అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధి!

ఇటీవల నేను గ్రహించిన ఒక వాస్తవం – ఓ పక్క తెలుగంటే ఏమిటో తెలీకుండా పోతోందని కొందరు (నాతో సహా) వాపోతుంటే, మరో పక్క బ్లాగుల్లోనూ ముఖపుస్తకంలాటి సామూహిక, సామాజిక, సాంకేతిక మాధ్యమాలలో

తెంగ్లీషు అను భాష మహోధృతంగా అవిరామంగా వృద్ధి పొందుతూ నవ్యనూతన పదాలతో ప్రజ్వరిల్లుతూ తెలుగు భాషామతల్లికి మంగళహారతులు పడుతోందని.

అసలు తెలుగు తూలిక మొదలు పెట్టేవరకూ నాకు ఈ సంగతులేవీ తెలీనే తెలీవు అప్పటికే పాతికేళ్ళగా కంప్యూటరు వాడుతున్నా. సౌమ్య నన్ను తెలుగు బ్లాగులకు పరిచయం చేసేక నా జాలజ్ఞానం తాజీకరణ జరిగింది.

సౌమ్య నాకు ఏదో మెయిల్లో “బ్లాగుతున్నాను” అని రాస్తే, ముందు తడబడి, తరవాత తల గోక్కుని, కొంచెం ఆగి ఇన్ని మంచినీళ్ళు తాగొచ్చి బహుశా హాస్యానికి అంటోంది కాబోలని సర్ది చెప్పుకున్నాను. అనతికాలంలోనే తెలిసింది మన భాషలో బ్లాగు అన్న పదం ధాతువుగా స్థిరపడి, నానా రకాల ప్రత్యయాలతోనూ మూడు కాలాలలోనూ వాడబడుతోందని. అలాగే కామెంటు, లైకు, లుక్కేయు కూడా తెలుగీకరించబడు వాడబడుతున్నాయని ఇటీవలే తెలిసింది.

డిసెంబరు 2007లో నేను కూడా ఓ బ్లాగు మొదలు పెట్టి అంతర్జాలంలో నా సాంఘికస్థాయిని ఆనాటి పాఠకులకి అనుగుణంగా తాజా చేసుకున్నాను. కానీ భాషకి సంబంధించినంతవరకూ మాత్రం నాకు అలవాటయిన తెలుగులోనే నాపాత కథలూ, కొన్ని కొత్త కథలూ పోస్టు చేస్తూ వచ్చేను. ఏడాది తిరక్కముందే నేను కూడా యాదాలాపంగానే కొన్నిపదాలు సృష్టించి ఈ భాషాభివృద్ధికి నావంతు సాయం చేయడం మొదలు పెట్టేను. ఊసుపోక ధారావాహిని మొదలు పెట్టేను.

ఇంతకీ అసలు విషయం ఏ భాషలోనైనా కొత్త పదాలు ఎలా చేరతాయో మీకూ తెలుసు కదా. మనకి లేని వస్తువో భావమో వాడుకుంటున్నప్పుడు ఆ వస్తువో భావమో ఇచ్చినవారిదగ్గర్నుంచి పుచ్చుకుంటాం. తెలుగులో ఉర్దూ, తురక పదాలు ఫిరంగిలాంటివి ముస్లిము ప్రభువులపాలనలో వచ్చేయిట. ఆ తరవాత మనకి తెల్లదొరలు వచ్చి ఇంగ్లీషు భాష చల్లగా అందించేరు. దరిమిలా అదే మనకి మాతృభాష కాకపోతే పితృభాష అయిపోయింది. మనది పితృస్వామ్య వ్యవస్థ కనక తండ్రే ప్రభువు కనక ఆ భాషే నెత్తికెత్తుకున్నాం. ఇలా లెక్కలు గట్టుకు చూస్తే తేలిందేమిటంటే ఈ కొత్త పదాలు మనం వాడడానికి కారణాలు ఇలా కనిపిస్తున్నాయి.

