రాయసం వెంకటశివుడుగారి భావజాలం, నా ఆలోచనలు – 1

ఇది రాయసం వెంకటశివుడుగారి రచనలమీద తులనాత్మకవ్యాసం కాదు. వారి ఆత్మచరిత్రములోనూ వ్యాసాలలోనూ ద్యోతకమైన ఆనాటి కొన్ని భావాలను
ఈనాటి భావజాలంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడినుండి ఎక్కడికి వచ్చేం అన్న జిజ్ఞాస ఈవ్యాసానికి పునాది.
320px-Rayasam_venkatasivuduరాయసం వెంకటశివుడుగారు (1870-1953∙ చూ. అథోజ్ఞాపిక )గారి ఆత్మచరిత్రము గ్రంథానికి దేశోధ్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారు పరిచయవాక్యము రాసేరు. అందులో వారు చెప్పిన ఒక విషయం, “మహాత్ముల చరిత్రలే కాదు సామాన్యుల చరిత్రలు కూడా ఆత్మోద్ధరణకు ఉపయోగపడగలవు” అని. రాయసం వెంకటశివుడు గారు కూడా తమ ఉపోద్ఘాతములో, “సర్వసామాన్యుని జీవితము గూడ సంసారయాత్ర గడుపుటయందు కొందరికి సహాయకారి కావచ్చుననియె నా ఆశయము” అని చెప్పుకున్నారు. ఇది వారి వినయానికి నిదర్శనమే కానీ వారి ఆత్మచరిత్రములో అనేక సంఘటనలు చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటాయి యౌవనదశలో అని నేను అనుకుంటున్నాను.
కాశీనాథుని నాగేశ్వరరావుగారు క్లుప్తంగా ఈ పుస్తకంలో విశేషాలగురించి ఇలా వివరించేరు –
“జీవయాత్రలో ఆత్మోపలబ్థికి గృహము బీజము, విద్యారంగము శక్తి, విశ్వరంగము కీలకము,” అంటూ ఈ పుటలలో “విశదపరిచిన ఆత్మోదంతము దేశంలోనూ ప్రపంచంలోనూ సంప్రాప్తమవుతున్న భావక్రియా పరివర్తనమును సింహావలోకనము చేస్తూ ధీమంతులకు కర్తవ్యమును ఉపదేశిస్తోంది,” అన్నారు.

వెంకటశివుడుగారి ఆత్మ చరిత్రములో మొదటి 62 పుటలు మాత్రమే ఉన్నాయి నాకు దొరికిన భాగంలో (ఇదెలా జరిగిందో నాకు గుర్తు లేదు). వ్యాసావళి రెండు భాగాలు దొరికేయి. పైన చెప్పిన ధ్యేయం దృష్టిలో ఉంచుకుని అర్థం చేసుకోడానికి ప్రయత్నించేను.

ఈ ఆత్మచరిత్రము 1925లో ప్రచురించారు. వ్యాసాలు మొదటిభాగం 1933లోనూ, రెండో భాగం 1926లోనూ ప్రచురించినట్టు half-title pages మీద ఉన్నాయి. రెండో భాగంలో రచయిత ఉపోద్ఘాతం ఉంది. బహుశా నాకు దొరికినవి పునర్ముద్రణలు అయిఉండొచ్చు. ఎందుకంటే లోపలి టైటిలు పేజీలో వెంకటశివుడుగారి గతించిన సంవత్సరం 1953 అని ఉంది కనక. ఇంతకీ అసలు విషయానికొస్తే, ఈ పుస్తకాలలోని భావజాలం సుమారుగా ఒక దశాబ్దం అటూ ఇటుగా ఒక శతాబ్దంనాటి భావజాలం అనుకోవచ్చు.

వెంకటశివుడుగారు పిల్లలపెంపకం, విద్యావిధానం, సంప్రదాయకంగా బోధించే “ప్రాతబడులు” ఆంగ్లేయులు స్థాపించిన “క్రొత్త పాఠశాలలు”, ఈ విద్యాసంస్థల దురవస్థ, మతవిషయంలో వారి ప్రస్థానంవంటి అనేక విషయాలు ప్రస్తావించేరు. ముఖ్యంగా స్త్రీలగురించి ఆయన చర్చించిన విషయాలు నన్ను చాలా ఆలోచింపజేసేయి.

