రాయసం వెంకటశివుడుగారి భావజాలం,నా ఆలోచనలు – 2

వీరేశలింగంగారి భావజాలం సహజంగానే వెంకటశివుడుగారి రచనల్లో చోటు చేసుకుంది, ముఖ్యంగా స్త్రీల నడవడి, బాధ్యతలను ప్రస్తావించినప్పుడు. మంచిబాలికల లక్షణములు ఏమిటంటే దయ కలిగి ఉండాలి. చదువుకోవాలి. పనిపాటలయందు శ్రద్ధ కలిగి తల్లికి ఇంటిపనులలో చేదోడుగా ఉండాలి. ఇవి వీరేశలింగంగారి అభిప్రాయాలే అయినా వెంకటశివుడుగారు ఉదాహరణకి బాలవితంతువులకు పునర్వివాహం చేయడంలో మాత్రం అభ్యుదయం మరింత విశదం చేసేరు. వీరేశలింగంగారికి వితంతువులకి పెళ్ళి చేసేయడమే ధ్యేయం. అవసరమైతే డబ్బో ఉద్యోగాలో ఆశ చూపి అయినా సరే పెళ్ళి చేసేస్తే చాలు. వెంకటశివుడు గారు చిన్నపిల్లలకి మళ్ళీ చిన్నతనంలోనే పెళ్ళిళ్లు చేయిండం గర్హించేరు. బాలవితంతువులకి చదువు చెప్పించి, విద్యావంతులయేక వారికి పెళ్ళి ఇష్టమయితేనే జరిపించాలి అంటారు. ఈ సందర్భంలో నాకు బత్తుల కామాక్షమ్మ (1886-1950)గారి వ్యాసం గుర్తుకొచ్చింది. కామాక్షమ్మగారు వీరేశలింగంగారిని రచనలు చదివి ప్రభావితురాలయినా, ఆయన అనుయాయులు ఆమెని నమ్మించడానికి ప్రయత్నించినా, ఆవిడ పునర్వివాహానికి అంగీకరించలేదు. అయితే ఆమె స్త్రీల పునర్వవాహానికి వ్యతిరేకులు కారు. పెళ్ళి చేసుకోదలచినవారికి అండగా నిలిచి పెళ్ళిళ్ళు చేయించేనని రాసేరు. కామాక్షమ్మగారి తెలుగువ్యాసం ఇక్కడ చూడవచ్చు.

నాదగ్గర లేదు కానీ నాఇంగ్లీషు అనువాదం Memories and Experiences by Battula Kamakshamma 

(ఈవ్యాసం మామిడిపూడి వెంకటరంగయ్యగారు సంపాదకత్వంలో యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం స్మారకోత్సవ సంఘం వారు ప్రచురించిన సంచికలో ఉఁది. అది ప్రచురించి తేది లేదు.)

అలాగే ముత్తవ్వలగురించి రాస్తూ పిల్లలకి సాధారణంగా తల్లి కంటె ముత్తవ్వలదగ్గర చనువు ఎక్కువగా ఉంటుంది కనక వాళ్ళు మంచి కథలు చెప్పాలి అంటారు. నిజమే. ఎటొచ్చీ మరొక వ్యాసంలో పిల్లలపెంపకంవిషయం ప్రస్తావిస్తూ ఆంగ్లేయ తల్లులు ఎంతో చక్కగా పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటారనీ అంచేత వాళ్లపిల్లలు బుద్ధిమంతులూ, మేధావంతులు అవుతున్నారనీ వ్యాఖ్యానించేరు. మనిళ్ళలో స్త్రీలు పిల్లలకీ భర్తకీ ఆరోగ్యం బాగులేనప్పుడు మాత్రం ఆరాటపడిపోతూ బోలెడు సేవలు చేస్తారు కానీ బాగున్నప్పుడు విసుక్కుంటూ కసురుకుంటూ కొడుతూ తిడుతూ ఆ పిల్లలకి ఆనందం లేకుండా చేస్తారు అంటారు. బహుశా ఈవ్యాసాలు ఆయన జనానా పత్రికకి రాసినవేమో.

కొన్ని ఇతర సందర్భాలలో కూడా ఆంగ్లరచయితల అభిప్రాయాలను ఉదహరించేరు. వీరేశలింగం కాలంలో మొదలయిందనుకుంటాను ఆంగ్ల మేధావులని ప్రమాణంగా తీసుకోడం. ఆంగ్లేయుల ప్రసక్తి అస్సలు కూడదు అనడం లేదు నేను. నాసంశయం ఎక్కడ అంటే అవే భావాలు మన పురాణాలలో శాస్త్రాలలో ఉన్నప్పుడు అవి తీసుకుని చెప్తే మనపిల్లలకి మన సంస్కృతిగురించి కూడా తెలిపినవాళ్ళం అవుతాం కదా. ఉభయసామాన్యమైన విషయాలకీ, మనకే ప్రత్యేకమైన విషయాలకీ కూడా వెతికి వెతికి పాశ్చాత్యమేధావులని ఉదహరించవలసిన అగత్యం లేదనిపిస్తుంది నాకు.