1. అదే నాగరీకం అని. లేదా నాకూ తెలుసులే నీ భాష అని చెప్పుకోడానికి. sis, bro, yea, madam లాటివి వాడడానికి నాకు మరో కారణమేమీ కనిపించదు. ఆఖరికి సరేనండి అనడం కూడా మనవాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఓకేనండి సిసలు తెలుగు. ఇది ఇంగిలీకంలో okaynandi అని రాయబడును. .ఇది చూసినప్పుడు నాకు ఒంటిమీద గొంగళీపురుగు పాకినట్టుంటుంది (దిగులుగా). అలాగే రూం, లైఫ్, మార్నింగ్ వంటి పదాలూను. గది, జీవితం, ఉదయం లేక పొద్దున్న వంటి పదాలు నిజంగా తెలీకే ఇలా రాస్తున్నారా?

2. మనకంటూ ఓ ప్రాంతం లేనప్పుడు. ఉదాహరణకి తమిళనాడునుంచి తెలుగుదేశం వేరుపడకముందు అలవాటయిన సాంబార్, కరీ, చట్నీ, ఇడ్లీలాటివి. దొరలు తరలిపోయి ఢిల్లీ రాజధాని అయింతరవాత దాల్, చపాతీ, పంద్రాగస్ట్ వంటి పదాలను ఆదరించేం. పాపడ్ మరో పాపం. ఏం చేస్తాం. తెలుగువారికి హృదయవైశాల్యం ఎక్కువ. అసలు ఆంధ్రప్రదేశ్ పేరులోనే కనిపిస్తోంది ఈ ధోరణి. తెలుగు హలంతభాష కాదు. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అడుగుజాడల్లో మనం ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకు ధన్యత గాంచితిమి.

3. మనకి ఆ వస్తువులు లేనప్పుడు. కంప్యూటరు, కీబోర్డు మున్నగునవి కోకొల్లలు.
బహుశా గత రెండు దశాబ్దాలలోనూ అన్యభాషాపదాలని తెలుగీకరించడం మొదయిందేమో. కంప్యూటరుకీ, సెల్ఫోనుకీ ఏవో పదాలు ఉన్నాయి కానీ నాకిప్పుడు గుర్తు లేవు. ఆ పదాలు చూసినప్పుడు మాత్రం అవతలివాడు ఏమంటున్నాడో గ్రహించగలను.

4. మన సృజనాత్మకత ప్రదర్శించుకోడానికి.

ఈ నాలుగోకారణంతోనే నేను కూడా కొన్ని పదాలు సృష్టించేను. ఊసుపోక మూడో పోస్టు రాసేవేళకి నా బాషాభివృద్ధి సరదా ఊపు అందుకుందనే చెప్పాలి. నసాంకేతికం, అసాంకేతికం అంటూ
మొదలు పెట్టి అనేక పదాలు సృష్టించేను. ఆ క్రమంలోనే ఇతర బ్లాగరులనుండి ఇతర పదాలు తెలుసుకున్నాను. ఏ పదం ఎక్కడినుండి సంపాదించేనో ఇప్పుడు చెప్పలేను కానీ ఇంతవరకూ నాకు తెలిసిన పదాల జాబితా ఇక్కడ ఇస్తున్నాను.

ఇవి బ్లాగులో వాడేక, పాఠకులు అహో ఒహో బాగున్నాయి అంటూ వ్యాఖ్యానించడంతో నేను ఇవి అందరికీ తెలిసిపోయి ఉంటాయనుకున్నాను. ఆ ఊపులో ముఖపుస్తకంలో నా ముఖపత్రం తెరిచి అక్కడ కూడా ఇవి వాడేను. వెంటనే అవి అంత ప్రపంచవ్యాప్తం కాదు సరి కదా జాలవ్యాప్తం కూడా కాలేదని తెలిసింది.