మొదట విద్యవిషయం తీసుకుందాం. తండ్రి పూర్వాచారపరాయణుడు. ఆయనకి సంప్రదాయకమైన విద్యపట్ల ఆసక్తి. వెంకటశివుడుగారివి అభ్యుదయభావాలు. ఆంగ్లపాఠశాలలో చదువు ఆ అభ్యుదయభావాలకు మూలం అయింది. అంతేగాక వ్యక్తిగతంగా “ఆయన (తండ్రి) జనాభిప్రాయమును శిరసావహించే భీరుడు. నేను స్వబుద్ధి సూచించిన సత్యపథమున బోయెడి ధీరుడను. నవనవోన్మేషదీధుతుల నొప్పెడి సంస్కారప్రియుడను,” అని నమ్మినవారు. “అది యౌవనమునాటి అహంకారమే అని పాఠకులు తలపకుందురు గాక” అని ఆశించినవారున్నూ.

ప్రాతబడులకీ క్రొత్తపాఠశాలలకీ మధ్య గల వ్యత్యాసంగురించి ఇలా అంటారు, “తాటియాకుల పుస్తకములు చేతబట్టి, చిన్నచదువరులు గొనిపోయి, అమర బాలరామాయణములు పఠించి, ఎక్కములు మున్నగునవి విద్యార్థులు గట్టిగ వల్లించెడి బడులకును, కాకితపు బుస్తకములు కలము సిరాబుడ్లును, పాఠపుస్తకములు, పలకబలపములును, జదువరులు వాడుక చేయు పాఠశాలలకును మధ్య గల వ్యత్యాసము నాకనుభవగోచరమయ్యెను.”

సంప్రదాయాలను నిరసించి కొత్తను ఆహ్వానించడం, ఆంగ్లపాఠశాలల్లో చదువులే ఘనం అనుకోడం బహుశా ఆ రోజుల్లోనే మొదలయిందేమో. ఈ అభిప్రాయంలో ఇప్పటికీ తేడా అట్టే లేదు. ఎటొచ్చీ ఇప్పుడు ఈ ఇంగ్లీషుచదువులకి మనం చెప్పుకునే కారణాలు వేరు. మరొక చిన్న అంశం – వెంకటశివుడుగారిని ఈ ఇంగ్లీషు పాఠశాలలో వేరు వేరు రంగు అట్టలు గల పుస్తకాలూ, సిరాబుడ్లు ఆకట్టుకోడం. ఇది చదువుతుంటే నాకు అనిపించింది ఈ పైపైన “కనిపించడం” మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి గల ప్రాశస్త్యం. అది ఇప్పుడు అన్ని విషయాలకీ అన్ని వస్తువులకీ వర్తిస్తోంది. పెట్టెలో ఏముంది అన్న ఆలోచనకి ముందు పెట్టె కంటికి నదురుగా కనిపిస్తోందో లేదో చూస్తున్నారు. రాను రాను దీనికే ప్రాముఖ్యం ముదిరిపోతోంది. లోపల ఏముందో దాని ఉపయోగం, అవసరం ఏమిటో అన్నది ఏ పరిశోధకులకో తప్ప పనికిరాకుండా పోతోంది. దీనికి మంచి ఉదాహరణ కథ ప్రచురించగానే అక్షరదోషాలు ఎంచే వారి సంఖ్య చూడండి.

పాఠశాలల దురవస్థ, ఉపాధ్యాయుల దురవస్థ, తల్లిదండ్రుల బాధ్యత వంటి విషయాలు వ్యాసాల్లో చర్చించేరు. విద్యాభ్యాసానికి తగిన వాతావరణం లేదన్నది వారి ప్రధాన అభియోగం. పాఠశాలకి తగిన భవనాలు లేవు. ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు సరిగా ఇవ్వకపోతే పంతుళ్ళు మాత్రం పాఠాలు ఎలా చెప్తారు? పిల్లలకి వాళ్ళయందు ఎలా గౌరవం ఉంటుంది? అంటూ ప్రశ్నంచేరు. బహుశా ఇప్పుడు ఆ పరిస్థితి మెరుగు పడి ఉండవచ్చు. ఇప్పుడు భవనాలు ఉండే ఉండొచ్చు. ఉపాధ్యాయులు జీతాలు సకాలంలో అందుకుంటూ ఉండొచ్చు. పిల్లలు యూనిఫారములు ధరించి ఉప్పుబస్తాల్లాటి పుస్తకాలసంచులు మోసుకుంటూ స్కూళ్ళకి వెళ్తూండవచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం వారు ఎలాటి చదువులు చదువుతున్నారు అన్నది. నాకు ఇప్పటి స్కూళ్ళతో, అక్కడి బోధనాపద్ధతులతో పరిచయం లేదు కానీ కొందరిని చూస్తుంటే మాత్రం వారు నేర్చుకుంటున్నది ప్రహ్లాదుడు చెప్పినట్టు “చదువులలోని సారము” కాదు అనిపించడంలేదూ? పై పై ఆడంబరాలెక్కువై సారం నీరసించిపోతోంది. నాఅభిప్రాయంలో స్కూళ్ళలో సరైన విద్య నేర్పితే వేరే వ్యక్తివికాసం పుస్తకాలూ అఖ్ఖర్లేదు, వ్యక్తివికాసం ఉపన్యాసాలూ అవసరం ఉండదు. సైకోథెరపిస్టు సందర్శనాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోవచ్చు.

