే పదప్రయోగాలు పెదవులమీదా కాయితంమీదా మాత్రమేనేమో అన్నది. అనేక కథల్లో స్త్రీలు మానసికంగానూ భౌతికంగానూ పడే బాధలే చిత్రిస్తున్నారు కదా. మరి ఆ నేపథ్యంలో అది అనడానికి బదులు ఆవిడ అనేసరికి , ఆహా ఆయనకి నేనంటే ఎంత గౌరవం అనుకుంటూ మురిసిపోతారా? ఇలాటివన్నీ తలుచుకున్నప్పుడు నాకు ఈ పదాల ఆర్భాటం మానేసి నిజంగా మనిషిని మనిషిగా చూడ్డం నేర్చుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు నేర్చుకుంటారో అని నీరసపడిపోతాను కూడాను. పేదవాడికోపం కన్నా హీనం ఈ పదాడంబరం. ఇందుకే అంటారు కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా అని.

నా ఆలోచనలను మొదట నా ముఖపత్ర మిత్రులతో పంచుకున్నాను. కొన్ని పదాలు ఇచ్చి వారిని ఒక చిన్న సన్నివేశం చిత్రించమని అడిగేను. ఆ పదాలు ఇవి – భార్య. పెళ్ళాం, పిన్నిగారు, మాఆవిడ (వాళ్ళావిడ), పనిది, పనావిడ, పనమ్మాయి, లేదా అసలు పేరు.

కొందరు నాప్రశ్నకి సమాధానంగా కొన్ని చక్కని సన్నివేశాలు చిత్రించేరు. ఇక్కడ పాఠకులు కూడా మీకు తెలిసిన లేక అలవాటయిన ధోరణిలో ఈ పదాలు ఉపయోగించి చిన్న సన్నివేశాలు చిత్రించి కింద వ్యాఖ్యపెట్టెలో పెడితే, అన్నీ కలిపి మరో టపాగా ప్రచురించాలని అనుకుంటున్నాను.
000

(ఏప్రిల్ 6, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 11 – మర్యాదా మప్పితమూ”

 1. అవునండి. మూలతత్వం అదే అయినప్పుడు ఏ దేశంలో ఉన్నా ఒకట్. అలాగే భర్త కూచున్నచోటికి తెచ్చి కాఫీ చేతికందిస్తే తాగని భర్తలు కూడా ఉన్నారు. కొందరి అభిప్రాయాలు మారేది వాళ్ళు బుగ్గయినప్పుడే అనుకుంటా. ఈ దగ్గరితనం, చనువు మరి ఆవిడ ఆయన్ని ఒరే అనడానికుందా.

  మెచ్చుకోండి

 2. మీ దేశంలోనే స్ధిరపడిన ఓ చిన్నసైజు ‘హాస్యరచయిత ‘ వెబ్‌పత్రికల్లో తన కధల్లో భర్త భార్యని ఒసే, ఏమే అని పిలుస్తున్నట్లు వ్రాస్తుంటాడు. చూసి చూసి ఇహ ఊరుకోలేక “భార్యని అలా సంబోధించడం సరి కాదు, మార్చితే బాగుంటుంది” అని ఓ ఉ.స (ఉచిత సలహా) మెయిల్ చేసాను. దానికి – అటువంటి పిలుపులు వాళ్ళిద్దరి మధ్యనున్న దగ్గరితనం, చనువు సూచిస్తాయి అని అతని జవాబు (?). ఏమనాలో పాలుపోలేదు 😦

  మెచ్చుకోండి

 3. తూలిక వారు,

  బాగున్నదండీ ! చిత్తూరు భాష లో చెప్పాలంటే ‘నల్లా’ యిరుక్కు:)

  పేద వాడికోపము కన్న పెద్ద పదము,
  నోటి మాట కీడు నొనర్చు; నొకరి నొకరు
  మనుజులవలె పలుకరింప మంచి జేయు ;
  తూలి కపలుకు లిట మేలు తూగు పలక !

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.