అందుచేత, ఇప్పుడు ఈ ప్రణాళిక – ఈ జాబితా తయారు చేసి నామిత్రమండలి ఆమోదంకోసం సమర్పించుకుంటున్నాను. ఇక్కడ మిత్రమండలి అంటే ఒక్క ముఖపత్ర మిత్రులే కాక, ఎక్కడ ఏవిధమైన మాధ్యమంలోనైనా సరే నా రాతలు చదువుతున్నవారుందరూను.

అసలు ప్రతి ఇంగ్లీషు పదానికీ తెలుగు పదం పుట్టించాలన్న కోరిక ఎప్పుడు మొదలయిందో నాకు తెలీదు. 1928లో అంతటి నరసింహంగారి వ్యాసంలో కనిపించిన పదాలు – హీనక్రమము anti-climax, వెనుకభాగము background. అవి వారే సృష్టించేరో అంతకుముందునించీ ఉన్నాయో నాకు తెలీదు. ఆత్మముద్రలు అన్న పదం పిలకా గణపతిశాస్త్రిగారు 1948లో రాసిన వ్యాసంలో కనిపించింది. వారి అభిప్రాయం స్వతస్సిద్దంగా సహజంగా ఒక జాతికి చెందిన అంతర్గతభావం అని అనుకుంటున్నాను.

నాబ్లాగులో కనిపించే కొన్ని కొత్త పదాలు ఇక్కడ ఇస్తున్నాను.
తోకచుక్కలు – కామాలు
భావముద్రలు – impressions
వేలిముద్రలు – Likes
ఆమోదముద్రలు – Likes (నిజంగా చదివి వేసిన వేలిముద్ర)
మంద పత్రాలు – group mailing, mailing list (కోపంగా, హాస్యంగా)
సామూహిక లేఖ – mailing list (మర్యాదగా)
మేలులాడుకొను – ఇమెయిలద్వారా హాస్యమాడుకొను
ఇంగిలీకం – ఇంగ్లీషు వాడకం (హేళనగా)
ఎకడమీకం – academic ధోరణి
నెట్టవతారం – జాలంలో నేను కనిపించే అవతారం (నారచనలమూలంగా మీరు ఊహించుకుంటున్న నేను అని మరో అర్థం)
చెత్తభ్రమణం – recycling
చెత్తక్షోభ – చెత్తభ్రమణంగురించి రాయడంవల్ల వచ్చిన బాధ. పనికిమాలిన, అర్థరహిత క్షోభ.
జాలాధీనం – ఎప్పుడు ఎక్కడ ఏమి కనిపిస్తుందో చెప్పలేని స్థితి
వెలుగురేఖ – silver lining
నాన్యెకడమీకం – నా అన్య ఎకడమీకం (నా రెండోరకం తెలివి), నాన్ ఎకమీకం (ఎకడమిక్ కానిది)
ఇ-భిప్రాయాలు – అంతర్జాలంలో అభిప్రాయాలు
అనేకాగ్రత – ఏకాగ్రత కానిది, multitasking
అష్టకర్మావధానం – అనేకాగ్రతకి మరో పేరు
అసాంకేతికేయులు – కీబోర్డుమీద చెయ్యేస్తే విరిగిపోతుందేమోనని భయపడిపోయేవాళ్ళు
నసాంకేతికేయులు – పైన చెప్పిన అసాంకేతికేయులకి ఎంతో తెలిసినవారిలా కనిపిస్తూ, సాంకేతిక నిపుణులముందు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ నస పెట్టేవారు.
నెట్చెలులు – నెట్ ద్వారా పరిచయమైన స్నేహాలు.
ముఖపత్రం – ముఖపుస్తకంలో ఒకరి పేజీ.
ఇవి కాక, ముఖపుస్తకంలో కనిపించిన కొన్ని పదాలు.
భాగస్వామ్యం చేయు – share చేయు. ఇది నాకు అయోమయంగా ఉంది. భాగస్వామ్యం అంటే ఆ టపాహక్కులు కూడా తీసుకున్నట్టు. నిజానికి అంతర్జాలంలో share అంటే తమ బ్లాగులోనో ముఖపత్రంలోనో మీ పోస్టుకి ప్రచారం మాత్రమే ఇస్తున్నారని కదా. పంచుకున్నారు అన్నపదం వాడుక సబబు.
వేలిముద్రలు – like (చూసేను సుమా అనిపించేది)
ఆమోదముద్రలు – like (చదివేను, బాగుంది)