ఈ విషయం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం వెంకటశివుడు గారు ఈవ్యాసాలు రాసేవేళకి మనం ఇంకా ఆంగ్లేయులపాలనలోనే ఉన్నాం. ఆరోజుల్లో కొంతవరకూ ఆంగ్లేయులవిషయంలో రాజభక్తి చూపడం అవసరమో అలవాటో అయింది. మనకి స్వాతంత్ర్యం వచ్చినతరవాత ఈ భావదాస్యంనుండి విముక్తి పొందవలసిన అవసరం లేదా అని.

నాఅభిప్రాయంలో రెండు కోణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంగ్లరచయితలనే ప్రమాణంగా తీసుకోడం ఎక్కువయిపోతోంది కనక ఆ అలవాటు మరొకమారు పరీక్షించి చూసుకోవలసిన అవుసరం ఉంది అన్నది ఒకటి. రెండో కోణం – పిల్లల పెంపకంగురించి ప్రస్తావిస్తూ, రచయిత చేసిన వ్యాఖ్యానం. Robert Burns, Ruskin వంటివారు గొప్ప మేధావులు కావడానికి వారి కుటుంబంలో శాంతిసౌఖ్యాలు, ముఖ్యంగా వారితల్లుల ప్రేమాభిమానాలు కారణం అంటారు. ఇలాటి ఆలోచనలు మనకి ఆంగ్లేయులే మార్గదర్శకులన్న వాదనని బలపరుస్తోంది. నాకు తెలిసి అమెరికాలో child protective services, social services వంటి సంస్థలు ప్రభుత్వం నడపడానికి కారణం హింసకి గురవుతున్న పిల్లలు సమాజంలో ఉండబట్టే. 6 లక్షలకి పైగా ఉన్నారు అమెరికాలో హింసకి గురౌవుతున్న పిల్లలు. మనదేశంలో అనేకులు తమ తల్లుల శిక్షణలో ఆదర్శమూర్తులు అయేరు. నేను అట్టే చదవడం లేదు అయినా నాకే ఈనాటికీ పత్రికలలో బ్లాగులలో అమ్మ ఔన్నత్యాన్నిగురించి రాస్తున్న రచనలు విరివిగా కనిపిస్తున్నాయి. పని గట్టుకు చూస్తే ఇంకా అనేక ఋజువులు కనిపించవచ్చు. సూక్ష్మంగా నామాట – పిల్లలని ఆదరభావంతో పెంచిన తల్లులూ నానాహింసలకీ గురి చేసిన తల్లులూ అన్ని దేశాల్లోనూ ఉన్నారు. మనపిల్లలకి మనదేశపు మేధావులగురించి చెప్తే మనచరిత్ర నిలబెట్టుకున్నవాళ్లం అవుతాం. ముఖ్యంగా ఈరోజుల్లో ఇంగ్లీషురచయితలగురించి తెలుసుకున్నవారిలో తెలుగురచయితలగురించి తెలీనివాళ్ళు ఉన్నారన్న సంగతి గమనిస్తే నా సూచనలో వాస్తవం ప్రస్పుటం కాగలదు.

ఆంగ్లేయుల ప్రాముఖ్యతని ఏ సందర్భంలోనూ అంగీకరించరాదు అనడం లేదు. ఉదాహరణకి వెంకటశివుడుగారు గ్రంథాలయోద్యమం అన్న వ్యాసంలో మాక్స్ ముల్లర్ వేదాలను తవ్వి తీసి తొలిసారిగా ప్రచురించడం, ఆంగ్లేయులే అచ్చుయంత్రాలను కనిపెట్టడం వంటివి. అలాగే పక్షులు, జంతువులుగురించి రాసిన వ్యాసాలలో విదేశీయుల పరిశోధనలు ఉటంకించేరు. వాటిని అంగీకరించడానికి నాకు ఇబ్బంది లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్నవాటిని కూడా గౌరవించడం, వాటిని కూడా మనపిల్లలకి (బహుశా పెద్దలకీ కూడా) తెలియజేయడం అవసరమే కాదు అవస్యం కూడా అంటున్నాను.