హిందూమతంవిషయంలో వెంకటశివుడుగారికి వైముఖ్యం ఏర్పడ్డానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి – తండ్రి చెప్పేడు కనక. మామూలుగా పిల్లలందరికీ పసితనంలో అంటే ఇల్లు వదలనంతవరకూ తల్లీ, తండ్రీ ఏం చెప్తే అదే వేదవాక్కు. అమ్మకీ నాన్నకీ తెలిసినంతగా లోకంలో ఎవరికీ తెలీదు అని గట్టిగా నమ్ముతారు. గుమ్మం దాటి స్కూలుకి బయల్దేరగానే, బయటి ప్రపంచంలో అడుగుపెట్టగానే, వారికి మరొక కొత్త ప్రపంచంతో పరిచయం కలుగుతుంది. దాంతో వారికి పాతవిషయాలు రుచించవు. అందుకు మొదటి కారణమే. అంటే తల్లిదండ్రులు పెట్టే అదుపాజ్ఞలు. దాదాపు అందరి ఇళ్ళల్లో జరిగే తంతే ఇది.

వెంకటశివుడుగారు పదో ఏట ఇంగ్లీషువారి పాఠశాలలో చేరేక క్రైస్తవమతంతో పరిచయం ఏర్పడింది. క్రైస్తవుల ప్రార్థనలు ఎంతో అర్థవంతంగా కనిపించేయి. కొంతకాలం అవే ప్రార్థనలు చేస్తూ వచ్చేరు. తరవాతికాలంలో ఆయన అభిప్రాయాలు మారేయి. ముఖ్యంగా మతపరమైన భావజాలంలో వచ్చిన క్రమపరిణామం – హైందవం ఛాందసమని నిరసించడంతో మొదలై, క్రైస్తవప్రార్థనలతో క్రైస్తవమే గొప్పమతమని కొంతకాలం నమ్మి, తరవాత బ్రాహ్మసమాజం బోధలు విని, వాటిని స్వీకరించేరు. వీరేశలింగంగారితో పరిచయమయింది. హిందూమతంలో లోపాలను సరి దిద్ది సర్వమానవసౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదించేవిధంగా బ్రాహ్మసమాజాన్ని రూపొందించడానికి నిర్ణయించుకున్నారు. ఈభాగం నాకు నచ్చింది. అంటే ఈ పరిణామక్రమమే నాది కూడా అని కాదు. ఈ క్రమం కొంతమంది మేధావులు అనుకున్నవారిలో కూడా చూసేను. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక దశలో ముఖ్యంగా యౌవనదశలో ఇంట్లో ఏ ఆచారం పాటిస్తే అది హేయంగా కనిపిస్తుంది. బయటిప్రపంచంలో కనిపించిన నూతన అంశాలు ఘనంగా కనిపించి ఆకర్షిస్తాయి. వివేకం గలవారు అది గుర్తించి, సదసద్వివేచన చేసుకుని, అర్థవంతమైన విశ్వాసం పెంపొందించుకుంటారు. అయితే ఈ సందర్భంలో నాకు కలిగిన ఆలోచన ఏమిటంటే మతానికి సంబంధించింనంతవరకూ వాదవివాదాలు కొన్ని ఇప్పటికీ అదే ధోరణిలో సాగుతున్నాయి అని. ముఖ్యంగా హేతువాదంపేరున సాగుతున్న చర్చ చూస్తే, ఇది నిరతాగ్నిహోత్రం అనిపిస్తుంది. అందుకే నేను ఈ పుస్తకం మళ్ళీ పరిచయం చేస్తున్నాను. మామూలుగా ఆత్మకథలు రాయడానికి కూడా ఇదే కారణం అనుకుంటాను. “మేం ప్రయోగాలన్నీ చేసి, ఈ నిర్ణయానికి వచ్చేం. అంచేత మీరు మళ్లీ ప్రయోగాలు చెయ్యఖ్ఖర్లేదు” అని చెప్పడానికి. ఎవరూ వినరనుకోండి. అది వేరే సంగతి.