ఇంకా కొన్ని పదాలకి సరైన తెలుగు పదాలు దొరకలేదు. ఉదాహరణకి, మన నిత్యవ్యవహారంలో వాడుతున్న of course, seriously వంటి పదాలకి ఖచ్చితంగా నప్పేవి నాకు దొరకలేదు. ఆ పదాలు వాడే సందర్భాలు తెలుగు సమాజంలో ఉన్నా అదే అర్థం తీసుకురావడం కష్టం.

కానీ తెలుగు రోమన్ లిపిలో రాయడం మాత్రం దుర్మార్గం అనే అనుకుంటున్నాను ఇప్పుడు. ఉప్పల లక్ష్మణరావుగారి అతడు ఆమె నవలలో ఒక చోట మూడు పుటలు సంభాషణ అంతా 90శాతం తెలుగులిపిలో రాసిన ఇంగ్లీషు! ఆ నవల నేను చదవడం ఆ పుటలదగ్గరే కుంటు పడింది. అది 40వ దశకంలో రాసింది అనుకుంటాను. అంటే అప్పటికే లేదా అప్పుడే ఈ లిపి గందరగోళానికి నాంది అయింది.

అలాగే ఇంగ్లీషులిపిలో రాస్తున్న తెలుగూను. Transliteration పద్ధతిలో Roman Script ఎకడమీకులు క్రమబద్ధం చేసేరు కానీ నూటికి 99మంది ఆ పద్ధతి అనుకరించడం లేదు. అది చాలనట్టు, ఈ తెంగ్లిషు(అసలు ఈ పదమే ఘోరంగా ఉంది)లో ఇంగ్లీషుపదాలు కలిపేసి తెలుగుపలుకులలా రాయడంతో మరింత చిక్కు. -nenu lost veeku shapuki velli frutsu, shartulu konnaanu.ఇలాటి వాక్యంలో ఏది తెలుగో ఏది ఇంగిలీకమో తెలుసుకుని అర్థం చేసుకోడానికి నాకు అరగంట పడుతోంది. ఇది ఈనాటి జనాలకి అందరికీ అలవాటయిపోయిందని నాకు తెలుసు. నాకు మాత్రం అది ఈ జన్మలో సాధ్యం కాదు. అసలు అంత అవస్థ ఎందుకు పడాలి అని కూడా అనిపిస్తుంది. అక్కడ రాసే విషయాలేమీ ప్రపంచాన్ని తల్లకిందులు చేసేసే మహోన్నతోపన్యాసాలు కావు కదా. కంప్యూటరు వాడడం నేర్చుకోగలిగినవాళ్ళు తెలుగు తెలుగు ఫాంట్సు వాడకం నేర్చుకోలేరు అంటే నేను నమ్మలేను. బహుశా ఇది మొబైల్ తెలుగుకి చేసిన అన్యాయం అనుకుంటాను.

చాలాకాలం అయింది కానీ నాకు ఇప్పటికీ గుర్తున్న ఒక కథ – ఒక లెక్చరరుగారు పాఠాలు చెప్పడంలో ఉన్న చిన్న చిన్న చిరాకులగురించి కొంచెం చెప్పి, “మండే క్లాసులో ఏం చేస్తానో” అని రాసేరు నాకు. మొత్తం ఉత్తరం అంతా తెలుగులో ఉంది కనక మండే క్లాసు అంటే ఏమనిపిస్తుందంటారు? క్లాసంటే మంట కాబోలు అనిపించదూ. కొంచెం ఆలోచించేక తోచింది ఆవిడ మాటాడుతున్నది సోంవారం క్లాసు సంగతని.