పదేళ్ళక్రితం రిటైరయిన ఒక ప్రొఫెసరుగారు (తెలుగువారే) మన ప్రాచీనగ్రంథాలను చదవడం మొదలు పెట్టేరు. ఏమంటే, చక్కగా చదువుకుని డాక్టరయిన కుమారుడు అడిగేడుట మన సంస్కృతిగురించి నాకేమీ చెప్పలేదేం ఇంతవరకూ అని. కొంతమంది అమెరికనులకి మనసంస్కృతిగురించి మనపిల్లలకంటే ఎక్కువ తెలుసు.

పాఠశాలల దుస్థితిలాగే బోధనావిధానాలలోనూ బోధించవలసిన విషయాలగురించీ కూడా విపులంగా చర్చించేరు వ్యాసాలు రెండవసంపుటంలో. దాదాపు వంద ఏళ్ళక్రితం రాసిన ఆ వ్యాసంలో చర్చించిన విషయాలు బహుశా కొన్ని ఇప్పటికీ వర్తించవచ్చు. కానీ ఇప్పటి అవుసరాలూ, పరిస్థితులూ వేరు కనక ఆ సిద్ధాంతాలలోని మూలభావాలను గ్రహించి ఇప్పుడు ఏం చేయగలం అన్నది ఆలోచించుకోవాలనుకుంటాను. ముఖ్యంగా నైతికవిలువల విషయంలో. నా హైస్కూలు చదువురోజుల్లో యం.ఐ. (Moral Instruction) క్లాసు అని వారానికో గంట ఉండేది. మరి ఇప్పుడుందో లేదో తెలీదు. కానీ విద్యార్థులకి చిన్నతనంనుండి నైతికవిలువలగురించిన అవగాహన అవసరం ఎంతైనా ఉందనే అనుకుంటున్నాను. నాకు ఆంధ్రాలో సంగతులు తెలీవు గానీ అమెరికాలో ఎన్నికలసంరంభం చూస్తుంటే మాత్రం నాకు ఎక్కడ లేని నీరసం వస్తోంది. అభ్యర్థులకే కాదు వారిని సమర్థించేవారికి కూడా మానవనైజం కావలసిన నీతిని గురించిన ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు.

కథల్లో నిరంజనశాస్త్రి కథ వెంకటశివుడుగారి స్వీయానుభవాలు చిత్రించేరనిపించింది వారి ఆత్మకథలో 60 పేజీలు చూసిన నాకే. మొత్తం ఆత్మచరిత్రము అంతా చదివితే మరింత ప్రస్ఫుటమైన అవగాహన ఏర్పడవచ్చు. పులికూన కథ తాము పరిశోధన చేసి, దొరికిన తామ్రపత్రాలు పరీక్షించి రాసిన కథ. అంచేత పులి పెంచిన కుర్రవాడికథగా మాత్రమే కాక చారిత్ర్యకంగా కూడా ఈకథకి ప్రత్యేకంగా ఉంది. వెనకెప్పుడో చదివిన తోడేలు పెంచిన పసివాడికథ గుర్తొచ్చింది. పన్నీరుపువ్వు కథ బ్రాహ్మణయువకుడు ముస్లిమ్ యువతి ప్రేమకథ. గౌతమీ స్వీయచరిత్రము కరుణార్ద్రమగు చిన్న కథ అన్నారు రచయిత. గౌతమి అను పేరుగల కుక్క ఉత్తమపురుషలో చెప్పినకథగా చిత్రించడం ఈ కథ ప్రత్యేకత.

వెంకటశివుడుగారి వ్యాసాలలో కొన్ని ఉదాహరణలు –

తెలుగు దుస్థితిసంస్కరణ ఆంగ్లేయులప్రభావంఉపాధ్యాయులురాత రానివారు

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “రాయసం వెంకటశివుడుగారి భావజాలం,నా ఆలోచనలు – 2”

  1. నేను చెప్పింది విదేశంలో ఉన్న కుటుంబంగురించేనండి. అవును, మనం, ఈ తరం, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆత్మపరీక్ష చేసుకోవలసిన అవుసరం ఉంది.

    మెచ్చుకోండి

  2. డాక్టరైన కుమారుడు అడిగినట్లు విదేశాలలో ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రులని అడిగేరోజు ఉంటుంది. ఎందుకంటే విదేశాలలో మనకి సంబంధించిన ప్రతి పండుగ మనకన్నా సంప్రదాయబద్దంగా చేసుకుంటున్నారు. అలాగే మన సంస్కృతి గురించి అడగడం కూడా చేయవచ్చు. మా సంస్కృతీ సంప్రదాయం గొప్పదని చంకలు గుద్దుకునే చాలామందికి (నేను కూడా) అసలు వాటి గురించి పెద్దగా ఏమీ తెలియవు కూడా! అందుకే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుని మనిషిగా విస్వజనీయంగా ఎలా మెలగగల్గాలో అర్ధం చేసుకోవాల్సి ఉంది. ధన్యవాదాలు మాలతీ గారూ.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s