వెంకటశివుడుగారు పిల్లలచదువులగురించి వ్యాసాలలో విపులంగా చర్చించేరు. పల్లెల్లో కింది తరగతి పాఠశాలల దుస్థితి, ఉపాధ్యాయుల దుస్థితి, తల్లిదండ్రులు పిల్లల చదువుల్లోనూ, స్కూలు పరిపాలనలోనూ జోక్యం కలగజేసుకోవలసిన ఆవశ్యకత- ఇలా అనేక అంశాలు పరామర్శించేరు. నేను ఆంధ్రలో లేను కనక ఇప్పటి పరిస్థితి నాకు తెలీదు. బహుశ అప్పటికంటే మెరుగే అయిఉండవచ్చు. కానీ నాకు ఒక సందేహం పిల్లలచదువులవిషయంలో తల్లిదండ్రుల జోక్యం మితి మీరుతోందేమో అని మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తోంది.

నాకు ప్రత్యేకంగా కనిపించిన రెండో విషయం అర్భకురాలయిన తల్లిగురించి. తండ్రి సంసారం నడపడానికి నానా అవస్థలు పడ్డారని చెప్తూనే, ఒకొకప్పుడు ఆయన ఆవిడని కొట్టేవారనీ. అప్పుడు వెంకటశివుడుగారికి 5, 6 ఏళ్ళవయసు. ఆయన తండ్రివీపుమీదకి ఎక్కి ఆయన జుత్తు పట్టుకుని కొట్టేవాడిని అని రాసేరు. పిల్లలకి ఏమాత్రమో చనువు లేకపోతే తండ్రిని కొట్టే ధైర్యం రాదు కదా. అంచేత నేననుకోడం తండ్రి ఛాందసం ఆయనని చిరాకు పెట్టినా ఆదరణకి కూడా లోపం లేదనే. సుమారుగా అదే అర్థం వచ్చినట్టు కనిపిస్తుంది ఉపోద్ఘాతంలో ఆయన తన చెప్పిన మాట – తల్లిదండ్రుల క్రమశిక్షణమూలంగానే తాను దుష్టసావాసాలనుండీ, దర్వ్యసనాలనుండీ తప్పుకుని సద్వర్తన అలవాటు చేసుకోగలిగేననీ కూడా రాసేరు. అంటే నేననడం ఏ ఒక్క సంఘటననీ తీసుకుని అభిప్రాయాలు ఏర్పరుచుకోడం సమంజసం కాదని. పిల్లలు తల్లిమీదో తండ్రిమీదో అరిస్తే అంతమాత్రంచేత ఆ పిల్లవాడు దుష్టుడయిపోతాడని అనలేం. ఇటువంటి సంఘటనలూ, చెల్లెళ్ళతో సావాసం ఆయనని తరవాతికాలంలో “స్త్రీ జనోద్ధరణ,””సత్య సంవర్ధని” వంటి పత్రికలు స్త్రీలకోసం స్థాపించి నడపడానికి పురికొల్పేయేమో.

వెంకటశివుడుగారు అనారోగ్యంమూలంగా ఒక సంవత్సరం కాలేజీనుండి శలవు తీసుకున్నారు కానీ అది వారికి సమ్మతం కాదు. “కాలు కదపక, కలము సాగింపక, మనస్సు పరిశ్రమింపక యుండు నిర్బంధవిపరీత పరిశ్రమ మెవరికైన శాంతి సౌఖ్యము లొనగూర్చిన గూర్చు గాక. నాకుమాత్రమమది కేవల దుర్భర దుస్థితియే!” అంటారు. నిజమే. విశ్రాంతి పేరుతో ఊరికే కూర్చుంటే మరిన్ని కలతలు. ఏదో పనిలో నిమగ్నమవడమే మానసిక శాంతికి తరుణోపాయం.