ఇంత చెప్పేక, నేను చేసిన పాపాలు కూడా చెప్పుకోకపోతే ఫలసిద్ధి లేదు. ఈ వ్యాసంకోసం నా వెనకటి రచనలు చదువుతుంటే, నారాతల్లో కూడా ఇంగ్లీషు పదాలు బాగానే కనిపించేయి. అయితే ఏ ఒక్క పుట చూసినా రెండు సంగతులు తెలుస్తాయి. ఒకటి తెలుగు పదాలున్నచోట ఇంగ్లీషు వాడినవి 1. ఎగతాళిగా (ఇది రావిశాస్త్రిగారు చాలా బాగా చేస్తారు), 2. తెలుగుపదాలు ప్రాచుర్యం లేక, 3. సరి అయిన తెలుగుపదాలు లేక.

కాలక్రమంలో నేను ఇంగిలీకం తగ్గించుకుంటూ వస్తున్నాను. ఇది నాకు తలకెక్కింది ముఖ్యంగా ఈనాటి యువరచయితలు తమకథలమీద నా అభిప్రాయం అడిగినప్పుడు. ఇంగ్లీషుపదాలు వాడకం తగ్గించమని వాళ్ళకి సలహా ఇస్తున్నాను. అందుచేత నేనేం రాస్తున్నానో కూడా చూసుకోవాలి. ఈ వ్యాసంతో ఆ బుద్ధి ఇప్పుడొచ్చింది. ఫలితం ఏమంత ఆనందదాయకంగా లేదు. నేను కూడా కొన్ని ఇంగ్లీషుపదాలు అనవసరంగా వాడేను. అయితే చారిత్ర్యకంగా చూస్తే తగ్గిస్తున్నానని కూడా అర్థమయింది.

ముఖపుస్తకంలో చేరేక అక్కడ తెలుగు అనబడే ఇంగ్లీషు చూసేక నాకు నిజంగానే చాలా చాలా బాధ కలిగింది. అంచేత “వీరతెలుగుభాషాయోధ”ని అయిపోయేను.

ముఖపుస్తకంలో నా ముఖపత్రంలో ఎవరూ ఇంగ్లీషులోనూ తెంగ్లీషులోనూ రాయరాదని నియమం విదించేను. అదొక యుద్ధంగానే ఉంది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎవరో ఒకరు ఆ భాషల్లోనే గిలుకుతున్నారు నన్ను పరీక్షించడానికేమో అన్నట్టు.ఇదొక ప్రచ్ఛన్నయుద్ధంగా ఇంకా సాగుతోంది.

అంచేత ఈ భాషవిషయంలో నాది మరీ విపరీతంగా ఉందని మీరంటే … సవినయంగా చేతులు కట్టుకు తల ఒంచుకుని ఒప్పుకుంటాను. అంతవరకే. అంతే కానీ ఈ పోరు మాత్రం మానే సూచనలు లేవు. మన్నించగలరు. లేదా నా టపాలకి వ్యాఖ్యలు రాయడం మానేసినా సరే.
000
=================================================

ముఖ్య గమనిక – ఈ విషయంలో నా వేదన వ్యక్తం చేసుకుంటూ పద్యాలు రాయమని నా ముఖపత్రంలో అడిగితే కొన్ని పద్యాలు వచ్చేయి. అవి రేపు మరో టపాలో పెడతాను. మీరు కూడా రాస్తే అవి కూడా చేర్చ గలను.

మాలతి
=================================================

ఈ అంశంమీద ముఖపత్రమిత్రులు రాసిన కవితలు ఇక్కడ
(ఏప్రిల్ 25, 2016)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధి!”

 1. share అనే పదానికి పంచుకోవడం అన్న పదాన్ని తెవికీ సముదాయంలో వాడుతున్నాం. పంచుకోవడం shareని చాలావరకూ ప్రతిబింబిస్తుంది.

  ఇష్టం

 2. అవునండి. మీరు చెప్పివన్నీ నిజమే. కొన్ని పదాలు హాస్యానికి సృష్టించినవి. అవి బహుశా ఆ సందర్భంలోనే రాణిస్తాయి. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఇంగ్లీషు అనవరసమైన చోట వాడడం అనవసరమనే. ఉదాహరణకి రూం, మార్నింగు, ఫోరో క్లాక్ లాటివి. మీ స్పందనకు ధన్యవాదాలు. వీవెన్ గారి తెలుగు పదం విన్నాననుకుంటాను.

  Liked by 1 వ్యక్తి

 3. మీరు చెప్పిన చాలా విశయలాతో ఏకీభవిస్తూనే ప్రతి ఆంగ్లపదానికి తెలుగు పదం కనిపెట్టడమనే ధోరణి విపరీతమని నా అనుకోలు.
  ఉదాహరణకి “కామా” అన్నది తెలుగుపదం కాదా అని ఆశ్చర్యపడేంతగా తెలుగైపోయాక ఇక దాన్ని అలాగే వుంచితే బాగు కదా!
  నాన్యెకడమీకం — అనేది పలకడం కష్టంగానూ, తెలుగుపదం కాదేమో అన్నట్టుగానూ వుంది.
  నెట్చెలులు — పలకడంలో నెచ్చెలులుగా మారిపోవచ్చు. internetలో netను అంతర్జాలంలో “జాలం” అని వాడుతున్నాం గనుక, జాల మిత్రులు ఇలా వాడొచ్చేమొ చూడండి.

  ఒకప్పుడు (2005-07) ప్రాంతాలలో తాడేపల్లి బాలసుబ్రమణ్యం గారు ఈ పదాల సృష్టి ఎలా జరగాలో వివరిస్తూ కరపత్రమో, పుస్తకమో వెలువరించినట్లు గుర్తు.
  వీవెన్ గారు “తెలుగు పదం” అన్న గూగుల్ గుంపునూ నిర్వహిస్తున్నారు.
  కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం నుండి ఓ ఆచార్యులు కూడా ఈ తెలుగుపదాల సృష్టిలో కృషి చేస్తున్నారు.

  ఇష్టం

 4. అందరికీ తెలిసిన విషయాలేనండి. మరోమారు ముందుకి తెస్తే కొంచెం స్ఫృహ కలుగుతుందేమోనని.

  ఇష్టం

 5. సూచనలు బాగున్నాయి…మీ కొత్త తెలుగు పదాలు నేర్చుకుంటాము…మీరన్నది నిజమే జాలమున తెలుగు కొంతమేర విరివిగానే వాడబడుతోంది .

  ఇష్టం

 6. చాలా సంతోషం వనజగారూ. కొన్ని ఇంగ్లీషు పదాలు తప్పనిసరిగా వస్తాయి కానీ రూం, పాన్ లో ఫ్రై వంటి పదాలు వాడడం తగ్గించవచ్చు మనవాళ్ళు అనుకుంటున్నాను. మీ నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. శుభమస్తు.

  ఇష్టం

 7. మీరు ఆంగ్ల పదాలకి ప్రత్యాన్మయంగా సూచించిన పదాలు చాలా బాగున్నాయి . వీటిని నేర్చుకుంటాను . అలాగే నాకు ఆంగ్లం అంతగా రాకపోయినా ఒకోసారి నావ్రాతలలో ఆంగ్ల పదాలు ఉంటాయి . మీ ఈ టపా చూసిన తర్వాత వీలైనంతవరకు ఆంగ్ల పదాలు రాకుండా వ్రాయాలని బలంగా అనుకున్నాను. ధన్యవాదాలు .

  Liked by 1 వ్యక్తి

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s