సాధారణంగా జీవితాన్నిగురించి ఏమాత్రమైనా ఆలోచించేవారందరికీ రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. వ్యక్తిగా తనధర్మం ఏమిటి, అది సాధించడానికి ఉత్తమమార్గం ఏమిటి అన్నవి. వ్యక్తిధర్మానికీ ప్రాతిపదిక వ్యక్తివికాసం. అది బాల్యంలో తల్లిదండ్రుల ఒరవడిలోనే ప్రారంభం అయినా క్రమంగా తనకు తాను ఆలోచించుకోడానికి అలవాటు పడతాడు. అనేక ప్రయోగాలు చేస్తాడు. అనేక అనుభవాలతరవాత తనకి ఏది సమంజసం అని తోస్తుందో అది ఆచరణలో పెట్టడానికి సిద్ధమవుతాడు. రాయసం వెంకటశివుడు గారి చరిత్ర కూడా అంతే.

వెంకటశివుడుగారి వ్యాసాలు కూడా రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఇందులో అనేక వ్యాసాలు స్నానం, వసంతం, వెన్నెల, సీతాకోకచిలుకలు, కోతులు వంటివి నాకు చాలా సామాన్యంగా తోచేయి. కొన్ని మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. నన్ను ప్రత్యేకించిన ఆకట్టుకున్న వ్యాసాల్లో “చీమలు” ఒకటి. చీమల ప్రవృత్తి అనేక విషయాల్లో మానవులప్రవృత్తిని పోలి ఉంటుందని నాకు ఈవ్యాసం చదివేకే తెలిసింది. ఉదాహరణకి చీమలలో కూడా తరతమ బేధాలు ఉంటాయిట. కొన్ని చీమలు మరికొన్ని చీమలనీ సేవకులుగా శిక్షణ ఇచ్చి మరీ ఉపయోగించుకుంటాయిట. మనం పాలకోసం ఆవులను పెంచినట్టుగానే అవి త్రాగే ద్రావకంకోసం కొన్ని రకాల చీమలను పెంచుతాయి. అలాగే ఉప్పు శాకాహారులకే కానీ మాంసాహారులకి అవసరంలేదుట. వేటాడి మాంసం తినే అమెరికనిండియనులు ఉప్పు వాడేవారు కాదుట. ఇలాటి అనేక విషయాలు రచయిత ఈవ్యాసాలలో విపులంగా వివరించేరు.

రాయసం వెంకటశివుడుగారి వ్యాసాలలో స్త్రీలగురించి, స్త్రీలకి ఉపయోగపడగల విషయాలగురించీ, మరి కొన్ని విషయాలగురించీ రెండో భాగంలో చర్చిస్తాను.

2వ భాగం లింకు ఇక్కడ

1. రాయసం వెంకటశివుడుగారి జీవితవిశేషాలు.
∙ వెంకటశివుడుగారు జననం, మరణం తేదీలు సరిగా ఉన్నట్టు లేదు. తెవికీలో 1870, 1954 అని ఉంది. వారి వ్యాసావళి రెండు సంపుటాలలోనూ half-title pageలో 1868-1953 అని ఉంది. సరైన తేదీలు తెలిసినవారు నాకు తెలియజేయగోరుతున్నాను.

2. తెలుగు వికీపీడీయోలో రచయిత వివరాలకి లింకు – ఇక్కడ

3. వారి కథలు కొన్ని కథానిలయంలో – ఇక్కడ. మొదటిపేజీలో లేవు కానీ తరవాతి పేజీలలో కనిపిస్తాయి పిడియప్ లో కథలు కొన్ని, గమనించగలరు.

4. టి.వి.యస్. శాస్త్రిగారి వ్యాసం వారి బ్లాగులో – ఇక్కడ

రాయసం వెంకటశివుడుగారి చిత్రం By k.nageswararao – https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf, సార్వజనీనం, https://commons.wikimedia.org/w/index.php?curid=38614231

000

(ఏప్రిల్ 11, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “రాయసం వెంకటశివుడుగారి భావజాలం, నా ఆలోచనలు – 1”

  1. ఆనాటి సామాజిక విషయాలు తెలుసుకోవడానికి దోహద పడినందుకు ధన్యవాదాలు….అప్పటికి ఇప్పటికీ మారని విషయాలు ఇంకా ఉన్నాయ్ విద్యా విధానం’, స్త్రీ లపై అణచి వేత ధోరణులు….

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s